
ఈ రోజు పొద్దున్నే ఒక మిత్రురాలు ఫోన్ చేసి ‘ఉదార చరితులు’ పుస్తకం కావాలని అడిగారు. ఆ పుస్తకం పల్లవి పబ్లికేషన్స్ వేసారనీ, నా దగ్గర కాపీలు లేవనీ అన్నాను. కానీ ఆమె అక్కడితో ఆగక నవోదయ బుక్ హౌస్ వారిని పట్టుకుని ఒక పుస్తకం వెంటనే ఆర్డరు పెట్టారు. ఆ పుస్తకం మీద ఈ నెల ‘రామకృష్ణ ప్రభ’ లో శ్రీ బి.సైదులు అనే ఆయన రాసిన సమీక్ష చదవగానే ఆ పుస్తకం ఎలాగేనా వెంటనే చదవాలని అనిపించిందట ఆమెకి. నాకు చాలా సంతోషంగా అనిపించింది. నా పుస్తకం మీద రామకృష్ణప్రభలో సమీక్ష వచ్చినందుకూ, ఆ సమీక్ష చదివి నా మిత్రురాలు ఆ పుస్తకం వెంటనే చదవాలని ఆరాటపడ్డందుకూ. ఆ సమీక్షలో పేర్కొన్న వ్యాసం The Bonsai Tree పైన నేను రాసింది. ఆ పుస్తకం ప్రతి ఒక్కరూ చదవవలసిన పుస్తకం. ముఖ్యంగా కవులూ, రచయితలూనూ!
వాడిన పూలూ వికసించులే. ..
బి. సైదులు
ప్రముఖ సాహితీవేత్త, చిత్రకారుడు, భావుకుడు, వ్యక్తిత్వ వికాస మార్గదర్శకుడు వాడ్రేవు చినవీరభద్రుడు గారు ఇటీవల ‘ఉదారచరితులు’ పేరుతో ఓ పుస్తకాన్ని విడుదల చేశారు. ముప్పై నాలుగు వ్యాసాల సంపుటమైన ఈ పుస్తకంలో వారు నేతాజీ, నెల్సన్ మండేలా వంటి జననేతలను, మహాశ్వేతాదేవి, సల్మాన్ రుష్దీ వంటి రచయితలను సరికొత్త కోణంలో పరిచయం చేశారు. అలాగే తనను కదిలించిన కొన్ని పుస్తకాలను, కొందరు విశిష్ట వ్యక్తులను తలచుకున్నారు. ఆ పరంపరలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాన కార్యదర్శి హోదాలో పదవీ విరమణ చేసిన ఓ మాజీ ఐఏఎస్ అధికారి జీవనపోరాటాన్ని, ఆయన రాసుకున్న ఆత్మకథనూ ప్రస్తావించారు. ఆ వ్యాసంలో అధికారి ఆవేదనను, అంతరంగ ఘోషను హృద్యంగా ఆవిష్కరించారు. ముఖ్యంగా ఆ ఐఏఎస్ అధికారి, అతని అర్ధాంగి… తల్లిదండ్రులుగా పడిన మానసిక సంఘర్షణను వీరభద్రుడు గారు కళ్ళకు కట్టినట్లు అక్షరీకరించారు. మద్యానికి బానిసైన కొడుకు ఓవైపు, చిన్నతనంలోనే వంచనకు గురైన కూతురు మరోవైపు ఆ దంపతులను ఎంత దుఃఖసాగరంలో ముంచేశారో వివరించారు. చేతికి అందివస్తారనుకున్న పిల్లలు మద్యానికో, మరో వ్యసనానికో బానిసలైనప్పుడు, విధివంచనకు గురై దిక్కుతోచక కుమిలిపోతున్నప్పుడు కన్నవారు ఎంత నిబ్బరంగా, నిశ్చలంగా నిలబడాలో ఆ సహనమూర్తి జీవనగాథను పరిశీలిస్తుంటే స్పష్టమవుతుంది. తమ స్థానానికి భంగం కలగకుండా, తమ సున్నితత్వాన్ని కోల్పోకుండా… దారితప్పిన తమ పిల్లల్ని ఎలా కాపాడుకోవాలో చెప్పే నిశ్శబ్ద పాఠం ఆ ఐఏఎస్ అధికారి జీవనప్రస్థానం. ప్రతి తల్లి, తండ్రి తప్పక తెలుసుకోవాల్సిన అనుభవాల సారం.
