
ప్రియమైన శాఫో
నీ గాఢమైన అనుభూతి ప్రపంచంలోకి అడుగుపెట్టేముందు, నీ కావ్యప్రపంచంలో మరింత విహరించే ముందు, అందం గురించిన నిన్నటి సంభాషణ మరికొంత కొనసాగించాలనిపిస్తోంది. నీ మరో కవితా వాక్యం గురించి కొంత ఆలోచించాలనిపిస్తోంది. Fragment 50 గా మాకు లభించిన ఈ వాక్యం:
అందంగా ఉండే మనిషి చూడ్డానికి మాత్రమే అందగాడు
కాని మంచిమనిషి ఏకకాలంలోనే అందగాడూ మంచివాడూ.
ఈ వాక్యాన్ని గుర్తుపెట్టుకుంది భాషావేత్తనో, అలంకారవేత్తనో కాదు, ఒక వక్త. రెండో శతాబ్దానికి చెందిన ఒక వైద్యుడు. శారీరిక సౌందర్యం నిలిచేది కాదనీ, మానసిక సౌందర్యం మాత్రమే నిలుస్తుందనీ చెప్పడానికి సమర్థనగా నీ మాటలు వాడుకున్నాడు. శరీరాల బాగోగుల గురించి మాట్లాడే వైద్యుడు నిన్ను చదివి ఉండటం లేదా విని ఉండటమూ, నీ మాటల్ని తన శాస్త్రానికి ప్రమాణంగా వాడుకోవడమూ ఆశ్చర్యంగా ఉంది కదూ!
ఇన్ని యుగాల తరువాత, మనుషులు ఇంత తెలివి మీరిన తరువాత, ఈ వాక్యంలో నువ్వు కొత్తగా చెప్తున్నది ఏముంది అనవచ్చు. సాధారణంగా ప్రతి ఒక్కరూ, ఏదో ఒక సందర్భంలో ఈ మాటలు ఎవరో ఒకరిని తక్కువ చేయడానికో, ఎక్కువ చేయడానికో వాడుతూనే ఉంటారు. కానీ, నీ వాక్యాన్ని ఒక వైద్యుడు ఇలా ప్రత్యేకంగా ఎత్తి చూపాక, ఇది నాలో కొత్త ఆలోచనలు కలగచేస్తోంది. ఇక్కడ కొంతసేపు ఆగాలనిపిస్తోంది.
నువ్వు ఈ వాక్యంలో రెండు అంశాల్ని స్పృశిస్తున్నావు, ఒకటి అందం, గ్రీకులో kalos, రెండోది మంచితనం. గ్రీకులో, agathos, రెండూ కలిపి kalaokagathia అనే భావన. కాని నీకన్నా ముందు హోమర్, హెసియోద్ లాంటి పురాణ కవులూ, నీ తర్వాత ప్లేటో, అరిస్టాటిల్ లాంటి తత్త్వవేత్తలూ ఈ భావనని ఎలా సమీపించారా అని చూసాను. ఎందుకంటే నీకన్నా ముందుది ఐతిహాసిక యుగం. అక్కడ ఈ భావనకి ఒక epic standard స్థిరపడిపోయింది. దాని ప్రకారం ఎవరు శారీరికంగా బలిష్ఠుడో అతడే అత్యంత సుందరుడు కూడా. శారీరిక దారుఢ్యమే స్ఫురద్రూపాన్నిస్తుందనేది ఒక్క గ్రీసులోనే కాదు, పూర్వకాలాల్లో, ప్రపంచమంతా నమ్మినమాట.
ఉదాహరణకి, ఇలియడ్ లో అకిలిస్ గురించి వర్ణించేటప్పుడు, ముఖ్యంగా పద్ధెనిమిదో సర్గలో, హోమర్ పదేపదే చెప్పేమాట, అతడు భాసమానుడిగా ఉన్నాడని.ఆ radiance ని వర్ణించడానికి అతడు పదే పదే అగ్నిప్రతీకలు వాడతాడు. హోమర్ దృష్టిలో అత్యంత సమర్థుడైన యోధుడే అత్యంత సుందరుడైన పురుషుడు కూడా. ఈ వాక్యాలు చూడు (tr. Robert Fitzgerald):
Imagine how the pyre of a burning town
Will tower to heaven and be seen for miles
From the island under attack, while all day long
Outside the town, in brutal combat, pikemen
Suffer the war-god’s winnowing, at sundown
Flare on flare is lit, the signal fires
Shoot up for other islanders to see,
That some relieving force in ships may come:
Just so the baleful radiance from Achilles
Lit the sky.
