
ప్రియమైన శాఫో
నిన్నంతా ఏమీ చెయ్యాలనిపించలేదు. ఒక్కొక్కరోజు అట్లా ఉంటుంది. బయట ఎండ మండుతున్నాకూడా లోపల ఏదో మబ్బుపట్టినట్టు ఉంటుంది. జీవితం పట్ల ఆసక్తి సన్నగిల్లిపొయ్యే క్షణాలు ఉంటాయి. మామూలుగా నన్ను నిరాశా, నిరాసక్తతా ఆవహించవుగాని, ఒక్కొక్కప్పుడు, ఒంట్లోంచి జీవితోత్సాహమంతా ఊడ్చేసినట్టుగా అయిపోతుంది. ఎందుకు బతకాలనిపిస్తుంది. కొందరంటారు, ఒక జీవితసత్యం తెలుసుకోడానికి బతకాలని. కొందరంటారు, అలాంటి సత్యం తెలిస్తే తృప్తిగా ఈ లోకం నుంచి వెళ్ళిపోవచ్చని. ఒకరోజు తన శిష్యులతో, కన్ ప్యూసియస్ అన్నాడట, ఆ సత్యమేదో పొద్దున్న తెలిస్తే, ఆ సాయంకాలానికల్లా ఈ లోకం నుంచి సెలవుతీసుకోవచ్చని.
కాని నేననుకుంటాను, సత్యం, శివం, సుందరం అంటామే, వాటిల్లో, ప్రాచీన కాలపు మానవుడు సత్యం గురించి ఎక్కువ ఆలోచించాడు. మధ్యయుగాల మానవులు, అంటే పారశీక కవిత్వం రాసినవాళ్ళు, రినైజాన్సు చిత్రకారులు, తాజ్ మహల్ కట్టినవాళ్ళు సౌందర్యం గురించి ఎక్కువ వెతుక్కున్నారు. ఆధునిక మానవుడి సమస్య వేరు. ఇక్కడ హితం ముఖ్యం. పరహితం, బహుజన హితం, బహుజన సుఖం- వీటికోసం ఏదైనా చేయాలనుకుంటాడని నేను ఒకప్పుడు అనుకున్నాను. కాని ఆధునిక మానవుడికి దేనిలోనూ నమ్మకం లేదు. సత్యం, సౌందర్యం సరే, హితం గురించి కూడా అతడు మాట్లాడేవన్నీ బోలుమాటలు. పైకి పరహితం గురించి మాట్లాడతాడుగానీ, ఎంతసేపూ తన హితం గురించే ఆలోచించుకుంటూ ఉంటాడు. ఒక్కటైతే అర్థమయింది నాకు, మనుషులు దేని గురించేనా ఎక్కువ మాట్లాడుతున్నారంటే, అది వాళ్ళ జీవితాల్లో లోపించినట్టు. పరహిత చింతన అరుదవుతోందికాబట్టే, ప్రతి ఒక్కరూ బిగ్గరగా, మనుషులంతా వినేలాగా పరహితం గురించి ప్రసంగిస్తూ ఉంటారు.
కాని అంతిమంగా ఈ ప్రసంగాలూ , ఈ ప్రవచనాలూ ఇవేవీ నిలబడవు. బైరాగి అన్నట్లుగా లెక్కకు వచ్చేవిక్కడ ఒక కిరణం, ఒక నవ్వు, ఒక పువ్వు. నువ్వు చూస్తున్నది సత్యమా, నువ్వు సంకల్పిస్తున్నది పదుగురికీ హితమా- ఈ ఆలోచనల్లో- ఎంతో కొంత నువ్వు నీ నుంచి విడివడి, నీవి కాని లెక్కలు తలకెత్తుకుంటావు. కాని నువ్వు పూర్తిగా నీలో, నీకై, నువ్వేగా ఉన్న క్షణాలుంటాయి, పరిపూర్ణ తన్మయక్షణాలు- అవి సత్యానికీ, లోకసంగ్రహానికీ అతీత క్షణాలు. అక్కడ నువ్వు కాక అన్య అస్తిత్వం గురించిన తలపు ఉండదు. నిజానికి నీ గురించిన స్పృహ కూడా నీకు ఉండదు. బహుశా ఆ క్షణాల్నే మనం సౌందర్యం అంటామనుకుంటాం. గొప్ప సత్యాలు మనకి ఆశ్రయమిచ్చాయని అనుకుంటున్నప్పుడు కూడా నిజానికి వాటిలోని ఆ sublime స్వరూపమే మనల్ని మననుంచి బయటకు లాగి, మనల్ని మనకి చేరువ చేసేది. మనలోని little self నుంచి కాపాడి, మనలోని higher self కు దగ్గర చేసేది.
