మాయా ఏంజెలొ

ఆఫ్రికన్-అమెరికన్ రచయితలందరిలోకీ, అత్యంత ఆత్మీయంగా అనిపించే రచయిత్రి ఎవరంటే మాయా ఏంజెలొ పేరే చెప్తాను. ఆమె రాసిన Letter to my daughter (2008) చదివినప్పుడే నిజమైన విద్యావంతురాల్ని, సంస్కారవంతురాల్ని, జీవితప్రేమికురాల్ని చూసిన సంతోషం నాకు అనుభవానికి వచ్చింది.

నేనెంతో అదృష్టవంతురాల్ని

ఆ మధ్య రావెల మనోహర్ అమెరికానుంచి వస్తూ నాకోసం బుట్టెడు పుస్తకాలు తెచ్చారు. అందులో మాయా ఏంజెలౌ రాసిన Letter to My Daughter ' (రాండం హౌస్, 2008) కూడా ఒకటి. ఏంజలౌ నాకు కవయిత్రిగా మాత్రమే తెలుసు. కాని ఆత్మకథనాత్మకంగా ఉన్న ఈ పుస్తకం తొలిపుటలు తెరుస్తూనే నన్నెంతో ఆకట్టుకుంది.