
రెండవ రోజు: మూడవ సంభాషణ
గ్లోబలైజేషన్ కి ప్రత్యామ్నాయం ఎక్కడుంది?
సమృద్ధికీ, సంపన్నతకీ మధ్య ఉన్న తేడా గురించి చెప్పాక గురూజీ మళ్ళా తాను మొదలుపెట్టిన విషయం దగ్గరికొచ్చారు. పూర్వకాలపు గ్రామాల్లో చేతివృత్తుల వాళ్ళకి జీవికకీ, భద్రతకీ అవసరమైన మార్కెట్ ఆ గ్రామాల్లోనే దొరికేటట్టుగా చేసిన వ్యవస్థ గురించి చెప్పడం కొనసాగించారు:
‘ఇలా ప్రతి వస్తువు దాని సమయాన్ని బట్టి ఇంట్లోకి వచ్చేది. బంగారు పనిచేసేవాళ్ళ విషయమైనా, మట్టి పని చేసేవాళ్ళ విషయమైనా, లేదా ఇనుముతో పనిచేసేవాళ్ళ విషయమైనా ఇదే పద్ధతి. బట్టలు కుట్టేవాళ్ళ విషయంలోనూ ఇదే జరిగేది.’
‘నిజానికి భారతదేశంలో కుట్టిన బట్టలు వేసుకోవడం నిషిద్ధం. అనాదిగా మన సంస్కృతిలో కుట్టని వస్త్రాలకే ప్రాధాన్యత ఉండేది. అయినా దర్జీల సమాజం కూడా ఇక్కడుండేది. కుట్టిన బట్టలు సమానత్వాన్ని దెబ్బతీస్తాయి. కానీ కుట్టని బట్టలు, ధోతీ, చీరలాంటివి సమానత్వానికి ప్రతీకలు. మనం గుడికి వెళ్ళినప్పుడు లేదా హజ్ యాత్రకు మక్కా వెళ్ళినప్పుడు అందరూ కుట్టిన బట్టలు తీసేసి కుట్టని వస్త్రాలు ధరిస్తారు. ఆ దేవుడి సన్నిధిలో అందరూ సమానులే అన్నది దాని ఉద్దేశ్యం. ఐశ్వర్యవంతులైనా, పేదవారైనా అందరూ ఒకేలా ఉండాలి. కుట్టని వస్త్రం మనుషులుందరినీ సమానంగా నిలబెడుతుంది. కాని కుట్టిన బట్టలు హెచ్చుతగ్గుల్ని, అసమానతల్ని పెంచుతాయి. అందుకనే మన సంస్కృతిలో కుట్టిన బట్టలు నిషిద్ధమని చెప్పారు. నిజాం కాలంలో ఇక్కడికొచ్చిన కొందరు బ్రిటిష్ వారు తమ డైరీల్లో ఇలా రాసుకున్నారు: ‘ఇదొక విచిత్రమైన దేశం. ఇక్కడ రాజు ఎవరో, సేవకుడెవరో గుర్తుపట్టడం చాలా కష్టం. దర్బారులో ఉన్నప్పుడు మాత్రమే రాజు రాజులాగా కనిపిస్తాడు. దర్బారు దాటి బయటకు వచ్చాక ఎవరేమిటో అస్సలు తెలియదు ‘ అని. ఇప్పుడు రాజు గారు రాజుగారైనంత మాత్రాన రోజంతా బంగారు ధోవతి కట్టుకుని తిరుగుతారా? అంత మేకప్, ఇరవై నాలుగ్గంటలూ ఆభరణాలు వేసుకునే ఉంటారా? దర్బార్ లోకి వచ్చేటప్పుడు మాత్రమే అవన్నీ ధరించి ఒక గంటపాటు అలంకరించుకుని వస్తారు. దర్బార్ అవగానే ఆయన చేసే మొదటి పని అవన్నీ తీసి అవతల పారేయడం! ఎందుకంటే అవి చాలా బరువుగా, గుచ్చుకుంటూ, వేడిగా అనిపిస్తాయి కదా. అవన్నీ తీసేసి మామూలు బట్టలు వేసుకుని కూర్చునేవారు. ఇరవైనాలుగ్గంటలూ ఎవరూ కిరీటాలు పెట్టుకుని ఉండరు. ఇది కేవలం టీవీల్లో మాత్రమే చూపించే సంగతి- రాజుగారు పడుకునేటప్పుడు కూడా కిరీటం పెట్టుకుని పడుకున్నట్టు! అది టీవీల్లో మాత్రమే సాధ్యం. సామాన్యజీవితంలో అలా జరగదు. దర్బారు నుంచి రాగానే బట్టలు మార్చేసుకుని సాదాసీదాగా ఉండేవారు. అందువల్ల ఎవరు రాజో, ఎవరు నౌకరో తెలిసేది కాదు. ఇక్కడ పెద్ద పెద్ద సేఠ్ ల విషయం లోనూ అలాగే ఉండేది. చాలాసార్లు మునిమ్ ని చూసి సేఠ్ అనుకునేవారు. అసలు సేఠ్ పక్కన కూచున్నా, మునిమ్ నే ‘సేఠ్ సాబ్, సేఠ్ సాబ్’ అని పిలిచేవారు. అలానే ఉండేది. సేఠ్ అంటే అన్నీ తగిలించుకుని కూర్చోవాలని కాదు కదా.’
‘రెండవది, కుట్టని బట్టలలో గొప్ప విషయమేమిటంటే, మగవారి, ఆడవారి- ఇద్దరి వస్త్ర ధారణా ఒకేలా ఉండేది. కుట్టిన బట్టలు లేని రోజుల్లో మగవారు ఒక ధోవతి కట్టేవారు. ఆడవారూ ఒక ధోవతిని కాసె పోసి చీరలా కట్టేవారు. మగవారు ఒక ఉత్తరీయం వేసుకుంటే, ఆడవారూ ఉత్తరీ యం వేసుకునేవారు. చోళీ కట్టుకునేవారు, కుట్టినవి కావు, అవి ముడులు వేసుకునే రవికెలు. మగవారికి చెవిపోగులుంటే, ఆడవారికీ ఉండేవి. ఆడవారి మెడలో నగలుంటే మగవారి మెడలోనూ ఉండేవి. భుజకీర్తులు అంటే బాజూబందులు, ఇద్దరికీ ఉండేవి. చేతికడియాలు ఇద్దరికీ ఉండేవి. నడుముకు పెట్టుకునే వడ్డాణాలు ఇద్దరికీ ఉండేవి. రెండింటి డిజైన్లు వేరుగా ఉండేవిగానీ, ఇద్దరూ నలభై యాభై తులాల వెండిపట్టీలు నడుముకు ధరించేవారు. ఆయా ప్రాంతాల్లో ఆడవారి వడ్డాణాలకు ఒకటి రెండు డిజైన్లుంటే మగవారికి చాలా డిజైన్లుండేవి. కాళ్లకి కడియాలు కూడా ఇద్దరికీ ఉండేవి. అలా ఇద్దరూ ఒకేలా కనిపించేవారు. ఎప్పుడైతే ఇద్దరూ సమానంగా కనిపిస్తారో, అప్పుడు ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అనే భావన రాదు. ఇద్దరూ ఒకటే, ఎలాంటి తేడా లేదు. కానీ కుట్టిన బట్టలు వేసుకోడం మొదలయ్యాకనే ఈ తేడాలన్నీ మొదలయ్యాయి.’
