నన్ను వెన్నాడే కథలు-17

నన్ను వెన్నాడే కథల గురించి పరిచయం చేద్దామనుకున్నప్పుడు నాకు మొదట గుర్తొచ్చింది ‘మొహంలేని సాయంకాలం’ కథ. సాహిత్య అకాడెమీ ప్రచురించిన ‘మరాఠీ కథాసంగ్రహం’ (1981)లో ఈ కథ మొదటిసారి చదివినప్పుడు నాకు కథానిక ప్రక్రియనీ, నా అవగాహననీ కూడా అప్పటిదాకా ఇరుగ్గా ఉన్న చట్రం నుంచి ఒక్కసారిగా బయటపడేసినట్టుగా అనిపించింది. బైరాగి రాసిన ‘ఒక గంట జీవితం’, త్రిపుర ‘భగవంతం కోసం’ చదివినప్పుడు కూడా నాకు ఇటువంటి భావననే కలిగింది.

ఈ కథ చదివినప్పటికి నేను ముంబై ఎలా ఉంటుందో చూడలేదు. కాని అప్పటికే మజ్రూ సుల్తాన్ పురీ రాసిన ‘యే దిల్ హై ముష్కిల్ జీనా యహాఁ, జరా హట్ కే, జరా బచ్ కే, యే హై బాంబే మేరీ జాఁ’ అనే పాట ఎన్నోసార్లు విని ఉన్నాను. ఆ పాటలో కవి వర్ణించిన బాంబేకి ఈ కథలో కనిపించే బాంబే పూర్తిగా సరిపోయింది. ఆ తర్వాత 1997 లో మొదటిసారి ముంబైలో అడుగుపెట్టినప్పుడు చేసిన ట్రాము ప్రయాణంలో ముంబైని కళ్ళారా చూసాను. మొహంలేని సాయంకాలం ఎలా ఉంటుందో ఆ రోజు నాకు పూర్తిగా బోధపడింది.

గంగాధర్ గోపాల్ గాడ్గిల్ (1923-2008) మరాఠీ సాహిత్యాన్ని కొత్తపుంతలు తొక్కించాడు. పూర్తి ప్రయోగశీల రచయిత. ‘మరాఠీ కథాసంగ్రహం’ సంపాదకుడు అచ్యుత కేశవ్ భాగవత్ తన ముందుమాటలో ఒక్క గాడ్గిల్ మీదనే నాలుగు పేజీల పరిచయం రాసాడంటే అర్థం చేసుకోవచ్చు. అప్పట్లో నాకు తెలియలేదుగానీ, ఆస్ట్రియను రచయిత రాబర్ట్ ముసిల్ రాసిన The Man Without Qualities(1930-43)నుంచి ఈ కథకి స్ఫూర్తి లభించి ఉండవచ్చునా అని ఇప్పుడు అనిపిస్తున్నది. ఈ కథ ఇంగ్లిషులోకి కూడా అనువాదమై, A Faceless Evening and Other Stories (2017) పేరిట పుస్తకంగా వెలువడింది కూడా.


మొహంలేని సాయంకాలం

మరాఠీ మూలం: గంగాధర్ గాడ్గిల్

తెలుగు అనువాదం: సోమంచి యజ్ఞన్న శాస్త్రి

మామూలు ప్రకారం ఆ సాయంకాలం విచారంతో కుంగిపోయివుంది. దాని బూడిదరంగు జుట్టుమీద సూర్యకిరణాలధూళి పడింది. ఆ సాయం కాలానికి మొహం లేదు. నిజంగా ఎంత భయంకరమైనవిషయం, మొహం లేని సాయంకాలం.

కాని ఎవరూ ఏమీ పట్టించుకోడంలేదు. మెల్లిగా మెల్లిగా అడుగు లేసుకుంటూ, దారి దాటుకుంటూ ఇంటికి వెళుతున్నాను. ఇతర ఆసంఖ్యాక పాదచారులూ ఆపనే చేస్తున్నారు. ఎంత తమాషా! వాళ్లలో ఎవరిముఖం మీదా చిరునవ్వైనా లేదు.

