
ప్రియమైన శాఫో
ఇంకా తెల్లవారకుండానే కోకిల కూత నగరమంతా వ్యాపిస్తూ ఉంది. అది గాల్లో తేలే పువ్వు. ఎక్కడ పూసినా ఆకాశమంతా విరజిమ్మే పరిమళం. ఆ కూజితం వింటూనే నాకు మా ఊళ్ళో మేలుకొన్నట్టనిపిస్తుంది.
పనిలో ప్రపంచాన్ని మర్చిపోయేవారు ఒక తరహా. వారిని ధన్యులనలేను. కోకిలని వినగానే నాలోంచి ఒక భాగం విడివడి ఎక్కడెక్కడి అడవులూ తిరిగొస్తుంది. ఈ ఊళ్ళో ఎంత వ్యాపకం. ఎంత సమాచారం. కాని నేను వార్తాపత్రికలు చదవను, టివి చూడను. రాజకీయాలు ఎటుపోతున్నాయో నాకు ఆసక్తి లేదు. నా బంధువుల గురించీ, స్నేహితుల గురించీ తెలుసుకోవాలని కూడా ఉండదు. నా ప్రపంచంలో నన్ను చేరవచ్చే వార్తలు, ఇదుగో, ఇలాంటి కోకిల పిలుపులు మాత్రమే.
వసంతకాలంలో ఒక కోకిల ఎలుగెత్తి ఆకాశద్వారాల్ని తడుతున్నంతకాలం ప్రపంచం నడుస్తున్నట్టే లెక్క. భూమి ఇంకా కూలిపోలేదనే నా నమ్మకం. వాతావరణమింకా ఆరోగ్యంగానే ఉన్నట్టు. మనమెందుకు పనిచెయ్యాలంటే, ఇదుగో, ఆరోగ్యంగా బతికి ఉండి, ఇలా ప్రతి వసంతఋతువులోనూ కోకిల పాట వినడానికే.
వేదకాల మానవుడు కర్మలు చేయడానికి విత్తం కావాలని కోరుకున్నాడు. అతడి దృష్టిలో కర్మలంటే దేవతలతో సంభాషణ. పొద్దున్నే లోచి ఉషస్సునీ, అగ్నినీ, ఆదిత్యుణ్ణీ ప్రార్థించడం. అగ్ని వెలిగించాక అందులో ఘృతం హవిస్సుగా సమర్పించడం కోసం విత్తం కోరుకున్నాడు. ఇప్పుడు మేం విత్తం కోసం కర్మలు చేద్దామనుకుంటాం. మా దృష్టిలో కర్మలంటే ఉద్యోగాలు చెయ్యడం. ఇప్పుడు మా జీవితాల్లో కార్యకలాపమంటే దేవతలకి దూరంగా జరగడం, mammon కి దగ్గరగా జరగడం.
ఇన్నేళ్ళ నా జీవితంలో నేను చాలా దగ్గరగా చూసిన జీవితాల్లో ఒకటైతే స్పష్టంగా చూసాను. వాళ్ళ జీవితాల్లో అవసరాలకు సరిపోయే ఆదాయం, ఇంకా చెప్పాలంటే, ఆదాయం బొటాబొటిగా ఉన్నంతకాలం వాళ్ళు మనుషులకీ, పాత హిందీసినిమా పాటలకీ, వెన్నెలనీడలకీ, వేసవి సెలవులకీ దగ్గరగా ఉండేవారు. తమ రోజువారీ అవసరాల్ని మించి తమ ఆదాయం ఎప్పుడు పెరగడం మొదలయ్యిందో అప్పణ్ణుంచీ వాళ్ళు వస్తువులకీ, ఇళ్ళ స్థలాలకీ, బాంకు ఖాతాలకీ అంటిపెట్టుకోడం మొదలుపెట్టారు. ఒకప్పుడు వాళ్ళు తమ స్నేహితులకి అడక్కుండానే ఏమి కావాలా అని కనిపెట్టుకుని ఉండేవారు. ఇప్పుడు కనిపిస్తే ఏమి సాయం చెయ్యవలసి వస్తుందో అని ముఖం చాటేసుకుని తిరుగుతున్నారు.