A thing of beauty is a joy forever అని కీట్సు అన్నాడు నిజమేగాని, అందరూ Endymion కవితలోని ఆ మొదటివాక్యం దగ్గరే ఆగిపోతారు. ఆ తర్వాతి వాక్యాలు కదా, మనం నిత్యం మననం చేసుకుంటూ ఉండవలసింది. చూడు:
A thing of beauty is a joy for ever:
Its loveliness increases; it will never
Pass into nothingness; but still will keep
A bower quiet for us, and a sleep
Full of sweet dreams, and health, and quiet breathing. .
ఆ సౌందర్యం, అది a thing ఒక శకలం మాత్రమే కావొచ్చు, కానీ, అది నానాటికీ మరింత ప్రేమాన్వితంగా మారుతుందిట, దాన్ని కాలం ఎప్పటికీ చెరిపివెయ్యలేదట, అది మనకోసం ఒక చల్లనినీడ చేకూర్చడమే కాక, చెక్కుచెదరకుండా చూసుకుంటూ ఉంటుందిట. మధురస్వప్నాలతో కూడిన ఒక నిద్రని, ఒడిదుడుకుల్లేని చిత్తాన్ని అనుగ్రహిస్తుందట. అంతేనా, ఇంకా ఇలా అంటున్నాడు:
Therefore, on every morrow, are we wreathing
A flowery band to bind us to the earth,
Spite of despondence, of the inhuman dearth
Of noble natures, of the gloomy days,
Of all the unhealthy and o’er-darkened ways
Made for our searching: yes, in spite of all,
Some shape of beauty moves away the pall
From our dark spirits.
కాబట్టి ప్రతి ప్రభాతానా మనల్ని మనమీ పుడమికి కట్టిపడేసుకోడానికి ఒక పూల మాల అల్లుకుంటూ ఉంటామట. మన పరాధీనత, దైన్యం, ఈ ప్రపంచంలో సహృదయుల కొరత, దిగులుతో మబ్బుపట్టిన దినాలు- ఇంకా అలాంటివే చీకటిదారులు, అస్వస్థధోరణులు ఎన్ని ఉన్నాకానీ ఏదో ఒక సౌందర్యసాక్షాత్కారం మనల్ని మన నిరాశానిస్పృహలనుంచి బయటపడేస్తూనే ఉంటుందిట.
కీట్సు కూడా నిన్ను ప్రేమించినవాడే. మరీ ముఖ్యంగా After dark vapours have oppressed our plains అన్న కవితలో నిన్ను పసిపాప వదనమ్మీది చిరునవ్వుతో పోల్చుకున్నాడు. ఆయనకి తెలుసు. జీవితపు సమస్త ఉన్మాదాలనుంచీ, అనారోగ్యాలనుంచీ కాపాడేది మనం పట్టుకు వేలాడుతున్న సత్యాలు కాదు, లోకోద్ధారణ చేసి తీరాలన్న యాంబిషన్లు కాదు, ఆయన మాటల్లో-
Like rose-leaves with the drip of summer rains.
And calmest thoughts come round us — as, of leaves
Budding. ..
అందుకే నన్ను నిరాశ కమ్ముకున్నప్పుడు, బైరాగి అన్నట్లుగా ‘వలసిన కాలం క్షణమాత్రపు సంజవేళ. ..’ అలాంటప్పుడు రంగులు చేతుల్లోకి తీసుకుంటాను. నీటిరంగులు. ఎవరో రాసారు, తెల్లకాగితం మీద నీటితో ఒక పూతపూసి, దాన్ని నీటిరంగుతో నింపిన కుంచెతో తాకితే, నెమ్మదిగా, ఆ రంగు ఆ కాగితమ్మీద పరుచుకున్న నీటిపోగుల్లో కలిసి అల్లుకుపోతూ ఉంటే, చూడటం, దానికదే ఒక చికిత్స అని. అందుకని నిన్నంతా రంగుల్తోనే గడిపాను. పూలు, రంగురంగుల నస్టూర్షియాల్ని మళ్లా కాగితం మీద పూయించడానికి చూసాను. ఆ పూలమ్మట రంగులు దిద్దుతూ ఉంటే, ఆ రేకలమ్మట, మళ్ళా నా మనసు నెమ్మది నెమ్మదిగా విప్పారడం మొదలుపెట్టింది. బొమ్మ పూర్తయ్యేటప్పటికి నన్ను నేను కూడదీసుకోగలిగాను.

