జీవన శిల్పి-11

మధ్యాహ్న భోజనం తరువాత మళ్ళా కూచున్నాం. ఈ రోజు గురూజీ ప్రసంగమంతా సామాజిక అర్థవ్యవస్థ మీదనే నడుస్తోందని అర్థమయింది. ఆయన తన సంభాషణ మళ్ళా మొదలుపెట్టారు:

‘పూర్వం ఒక రాజు గుర్రం మీద వెళ్తున్నాడు. అక్కడ ఒకాయన పనిచేస్తుంటే చూసి ‘నువ్వు రోజంతా  కష్టపడితే నీకెంత దొరుకుతుంది’ అనడిగాడు. ‘నాకో రూపాయి దొరుకుతుంది’ అన్నాడతడు. ‘దాంతో నువ్వేం చేస్తావు?’ అనడిగాడు రాజు. అతను ‘ఒక పావలా అప్పు తీరుస్తాను, ఒక పావలా అప్పిస్తాను, ఒక పావలాతో పరలోకం కొనుక్కుంటాను, మిగిలిన పావలా నా సొంతానికి వాడుకుంటాను ‘అని చెప్పాడు.’

‘రాజు దర్బారుకి తిరిగొచ్చి అడిగాడు: ‘దీని అర్థం ఏమీటో చెప్పండి. పావలా అప్పు తీరుస్తాడట, పావలా అప్పిస్తాడట, పావలాతో పరలోకం కొనుక్కుంటాడట, మిగిలిన పావలా తను తింటాడట. దీని అర్థమేమిటో చెప్పండి’ అని అడిగాడు. ఎవరికీ తెలియలేదు. చివరికి ఆ వ్యక్తినే పిలిపించారు. అతడొచ్చి ఇలా వివరించేడు:

‘మహారాజా, నేను సంపాదించే దానిలో నాలుగు భాగాలు చేస్తాను. మొదటి భాగం నా తల్లిదండ్రుల కోసం ఖర్చుపెడతాను. ఎందుకంటే నన్ను పెంచి పెద్ద చేసినందుకు వారి అప్పు తీరుస్తున్నాను. రెండో భాగం నా పిల్లలకోసం ఖర్చుపెడతాను. అది నేను వారికి అప్పిస్తున్నట్టు. మూడో భాగంతో దానధర్మాలు చేస్తాను. దాంతో నేను పరలోకాన్ని  కొనుక్కుంటున్నాను. ఇక మిగిలిన నాలుగో భాగం నేను బతకడానికి తింటున్నాను.’

‘ఇదీ మన ఆర్థిక వ్యవస్థ! ఇందులో ముసలివాళ్ళకీ భద్రత ఉంది, పిల్లలకూ భద్రత ఉంది. ఇది ఒక అద్భుతమైన ఆర్థిక వ్యవస్థ కదా! ఎందుకంటే ఇందులో ఋణం గురించి మాట్లాడారు. మన వ్యవస్థలో ఋణభావన చాలా ముఖ్యమైంది. మనం డబ్బుకి ఋణపడిలేం. భావానికి ఋణపడి ఉన్నాం. కృతజ్ఞతా  భావం ప్రతి ఒక్కరిలోనూ ఉండేది. ఈ రోజు ప్రతి ఒక్కడూ డబ్బుకే ఋణపడి ఉన్నాడు, భావంతో లేడు. ఆ రోజుల్లో సమాజంలో బతికే ప్రతి ఒక్క కళాకారుడూ, ప్రతి ఒక్క వ్యక్తీ తాను ఇతరులకు ఋణపడి ఉన్నానని నమ్మేవాడు. ‘వీరంతా ఉన్నారు కాబట్టే నేను బతుకుతున్నాను. వీరు లేకపోతే ఎలా బతగ్గలను?’ అనుకునేవాడు. ఇతరులు కూడా అలానే అనుకునేవారు. ‘ఈ వృత్తులు చేసేవాళ్ళందరూ ఉన్నారు కాబట్టే ఈ వస్తువులు మనకి అందుతున్నాయి. లేకపోతే మనకి లోటుగానే ఉండేది’ అని. ఆ ఋణభావం అందరిలోనూ ఉండేది.అది అద్భుతంగా పనిచేసేది.

ఈ రోజు ఆ ఋణభావం లేదు. ఆ రోజుల్లో ప్రతి ఒక్కడూ తనను తాను ఇతరులకు ఋణపడి ఉన్నట్టుగా భావించేవాడు. అందుకే ఈ చేతివృత్తుల వాళ్ళు ఆ రోజుల్లో తాము చేసిన వస్తువులు ఎవరికింటికేనా తీసుకొచ్చినప్పుడు ఎలా తీసుకొచ్చేవారంటే- ఉదాహరణకి ఒక ఇంట్లో బిడ్డ పుట్టినప్పుడు ఆ ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్క వృత్తికి చెందిన మహిళ అక్కడికొచ్చి నిలబడేది. కుమ్మరి మహిళ ఒక మట్టిపాత్ర తీసుకొచ్చేది. దాన్ని మాయముంత అనే వారు. వెదురు పని చేసే మహిళ చేట పట్టుకొచ్చేది. బొడ్డు కోయడానికి కమ్మరి మహిళా లేదా చర్మకారుల మహిళ వచ్చేది. కానుపు నడిపించడానికి మంగళి మహిళ మంత్రసానిగా వచ్చేది. రజకవృత్తికి చెందిన మహిళ స్నానానికి కావలసిన నూనె తెచ్చేది. ఇలా ప్రతి ఒక్క వృత్తికి చెందిన మహిళా  అక్కడికొచ్చి నిలబడేదీ. ఆ తల్లికి పసుపునీళ్ళల్లో ముంచిన తెల్లటి చీర కట్టించేవారు. పసుపు రాసిన బట్టలను ఆమెకి తొడిగించేవారు. బిడ్డ పుట్టగానే ఆ బిడ్డను చేటలో పెట్టేవారు. ఆ తర్వాత బొడ్డు తాడు కోసి ఒక తెల్లటి గుడ్డని పసుపునీళ్ళల్లో ముంచి ఆ తాడుకు చుట్టి పసుపు రాసి బాగా కట్టేవారు. లేదా ఆ బొడ్డుతాడులో కొంత భాగాన్ని కట్ చేసి భద్రపరిచేవారు. దాన్నొక తాయెత్తులో చుట్టి పిల్లవాడికి నడుముకి కట్టేవారు. భవిష్యత్తులో ఆ పిల్లవాడికి ఏదైనా పెద్ద జబ్బు చేసినప్పుడు ఆ బొడ్డు తాడు తీసి పాలలో మరిగించి మందుగా తాగించేవారు! అదొక గొప్ప ఔషధంగా పనిచేసేది. అందుకే ప్రతి ఒక్కరి బొడ్డుతాడుని ఎంతో భద్రంగా ప్రతి ఇంట్లోనూ దాచేవారు. దేశసంచారం చేసేవారు ఆ బొడ్డు తాడుముక్కను తాయెత్తులో వేసి తమ నడుముకే కట్టుకునేవారు. ఆ బొడ్డుతాడుని గనుక కుక్కలో నక్కలో తింటే తల్లికి పాలు ఎండిపోతాయనీ, బిడ్డకు పాలు దొరకవనీ నమ్మేవారు.’

‘ఇక్కడి నియమాల ప్రకారం పూర్వం ఒక తల్లి తన బిడ్డకు నాలుగైదేళ్ళ వయసు వచ్చేదాకా పాలిచ్చేది. పిల్లలు స్కూలు వెళ్ళి వచ్చి కూడా తల్లిపాలు తాగేవారు. ఎప్పుడైతే ఈ సంప్రదాయాలు, ఈ భద్రత పోయాయో, ఇప్పుడు తల్లులకు పాలుండటంలేదు. రెండుమూడు నెలలు కాగానే పాలు ఎండిపోతున్నాయి. ఇదంతా ఒక పెద్ద మార్పు.’

‘ఆ రోజుల్లో కానుపు సమయానికి ఆయా వృత్తుల మహిళలు తీసుకొచ్చే వస్తువులు-మాయముంత, చేట, నూనె, వస్త్రాలు- ఇలా ఏమేమి తెచ్చేవారో, వాటన్నింటికీ బదులుగా ఆ ఇంటివారు ఒక చేటలో పప్పు, బియ్యం, పిండి, ఉప్పు, మిరపకాయలు, ఒక వస్త్రంతో పాటు నాలుగణాలో లేదా ఎనిమిదణాలో డబ్బు పెట్టి వారికి నమస్కారం పెట్టేవారు. అవసరానికి మించి ఎంతో గౌరవంగా ఇచ్చేవారు. దానికి వెలకట్టేవారు కాదు. వారిని సన్మానించేవారు.’