‘కుట్టిన బట్టలు మొదట మగవారు అలవాటు చేసుకున్నారు. ఆడవారు మొదట్లో ఒప్పుకోలేదు. మగవారు పాంట్లు, షర్టులు వేసుకుని తిరగడం మొదలుపెట్టాక, ఆడవాళ్ళ మనసుల్లో ఒక భావం మొదలయ్యింది-‘మమ్మల్ని శతాబ్దాలుగా అణచివేసారు. మమ్మల్ని వెనకబడేలా చేసారు. మమ్మల్నింత పెద్ద చీరలో చుట్టి ఉంచారు ‘అని.
‘ఈ రోజుల్లో ఆదివాసి మహిళల్ని చూస్తే వారు సగం చీర కడతారు, అంటే గోచీపోసి కడతారు. వారి కట్టులో ఒక పద్ధతి ఉంటుంది. కానీ ‘అభివృద్ధి ‘ అనే పేరుతో ఏం జరిగిందంటే, ఇక్కడ తెలుగు మాట్లాడేవారు కట్టే గోల్ చీరెలు ఇప్పుడు ఆదివాసి మహిళలు కూడా కట్టడం మొదలుపెట్టారు. పూర్వం కాసె చీరలు కట్టే ఆడవాళ్ళు ఇప్పుడు తమ ఇంటికోడలు గోల్ చీర కట్టుకుని వస్తే ఆమె బాగా అడ్వాన్స్డ్ అని భావిస్తున్నారు. ఆ గోల్ చీర కట్టేవాళ్ళ దృష్టిలొ పంజాబీ డ్రెస్సు అంటే సల్వార్ కమీజు వేసుకునే అమ్మాయి అడ్వాన్స్డ్. పంజాబీ డ్రెస్సు వేసుకునేవారి దృష్టిలో మిడీలు, స్కర్టులు వేసుక్నే అమ్మాయి అడ్వాన్స్డ్. వారి దృష్టిలో జీన్స్ పాంటు వేసుకునే అమ్మాయి అడ్వాన్స్డ్. ఇలా ఒకరి దృష్టిలో మరొకరు అడ్వాన్స్డ్ గా కనిపిస్తున్నారుగానీ, ఎవరికి వారు తమను తాము అలా అనుకోవడం లేదు. ఈ రోజు గోండు మహిళలు తమ సాంప్రదాయిక చీరకట్టు వదిలేసి ఆధునిక చీర కట్టుని అనుసరిస్తున్నారు. కాని వారి కోడళ్ళు మాత్రం గోల్ చీరలు కడుతున్నారు. ఆ తర్వాత వారి కోడళ్ళు ఏం వేసుకుంటారో కాలమే చెప్పాలి.’
‘మన దేశంలో పూర్వం అందరూ కాసె చీరలే కట్టేవారు. గోల్ చీరలుండేవి కావు. మన దగ్గర ఈ గోల్ చీరలు ఎప్పుడు మొదలయ్యాయో తెలుసా? రవీంద్రనాథ్ టాగోరు గారి మేనత్త ఒకరుండేవారు. ఆమె పేరు జ్ఞానదానందిని. ఆమె భర్త పెద్ద బారిష్టరు. ఆమె తన భర్తతో కలిసి ముంబై వెళ్తుండేవారు. అయితే ఆయన ఆమెని ఏ సభలకూ తీసుకువెళ్ళేవాడు కాడు. ఎందుకంటే ఆమె తన పాతపద్ధతిలో కాసె చీర కట్టుకుని పెద్ద తాళాల గుత్తి నడుముకు తగిలించుకుని ఉండేది. కానీ ఆ రోజుల్లో పార్శీ మహిళలు సభలకు హాజరవుండేవారు. అది చూసి ఆమె ‘పార్శీ మహిళలు వెళ్తున్నారు కదా, నేనెందుకు వెళ్ళకూడదు’ అని ఆలోచించింది. అప్పుడామెకి తన వస్త్రధారణనే తనని ఆపుతోందని అర్థమయింది. అందుకని తను కూడా పార్శీ మహిళల్లాగే దుస్తులు వేసుకుని వెళ్ళాలని నిశ్చయించుకుంది. పార్శీ మహిళలు ఒక ఇజార్ అంటే పైజామా లాంటిది వేసుకుని దానిపైన ఒక వస్త్రాన్ని చీరలా చుట్టుకుని వచ్చేవారు. అది చూడటానికి చీరలాగే ఉండేది.అప్పుడు వాళ్ళు మీటింగులకి వెళ్ళి మాట్లాడి వచ్చేవారు. ఆ తర్వాత జ్ఞానదానందిని కలకత్తా తిరిగి వచ్చి అక్కడి మహిళలకు గోల్ చీర కట్టుకోడమెలానో నేర్పించడానికి ఒక ట్రైనింగు సెంటరు ప్రారంభించింది! అలా అక్కడినుండి నెమ్మదిగా మొత్తం భారతదేశానికి ఈ గోల్ చీర వ్యాపించింది. అంతకుముందిది లేదు. అందరూ కాసె చీరలే కట్టేవారు. ఉత్తరభారతదేశంలోనూ అదే పద్ధతి ఉండేది. ఇప్పటికీ మధ్యప్రదేశ్ లో వృద్ధుల్ని చూస్తే వారు తమ సొంత పద్ధతిలో కాసె చీరలు కట్టుకోవడం కనిపిస్తుంది. ప్రతి చోటా గోచి పెట్టి కట్టే చీరలే ఉండేవి. ఎందుకంటే ఈ గోల్ చీర లోపల పెట్టికోటు వేసుకోవాలి. అది కుట్టిన వస్త్రం. లంబాడా మహిళలు ఘాగ్రా వేసుకుంటారు. అది కుట్టిన వస్త్రం కింద లెక్కకు రాదు, దాన్ని ముడులు వేసి కుట్టుకుంటారు. అది కుట్టినవస్త్రమైతే ఉతికినప్పుడు ఆరదు. అది చాలా బరువుగా ఉంటుంది కదా, అందుకని దాన్ని విప్పి ఆరబెడతారు. కాబట్టి అది కుట్టిన వస్త్రం కాదు. వారి చోళీలు కూడా ముడులు వేసుకునేవే, కుట్టినవి కావు.’
