
రెండవ రోజు: మొదటి సంభాషణ
సమాజమంతా ఒక సంచార జాతిగా మారిపోయింది
రెండో రోజు పొద్దున్నే గురూజీ బ్రేక్ ఫాస్ట్ కి ఇంటికి రమ్మన్నారు. ఆయనతో కూచుని ఆ ఇంట్లో ఆ అల్పాహారం ఆరగించడంలో కూడా ఏదో ఒక సరళజీవితానుభూతి అనుభవానికొచ్చింది. అక్కణ్ణుంచి మళ్ళా ప్రార్థనా మందిరానికి వచ్చాం. నాతో పాటు ఆశిష్ కూడా ఉన్నాడు. గురూజీ ముందురోజే తన జీవితనేపథ్యం చెప్పవలసిందంతా చెప్పారని నాకనిపించింది. ఇంక ఇప్పుడు ఆయన చూసిన, తెలుసుకున్న జ్ఞానం గురించీ, విషయాల గురించీ మాట్లాడబోతున్నారని అనుకున్నాను.
అయితే, నేను ఉట్నూరులో ఉన్నప్పుడు ఒకసారి కళాశ్రమానికి వస్తే, ఒకామె కనిపించారు. ఆమె పేరు రజనీ బక్షి. దేశంలో ఇంకా గాంధేయ పద్ధతుల్ని విశ్వసిస్తూ, ప్రజల జీవితాన్ని మెరుగుపర్చడంకోసం కృషి చేస్తున్నవారి మీద ఆమె ఒక పుస్తకం రాయడంకోసం, అప్పట్లో, ఆమె దేశమంతా పర్యటిస్తూ ఉన్నారు. గురూజీ ఆమెని నాకు పరిచయం చేసారు. ఆమె నాతో కూడా మాట్లాడారు. ఆ విషయం నేను మర్చిపోయాను. కాని నేను శ్రీశైలంలో ఉండగా, గురూజీ నా దగ్గరకొచ్చినప్పుడు, రజనీ బక్షి రాసిన పుస్తకం తీసుకొచ్చి చూపించారు. ఆమె తన పర్యటనల్లో కలుసుకున్న వ్యక్తుల గురించీ, వారు చేపడుతున్న కార్యక్రమాల గురించీ Bapu Kuti (1998) పేరిట వెలువరించిన పుస్తకం అది! అందులో ఆమె గురూజీ గురించి పెద్ద అధ్యాయమే రాసారు. అందులో నా ప్రస్తావన కూడా ఉంది!

అందులో ఆమె గురూజీ గురించి రాస్తూ ఒక సంఘటన నమోదు చేసారు. గురూజీ బరోడా వెళ్ళకముందు, అదిలాబాదు చుట్టు పక్కల గ్రామాలు పర్యటిస్తూ ఉన్నరోజుల్లో ఒక బీద గ్రామీణ కళాకారుడి ఇంట్లో ఒక రాత్రి ఉండవలసి వచ్చిందట. అది బాగా చలికాలం. గురూజీకి కప్పుకోడానికి దుప్పటి ఇవ్వలేని పరిస్థితిలో ఆ కుటుంబం ఉంది. ఆ బీదరికం చూసి ఆ రాత్రి గురూజీ తనకై తాను ఒక ప్రతిజ్ఞ చేసుకున్నారట. అప్పణ్ణుంచీ తన జీవితంలో ఒక ఇరవయ్యేళ్ళ కాలం గ్రామీణ కళాకారులకోసమే అంకితం చెయ్యాలనీ, వారి జీవితాలకి చేయగలిగినంత చెయ్యాలనీ. గురూజీతో ఈ సంభాషణలకు కూర్చునేటప్పటికి ఆ ఇరవయ్యేళ్ళ కాలం ఎప్పుడో అయిపోయింది. అందువల్లనే మా సంభాషణల్లో ఆయన ఆ విషయం నాతో ప్రస్తావించలేదనుకుంటాను. కానీ ఆయన తనకి తాను చేసుకున్న ప్రమాణానికి కట్టుబడి కళాశ్రమం మొదలుపెట్టాక, ఆ ప్రమాణం కళాశ్రమం రూపంలో ఆయన్ని జీవితాంతం వదిలిపెట్టలేదని నాకనిపించింది. అందుకని ఆ రోజు కళాశ్రమం గురించే మరికొంత మాట్లాడిద్దామనిపించింది. ఆ మాటే అడిగాను.
ఆయన చెప్పడం మొదలుపెట్టారు.
‘ఆశ్రమం ప్రారంభించడం వెనక చిన్న కథ ఉంది. ఒకసారి ఋషులకు ప్రళయం రాబోతోందని తెలిసింది. ప్రళయం వస్తే ఏమవుతుంది? అంతా నాశనమైపోతుంది కదా! దాంతో ఆ ఋషులు త్వరత్వరగా అన్ని వస్తువుల విత్తనాలు సేకరించి ఒక పడవ ఎక్కారు. ప్రళయం వచ్చింది, భూమి అంతా మునిగిపోయింది, ఆ పడవ కొట్టుకుపోయింది. ఆ తర్వాత ప్రళయం శాంతించాక, భూమి మళ్లీ బయటపడినప్పుడు, ఆ ఋషులు ఆ విత్తనాలతోనే మళ్లీ ఒక కొత్త సృష్టి ప్రారంభించారు. ఇది పురాణాలలో ఉన్న కథ. అలా వారు ఏ సృష్టినైతే మళ్లీ ప్రారంభించారో, ఆ సృష్టిలోనే ఇప్పుడు మనం జీవిస్తున్నాం.’
‘మాకు కూడా అలానే అనిపించింది. ఇప్పుడు ఒక ప్రళయం రాబోతున్నది. ఆ ప్రళయంలో ఇక్కడున్నదంతా అంతమైపోతుంది. భారతీయ సభ్యత, భారతీయ సంస్కృతి, భారతీయ సంప్రదాయం, భారతీయ విజ్ఞానం, భారతీయ విద్యలు, భారతీయ వ్యవస్థలు- మొత్తమన్నీ ఆ ప్రళయంలో మునిగిపోతాయి. ఆ ప్రళయం పేరు పాశ్చాత్య విజ్ఞానం. ఆ ప్రళయంలో ఇక్కడేదీ మిగలదు. అంతా నాశనమైపోతుంది. అందుకని ఇవన్నీ అంతమైపోయేలోపు అన్ని విషయాల విత్తనాల్ని సేకరించి దాచుకోవాలి. ఈ ప్రాతంలో ఒకప్పుడు ఏయే ఏయే విషయాలు ఎలా నడిచేవో, వాటి పాత వ్యవస్థలు ఏమిటో, ఒకసారి అధ్యయనం చేసి వాటిని పూర్తిగా సేకరించాలని అనుకున్నాం. ఆ ఉద్దేశ్యంతోనే ఆశ్రమంలో పని మొదలుపెట్టాం. ఈ ప్రాంతంలో ఇనుము నుంచి కాగితం, కాటుక దాకా ఎలా తయారు చేసేవాళ్ళో చూద్దాం అనుకున్నాం.’