‘కానీ ఈ రోజుల్లో మనకి మార్కెటింగ్ వ్యవస్థ గురించి ఏం చదువులు చెప్తున్నారు? ఇక్కడ పూర్వం కేవలం వస్తుమార్పిడి పద్ధతి మాత్రమే ఉండేది అని చెప్తున్నారు. కాని దీన్ని వస్తుమార్పిడి పద్ధతి అనగలమా? వస్తు మార్పిడి అనేది కేవలం అవసరం కొద్దీ జరిగేది. ‘నీ దగ్గర వాచ్ ఉంది నాకు కావాలి. కాబట్టి నాకు అదివ్వి, ఇదివ్వు, అప్పుడే ఇస్తాను’ అని బేరమాడటం. కానీ ఇక్కడ అవసరం లేకపోయినా కేవలం గౌరవ సూచకంగా వస్తువులిస్తున్నారు. కాబట్టి దీన్ని వస్తుమార్పిడి పద్ధతి అనలేం.’

‘ఆ విధంగా ఈ బంధం కొనసాగేది. బిడ్డ పుట్టిన ఇరవై ఒకటవ రోజున వడ్రంగులు ఎంతో అందమైన ఊయెల తయారుచేసి తెచ్చేవారు. పరుపులు కుట్టేవాడు చిన్నచిన్న పరుపులు, దుస్తులు కుట్టి తెచ్చేవారు. ఆటబొమ్మలు చేసేవారు అప్పటి సీజన్ కి తగ్గ బొమ్మలు తెచ్చేవారు. వాటన్నింటికీ ప్రతిఫలంగా ఈ ఇంటివారేమిచ్చేవారంటే- ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో చూస్తే, మనవడు లేదా మనవరాలు పుట్టినప్పుడు, వడ్రంగులు ఊయెల తెచ్చినా, కమ్మరులు ఇనప గొలుసులు తెచ్చినా ఆ తాత అడుగుతాడు  ‘నీకేం కావాలి? ఆవుకావాలా? ఇంకేం కావాలి? తీసుకో’ అని ఆవుల్నీ, మేకల్నీ దానం చేసేవారు. వారు తెచ్చిన వస్తువుల కన్నా ఎన్నో రెట్లు ఎక్కువ విలువైన వాటినిచ్చేవారు. ఎందుకంటే వారు సరైన సమయానికి ఆ వస్తువులు తీసుకొచ్చారు కాబట్టి.’

‘ఇరవై ఒకటవ రోజున దర్జీ వచ్చి బిడ్డ కోసం కుట్టిన టోపీ తెచ్చేవాడు. అలాగే దర్జీలు సంవత్సరంలో రెండుమూడు సార్లు పైసలు దాచుకునే చిన్న చిన్న సంచులు కూడా తీసుకొచ్చి చేటల్లో పెట్టి ఇచ్చేవారు. ఎద్దులకు కట్టే అలంకారాలు, ఎడ్లబండ్లమీద కప్పే బట్టలు, బురఖాలు- ఇలాంటివన్నీ దర్జీలు కుట్టి తెచ్చేవారు. ఆ రోజుల్లో దర్జీలకి చాలా పని ఉండేది. మనుషులు తామైతే  కుట్టినబట్టలు వేసుకునేవారు కాదుగానీ, మిగతా అలంకారాలన్నీ కుట్టించేవారు. అలా దర్జీలకి చేతినిండా పని ఉండేది.’

‘ఆ తర్వాత బిడ్డ కాస్త పెద్దవగానే మనకు కొన్ని కార్యక్రమాలు మొదలయ్యేవి. పుట్టువెండ్రుకలు తీయించడం, చెవులు కుట్టించడం, అక్షరాభ్యాసం, అన్నప్రాశన, మొదటిసారి దుస్తులు తొడగడం లాంటి సంస్కారాలు నడిచేవి. చెవులు కుట్టించే రోజున కంసాలితో సంబంధం ఉండేది. పుట్టువెండ్రుకలు తీసే రోజున మంగళితో సంబంధం ఉండేది. కొత్త దుస్తులు తొడిగే రోజున దర్జీతో సంబంధం ఉండేది. అన్నప్రాశన రోజున రైతుతో సంబంధం ఉండేది.  ఇవన్నీ కూడా ఒక విధంగా పరిచయ కార్యక్రమాలు. ఇవే మన సంస్కారాలుగా మారాయి. సమాజంలో పుట్టిన ప్రతి బిడ్డకూ ఆ ఊళ్ళోని ప్రతి ఒక్క వృత్తితో పరిచయం ఏర్పరచడమే వీటి ముఖ్య ఉద్దేశ్యం. ఇప్పుడు పుట్టువెండ్రుకలు తీయించకపోతే ఏమవుతుంది? లేదా చెవులు కుట్టించకపోతే ఏమవుతుంది? ఈ రోజుల్లో చాలామంది చేయించుకోవడం లేదు కదా. కానీ ఆ రోజుల్లో ఈ సంస్కారాలన్నీ ఆయా వృత్తుల వారి ప్రాధాన్యతను చాటడానికి ఉపయోగపడేవి. ఆ రోజున ఆ వృత్తికి ఎంతో గౌరవం దక్కేది. అతనికోసం అన్నీ సిద్ధం చేసేవారు. కేశఖండన రోజున మంగళి వస్తే, ఆయన కోసం ఎంతో అందమైన కత్తెరలు, ఇతర పనిముట్లు తయారుచేయించేవారు. వాటికి వెండి పిడి ఉండేది. వాటిని అతనికి బహుమతిగా ఇచ్చేవారు. దాంతో పాటు సంభావన ఇచ్చేవారు. అలాగే చెవులు కుట్టే రోజున కంసాలి వచ్చి ఒక చిన్న రాగితీగను చెవిలో వేసేవాడు, కానీ దానికి బదులుగా అతనికి నూతన వస్త్రాలూ, ధనధాన్యాలూ ఎంతో గొప్పగా ఇచ్చేవారు. ప్రతి ఒక్క సంస్కారంలోనూ ప్రతి ఒక్క వృత్తికళాకారుడికీ కనీసం ఒకటినుండి అయిదుదాకా వస్తువులు బహుమతిగా ఇచ్చేవారు.’

‘ఇక పెళ్ళిళ్ళ  విషయానికి వస్తే పెళ్ళి నిశ్చయంకాగానే, అంటే కనీసం ఏడాది ముందే, మంగళ వాద్యాలతో ప్రతి ఒక్క వృత్తి కళాకారుడి ఇంటికీ వెళ్ళేవారు. ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి ‘మా ఇంట్లో పెళ్ళి నిశ్చయమైంది. పెళ్ళి పనులు మొదలుపెట్టండి’ అని వారికి తిలకం దిద్ది, కొబ్బరికాయ ఇచ్చి, బట్టలు పెట్టి అడిగేవారు. అప్పుడు వారు ఆ పెళ్ళికి కావలసిన వస్తువుల తయారీ ప్రారంభించేవారు. పెళ్ళికి ముందు ప్రతి ఒక్క వృత్తికళాకారుడి ఇంటికీ వీరు వెళ్ళాలి. కుమ్మరి ఇంటికి వెళ్తే ఆయన ఐరేని కుండలిచ్చేవాడు. వడ్రంగి ఇంటికి వెళ్తే పెళ్ళిపీటలు, సామగ్రి ఇచ్చేవారు. ఇలానే ప్రతి ఒక్క వృత్తికారుడి ఇంటికీ వెళ్ళేవారు.’

‘ఇక్కడొక దూదేకుల పనివాడుండేవాడు. అతను గద్దెలు, పరుపులు తయారు చేస్తుండేవాడు. నేనొకరోజు అతని ఇంటికి వెళ్ళాను. అతని ఇంట్లో ఒక చరఖా కనిపించింది. ‘మౌలా, ఈ చరఖాతో నీకేం పని? ఇది నాకిచ్చేసెయ్యి. నేను మా ఆశ్రమంలో పెట్టుకుంటాను’ అన్నాను. ‘లేదు, గురూజీ, ఇది మా వంశపారంపర్యంగా వచ్చిన గుర్తు. దీన్ని నేనెలా ఇచ్చేస్తాను? నువ్వు కాసేపు కూచో. దీని ప్రత్యేకత ఏమిటో చూపిస్తాను’ అని అన్నాడు.

‘నేనక్కడ కూచున్నాను. కొంతసేపటికి మేళతాళాలతో ఒక కుటుంబం అక్కడికొచ్చింది. వాళ్ళు అతని ఇంట్లో అడుగుపెట్టారు. మౌలా ఒక పీట వేసి, దానిమీద చరఖా పెట్టి, తాను కూడా తన  తలమీద ఒకవస్త్రం చుట్టుకుని మరొక పీట మీద కూచున్నాడు. వచ్చినవాళ్ళు అతనికి బొట్టుపెట్టారు. అతణ్ణి గౌరవించి బట్టలు పెట్టారు. ఆ తర్వాత అతను ఆ చరఖాతో కొద్దిగా నూలు వడికాడు. ఆ దారంతో పెళ్ళికి కావలసిన రెండు కంకణాలు తయారుచేసాడు. వాటిని ఒక తాంబూలంలో ఉంచాడు. పెళ్ళిలో కట్టే కంకణాలు ఆ వృత్తికి సంబంధించినవే. వాటిని ఆ పరుపులు కుట్టేవాడే తయారుచేసి ఇస్తాడు. మన పూజల్లో, శుభకార్యాల్లో ఉపయోగించే ఆ పచ్చి దారం ఉందే అది అతని వృత్తికి సంబంధించిన భాగం. మన సంస్కృతిలో ఆ పచ్చిదారాన్ని చాలా ఎక్కువగా ఉపయోగిస్తారు.’