అలానే మూడో సర్గలో హెలెన్ గురించి పెద్దవాళ్ళు గుసగుసలాడుకుంటున్నప్పుడు, ఆమె దేవతలాగా ఉందని చెప్పుకుంటారు. చూడు:
-so droned and murmured these
Old leaders of the Trojans on the tower,
And watching Helen as she climbed the stair
‘We cannot rage at her, it is no wonder
That Trojans and Achaeans under arms
Should long have borne the pains of war
For one like this.
‘Unearthliness. A goddess
the woman to look at.’
కవి ఆమె అందమైంది అని చెప్పవచ్చు. చెప్తున్నాడు కూడా. కాని ఆమె దేవతలాగా ఉందని చెప్పడం చూడాలి. అలానే ఒడెస్సీలో పెనెలోప్ ని ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్న ఒడెస్యూస్ కి ఎథీనా దేవత ఒక వినూత్న సౌందర్యాన్ని అనుగ్రహించిందని చెప్తాడు. ఇలియడ్ ప్రకారం ఒడెస్యూస్ చతురుడు మాత్రమే. కాని ఒడెస్సీకి వచ్చేటప్పటికి అతడికొక కొత్త సౌందర్యం కూడా సమకూరుస్తాడు కవి. ఈ పోలికలు, ఈ వర్ణనలన్నీ చెప్పేదొకటే, ఎవరు బలవంతుడో అతడే అందగాడు.
నేను నీకు రాసిన మొదటి ఉత్తరంలో రాసిన మాటలే ఇప్పుడూ రాయాలి. అదేమంటే, నువ్వొక పౌరాణిక యుగ ప్రమాణాల్ని పరాస్తం చేసేసావు. ఈ ఐతిహాసిక ప్రమాణాల్ని నీ మానవీయ గీతంతో పక్కకు నెట్టేసావు. రూపసౌందర్యం మీద ఆధారపడ్డ అందం చూసినంతసేపే అందమనీ, కానీ మంచితనం మీద ఆధారపడ్డ అందం కాలాంతరంలో కూడా నిలబడుతుందనీ అనడం, ఈ నేపథ్యంలో చూసినప్పుడు, చిన్నమాట కాదు.
హోమరీయ తర్కం ఇలా ఉంది: ‘నువ్వు రాజువా, అయితే నువ్వు అందగాడివి, కాబట్టి నువ్వు మంచివాడివి’. కానీ నువ్వు చెప్తున్నదేమిటి? ‘నువ్వు అందగాడివా? ఆ అందం నీ దేహదారుఢ్యం మీద నిలబడుతోందా? అయితే అది మూణ్ణాళ్ళ ముచ్చట మాత్రమే. అది కూడా చూపులెంతవరకూ పోగలవో ఆ మేరకు మాత్రమే నువ్వు అందగాడివి. నువ్వు స్వతహాగా మంచివాడివా? అయితే, ఈరోజు కాకపోయినా రేపైనా నువ్వు అందగాడివి కాగలవు’.
నువ్విక్కడ, అందాన్ని రాజకీయ ప్రాబల్యం నుండి, భౌతిక క్షేత్రం నుండి, అధికార సన్నిధినుండి బయటకు తీసుకొస్తున్నావు. దాన్ని బాహ్యప్రపంచం నుంచి అంతఃప్రపంచంలోకి తీసుకువెళ్తున్నావు. నేను రాస్తున్న ఈ వాక్యాలు చదివి, ఎవరేనా, నువ్వు మరీ ఆమెని అతిగా పొగుడుతున్నావు, రూపం ముఖ్యం కాదు, గుణం ముఖ్యం అని చెప్పడానికి రెండున్నరవేల ఏళ్ళ కిందటి ఒక వాక్యశకలం పట్టుకురావాలా, మరీ విడ్డూరం కాకపోతే అనవచ్చు.