‘ఉదాహరణకి, ఈ ప్రాంతంలో పూర్వం చాలా ఇనుము తయారయ్యేది. చంద్రాపూర్ నుంచి చెన్నూరు దాకా సంవత్సరానికి లక్ష టన్నుల ఇనుము తయారయ్యేది. నిర్మల్ పక్కనున్న ‘దస్తూరాబాద్’ దీనికి చాలా పెద్ద మార్కెట్ గా ఉండేది. ఇప్పటికి రెండువేల ఏళ్ళ కిందట కూడా గ్రీసు నుంచి కూడా ప్రజలు వచ్చి ఇక్కడినుంచి చాలా ఇనుము కొనుగోలు చేసేవాళ్ళు. ఈ ఇనుము ప్రపంచవ్యాప్తంగా కత్తుల తయారీకి చాలా ప్రసిద్ధి చెందింది—ఆదిలాబాద్ ఇనుము. అలాంటి ఇనుము హిందుస్తాన్ లో ప్రతి చోటా పెద్ద ఎత్తున తయారవుతూ వచ్చింది. మధ్యప్రదేశ్ లో, బెంగాల్లో, ప్రతి ఒక్కచోటా. ఇనుమును తయారు చేసే భట్టీలు చాలా చిన్నవిగా ఉండేవి.’
‘కాబట్టి ఇనుము నుంచి కాటుక దాకా ప్రజలు ఎలా తయారు చేసుకోగలిగేవారో, ఆ విషయాల్ని కాపాడుకోవాలనిపించింది. ఎందుకంటే రానురాను ఈ విద్యలన్నీ అంతరించిపోతాయి. వీటిని అధ్యయనం చెయ్యాలి. ఆ ఆలోచనతోనే మేం బయల్దేరి వీటన్నిటినీ చూడటం మొదలుపెట్టాం. ఈ విషయాల గురించి సమాచారం సేకరించడం, వీటినెలా కాపాడుకోగలమో ఆలోచించడం మొదలుపెట్టాం. అయితే ధనం, జనం, సాధనం— ఈ మూడింటిలో నా దగ్గర ఏమీ లేదు. ధనం లేదు, నాతో జనం లేరు, నా దగ్గర ఎటువంటి సాధనమూ లేదు ఈ మూడూ లేకుండానే ఇదంతా సాగింది. ఇప్పుడు జనమైతే చాలా మంది ఉన్నారుగాని, మిగతా విషయాలు ఇప్పటికీ నా దగ్గర లేవు. అధ్యయనం చేయడానికైతే ఇవ్వన్నీ అవసరం లేదు కదా. వెళ్ళి సమాచారం సేకరించడమే కదా. కాని డాక్యుమెంటేషను చెయ్యలేకపోయాం, అది చేయాల్సింది. కానీ మా వల్ల కాలేదు. కొన్ని ప్రయత్నాలు చేసాం. కాని సరిగ్గా సాగలేదు.’
‘అయితే భారతీయ సభ్యత విషయానికొస్తే, అసలు సభ్యత అని దేన్నంటారు? సభ్యతకు ఏది మూలం? ఆ తర్వాత, సంస్కృతి అని దేన్నంటారు? సంప్రదాయమంటే ఏమిటి? ఇవీ ప్రశ్నలు. నేను తెలుసుకున్నదేమంటే, సభ్యతకు మూలంలో ఒక ఆర్థిక వ్యవస్థ ఉంటుంది. ఆ ఆర్థిక వ్యవస్థ కూలిపోయిన రోజు ఆ సభ్యత అంతమైపోతుంది. అప్పుడు మనం ఏ సభ్యతకు చెందిన ప్రజలుగా మిగిలిపోతాం? సంస్కృతికి మూలంలో ఒక సౌందర్య దృష్టి ఉంటుంది. సంప్రదాయానికి మూలంలో ఒక పరమతత్త్వం ఉంటుంది. అద్భుతమైన పరమతత్త్వం. అది దృశ్యరూపంగాగానీ లేదా అదృశ్యరూపంగాగానీ తర్వాతి తరాలకు అందుతుంది. అదే ఫిలాసఫీ.’
‘సభ్యత (నాగరికత) అనేది ఒక ఆర్థిక వ్యవస్థకుండే ఒక పేరు. ఆ ఆర్థిక వ్యవస్థలో మొత్తం సమాజమంతటినీ ఒక క్రమ పద్ధతిలో ఉంచుతారు. ఆ సమాజం ఎలా జీవించాలో సూచిస్తారు. అలా ప్రతి ఒక్కరి జీవన విధానానికి ఒక వ్యవస్థ ఏర్పాటవుతుంది. నేను క్లుప్తంగా చెప్తాను. గుజారాత్ లో చీర కట్టుకుంటారు, మహారాష్ట్రలో చీర కట్టుకుంటారు, తెలంగాణాలో కట్టుకుంటారు, ఒరిస్సాలో కట్టుకుంటారు, బెంగాల్లో కట్టుకుంటారు. అందరు కట్టుకునేది నేతవస్త్రాలే కదా, కాని వారందరినీ ఒక వరసలో నిలబెడితే మనం ఈమె బెంగాలీ, ఈమె ఒడిశా ఆమె, ఈమె తెలంగాణా ఆమె, ఈమె మహారాష్ట్ర ఆమె, ఈమె గుజరాతీ అని చెప్పగలం. ఎలా చెప్పగలం? ఇక్కడ చీర అనేది సభ్యత. అది అందరికీ సమానంగా ఉంది. కాని ఆ చీర కట్టుకునే విధానముందే అది వారి ప్రకృతి, పర్యావరణం, వారి పనిపాటలమీద ఆధారపడి ఉంటుంది. దాన్నే మనం సంస్కృతి అంటాం. అంటే ఆ వస్తువుని అందంగా ఉపయోగించే విధానమే సంస్కృతి.’
‘అయితే, ఆ వస్త్రం చీరనే ఎందుకు కావాలి? మరో వస్త్రమెందుక్కాకూడదు? చీర కట్టుకునే సంప్రదాయమే ఎందుకుండాలి? మరోది ఎందుక్కాదు? అంటే దానికి తనదైన ఒక ఫిలాసఫీ ఉంటుంది. ఇదే ఎందుకు అని చెప్పే ఒక తత్త్వం ఉంటుంది. సంప్రదాయాల్ని అంత సులభంగా విరగ్గొట్టలేం. అది చాలా కష్టం. నియమాలు వేరు. నియమాల్ని మార్చవచ్చు. కానీ సంప్రదాయాల్ని మార్చడం కష్టం. ఎందుకంటే వాటి వెనక ఒక ఫిలాసఫీ, ఒక తత్త్వం ఉంటుంది. అలాగే సంస్కృతికి మూలంలో సౌందర్యదృష్టి ఉంటుంది. మనం వస్తువుల్ని ఉపయోగించే విధానం, వాటినెలా ఉపయోగించాలో ఆ పద్ధతులు ప్రకృతి, పర్యావరణాలతో సామరస్యంగా జీవించడం కోసం ఏర్పడతాయి. ఆ విధానాన్నే సంస్కృతి అంటాం.’