విక్టోరియాబండి గుర్రండెక్క రోడ్డుకి తగిలి, నిప్పురవ్వలు పుట్టు కొస్తున్నాయి, ఎర్ర ఎర్రగా, పచ్చపచ్చగా, నిప్పురవ్వ ఓక్షణం కనిపించి, అదృశ్యమైపోతుంది. ని ప్పురవ్వబతుకే ఒక్క సెకండు, కాలప్రవాహంలో అది ఒక రేణువు. ప్రకాశ ప్రవాహంలోకూడా ఒక రేణువే సకృత్తుగా రెండూ కలుసుకున్నాయి. ఆ రేణువు ఓ క్షణం ప్రవేశించి, కనుమరుగై పోయింది.

కళ్లు మిరుమిట్లుగొలిపే ప్రకాశవంతమైన అక్షరాలు. ఒక్కలైనులో నించున్నాయి. కొన్ని అక్షరాలు ఒంటిపిల్లి రాకాసులు. మరికొన్ని, ఇంకో అక్షరంతో కలిసి పెనవేసుకుపోయాయి. కొన్ని వొట్టి తలకట్టు అక్షరాలు. కొన్ని అక్షరాలకి గుడులు, గుడిలో దీర్ఘాలు వున్నాయి. అక్షరాలకీ, అక్షరాల అర్థానికీ సమన్వయం కుదిరించడానికి ప్రయత్నం, వీటిని చూడడానికి వొచ్చిన జనసమ్మర్దం. ఓ శిశువు చేతిలో వాళ్లమ్మ ఓ అణాకాసు పెట్టింది. ఆ శిశువు తన బుల్లి వేళ్ల మధ్య ఆ అణా పట్టుకుంది. ఆశ్చర్యంతో, అసనమ్మకంతో ఆ అణాకాసుకేసి చూస్తోంది ఆ శిశువు. మెరుస్తున్న అణా తనచేతిలో నిజంగా వుందో లేదో చూసుకోడానికో అన్నట్టు, ఆ ఆణాకాసుని అటూ యిటూ ఆడించి చూసింది. ఆ పైన నోరంతావిప్పి బోసినోటితో నవ్వింది. ఆ నవ్వు బరువువల్ల మెడ వొరిగిపోయింది. కళ్లు, మొహం ముడతలలో చిక్కుకుపోయాయి. కళ్లు వున్నాయా, లేదా, అనిపించింది. పెదవులు చివరనించి చొంగధార. ఆకస్మాత్తుగా అణా కేసి చూడడం మానేసి, ఆ కళ్లు చెదిరే రంగురంగుల పోస్టరుకేసి చూపింది.

పోస్టరుమీద ప్రజల అభిమాననటి శాశ్వతంగా నవ్వుతోంది. కోటి డాలర్ల విలువైన నవ్వు, రోడ్డుమీద పరుగెడుతున్న కార్ల చప్పుడు శాంతతని కొరుక తోంది; చెపుల్లో గింగురుమంటోంది. యూనిఫారమ్ దుస్తులు ధరించిన డ్రైవరు, వెనకసీటులో చేతనంలేని, ఎర్ర పెదవుల, ప్లాస్టిక్ బొమ్మలాటి ఆడావిడ వీపులో ఎముకలేని అధికారి. యవ్వనంలో ములిగిపోయిన పొడుగాటి జుట్టుయువకుడు. అన్ని కారులూ అరుస్తున్నాయి. ‘పక్కకి తప్పుకోండి’ హెచ్చరికలకి విరామంలేదు. ఒక హెచ్చరికకి మరో హెచ్చరికకీ తేడాలేదు!

యూనిఫారమ్ వేసుకున్న డ్రైవరు, ప్లాస్టిక్ యువతి ఒకే రకమైన గొంతుకతో, భాషలో, మాట్లాడుతున్నారు. ఎప్పుడూ నోరెత్తని మైనం మనిషి, ఇప్పుడు మాత్రం జోరుగా ధాటిగా మాట్లాడుతున్నాడు. దానిని చూసి ఎవరికీ ఆశ్చర్యం వెయ్యడంలేదు. ఎవరికీ భీతిపుట్టడంలేదు.