ఇదే కదా, నీ కవిత Hymn to Aphrodite in the Grove లో రాసింది! ఇంతసేపూ నేను రాసిందీ, నాకన్నా రెండువందల ఏళ్ళ కిందట కీట్సు రాసిందీ, నువ్వు ముందే రాసేసావు కదా. ఇదుగో, ఈ కవిత:
. ..
క్రీటునుంచి ఇదుగో ఈ అందమైనతోటలో
ఆరాధనాలయానికి తరలిరా
యాపిల్ చెట్ల తోపులో, ఈ అర్చావేదిక దగ్గరికి,
సాంబ్రాణి సువాసనల మధ్యకి.
యాపిల్ తరువుల్ని చుట్టి ప్రవహించే
శీతలప్రవాహపు గలగల, వెలుగు విరజిమ్మే
గులాబీలు చెంత, చెట్ల నీడల్లోంచి
నిద్ర కమ్ముకొస్తుంది.
పూలు విరబూసిన ఈ తోట చెంత
గుర్రాలు మేసినంత పచ్చిక.
వసంతకాలపు గాలుల్లోంచి
తేనె ప్రవహిస్తుంది.
. …
ఓ సింధుతీరవాసినీ, ఉత్సవసౌరభంలో
ముంచి తేల్చిన అమృతాన్ని
బంగారు పానపాత్రల్లో సున్నితంగా
నింపిపెట్టు.
ఏమి కవిత ఇది శాఫో! చూడబోతే, నువ్వు ఎండిమియాన్ లో ఆ మొదటి పంక్తుల్ని దృష్టిలో పెట్టుకునిగానీ ఈ కవిత రాసావా అని అనుమానమొస్తోంది. కీట్సు నిన్ను చదవడం కాదు, నువ్వే కీట్సుని చదివినట్టుంది. ఎందుకంటే, ఆయన రాసినట్టే, ఇది ఒక సౌందర్య శకలం, a thing of beauty! కాని ఈ కవిత నిజంగానే A bower quiet, చెక్కుచెదరని నీడ. ఈ కవిత మాకెలా దొరికిందో తెలుసునా? క్రీస్తు పూర్వం రెండో శతాబ్దిలో ఎవరో ఒక మృణ్మయ పాత్ర మీద ఈ కవిత చెక్కిపెట్టుకున్నారు. Ostracon. అంటే పగిలిపోయిన పాత్రముక్క. ఒకప్పుడు ఈజిప్టులో, గ్రీసులో, మధ్యధరా ప్రాంతమంతా, ఏదైనా రాసుకోడానికి, ఆ ముక్కల్నే కాగితాలుగా వాడుకునేవారు. అలాంటి ఒక పగిలిన కుండపెంకుమీద ఎవరో విద్యార్థి అయి ఉండవచ్చు, లేదా యాత్రీకుడు రాసిపెట్టుకున్నాడీ కవితని. అతడెవరోగానీ సౌందర్యారాధకుడని మాత్రం చెప్పగలను. నిన్న నేను అనుభవించిన మనఃస్థితి లాంటిదే అతడూ అనుభవించి ఉంటాడు. నీ కవిత, బహుశా అది అతడికి నోటికి వచ్చే ఉంటుంది, కాని తనని తాను కూడగట్టుకోడానికి, ఇలా మళ్ళా ప్రత్యక్షరం రాసిపెట్టుకుని ఉంటాడు. అప్పటికి గాని అతడి మనసు నెమ్మదించి ఉండదు. దీన్ని రాసిపెట్టుకుని అతడు ఈ లోకానికి ఎంత ఉపకారం చేసి పోయాడు. It will never pass into nothingness అని కీట్సు అన్నమాటలు ఎంత సత్యమయ్యాయి ఈ సౌందర్యశకలం విషయంలో.
