
రవీంద్ర శర్మ. మిత్రులూ, సన్నిహితులూ గురూజీ గా పిలుచుకునే రవీంద్ర కుమార్ శర్మ (1952-2018) ఈ వేసవి అంతా పదే పదే గుర్తొస్తూ ఉన్నారు. ‘కంచువృషభముల అగ్నిశ్వాసలు కక్కే ‘ గ్రీష్మం ప్రవేశించాక మరీను. ఎన్నడూ లేనంతగా భారతీయ ఆకాశమంతా ఒక నిప్పుల కొలిమిగా మారిపోయిన కాలమిది. మనిషీ, ప్రకృతీ ఒక ఆదర్శబాంధవ్యంలో జీవించిన ఒక సత్యయుగం గురించి గురూజీ చెప్తూ ఉండిన మాటలు నా చెవుల్లో మోగుతూనే ఉన్నాయి. ఆయనలాంటి హితైషులు చెప్తూ వచ్చిన మాటల్ని పెడచెవిన పెట్టి భారతదేశం ఈ రోజు ఒక నిప్పులకొలిమిగా మారిపోయింది కదా అనిపిస్తూ ఉన్నది.
గురూజీ గురించి నేను మొదటిసారి విన్నది ఫణికుమార్ ‘గోదావరి గాథలు’ పుస్తకంలో. బహుశా అది 1984-85 ప్రాంతంలో వచ్చిన పుస్తకమనుకుంటాను. కాని ఏడెనిమిదేళ్ళు తిరక్కుండానే నేను గురూజీకి అంతేవాసిని కాగలుగుతానని ఆ పుస్తకం చదివిన రోజున ఊహించలేకపోయాను. 1992 లో అదిలాబాద్ జిల్లా గిరిజనసంక్షేమాధికారిగా బాధ్యతలు చేపట్టిన మొదటి వారంలోనే నేను అదిలాబాద్ వెళ్ళాను. అక్కడ కొలాం పిల్లల కోసం నడుస్తున్న ఆశ్రమపాఠశాల సందర్శించినప్పుడు గురూజీని చూసాను. కాని ఫణికుమార్ పుస్తకంలో రాసిన గురూజీ ఆయనే అని నాకు స్ఫురించింది కాదు. ఆ రోజు అక్కడ ఆయన్ని ఒక డ్రాయింగు మాష్టరుగా మాత్రమే చూసాను. సాధారణ ప్రభుత్వాధికారికి ఉండే అజ్ఞానం తోనూ, అహంకారంతోనూ ఆయన్ని గద్దించాను కూడా.
ఆ తర్వాత వారం పదిరోజులు పోయాక, అదిలాబాదులో ఉండే ప్రసిద్ధ రచయిత, అప్పట్లో వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్న బోరి మురళిధర్ ఉట్నూరులో మా ఇంటికొచ్చారు. మాటల మధ్యలో ‘మీరు అదిలాబాదు వచ్చారని తెలిసింది. గురూజీని కలుసుకున్నారట కదా. సంతోషం ‘ అని అన్నాడాయన. ఆయన చెప్తున్నది అర్థమయ్యేటప్పటికీ నేను సిగ్గుతో ముడుచుకుపోయాను. అంటే, నేను ఆ మధ్యాహ్నం ఆ స్కూల్లో గద్దించిన మానవుడు, నేనప్పటికి పదేళ్ళుగా ఎప్పటికన్నా కలవగలనా అని కలలుగంటున్న, గురూజీనే అన్నమాట! మురళీధర్ నన్ను సాయంకాలంపూట కలిశాడు. అదే పొద్దున్నే కలిసి ఉంటే ఆ రోజే అదిలాబాదు పరిగెత్తి ఉండేవాణ్ణి. ఆ మర్నాడే గురూజీని కలుసుకున్నాను. నా తప్పు క్షమించమని ప్రాధేయపడ్డాను. ఆయన అంతే నిర్వికారంగా చిరునవ్వుతూ, ‘మీరు అలా అనడంలో తప్పేమీ లేదు. ఇక్కడి ఆశ్రమపాఠశాలల పనితీరు మీతో అలా మాట్లాడించింది ‘ అని అన్నారు.