దారి పక్కన దుకాణంవించి లౌడుస్పీకరు ఏదో పాట కక్కుతోంది. ఆ లౌడుస్పీకరు నోరు ఎప్పుడూ తెరుచుకునే వుంటుంది. ఆ లౌడుస్పీకరుకి నోరేకాని మొహంలేదు. నోరు కదపకుండా సంగీతం కక్కేస్తోంది. ఆ పాట వినడానికి గుమిగూడిన ఓ చిన్నగుంపు. ఆ గుంపు పాటని కడుపునిండా మింగుతోంది. మూడు నిమిషాలభక్తి. మూడు నిమిషాలప్రేమ. మూడు నిమిషాల విరహం. వేలంపాట ప్రతివస్తువూ మూడణాలు మాత్రం. కంపెనీ దివాళ తీసింది. వేలం మూడణాలు. దివాళాకోరు కంపెనీ, ఏమిటి ఈ కంపెనీ. యూనివర్సల్ ఎంటర్ ప్రైజ్ లిమిటెడ్. ‘లిమిటెడ్’ జ్ఞాపకముంచుకోండి.

ఆ ధ్వని అంతా, ఇంకో ధ్వనిలో మునిగిపోయింది. ఒక మోటారుకి చుట్టూ బోర్డులు. మెల్లిగా వెళుతోంది. ‘కొరియాలో శాంతి శాంతికోసం వినతి’ నాలుగు వైపులా ఫిరంగులలా అమర్చిన లౌడ్ స్పీకర్ల లోనించి ఒకటే అరపులు. ఆ యంత్రాలలోంచి బయటపడిన ఆ యాంత్రిక గొంతుక ఒకే విధంగా ఆరుస్తోంది. ‘కొరియాలో శాంతి, శాంతి, శాంతి.’ ఎదుటనించి వొస్తున్న ఓ మనిషి నన్ను చూసి నవ్వాడు. నేనతన్ని ఎరుగుదును. ఆ నవ్వు చూశాను. కాని వినపడలేదు. ‘శాంతి శాంతి’ నేనూ నవ్వాను. నా నవ్వు అతనూ వినలేదు. ఆతని పెదవులు కదులుతూ కనిపించాయి. నేనూ నా పెదవులు కదిపాను. అతను మళ్ళీ పెదవులు కదిపాడు. మా మాటలు రణ గొణధ్వనిలో ఎక్కడో అంతర్ధానమయి పోయాయి. మా నోటిమాటలకి, ఆ శబ్దప్రపంచంలో చోటులేకపోయింది. ఇక ముందు బహుశా, ఎక్కడా చోటు దొరకదేమో కూడాను. మేము నిశ్శబ్దంగా నవ్వుతూ గుద్ బై చెప్పుకున్నాము. saదా పూర్తిగా తెరుచుకున్న నోటితో, లౌద్ స్పీకరు అరుస్తోంది. ఆ ఆరుస్తున్న శాంతత నా దగ్గిరనించి దూరమైపోయింది. ఆ చప్పుడుతో గింగురుమనిపోయిన నా చెవి మళ్ళీ వినడం ప్రారంభించింది. కళ్లు మళ్ళీ చూడడం ప్రారంభించాయి. అడుగులేసుకుంటూ, రోడ్డు దాటుకుంటూ మనుష్యులు ముందుకి సాగిపోతున్నారు. అందరూ ఒక్క విధంగానే కనిపిస్తున్నారు. రోడ్డు మలుపులో ఓ టంకశాల వుండి వుండాలి. ఆ టంక శాలలో ముద్రణ అయి, ఈ మనుష్యులందరూ బయటపడివుండాలి. తమ అభిమాన నటుడిలాగే, జుట్టు దువ్వుకున్నారు. మొహంమీద ఏ భావమూ కనిపించదు. మొహాలు నున్నగా వున్నాయి: భావనలు, ఉద్రేకాలూ అవీ నున్నగానే వుండివుండాలి. అందరి ఆడవాళ్ళ మొహాలమీదా, చిన్న పిల్లల అమాయకత్వం, నెత్తిమీద టోపీలా కూర్చుంది. అందరి మొహాలూ, చిన్న పిల్ల మొహాలే! ఫిల్మీపిల్లలు. ఫిలుములు రూపొందించిన మనుషులు. ఈ ‘పిల్లల’ నిర్మాతలు, తమ ఫిలుములలో ఉపయోగించిన నటీనటులు ఓ పైన పెట్టిన పోస్టరుమీదనించి, విజయగర్వంతో నవ్వుతున్నారు. మిలియన్ డాలర్ల నవ్వులు, లక్షల రూపాయల కిమ్మతైన నవ్వు. లక్షల మనుష్యుల నవ్వు. ఇరవై ముప్ఫయిమంది నటీనటులకి ఇంతమంది పిల్లలా కాదు. కాని ఇది శక్యమే. శాస్త్ర పరిశోధనలు, ఇంకా చాలా విషయాలు శక్యంచేశాయి. తెలియని మనిషినించి, వారివురు సంయోగమూ కలగకుండానే ఒక స్త్రీకి గర్భం కలగవచ్చును. పురుషుని రేతస్సు కొన్ని సంవత్సరాలు భద్రంగా దాచవొచ్చును. ఇంకో యాభయి సంవత్సరాల తరవాత పుట్టబోయేవాడి తండ్రి ఎప్పుడోపోయిన హిట్లరయి వుండొచ్చును. శాస్త్రం ఉపయోగించి, ఇప్పుడు పుట్టబోయే పిల్లలస్వభావం మార్చేసెయ్యవొచ్చును.