కానీ విడ్డూరం అందులో లేదు. ఇది చాలా సార్వజనీన సత్యమన్నట్టే, ఇందులో ఏమీ కొత్తదనం లేదన్నట్టే మాట్లాడే ప్రపంచం, ఆచరణకు వచ్చేటప్పటికి, పురాణ కాలం నుంచి ఒక్క అడుగు కూడా ముందుకు వేయకపోవడం విడ్డూరం. ఎక్కడో చదివాను, ఒక అమెరికన్ ప్రొఫెసరు ఇలియడు పద్ధెనిమిదో సర్గ మీద పాఠం చెప్తూ, అకిలిస్ దేహదారుఢ్యాన్ని చూసి గ్రీకులు పరవశించినట్టే, ఇప్పుడు బేస్ బాల్ ఆటగాళ్ళని చూసి సమకాలిక అమెరికా పరవశిస్తూ ఉంటుందని అన్నాడట. ఆ మాట చదవగానే, నాకు క్రికెట్టు ఆటగాళ్ళు గుర్తొచ్చారు. మా దేశంలో, మా సమాజంలో, క్రికెట్టు ఆటగాళ్ళ క్రీడా సామర్థ్యాన్ని పురుష సౌందర్యానికి సమానార్థకంగా భావించడం ఒక మామూలు విషయం. ఇక్కడ తక్కిన సమాజమంతా సినిమా తారల వెనక పడుతుంది, సినిమా తారలు క్రికెట్టు ఆటగాళ్ళ వెనకపడుతుంటారు.
దేహాల పట్ల మా సమాజాలు చూపించే ఈ ఆరాధన కేవలం క్రీడాకారుల దేహాలకి మాత్రమే పరిమితం కాదు. ఉదాహరణకి, ఒక కవి లేదా పండితుడు ఒక పుస్తకం రాసాడనుకుందాం. అది సోక్రటీసుమీదనో, శంకరాచార్యుడిమీదనో రాసాడనుకుందాం. ఆ పుస్తకం ఆవిష్కరించడానికి మా హైదరాబాదులో ఒక సభ ఏర్పాటు చేసారనుకుందాం. ఆ సభకి ఒక తత్త్వశాస్త్ర ఆచార్యుణ్ణీ, ఒక సినిమానటుణ్ణీ కూడా పిలిచారనుకుందాం. ఆ సభకి హాజరైన శ్రోతలు ఆ తత్త్వశాస్త్ర ఆచార్యుడు ఏం మాట్లాడినా పట్టించుకోరు. కాని అదే ఆ సినిమానటుడు మాట్లాడుతుంటే చెప్పలేనంత పారవశ్యంతో వింటారు. ఆ నటుడికి సోక్రటీసు గురించో, శంకరాచార్యుడి గురించో కనీస పరిజ్ఞానం కూడా ఉండకపోవచ్చు. అయితే ఏమిటట? అతడు మాట్లాడుతున్నాడు. తమ కళ్ళముందు వేదిక మీద నిలువెత్తు మనిషి కనిపిస్తున్నాడు. ఎంతసేపూ తాము తెరమీద మాత్రమే చూడ్డానికి నోచుకున్న విగ్రహం, సజీవమానవదేహంతో, తమ ముందు కనిపిస్తున్నది. అతడి నీడ కూడా వేదిక మీద పడుతున్నది. అది చాలు. ఆ మర్నాడు పత్రికల్లో, ఆ సినిమానటుడు సోక్రటీసుగురించో, శంకరాచార్యుడి గురించో ఎన్నో కొత్త విషయాలు చెప్పాడని ప్రముఖంగా వార్త వస్తుంది. అంటే ఏమిటి? హోమర్ తర్కానికి, ఇది నువ్వు కూడా ఊహించలేని, కొనసాగింపు. హోమర్ ఏమన్నాడు? ‘నువ్వు రాజువా? వీరుడివా? అయితే నువ్వు అందగాడివి, కాబట్టి మంచివాడివి’. మా సమాజమూ, మా పత్రికలూ ఏమంటున్నాయి? ‘నీ ముఖం రోజూ తెరమీద కనిపిస్తోందా? అయితే నువ్వు అందగాడివి కాబట్టి నువ్వు తెలివైనవాడివి, కాబట్టి మంచివాడివి, కాబట్టి మొత్తం సమాజమంతా కూడా నీ మాటలు వినితీరాలి.’