రెండువేల ఏళ్ళ కిందటి ఒక పానపాత్ర శకలం మీద ఈ కవిత దొరకడం ఒక విశేషమైతే, సామాన్య శకం రెండో శతాబ్దానికి చెందిన Hermogenes of Taurus అనే గ్రీకు లాక్షణికుడు కూడా ఈ కవిత గురించి రాయడం మరో విశేషం. ఆయన తన పుస్తకం On Types of Style లో కవిత్వంలో మాధుర్యం గురించి రాస్తూ (2:4:331) ఈ కవితని ఉదాహరించాడు. ఈ కవితలో నువ్వు పొందుపరిచిన పద చిత్రం ‘యాపిల్ తరువుల్ని చుట్టి ప్రవహించే శీతలప్రవాహపు గలగల’ ఒక మాధుర్యాన్ని (glykytes) ప్రోది చేస్తున్నదన్నాడు.
మా పూర్వ సంస్కృత ఆలంకారికులు ఈ కవిత చదివిఉంటే రసానుభవం గురించి తాము చెప్తున్నదే నువ్వు కూడా చెప్తున్నావనుకునేవారు. భరతముని విభావాలన్నది వీటినే అని కూడా చెప్పి ఉండేవారు. ఆ సౌందర్య సామగ్రి- విభావాలు, అనుభావాలు, సంచారీ భావాలు- వీటిమిశ్రమంతోటే రసద్రవ్యం రూపొందుతుంది కదా అని గుర్తుచేసుకునేవారు. అందుకనే, మా భాషల్లో, ఇటువంటి అనుభూతిని వర్ణించడానికి, మా కవులకి, ఇటువంటి పదజాలమే స్ఫురిస్తుంది. అందుకనే నువ్వు ఆ యాపిల్ తోటలో ఆఫ్రొడైటుకి కట్టిన గుడి చూడగానే, నాకు బాలసరస్వతి పాడిన ఈ పాటే గుర్తొచ్చింది:
ఆ తోటలోనొకటి ఆరాధనాలయము
ఆ ఆలయములోని అందగాడెవరే
అందగాడెవరే అనే బదులు ఆ అందగత్తెవరే అంటే అది నీ కవితే అయిఉండేది. ఈ పాట రాసిన సన్యాసి రాజుగారికి నీ గురించిగానీ, నీ కవితగురించి గానీ తెలిసి ఉండదు, కానీ, ఇటువంటి రసానుభూతిమాత్రం ఆయనకి తెలుసనుకోవచ్చు, ఆ పాటకి స్వరకల్పన చేసిన రాజేశ్వరావుగారికీ, ఇక అంత మధురమంజులంగా గానం చేసిన బాలసరస్వతికీ మరింత బాగా తెలుసనుకోవచ్చు.
ఇక టాగోరునుంచి కృష్ణశాస్త్రిదాకా సౌందర్యసాక్షాత్కారం పొందిన కవులంతా గుర్తు రాకుండా ఎలా ఉంటారు! అందుకనే, నువ్వు ఆఫ్రొడైటుని Kypris అని పిలిస్తే, నాకు ‘సింధుతీరవాసినీ’ అని వినిపించింది. ఆఫ్రొడైటు సైప్రస్ ద్వీపవాసినే కదా!
మొన్న నీ మొదటి కవిత చదివినప్పుడు కూడా, నువ్వు Aphrodite అని అంటున్నప్పుడల్లా, నాకు నా మనసులో ‘ఊర్వశి’ అనే వినిపిస్తోంది. నువ్వే ఊర్వశివి, నువ్వు ప్రార్థిస్తున్న ఆఫ్రొడైటు కూడా ఊర్వశినే. ఊర్వశి అని మనసులో ఒక శబ్దం వినబడగానే, కృష్ణశాస్త్రి కవిత్వమంతా నా మనసులో తెరలు తెరలుగా కదిలిపోతుంది. కృష్ణశాస్త్రికి కూడా ఈ సంగతి తెలుసు. అందుకనే, ‘నాడు శాఫో’ అనే కవితలో, నిన్ను తలుచుకున్న వెంటనే ఊర్వశిని తలుచుకున్నాడు. తన ‘ఊర్వశి’ కావ్యం ముగిస్తూ,
ఏ విధాన సౌందర్య రసైకజీవి
నిలువ నేరుతునిట నొక్క నిముసమేని
మామకీన జీవిత శుష్కమార్గముల త్వ
దీయ పాదమంజీరముల్ మ్రోయకున్న
అని అన్నాడు. అయితే ఆ ఊర్వశి ఆయన చూసిన ఊర్వశి. ఎవరి ఊర్వశీదర్శనం వారిది. ఇప్పుడు నాకు ఊర్వశి అన్నా, ఆఫ్రొడైటు అన్నా, శాఫో అన్నా, యాపిల్ తరువుల్ని చుట్టుకుని ప్రవహించే వినబడుతున్నది.
నువ్వు నీ మొదటి కవితలో ప్రార్థించిన ఆఫ్రొడైటు దేవత, పిచుకలు పూన్చిన రథంలో అమరమందారవనం నుంచి దిగివచ్చే సర్వేశ్వర పుత్రిక. కానీ ఈ ఆఫ్రొడైటు స్నేహితురాలు. గులాబీనీడల్లో మైమరచిపోయే మృదుల. ఆ మైమరపు, ఆ koma, ఆ పవిత్ర నిద్ర, అదంతా ఒక Eleusinian Mystery, ఒక తాంత్రిక చిన్ముద్ర. కీట్సుమాటల్లో చెప్పాలంటే-
An endless fountain of immortal drink,
Pouring unto us from the heaven’s brink.
ఈ ఒక్క కవిత చాలు, కీట్సు అనుకున్నట్టుగా, to move away the pall from our dark spirits.
24-4-2026


మీ అద్భుతమైన paintings, శాఫో మాటల్లో మీరు తెలిపిన విషయాలు, సౌందర్యసాక్షాత్కారం పొందిన టాగోరు, కీట్సు, నుండి కృష్ణశాస్త్రిదాకా కవుల మాటలు చదివి ఎందుకో కమ్ముకున్న నీడలో నుండి కొంచెం వెలుతురు వైపుకి నడిచినట్లు అనిపించింది.
Those beautiful paintings were enough to brighten the day, Sappho’s words, Keats, Devulapalli, Tagore’s were all a big bonus. 🙏🏽
హృదయపూర్వక ధన్యవాదాలు మాధవీ!
మీరు కాక పోతే ఇలా ఇంకెవరు చెప్పగలరు భద్రుడు గారు. ఈ సంగతులన్నీ, ఇంత సరళంగా సవి వరంగా సూటిగా మా హృదయాలను హత్తుకునేలా. మీరు నాలాంటి పాఠకుల స్థాయిని బాగా పెంచేస్తున్నారు..
“ఏమి కవిత ఇది శాఫో! చూడబోతే, నువ్వు ఎండిమియాన్ లో ఆ మొదటి పంక్తుల్ని దృష్టిలో పెట్టుకునిగానీ ఈ కవిత రాసావా అని అనుమానమొస్తోంది. కీట్సు నిన్ను చదవడం కాదు, నువ్వే కీట్సుని చదివినట్టుంది. ఎందుకంటే, ఆయన రాసినట్టే, ఇది ఒక సౌందర్య శకలం,”
వాళ్ళది ఒక సౌందర్య శకలం కావచ్చు
మీరు శాఫో కి రాస్తున్న ఉత్తరాలు సౌందర్య సకలం.
ధన్యవాదాలు
హృదయపూర్వక ధన్యవాదాలు సార్!
అత్యద్భుతం కవీ… నమోనమః
ధన్యవాదాలు మేడం
అద్భుతం సార్. మాటల్లేవ్.
ధన్యవాదాలు సార్!
రెండున్నర సహస్రాబ్దులు పెద్ద దూరమనిపించ లేదు ఇవాళ్టి పోస్టు చదువుతుంటే . శాఫో మనం నివసించని వేరే నగరంలో ఎక్కడో ఉందన్న భావన స్ఫురింపజేయడం మీ రచనానైపుణ్యం .
హృదయపూర్వక ధన్యవాదాలు సార్!