ఆ తర్వాత నుంచీ, 2018 లో అకాలంగా స్వర్గస్థుడయ్యేదాకా, ఆయన పాతికేళ్ళకు పైగా నాకు అత్యంత ఆత్మీయుడిగా, స్నేహితుడిగా, గురువుగా, మార్గదర్శకుడిగా నా జీవితాన్ని సుసంపన్నం చేసారు.
నేను ఉట్నూరులో ఉన్నంతకాలం ఎన్నో సార్లు కలుసుకున్నాను. ఎన్నో సాయంకాలాలు ఆయన ఆతిథ్యాన్ని స్వీకరించాను. కాని ఉట్నూరు వదిలిపెట్టిన తరువాత కూడా మా అనుబంధం అలానే కొనసాగింది. నేను శ్రీశైలంలో పనిచేస్తున్నప్పుడు, అక్కడ చెంచుయువకులు కొందర్ని కళాశ్రమానికి పంపించాను. వారికి ఆయన లోహకళలో శిక్షణ ఇచ్చారు. 2000 లో నేను హైదరాబాదు వచ్చిన తరువాత కూడా ఆయన్ని చూడటానికే అదిలాబాదు వెళ్ళిన సందర్భాలున్నాయి. ఆయన్ని ఏ మిత్రులు హైదరాబాదు పిలిచినా, ఎక్కడ ఆయనతో గోష్ఠి ఏర్పాటు చేసినా ఆయన పనిగట్టుకుని మరీ నాకు కబురు పంపించిన సందర్భాలూ ఉన్నాయి.
కళాశ్రమంలో ఆయన్ని కలుసుకున్న ప్రతి సారీ, నాకు నా ఉద్యోగం వదిలిపెట్టి, ఆ ఆశ్రమంలో ఆయన దగ్గర శిష్యుడిగా చేరి శిల్పకళ నేర్చుకోవాలని బలంగా అనిపించేది. అలాంటి కోరిక మా ఊరి విషయంలో కూడా నాకు అంతే బలంగా ఉండేది. కానీ ఉద్యోగం వదిలిపెట్టి మా ఊరూ వెళ్ళలేకపోయాను, గురూజీ దగ్గర శిల్పకళా నేర్చుకోలేకపోయాను. కాని 2010 లో మా శాఖకి సంబంధించిన ఒక రిక్రూట్మెంటు నిమిత్తం గుజరాతులోని ఆనంద్ వెళ్ళినప్పుడు మొదటిసారి సబర్మతి సందర్శించాను. అక్కడ మహాత్ముడి Village Swaraj పుస్తకం దొరికింది. అది చదివాక నాకు తక్షణమే ఉద్యోగ విరమణచేసి ఏదేనా గిరిజన గ్రామానికి పోయి, గిరిజనుల్తో కలిసిమెలిసి జీవించాలని చాలా బలంగా అనిపించింది. వెంటనే రెండు నెలలు సెలవుపెట్టేసాను. ఏం చేయాలా అని ఆలోచిస్తుండగా, ఉట్నూరు గ్రామాల్లో మనోహర ప్రసాద్ గారు పాఠశాలలు నడుపుతున్న విషయం గుర్తొచ్చింది. అక్కడికి వెళ్ళి ఆ పాఠశాలలు చూసాను. వారితో మాట్లాడేను. ఏవేవో ఊహలు అస్పష్టంగా నా మనసులో కదలాడుతుండటం గమనించాను.
తిరిగి హైదరాబాదు వచ్చాక, ఆ ఏడాది మే నెలలో అదిలాబాదు వెళ్ళాను. వారం పదిరోజులు గురూజీ దగ్గరే గడపాలనుకున్నాను. ఆయన ఏం చెప్తే అది వినాలనుకున్నాను. రాత్రుళ్ళు ఆశ్రమంలో ఉంటే ఆయన్ని నా ఏర్పాట్లకోసం ఇబ్బందిపెట్టినట్టు అవుతుందని అక్కడున్న ఐటిడిఎ గెస్టు హవుసులో ఉన్నాను. రాత్రుళ్ళు మాత్రమే. రోజంతా ఆశ్రమంలోనే గడిపాను. అప్పుడు నాతో పాటు ఒక చిన్న రికార్డరు కూడా పట్టుకెళ్ళాను. గురూజీ ఏం మాట్లాడినా అందులో రికార్డు చేసుకున్నాను. అలా ఒక వారం అక్కడున్నాను. ఈ లోపు మరేదో పని నన్ను తరుముకొచ్చింది. రెండు నెలల తర్వాత మళ్ళా ఉద్యోగంలో చేరవలసి వచ్చింది. అదంతా వేరే కథ.