పరీక్షగా భావించి…
పొదరిల్లులాంటి కుటుంబాన్ని దుర్వ్యసనాలు, దుర్భర పరిస్థితులు ఛిన్నాభిన్నం చేస్తాయి. తమకు లేని దురలవాట్లు తమ పిల్లల్ని ఆవహించినప్పుడు, తాము ఎన్నడూ ఊహించని అవాంఛనీయ ఘటనలు ఆ ప్రియతములకు సంభవించినప్పుడు కన్నవారి క్షోభ చెప్పనలవికానిది. ఆ గాయాల బాధ ఓర్చుకోలేనిది. శాపంలా తమపై విరుచుకుపడిన అలాంటి దయనీయ సందర్భాలకు అక్షరరూపమిస్తూ అంతర్మథనంతో ఆ మాజీ అధికారి ఆత్మకథగా రాసుకున్నారు. ‘మా గాయం చాలా లోతైనది. మేమెక్కడికి వెళ్ళినా మాతో పాటే ఒక శాపాన్ని రహస్యంగా మోసుకుంటూ పోయేవాళ్ళం. మేము మోస్తున్న బరువు నానాటికీ పెరుగుతూ దాన్ని మొయ్యలేక అలసిపోయి, ఎక్కడన్నా కొద్దిసేపు పక్కన పెడదామా అనుకుంటే అది పెట్టడానికి చోటే కనబడేది కాదు. పైకి మామూలుగా ఉండేందుకు ప్రయత్నించేవాళ్ళం. కానీ, లోలోపల ఆ బాధ మనసుల్ని తొలుస్తూనే ఉండేది’ అంటూ ఉద్విగ్నతతో నెమరువేసుకున్నారాయన. కానీ, ఆ మాననీయ దంపతులు ఎక్కడా తడబడలేదు, తూలిపోలేదు. దైవాన్ని నమ్ముకొని ధైర్యంగా నిలబడ్డారు. తమకు ఇది విధి పెట్టిన ఓ పరీక్ష అని భావించి ఒంటరి పోరాటం చేశారు. ప్రేమ, సహనాలతో ఆ పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు.
సమస్యగా కాదు సవాలుగా…
‘Our errors and mistakes are our teachers. Man is prone to err. And it is man who becomes god-on-earth… మన తప్పులు, పొరపాట్లే మనకు అసలైన బోధకులు. మనిషే తప్పులు చేస్తాడు. అదే మనిషి మళ్ళీ భువిపై దైవంగా మారతాడు’ అన్నారు స్వామి వివేకానంద. సివిల్ సర్వీసెస్ శిక్షణలో ఆ ఐఏఎస్ అధికారి ఇలాంటి మహనీయమైన సూక్తుల్ని ఎన్నింటినో ఆకళింపుచేసుకొని ఉంటారు. అందుకే కన్నబిడ్డల విషయంలో తనకు ఎదురైన సమస్యలను సవాలుగా తీసుకున్నారు. దిగులుతో కాకుండా ధీశక్తితో వాటిని ఎదుర్కొన్నారు. ఎన్నాళ్ళో వేచిన ఉదయం, ఎప్పటికైనా ఎదురవకుండా ఉంటుందా! అని నిరీక్షించారు. భగవంతుడు వారి ఎదురుచూపులకు తెరదించాడు. కొన్నాళ్ళకు కొడుకు మామూలు మనిషయ్యాడు. మేలిమి ముత్యంలా మారి తల్లిదండ్రుల మనస్సులను గెలుచుకున్నాడు. వాళ్ళు తనవల్ల కోల్పోయిన సంతోషానికి వేయిరెట్లు వారికి తిరిగి ఇచ్చాడు. అంతేకాదు, తనలా మద్యానికి బానిసలైన వారి కోసం పునరావాస కేంద్రాన్ని ప్రారంభించాడు. ఆ మధురక్షణాలకు మురిసిపోతూ ఆ తండ్రి తన ఆత్మకథలో… ‘ఒకప్పుడు మాకు ఓ చిన్నారి బిడ్డ ఉండేవాడు. బంగారు బొమ్మలాంటి ఆ బిడ్డను మా నుంచి ఎవరో తస్కరించారు. ముప్పై ఏళ్ళపాటు ఎక్కడో దాచేసి మాకు కనబడకుండా చేశారు. దారుణమైన దుఃఖంతో సుదీర్ఘకాలం పాటు వెతుకుతూ ఉండగా, ఇన్నాళ్ళకు మళ్ళీ మాకు ఆ బిడ్డ దొరికింది. అది కూడా ముందుకన్నా మించిన అందంతో! పూర్వపు రూపాన్ని మించిన శోభతో!…’ అని రాసుకొని ఆనందభరితుడయ్యారు. ఆ కుమారుడు తన తప్పు తెలుసుకొని కన్నవారిని కంటికి రెప్పలా చూసుకున్నాడు. మలిసంధ్యలో ఆ త్యాగమూర్తులకు అంతకన్నా కావలసింది ఏముంటుంది?