‘కొత్తఢిల్లీ. మే పందొమ్మిదోతారీకు, 1991 శాస్త్రీయపద్ధతిని పిల్లలని పుట్టించే కార్ఖానా ఉద్ఘాటన ప్రైమ్ మినిస్టరుగారి హస్తాలలో, చాలా ధూంధాంగా జరిగింది. కార్ఖానాలో తయారయిన ప్రథమ సంతానాన్ని ప్రైమ్ మినిస్టరుగారికి అర్పణచేశారు. ప్రైమ్ మినిస్టరుగారి కోరిక ననుసరించి, ఆ శిశువు తీవ్ర దేశభక్తి కలిగివుండే శిశువుగా తయారు చెయ్యాలని ప్రణాళిక తయారు చేశారు.

ప్రైమ్ మినిస్టరుగారు ఆ కార్ఖానా, ఉద్ఘాటనచేస్తూ అన్నారు. ‘ప్రగతి మార్గంలో ఇది మరో ముందడుగు, అందుచేత దేశ జీవనం ప్లాను చేసే విషయంలో ఓ గొప్ప అవరోధం తొలగిపోయిందని విశ్వసిస్తున్నాను.’

మా ప్రత్యేక విలేఖరి ఇలా తెలియజేస్తున్నాడు. కోరినట్టు కలలు కలిగించే మాత్రలు తయారుచెయ్యడంలో ఇప్పుడు పరిశోధకులు ఫలితం సాధించారు. త్వరలోనే ఆ మాత్రలు వ్యాపార పద్ధతిని, ఉత్పత్తిచేసే అవకాశముంది. భీతి పుట్టించే స్వప్నాలు కలిగించగలిగిన నల్లటి మాత్రలకి కూడా చాలా గిరాకీ వుంటుందని, తెలిసినవారు అనుకున్నారు. షేక్స్పియర్ మహాశయుడు అన్నాడు . ‘Life is a tale told by an idiot signifying nothing’. ఏం మూర్ఖుడు.

మొహం లేని సాయంకాలం నవ్విందా: ఏడిచిందా: లేదు. మొహం లేని కాదు . .. మొగపిల్లాడిలాటి మొహంవున్న ఆడపిల్ల నవ్వింది. నవ్వుతూ నాకేసి చూస్తోంది. నేను కూడా, తెలివొచ్చి, ఆ అమ్మాయికేసి చూశాను. ఆ అమ్మాయి అంది. ‘ఇస్సు! ఎటు చూస్తున్నారయ్యా!’

ఆటోమాటిక్ గా పర్సు తెరిచింది. రుమాలు పైకి తీసింది. పర్సు మూసింది. రుమాలుతో మొహం తుడుచుకుంది. మళ్లీ పర్సు తెరిచింది . ..

నే అన్నాను. ‘ఏదో ఆలోచనలో నిమగ్నుడనై వున్నాము.’ ఆ అమ్మాయి కళ్లు మూసి, తెరుస్తూ అంది. ‘ఆలోచనలా: ఎవరిని గురించి’ చెంగు సవరించుకుంది. కాళ్ళు కదిపింది. నే నవ్వాను. ఆ అమ్మాయీ నవ్వింది.