‘అందుకే మన దేవతామూర్తుల్ని చూస్తే అందరూ కుట్టని వస్త్రాలే ధరించి ఉంటారు. కానీ మొఘలులు భారతదేశానికి వచ్చాక ఆ వస్త్రధారణ భారతీయీకరణ చెందింది. మొఘలుల వస్త్రధారణ ప్రభావం మనమీద పడింది. మోకాళ్ళకింద దాకా ఉండే వాళ్ళ జుబ్బా మన దగ్గరికొచ్చేసరికి మోకాళ్ళ పైకి వచ్చింది. గుర్రాలెక్కడానికి వీలుగా మగవారు కట్టే రెండు గోచీల ధోవతి చుడీదార్ పైజామాగా మారింది. కిరీటం స్థానంలో పగడీ వచ్చింది. ఆ కాలపు పెయింటింగులు చూస్తే మగవారి ఆడవారి వస్త్రధారణ ఒకేలా ఉండేది. ఇద్దరికీ చూడీదార్ పైజామా, జుబ్బా ఉండేవి. పైనుంచి ఒక వస్త్రం వేసుకునేవారు. తలమీద టోపీ పెట్టుకునేవారు. కవ్వాలీలు పాడేటప్పుడు చూస్తే ఇద్దరి వస్త్రధారణా ఒకేలా ఉంటుంది కదా, ఎలాంటి తేడా కనిపించదు. అలా చాలాకాలం ఇద్దరి వేషభాషలూ ఒకేలా సాగాయి. కానీ బ్రిటిష్ వారు వచ్చాక మగవారి వస్త్రధారణ పూర్తిగా వేరైపోయింది, ఆడవారిది వేరైపోయింది. చివరికిదంతా గందరగోళంగా మారింది.’
‘వస్త్రధారణ మారడంతో మన దగ్గర చాలా విషయాలు మారిపోయాయి. అసలు కళ అనేది సమకాలీనంగా ఉండాలి. నువ్వు ఏ కాలంలో జీవిస్తున్నావో ఆ కాలానికి తగ్గట్టుగా కళ ఉండాలి. పూర్వం శకులు, హూణులు బయటి దేశాలనుంచి ఇక్కడికి వచ్చారు. వారు చాల చల్లటి ప్రాంతాలనుండి రావడం వల్ల వారి దేవుడు కూడా చల్లటిప్రాంతాల వస్త్రధారణలోనే ఉండేవాడు. చలినుండి రక్షించుకోడానికి తాము ఎలాంటి దుస్తులు వేసుకునేవారో తమ దేవుడికీ అలాగే వేసేవారు. పెద్ద జుబ్బా తొడిగి, కాళ్ళకు పెద్ద బూట్లు తొడిగి, తలపాగా చుట్టేవారు. సూర్యభగవానుణ్ణి మొదట ఇక్కడికి తెచ్చినప్పుడు ఆయన విగ్రహాలు మనకి అలాగే కనిపిస్తాయి-పెద్ద బూట్లు, జుబ్బా, పగడీ ధరించి, ఒక కత్తి పట్టుకుని నిలబడి ఉంటాడు. కానీ భారతదేశానికి వచ్చాక, ఇక్కడి వాతావరణానికి, ఇక్కడి సంస్కృతికి అలవాటు పడ్డాక ఇక్కడి వస్త్రధారణని బట్టి దేవుడి బట్టలు కూడా మార్చేసారు. ఆయన కూడా కుట్టని వస్త్రాలు ధరించడం మొదలుపెట్టాడు. కానీ బూట్లు మాత్రమే మార్చలేదు. అలాగే ఉంచేసారు. సూర్యుడి పాదాలు చూపించకూడదు అనే నియమం ఉంది. కానీ దక్షిణ భారతదేశంలో సూర్యుడి విగ్రహాలకు పాదాలు చూపిస్తారు, ఎందుకంటే ఇక్కడ బూట్లు వేసుకునే పద్ధతి లేదు.’
‘మన దగ్గరొక నియమం ఉండేది, పిల్లలకి పన్నెండు సంవత్సరాల వయసు వచ్చేవరకు కాళ్ళకు చెప్పులు వేయకూడదని. వాళ్ళు ఎంతటి పెద్ద ఇంటి పిల్లలైనా సరే పన్నెండేళ్ళు వచ్చేదాకా కాళ్ళకు చెప్పులు వేసేవారు కాదు. పిల్లవాడు ప్రకృతిలోని అన్ని విషయాలను, నేలను, స్పర్శను అనుభవించాలని ఆ నియమం పెట్టారు. అంతవరకు ఖాళీ కాళ్ళతోనే పరుగెత్తేవారు. కాని ఈ రోజుల్లో పన్నెండు రోజుల వయసుపిల్లవాడికి కూడా బూట్లు తొడుగుతున్నారు.’
‘ఉత్తరభారతదేశంలో మొఘలుల వస్త్రధారణ భారతీయీకరణ చెందాక అక్కడి దేవుళ్ళను రాజులను కూడా కొంత కాలం పాటు దర్బారుకువెళ్ళేటప్పుడు ఆ దుస్తులు వేసుకోమన్నారు. దాంతో అక్కడి దేవుళ్ళు కూడా వాటిని అలవాటు చేసుకున్నారు. ఉదాహరణకి, గుజరాత్, రాజస్తాన్ ప్రాంతాల్లో కృష్ణభగవానుణ్ణి చూస్తే, ఆయన చుడీదార్ పైజామా, జుబ్బా, షేర్వాణీ వేసుకుని తలపాగా చుట్టుకుని మురళి వాయిస్తూ ఉంటాడు. మొఘలులదాకా ఎలాగోలా నడిచింది. కానీ బ్రిటిష్ వారు వచ్చాక అంతా మారిపోయింది. ఇప్పుడు కృష్ణుడికి ఏం వేస్తారు? పాంటు వేస్తారా లేక సూటూ, బూట్లూ వేసి టై కట్టి కిరీటానికి బదులు హాట్ పెట్టి చేతిలో మురళికి బదులు సిగరెట్టిస్తారా? ఏం చేస్తారు? దాంతో మన కళలన్నీ అక్కడితో ఆగిపోయాయి. వాటి సమకాలీనతని అవి ప్రతిబింబించలేని స్థితికి చేరుకున్నాయి. ఎందుకంటే ఇక్కడ సంస్కృతి పూర్తిగా మారిపోయింది.’
‘అందుకే మన చేతివృత్తుల వారు ఆ రోజుల్లో ఒక డిజైన్ ద్వారా అన్నింటినీ తమ వశంలో ఉంచుకున్నారు. ఆయా ప్రాంతాల డిజైన్లు ఆ ప్రాంతాలకే పరిమితం. అవి బయట ఎక్కడా దొరకవు. ఒకవేళ బయటకు తీసుకెళ్ళినా ఎవరూ కొనరు. దేని ప్రత్యేకత దానిదే. అంటే ఆ కాలంలో ప్రతి ఒక్క గ్రామం ఒక కంపెనీ లాంటిది.బయటి వ్యక్తి ఎవరూ అందులోకి రావడానికి వీల్లేదు. వారికి ఎలాంటి అవకాశం ఉండేది కాదు, అంతటి పక్కాబందోబస్తు ఉండేది. మార్కెట్ ఎంత కఠినంగా ఉండేదంటే, ఇళ్ళూ, గ్రామాలూ పక్కా పంపకం జరిగి ఉండేవి. ఒకవేళ వేరే ఊరి కుమ్మరి వచ్చి ఈ ఊళ్ళో మట్టిపాత్రలు అమ్మితే అతణ్ణి పట్టుకుని జరిమానా విధించేవారు- మా ఊళ్ళో ఎలా అమ్ముతావు? అని. అలాగే బయటి ఊరినుంచి వాద్యకారుడు వచ్చి ఇక్కడ వాయిస్తే అతడికి జరిమానా వేసేవారు. అంతటి పట్టు ఉండేది మార్కెట్ మీద.’