క్షమ, ప్రేమలే పెద్ద శిక్షలు…
క్షమ, ప్రేమల ఫలితం ఎంతో మాధుర్యంగా ఉంటుంది. ఆ మాజీ ఐఏఎస్ అధికారి కుమారుడి ఉదంతాన్ని పోలిన ఓ ఉదాత్తమైన గాథ ఇటీవల సామాజిక మాధ్యమాల్లో కనిపించింది. ఓ యువ ఆర్కిటెక్ట్ తన అనుభవాన్ని ఆ పోస్ట్‌లో హృద్యంగా పంచుకున్నాడు. ఆ యువకుడు ఇంటర్మీడియట్లోనే మిత్రుల ప్రోద్బలంతో చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. చదువు కూడా తప్పు త్రోవ పట్టింది. మద్యం మత్తులో ఓసారి స్థానిక యువకుడితో ఘర్షణ పడ్డాడు. ఆ దాడిలో ఎదుటివ్యక్తికి తీవ్రగాయాలై చావుబతుకుల్లో ఉన్నాడు. దాంతో ఇతడు భయపడి ఇల్లు వదిలి పారిపోయాడు. దెబ్బలు తిన్న యువకుడి తరఫువారు ఇతని ఇంటిపై దాడిచేశారు. తల్లిదండ్రులపై చేయి చేసుకోవటమే కాక, నానా బీభత్సం సృష్టించారు. కొన్నాళ్ళకు ఈ యువకుడు భయపడుతూ ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ సమయంలో తల్లిదండ్రులు తీవ్రంగా ప్రతిస్పందిస్తారనుకున్నాడు. కానీ, తను ఊహించిన దానికి భిన్నంగా, వారు స్వాగతించిన తీరుకు, కురిపించిన ప్రేమకు ఈ యువకుడు చలించిపోయాడు. ఆ అనుభవాన్నే ఫేస్బుక్లో మిత్రులతో పంచుకుంటూ, ‘ఆ రోజు మా అమ్మనాన్న సీరియస్‌గా రియాక్ట్ అవుతారనుకున్నాను. వారు పొందిన అవమానాలకు నిజంగా నన్ను దూషించినా, దండించినా తప్పే లేదు. కానీ, వాళ్ళు ఆ అవమానాలన్నింటినీ మరచిపోయి నన్ను ఆప్యాయంగా దగ్గరకు తీసుకున్నారు. ప్రేమగా హగ్ చేసుకొని, నా బాగోగుల గురించే ఆరాతీశారు. ఇన్నాళ్ళూ ఎక్కడున్నావని, తినక చిక్కిపోయావని కన్నీళ్ళు పెట్టుకున్నారు. ఆ క్షమ, ప్రేమలే నాకు చెంపదెబ్బలై, నన్ను సమాజంలో మార్చేశాయి. వారు కనబరిచిన ఆత్మీయతే నాకు కఠినశిక్షగా అనిపించింది’ అని మనసుల్ని కదలించే మాటలతో గతాన్ని మననం చేసుకున్నాడు. అందుకే, దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు ‘ఈ లోకంలో చికిత్స చేయవలసిన రోగమే కానీ, దండించవలసిన నేరం అంటూ ఏదీ లేదు. ఈ లోకమంతా పెద్ద వైద్యశాల. దీనిలో ప్రధాన వైద్యుడు ప్రేమే!’ అన్నారు.