‘ఆ దారం కంకణాలు చేసి ఇస్తూ, అతను ‘చూడండి మహరాజ్, ఇంత చిన్న దారానికి నాకెంత లభిస్తుందో! మీరేమో ఈ చరఖాను ఇచ్చేమంటున్నారు. నేనెలా ఇవ్వగలను?’ అన్నాడు.’

‘ఆ కాలంలో ఏం జరిగేదంటే- బిడ్డ పుట్టాక మొలతాడు కట్టాలి కదా. పూర్వం ధోవతులు కట్టేటప్పుడు మొలతాడు చాలా ముఖ్యం. గోచీలు పెట్టడానికీ, వాటన్నింటికీ మొలతాడు చాలా అవసరం. ఆ మొలతాడుకి కావలసిన నల్లని దారం సాలెవారి ఇళ్ళనుంచి వచ్చేది. నిజానికి అప్పుడు ప్రతి ఒక్క ఇంట్లోనూ చరఖా నడిచేది, దారం వడికేవారు. కాని ఆ మొలతాడు దారం మాత్రం నేతపనివారి ఇళ్ళనుంచి తెచ్చుకోవాలనే నియమం ఉండేది. ఆ నేతన్నల ఇంటికి వెళ్ళి ఒక గంపెడు జొన్నలిస్తే అతను కావలసినంత దారమిచ్చేవాడు. ఇంత చిన్న దారానికి అన్ని జొన్నలు లభిస్తుంటే ఆ దారంతో అతనేం చేసుకుంటాడు? నిజానికి ఆ మిగిలిన దారం తన దగ్గర పెట్టుకుంటే, ఇంకెవరి ఇంట్లోనో మట్టి పాత్రలు తెచ్చుకోడానికి ఆ దారం ఉపయోగించుకోవచ్చు. లేదా ఎవరి ఇంట్లోనైనా లభించే వస్తువును భద్రపరచుకోడానికి ఆ దారం ఉపయోగించవచ్చు. ఎందుకంటే అది మళ్ళీ ఎప్పటికైనా ఉపయోగపడుతుంది కదా. కానీ, ఎవరికైతే ‘ఇది రేపు కూడా నాకు దొరుకుతుంది’ అనే నమ్మకం ఉంటుందో అతడు ఆ వస్తువుని కూడబెట్టడు. ‘రేపు కూడా మనకి దొరుకుతుంది కదా, ఎందుకు కూడబెట్టాలి?’ అనుకుంటాడు. ఎవరికైతే ‘ఇది నాకు రేపు దొరుకుతుందో లేదో అనే అభద్రతాభావం ఉంటుందో అతడే వస్తువులు కూడబెట్టే ఆరాటంలో పడతాడు. ఆ అభద్రతా భావమే మనిషి వస్తువుల్ని వెనకేసుకునేలా చేస్తుంది. భద్రత ఉందనే నమ్మకం ఉంటే ‘రేపు కూడా ఇవన్నీ దొరుకుతాయి కదా, ఇప్పుడెందుకు కూడబెట్టాలి?’ అని ఆలోచిస్తాడు. కాబట్టి వస్తువులు కూడబెట్టడు.’

‘అటువంటి అభద్రతాభావం లేని మనిషి ఇతరులకు ఇస్తూనే ఉంటాడు. ఉదాహరణకి, ఇక్కడ మా దగ్గర ఒక నిమ్మ చెట్టు ఉంది. వెంకట్రావుగారు అప్పుడప్పుడు వస్తుంటారు. చాలాసార్లు నేను ‘వెంకట్రావుగారూ, కొన్ని నిమ్మకాయలు తీసుకెళ్ళండి’ అని అంటూంటాను. ఆయనేమో ‘లేదు గురూజీ, మా ఇంట్లో నిమ్మచెట్టుంది, తీసుకెళ్ళను’ అనంటారు. ఎవరి పరిధిలో అయితే ఆ వస్తువుంటుందో వారు దాన్ని మరొకరినుంచి తీసుకోడం నిరాకరిస్తారు. మాకొద్దంటారు.’

‘కానీ ఎవరి పరిధిలో ఆ వస్తువుండదో, మరెవరింట్లోగానీ, చుట్టుపక్కలగానీ దొరకదో, అలాంటి వ్యక్తి ఎవరేనా వచ్చినప్పుడు  ‘కొన్ని నిమ్మకాయలు పట్టుకెళ్ళు’ అని అన్నాననుకో, ‘తీసుకెళ్ళమంటారా గురూజీ’ అని ఆ చెట్టుని ఊపేసి పచ్చివీ , పండినవీ అన్నీ రాల్చేస్తాడు. వాటిని పోగుచేసుకుని పట్టుకుపోతాడు.’

‘ఎందుకని? ఎందుకంటే ఆ వృక్షం అతని పరిధిలో లేదు. అతని పరిధిలో లేకపోవడం వల్లనే అతనిలో ఆ కూడబెట్టే స్వభావం వచ్చింది. ఎవరి పరిధిలో అయితే ఆ వృక్షముంటుందో వాళ్ళు ఉచితంగా ఇచ్చినా తీసుకోరు. అందుకే గ్రామాల సమృద్ధి అంటే ఇదే- ప్రతి ఒక్క వస్తువూ వారి పరిధిలోనే లభించాలి. తద్వారా ఎవరిలోనూ కూడబెట్టాలనే స్వభావంగానీ, దొంగతనం చేయాలనే ఆలోచన గానీ పుట్టదు. సమృద్ధి అంటే ఇదే కదా, హెచ్చుతగ్గులు లేకపోవడం.’

గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో వృత్తిపనివారికి ఆహారభద్రత కలిగించడం కోసం చేపట్టిన కార్యక్రమాల్ని గురూజీ చెప్తున్నప్పుడు సహజంగానే ఒక సందేహం కలుగుతుంది. అవన్నీ ఒక స్థితిశీలక వ్యవస్థను కొనసాగించగలవు తప్ప, గతిశీలక వ్యవస్థకు అనుగుణంగా ఎలా సర్దుబాటు చేసుకోగలవు? ఉదాహరణకి జనాభా పెరుగుతున్నప్పుడు, ఆ నిర్దిష్ట చట్రాన్ని ఎలా నిలబెట్టడం?

బహుశా ఇటువంటి ప్రశ్నలు మనకన్నా ముందు గురూజీనే వేధించి ఉంటాయి. కాబట్టి ఆయన దీనికి కూడా జవాబులు వెతుక్కున్నారు. ఆయన నా మనసులో మాట గ్రహించినట్టే ఇలా చెప్పడం మొదలుపెట్టారు:

‘ఒక కుమ్మరి మీకొక పాత్ర ఇస్తున్నాడంటే, ఒక చాకలి మీ బట్టలు ఉతుకుతున్నాడంటే, లేదా ఒక మంగళి మీకు క్షవరం చేస్తున్నాడంటే, అది ఒక కుటుంబానికి సంబంధించిన లెక్క. నువ్వూ, నీ పిల్లలూ కలిసి ఒక కుటుంబం. నువ్వు నీ పిల్లలకి పెళ్ళి చేసినా కూడా మీదంతా ఒక కుటుంబంగానే లెక్కేస్తారు. కాని ఏ రోజైతే ఆ పిల్లలకి సంతానం కలుగుతుందో అప్పటినుండీ అది రెండు కుటుంబాలుగా లెక్క. అప్పుడు అతను రెండు కుటుంబాల లెక్కన వస్తువులు తీసుకుంటాడు. కాబట్టి ఒక కులపెద్ద లేదా ఒక వంశవృక్షంలో ఎన్నో కుటుంబాలుంటాయి. ఎన్నో కుటుంబాల లెక్కన అతను వస్తువులు తీసుకుంటాడు, కానీ ఇంత పెద్ద వంశానికి అతను ఒక్కడే వస్తువులు సమకూర్చలేడు కదా. ఎలాగైతే ఒకరి ఇంట్లో బిడ్డ పుట్టి వానికి పెళ్ళయి సంతానం కలిగిందో, అలాగే ఇంకొకరి ఇంట్లో కూడా బిడ్డ పుడతాడు. వానికి కూడా జీవనోపాధి కావాలి. కాబట్టి అక్కడ ప్రారంభమయ్యే ఆ కొత్త కుటుంబపు బాధ్యతను ఇతని ఇంట్లో ప్రారంభమైన కొత్త కుటుంబం చూసుకుంటుంది. ఇది ఆహారభద్రతకి సంబంధించిన పెద్ద రక్షణ వ్యవస్థ.’