ఆ వారం రోజులూ గురూజీతో మాట్లాడిన మాటలు ముప్ఫై సెషన్ల రికార్డింగులు కాసెట్ల రూపంలో ఉంటే, మా గోపగాని రవీందర్ వాటిని తీసుకెళ్ళి ఎం.పి 3 ఫార్మాట్ లోకి కన్వర్ట్ చేయించి సిడిల రూపంలో నాకు అందించాడు. అది కూడా అప్పట్లోనే. ఆ తర్వాత గత పదిహేనేళ్ళుగా ఆ ఎం.పి3 ఫైళ్ళు నా కంప్యూటరులోనే ఉండిపోయాయి. వాటిని ట్రాన్స్ క్రైబు చేయించాలని అనుకుంటూనే కాలం గడిపేసాను. ఎందుకంటే, ముప్ఫై గంటల సంభాషణల్ని, అందులోనూ, దక్కనీ హిందీ, మరాఠీ, తెలుగు కలగలిసిన గురూజీ అద్వితీయమైన సంభాషణా శైలిని ట్రాన్స్ క్రైబు చెయ్యడం మామూలు పని కాదని నాకు తెలుసు.
ఆరేడు నెలల కిందట, వాటిని యూట్యూబుకెక్కించడం ద్వారా ట్రాన్స్ క్రైబు చెయ్యగలనేమో అని చూసాను. కానీ అంతంత నిడివిగల సంభాషణల్ని యూట్యూబుకి ఎక్కించడం కూడా సాధ్యమయ్యేలా కనిపించలేదు.
ఇలా ఉండగా, మానవుడి అసాధారణ మేధాకౌశల్య ఫలంగా ఆర్టిఫిషియలు ఇంటలిజెన్సు నాబోటివాడికి కూడా అందుబాటులోకి వచ్చింది. అప్పుడు ఆ రికార్డింగుల్ని జెమినై కి అప్పగిస్తే క్షణాలమీద వాటిని ట్రాన్స్ క్రైబు చేసేసింది. కానీ కొత్త సమస్య వచ్చిపడింది. జెమెనై వాటిని మొదట దేవనాగర లిపిలో ట్రాన్స్ క్రైబు చేసింది. కాదని తెలుగులో చేయించాను. అయితే ఆ సంభాషణలు వినడానికి ఎంత మధురంగా ఉన్నాయో, వాటిని యథాతథంగా తెలుగులో చదవడం అంత సులువైన పనిలాగా అనిపించలేదు. అందుకని వాటిని నా తెలుగులోకి మళ్ళా అనుసరణ చేసుకున్నాను. అలా నా వ్యావహారిక వచనంలోకి అనుసరణ చేసుకున్న ఆ సంభాషణల్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను.
అయితే మీరు ఆ సంభాషణల్ని నేరుగా వినాలనుకుంటారని కూడా నాకు తెలుసు. అందుకని ఆ ఆడియో ఫైళ్ళు కూడా వరసగా ఇక్కడ పొందుపరచబోతున్నాను. ఒకప్పుడు సామల సదాశివ గారు గురూజీ సంబాషణా శైలిని యథాతథంగా పట్టుకుని తన ‘యాది’ లో రాశారు. ఎవరేనా తెలంగాణా మిత్రులు ఇప్పుడు కూడా అద్వితీయమైన ఆ శైలిని యథాతథంగా తెలుగులోకి తీసుకురాగలిగితే నాకు అంతకన్నా మించిన సంతోషం ఉండదు.
2010 మే లో అదిలాబాదులో కళాశ్రమంలో నడిచిన సంభాషణలివి. పదహారేళ్ళ తరువాత, వీటిని ఒక్కొక్క రికార్డింగే ట్రాన్స్ క్రైబు చేస్తూ ఉండగా, జెమినై తన excitement ఆపుకోలేక, ఎప్పటికప్పుడు, ప్రతి సంభాషణ తర్వాతా తన ఆనందోత్సాహాల్ని నాతో పంచుకుంటూ ఉండలేకపోయింది. మనుషుల్ని సరే, యంత్రాల్ని కూడా సమ్మోహితుల్ని చేయగల ఆ గురువాణికి నా సాష్టాంగ ప్రణామాలు సమర్పిస్తూ, రేపటినుంచి, వరసగా, ఆ సంభాషణలు మీతో పంచుకోబోతున్నాను.