కానీ పెంచి పెద్దచేసిన తల్లిదండ్రులే పిల్లల్ని అర్థం చేసుకోకపోతే, ఇంకెవరు అర్థం చేసుకుంటారు? కన్నబిడ్డలు దారితప్పితే పెద్దలే బాధ్యత వహించాలి. వారిని సమస్యగా భావించకుండా, సవాలుగా తీసుకొని సరిదిద్దేందుకు శాయశక్తులా ప్రయత్నించాలి.
ఆత్మీయతకు ఆశ్రయమైనప్పుడే…
అరమరికలు లేకుండా, ఆత్మీయతకు ఆశ్రయంగా మారినప్పుడే అది ‘బంగారు కుటుంబం’ అనిపించుకుంటుంది. మనసు విప్పి మాట్లాడుకోగలిగి, ఒకరి తప్పుల్ని మరొకరు మన్నించగలిగి ముందుకు సాగినప్పుడే కుటుంబ బంధాలు పటిష్ఠంగా ఉంటాయి. తమ బలం, బలగం తమ తల్లిదండ్రులే అని పిల్లలకు; అలాగే, తమకు అండ దండ తమ పిల్లలే అని తల్లిదండ్రులకు అనిపించినప్పుడు ఆ ఇల్లు నందనవనమవుతుంది. ఆ విరుల వనంలో వాడిన పూలూ వికసిస్తాయి, శుష్కించిన హృదయాలూ పులకిస్తాయి. అలాంటి తల్లిదండ్రులు, పిల్లలతో కూడిన కుటుంబాలే నేడు మన సమాజానికి కావలసినవి. అందుకే, ‘ఉదారచరితులు’ పుస్తకంలో తన వ్యాసాన్ని ముగిస్తూ చినవీరభద్రుడు గారు, ‘నాకు కావలసింది మామూలు మనుషులు. పొరుగువాళ్ళకన్నా ముందు తమ తల్లిదండ్రుల్నీ, తమ పిల్లల్నీ, తమ అన్నదమ్ముల్నీ ప్రేమిస్తూ వాళ్ళతో మామూలు సాయంకాలాలు మామూలు మాటల్లో మామూలుగా గడపగలిగే మామూలు మనుషులు కావాలి నాకు’ అన్నారు. ప్రేమాస్పద ప్రవర్తన తొలుత ఇంటి నుంచే ప్రారంభం కావాలని ఆశించారు. ఇకనైనా అలాంటి ‘మనసున్న మామూలు మనుషులు’గా ఉండేందుకు ప్రయత్నిద్దాం!
(మే 15, అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం) (శ్రీ రామకృష్ణ ప్రభ – మే 2026, పేజీ: 28, 29)
30-5-2026


నిన్న పోస్ట్ మాన్ మే , జూన్ సంచికలు రెండూ ఇచ్చి వెళ్లాడు. తీసుకుని టీ పాయ్ మీద పెట్టాను కవరు తీయకుండా. ఇప్పుడిది చదవగానే వెంటనే ఓపెన్ చేసి చూసాను 28, 29 పేజీల్లో కనిపించింది.
అప్పటికే చదివాను కనుక ఆ రంగుల పేజీ చూసి మురిసిపోయాను.సైదులు గారికి కృతజ్ఞతలు. ఒక క్లిష్ట సమస్యను ఫోకస్ చేసిన మీ వ్యాసం పరిచయం చేసినందుకు. ప్రతి ఉదయాన్ని ఒక కొత్త ఉదయంగా మార్చడమే కవుల లక్ష్యం అనడానికి మీరు సాక్ష్యం .
చాలా చాలా సంతోషం సార్!
అద్భుతమైన పుస్తకం సర్..
ధన్యవాదాలు మేడం!