ఆ అమ్మాయి అడిగింది. ‘ఫలాని పిక్చరు చూశారా!’ ఈసమయాన, కళ్లు, కిందకిదింపి చూడ్డానికి ప్రయత్నించింది. ఈ చూపు కొత్తగా నేర్చుకుంటున్నట్టుంది.

నే అడిగాను, ‘రేపు మాచ్ చూస్తున్నారా’ మేం ఒకరి కొకరం గుడ్ బై చెప్పుకున్నాము. ఆమనిషి, తన వ్యక్తిత్వపు మూడునిమిషాల రికార్డు వాయించి, ముందుకి సాగింది. ముందుకి వెళ్ళినతరవాత మళ్ళీ ఆ రికార్డు మొదటినించీ పెట్టిందో ఏమిటో. పర్సు తెరిచివుంటుంది. రుమాలా తీసివుంటుంది. పర్సు మళ్ళీ మూసేసే వుంటుంది. .. ప్రతియింట్లోనూ, మోగుతున్న రికార్డు, మూడు నిమిషాల రికార్డు. తూతూలమ్మా, తూతూలు. బాకాలమ్మా, బాకాలు, తెస్తాడమ్మా, మాబావ. .. అడ్డుకుపోయింది. అక్కడే ఆ రికార్డు, ఆ పాటలో ఇంకేముందో తెలీదు. అదే అదే అంటోంది ఆ రికార్డు. ఆ మాటలే మళ్ళీ మళ్ళీ వొస్తున్నాయి. మోటారు బ్రేకు కర్కశంగా శబ్దం చేసింది. ఒక భయానకమైన కేక వినిపించింది. మనుష్యులు ఒక పెద్ద గుంపుగా పరుగెత్తారు. మనుష్యులగుంపు చుట్టు ముట్టేసింది. ఓ మనిషి చచ్చిపోయాడు. కుతూహలంతో అందరు మనుష్యులూ చూస్తున్నారు. ప్రతి మనిషి కళ్ళల్లోనూ కనిపిస్తోంది కుతూహలం. తెగిపోయిన కాలు చూడాలని అందరూ ప్రయత్నిస్తున్నారు. అతని మొహాన్నిబట్టి, జేబులోవున్న కాగి తాలనిబట్టి, అతనెవరో తెలుసుకోవాలి!

ఆ మనుష్యులు నిర్దయులనికాదు. ఆ మనిషి బతికేవుంటె, అతవి నోట్లో, ఎవరైనా కాసినినీళ్లు పోసేవుందురు. అంబ్యులెన్సు పిలిచివుందురు. కాని ఇప్పుడు…. అతనెవరో తెలుసుకోవాలన్న కుతూహలం మాత్రమే వుంది. ఆ కుతూహలంలో, దయాదాక్షిణ్యాలు లేవు. క్రూరత్వముంది. నిజానికి రకరకాల, పరస్పర విరుద్ధాలయిన ప్రవృత్తులున్నాయి. భావనలు, ఉద్రేకాలూ వున్నాయి.

సినీమా చూస్తూ, జార్జెట్ చీర కట్టుకున్ననటికి ప్రేమభంగమయినప్పుడు నీళ్ళు కార్చేవుందురు. దేశభక్తుడి ఉపన్యాసం విని ఉద్రేకంతో యుద్ధానికి తయారయివుందురు. పోలీసు చేతిలో దుడ్డుకర్ర చూపి పరుగెత్తుకు పోయీవుందురు. తాము చావును , కొంచెంలో ఎలా తప్పించుకున్నారో చెబుతూ, పళ్ళు ఇకిలిస్తూ, నవ్వేవారు కొందరు. సినీమాలో శృంగార ఘట్టాలలో విజిలులు వేసివుందురు. భక్తిభావాలైతే ఇంటికొచ్చి, ఇంట్లో మళ్ళీ మళ్ళీ చెప్పివుందురు.