‘ఉదాహరణకి మీ ఇంట్లో ఒక కొత్త కుటుంబం ప్రారంభమయ్యింది. మీ కొడుక్కి ఒక కొడుకు పుట్టాడనుకుంటే, అక్కడ కుమ్మరి కొడుక్కి కూడా ఒక కొడుకు పుడతాడు కదా, అప్పుడది వేరే కుటుంబంగా లెక్కకొస్తుంది. ఒకే ఇంట్లోనే ఉంటున్నా కూడా దాన్ని వేరొక కుటుంబంగా లెక్కేస్తారు. ఎందుకంటే వారినుంచి ఏ వస్తువులు తీసుకోవాలో అవి రెండు కుటుంబాల లెక్క చొప్పున తీసుకుంటారు. కాబట్టి ఇది కూడా మీ వేరొక కుటుంబపు లెక్కన, అతని వేరొక కుటుంబం పనిచేస్తుంది. అంతే తప్ప ఒక్కడే అందరి పనులూ చూసుకోడు.’

‘ఉదాహరణకి గౌడు సమాజం ఉంది. ఆ సమాజంలో ఒక ఇంట్లో ఏ రోజైతే ఒక బిడ్డ పుడతాడో అదే రోజున ఆ గౌడు ఐదు ఈత చెట్లు నాటేవాడు. బిడ్డ పెరుగుతున్నకొద్దీ ఆ ఈత చెట్లు కూడా పెరుగుతాయి. బిడ్డకు పదహారేళ్ళు రాగానే ఆ ఈతచెట్లకి కూడా పదహారేళ్ళు వస్తాయి. అప్పుడు అతడు తన కొడుకుని పిలిచి ‘సరే, ఇకనుంచీ ఈ చెట్లు కల్లుగీసి అమ్ముకో, నీ బతుకు నువ్వు బతుకు’ అనేవాడు. అంటే వాడు పుట్టినరోజునే వాడి ఆహారాన్ని కూడా సృష్టించేవారు. మనదగ్గర ఇటువంటి పద్ధతి ఉండేది- మీ కుటుంబం నుండి ఇంకొక కుటుంబం ఏర్పడగానే వేరొక కుటుంబపు ఆహారవ్యవస్థ అక్కడ ప్రారంభమైపోయేది.’

‘మన శాస్త్రాలేవీ దీని గురించి తప్పుగా చెప్పలేదు. అధమ వృత్తి అని దేన్నీ పిలవలేదు. ప్రతి వృత్తినీ శ్రేష్ఠమైందిగానే భావించారు. రేపు నేను ఈ జాతి పురాణాలగురించీ, ఈ భిక్షావృత్తుల గురించీ చెప్తాను. అందులో ఈ విషయాలన్నీ వివరిస్తాను. ఈ రోజు మాత్రం, వాళ్ళు ఒకరితో ఒకరు కలిసి ఎలా బతికేవాళ్ళు, వాళ్ళ మార్కెట్ ఎలా ఉండేది, ఎలాంటి మార్కెట్ వ్యవస్థను నిర్మించారు అనే విషయాల గురించి చూడదాం.’

‘ఒక వృత్తిని అధమంగా భావిస్తే వారి గురించి ఎందుకు ఆలోచించాలి? వారి ఆహార వ్యవస్థ ఎందుకు ఏర్పాటు చేయాలి? అదంతా సాగదు కదా. అలా అయితే మళ్ళీ అంతా గందరగోళం అవుతుంది. ఒకడు అధముడు, ఒకడు ఉత్తముడు అని ఉండదు. కాబట్టి ఇక్కడ ఎటువంటి భేదాలూ లేవు, ఇదంతా అద్భుతమైన రూపురేఖల్తో చేసిన ఒక చట్రం.  చూడండి. ఒక ఇంటినుంచి ఒక కంసాలికి ఎంత డబ్బు వెళ్తుందో అంతే డబ్బు కుమ్మరికి కూడా వెళ్ళాలనుకుంటే, అంతే డబ్బు వెదురుపనులు చేసేవాడికి కూడా వెళ్ళాలనుకుంటే, అప్పుడు ఆ ఇల్లు వీళ్ళ వస్తువుల్ని ఎంత పరిమాణంలో ఉపయోగించవలసి ఉంటుంది? బంగారం చాలా విలువైంది. మట్టి దానిముందు చాలా చౌక. ఏమీ కాదు. వెదురు కూడా బంగారం ముందు ఏమీ కాదు. కానీ బంగారంతో చేసిన ఒక వస్తువు లేదా దాని విలువ ఎంత ఉందో అంత మొత్తం కుమ్మరికి కూడా అందించాలంటే అప్పుడు వాని వస్తువుల్ని ఎంత ఎక్కువగా ఉపయోగించవలసి ఉంటుంది? అంతే మొత్తాన్ని వెదురుపనిచేసేవాడికి కూడా అందించాలి. ఈ ఇంటినుండి అందరికీ సమానంగా వెళ్ళాలి. ఎవరికీ ఎక్కువతక్కువలుండకూడదు. మరి అప్పుడు ఎవరి వస్తువుల్ని ఎంతెంత పరిమాణంలో ఉపయోగించవలసి ఉంటుంది? అందుకు ఒక చట్రాన్ని ముందే ఖాయం చేసారు. ఇది చాలా పెద్ద విషయం.’

‘మేమొక ఇల్లు నమూనాగా తీసుకుని లెక్కలు వేసి చూసాం- మట్టి వస్తువులు ఎంతెంత అవసరమవుతాయని. ఒక ఇంటికి ఒక సంవత్సరానికి 222 మట్టి వస్తువులు అవసరమయ్యేవి. ప్రతి ఇంటి వాళ్ళూ కనీసం 222 కుమ్మరి వస్తువుల్ని ఉపయోగించేవాళ్ళు, అంతే మొత్తంలో వెదురుపనులు చేసేవాడి వస్తువులు కూడా ఉండేవి. కానీ ఈ రెండు రకాల వస్తువులూ శాశ్వతంగా ఇంట్లో ఉంచుకునేవి కావు. ఒక సంవత్సరం తర్వాత వీటన్నింటినీ పారేయాలి. అంతం చేయాలి. హోలీ రోజున పాత కుండ పగలగొట్టేయాలి. మళ్ళీ కొత్తది తీసుకోవాలి. కొత్తదాన్నే ఉపయోగించాలి. ఇంట్లో ఎవరైనా చనిపోయారనుకోండి, మట్టి వస్తువులన్నీ తీసి బయట పారేయాలి. మట్టిసామాను మళ్ళా కొత్తగా తెచ్చుకోవాలి. గ్రహణం పట్టిందనుకోండి, నీళ్ళ కుండలు మార్చేసేవాళ్ళు. ఇలానే వెదురు వస్తువులు కూడా ఏడాదికి మించి ఇంట్లో ఉంచేవాళ్ళు కాదు. ఇక్కడ ఛట్కీ పూజ అని జరుగుతుంది. ఆ రోజు ఇంట్లో ఉన్న వెదురుసామానంతా-బుట్టలు, చేటలు, వెదురుతో చేసిన ప్రతి ఒక్క వస్తువూ  పట్టుకుపోయి గ్రామసరిహద్దుల్లో పారేసేవాళ్ళు. ఆ తర్వాత కొత్తది తెచ్చుకోవాలి. దానికి పూజచేయాలి.ఆ తర్వాతే దాన్ని ఉపయోగించాలి. వెదురునీ, మట్టినీ ఇలా చూసేవాళ్ళు. వాటితో తయారు చేసినవేవీ సంవత్సరానికి మించి ఉంచకూడదని. కాబట్టి ఆ 49 సంస్కారాలకీ వాటి సొంతమార్కెట్ వాటికుండేది. పెళ్ళి జరుగుతుంటే ప్రతి ఒక్క వృత్తి పనివాని ఇంటికి వెళ్ళి వాళ్ళ వస్తువులు తెచ్చుకునేవారని చెప్పాను కదా, అవి కూడా ఐదు వస్తువులు తేవాలి. కనీసం అయిదు. అంతకంటే ఎక్కువ తెచ్చుకోవచ్చుగానీ, తక్కువ మాత్రం కాకూడదు.’