కాబట్టి ఒకరికి జీవితంలో పొద్దున్నే కోకిల పిలుపు వినబడుతోందంటే వాళ్ళు రియల్ ఎస్టేట్ కి దూరంగానూ, దేవతలకి దగ్గరగానూ ఉన్నారన్నమాట. వాళ్ళకి పని ఒక రుటీన్ గా, ఒక drudgery గా మారిపోలేదన్నమాట. పాతనిబంధనలో యెహోవా అబ్రహాంతో చెప్తాడే, అటువంటి వాళ్ళు ఒక నగరంలో పదిమంది ఉన్నా కూడా, ఆయన వారిమీద తన కరుణ కురిపించకుండా ఉండడనే నా ఆశ. నినేవే నగరం ధ్వంసం కావాలాని జోనా కోరుకున్నా కూడా యెహోవా ఆ నగరాన్ని కారుణిమకడానికి కారణం బహుశా ఆ నగరంలో ఒక్కరేనా బంగారం కోసం కాక ఆకాశం కోసం బెంగపెట్టుకుని ఉంటారు.
పొద్దున్నే నీ యీ కవితాశకలం, Fragment 102 గుర్తురాగానే నాకిదే అనిపించింది. ప్రేమతో స్పందించనిది మగ్గమైనా సరే నువ్వక్కడ ఒక క్షణం కూడా కూర్చోలేవని. ఇదుగో, ఇలా అంటున్నావు:
అమ్మా, మా మంచి తల్లివి కదూ, నేనీ మగ్గం దగ్గర కూచోలేకపోతున్నాను
ఆఫ్రోడైటు పుణ్యమా అని ఆ పిలగాడికోసం నా మనసు కొట్టుకుపోతోంది.
పైకి వినడానికిది పనికీ, ప్రేమకీ మధ్య పగులు వచ్చినట్టనిపించవచ్చు. కానీ కబీరు కూడా ఇలానే అంటున్నాడే!
ఇంక నేత ఎక్కడిది? ప్రేమలో తగులుకొన్నాక, అమ్మా, ఇంక నేత ఎక్కడిది? ప్రేమరసాయనం తాగి మత్తెక్కాక మరి ఇంక నేతనేసేదెవ్వరు?
చెయ్యి తిరిగిన నేతగాణ్ణని చెప్పేదానివి. ఇప్పుడు నా మగ్గం అమ్మేసాక, అమ్మా మరి ఇంక నేత నేసేదెవ్వరు?
ప్రేమరసం సోకి మగ్గానికే మత్తెక్కాక, అమ్మా, మరి ఇంక నేతనేసేదెవ్వరు?
పడుగు నాట్యమాడుతోంది, పేక నాట్యమాడుతోంది, పాతకుచ్చు కూడా నాట్యమాడుతున్నాక, అమ్మా, ఇంక నేత నేసేదెవ్వరు?
చుంచులు తాళ్ళు కొరికేసాక, మగ్గం విరిచి కబీరు పైకెక్కి కూచున్నాక, అమ్మా, మరి ఇంక నేతనేసేదెవ్వరు?
కబీరు కవితలో కూడా వాళ్ళమ్మతోటే తన అశక్తత చెప్పుకుంటున్నాడు. కాని తానింక మగ్గం దగ్గర కూచోలేకపోతున్నాడని కాదు. ఆ మగ్గాన్ని అమ్మేసాడని చెప్తున్నాడు. చుంచులు తాళ్ళు కొరికేసాయనీ, చివరికి మగ్గం విరిచి తాను దానిమీదకెక్కి కూచున్నాడనీ చెప్తున్నాడు. ఆయనతో పోలిస్తే నువ్వింకా ఎంతో సౌమ్యంగానే చెప్తున్నట్టు.
ఆయన్ని మగ్గం నుంచి పక్కకు తప్పించిన ఆ ప్రేమరసాయనం ఆయనతో తాగించింది భగవంతుడూనూ, నిన్ను మగ్గం దగ్గర కూచోకుండా చేస్తున్నది ఒక మనిషీ అని అనుకోడం కన్న పొరపాటు మరొకటి లేదు. ఎవరి వల్లనైతేనేం, మీరిద్దరూ ప్రేమలో తగులుకున్నారు.
ప్రేమలో తగులుకొన్నాక, ఇంక నేత ఎక్కడిది?