‘అయితే ఒక విషయముంది. సభ్యతలో ఆ కాలపు సాంకేతికత, అప్పటి విద్యల పాత్ర చాలా ఎక్కువగా ఉంటుంది. ఉదాహరణకి మనదగ్గరున్న చేతివృత్తులు చాల చిన్న చిన్న పనులు. కార్ఖానాలు చిన్నవిగా ఉండేవి. మనవాళ్ళు ప్రతి విషయాన్నీ చాలా సరళంగా, చిన్నగా మార్చేసారు. వాటినొక క్రమపద్ధతిలో అమర్చిపెట్టారు. అదొక ఆర్థిక వ్యవస్థ. ఏం చేయాలి, ఎలా క్రమబద్ధం చేయాలనేది—’
‘సభ్యత నీకెప్పుడూ ఈ పరమాత్ముణ్ణి నమ్ము, ఇతణ్ణి నమ్మకు అని చెప్పదు. సభ్యత ఎంతసేపూ ఏం చెప్తుందంటే, నువ్వెవరినైనా నమ్ము కానీ సమాజంలో ఇలా జీవించు అని మాత్రమే చెప్తుంది. నిన్నటినుంచి మన మధ్య మాటలు నడుస్తున్నాయి, ఇంకా ఎన్ని రోజులైనా సాగుతాయి. కానీ నా మాటలలో ఎక్కడా పరమాత్ముడు రాడు, పరమాత్ముణ్ణి మధ్యలోకి తీసుకురాకుండానే ఒక సమాజం చాలా సుసభ్యంగా, చక్కగా జీవించవచ్చు కదా! మరి మన పూర్వీకులు దాన్నెలా సాధ్యం చేసారు? మన సభ్యత మధ్యలో ఎక్కడా పరమాత్ముడు రాడు, నువ్వు ఈ పరమాత్ముణ్ణి నమ్ము, దీని ప్రకారమే నువ్వు జీవించాలి అని ఎక్కడా ఉండదు. అలా చెప్తే అదొక మతమవుతుంది. అది మతం పని. మతం వేరు, సభ్యత వేరు. మతం ఒక సభ్యత కాదు. ఒక సభ్యతలో చాలా మతాలు ఉండవచ్చు. మన సభ్యతలో చాలా మతాలు ఉన్నాయి. కానీ ఏ ఒక్క మతమూ మతం ఒక సభ్యత కాదు, మతం సంస్కృతి కూడా కాదు.’
‘వైష్ణవుడు ఎక్కడివాడైనా కావచ్చు, తెలంగాణాలోనూ వైష్ణవుడు ఉండవచ్చు, మహారాష్ట్రలోనూ ఉండవచ్చు, గుజరాత్ లోనూ ఉండవచ్చు, కాని అక్కడి వైష్ణవ మహిళ అక్కడి పద్ధతిలోనే చీర కడుతుంది, ఇక్కడ తెలంగాణలోని వైష్ణవ మహిళ ఇక్కడి పద్ధతిలోనే చీర కడుతుంది. మతాన్ని బట్టి వాళ్ళ సంస్కృతి మారదు, కట్టు, బొట్టు మారదు. మతాన్ని బట్టి సంస్కృతి ఏర్పడదు. మతం ఒక వ్యక్తి నుంచి మొదలవుతుంది, ఆ వ్యక్తికోసం ఉంటుంది. కాని సభ్యతను సమాజం నిర్ణయిస్తుంది. అక్కడ అందరూ కలిసి కూచుని నిర్ణయిస్తారు. అలా నిర్ణయించింది సమాజం కోసం ఉంటుంది. ఒక సభ్యతకి సంబంధించిన ఆర్థికవ్యవస్థను నిర్ణయించే ముందు ఆ సమాజం ఎలా జీవించాలని ఆలోచించాల్సి ఉంటుంది. ఒకవేళ సమాజం తన సభ్యులు సన్న్యాసులుగా జీవించాలనుకుంటే అలానే విడివిడిగా జీవించవచ్చు, లేదా సమూహంగానూ జీవించవచ్చు, లేదా ఒక కుటుంబవ్యవస్థగా కూడా తనను తాను మార్చుకుని జీవించవచ్చు.’
‘కాని పూర్వం, మనదగ్గర, సమాజం ఒక సామాజిక పద్ధతిలో జీవించాలని ఆలోచించారు. సామాజిక పద్ధతిలో జీవించాలంటే, దాని ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండాలో, దాని జీవన శైలి ఉండాలో ఆలోచించవలసి ఉంటుంది. మన దగ్గర సామాజికతకు చాలా ప్రాధాన్యత ఇచ్చారు. మనం సామాజికంగా కలిసి జీవించడం ముఖ్యమనుకున్నారు. సామాజిక పద్ధతిలో జీవించాలంటే ఆ జీవనశైలికి తగ్గట్టుగా ఒక ఆర్థికవ్యవస్థనీ, దానికి తగ్గట్టుగా ఒక డిజైన్ నీ ఊహించవలసి ఉంటుంది. ఎలాంటి డిజైన్ ఉంటే ఈ సమాజం సామాజిక పద్ధతిలో జీవించగలదని. డిజైన్ గురించిన ఆలోచనకు అది మొదలు.’
‘డిజైన్ అంటే ఏమిటి? ఈరోజు నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ప్రజలున్నారు. డిజైన్ కి వాళ్ళిచ్చే నిర్వచనమొకటుంది. వాళ్ళు చెప్పేదాని ప్రకారం డిజైన్ అనేది ఒక సమస్యకు పరిష్కారం. ఉదాహరణకి కూర్చోడం ఒక సమస్య అనుకుంటే, కూర్చోడానికి అనువుగా చేసే వస్తువే డిజైన్ అని అని వారి నమ్మకం. మరికొంతమంది నమ్మకం ప్రకారం డిజైన్ అంటే ఉపాధిని పెంచే సాధనం. ఈ రోజు దాదాపుగా అంతా అలానే భావిస్తున్నారు. ఎవరికి ఎంత ఎక్కువ డిజైన్ నైపుణ్యముంటే వాడంత ఎక్కువ సాధిస్తాడు. ఇది కూడా ఒక నిర్వచనమే. మరికొంతమంది దృష్టిలో డిజైన్ అంటే సౌకర్యానికి మరో పేరు. ప్రతి ఒక్కరికీ సౌకర్యాన్ని కల్పించేదే డిజైన్. నేను చాలామంది నుంచి ఇదే విన్నాను.’
‘మరి మనవాళ్ళు డిజైన్ అని దేన్ని భావించేవాళ్ళు? మన దగ్గర ఒక మాట నడిచేది- జీవాత్మ పరమాత్మతో కలవాలని అనుకుంటుంది, కాని కలవలేదు అని. ఎందుకంటే జీవాత్మకీ, పరమాత్మకీ మధ్యలో మాయ అనే ఒక వస్తువుంది. అది జీవాత్మను పరమాత్మతో కలవనివ్వదు. ఆ మాయ ఏమిటి? మాయంటే ఏమిటంటే— దాన్ని అంతం చెయ్యలేం, కాని అదుపులో ఉంచుకోవచ్చు. నా ఉద్దేశ్యం ప్రకారం ఈ డిజైన్ అనేది మాయలాంటిది, నువ్వెలాంటి ఇల్లు కడితే అలాంటి జీవితం జీవిస్తావు. ఎలాంటి వస్త్రధారణ చేస్తే అలాంటి జీవితం జీవిస్తావు. మొత్తం డిజైన్ ప్రభావం నీ జీవన శైలిమీద ఉంటుంది. కాబట్టి సభ్యతమీద కూడా డిజైన్ కి చాలా పెద్ద ప్రభావం ఉంది. సభ్యత మొదట నిర్ణయిస్తుంది, నువ్వెలాంటి జీవితం జీవించాలో. నువ్వు సామాజిక జీవితం జీవించాలంటే దానికి తగ్గ డిజైన్ ఊహిస్తుంది.’