‘అలాగే, ఒక ఇంట్లో ఎవరైనా చనిపోతే, ఆ రోజు సహజంగానే వెదురుపనులు  చేసేవాడు వెదురు తెస్తాడు, కుమ్మరి కుండ తెస్తాడు, దళితుడు శవవస్త్రంతో పాటు కట్టడానికి తాడు తీసుకొస్తాడు. కంసాలి పంచరత్నాలు పట్టుకొస్తాడు. మంగళి ముండనం చేయడానికి వస్తాడు. సాలె వస్త్రం పట్టుకొస్తాడు. బుక్కా గులాల్ తయారు చేసే బుక్కోడు గులాల్ పట్టుకొస్తాడు. దర్జీ బట్టల్తో కట్టిన పూలు పట్టుకొస్తాడు. కమ్మరి, వడ్రంగి ఆ పాడె కట్టడానికి వస్తారు. ఆ సమయంలో ప్రతి ఒక్క కులం లేదా జాతినుంచి ఒక ప్రతినిధి వచ్చి నిలబడతాడు. తన సహాయం అందించడానికి సిద్ధంగా ఉంటాడు. అందరూ కలిసి ఆ గతించిన మనిషి అంతిమ సంస్కారాలు దగ్గరుండి చేస్తారు. అందులో గ్రామంలో  ఏ ఒక్క కులానికి చెందిన ప్రతినిధీ రాకుండా మిగిలిపోకూడదు. మొత్తం గ్రామం అక్కడ నిలబడాలి. అలాగని కార్యక్రమానికి మొత్తం గ్రామం రావాలని ఏమీ లేదు. ప్రతి ఒక్క కులం నుండీ ఒక ప్రతినిధి అక్కడ నిలబడ్డాడా, మొత్తం సమాజం అక్కడ నిలబడ్డట్టే.’

‘ఆ తర్వాత మూడో రోజునుంచీ మొదలయ్యే కార్యక్రమాలు కూడా మళ్ళా వీళ్ళ మార్కెట్. మూడో రోజున, వడ్రంగి ఇంటినుంచి కట్టెతో చేసిన పార, ముక్కాలిపీట, నాలుగు గూటాలు వస్తాయి. కుమ్మరి ఇంటినుండి ఒక పెద్ద కుండ, ఒక చిన్న కుండ, ఒక చిన్న గుడిగి, ఒక చిప్ప, నాలుగు ప్రమిదలు వస్తాయి.వెదురు పనివాడి ఇంటినుంచి ఒక చేట, ఒక బుట్ట వస్తాయి. మిగతా అందరు వృత్తిపనివారల ఇంటినుంచి ఒక మీటరు ఎర్రబట్ట లేదా తెల్లటివస్త్రం వస్తుంది. తాడు వస్తుంది, ఉన్ని దారం వస్తుంది. పచ్చి నూలుదారం వస్తుంది. వీటన్నిటినీ సేకరించి స్మశానానికి వెళ్తారు. కుండతో నీళ్ళు తెచ్చి ఆ చితాభస్మాన్ని చల్లబరుస్తారు. కట్టెపారతో ఆ బూడిద సేకరించి అందులోంచి అస్థికలు ఏరి తీస్తారు. మిగతా బూడిద కట్టెపారతో సేకరించి చేటతో, బుట్టతో ఎత్తి దూరంగా పారేస్తారు. ఆ మీదట ఆ ప్రదేశమంతా శుభ్రం చేసి చక్కగా పేడతో అలుకుతారు. ఆ ముక్కాలిపీటలాంటివన్నీ అక్కడ పెట్టి, చిన్న కార్యక్రమం చేసి, అదవగానే వాటినక్కడే పారేసి వస్తారు. వాటిని అక్కడే పారేయడానికి కూడా ఒక పద్ధతి ఉంది. ఆ పారని ఎలా పారేయాలి, కుండ ఎలా పగలగొట్టాలి, దాన్నెలా పట్టుకుని పగలగొట్టాలి, ఆ పార ఎలా పట్టుకు పారేయాలి అనే వాటికి కూడా ఒక పద్ధతి ఉంది.’

‘ఆ తర్వాత తొమ్మిదవ రోజు, పదవ రోజు జరిగే కార్యక్రమాల్లో వృత్తిపనివాళ్ళ వస్తువులు చాలా అవసరమవుతాయి. చివరి రోజు జరిగే శయ్యాదానం కార్యక్రమానికి వడ్రంగి ఇంటినుంచి మంచం తయారై వస్తుంది. దళితమహిళలు దాన్ని అల్లుతారు. దానిమీద పరుపు, దుప్పటి అన్నీ పరుస్తారు. ఐదు పాత్రలు ఉంచుతారు. వెదురుతో చేసిన విసనకర్ర కూడా ఉంటుంది. ఇనప బుట్ట ఉంటుంది, ఆ బుట్టలో నాలుగు మేకులుంటాయి. వెండి లేదా బంగారంతో చేసిన నగ ఏదైనా ఉంటుంది. బట్టలు ఉంచుతారు, చెప్పులు ఉంచుతారు- ఇవన్నీ ఆ మంచమ్మీద ఉంచి దానం చేస్తారు.’

‘మా నాన్నగారు చనిపోయినప్పుడు నేను మా పురోహితునికి చెప్పాను- ‘మహరాజ్, ఈ కార్యక్రమంలో ఫాక్టరీ వస్తువులేవీ రాకూడదు. ఎందుకంటే ఈ కార్యక్రమాల్ని ఎందుకు ఏర్పాటు చేసారో నాకు తెలుసు. మనకున్న సంస్కారాల్నీ, కార్యక్రమాల్నీ  వృత్తిపనివారికోసమే ఏర్పాటు చేసారు, ఫాక్టరీల కోసం కాదు. ఒకవేళ ఈ కార్యక్రమాల ద్వారా ఏదైనా ఫాక్టరీకి డబ్బు వెళ్తుంటే నేనైతే ఈ కార్యక్రమం చెయ్యను. ఇందులో ఉపయోగించే ప్రతి ఒక్క వస్తువూ ఎవరో ఒక వృత్తిపనివాడు తయారు చేసినదే అయి ఉండాలి. దొరికింది సరే, దొరక్కపోతే ఆ కార్యక్రమం వదిలేయండి’ అని చెప్పాను. అన్నట్టే  అన్ని వస్తువులూ సేకరించాను.  ఇత్తడితో చేసినవి పదహారు లోటాలు కావాలి. కంసాలితో తయారుచేయించాను. చాలామంది అంటారు, ఇనుపమంచం దొరుకుతుంది కదా, ఆరేడువందలు పెడితే దొరుకుతుంది, అది తెచ్చుకోవచ్చు కదా అని అంటారు. ఎందుకు తెచ్చుకోవాలి? మన వడ్రంగి ఉన్నాడుకదా, అతనితోనే తయారు చేయించాను. అతను అంగవైకల్యంతో ఉన్నాడు. అయినా సరే ఆ  వస్తువులన్నీ అతనితోనే చేయించాను. ఇప్పుడన్నీ సులభంగా దొరకవు కదా, అయినా సరే చేయించాను. చాలా వస్తువులు తయారు చేయించాను. కాబట్టి నేను ప్రజలకిదే చెప్తుంటాను: ఒకవేళ ఈ కార్యక్రమాలన్నీ చేయాలనుకుంటే, వృత్తిపనివాడు తయారుచేసిన వస్తువులే ఉపయోగించండి. ఒకవేళ దొరక్కపోతే, ఆ కార్యక్రమాలు అస్సలు చేయకండి. ఏమవుతుంది? చాలా సమాజాలు ఇటువంటి కార్యక్రమాలేమీ చెయ్యడం లేదుకదా. వాళ్ళ శవాలు లేచి పరుగెడుతున్నాయా ఏంటి? ఒకవేళ చేయాలనుకుంటే వృత్తిపనివాడి వస్తువులే వాడండి. మన దగ్గర ఈ సంస్కారాలు రూపొందించింది ఫాక్టరీల కోసం కాదు. గ్రామాల్లో ఉండే వృత్తిపనివారికోసమే ఈ సంస్కారాలు. వాళ్ళ కోసమే ఈ పండగలు. ఇన్ని పండగలూ, ఇన్ని సంస్కారాలూ చేయడానికి మన దగ్గర మరేకారణం లేదు.’

‘గ్రామంలో ఏ సమాజం బుక్కా, గులాల్ తయారు చేస్తారో హోలీ రోజున ఆ స్టాక్ మొత్తం ఖాళీ చేయాలి. మొత్తం రంగులన్నీ చల్లేసి ఖాళీ చేయండి. ఆ తర్వాత వాడు మళ్ళా కొత్తగా తయారు చేసుకుంటాడు. ఎండాకాలంలో కుమ్మర్లు ఎన్నో పాత్రలు తయారు చేస్తారు. నిర్జల ఏకాదశి వస్తుంది. అది జూలైలో వస్తుంది.  ఆ రోజు ప్రతి ఒక్కరూ ఒక కుండా, విసనకర్రా దానం చేయాల్సి ఉంటుంది. వాళ్ళ దగ్గర మిగిలిపోయిన ప్రతి వస్తువునూ ఆ రోజున ఖాళీ చేసెయ్యాలి.’