రూపం ముఖ్యంకాదు, గుణం ముఖ్యమంటారే గాని, అలా గుణానికి విలువనిచ్చే ఊరు, నగరం, సభ, సమూహం ఎక్కడున్నాయి? అలాంటి తావులుంటే చెప్పు, అక్కడే శాశ్వతంగా నా నివాసం ఏర్పరుచుకుంటాను. కాని అందం గురించి మా సమాజాలు ఏర్పరచుకున్న epic standard ఇక్కడితో ఆగిపోవడం లేదు. ఈ తర్కానికి ఇంకా కొనసాగింపు ఉంది. ‘నీ ముఖం రోజూ పత్రికల్లోనో, తెరమీదనో కనిపిస్తోందా? అయితే నువ్వు అందగాడివి, కాబట్టి తెలివైనవాడివి, కాబట్టి మంచివాడివి, కాబట్టి మమ్మల్ని పరిపాలించడానికి అన్ని విధాలా నువ్వే యోగ్యుడివి.’ ఇది హోమరీయ epic standard ని పూర్తి చేస్తోంది. హోమర్ దృష్టిలో ‘ఎవడు పరిపాలకుడో అతడే బలవంతుడు, అతడే బలవంతుడు కాబట్టి అతడే అందగాడు, కాబట్టి అతడే మంచివాడు’. ఈ తర్కం ఒక అర్థవలయం. ఇప్పుడు మా సమకాలిక సమాజం దృష్టిలో ‘అతడు అందగాడు కాబట్టి అతడే తెలివైనవాడు, కాబట్టి అతడే మంచివాడు, కాబట్టి అతడే మా పరిపాలకుడు కావాలి.’
అది epic world అయితే, మాది mock-epic world. ఇప్పటి ప్రపంచంలో జ్ఞానం, సౌందర్యం ప్రతి ఒక్కటీ ఒక commodity. వాటిని అమ్ముకోవచ్చు, కొనుక్కోవచ్చు, ప్రదర్శించవచ్చు. కానీ శాఫో నీ దృష్టిలో అందం మనిషిలోపల జరిగే ఒక అంతరంగ పరివర్తన. అచిరకాలంలోనే దాని వెలుగు, ఆ luminence లోకమంతా ప్రసరిస్తుంది. శాఫో, అందగాడి అందం కేవలం చూసినంత సేపే అందం, కాని మంచిమనిషి అందం రేపటికన్నా బయటపడేదే అన్నావే, అది ఎంత విప్లవాత్మకమైన మాటగా నాకు వినిపిస్తోందో నీకెలా చెప్పేది! ఈ వాక్యంలో మొత్తం philosophy of gaze ఉంది.
నీ వాక్యం మళ్ళీ మళ్ళీ చదువుకున్నాను:
అందంగా ఉండే మనిషి చూడ్డానికి మాత్రమే అందగాడు
కాని మంచిమనిషి ఏకకాలంలోనే అందగాడూ మంచివాడూ.
ఇది Anne Carson కి నేను చేసిన తెలుగు. కాని ఒక్కొక్క గ్రీకుపదానికీ ఇంటర్నెట్లో అర్థం చూసుకుని సరిగ్గా అనువదిస్తే, ఇలా ఉంటుంది:
చూపులు ప్రసరించినంతమేరకే అందగాడి అందం
కాని మంచిమనిషి తొందర్లోనే అందగాడు కాగలడు.
ὁ δὲ κἄγαθος αὔτικα καὶ κάλος ἔσσεται
but the man who is good will soon be beautiful as well
మంచిమనిషి కూడా తొందరలోనే అందగాడు కాగలడని అంటున్నప్పుడు నువ్వు రూపసౌందర్యం గురించి మాట్లాడటం లేదని అర్థమవుతోంది. రూపసౌందర్యాన్ని నువ్వు ముందువాక్యంలోనే తిరస్కరించావు కాబట్టి. అలాగే తొందరలోనే మంచిమనిషికి సమకూరే సౌందర్యం కూడా చూపులకి చిక్కేది కాదని కూడా అనుకోవాలి. ఎందుకంటే చూపుల్తో చూసేది చూపులకు మాత్రమే పరిమితమవుతుందనే కదా నువ్వు అంటున్నావు. కాబట్టి నీ వాక్యానికి ఇలా అర్థం చెప్పుకోవచ్చు:
అందగాడిలో నువ్వు చూసే అందం చూపులకే పరిమితం
మంచిమనిషిలో అందం ఇప్పుడు కనబడకపోయినా రేపు తెలుస్తుంది.