మీ ప్రేమల్లో ఒకటి దివ్యప్రేమా మరొకటి మానుష ప్రేమా అని నేను విడదీసి చూపలేను. విరహంతో అస్థిమితంగా ఎక్కడా నిలబడలేకుండా ఊరికే అటూ ఇటూ అశాంతితో తిరిగే ఒక చక్రవాకం గురించి మా ఆంధ్రకవితా పితామహుడు అల్లసాని పెద్దన్న ఒక పద్యం రాసాడు. మా మాష్టారికి ఆ పద్యమంటే ఎంతో ఇష్టం. ఆ పద్యం వినిపించేటప్పుడు ఆయన గొంతు గద్గదమైపోయేది. ‘విరహం మనుషులదైతే ఏమిటి? పక్షులదైతే ఏమిటి? విరహం విరహమే కదా’ అనేవారు.
అందుకనే శాఫో, నీ ప్రేమ స్త్రీలకి మాత్రమే పరిమితమైన ప్రేమ అని ఎవరన్నా చెప్తే నాకు ఆశ్చర్యమనిపిస్తుంది. కాదు, ఆమె స్త్రీల పట్ల ఆరాధన చూపించింది గాని, అంతకు మించి మరేమీ లేదు అని ఎవరన్నా సర్దిచెప్పబోతే కూడా ఆశ్చర్యమనిపిస్తుంది. ఒక స్త్రీ, ఒక పురుషుడు, ఒక పటం, ఒక పువ్వు, ఒక సుదూరగ్రామం- నీ మగ్గానికే మత్తెక్కేలాగా నిన్ను మంత్రించింది ఎవరైతే ఏమిటి? నువ్వట్లా మైమరచడానికి కారణం ఆఫ్రొడైటు అని చెప్పుకున్నావు. అదే కబీరైతే తన గురువు వల్ల తనకి ఆ ప్రేమరహస్యం పట్టుబడిందని చెప్తాడు. ఎవరి వల్ల నువ్వు అటుగా చూస్తున్నావన్నది ముఖ్యం కాదు, నిజానికి, ఎటు చూస్తున్నావన్నది కూడా ముఖ్యంకాదు. ముఖ్యమేమిటంటే, నువ్వింక మగ్గం దగ్గర కూచోలేకపోతున్నావు చూడు, అది. వస్తువులు కాదు, సంపదలు కాదు, social capital గా గొప్పగా చెప్పుకునే నెట్ వర్క్ కాదు, లోకం దృష్టిలో నిన్ను అప్రయోజకుడిగా చూపించే, బికారిగా మార్చే, ఆ అత్యంత విలువైన పిలుపేదో మీరు విన్నారు. ఏదో మహదైశ్వర్యాన్ని మీరు కనుగొన్నారు. అదేమిటో నాక్కూడా తెలుస్తుందన్న ఆశతోటే నేను కూడా తక్కిన లోకాన్ని వదిలిపెట్టి మీ కవిత్వం చుట్టూ తిరుగుతున్నాను.
నేను కూడా నా తొలియవ్వనపు రోజుల్లో రాజమండ్రిలో టెలిఫోన్స్ ఆఫీసులో టెలిఫోను టిక్కెట్లు లెక్కపెట్టే ఉద్యోగం కొన్నాళ్ళు చేసాను. కాని నా దృష్టి ఆ లెడ్జర్లమీదా, ఆ బిల్లుల మీదా ఉండేది కాదు. ఆ వేళప్పుడు మా ఊళ్ళో అడవుల్లో వసంత ఋతువు వచ్చి ఉంటుందని గుర్తొచ్చేది. లేదా గోదావరి ఒడ్డున రావిచెట్టు నీడన ఆ మధ్యాహ్నవేళ పడవలు నిద్రపోతుంటాయని గుర్తొచ్చేది. మనసు వికలమైపోయేది. ఆ బల్ల దగ్గరనుంచి లేచి అలానే గోదావరి ఒడ్డుకి వెళ్ళిపోదామనిపించేది. లేదా తక్షణమే ఆ ఉద్యోగం వదిలిపెట్టి మా ఊరు వెళ్ళిపోదామనిపించేది.