ఎన్నిరకాలయిన ప్రవృత్తులు: ఈ మనుష్యుల్లో అణిగివుంటాయి!! ఆ ప్రవృత్తి ఎప్పుడు ఏవిధంగా మారిపోతుందో ఎవరూ చెప్పలేరు. ఈ సందర్భంలో వాళ్లకి నిజంగా భీతి కలిగివుండవలసింది. ఆ దృశ్యం భీతి కొలిపించే దృశ్యమే. కాని మనిషిరక్తం కొంతదూరం ప్రవహిస్తోంది. అది ఎక్కడికి ప్రవహిస్తుందో, అందరూ కనిపెట్టి చూస్తున్నారు. చివరికి ఓదిశగా పారింది. ఆ చుట్టుపక్కలవున్న మనుష్యులపాదాలవైపు ప్రవహించడం మొదలెట్టింది. అరుచుకుంటూ, అటువైపునవున్న మనుష్యులు వెనక్కి తప్పుకున్నారు. తరువాత అందరూ బిగ్గరగా నవ్వారు. ఆ చచ్చి పోయినమనిషిని చూసినకంటె ఈ బతికున్న మనుష్యులంటె భయమేసింది.

వాళ్ళలో ఏదో అజ్ఞాతంగా వుంది. అది తర్కానికి అతీతం: దాన్ని చూసి భయమెత్తుకొచ్చింది. వాళ్ల నవ్వుచూసి భయమేసింది. చచ్చిపోయిన మనిషివి, ఎగిరి పడిపోయిన చెప్పులు, చాలా గంభీరంగా తీసుకొచ్చి, ఆ శవందగ్గిర పెట్టినవిధం భయమెత్తించింది. ఈ మనుష్యుల జీవనరహస్యాన్ని గురించి తెలిపేశాస్త్రమన్నా, ఆ జీవితాలని మార్చగలిగే ఆ శాస్త్ర సామర్థ్యమన్నా, ఇంకా భయమేసింది.

ఎవరైనా శాస్త్రజ్ఞుడువొచ్చి, ఏదో రసాయనంరాసి, ఆ తెగిపోయిన కాలు అతికిస్తాడేమో ననిపించింది. ఏదైనా ఇంజక్షని చ్చి, ఎవరైనా, అతన్ని బతికిస్తాడేమో! ఆతరవాత లోకులు, తన పాదాలదగ్గిర పెట్టిన చెప్పులు నిజంగా తొడుక్కుని ఉంటాడనిపించింది. ఆతరవాత, తనమీద మోటారు నడిపించేసిన డ్రైవరుకి షేకుహాండుచేసి అంటాడు. ‘స్నేహితుడా ! ఎంత సుందరంగా భీతికలిగించావు. చావులో చాలా తమాషా వుంది. థాంక్సు.’

ఆతరవాత తమాషాగా వుంటుందని చాలామంది చచ్చిపోతారు. చంపేసి, బతికించే ఉపాయాలు అమ్మే కంపెనీ స్థాపితమవుతుంది. లోకులు ఆ కంపెనీలో షేర్లు కొనుక్కుంటారు. మరణం విషయమైన అన్ని నియమాలు, దాన్ని గురించిన ఆలోచనలు, మనసులలో పుట్టేభావాలు, ఉద్రేకాలు అన్నీ మారిపోతాయి. శాస్త్రం తీసిన ఒక్కదెబ్బతో మానవజీవితమంతా, తల్లకిందులై పోతుంది. ఆ దెబ్బతో ఆడుతూ నిలదొక్కుకోబోతున్న నడుం మీద మరోదెబ్బ. చివరికి, దెబ్బలు భరించలేక, మానవజీవితం అదృశ్యమై పోతుందేమో. అందులోనించి, మానవరహితమైన పృథ్విలో. తేనెటీగల సంస్కృతి పుట్టుకురావచ్చు. భయంకరం: ఈ పరిణామ అవకాశం తలుచుకుంటె భయమేస్తోంది, ఈ బతికున్నమనుష్యులు మరీ భయానకంగా వున్నారు. మానవజీవితపు తిరునాళ్ళలో, ముఖ్యమైన ఆకర్షణ, భీతి అనే గిరగిర తిరుగుతున్న రంకులరాట్నం. దేవదర్శనానికి వెళ్ళినప్పుడు, డిబ్బెంలో కొన్నిడబ్బులు అర్పించుకుంటాము. రంకులరాట్నం ఎక్కడానికికూడా డబ్బు ఇచ్చుకోవాలి. దేవాలయానికి వెళ్ళినప్పుడు శ్రద్ధతో కళ్ళు మూసుకుంటాము. రంగులరాట్నంలో తిరిగినప్పుడు, భీతివల్ల మూసుకుంటాము.