‘ఈ మార్కెట్ వ్యవస్థ ఎప్పుడు దెబ్బతిన్నదంటే, బహుశా 1777 లో అనుకుంటా, ధర్మపాల్ గారి పుస్తకాల్లో ఆ తేదీ ఉంటుంది, బ్రిటిష్ వారు ఒక చట్టం తెచ్చారు- ‘ఈ రోజునుండి ఎవరైనా ఎక్కడైనా ఏ వస్తువైనా అమ్ముకోవచ్చు, ఎవరూ ఆపకూడదు’ అని. దాంతో మార్కెట్లు తెరుచుకున్నాయి. ముక్త మార్కెట్ వ్యవస్థ వచ్చింది. అంతకుముందలా ఉండేదికాదు. ఎవరూ తమ వస్తువుల్ని ఇతరుల ప్రాంతాల్లో అమ్మడానికి వీల్లేడు. ఎవరి మార్కెట్ వారిదే, ఎవరూ ఇతరుల మార్కెట్ ఆక్రమించుకునేవారు కాదు.’
మా తొలిసమావేశాలనుంచీ కూడా గురూజీ ఈ మాటలు చెప్తున్నప్పటికీ, ఇవి నాకు బాగా అర్థమయింది, 1999లో. అప్పటికి గ్లోబలైజేషన్ గాలి భారతదేశానికి తగలడం మొదలయ్యింది. అప్పుడు చీరాలలో ‘లోక్ విద్యా ఆందోళన్ ‘ అనే వారు ఒక ప్రజాసదస్సు నిర్వహించారు. చీరాలలో చేనేతకారుల కోసం కృషి చేసే మోహన రావు గారు దానికి సూత్రధారి అనుకుంటాను. ఆ సదస్సుకి గురూజీని కూడా ఆహ్వానించారు. నేనప్పుడు శ్రీశైలంలో పనిచేస్తుండేవాణ్ణి. నన్ను కూడా చెంచువారి సాంప్రదాయిక సామర్థ్యాల గురించి మాట్లాడమని పిలిచారు. ఆ రోజు గురూజీ ఇవే మాట్లాడారు. కాని గ్లోబలైజేషన్ అంటే ఏమిటో చూచాయగా తెలుస్తున్న ఆ తొలిరోజుల్లో గురూజీ మాటలు నా చెవుల్లో డైనమైట్లలాగా బద్దలయ్యాయి.
అప్పటికింకా తెలుగు కవులూ, రచయితలూ,మేధావులూ, (ఇప్పటికీ కూడా) చేతివృత్తులు నాశనమవు తున్నాయనీ, పల్లెలు ధ్వంసమవుతున్నాయనీ, పట్టణాలకు వలసలు పెరుగుతున్నాయనీ కథలూ, కవిత్వాలూ రాస్తూ ఉండేవారు. కానీ గ్లోబైలైజేషన్ కి విరుగుడు ఎక్కడ ఉందో ఎవరూ లోతుగా ఆలోచించేవారు కాదు. ఎందుకంటే వారిలో చాలామంది గ్రామాలనుంచే వచ్చినప్పటికీ, వారు మానసికంగా ఎప్పుడో గ్రామజీవితం నుంచి దూరంగా జరిగిపోయారు. కాబట్టి వారికి చేతనయిందేమంటే, ప్రభుత్వాన్నీ లేకపోతే ఆమెరికానీ విమర్శిస్తూ ఉండటమే. ఆ రోజుల్లో డంకెల్ ని తిట్టడమే కవిత్వంగానూ, ఉద్యమనినాదంగానూ చలామణీ అయ్యేది.
కానీ గ్లోబలైజేషన్ కు ప్రత్యామ్నాయం లోకల్ మార్కెట్లని బలోపేతం చెయ్యడమని గురూజీ చెప్పడం నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. ప్రపంచీకరణ అంటే ఏమిటి? మార్కెట్ కి తలుపులు తెరవడమే కదా. దేశీయ వనరుల్ని (ప్రకృతిసంబంధమైనవీ, మానవసంబంధమైనవీ కూడా) కార్పొరేట్లు కొల్లగొట్టుకోడానికి ప్రభుత్వాలు పీట వెయ్యడమే కదా. అయితే లోకల్ మార్కెట్ల గురించి మాట్లాడిన మొదటి మనిషి గురూజీనే కాకపోవచ్చు. కానీ లోకల్ మార్కెట్ కి వెన్నెముక లోకల్ డిజైన్ అనీ ఆ లోకల్ డిజైన్ కి కీలకం స్థానిక సౌందర్యదృష్టిలో ఉంటుందనీ చెప్పినవాడు మాత్రం గురూజీనే. స్వావలంబన అను, స్వాతంత్య్రం అను, స్వయం-సమర్థ జీవన శైలి అను, నువ్వు ఏ మాట చెప్పినా సరే, నీ స్వాతంత్య్రాన్ని నీ ఆర్థిక వ్యవస్థ కాపాడుతుందనీ, నీ ఆర్థిక వ్యవస్థను నీ స్థానిక సంస్కృతి కాపాడుతుందనీ చెప్పినవాడు మాత్రం నాకు తెలిసి గురూజీనే.
లోకల్ డిజైన్ మార్కెట్ ని లోకల్ చేస్తుందనీ, లోకల్ మార్కెట్ వల్ల స్థానిక కళాకారుడికి ఆహారభద్రత లభిస్తుందనీ గురూజీ చెప్పిన ఈ మాట ప్రపంచమంతా వినవలసిన మాట కదా అనిపించింది. ఈ సంభాషణలు 2010 లో మాట్లాడుకున్నవి. కాని 2018 లో Arturo Escobar అనే ఒక కొలంబియన్-అమెరికన్ ఆంత్రొపాలజిస్టు Designs for the Pluriverse అని ఒక పుస్తకం రాసాడు. అతను చెప్పేదేమంటే, పాశ్చాత్య దేశాలు మాట్లాడే ‘అభివృద్ధి’ నిజానికి స్థానిక జనజీవన శైలినీ, స్థానిక పరిజ్ఞానాల్నీ తుడిచిపెట్టేసి కార్పొరేట్ పెట్టుబడిదారీ వ్యవస్థని బలపర్చడానికే పనికొస్తుందని. అంతేకాదు, అది తీవ్రస్థాయిలో పర్యావరణ వ్యవస్థల్ని కూడా ధ్వంసం చేస్తుందని.