మంచిమనిషి తాలూకు agathos ద్వారా మనకు అనుభవంలోకి వచ్చే అతడి శ్రేష్ఠత, arete నే, నువ్వు అందమైంది అంటున్నావు. అంటే మంచితనం, సౌందర్యం ఒక్కటేనని చెప్తున్నావు. హోమర్ దృష్టిలో మనుషుల వీరత్వం, మంచితనం, సౌందర్యం ప్రతి ఒక్కటీ కూడా ఒలింపస్ పర్వతాగ్రం మీద ఉండే దేవతల అనుగ్రహం వల్లనే సిద్ధిస్తాయి. అది పౌరాణిక యుగం కాబట్టి ఆ నమ్మకాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కాని నీ తర్వాత ఏథెన్సులో వర్ధిల్లిన తత్త్వవేత్తలు మనిషి తార్కికంగా ఆలోచించడం వల్ల మాత్రమే శ్రేష్ఠత్వం సంపాదించుకోగలడన్నారు. సోఫిస్టులైతే మనిషికి తగినంత శిక్షణ ఇవ్వడం ద్వారా అతణ్ణి సమర్థుడిగా, మంచివాడిగా, అందగాడిగా తయారు చెయ్యవచ్చన్నారు. సోక్రటీసు ఒక్కడే ఈ ఆలోచనని పూర్తిగా నమ్మినట్టు కనిపించదు. కానీ ఆయనకి నువ్వు ఎదురుపడి ఉంటావనుకో, నీతో ఇలా సంభాషణ మొదలుపెట్టి ఉండేవాడు:
సోక్రటీసు: అమ్మాయీ, నువ్వు అందం గురించీ, మంచితనం గురించీ ఏదో ప్రతిపాదన చేసావని విన్నాను. ఏమిటది? ఒకసారి చెప్పు.
నువ్వు: మనిషిలో మంచితనమంటూ ఉంటే అతడు త్వరలోనే అందగాడు కూడా కాగలడు. లోపల ప్రకాశించే వెలుగు తొందరలోనే దీపాన్ని దాటి బయటకు ప్రసరిస్తుంది.
సోక్రటీసు: భేషైన మాట. కానీ, అమ్మాయీ, ఈ ప్రతిపాదనని కొంత తరిచి చూడాలి. ఇదిగో. ఈ పక్కన నిలబడి మాట్లాడుకుందాం. నువ్వు చెప్పిందాంట్లో నాకో సందేహం: ఒక వడ్రంగి ఉన్నాడనుకో, కుర్చీలూ, బల్లలూ తయారు చేస్తున్నప్పుడు అతడు వాటిని ‘మంచి’ గా చెయ్యడం మీద దృష్టిపెట్టాడనుకో- అప్పుడు అతడి నైపుణ్యంలో శ్రేష్ఠతవల్ల ఆ కుర్చీలూ, బల్లలూ బాగా కనిపించడం మొదలు పెడతాయి, ఒప్పుకుంటాను, కాని అతడు మరింత ‘అందగాడు’ అవుతాడని ఎలా అనుకోవడం? ఒకవేళ ఇది ఒంటికీ, కంటికీ సంబంధించింది కాదు, ఆత్మలో అనుష్ఠించే సౌందర్యం అంటావా, అప్పుడు దాన్ని నలుగురికీ బోధించగలమా? అలా చేస్తే, పొద్దుపొయ్యేలోపల, ఒక్క రోజులో, మొత్తం ఏథెన్సునంతటినీ సౌందర్యమయం చేసేయవచ్చుకదా!
అప్పుడు నువ్వేమంటావు? ఒకవేళ మంచితనమనేది కంటికి కనిపించేదికాదు, మనిషిలోపల ఉండేది అన్నావనుకో, అప్పుడు హోమర్ లాగా నువ్వు కూడా అదొక దైవదత్త సద్గుణమని నమ్ముతున్నట్టు. వెంటనే సోక్రటీసు మెనోని ఖండించినట్టు నిన్ను నిరుత్తరురాల్ని చేసిఉండేవాడు. అలాకాక, శిక్షణ ద్వారా మంచితనాన్ని అలవర్చగలం అన్నావనుకో, అప్పుడు, ప్రొటాగొరస్ తో వాదించినట్టే, నీతో కూడా వాదించి ఉండేవాడు.