ఇక మిగిలినది, అంధకారంలో తడుముకోడం, బుద్ధిపూర్వకంగా, తెలివి తేటలు అనే డబ్బు చేతపుచ్చుకుని, ఈ జీవితపు తిరునాళ్లకి వొస్తాము. డబ్బుతో ‘భీతి’ కొనుక్కుంటాము. అంతకంటె చిమ్మిలివుండలుతింటె బాగుండును. కాస్త తియ్యతియ్యగా నమలడానికి వీలుండును.

కావి, చిమ్మిలివుండలు తినే మనుష్యులుకూడా మధ్యలో, రంకుల రాట్నం ఎక్కి ‘భయం’ అనుభవిస్తారు. భయం! పేపర్లలో, నల్లసిరాలో వ్రాసిన హెడ్డింగు. పెద్ద అక్షరాల భయం. లైనులో నించున్న అక్షరాలని గురించి అనేకభీతులు. గుర్తుతెలియని భీతి. కారణం తెలియని భీతి. గొప్ప తనాన్ని గురించిన భీతి. హీనతని గురించిన భీతి. జ్ఞానాన్నిగురించి, అజ్ఞానాన్ని గురించి భీతి. బంధనాలని గురించి, స్వాతంత్ర్యాన్ని గురించికూడా భీతి. ఇతరులని గురించి; స్వతహాగా, తనంటె తనకే భీతి. భీతితో విలవిలలాడుతున్న జీవితం ఒక పరమపద సోపానపటం, వైకుంఠపాళీ ఆట. నిచ్చెనెక్కి పైకి వెళ్ళాలి. పామునోట్లోపడి జారిపోవాలి. పెద్ద పెద్దనిచ్చెనల దగ్గిరగా పెద్దపాములు. చాలా పైన. తెరిచిననోరు. చాలాకిందగా తోక, చేతిలో అందమైన పావుల గలగల నిర్ణయించేది అజ్ఞాతభవితవ్యం. నీతి అనే గిరగిర తిరిగే రంకులరాట్నం.

బొంబాయిలో కాంతిహీనమైన ఆ సాయంకాలం, పాదాలమీద రోడ్డుని దాటుకుంటూ నడుస్తున్నాను. ఎక్కడినించో ఓగాలి విసురు. పైని ఎగురుతున్న గాలిపటం అల్లల్లాడింది. ఎక్కడో ఓచెట్టు చిన్న ఆకుల గల గల. ఒక చిన్నకుర్రాడు ‘ఓ’ అని అరుస్తూ తన చిన్నచెయ్యి పైకెత్తి, పరుగెత్తాడు. రోడ్డుమీద దుమ్ము ఎగురుతోంది. గాలి ఒకచోటినించి మరో చోటికి విసురుగా ప్రయాణం చేసింది.

నా ఆలోచనలు కలవరపడ్డాయి. మనసులో పేకముక్కల కలవడం జరిగింది. నాచేతిలో అయిదు పేకముక్కలు పెట్టి, ఎవరో అడిగారు, తురుపు ఏమిటి? నే ఆలోచించి అన్నాను, అన్నిముక్కలు వంచేసి, ఆఖరిముక్క తెరిచి వెయ్యి. అదే నా తురుపు. ఎన్ని ముక్కలు పంచినా, పేక అయిపోదు. నా తురుపు బయట పడదు. ఇంతలో ఎవరో తోసినందువల్ల చేతులోంచి ఓముక్క తెరుచుకుపడింది. ఆటీను రాణి.