అతని పుస్తకం ప్రధానంగా డిజైన్ మీదనే ఆధారపడి నడుస్తుంది. మనం తొడుక్కునే గుడ్డలు మొదలుకుని మనం వాడే స్మార్ట్ ఫోన్ల దాకా ప్రతి ఒక్క వస్తువూ కూడా ఏకశిలాసదృశమైన జీవనవిధానాన్నే ప్రోత్సహిస్తుందని. అందుకని అతను autonomous design గురించి మాట్లాడతాడు. అంటే స్థానిక సమాజాలే తమ వ్యవస్థల్ని, తమ సాంకేతికతల్ని, తమ ఉత్పత్తుల్ని తామే రూపొందించుకోవాలంటాడు. అలా చెయ్యడానికి వారి సంస్కృతినుంచి స్ఫూర్తి పొందాలని చెప్తాడు. దక్షిణ మెక్సికోలోని జపతిస్తా ఉద్యమాల స్ఫూర్తితో అతను తన pluriverse ని నిర్వచించుకున్నాడు. Pluriverse అంటే ‘ .. a world where many worlds fit’ ఎస్కోబార్ మాట్లాడింది కేవలం పుస్తకాలకే పరిమితం కాలేదు. ఈ రోజు కొలంబియా, ఈక్వడార్, బొలీవియా లాంటి దక్షిణ అమెరికా దేశాల్లో ఆయన భావాల ప్రాతిపదికగా ఎన్నో స్థానిక సమాజాలు కృషి చేస్తున్నాయి.
కానీ మన దగ్గర ఒకరు ప్రభుత్వంలోకి రాగానే చేసే మొదటిపని పెట్టుబడులు ఆహ్వానించడం. దానికోసం ఇక్కడి భూమి, నీళ్ళు, విద్యుత్తు సబ్సిడైజు చేసి అందించడం. కానీ అవే వనరుల్ని ఇక్కడి స్థానిక సమాజాలకీ, దేశీయ పరిశ్రమలకీ, కుటీర ఉద్యోగితకీ వినియోగించవచ్చునని వారికి తెలీదు, చెప్పినా వినే పరిస్థితి లేదు.
గురూజీ సంభాషణ కొనసాగిస్తున్నారు: ‘అలా డిజైన్ల ద్వారా, మార్కెట్ ద్వారా ప్రతి ఒక్కరికీ ఆహారభద్రత కల్పించారు. మనిషికి అంతకంటే ఏం కావాలి? ఈ రోజు మనిషి చస్తూ, జీవిస్తూ సంపాదిస్తున్నది దేనికోసం? వనరులకోసమే కదా. ఆ రోజు వనరులు సులభంగా దొరికేవి. అన్నింటికంటే ముఖ్యంగా ఆహారభద్రత ఉండేది. మూడవది ఆరోగ్య వ్యవస్థ కూడా వారి పరిధిలోనే ఉండేది.
‘ఎవరికైతే ఈ మూడు విషయాలూ, అంటే ఆహారభద్రత, జీవనవిధానాన్ని నేర్పే చదువు, తమ పరిధిలో ఉండే ఆరోగ్య వ్యవస్థ- ఉండవో ఆ మూడూలేని గ్రామమే పేదగ్రామం. ఆ మనిషే పేదవాడు.’
‘మనవాళ్ళు పూర్వం చదువు జీవితం కోసం కావాలి తప్ప కేవలం బతకడం కోసం కాదని నమ్మారు. జీవితం కోసం చదువంటే అర్థం మనమెలాంటి జీవితం జీవించాలో చెప్పే చదువు. ఆహారభద్రత టెక్నాలజీ ద్వారా, మార్కెటింగ్ ద్వారా వ్యాపార రూపంలో ప్రతి ఒక్కరికీ అందుతోంది-అప్పుడు వారెలాంటి చదువు కోరుకుంటారు? జీవితాన్ని నేర్పే చదువు కోరుకుంటారు. అదే సమాజంలో ఆహారభద్రత లేకపోతే వాళ్ళు కోరుకునే చదువు ఉపాధికోసం చదవడమే అవుతుంది. ఎందుకంటే ఆ చదువు ద్వారా వారు కూడు సంపాదించుకోవాలి. ఎప్పుడైతే ప్రతి ఒక్కరికీ ఆహారభద్రత ఉంటుందో, అప్పుడు వారు చదివే చదువు బతకడం కోసం కాకుండా, జీవితం కోసం చదివే చదువు అవుతుంది. మన జీవితమెలా జీవించాలో చెప్పే చదువవుతుంది.’
‘మన శాస్త్రాలన్నీ కూడా ఈ కాలపు పనులకోసం రాసినవి కావు. ఇప్పటి పనులకి అవి పనికిరావు. సమాజంలో అందరికీ ఆహారభద్రత కల్పించినప్పుడు మాత్రమే ఆ శాస్త్రాల చదువు ఉపయోగపడుతుంది. మన శాస్త్రాలన్నింటినీ చదివాక చివరకి అర్థమయ్యేదొక్కటే-అన్ని శాస్త్రాల సారాంశమేమంటే- ‘నేను’, ‘నాకు’ అనే ఈ రెండు పదాల్ని నీలోపలనుండి తీసేయి అనే. ‘నేను ఎవరు?’, ‘నేను ఏం చేయాలి?’ అనే జిజ్ఞాస పెంచుకో. ‘నేను’, ‘నాకు’ అనే భావనల్ని ముందు అంతం చేయాలి. ఎందుకంటే మనిషిలో ఆ అహంకారం ఉన్నంతవరకు అతను ఏదో ఒకటి చేస్తాడు తప్ప ఏమీ నేర్చుకోలేడు. ఏదైనా నేర్చుకోవాలంటే ఆ అహాన్ని వదిలేయాలి. మన శాస్త్రాలన్నీ చెప్పేదిదే: ‘నేను’ అనే భావన వదిలేయి, అప్పుడు నువ్వు ప్రపంచంలో చాలా విషయాలు నేర్చుకుంటావు, సాధిస్తావు అనే.’
‘కాని ఇప్పటి చదువుల్లో ‘నేను’, ‘నాకు’ అనేవే చాలా ముఖ్యమయ్యాయి. ప్రతి అబ్బాయి ఏమంటున్నాడు- ‘నేనిది కోరుకుంటున్నాను, నాకిదింటే ఇష్టం భయ్యా, మీకెంటి ప్రాబ్లెం? నాకు పడుకోడం ఇష్టం, నేను పడుకుంటాను, పడుకుంటే మీకేమిటి ఇబ్బంది?’ అని అంటున్నాడు. బ్రిటిష్ వారి చదువుల్లో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే అది ఇండివిడ్యూలిజం ని బాగా ప్రోత్సహిస్తుంది. ప్రతి ఒక్కరూ స్వార్థంలో మునిగిపోతున్నారు. కానీ మన సంస్కృతిలో వ్యక్తిగతవాదం ఎప్పుడూ లేదు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైతే ఒక సమాజంలో వ్యక్తి తన సొంత లాభాన్ని వెతుక్కుంటాడో అప్పుడు సమాజం నాశనమవుతుంది. అదే సమాజపు అస్తిత్వాన్ని ప్రతి ఒక్క వ్యక్తి తనలోపల నిలుపుకుంటే సమాజం పైకి లేస్తుంది. నువ్వు సమాజంలో నీ సొంత అస్తిత్వం గురించి మాట్లాడితే సమాజం అంతమైపోతుంది.’