‘కాబట్టి మనదగ్గర ఎన్నో నియమాలున్నాయి. నియమం అంటే ఒక రకమైన దానం. కొన్ని నియమాలు ఎలా ఉంటాయంటే, మామిడి పండ్లు పంచడం ఒక నియమం. ఎవరి ఇంట్లో అయితే పెళ్ళి జరిగి కొత్త కోడలు అడుగుపెడుతుందో, మొదటి కోడలు వస్తుందో, వాళ్ళు మామిడి పండ్లు  నియమం పాటిస్తారు. గానుగ నూనె పంచే నియమాన్ని పాటిస్తారు.  అలాగే కంసాలి దుకాణాన్ని దోచుకునే ఆచారం కూడా.’

‘ఎలాంటిది ఆ నియమ పద్ధతి? మంగళ వాయిద్యాలతో కుమ్మరి ఇంటికి వెళ్తారు. వాని ఆవానికి పూజ చేస్తారు. అందులోంచి  ఒక పాత్ర తీసి, దానిలో ఐదు వస్తువులు వేసి, మొదట ఆ కుమ్మరి మహిళకు పూజ చేస్తారు. ఆ తర్వాత వచ్చిన మహిళలందరికీ పాత్రలు పంచుతారు. ఆ తర్వాత ఆ పాత్రలు మొత్తానికి వెలకట్టి ఆ కుమ్మరికి ఇచ్చేస్తారు. అలాగే గానుగ నూనె దగ్గర కూడా నియమం సాగేది. ఆ గానుగ వానికి ముందే సమాచారం వెళ్తుంది, వాడు ఎన్నో మట్టి పాత్రలలో ఆ నూనె నింపి సిద్ధంగా ఉంచుతాడు. వీరంతా వెళ్తారు, ముందొక పాత్ర తీసి మొదట ఆ గానుగ వాని భార్యకు దానం చేస్తారు, ఆ తర్వాత వచ్చిన వాళ్లందరికీ నూనెను పంచుతారు. ఆ తర్వాత అలా ఎంత నూనె పంచారో లెక్కగట్టి వానికి ఇచ్చేస్తారు. అలాగే ఇక్కడ పాత్రల దుకాణాన్ని దోచుకునేవాళ్ళు, కంసాలి దుకాణాన్ని దోచుకునేవాళ్ళు. వాడు ఎన్నో గ్లాసులు, గిన్నెలు, పాత్రలు తయారు చేసి పెట్టుకునేవాడు, వీరంతా వెళ్తారు, వాటిని తీసి అందరికీ పంచేస్తారు, నియమం చేస్తారు. ఆ తర్వాత దానికి ధర కట్టి వానికి ఇచ్చేయాలి.’

‘కొన్నిసార్లనిపిస్తుంది, ఈ పద్ధతులు ఎందుకు ప్రవేశపెట్టారని? ఏం అవసరం ఉంది వీటితో? ఎందుకంటే గ్రామంలో వృత్తిపనివార్ల సమాజం బతుకుతోంది. వాళ్ళకి చేతినిండా పని కల్పించాలి. అందుకోసం ఇలా చేయాల్సి ఉంటుందని. అందుకే నేను పదే పదే చెప్తుంటాను- మన పాత వ్యవస్థ వ్యయంకోసం రూపొందించింది, దాచడం కోసం కాదని. ఇది నిరంతరం ఇస్తూనే ఉండాలి ఇస్తూనే ఉండాలి.’

‘ఉదాహరణకి వినాయక చవితి పండగ ఉంది, అదెప్పుడొస్తుంది? ఆగస్టు-సెప్టెంబరు నెలల్లో వస్తుంది. ఆ రోజున మనదగ్గర ఒక ఆచారం ఉండేది. ఇంటికప్పులమీదరాళ్ళు వెయ్యడం. అందుకని గణేశ్ చౌత్ ని పత్తర్ చౌత్ అని కూడా అంటారు. ఆ రోజుల్లో ఆర్ సి సి స్లాబులు లేవు. రేకుల కప్పుల్లేవు. ప్రతి ఇంట్లోనూ కుమ్మరి తయారు చేసే పెంకులే ఉండేవి. ఆ రోజున పిల్లలు రాళ్ళు వేసేవాళ్ళు. ప్రతి ఇంట్లోనూ ఇరవై ముప్ఫై పెంకులు పగిలిపోయేవి. మర్నాటినుంచీ కుమ్మరులకి పనిదొరికేది. ఎందుకంటే వర్షాకాలంలో కుమ్మరులకి పనులు సాగవు కదా. ఆ విధంగా ఆ సమాజం తన నష్టాన్ని తనే భరిస్తూ కూడా మార్కెట్ సృష్టించుకుంది.’

‘ఇంత అద్భుతమైన మనస్తత్వం కలిగి ఉండటం, ఇందుకోసం మనసుని సిద్ధం చేసుకోవడం మామూలు విషయాలు కావు. ఆ మనుషులు ఎలాంటి మనస్తత్వం కలిగినవాళ్ళంటే వాళ్ళకి ఎక్కువ తక్కువలు చూపడం చాతకాదు. ఎవరినైనా తక్కువగా చూడటం, ఎవరినైనా హీనంగా చూడటం వారికి అసాధ్యం. ఎక్కువతక్కువల మాట ఈ సమాజం ఎప్పటికీ చేయలేదు. చిన్నపెద్దల అవసరం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. మరో సంగతేమంటే, మనం ఎవరికైతే ఇవ్వాలో, వారినుంచి మనం ఏదీ తీసుకోకూడదు. అదొక విషయం. అవన్నీ మళ్ళీ తర్వాత మాట్లాడుకుందాం పూర్తిగా.’

‘ఇలా ఇచ్చే మనస్తత్వాన్ని మనిషిలో సిద్ధం చేసే ఈ పనికి ఈ రోజు ఎవరూ సాహసించరు. ఇంతగా వృథాగా ఖర్చుచేయడానికి పెద్ద గొడవ జరుగుతుంది కదా. ఇళ్ళల్లో ఇదంతా వృథా, దోపిడీ అంటారు కదా. ఒకవేళ ఇలాంటి మనస్తత్వాన్ని నిర్మించాలనుకుంటే ఏం చేయాలి? ఎలా ఈ మనస్తత్వాన్ని తయారు చేసారు మనదగ్గర? అందులో అంతా వదిలేయడం- ఇదంతా ఒక  పార్థివ చిత్రం, పార్థివ శిల్పకళ.’

‘ఇక్కడ కళలద్వారా ఈ మనస్తత్వం తయారుచేసారు, వదిలేసే మనస్తత్వం. చిత్రకళ ఉంది, శిల్పకళ ఉంది. మహిళలు ఎన్నో వస్తువులు తయారు చేస్తారు. ఇప్పుడు ముగ్గులున్నాయి. పొద్దున్న వేసారు. సాయంత్రానికి వాటిని తుడిచేయాలి. మళ్ళీ వేయాలి. మళ్ళా అందంగా తయారు చేయాలి. చైత్ర గౌరి, మంగళ గౌరి, మహాలక్ష్మి, నవరాత్రి దేవుళ్ళు- ఇవన్నీ మూడు నాలుగు రోజుల వేడుకకోసం తయారు చేయాలి, ఆ తర్వాత వాటిని నీట్లో నిమజ్జనం చేయాలి. ఇన్ని వస్తువులు మనదగ్గరుంటాయి, చాలా అందమైన వాతావరణం సృష్టిస్తాం. ఆ మీదట నీటిలో కలిపేస్తాం. అలా నిమజ్జనం చేసేటప్పుడు మనకి ఎటువంటి బాధా కలగదు. మనం మన చేతుల్తో చేసిన ఈ వస్తువుల్ని నీటిలో కలిపేస్తుంటే మనకేమైనా బాధ కలుగుతుందా? మనస్సు అంతగా సిద్ధమైపోతుంది. ఈ వస్తువుల్ని త్యజించే సమయంలో ఎటువంటి బాధా కలగకూడదని. చివరికి మన శరీరాల్ని వదిలేసే సమయంలో కూడా మనకి ఎటువంటి బాధా కలగదు.’