ఎవరు తోసింది. ఆవిడ. ఆవిడెవరు? నాకేం తెలుసు. నే ఒకటి రెండుమాట్లు చూశాను. నావైపు వీపు పెట్టి నించుంది. పొట్టి, లావు, ఎగు భుజాలు. తల పై కెత్తి ఎవరితోటో మాట్లాడుతోంది. కళ్లు ఎర్రగా కనిపిస్తున్నాయి. జుట్టుమీద కాంతి అల్లల్లాడుతోంది. పైకి చూస్తూవుండడంవల్ల, జట్టుముడి ఆమె నాజూకు మెడని ఆధారం చేసుకుని పైకి లేచినట్టు వుంది. అది చూస్తూవుంటే, నాహృదయం కూడా ఎవరో చేతితో ఎత్తి పైకి పెట్టినట్టు అనిపించింది.

మాట్లాడుతూ, మాటాడుతూవుండగా, చేత్తో గట్టిగా పట్టుకున్న చీర చెంగు జారిపోయింది, చేతిలోనించి. గాలికి ఎగిరింది. ‘వి’ కత్తిరింపు బ్లౌజులోనించి, మనుష్యులని ప్రలోభపరిచే దృశ్యం కనిపించింది. నాదృష్టి తరవాత ఒక్క నిమిషం, గుండ్రని పిరుదుల మీద అగి, తరువాత గులాబీ పాదాలమీదికి ప్రసరించింది. ఆ జాగానించి కదలలేకపోయాను. ఆవిడమీదనించి దృష్టి మళ్ళించుకోలేకపోయాను, బుర్రలో టకటకమన్న ధ్వని. వొంటిమీద కంట్రోలు పోయింది. ఆవిడంటె నాకు చాలా ఇష్టమయింది.

ఎందుకలా అయిందో నాకు అర్థం కాలేదు. నిజానికి ఆవిడకూడా, మిగతా ఆడవాళ్లలాగే వుంది. బేబీ ఫేస్. ఆవిడ వ్యక్తిత్వపు రికార్డు మూడు నిమిషాల్లో ఆఖరయిపోయే రికార్డే అని తెలిసిపోయింది. నేనెప్పుడూ అది వరకు ఆవిడతో మాట్లాడలేదు. మాట్లాడే అవకాశంకూడా ఆ నిమిషంలో కనిపించలేదు. అయినా, నాహృదయం ఆ జీవితంలో పెనవేసుకుపోయింది.

ప్రేమ, ఎలాంటి ప్రేమ. ‘సాహెబ్, మొదటిప్రేమ. గులాబిప్రేమ. ఎదురుతిరిగే ప్రేమ. అన్నిటి ఖరీదు మూడురూపాయలు. సాహెబ్. కానుకగా ఇవ్వడానికి ఇంతకంటె ఖరీదైన పుస్తకాలు పనికిరావు. అన్ని పుస్తకాలు ఖరీదు మూడురూపాయలే! ఎవరో నాచెవిలో గుసగుస లాడారు. నే లక్ష్యపెట్టలేదు.

‘దీనికి రసాయనిక కారణం ఏమిటంటే’ పిల్లలని తయారుచేసే కార్ఖానాలో శాస్త్రజ్ఞుడు చెప్పడం ప్రారంభించాడు. కాని నే అతనిమాట వినలేదు.

నాహృదయం ఆవిడపాదాలకి అర్పించి, ముందుకి సాగిపోయాను. ఆ హృదయాన్ని కాళ్ళకింద తొక్కేసి, ఆవిడ ఎక్కడికో వెళ్లిపోయింది. ఆ హృదయం దెబ్బతిని, నలిగిపోయి, అలా ధూళితో లేచిపోయింది, ఆ దెబ్బతించి, రక్తం ప్రవహించలేదు. ఆనందం ప్రవహించింది.

నా హృదయాన్ని అక్కడే, అలాగే పారేసి, నడుచుకుంటూ ముందుకి సాగిపోయాను. నిజంగా ఇది జరిగుంటె ఎంత అద్భుతం, భయానకం అయివుండును. కాని నాకు ఏమీ అనిపించలేదు. ఓ సిగరెట్టు కాలుద్దామని అనిపించింది. బొంబాయిలో ఆ సాయంకాలం, విచారంలో మునిగిపోయింది. దాని జుట్టు రేగిపోయింది.

గుర్తు పట్టగలిగిన మొహంలేదు దానికి.

13-12-2025

2 Replies to “నన్ను వెన్నాడే కథలు-17”

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%