‘పూర్వకాలం గ్రామాల్లో కనీసం పద్ధెనిమిది రకాల వృత్తిపనివాళ్ళుండేవారు. మళ్ళా ప్రతి వృత్తిలోనూ పది పన్నెండు రకాల ఉపకులాలుండేవి. ఇనుము పనిచేసేవాడుంటే వాడికి పన్నెండు ఉపశాఖలు, కుమ్మరి ఉంటే వానికి పన్నెండు ఉపశాఖలు, రైతుకి పన్నెండు ఉపశాఖలు ఇలా ప్రతి ఒక్క వృత్తికీ పన్నెండు ఉపశాఖలుండేవి. ఆ కాలం ప్రజలు వీరందరినీ గ్రామంలో ఎందుకని ఒకే చోట చేర్చడానికి ప్రయత్నించారు? అప్పటి ప్రజల ఆలోచన ఏమిటంటే, ప్రపంచం మన గ్రామం కాదు, ప్రపంచం మన గ్రామం ఎప్పటికీ కాలేదు, కానీ మన గ్రామమే మన ప్రపంచం కాగలదు. అంటే మనం మన గ్రామాన్నే మన ప్రపంచంగా మార్చుకోవాలి. ప్రపంచంలో ఏయే వస్తువులు తయారవుతాయో వాటిని మనం మన గ్రామంలోనే ఎందుకు తయారుచేసుకోకూడదు? ఎందుకు చేసుకోలేము? అక్కడ తయారు చేసేవాడూ మనిషే, ఇక్కడ తయారు చేసేవాడూ మనిషే. ప్రపంచంలో తయారయ్యే ప్రతి ఒక్క వస్తువూ మన గ్రామంలోనే తయారు కావాలి. ఆ ఆలోచననే వారు ఊహించారు. ఆ లెక్క చొప్పున ప్రతి ఒక్క సాంకేతికతనూ మన దగ్గర ప్రోత్సహించారు. అభివృద్ధి చేసారు. ప్రతి ఒక్క రకమైన వృత్తిపనివాణ్ణీ గ్రామంలోనే ఉంచడానికి ప్రయత్నించేరు.’
‘అసలు ఎవరైనా ఏ పనైనా ఎందుకు చేస్తారు? ఎవరైనా ఏ పనైనా ఎందుకు చేస్తారంటే, ఆహారభద్రత కోసం. ఏదైనా పని చేపట్టేముందు, మనిషి — నేను చేపట్టబోయే ఈ పనిలో నేనూ, నా కుటుంబమూ ప్రశాంతంగా జీవించగలమా అని చూస్తాడు. అందులో ఆహారభద్రత కనిపిస్తే ప్రపంచంలో ఏ పనైనా సరే వాడు చేస్తాడు. దాన్ని చిన్నపనిగా భావించడు. రెండవది, ఆ పనినిబట్టి వాడు సమాజంలో గౌరవం ఆశిస్తాడు. ఈ రెండు విషయాలూ లేకపోతే మనిషి ఏ పనీ చెయ్యడు. ఆహారభద్రత, సమాన గౌరవం— మరి ప్రతి ఒక్కరికీ ఈ రెండు విషయాలూ ఎవరు కల్పించాలి? ఇవి సమాజం మాత్రమే ఇవ్వగలదు, ఏ ప్రభుత్వమూ ఇవ్వగలిగేవి కావివి. మన దగ్గర ఈ రెండు విషయాల్నీ ప్రతి ఒక్కరికీ ఎలా కల్పించారు? అందుకు ప్రతి ఒక్కరినీ ఎలా సిద్ధం చేసారు?’
‘ఎవరిదైనా ఒక వస్తువుని వేరొకరు ఎందుకు తీసుకోవాలి? అలా తీసుకొమ్మనే బలవంతం ఏదైనా ఉందా? లేదు కదా. అవసరముంటేనే ఎవరైనా ఏదైనా వస్తువు తీసుకుంటారు. లేదా ఆ వస్తువు చాలా అందంగా కనిపిస్తే తీసుకుంటారు. ఎప్పుడు ఎంత ధర చెల్లించైనా తీసుకుంటారు. కాబట్టి మార్కెట్లో అవసరం, అందం— రెండూ చాలా ముఖ్యమైనవి. అయితే పనిచేసేవాడికేమో ఆహారభద్రతా, గౌరవం ఈ రెండూ ముఖ్యం. మరి ఈ రెండు విషయాల్నీ ఎలా సమన్వయించారు?
‘ఈ రోజు కాశ్మీరునుండి కన్యాకుమారిదాకా ఏ ఒక్కడూ తన గ్రామంలో, తన ఇంట్లో ఉండి జీవించలేకపోతున్నాడు. ప్రతి ఒక్కడూ జీవికకోసం బయటకు వెళ్ళవలసి వస్తోంది. మొత్తం సమాజమంతా ఒక సంచార జాతిగా మారిపోయింది. ఎందుకలా బతుకుతున్నారు? కేవలం అన్నం కోసమే కదా. సరే ఒకరి చేతిలో బంగారు గిన్నె ఉండవచ్చు, మరొకరి చేతిలో మట్టిగిన్నె ఉండవచ్చు, కానీ ఇద్దరూ బయలుదేరింది అన్నం కోసమే కదా! సంచార జీవులుగా మారడం ఒకటైతే, రెండోది, ప్రతి ఒక్కడూ తన జీవితాన్ని తనతోనే ప్రారంభిస్తున్నాడు, తనతోనే ముగిస్తున్నాడు. ఈ రోజు ఏ బిడ్డ తన జీవితం మొదలుపెడుతున్నాడో, వాడి సంతానం ఆ జీవితం జీవించదు. తన తండ్రి ఏ జీవితం జీవించాడో ఈ బిడ్డ ఆ జీవితం జీవించడం లేదు. ప్రతి ఒక్కడూ తన జీవితం తనతోనే ప్రారంభిస్తున్నాడు, తనతోనే ముగించేస్తున్నాడు. ఇక మూడవ విషయమేమిటంటే, ఈ రోజు ఒక చిన్న పరిపక్వ జీవితం జీవించడం కోసం ప్రతి ఒక్కడూ పదిరకాల పనులు చేయాల్సి వస్తోంది. ఏ ఒక్క పనిలోనూ తన పరిపక్వ జీవితాన్ని జీవించలేకపోతున్నాడు. చూడండి, ఇంత జరిగినా కూడా ఏ ఒక్కడూ తన ఇల్లు తన సంపాదనతో నిర్మించుకోలేకపోతున్నాడు. తన ఇల్లు తన సంపాదనతో కట్టుకోలేడు, తన సంతానాన్ని చదివించలేడు, ఏ వ్యాపారమూ తన సంపాదనతో చేసుకోలేకపోతున్నాడు.’
