చింతల చేను

తిరుపతికి చెందిన ఆర్.సి.కృష్ణస్వామి రాజు రాసిన ‘చింతల చేను’ నవలని ఈ రోజు తిరుపతిలో ఆవిష్కరించారు. ఆ నవలకు నేను రాసిన ముందుమాట ఇక్కడ మీతో పంచుకుంటున్నాను.


వ్యథార్థజీవిత యథార్థదృశ్యం

ఈ పాతిక ముప్ఫయ్యేళ్ళుగా తెలుగు కథకులు చిత్రిస్తూ వస్తున్న జీవితం మనల్ని విభ్రాంతికి లోను చేస్తున్నది. ఎంత జీవితం! ఎందరు సజీవులైన మనుషులు! కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్న ఎన్ని జీవితానుభవాలు!

ఇప్పుడు మీ చేతుల్లో ఉన్న ఈ నవలిక చూడండి. తిరుపతికి చెందిన ఆర్‌.సి. కృష్ణస్వామి రాజు రాసిన ఈ చిన్న పుస్తకంలో విస్తారమైన జీవనప్రవాహం ఎంతగా పరవళ్ళు తొక్కుతోందో చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఎందరు మనుషులు! ఎన్ని జీవితపార్శ్వాలు! ఒకరిలాగా మరొకరు కనిపించరు. ఎవరి ప్రయోజనాలు వారివి. కానీ పరస్పర విరుద్ధమైన ఆ ప్రయోజనాలు ఒకదానికొకటి తారసపడి పరస్పరం ఖండిరచుకున్న తావుల్ని పట్టుకున్నాడు రచయిత.

చూడండి. ఒక ట్రాక్టరు సెకండు హాండుదైనా సరే కొనుక్కుంటే తన ఆర్థిక పరిస్థితి బాగుపడుతుందనుకునే గుణశేఖరుడు, అతడి తల్లి నారాయణమ్మ,అతడి భార్య హైమవతి, కొడుకు బాలాజీ ముఖ్యపాత్రలు. కథ ఈ చిన్న కుటుంబం చుట్టూతానే పరిభ్రమిస్తుంది. ట్రాక్టరు కొనుక్కోడానికి అతడికి అప్పిచ్చిన సిద్ధిరాజు, అతడితో ట్రాక్టరు ఇన్సూరు చేయించాలని చూసే వెంకటముని, అతడి ట్రాక్టరుకి పని కల్పించి సొమ్ము చెల్లించిన ఏలుమలైతో పాటు, సొమ్ము సగం మాత్రమే చెల్లించిన సుబ్బరాముడితో పాటు, సొమ్ము చెల్లించలేకపోయిన నరసరాజుతో పాటు చివరికి ఎవరి కయ్యల్లో ట్రాక్టరు నడపబోయి చేయి విరగ్గొట్టుకున్నాడో ఆ తంజావూరు సుబ్రహ్మణ్యం కూడా కథకి ముఖ్యమైన పాత్రలే. కాని ఈ అయిదారుగురితోటే జీవనచలనచిత్రం పూర్తయితే ఈ కథనం ప్రత్యేకత ఏమిటి? ఈ కాలం ప్రత్యేకత ఏమిటి?