‘చూడండి, ఇప్పుడొక పిల్లగాడు అన్నీ చదువుకుని, పాంటు వేసుకుని, ఊరికి వెళ్ళి అందరికీ ‘నేను చదువుకున్నవాణ్ణి’ అని తన అస్తిత్వాన్ని చూపిస్తాడు. ఇంకొకడు అలాగే చూపిస్తాడు. మూడోవాడూ అలాగే చూపిస్తాడు. దానివల్ల సమాజం ముక్కలైపోతుంది. అంతమై పోతుంది. సమాజానికంటూ ఒక అస్తిత్వముంది. సామాజిక జీవితానికి ఒక ఆనందం ఉంది. ఆ ఆనందాన్ని నువ్వు నీలోపల ఉంచుకుంటే సమాజం బతుకుతుంది. ‘నేనేమీ కాను, నేనీ ఊరి బిడ్డను. ఈ సమాజంలో ఒక భాగాన్ని, సమాజం కంటే నేను పెద్దవాణ్ణి కాను’ అనే భావన మనిషిలో ఎప్పుడుంటుందో అప్పుడు సమాజం బతుకుతుంది. కానీ ఈ రోజుల్లో సమాజంలో అస్తిత్వాన్ని చాటుకోవడం ఎక్కువైంది. ఇదే వ్యక్తిగతవాదం కదా. ‘నేనున్నాను కాబట్టే నా మాట ఉంది కాబట్టే నేనున్నాను, కాబట్టి అంతా నేనే’ అనుకోవడం. ఇది వ్యక్తిగతవాదం. ఇప్పటి చదువుల్లో దీనికే ప్రాధాన్యతనిస్తున్నారు. మెకాలే చదువుల్లో దీనికే ప్రాధాన్యత. ‘సమాజం కంటే నేను పెద్దవాడిని కాను” అనే భావన ఎప్పుడైతే మనిషిలో ఉంటుందో, అప్పుడు సమాజం బతుకుతుంది. మన పాతపద్ధతుల్లో వ్యక్తిగతవాదానికి ఎక్కడా తావులేదు. మనిషి గుర్తింపుకి అంత ప్రాధాన్యత ఉండేది కాదు.
‘ఇక్కడ మన దగ్గర కొన్ని కొలాం కుటుంబాలుండేవి. అందులో ఒకామె గర్భవతి. ఆమెకు ప్రసవ సమయం వచ్చి నొప్పులు మొదలయ్యాయి. ‘హాస్పిటల్ కి తీసుకువెళ్దాం పదండి’ అన్నాం. కానీ వాళ్ళొప్పుకోలేదు. ‘మేం హాస్పటల్ కి రాము, ఏం చేయాలన్నా ఇంట్లోనే చేసుకుంటాం, మేం రాము’ అన్నారు. ‘ఎందుకు రారు?’ అని అడిగితే ‘మాకు ఒక పద్ధతి ఉంది, బిడ్డ పుట్టాక ఐదు రోజులదాకా ఎవరూ వాళ్ళను తాకకూడదు. ఏ ఇతర మహిళగానీ, పురుషుడుగానీ, తల్లినీ, బిడ్డనీ ముట్టుకోకూడదు. వారు పూర్తిగా దూరంగా విడిగా ఉండాలి. ఆ అమ్మాయి తన కానుపు తనే స్వయంగా చేసుకోవాలి, ఎవరూ సాయం చేయరు’ అని అన్నారు.
సరే అని వదిలేసాం. అక్కడొక చిన్న గుడిసె ఉంటే ఆమె అందులోకి వెళ్ళింది. ఒక వృద్ధురాలు గుడిసె బయట కూచుని ‘ఇలా చెయ్, అలా చెయ్’ అని లోపలకి చెబుతోంది. ఆ అమ్మాయి తనే స్వయంగా కానుపు చేసుకుంది. బొడ్డుతాడు తనే కోసుకుంది. ఆ తర్వాత ఇక్కడ బోరింగు పంపుదగ్గర మగవాళ్ళు లోటాలు పట్టుకుని నిలబడ్డారు. బిడ్డ పుట్టగానే ఏడవడం మొదలుపెట్టాడు. బిడ్డ ఏడుస్తుంటే వీరు పేర్లు పిలవడం మొదలుపెట్టారు- భీం రావ్, జంగు- ఇలా పిలుస్తున్నారు. చివరకు ఒక పేరు దగ్గర బిడ్డ ఏడవడం ఆపేసాడు. ఆ పేరే ఆ బిడ్డకి ఖాయం చేసేసారు.
‘రావుజీ, ఇదేమిటి ‘ అనడిగాన్నేను. ‘బిడ్డ పుట్టగానే పేరు కోసం ఏడుస్తాడు, అతనికి సరైన పేరు దొరకగానే ఏడుపు ఆపేస్తాడు’ అని చెప్పారాయన. ఇది భలే విచిత్రంగా ఉందే, పేరు దొరకగానే ఏడుపు బంద్! కానీ ఇక్కడ మన సమాజంలో ప్రతి ఒక్కడూ జీవితాంతం పేరుకోసం ఏడుస్తూనే ఉన్నాడు కదా! నాకేం పేరొచ్చింది? నా పేరేమయ్యింది అని ఏడుస్తున్నారు. అక్కడ పేరుకోసం ఏడ్చాడు. పేరు దొరకగానే కథ ముగిసింది. ఆ తర్వాత తను పేరు సంపాదించుకోవాలని ఎప్పుడూ ఆరాటపడడు. నేనో తోపును, నేనే అంతా అని ఎప్పుడూ నిరూపించుకోడు. ఎందుకంటే మనం సామాజిక జీవులం, సమాజం కంటే పెద్దవాళ్ళం కాదు కదా! ‘మనవాళ్ళంతా జీవితాంతం పేరుకోసం ఏడుస్తూనే ఉంటారు. ఎంతో బాండూ బాజాలతో పేరుపెడతారు. అయినా జీవితాంతం పేరుకోసమే ఏడుస్తారు’ అన్నాను వాళ్ళతో.
అప్పుడు మా దగ్గర కొందరు జర్నలిస్టులు కూడా ఉన్నారు. ‘ఓహ్! ఇప్పటికీ ఇంత మూఢనమ్మకమా! ఇంత వెనుకబాటుతనమా! ఇంత దగ్గరలో హాస్పటల్ పెట్టుకుని కూడా ఇంట్లోనే కానుపు చేసుకోడం వెనుకబాటుతనం కాకపోతే ఏమిటి! ఏమైనా జరిగి ఉంటే ఎవరు బాధ్యులు?’ అని వాదించారు.
నేనన్నాను—‘ఇందులో వెనుకబాటుతనం ఏముంది భయ్యా? ఒకవేళ ఈ రోజుల్లో బాగా చదువుకున్న అమ్మాయి ఎవరైనా ఇలాంటి పని చేస్తే, తనే స్వయంగా కాన్పు చేసుకుంటే- మీరంతా ఎగిరి గంతేసి పేజీల కొద్దీ ఆర్టికల్స్ రాస్తారు—’సైన్స్ ఎంత పురోగమించింది! ఈ రోజుల్లో ఒక అమ్మాయి కాన్పు చేసుకోవడానికి ఎవరి సహాయం అవసరం లేదు, ఆమెకు ఆమె ఒక డాక్టర్ అయిపోయింది!’ అని పొగుడుతారు. అదే ఒక ఆదివాసీ మహిళ చేస్తే అది వెనుకబాటుతనం అవుతుందా? చదువుకున్న అమ్మాయి చేస్తే అది పురోగామి అవుతుందా? ఇద్దరూ చేసిందీ ఒక పనే కదా!’