‘ఈ మూడు విషయాల్నీ దృష్టిలో పెట్టుకుని చూడండి. ఈ కొత్త వ్యవస్థ రాకముందు, ఈ సంచార జాతి వ్యవస్థ ఏర్పడకముందు, హిందుస్తాన్ లో సామాన్యమానవుడు యాత్రల పేరుతో దేశమంతా తిరిగేవాడు, కాని జీవించేది మాత్రం తన గ్రామంలోనే! జీవించడం కోసం వాడు బయటికి వెళ్ళేవాడు కాడు. యాత్రల పేరుతో దేశమంతా తిరిగేవాడు నిజమే, కాని జీవించేది మాత్రం తన గ్రామంలోనే! అలా ఎలా జీవించగలిగేవాడు తన గ్రామంలో? వాని జీవన విధానాలు ఎటువంటివి? దీన్నొక సారి ఆలోచించాలి.’
‘ఈ రోజైతే అది అసాధ్యం. ఎప్పుడైతే సమాజమంతా ఒక సంచార జాతిలా మారిపోతుందో, అప్పుడు వానికి ఒక సభ్యత అంటూ ఉండదు, సంస్కృతి ఉండదు, ఒక సంప్రదాయం ఉండదు. ఆ బిడ్డ గ్రామంలో ఉన్నంతకాలం వానికి ఒక సంస్కృతి ఉండేది. ఈ రోజు వాళ్ళు బయటికి వచ్చేసారు. ఇప్పుడు వాళ్ళకి ఎటువంటి సంస్కృతీ లేదు, సంప్రదాయం లేదు. ఉదాహరణకి గోండు సమాజంలో చెప్పులు వేసుకోవడం నిషేధం. ఈ రోజు వాళ్ళు పెద్ద ఎత్తున చెప్పులు వాడుతున్నారు. కొన్నిరోజుల్లో తమ వంటింటికి కూడా చెప్పులు వేసుకు వెళ్తారు. పాత సంప్రదాయం ముగిసిపోతుంది. ఎందుకంటే ఇప్పుడిది సంచార జాతి వ్యవస్థ కదా!’
‘సంచార జాతి వ్యవస్థలో అవసరాలు చాలా తక్కువగా ఉంటాయి. జబ్బుపడితే ఒక డాక్టరు కనిపిస్తే చాలు, చిన్నపిల్లలకోసం ఎనిమిదో తరగతిదాకానో, పదో తరగతి దాకానో ఒక స్కూలు దొరికితే చాలు. ఉప్పు, మిరపకాయల కోసం రెండుమూడు దుకాణాలు, రెండు మూడు హోటళ్ళు ఉంటే చాలు. వానికి అంతకంటే ఎక్కువ ఏ అవసరాలూ ఉండవు. ఎప్పుడైనా కొంచెం సమయం దొరికితే వినోదం కోసం తమదంటూ ఒక ఏర్పాటు చేసుకుంటారు. వినోదం కోసం—గమనించండి, ఆనందం కోసం కాదు, వినోదం చేసుకోవడం, అంతే సరిపోతుంది. ఇది వారి జీవనశైలి, సంచారప్రజలది.’
‘ఒక వ్యక్తిలో స్థిరత్వం లేకపోతే వాడు చంచలస్వభావుడవుతాడు కదా. వాడు తన జీవితంలో ఏమీ చేయలేడు. అలానే ఒక సమాజంలో కూడా స్థిరత్వం లేకపోతే ఆ సమాజం కూడా ఏమీ చెయ్యలేదు. కాబట్టి ఒక సమాజంలో ఏదైనా చెయ్యాలంటే అందులో స్థిరత్వం ఉండటం చాలా అవసరం. అందుకనే సమాజానికి స్థిరత్వం ఇవ్వడానికి పూర్వం చాలా ప్రయత్నాలు చేసారు. స్థిరపడి జీవించినప్పుడే చాలా విషయాలు సాధ్యమవుతాయి. అక్కడెన్నో విషయాలు పుడతాయి, అభివృద్ధి చెందుతాయి . లేకపోతే అవన్నీ అంతమైపోతాయి. ఇప్పుడు నువ్వెక్కడికో వెళ్ళి జీవిస్తున్నావు, ఈ బిడ్డ ఇంకెక్కడో జీవిస్తున్నాడు. వీనికి ఏ వస్తువుతో పనుంది? మహారాష్ట్ర లేదా ఆంధ్ర ప్రాంతాల ప్రజలు ఇక్కడికొచ్చి జీవిస్తున్నారు. ఇక్కడ శ్రావణ అమావాస్య రోజు పశువుల పండగ, పొలాల పండగ జరుగుతుంది. వాళ్ళు చూస్తుంటారు—‘ ఏమిటిది పశువులకి పూజచేస్తున్నారు’ అని. ‘ఇది పొలాలపండగ కదా, ఇక్కడిలా చేస్తారు’ అని చెప్తారు. వాళ్ళు ‘ఇది మా దగ్గర లేదు’ అంటారు. అలాగని మళ్ళీ అక్కడ వాళ్ళ పండగలేమైనా ఇక్కడ చేసుకుంటారా అంటే చేయరు. ‘మావాళ్ళెవరున్నారు ఇక్కడ చెయ్యడానికి’ అంటారు. కాబట్టి వాళ్ళ సంతానం ఎటువంటి పండగలూ చేయరు. అక్కడివీ చెయ్యరు, ఇక్కడివీ చెయ్యరు.’
‘కాని మన దగ్గర పూర్వం ప్రజలు యాత్రల పేరుతో అంతా తిరిగేవాళ్ళు. కాని జీవించేది మాత్రం తమ గ్రామంలోనే. మరి ఎలా జీవించగలిగేవాళ్ళు? మట్టి తిని అయితే జీవించలేదు కదా. వాళ్ళు కూడా అన్నం తిన్నారు. వాళ్ళు కూడా బంగారం ధరించారు. ఇప్పటికంటే ఎక్కువ బంగారం ధరించారు వాళ్ళు. మా ఇంట్లో ఒక రెడ్డిగారు అద్దెకుండేవారు, వారు మహబూబ్ నగర్ ప్రాంతానికి చెందినవారు. వారి భార్యకు చాలా బాధగా ఉండేది, మహబూబ్ నగర్ దగ్గర వారు ఎవరో దివానులాంటి వాళ్ళంట. ‘మా అమ్మ మా అక్కచెల్లెళ్ళకి తలో ముప్ఫై ముప్ఫై కిలోల బంగారం తూచి ఇచ్చింది. కాని మేం మా ఆడపిల్లలకి తలో మూడు మూడు కిలోల బంగారం కూడా ఇవ్వలేకపోతున్నాం’ అని ఆమె చాలా బాధపడేది. మూడు కిలోల బంగారం! ఆమెకి ముగ్గురు ఆడపిల్లలున్నారు. ‘ప్రతి ఒక్కరికీ మూడు మూడు కిలోల బంగారం ఇవ్వాలి. కానీ నా మొగుడు నాకున్న డబ్బంతా నాశనం చేసాడు’ అని బాధపడేది. కానీ అంత బంగారమైతే ఉండేది కదా!;
‘నేను కరీం నగర్ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఉదయాన్నే ఇల్లు ఊడ్చే ఒక మహిళ ఒంటిమీద కనీసం ఇరవై తులాల బంగారం ఉండటం చూసాను. ఒంటినిండా నగలు ధరించింది. చెవులకి పెట్టుకుంది. బంగారు కడియాలున్నాయి. కాళ్ళకి అంత లావు వెండి కడియాలున్నాయి. ఆమె ఇల్లు ఊడుస్తోంది. కాని ఆమె ఒంటిమీద కనీసం ఇరవై తులాల బంగారం ఉంది.’