‘కాబట్టి ఇటువంటి ఒక మనస్తత్వాన్ని నిర్మించడం కోసం మన దగ్గర ఈ కళలన్నింటి అవసరం ఏర్పడింది. ఈ పద్ధతుల ప్రకారం ఎన్నో ఆచారాలు వచ్చాయి. ప్రతి ఒక్క వృత్తిపనివాడికీ తనదైన ముడిసరుకు ఉంటుంది. దానికి దాని గుణాలుంటాయి. ఎలాగంటే, ఒక కుమ్మరి ఇంట్లో ఎవరైనా చనిపోయారనుకోండి, వాడు ఎన్నిరోజుల వరకూ మైల పాటిస్తాడు? ఒక బ్రాహ్మణుడి ఇంట్లో ఎవరైనా చనిపోతే బ్రాహ్మణుడికి పన్నెండురోజుల మైల ఉంటుంది. కుమ్మరి పన్నెండురోజులు మైల పెట్టుకుని కూచోగలడా? వాడి ముడిసరుకంతా ఏమవ్వాలి? అదంతా ఖరాబైపోతుంది కదా. చాలా పెద్ద నష్టం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క వృత్తిపనివానికీ ముడి సరుకు ఎన్ని రోజులు సురక్షితంగా ఉంటుందో అన్ని రోజుల పాటే వాళ్ళు మైల పాటించేవాళ్ళు. అంతకంటే ఎక్కువరోజులు కాదు. ఒకడు ఒకరోజే పాటించేవాడు, ఒకరికి రెండు రోజులు, ఒకరికి మూడు రోజులు, ఒకరికి ఐదు రోజులు. ఆ లెక్కన వాళ్ళు తమ మైల, సూతకాలు ముగించుకునేవాళ్ళు. ఇప్పుడు ఎవరింట్లో ఎటువంటి ముడిసరుకూ ఉండదో వాడు కావాలంటే నెలరోజుల పాటు సూతకం పాటించనివ్వండి. వానికొచ్చే నష్టమేముంది? కానీ ఎవరి ఇంట్లో ముడిసరుకు ఉంటుందో వాడలా ఉండలేడు కదా. చర్మకారుల పనులు గంటల లెక్కన నడుస్తాయి. పోత పోసే పనులు గంటల లెక్కన దించాలి, పెట్టాలి.లేకపోతే ఆ చర్మం, ఆ లోహం పాడైపోతాయి. కాబట్టి ఆ వాళ్ళు ఆ లెక్కన తన మైల, సూతకాలు ఖాయం చేసుకున్నారు.’

‘మైల, సూతకాలు పాటించవలసిందే. కాని తమ వీలుని బట్టి చేసుకోవాలి. బలవంతంగా కాదు. ఈ విషయాలన్నీ రెండు రకాలు. ఒకటి, శాస్త్రాచారం. ఇంకొకటి లోకాచారం. శాస్త్రాచారం నువ్వు ఇవన్నీ చెయ్యాలని చెప్తుంది. లోకాచారం నీ వీలుని బట్టి చేసుకో అని చెప్తుంది. తమ వీలుని బట్టి చేసుకునే సడలింపు వృత్తిపనివాళ్ళకి ఉండేది. వివాహం చేసుకోవాలి, లేదా శవసంస్కారం చేయాలి- నీ లోకాచారం ప్రకారం చేసుకో అని చెప్తుంది. అక్కడ ఎటువంటి బలవంతమూ లేదు. ఈ విధంగా అద్భుతమైన ఆర్థిక వ్యవస్థ, మార్కెట్ పద్ధతి ఉండేవి. అది ప్రతి ఒక్కరికీ పూర్తి ఆహారభద్రతనీ, సమానగౌరవాన్నీ కల్పించే వ్యవస్థగా నిలబడింది.’

‘మన దగ్గర రెండు రకాల విద్యలున్నాయి-ఒకటి పూర్తి సామర్థ్యశాలి విద్య, మరొకటి సామర్థ్యహీన విద్య. కళ పూర్తిగా సామర్థ్య హీన విద్య. జ్యోతిషం, కళ, నృత్యం, సంగీతం-ఇవి సామర్థ్యహీనాలు. వీటిని పట్టుకుని మనిషి బతకలేడు. వీటిని పట్టుకుని ఏ వ్యవస్థా ఏర్పడదు. సామర్థ్యశాలి చదువులు వేరు. వేటి అవసరం సమాజానికి ఉంటుందో, ఉదాహరణకి, వైద్యం, శాస్త్రసాంకేతికత లాంటి టెక్నిక్ ల చదువులు సామర్థ్యశాలి చదువులు. వీటిని పట్టుకుని మనిషి బతకవచ్చు, దోచుకోవచ్చు కూడా. విలాసాలు కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే వీటి అవసరం ప్రతి ఒక్కరికీ ఉంటుంది.’

‘కానీ మన సభ్యతలో సామర్థ్యశాలి చదువులకంటే సామర్థ్యహీన చదువులకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. ఒక రాజు దర్బారులో ఒక గాయకుడి ఆసనం రాజు ఆసనం కంటే జానెడు ఎత్తులో ఉండేది. ఒక జ్యోతిష్కుడి ఆసనం అతని ఆసనం కన్నా ఎక్కువ ఎత్తులో ఉండేది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు, సామర్థ్యశాలి చదువులు వ్యవస్థను నిర్మిస్తాయి, కానీ మనసును నిర్మించలేవు. సామర్థ్యశాలి విద్యలు మనసును సంకుచితం చేస్తాయి. ఇప్పుడున్నట్లే తన సామర్థ్యంతో మనిషి దోచుకోడం మొదలుపెడతాడు. కాని సామర్థ్యహీన విద్యలు మనిషి మనసును ఎంతో ఉన్నతంగా తీసుకెళ్టాయి. మనిషి ఇష్టాల్ని ఎంతో ఉన్నతస్థానంలో నిలుపుతాయి. సంకుచితంగా మార్చవు. ఒక సమాజపు మనస్సు ఉన్నతంగా ఎదగాలనుకుంటే ఇటువంటి సామర్థ్యహీన విద్యలకి చాలా పెద్ద ప్రాధాన్యతనివ్వవలసి ఉంటుంది.’

చాలా గంభీరమైన విషయాలు. ఒక మహత్తర సమాజం. అది గాంధీగారన్నట్లే నిజంగానే ఒక సుందరవృక్షం, గురజాడ అన్నట్లు దొడ్డ వృక్షం అనిపించింది గురూజీ తన ప్రసంగం ముగించగానే.

13-6-2026

7 Replies to “జీవన శిల్పి-11”

  1. Every conversation with Guruji you posted has been very informative and thought provoking, Sir.

    Nice story explaining how gratitude influenced our economics, and the interdependence that made up a complete society and life.

    “మన వ్యవస్థలో ఋణభావన చాలా ముఖ్యమైంది. మనం డబ్బుకి ఋణపడిలేం. భావానికి ఋణపడి ఉన్నాం. కృతజ్ఞతా భావం ప్రతి ఒక్కరిలోనూ ఉండేది.”

    “వీరంతా ఉన్నారు కాబట్టే నేను బతుకుతున్నాను. వీరు లేకపోతే ఎలా బతగ్గలను?”

    గ్రామీణ ఆర్థిక వ్యవస్థ గురించి మీరు చెప్పిన సందేహం:
    “జనాభా పెరుగుతున్నప్పుడు, ఆ నిర్దిష్ట చట్రాన్ని ఎలా నిలబెట్టడం?”

    దానికి గురూజీ ఇచ్చిన వివరణ కూడా చాలా interesting గా వున్నాయి:
    “మీ కుటుంబం నుండి ఇంకొక కుటుంబం ఏర్పడగానే వేరొక కుటుంబపు ఆహారవ్యవస్థ అక్కడ ప్రారంభమైపోయేది.”

    ఇప్పుడు వినడానికి కొన్ని విషయాలు కొత్తగా అనిపించినా, modernization కి ముందు తరతరాల పాటు ఈ వ్యవస్థ నిలకడగా కొనసాగిందనే విషయం ఆలోచిస్తే ఆశ్చర్యంగా ఉంటుంది.

    బిడ్డ పుట్టినప్పటి నుండి పెళ్లి, పండుగలు, సంస్కారాలు, చివరకు చావు వరకు కూడా ప్రతి వృత్తి కళాకారుడికి ఆర్థిక భద్రత కల్పించే విధంగా మన సంప్రదాయాలు, సంస్కారాలు, కార్యక్రమాలు ఎలా ఏర్పడ్డాయో గురూజీ చాలా చక్కగా వివరించారు.

    పల్లెలో పెరగడం వల్ల వివిధ వృత్తుల వాళ్లతో ఉన్న interdependence, పరస్పర సహకారం, గౌరవం ప్రత్యక్షంగా చూసిన అనుభవం ఉండటం వల్ల, వీటిని కేవలం ఆచారాలుగా మాత్రమే కాకుండా సమాజంలోని ప్రతి వృత్తిపనివారికీ గౌరవం, జీవనోపాధి కల్పించే ఒక system గా చూడటం ఎంతో ఆసక్తికరంగా అనిపించింది. Never thought about it this way.

    At the same time, మీరు చెప్పిన local traditional aesthetic తో కూడిన ఇంత efficient వ్యవస్థను modernization పేరుతో క్రమంగా కోల్పోతున్నాము కదా అని బాధ కలుగుతుంది.

    శాస్త్రాచారం, లోకాచారం గురించి, అలాగే వారు చేసే పనిని బట్టి శాస్త్రాన్ని సడలించుకునే పద్ధతుల గురించి,
    సామర్థ్యశాలి చదువులు, సామర్థ్యహీన చదువుల గురించి వారు చేసిన observation కూడా ఎంతో interesting and necessary knowledge for today అనిపించింది.