అందుకని మనకి ఒక ఊరేగింపులాగా పాత్రల ప్రవాహం ఎదురవుతూనే ఉంటుంది. టీ అంగడి నడుపుకునే మీనాక్షయ్య, ‘తలపాగా చుట్టి పూసల దండలు మెడలో వేసి రంగురంగుల బొట్లు నుడిటిన పెట్టి పట్టువస్త్రం మెడకు చుట్టిన జోస్యగాడూ,’ ‘దానిమీద పాలు పోసి పాలు ఎత్తుకునేంత శుభ్రంగా ఉన్న తెల్లరంగు పాతమారుతి కారు’ లోంచి దిగే రంగమామ, బైకుకి ట్రాలీ లాంటిది తగిలించి ఆటోలా నడిపే బాలచంద్రుడు, కుప్పంలో తెలుగు పండిట్‌ ట్రైనింగ్‌ కోర్సు చేసి కవిత్వం రాస్తూ, కవిత్వం పుస్తకాలు వేసి ఉచితంగా పంచిపెట్టే నీలిరాజు, మద్రాసులో దంతవైద్యం కోర్సు చేస్తూ సొంత వూరు వచ్చినప్పుడు స్కూటీలో తిరిగే మిసిమి, మరాఠీ గేటు దగ్గర ఉండే స్పిన్నింగుమిల్లులో పనిచేస్తూ నాలుగు నెలలుగా సమ్మె చేస్తున్న కార్మికులూ, పనికి వెనకాడకపోయినా తన తాగుడు, గుట్కాల వల్ల పనిలో నిలబడలేకపోయిన కన్నదాసన్‌, ట్రాక్టర్‌ డ్రైవరుగా చేరడానికి వచ్చి బండి నడపలేక పారిపోయిన కడపజిల్లా సుండుపల్లికి చెందిన కోటిరెడ్డి, కర్నూలు జిల్లా దేవనకొండ మండలంలో ఉల్లి సాగుచేస్తూ నష్టపోయిన రైతు దంపతులు, పుత్తూరు డాక్టరుదగ్గరికి వచ్చి డబ్బులివ్వకుండానే ఘరానాగా కారులో వెళ్ళిపోయే టీవీ యాంకరూ, ఆమె భర్తా – ఇలా కనిపించే ఈ మనుషులందరూ కథలో ప్రధానపాత్ర అయిన గుణశేఖరుడి జీవితకథని తమ తమ అనుభవాల్తో పూరిస్తూ కనబడతారు.

వ్యవసాయం, దుక్కులు, అప్పులు, వడ్డీలు, అడ్వాన్సులు, చెల్లింపులు, బకాయిలు మాత్రమే ఉండీ ఉంటే ఈ కథ పూర్తికాదని రచయితకి తెలుసు. అందుకని మన గ్రామాల్లోకి ప్రవేశిస్తున్న సరికొత్త శక్తులు, సరికొత్త కల్పనలు, సరికొత్త భావనల్ని కూడా ఈ కథలో ప్రవేశపెడతాడు. అర్ధరాత్రి పూసే బ్రహ్మకమలం, పశువులకు ఇస్తున్న గోధార్‌, ‘హాట్‌సూపు లాఫింగ్‌’, ‘లాఫింగ్‌ బుద్ధా’, మనీప్లాంట్‌ లాంటివి కూడా వాటంతట అవే ఈ జీవితం మధ్యకి నడుచుకుంటూ వచ్చేసి కనిపిస్తాయి!

ఈ కథలో పాత్రలు వట్టి ఊహల్లాగా కనిపించరు. రక్తమాంసాలున్న నిలువెత్తు మనుషులు వాళ్ళు. వాళ్ళని చిత్రించేటప్పుడు రచయిత ఇచ్చే ఆ వివరాలు ఈ కథకి విశ్వసనీయతని సమకూరుస్తున్నాయి. చివరికి జోస్యగాడి దగ్గర ఉండే ఎలుక కూడా ‘రంగుల చొక్కా, తళుక్కుతళుక్కున మెరిసే నిక్కరు, కాలికి గజ్జెలు, మెడలో రోల్డ్‌ గోల్డ్‌ చైనుతో’ సాక్షాత్కరిస్తుంది.

ఈ నవల నేను పట్టలేనంత భయంతో, ఉత్కంఠతో, ఆదుర్దాతో చదివాను. ఆ ట్రాక్టరుకి ఏమవుతుందో, ఆ కుటుంబానికేమవుతుందో అని. కాని ఇదివట్టి కథ కాదు. వ్యథార్థజీవిత యథార్థదృశ్యం.

11-1-2026

One Reply to “”

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%