అప్పుడు మాతో కూచున్న ఒక శ్రోతని చూపిస్తూ ‘ఇప్పుడు ఈ పిల్లవాడికి తెలుసో లేదో వీడి నానమ్మ కనీసం రెండు కిలోల వెండి ధరించేది. ఇక్కడ గోండుమహిళల దగ్గర, కొలాం మహిళల దగ్గర, లంబాడా మహిళల దగ్గర ఒక్కొక్కరి దగ్గర కనీసం రెండు కిలోల వెండి ఉండేది. అంత వెండి ధరించేవారు. అదెలా సాధ్యమైంది?’
గురూజీ ఒక క్షణం ఆగారు. మళ్ళీ మొదలుపెట్టారు:
‘ఒక గ్రామంలో నాలుగు విషయాలు ముఖ్యంగా కనిపిస్తాయి. అవి జ్ఞానం, ఆధ్యాత్మికత, కళలు, సామాజిక అర్థశాస్త్రం. సామాజిక అర్థశాస్త్రం అందరికోసం ఉంటుంది. అది లేకుండా మన దగ్గర ఏ వ్యవస్థా ముందుకు సాగదు. అర్థశాస్త్రం కూడా సామాజికంగానే ఉండాలి.’
‘మన పాత వ్యవస్థ మొత్తం వ్యయం కోసం రూపొందించింది, ఆదాయం కోసం కాదు. ఇప్పటి వ్యయం వేరు. ఇప్పుడు, చాలామంది అభిప్రాయం ప్రకారం ‘డబ్బు ఎలాగేనా సంపాదించవచ్చు, కాని దాని వ్యయం మాత్రం సరిగ్గా ఉండాలి, తద్వారా పుణ్యం లభిస్తుంది’. కాని మన పాతపద్ధతిలో ‘ఎలాగైనా సంపాదించడం’ అనేదానికి ఆదాయవనరుల్లేవు. ఇప్పుడు చాలామంది ధనవంతులున్నారు. వాళ్ళు ‘డబ్బు ఎలాగైనా సంపాదించు, ఆపై దానధర్మాలు చేసి పుణ్యం సంపాదించుకో ‘ అంటారు. దానధర్మాలు చెయ్యడం వల్ల పుణ్యం వస్తుందట. కానీ ‘ఎలాగైనా’ సంపాదించడం అంటే ఏమిటి? అందులో ప్రతి ఒక్క రకమైన బద్మాష్ పనులు, తప్పుడు పనులు ఉంటాయి. తప్పుడు పనులు చేసి కూడా సంపాదించడమే కదా దాని అర్థం. అలా కాకూడదు. ఇప్పుడు చాలామంది సామాజిక కార్యక్రమాలు చేసేవాళ్ళు కూడా ‘మేము డబ్బు ఎక్కడినుండైనా తెస్తాం. ప్రపంచంలో ఎక్కడినుండైనా ఎలాగైన తెస్తాం. కానీ ఖర్చు మాత్రం మనవాళ్ళ కోసం చేస్తాం’ అంటారు. మన దగ్గర పాత పద్ధతి అలా ఉండేది కాదు. అక్కడ ఆదాయం గురించి చింత ఉండేది కాదు, ప్రతి ఒక్కరికీ ఆదాయానికి ఒక వ్యవస్థ ఉండేది. ఆదాయం అంటే ఏమిటి? నీకు కావలసినంత నెరవేరడమే కదా. దానికే కదా నీకు ఆదాయం కావాలి? నీకు కావలసిన వస్తువులు, భోజనం, జీవనసాధనం, ఆరోగ్యభద్రత లభించడమే కదా ఆదాయం. దీనికోసమే కదా డబ్బు కావాలి, లేకపోతే మరెందుకు?’
‘మన సమాజంలో పేదవాడు అని ఎవరినంటారు? ఇప్పుడు అసలు పేదవాడు ఎవరు? ఎందుకు ఆదాయం ఉండటం లేదు? నీ దగ్గర వంద ఆవులుండవచ్చు. కానీ నీ ఇంట్లో టీవీ, ఫ్రిజ్ లేకపోతే నువ్వు పేదవాడివి అని నేటి మార్కెట్ డిసైడ్ చేస్తోంది. నేటి మార్కెట్ మీద ఆధారపడనివాడు ఈ రోజుల్లో పేదవాడు. ఈ రోజుల్లో మార్కెట్లో దొరికేవాటినీ, ఫాక్టరీల్లో తయారయ్యే వస్తువుల్నీ కొనలేనివాణ్ణి పేదవాడు అంటున్నారు. వాళ్ళ ఇంట్లో ఏమీ ఉండవు కాబట్టి వాళ్ళు పేదవాళ్ళు. ఇప్పుడు జరుగుతున్న సర్వేల్లో కూడా ఇవే అడుగుతున్నారు— మీ ఇంట్లో ఏముంది, ఏది లేదు అని.’
‘గతంలో ఒక సర్వే చేసినప్పుడు చాలా తమాషాగా అనిపించింది. టీవీ ఉందా అని అడిగారు. ఉందన్నారు. ఇవన్నీ ఉన్నాయి. ఆపైన కరెంటుందా అని అడిగారు. కరెంటు లేదు. ఒకవేళ కరెంటు ఉందని చెప్తే మీటరు నంబరు రాయాలి. గ్రామంలో అందరిళ్ళకూ కరెంటు కనెక్షనుంది. అన్నీ పెట్టుకుని చూస్తున్నారు, వింటున్నారు, కానీ కరెంటు ఉందని మాత్రం చెప్పలేరు. ఎందుకంటే ఎవరిదగ్గరా మీటరు లేదు. అందరూ వైర్లు తగిలించుకుని వాడుకుంటున్నారు. కరెంటు ఉంది గానీ మీటరు లేదు.’
‘కాబట్టి నేటిమార్కెట్ మీద ఆధారపడనివాడిని లేదా ఇంట్లో మార్కెట్ వస్తువులు లేనివాడిని ఇప్పుడు పేదవాడిగా భావిస్తున్నారు. పూర్వం మనదగ్గర ‘పేదవాడు’ అనే భావనలేదు. ఆ పదం కూడా లేదు. ‘నిర్ధనుడు’ అనే పదం ఉండేది. ఎవరిదగ్గరైతే ధనం ఉండదో వాడు నిర్ధనుడు. అది కూడా ఎవరిని పడితే వారిని నిర్ధనుడు అని రాయలేదు. కేవలం ‘నిర్ధన బ్రాహ్మణుడు’ అని మాత్రమే రాసారు. పురాణాల కథలన్నిటిలోనూ నిర్ధన బ్రాహ్మణుణ్ణే చూస్తాం. అంతే తప్ప నిర్ధన-సాహుకారు అని ఎక్కడా అనరు. అది కేవలం బ్రాహ్మణుడికి మాత్రమే వర్తించే పదంగా కనిపిస్తుంది.’