‘మన సంస్కృతిలో ‘సామర్థ్యం’, ‘మనస్సు’ అనేవి చాలా గొప్ప విషయాలు. ప్రతి ఒక్కరూ సామర్థ్యంతో పాటు మంచి మనసు కలిగి ఉండాలి. ఒకరోజు నేను ఇంటి నుంచి ఆశ్రమానికి వస్తున్నాను. అదంతా ఒక పెద్ద మైదానం. అక్కడ పాత చెరువు కట్ట ఉంది. దానిమీద కొంతమంది ఇళ్ళు కట్టుకుని ఉన్నారు. ఏదో ఊరి నుండి వచ్చి ఒక జంట కూడా అక్కడ నివసిస్తోంది, వాళ్ళు భార్యాభర్తలు. చాలా వయసులో ఉన్న కుర్రవాళ్ళు. ఆమె గర్భవతి. చుట్టుపక్కల ఒకట్రెండు ఇళ్ళు ఉన్నాయి తప్ప మరేమీ లేదు. ఆమెకు కాన్పు అయ్యే సమయం వచ్చింది, నొప్పులు మొదలయ్యాయి. ఆ కుర్రవాడు కంగారుపడిపోయాడు— ‘నేను ఏం చేయాలి?’ అని. అతను అటు ఇటు పరిగెడుతున్నాడు, ఏడుస్తున్నాడు. అతనికి ఏం చేయాలో తోచడం లేదు. అదే సమయంలో కొందరు మహిళలు పొలం పనుల కోసం ఆ దారిలో వెళ్తున్నారు. వాళ్ళు చూసి— ‘ఏమైందిరా? ఎందుకు ఏడుస్తున్నావు?’ అనడిగారు. ‘నా భార్య లోపల నొప్పులతో బాధపడుతోంది, నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు’ అన్నాడు. వాళ్ళు లోపలికి వెళ్ళి చూసి—’అరేయ్! ఈమెకు కాన్పు అయ్యే సమయం వచ్చింది కదరా! ఇంట్లో ఎవరూ లేరా?’ అనడిగారు. ‘ఎవరూ లేరు, నేనేం చేయాలి?’ అని అతను ఏడ్చాడు.
ఆ మహిళలు రెండు నిమిషాలు నిలబడి ఆలోచించారు. ‘ఎవరూ లేకపోతే ఏంటి, మేము లేమా ఏంటి? పదండి చూసుకుందాం’ అన్నారు. వాళ్ళు తమ చేతుల్లో కొడవళ్ళు పక్కన పెట్టారు. ఒకరు వేడి నీళ్ళు పెట్టారు, ఒకరు ఇంకో పని చేశారు. కొద్ది సేపట్లోనే కాన్పు చేశారు. బిడ్డ పుట్టాక, బిడ్డను బాగా కడిగి, బట్టలో చుట్టి ఆ కుర్రవాడికి ఇస్తూ, చూడు, ఇక్కడెవరూ లేరు కదా. ఈ పెద్దామె ఉంది, ఈమె ఈ రోజుకిక్కడే ఉంటుంది. సాయంత్రం నీకు తోచింది ఏదైనా కూలి ఇవ్వు. మీ వాళ్ళు వచ్చేవరకు ఈమె చూసుకుంటుంది’ అని చెప్పారు. అప్పుడు వాళ్ళు తమ కొడవళ్ళు తీసుకుని పొలం పనులకు వెళ్ళిపోయారు.
నేను అక్కడ నిలబడి ఇదంతా చూస్తూ ఉండిపోయాను—ఇంతటి సామర్థ్యం, ఇంతటి అందమైన మనస్సు! ఈ కాలపు అమ్మాయిల్లో సామర్థ్యం ఉండవచ్చు, కానీ ఇలాంటి మనస్సు ఉందా? సామర్థ్యం ఉన్నా కూడా ఇంతటి గొప్ప మనస్సు కలిగి ఉండటం సామాన్యమైన విషయం కాదు కదా! ఆ మనస్సు ఎలా వస్తుంది? సామర్థ్యం ఉండాలి, దాంతో పాటు ఇతరుల కోసం నిలబడే గుణం ఉండాలి—తమ పనులను కూడా పక్కన పెట్టి సహాయం చేసే మనస్సు ఉండాలి. ఈ మనస్సును మనం ఎలా తయారుచేస్తాం? ఈ రోజుల్లో అమ్మాయిలు సమర్థులవుతున్నారు, బస్సుల్లో, ఫ్లైట్లలో ఎక్కడికైనా తిరగగలుగుతున్నారు. కానీ వారి మనస్సు ఇంత అందంగా ఉందా? వాళ్ళు ఇలా చేయగలరా? ఒకవేళ చేయలేకపోతే ఆ చదువుకు అర్థం ఏంటి?’
‘ఇలాంటివి చూసినప్పుడల్లా నాకు భారతీయతకు, పాశ్చాత్య సంస్కృతికి ఉన్న తేడా ఏమిటనే ఆలోచన వస్తుంది. దేన్ని భారతీయత అంటారు? దేనిని పాశ్చాత్యం అంటారు? ఇక్కడ ఒకే ఒక్క తేడా ఉంది—ఆత్మీయతతో వ్యవహరించడం వేరు, వ్యవహారంతో ఆత్మీయత చూపించడం వేరు. ఎవరైతే హృదయపూర్వకమైన ఆత్మీయతతో ప్రవర్తిస్తారో అది భారతీయ మనస్తత్వం. ఎవరైతే వ్యవహారాన్ని బట్టి ఆత్మీయత చూపిస్తారో అది పాశ్చాత్య మనస్తత్వం. మనం కూడా కేవలం అవసరాల కోసమే ఆత్మీయత చూపించిన రోజు మనం కూడా భారతీయులం కాకుండా పోతాము. మన సర్వస్వం అంతమైపోతుంది. మనం ఆత్మీయతతో బతికేవాళ్ళం.’
‘హైదరాబాద్ నుండి ఒక అబ్బాయి వచ్చాడు. అతను ఆదివాసీలపై, ముఖ్యంగా కొలాం తెగమీద రీసెర్చ్ చేస్తున్నాడు. ‘నువ్వు ఏ ఊరికి వెళ్ళావు? ఎక్కడ తిరిగావు?’ అని అడిగాను అతణ్ణి. ‘ఫలానా గ్రామాల్లో తిరిగాను, చాలా చోట్లు చూసాను, అక్కడ ఒక కుటుంబంతో మాట్లాడాను ‘ అని చెప్పాడు. ‘నీకెలా అనిపించింది అదంతా చూసాక?’ అనడిగాను. ‘చాలా పేదరికం భయ్యా! చాలా వెనుకబాటుతనం, ఎంతో దారిద్ర్యం’ అన్నాడు. ‘సరే, వాళ్ళు నీకేమన్నా అన్నం పెట్టారా, లేదా?’ అనడిగాను. ‘ఆ, అన్నం పెట్టారు. మీల్ మేకర్ కూర, రొట్టెలు చేసి పెట్టారు’ అని చెప్పాడు. ‘నువ్వేమైనా వాళ్ళ చుట్టానివా?’ అనడిగాను. కాదన్నాడు. ‘మరి నీకు వాళ్ళు ముందే తెలుసా? లేదా మీవాళ్ళకెవరికేనా తెలుసా?’ అనడిగాను. లేదన్నాడు. చూడండి. ఒక అపరిచిత వ్యక్తి, వారి జీవితానికి ఏ విధంగానూ ఉపయోగపడనివాడు, పైగా వారి సమయం వృథాచెయ్యడానికి వచ్చినవాడు, ఎందుకంటే రిసెర్చ్ పేరుతో వాళ్ళ పనులు చెడగొట్టాడు, వీడు వెళ్ళకపోతే ఆ కుటుంబం ఆ పూటకి పొలంపనికో ఏదో ఒక పనికి వెళ్ళేవారై ఉంటారు. అలా తమ సమయాన్ని వృథా చేసుకుని మరీ వీడితో మాట్లాడి అన్నం కూడా వండిపెట్టారు!