కాని నువ్వు ఏథెన్సువాసివి కావు, లెస్బోస్ వాసివి. నీకు సోక్రటీసు తర్కంలో పడకుండా ఉండటమెలానో తెలుసు. నువ్వు సోక్రటీస్ మాటలకి చిరునవ్వి ఇలా చెప్పి ఉండేదానివి:
నువ్వు: సోక్రటీస్, మంచితనం మనిషి అంతరంగంలో నిక్షిప్తమై ఉండే అందం కాదు, అలాగని, అది నలుగురికీ, స్కూలు పెట్టి నేర్పేదీ కాదు. అగధాన్ ఇంట్లో పానగోష్ఠిలో పాల్గొన్నప్పుడు నువ్వేం చెప్పావో గుర్తులేదా? అవి నీ మాటలు కావు, డయోటిమా మాటలని కూడా నాకు గుర్తుంది. నువ్వు తర్కాన్నీ, హేతువునీ గొప్పగా చేసి వాదిస్తుంటావుగానీ, నాకు తెలీదా, నువ్వు నీ అంతఃకరణాన్నే నమ్ముతుంటావని. నీ మాటల్లో పదే పదే వినిపించే daemon, అంటే నీ మనస్సాక్షి, నీ అంతరంగ అధిదేవత, ఆమెనే కదా, నీకు మంచిచెడ్డల విచక్షణ నేర్పింది. ఆమెనే కదా, నిన్ను సత్యాన్వేషకుడిగా మార్చింది, ఆమెనే కదా, చిరునవ్వుతో నిన్ను మృత్యువుకు ఎదురేగనిచ్చింది! నేను చెప్తున్న మంచితనం, అదిగో, అది. ఆ అంతరాగ్ని. అది జ్వలిస్తూ ఉంటే, ఆ మనిషి, చూడ్డానికి ఎలాగేనా ఉణ్ణివ్వు, అంతకన్నా సుందరవర్ఛస్వి మరొకరుండరని చెప్పడానికి, ఎక్కడిదాకానో ఎందుకు, నువ్వే నా ముందున్నావు కదా, సోక్రటీస్!
అని ఉండేదానివి కదా!
ఏవో, రోజంతా, ఇలాంటి ఆలోచనలే నడుస్తుంటాయి శాఫో! నీ వాక్యాలు మననం చేసుకుంటూ ఉంటే!
28-4-2026


Another very interesting post on Sappho’s poetry, Sir, on her fragment 50.
I appreciated how you started from the epic world’s idea of beauty and then brought Sappho into it.
In that context, like you said, “ఈ నేపథ్యంలో చూసినప్పుడు, చిన్నమాట కాదు”
it really doesn’t feel like a small statement.
Shows she is a thinker and philosopher and her originality in thought is expressed. This context makes all the difference for me in understanding and appreciating the works and people from that time.
“అది epic world అయితే, మాది mock-epic world. ఇప్పటి ప్రపంచంలో జ్ఞానం, సౌందర్యం ప్రతి ఒక్కటీ ఒక commodity”
Sad but true, Sir. Even after so much philosophy and thinking over centuries, we are still stuck to those same old standards when it comes to beauty.
Really enjoyed the imagined conversation between Sappho and Socrates.
She says”నీ మాటల్లో పదే పదే వినిపించే daemon, అంటే నీ మనస్సాక్షి, నీ అంతరంగ అధిదేవత, ఆమెనే కదా, నీకు మంచిచెడ్డల విచక్షణ నేర్పింది. ఆమెనే కదా, నిన్ను సత్యాన్వేషకుడిగా మార్చింది, ఆమెనే కదా, చిరునవ్వుతో నిన్ను మృత్యువుకు ఎదురేగనిచ్చింది! నేను చెప్తున్న మంచితనం, అదిగో, అది. ఆ అంతరాగ్ని. అది జ్వలిస్తూ ఉంటే, ఆ మనిషి, చూడ్డానికి ఎలాగేనా ఉణ్ణివ్వు, అంతకన్నా సుందరవర్ఛస్వి మరొకరుండరని చెప్పడానికి, ఎక్కడిదాకానో ఎందుకు, నువ్వే నా ముందున్నావు కదా, సోక్రటీస్!”
This part where she recognizes that inner beauty in Socrates himself is really nice and this conversation between them seemed very interesting and natural too.
🙏🏽
చాలా సంతోషం మాధవీ! ఈ స్పందన కోసమే ఎదురు చూస్తూ ఉన్నాను.
కాని మంచిమనిషి ఏకకాలంలోనే అందగాడూ మంచివాడూ. ఆహా… మీలా. నమోనమః
అయ్యో! పెద్ద మాట!