‘ధనమంటే కేవలం ఒక్కటే కాదు, మన దగ్గర చాలా రకాల వస్తువుల్ని ధనంగా భావించేవాళ్ళు. దాదాపు ఏడెనిమిది రకాల విషయాల్ని ధనంగా చూసేవాళ్ళు. అందులో బంగారం ఒక ధనం. స్వర్ణాన్ని లక్ష్మీదేవి నాణెంగా చూసేవాళ్ళు. రెండవది భూమి, దాన్ని కూడా ధనంగా భావించేవాళ్ళు, కానీ పూర్వం భూమికి అంత ప్రాధాన్యత ఉండేది కాదు. మరొకటి పశుధనం, ధాన్యధనం. పశువులలో గోధనం, గజధనం, అశ్వధనం, అజధనం —ఇవన్నీ ధనాలే. వీటితో పాటు ‘విద్య’ కూడా ఒక ధనమే. ఇలా వాటన్నింటినీ ధనంగా భావించేవాళ్ళు. ఎవరి దగ్గర ఏది ఉంటే, దాన్ని బట్టి వాళ్ళు ధనవంతులు. ఎవరి దగ్గర ధాన్యముందో వాడు ధనవంతుడే. ఎవరి దగ్గర పశువులు ఉన్నాయో, ఎవరి దగ్గర వంద ఆవులు ఉన్నాయో వాడు ధనవంతుడు. వెయ్యి మేకలున్నవాడు కూడా ధనవంతుడే.’
‘అలా పూర్వం ధనానికి ఒకే రూపం ఉండేది కాదు. మన దగ్గరకి నోట్లు వచ్చినప్పుడు ఇదంతా నిర్ధనంగా మారిపోయింది. ఎప్పుడైతే నోట్లనే ధనంగా భావించడం మొదలుపెట్టామో అప్పుడు మిగతా ధనాలన్నీ అంతమైపోయాయి. మరి నోట్లు ఎప్పుడు ధనంగా మారాయంటే, ఫాక్టరీలొచ్చాక. పెద్ద పెద్ద ఫాక్టరీలొచ్చాక నోట్లకి ప్రాధాన్యత పెరిగింది. మనం వస్తువుని నోట్ల ద్వారానే తీసుకుంటాం, మరి దేనిద్వారానూ తీసుకోమనే పరిస్థితి వచ్చింది. ఈ రోజు నీ దగ్గర వెయ్యి మేకలుండవచ్చు, కానీ రోజువారీ ఖర్చులకి వెయ్యి రూపాయలు చేతిలో లేకపోతే నువ్వు కంగాలీవే. ఆవులుండవచ్చు, కానీ వంద రూపాయలు చేతిలో లేకపోతే నువ్వు కంగాలీ. ఇప్పుడు ధనానికి ప్రతీకగా ఈ నోట్లనే చూస్తున్నారు. ఇవి ఎవరి దగ్గర ఎంత ఎక్కువుంటే వాడు అంత ధనవంతుడు.’
‘పూర్వం మన దగ్గర అలా ఉండేది కాదు కదా. ఎవరి దగ్గర ఏ వస్తువుంటే అది ధనరూపంలో సాగిపోయేది. పశువులు ధనరూపంలో సాగేవి, ధాన్యం ధనరూపంలో సాగేది, బంగారం ధనరూపంలో సాగేది, ఎవరి దగ్గర విద్య ఉన్నా అది కూడా ధనరూపంలోనే సాగేది. కుమ్మరి దగ్గర అతని విద్య ఉంది. దాన్నే అతను ధనరూపంగా మార్చుకునేవాడు. ఇలా ధనానికి చాలా రూపాలుండేవి. ఆ సమయంలో ప్రతి ఒక్కడూ తన దగ్గరున్న ధనాన్నిబట్టి తన్ను తాను ధనవంతుడిగా అనుకునేవాడు తప్ప తనని పేదవాడిగా భావించేవాడు కాడు. ‘నాకేం తక్కువ? నాకు వంద ఆవులున్నాయి. పాలున్నాయి, ఇల్లంతా సమృద్ధిగా ఉంది, ఇంకేం కావాలి?’ అనుకునేవాడు.కాని ఈ రోజు నీ ఇంట్లో ఆవులూ, పాలూ అన్నీ ఉండవచ్చు, కానీ చేతిలో వందరూపాయల నోట్లు, వెయ్యి రూపాయల నోట్లు లేకపోతే నువ్వు కంగాలీవి.’
‘ఇక్కడ నోట్లు ధనరూపంలోకి వచ్చాక మన దగ్గరొక పెద్ద గందరగోళం మొదలయ్యింది. ఏమిటా సమస్య అంటే— పూర్వం ధనం ధాన్యంగా ఉన్నప్పుడు, ఆ ధాన్యం ఇంట్లో ఎవరిదగ్గరుండేది? రైతు పండించేవాడు. కానీ ఇంట్లో ఎవరి చేతిలో ఉండేది? మహిళల ఆధీనంలో ఉండేది. ధాన్యం ధనంగా ఉన్నంతకాలం అది మహిళల అధీనంలోనే ఉంది. ఇవ్వడం, తీసుకోవడం, అప్పులు, సంప్రదాయాలు, దానధర్మాలు, వ్యవహారాలు, సంబంధాలు—ఇవన్నీ మహిళలే చూసుకునేవాళ్ళు. పురుషుడు ఆ సమయంలో కేవలం ఎద్దులా కష్టపడేవాడు. అతన్ని కేవలం పొగడటానికి మాత్రమే ‘నువ్వు గొప్పవాడివి, నువ్వది, నువ్విది’ అనేవారు. కానీ అధికారం మాత్రం అతని చేతిలో ఏమీ ఉండేది కాదు. ధాన్యం ధనరూపంలో ఉండి మహిళల చేతిలో ఉన్నంత కాలం, ఈ దేశంలో అన్నం అమ్ముడుపోలేదు, వండిన అన్నం ఎక్కడా అమ్మలేదు. ఎందుకంటే గ్రామాల్లో ఏ మహిళా ఎవరినీ ఆకలితో ఉండనిచ్చేది కాదు. అన్ని వ్యవహారాలూ వాళ్ళే చూసుకునేవాళ్ళు.’
‘ఎప్పుడైతే నోట్లు ధన రూపంలో వచ్చాయో, అవి ఎవరి చేతిలోకి వచ్చాయి? నోట్లు ఈ రోజు పురుషుల చేతిలోకి వచ్చాయి. నోట్లు ధనంగా మారగానే అవి పురుషుల చేతికి వచ్చాయి. పురుషుడు శతాబ్దాలుగా సామాజిక వ్యవహారాలకి దూరంగా ఉన్నాడు. ఇవ్వడం, తీసుకోవడం, దానధర్మాలు—స్త్రీలు ఏం చేసినా ఇతనికి సంబంధం ఉండేది కాదు. ఎప్పుడైతే నోట్లు పురుషుడి చేతికి వచ్చాయో, అతనికి మహిళలు చేసే పనులన్నీ పనికిరానివిగా కనిపించడం మొదలైంది. ‘ఆమెకి ఎందుకివ్వాలి? అక్కడెందుకు దానం చేయాలి? దాని వల్ల ఉపయోగం ఏంటి?’ అనే ప్రశ్నలు మొదలయ్యాయి. ఎందుకంటే ఆతనికి వాటి విలువ తెలియదు.’