కాని బతకాలి. బతకడానికి డబ్బు కావాలి. కాబట్టి ఉద్యోగం చేయాలి. అలానే గడిపేసాను నలభయ్యేళ్ళు. కాని నా ఉద్యోగం, నా జీతం, నా చాకిరీ నన్ను దేవతలనుంచి దూరంగా తీసుకువెళ్ళిపోతున్నాయన్న బెంగ మాత్రం నన్ను వదల్లేదు. వేదకాల మానవుడు ఎంత అదృష్టవంతుడు! అతడికి ఈ ప్రపంచం ఒక్కటే లోకం కాదని తెలుసు. పనికీ, పరమాత్మకీ మధ్య సన్నని సరిహద్దురేఖ గీసుకోగలిగాడతడు. పని చేయాలి. ఎందుకంటే పరమాత్మకు దగ్గరకావడానికి అనుకున్నాడు. కానీ నా పరిస్థితి వేరే. ఫైజ్ అహ్మద్ ఫైజ్ వాపోయినట్టే నాది కూడా ఇదే అనుభవం:
ప్రేమకి పని అడ్డొస్తుండేది
పనికి తరచూ ప్రేమ అడ్డుపడేది
చివరికి విసుగెత్తి వదిలిపెట్టేసాను
పనీ, ప్రేమా- రెండింటినీ
కాని నువ్వు అదృష్టవంతురాలివి, కబీరులానే. నీ మగ్గం మీద నువ్వే వస్త్రం నేసేదానివో మాకు తెలియదుగాని, ఇదుగో, అపురూపమైన ఈ ప్రేమవాక్యమైతే నేసావు. నీలాంటి వాళ్ళకి నీడనిచ్చే వాక్యం. వాళ్ళ హృదయాన్నీ, గౌరవాన్నీ కూడా కాపాడే వాక్యం. ఎవరు ముసుగులన్నీ తీసి పక్కనపెట్టేస్తారో, లోకం దృష్టిలో విలువలుగా లెక్కేసే ఆచ్ఛాదనలన్నీ చింపి పక్కన పడేస్తారో, వారికి, ఈ ఒక్క వస్త్రం చాలు. ఈ ఒక్క వాక్యం చాలు.
Featured image photography courtesy Amjad ali via pexels.com
3-5-2026


అద్భుతమైన రచన సార్
కోకిల కూతతో ప్రారంభించి ప్రేమ, పని, జీవితం మధ్య ఉన్న ఆ అంతర్గత సంఘర్షణను ఎంతో అందంగా వ్యక్తీకరించారు.
మనిషి డబ్బు కోసం పరిగెడుతూ నిజమైన ఆనందాల నుంచి ఎంత దూరమవుతున్నాడో చాలా సున్నితంగా చూపించారు.
కోకిల పాట వినగలిగే హృదయం ఉండటం ఎంత గొప్ప వరమో గుర్తు చేసినందుకు ధన్యవాదాలు సార్.
హృదయపూర్వక ధన్యవాదాలు మేడం!
శుభోదయం సర్
అద్భుతంగా ఉందండి
ప్రస్తుతం నేను ఉన్న బెంగళూరు నగరంలో కోకిల కాదు కదా కాకి అరుపు కూడా వినిపించడం లేదు. ఇది చదివిన ఈ శుభోదయము వేళ, ఈ నగరాన్ని విడిచిపెట్టి వెంటనే మా గ్రామానికి పారిపోవాలనిపిస్తోంది.మళ్ళీ మా పెరటి చెట్టు మీద వాలి,కూసే కోకిల పాట వినడానికి.
ధన్యవాదములు
హృదయపూర్వక ధన్యవాదాలు సార్!
వాళ్ల కవిత్వం గురించి మీరిలా అన్నారు గానీ
“ఏదో మహదైశ్వర్యాన్ని మీరు కనుగొన్నారు. అదేమిటో నాక్కూడా తెలుస్తుందన్న ఆశతోటే నేను కూడా తక్కిన లోకాన్ని వదిలిపెట్టి మీ కవిత్వం చుట్టూ తిరుగుతున్నాను.“
నిజానికి వాళ్ళూ మీరూ ఒకటే, సర్!
🙏🏽
ఏమని చెప్పాలి? హృదయపూర్వక ధన్యవాదాలు.