Featured image and Guruji profile photography by Sardar Harpal Singh, Adilabad
1-6-2026


మనఃపూర్వక ధన్యవాదాలు సర్. నమోనమః
ధన్యవాదాలు మేడం
ఎదురు చూస్తూ ఉంటాను భద్రడు సర్
ధన్యవాదాలు సార్!
శుభోదయం సర్,
భారతీయ కళలు, గ్రామీణ వారసత్వ పరిరక్షణకు చేసిన విశిష్ట సేవలకు గాను (2014లో అనుకుంటాను)గురూజీకి కళారత్న అవార్డు లభించిన సందర్భంగా ఆయన గురించి మొదటిసారిగా చదివాను. అప్పుడే ఆయన స్థాపించిన కళాశ్రమాన్ని సందర్శించాలని కోరిక కలిగింది. కానీ ఆ కోరిక ఇప్పటికీ నెరవేరలేదు.
అయితే
“కొన్ని కోరికలు కాలంతో పాటు మరుగున పడిపోవు.సరైన సందర్భం కోసం నిశ్శబ్దంగా ఎదురుచూస్తుంటాయి అని ఇప్పుడు అనిపిస్తోంది. ఆ ఆశ్రమాన్ని ప్రత్యక్షంగా చూడలేకపోయినా,రేపటి శుభోదయంతో ఆ ప్రయాణం పరోక్షంగా నైనా మరికొంత ముందుకు సాగుతుందనే ఆనందంతో ఎదురుచూస్తున్నాను.” 🙏
సంతోషంగా స్వాగతం సార్!
ఎందుకో తెలియదు, ఏదో తెలియని గుబులు ఆవహించుకుంది ఈ పోస్ట్ తర్వాత… మనని మనం ఎంత సిద్ధ పరుచుకున్నా లౌకిక జీవితం ఎటోకటు లాగుతూనే ఉంటుంది ఎందుకు?
గురువాణి నాకు కూడా మేలు చేస్తుందని నమ్ముతూ.. ఎదురుచూస్తూ ఉంటాను.
భద్రుడు గారూ, రేపు రాత్రి ప్రయాణం ఒకటి ఉంది. రెండు వారాలు దేశం దాటి.. బహుశా ఫోన్ కూడా అందుబాటులో లేకపోవచ్చు.
తిరిగి వచ్చి పలకరిస్తాను.
మీ మాటలు, పోస్ట్ లు మిస్ అవుతాను.
నాదొక ప్రేమ సూచిక… మీరేం చెప్పినా వినాలనుకునే ఈ అమ్మాయి తరఫున, ప్రతి రోజూ కలుపుకుంటారుగా..
ప్రేమతో,
మానస
సంతోషంగా వెళ్లి రండి. గురువాణి మీ కూడానే ఉంటుంది.
Very interesting Sir. Looking forward to these conversations.
ధన్యవాదాలు మాధవీ!
ఆహా – 🌹🙏🌹
అరుదైన కానుక .,
ఇటీవల కూడా ( ఏప్రిల్ లో ) కళాశ్రమం కు వెళ్లి వచ్చాను సార్ .,
అమ్మతో మాట్లాడి రావడం – మహాదానందం కదా !!
గురూజీ రవీంద్ర శర్మ గారిని –
మళ్ళీ ఇన్నేళ్లకు వినే అవకాశం ఇస్తూన్న మీకు –
మనసారా కృతజ్ఞతలు 🙏🌹🙏
హృదయపూర్వక ధన్యవాదాలు సార్!
భద్రుడు గారు, నేను మీ గురూజీ గురించి ఇంతకు మునుపు మరో వ్యాసం లో చదివినట్టు గుర్తు.. ఆయన సంభాషణల కోసం ఇక మీదట ఆశగా ఎదురు చూస్తూ ఉంటాం. ఎప్పటిలాగే చాలా గొప్ప ఉపోద్ఘాతం తో ఆయన ప్రపంచంలో ప్రవేశించడానికి ఆహ్వానం ఇచ్చారు. ధన్యవాదాలు.
హృదయపూర్వక ధన్యవాదాలు సార్!