‘దాంతో ఈ పద్ధతులన్నీ దోపిడీ కోసం తయారయ్యాయి, ఇవన్నీ తప్పుడు పనుల వైపు తీసుకెళ్ళాయి. పురుషుడు దానం కంటే దావత్‌లకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టాడు. ఈ రోజు జీతం రాగానే వాడు స్నేహితులతో దావత్ చేసుకుని ఆ తర్వాత ఇంటికి వస్తాడు. పూర్వం మన దగ్గర ఈ నోట్లు ఉండేవి కావు కదా, ఇప్పుడు ఈ నోట్లు పురుషుల చేతిలో ఉన్నాయి, మహిళల చేతిలో లేవు. ఇవి పురుషుల చేతికి రావడం వల్లే సమాజంలో ఇన్ని మద్యం దుకాణాలు, ఇన్ని బార్‌లు తెరుచుకున్నాయి. దీనివల్ల మన దగ్గర చాలా పెద్ద మార్పు వచ్చేసింది. మహిళల చేతిలో ఉన్న అధికారం పూర్తిగా అంతమైపోయింది. ధనం రూపం మారగానే ఇంత పెద్ద మార్పు వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ నోట్లని మహిళల చేతికి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. చిన్న చిన్న ‘డ్వాక్రా’ గ్రూప్‌లు పెట్టి, రకరకాల పద్ధతుల ద్వారా మహిళల చేతికి నోట్లని తేవాలని చూస్తున్నారు.’
‘అందుకే కొన్నిసార్లు అనిపిస్తుంది, ఈ నోట్ల వ్యవస్థని పూర్తిగా అంతం చేయాలి అని. మన దగ్గర కేవలం ఒక్క వస్తువునే ధనంగా ఎప్పుడూ చూడలేదు. దీనితోనే అన్ని వ్యవహారాలూ సాగాలి అనే నిబంధన ఎప్పుడూ లేదు. చాలాసార్లు అనిపిస్తుంది, ఈ వ్యవస్థను మార్చాలనుకునే వాళ్ళు, దీని గురించి మాట్లాడేవాళ్ళు, వాళ్ళు ఈ ధనరూప వ్యవస్థని మారుస్తారా? అధికార మార్పిడి జరగకపోయినా, ఈ ధనవ్యవస్థ మారితే చాలా విషయాలు దానంతట అవే సరిగ్గా సాగుతాయి. మనం ఏ మానవత్వంతో బతకాలి అనుకుంటున్నామో, ఆ విధంగా జీవితాన్ని జీవించవచ్చు—’
ధారాప్రవాహంగా సాగిన ఆ ప్రసంగాన్ని ఎక్కడా ఆపాలనిపించలేదు. ఆయనే తన ప్రసంగం ఆపి ‘చాయ్ తాగుదామా? ‘ అనడిగారు.
Featured image and profile photography by Sardar Harpal Singh, Adilabad
9-6-2026


ఫోటో లో కనిపిస్తున్న artifacts అన్నీ వారి ఆశ్రమ కళాకారులు తయారు చేసినట్లుగా వున్నాయి.
“రజనీ బక్షి రాసిన పుస్తకం తీసుకొచ్చి చూపించారు. ఆమె తన పర్యటనల్లో కలుసుకున్న వ్యక్తుల గురించీ, వారు చేపడుతున్న కార్యక్రమాల గురించీ Bapu Kuti (1998) పేరిట వెలువరించిన పుస్తకం అది! అందులో ఆమె గురూజీ గురించి పెద్ద అధ్యాయమే రాసారు. అందులో నా ప్రస్తావన కూడా ఉంది!!”
🙏🏽🙏🏽🙏🏽
Guruji ‘s observations on how societies functioned, how culture, tradition, economy, and design came together harmoniously, but how modern transformations have affected them, are eye opening.
సభ్యత, సంస్కృతి, సంప్రదాయాల గురించి గురూజీ ఇచ్చిన వివరణ చాలా informative గా ఉంది.
అంతరించిపోతున్న జ్ఞానాన్ని,విద్యను, కళలను సేకరించి భద్రపరచి ముందు తరాలకు అందించాలని అనుకోవడం నిజంగా a rare thought.
Guruji’s lifelong commitment to preserving that knowledge and those traditional skills is an invaluable contribution. 🙏🏽
ఇటువంటి మహనీయుల గురించి, వారి thought process గురించి what made them who they are అని వారి మాటల్లోనే తెలుసుకునే అవకాశం almost impossible కదా. అటువంటిది మీరు time చేసుకుని వారి వద్దకు వెళ్ళి వారి మాటలను రికార్డు చేసుకొని ఇన్ని సంవత్సరాలూ భద్రపరిచి ఈ విధంగా అందరితో పంచుకోవడం మీ గొప్పతనం, ఈ posts చదువుతున్న వారి అదృష్టం
Thank you Sir 🙏🏽
హృదయపూర్వక ధన్యవాదాలు మాధవీ!
ఇంత చక్కటి అపురూపమైన విషయాలు మాకు అందజేస్తునందుకు మీకు కృతజ్ఞతలు. గురూజీ గారికి నమస్కారాలు.
హృదయపూర్వక ధన్యవాదాలు సార్!
ఎంత వివరణాత్మక సంభాషణ. సభ్యత, సంస్కృతి, సామాజికత , సాంప్రదాయాల గురించి గురూజీ ఉదాహరణలతో ఇచ్చిన వివరణ పాఠ్య పుస్తకాల్లో చేర్చే ప్రమాణాలతో ఉంది. మీరు సందర్భానుసారంగా రజనీ భక్షి గారి గురించి, ఆమె రాసిన పుస్తకం గురించి ప్రస్తావిస్తూ గురూజీ ఈ కళాశ్రమం మొదలుపెట్టడానికి పడిన బీజం గురించి చెప్పిన విధానం చాలా బాగుంది. నిజంగా ఈ సంభాషణలు మీరు రికార్డు చేసి వాటికి ఇలా అక్షర రూపం ఇవ్వడం తెలుగు పాఠకులకు భవిషత్తు లో భారతీయ, ప్రాంతీయ , గ్రామీణ కళల గురించి, వృత్తుల గురించి సమగ్రంగా తెలుసుకునే గ్రంథం అవుతుందనడంలో నాకేమాత్రం సందేహం లేదు.
‘ఒక గ్రామంలో నాలుగు విషయాలు ముఖ్యంగా కనిపిస్తాయి. అవి జ్ఞానం, ఆధ్యాత్మికత, కళలు, సామాజిక అర్థశాస్త్రం. సామాజిక అర్థశాస్త్రం అందరికోసం ఉంటుంది. అది లేకుండా మన దగ్గర ఏ వ్యవస్థా ముందుకు సాగదు. అర్థశాస్త్రం కూడా సామాజికంగానే ఉండాలి.’
– గురూజీ గారిది అద్భుతమైన పరిశీలన.
🙏🙏🙏
చాలా సంతోషం సార్!