    మీరు చెప్పినట్లు,
    “చాలా గంభీరమైన విషయాలు. ఒక మహత్తర సమాజం. అది గాంధీగారన్నట్లే నిజంగానే ఒక సుందరవృక్షం, గురజాడ అన్నట్లు దొడ్డ వృక్షం అనిపించింది గురూజీ తన ప్రసంగం ముగించగానే.”

    🙏🏽🙏🏽🙏🏽

  2. జీవన శిల్పి పదకొండవ భాగం కేవలం ఒక సంభాషణ అనలేం భద్రుడు గారు. ఇది మోడర్న్ ఎకనామిక్స్ కోల్పోయిన అత్యంత విలువైన , అవసరమైన మానవీయ కోణాన్ని గురూజీ అద్భుతంగా బోధించిన పాఠం. అభద్రతా భావం లేకుండా విలసిల్లిన గ్రామీణ ఆర్థిక వ్యవస్థ గురించి తెలుసుకుంటుంటే మనం ఆధునికత, ఆర్థిక ఎదుగుదల తో ఎంత దూరమో వచ్చేసి ఏమేమో సాధించినా దానికోసం ఏం కోల్పోయామో ఆలోచిస్తే చాలా బాధేసింది.

    ​”ఇది నాకు రేపు దొరుకుతుందో లేదో అనే అభద్రతాభావం ఉంటుందో అతడే వస్తువులు కూడబెట్టే ఆరాటంలో పడతాడు. ఆ అభద్రతా భావమే మనిషి వస్తువుల్ని వెనకేసుకునేలా చేస్తుంది. భద్రత ఉందనే నమ్మకం ఉంటే ‘రేపు కూడా ఇవన్నీ దొరుకుతాయి కదా, ఇప్పుడెందుకు కూడబెట్టాలి?’ అని ఆలోచిస్తాడు. కాబట్టి వస్తువులు కూడబెట్టడు”

    గురూజీ చేసిన ఈ పరిశీలన అద్భుతం. ఆధునిక సమాజం ‘సమృద్ధి’ అంటే బ్యాంకు బ్యాలెన్స్‌లు, ఆస్తులు కూడబెట్టడం అనుకుంటుంది. కానీ నిజమైన సమృద్ధి అంటే భౌతికమైన నిల్వలు కాదు, వ్యవస్థ మీద ఉండే ప్రగాఢ విశ్వాసం అని గురూజీ ఎంత సులువుగా తేల్చి చెప్పారు. మనిషిలో ఉన్న గ్రీడ్ కి మూలం ప్రకృతి సిద్ధమైనది కాదు, అది వ్యవస్థ సృష్టించిన అభద్రతాభావమే కదా. ఈ విషయాన్ని నిమ్మచెట్టు ఉదాహరణ ద్వారా గురూజీ విశ్లేషించిన తీరు అమోఘం.

    ​”ఎందుకని? ఎందుకంటే ఆ వృక్షం అతని పరిధిలో లేదు. అతని పరిధిలో లేకపోవడం వల్లనే అతనిలో ఆ కూడబెట్టే స్వభావం వచ్చింది. ఎవరి పరిధిలో అయితే ఆ వృక్షముంటుందో వాళ్ళు ఉచితంగా ఇచ్చినా తీసుకోరు. అందుకే గ్రామాల సమృద్ధి అంటే ఇదే- ప్రతి ఒక్క వస్తువూ వారి పరిధిలోనే లభించాలి. తద్వారా ఎవరిలోనూ కూడబెట్టాలనే స్వభావంగానీ, దొంగతనం చేయాలనే ఆలోచన గానీ పుట్టదు. సమృద్ధి అంటే ఇదే కదా, హెచ్చుతగ్గులు లేకపోవడం.’”
    — గురూజీ చెప్పిన ఈ వాక్యాలు ఎంత నిజమో అనిపించాయి.

    ​ప్రతి వస్తువూ ‘తమ పరిధిలోనే లభించడం’ అనే ఆత్మనిర్భరత ఎప్పుడైతే పోయిందో, అప్పుడే మార్కెట్ శక్తులు మనల్ని లూటీ చేయడం మొదలుపెట్టాయి.

    ​గురూజీ తన తండ్రిగారు చనిపోయినప్పుడు ఫ్యాక్టరీ వస్తువులను పూర్తిగా నిరాకరించి, గ్రామంలోని అంగవైకల్యం ఉన్న వడ్రంగి చేత మంచం చేయించి, ఇతర వృత్తుల వాళ్ళ చేత అవసరమైన పనులు చేయించి ఆచారాలు జరిపించామని చెప్పిన వృత్తాంతం కళ్ళల్లో నీళ్ళు తెప్పించింది. సిద్ధాంతాలు మాట్లాడటం సులభమే, కానీ వాటిని ఇలా ఆచరణలో చూపెట్టడం ఎక్కడో గురూజీ లాంటి వారికి మాత్రమే సాధ్యమయ్యే పని.

    నిజంగా చాలా గంభీరమైన విషయాలు. మీరు ఎప్పుడో మూడు దశాబ్దాల క్రితం రికార్డ్ చేసి ఇప్పుడు మాకిలా అందిస్తున్నందుకు మీకు కృతజ్ఞతాభివందనాలు.

    1. చాలా చాలా సంతోషం సార్! మీ వంటి మిత్రులివి చదువుతున్నారన్నప్పుడు ఎంతో ఉత్సాహం కలుగుతుంది. ఎంతో బలం చేకూరుతుంది.

  3. చాలా విషయాలు లోతుగా వివరిస్తున్నారు. చదువుతుంటే ఇంకా మిగిలిన ఆనవాళ్లను చిత్రీకరించి భద్రపరచాలనిపిస్తుంది.

    సమాజంలో మనుషులు పరస్పరం రుణభారం లేని జీవితాలు గడిపింది నా తరం కూడా చూసింది.

    ఇద్దరు కలిసినప్పుడు, యోగక్షేమాలు కనుక్కునేటప్పుడు ఇవతలి వ్యక్తి “బాగున్నారా” అన్న అర్థం స్పిరించేలా మాట వాడినప్పుడు అవతలి వ్యక్తి “మీ దయ” అనేవారు, రెండు చేతులు జోడించి. రుణ భారాన్ని మించిన ఆ వ్యక్తీకరణను నేను ఇష్టంగా ఒక ఫోటో గా తీసి పెట్టాను.

    మా ఊరి చాకలి భార్యతో హైదరాబాద్ వచ్చినప్పుడు మా ఇంటిని సందర్శించారు. మా ఆవిడతో “మీ పెళ్లి చేసింది మేమే కదా” అన్నప్పుడు తనకు అర్థం కాలే . వాళ్లు మా బంధువులు ఏమో అనుకుంది. తర్వాత చెప్పాను, మా చాకలి వాళ్ళని. చిన్న చూపుకు తావివ్వని విధంగా అంత హక్కుగా అనుబంధంతో ఉండేవాళ్లు అన్ని కులాల వాళ్ళు.

    గ్రామీణ భారతం గురించి మన తెలుగు రాష్ట్రాల్లో లేదా బహుశా మన దేశంలోనే ఇంత విపులంగా అర్థం చేసుకొని విశదపరిచిన మహానుభావులు మరొకరు ఉన్నారా అనిపిస్తుంది.

    రవీంద్ర శర్మ గారితో మీరు సంభాషించి గొప్ప మేలు చేశారు. ఇదంతా ఒక పుస్తకంగా తెస్తే ‘భారతం’ అన్న పేరు పెట్టడం మంచిదేమో అని కూడా అనిపిస్తుంది.. ఎక్కడైనా ఒక చోట, శీర్షికలోనో ఉపశీర్షికలోనో…

    1. చాలా చాలా సంతోషం రమేష్ మీరు చదువుతున్నందుకు! ఎందుకంటే మీబోటి వాళ్లే ఆ సమాజాన్ని ఇంకా కళ్ళతో చూస్తున్నారు, చిత్రిస్తున్నారు, మాకు అందిస్తున్నారు!

  4. ఈ ఒక్క సంభాషణ లోనే ప్రతీ ఒక్క వాక్యమూ ఒకటికి రెండుసార్లు చదువుకుంటూ వచ్చానంటే అది అతిశయోక్తి కాదు. ఎన్నో తెలియని విషయాలు, ఇంకెన్నో పట్టించుకోని విషయాలు మనం చేసిన చేస్తున్న , పాటిస్తున్న ఆచారాలు, పద్ధతులు వెనుక వున్నాయంటే , ఆ వ్యవస్థను ఎంత పటిష్టంగా తీర్చిదిద్దారో అని ఆశ్చర్యమేస్తోంది . ధన్యవాదాలు. రేపటి ముత్యాల మాటల కోసం ఎదురుచూస్తూ …

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading