ఈ కవి హృదయం నిర్మలం

మనిషి అంతరంగమూ, బయటి ప్రపంచమూ ఒకదానికొకటి ఎదురయ్యే చోట కవిత్వం పుడుతుంది. అదొక disruptive moment. సాధారణంగా మనిషి బాహ్య, అంతః ప్రపంచాలు సంఘర్షించుకోడంలోంచే కవిత్వం ప్రభవిస్తుందని చలంగారే అన్నారు, మహాప్రస్థానానికి యోగ్యతాపత్రమిస్తూ. ‘తనకీ, ప్రపంచానికీ సామరస్యం కుదిరిందాకా కవి చేసే అంతర్‌ బహిర్‌ యుద్ధారావమే కవిత్వం’ -ఇదీ ఆయన వాక్యం. ఇటువంటి సామరస్యం కొందరు కవులకు జీవితమంతా ప్రయత్నించినా లభ్యం కాకపోవచ్చు. కొందరికి కవిత్వం రాస్తున్న తొలిరోజుల్లోనే లభ్యం కావొచ్చు కూడా.

ఇదుగో, మీ చేతుల్లో ఎస్‌.ఎస్‌.వీరు కవిత్వం ఉంది. ఇందులో కవి బయటి ప్రపంచంలో చెట్లని, చిగుళ్ళని, మేఘాన్ని, వానని, నీడని, ఎండని- దేన్ని చూసినా కూడా వెనువెంటనే దాన్ని తన అంతరంగంతో లంకె వేసుకున్న క్షణాలే కనిపిస్తాయి. అది కూడా నిర్మలమైన అంతరంగం. ఆ నిర్మలత్వం వల్ల అతడు చూసినంతసేపూ, చూస్తున్నంతమేరా బయటి ప్రపంచం కూడా నిర్మలంగా మారిపోవడం మనం గమనిస్తాం. ఇదుగో, ఈ క్షణంలాగా-

ఆకాశం ఏడురంగుల పారాచ్యూట్‌ కట్టుకుని
మా ఊరి చెరువులో ల్యాండ్‌ అయ్యింది.

దాదాపు నూట ఇరవైకి పైగా కవితలున్న ఈ సంపుటిలో ఇలాంటి క్షణాల్ని కవితలుగా మార్చిన తావులు చాలానే కనిపిస్తాయి. మీరు పుస్తకం చదివే ముందే వాటిని మీకు రుచి చూపడం భావ్యం కాకపోయినా, కవి హృదయపు తేటదనాన్ని పరిచయం చేయడానికి తప్పట్లేదు. చూడండి:

ఇప్పటివరకూ
ఏ కొంగ రెక్కలమీద నిలబడుందో ఆకాశం
ఇపుడు నా కనురెప్పల వంతు!!

ఎండదారంతో నీడను నేసే
చెట్టవగలిగితే చాలు మనం మనిషైనట్టే

మేఘం మనసుని
తర్జుమా చేశాను…
నది అంత ప్రేమలేఖ అయ్యింది.

మేఘం – ఓ చేప పిల్ల..
నదిలో ఈదకపోతే బ్రతుకలేదు.

వసంతం రాగానే వేపకొమ్మకు
ఎన్ని వేల ముక్కుపుడకలో. ..

తుమ్మెదను పిలిచేటప్పుడు
పువ్వుకు-వేయి పుప్పొడుల పెదవులు.

ఇటువంటి ఊహలు పుట్టాలంటే ముందు నీకంటూ ఒక నిర్మలమైన అంతరంగం ఉండాలి. దానిలో బయటి ప్రపంచం మళ్ళా అంతే నిర్మలంగా ప్రతిఫలించాలి. ఆ క్షణాల్ని నువ్వు నీ బుద్ధితో ఏ మాత్రం కలవరపరచకుండా, అంతే సున్నితంగా తిరిగి అందివ్వాలి. పూలరేకల్లాంటి ఆ భావనలకి మన ఊపిరి తగిలితే కందిపోతాయనే స్పృహ ఉండాలి.

వీరూది ఇటువంటి సున్నితమైన మనస్సు అనీ, తన అంతరంగపు నైర్మల్యం పట్ల ఆయనకు అపారమైన జాగృతి ఉందనీ ఈ కవిత్వం చదివితే నాకు బోధపడిరది. అతణ్ణి తన సాధన ఇలానే కొనసాగించమనే నేను చెప్పగలిగేది. పుస్తకం పూర్తిగా చదివేక మీరు కూడా అతణ్ణుంచి మళ్ళా తొందరలోనే ఇటువంటి మరో పుస్తకం కోరుకుంటారు.


Featured image photography by Egor Kunovs via pexels.com

10-1-2026

3 Replies to “ఈ కవి హృదయం నిర్మలం”

  1. మీరు వీరు గారి అతి సుందరమైన భావ చిత్రాలు ఎన్నుకుని మాతో పంచుకున్నందుకు కృతజ్ఞతలు.

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%