నేనతణ్ణి అడిగాను: ‘నువ్వు ఈ పని చేయగలవా? ఒక అపరిచిత వ్యక్తి నీ ఇంటికొస్తే నువ్వు అన్నం పెట్టగలవా? వాని కోసం నీ సమయం వృథా చేసుకోగలవా? చేసుకోవు కదా. మరి పేదవాడు ఎవడు? వాడా? నువ్వా?’ అనడిగాను. ఒక రకంగా చూస్తే పేదవాళ్ళం మనం! నువ్వైతే అపరిచితుడికి అన్నం వండిపెట్టవు కదా. కానీ వారి మనస్సు, అది చూడాలి మనం.’
ఇప్పుడు గురూజీ మళ్ళా మరో కొత్త భావన పరిచయం చేసాడు. స్థానిక మార్కెట్, స్థానిక డిజైన్, స్థానిక సంస్కృతిమీద ఆధారపడ్డ సౌందర్యదృష్టి- ఈ మూడింటితో పాటు, స్థానిక సౌందర్యదృష్టి స్థానికుల మనోసౌందర్యం మీద ఆధారపడి ఉంటుందని చెప్తున్నాడు. ఈ రోజు పాన్-ఇండియన్ సినిమాల రూపంలో కార్పొరేట్లు ధ్వంసం చేస్తున్నది ఆ మనోసౌందర్యాన్నే కదా!
11-6-2026


ఆడవారి మగవారి వస్త్రధారణ గురించి, కుట్టని వస్త్రాలు ధరించడం ఎందుకు నిషిద్ధం అన్న విషయం గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.
And how British free market system opened up markets and disrupted the local market systems and stability that had existed before.
Guruji’s farsightedness in understanding the relationship between local culture, aesthetics and economics is really amazing, as you pointed out:
“స్వావలంబన అను, స్వాతంత్య్రం అను, స్వయం-సమర్థ జీవన శైలి అను, నువ్వు ఏ మాట చెప్పినా సరే, నీ స్వాతంత్య్రాన్ని నీ ఆర్థిక వ్యవస్థ కాపాడుతుందనీ, నీ ఆర్థిక వ్యవస్థను నీ స్థానిక సంస్కృతి కాపాడుతుందనీ చెప్పినవాడు మాత్రం నాకు తెలిసి గురూజీనే.”
Also amazing that Guruji’s ideas were similar to Columbian-American anthropologist Arturo Escobar’s, whose ideas are being implemented and worked on elsewhere in the world. It is unfortunate that we still do not seem to see the value of such ideas in our country.
“మన సంస్కృతిలో ‘సామర్థ్యం’, ‘మనస్సు’ అనేవి చాలా గొప్ప విషయాలు. ప్రతి ఒక్కరూ సామర్థ్యంతో పాటు మంచి మనసు కలిగి ఉండాలి.”
ఈ మాటలకి ఉదాహరణగా చెప్పిన incident చాలా heart-warming గా ఉంది.
ఎన్ని విషయాల గురించి ఎంత లోతైన అవగాహన, vision కలిగిన వ్యక్తి గురూజీ!! A true visionary!!
This is a very relevant issue you ended the post with Sir:
“స్థానిక మార్కెట్, స్థానిక డిజైన్, స్థానిక సంస్కృతిమీద ఆధారపడ్డ సౌందర్యదృష్టి- ఈ మూడింటితో పాటు, స్థానిక సౌందర్యదృష్టి స్థానికుల మనోసౌందర్యం మీద ఆధారపడి ఉంటుందని చెప్తున్నాడు. ఈ రోజు పాన్-ఇండియన్ సినిమాల రూపంలో కార్పొరేట్లు ధ్వంసం చేస్తున్నది ఆ మనోసౌందర్యాన్నే కదా!”
చాలా చక్కగా సమీక్షించారు. సమరైజ్ చేశారు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.
”ఎవరికైతే ఈ మూడు విషయాలూ, అంటే ఆహారభద్రత, జీవనవిధానాన్ని నేర్పే చదువు, తమ పరిధిలో ఉండే ఆరోగ్య వ్యవస్థ- ఉండవో ఆ మూడూలేని గ్రామమే పేదగ్రామం. ఆ మనిషే పేదవాడు.” – గురూజీ ఎంత చక్కగా నిర్వచించారు.
“ఎప్పుడైతే ప్రతి ఒక్కరికీ ఆహారభద్రత ఉంటుందో, అప్పుడు వారు చదివే చదువు బతకడం కోసం కాకుండా, జీవితం కోసం చదివే చదువు అవుతుంది. మన జీవితమెలా జీవించాలో చెప్పే చదువవుతుంది.” గురూజీ ఎంత బాగా చెప్పారో.. నిజంగా మనం చదివే చదువులకి ఇంత కంటే సార్థకత ఏముంటుంది… ?
మరొక అపురూపమైన సంభాషణ ఇది.. దీనికి తోడు మీరు లోకల్ డిజైన్ గురించి వెలిబుచ్చిన విషయాలు, అభిప్రాయాలు ఎస్కోబార్ పుస్తకం రిఫరెన్స్ మరింత ఆలోచింప చేశాయి భద్రుడు గారు..
గురూజీ చెప్పినట్టు స్థానిక సౌందర్యదృష్టి స్థానికుల మనోసౌందర్యం మీద ఆధారపడి ఉంటుంది.. మీరన్నట్టు ఆ నేటివిటీ మిస్సవుతున్నందుకే ఈ రోజు కార్పొరేట్లు నిర్మిస్తున్న పాన్-ఇండియన్ సినిమాల్లో మనోసౌందర్యం విధ్వంసం అవుతోంది.. మనోవికారం కలిగించే వాయిలెన్స్ రాజ్యం యేలుతోంది.
మాధవి గారు, భద్రుడు గారు చెప్పినట్టు మీరు నిజంగానే ఈ పోస్టును చాలా బాగా సమ్మరైజ్ చేస్తూ సమీక్షించారు.
హృదయపూర్వక ధన్యవాదాలు సార్! మీ వంటి మిత్రుల స్పందనలే నాకు ఇంధనం.