
60
తమ సొంతబాగు చూసుకోని వాళ్ళు
పక్కవాళ్ళ యిష్టాలకి అడ్డుపడతారు.
మరింత పాపం మూటగట్టుకుంటారు
వాళ్ళ పతనానికి వేసిన మొదటి అడుగు.
ఇలాంటి కర్మ కొంగునగట్టుకున్నాక
దేవుడు మాత్రం ఏం చేయగలడు?
తుకా అంటున్నాడు: నువ్వేదన్నా ఊరికెళితే
నలుగురినీ దారి అడిగి మరీ ముందుకు నడు.
जेणें नाहीं केलें आपुलें स्वहित । पुढिलांचा घात इच्छीतसे ॥१॥
संचितासी जाय मिळोनियां खोडी । पतनाचे ओंडीवरी हांव ॥ध्रु.॥
बांधलें गांठी तें लागलें भोगावें । ऐसियासी देवें काय कीजे ॥२॥
तुका म्हणे जया गांवां जाणे जया । पुसोनियां तया वाट चाले ॥३॥ (1499)
61
నువ్వు నా మాట విన్నావు
నా మనోరథం ఈడేర్చావు.
నా సేవని స్వీకరించడంతో
దేవా! నా ప్రేమ రెట్టింపైంది.
నేనొక విన్నపం చేసుకున్నాను
నేను కోరినట్టే నెరవేర్చాడు స్వామి.
తుకా అంటున్నాడు: ఈ దేహమిప్పుడు
పొంగిపొర్లుతున్న రసపాత్ర.
आइकिली मात । पुरविले मनोरथ ॥१॥
प्रेम वाढविलें देवा । बरवी घेऊनियां सेवा ॥ध्रु.॥
केली विनवणी । तैसी पुरविली धणी ॥२॥
तुका म्हणे काया । रसा कुरोंडी वरोनियां ॥३॥ (2844)
62
నా లెక్కల్లో దేవుడు మరణించాడు
మంచిది, ఆయన్నలా ఉండనివ్వండి.
ఇప్పటిదాకా కథలు చెప్పాను
పేర్లుపెట్టాను, ఇప్పుడు రెండూ లేవు
పొగుడుతుండటం తెగుడుతుండటం
పనిగా బహుకాలం గడిపేసాను.
ఇన్నాళ్ళూ జీవితం అమ్ముడుపోతూనే ఉంది.
తుకా అంటున్నాడు: ఇంక కుదుటపడ్డాను.
माझे लेखीं देव मेला । असो त्याला असेल ॥१॥
गोष्ट न करी नांव नेघें । गेलों दोघें खंडोनी ॥ध्रु.॥
स्तुतिसमवेत निंदा । केला धंदा उदंड ॥२॥
तुका म्हणे निवांत ठेलों । वेचित आलों जीवित्व ॥३॥
63
అలాంటి వ్యాపారంలో ఉండికూడా ఒక్కసారిగా
ధనవంతుణ్ణి కావాలని గట్టిగా కోరుకున్నాను.
ఆపైన ధైర్యం చేసి హరిదాసుడిగా మారాను
నాకన్నా ముందునడిచినవాళ్ళు తోడు నిలబడ్డారు.
జనసమ్మర్దం నుంచి దూరంగా అభినవ జీవితం.
చెప్పాలంటే ఇక్కడ జీవితాన్నే బలిపెట్టాను.
తుకా అంటున్నాడు: అయినా అమ్మకాలు ఆగలేదు.
రోజులిలా గడుస్తుంటే స్వామికి ఋణపడుతున్నాను.
तरी हांव केली अमुप व्यापारें । व्हावें एकसरें धनवंत ॥१॥
जालों हरीदास शूरत्वाच्या नेमें । जालीं ठावीं वर्में पुढिलांची ॥ध्रु.॥
जनावेगळें हें असे अभिनव । बळी दिला जीव म्हणऊनि ॥२॥
तुका म्हणे तरी लागलों विल्हेसी । चालतिया दिवसीं स्वामी ॠणी ॥३॥(2748)
64
జ్ఞానేశ్వరిలో ఏమి తక్కువైందని?
నన్నీ భూమ్మీదకు పంపించాడు?
అక్కడ రాసిఉన్నది విన్నాడుకాబట్టి
నలుగురికీ తెలియాలనుకున్నాడు
అయినా కూడా స్వామికి తెలిసిందే
సేవకుడు మాటల్లో పెడతాడు.
తుకా అంటున్నాడు: అలానే కానివ్వు
దేవా, నాకు చాతనయినట్టు చెప్తాను.
काय ज्ञानेश्वरीं उणें । तिंहीं पाठविलें धरणें ॥१॥
ऐकोनियां लिखित । ह्मुण जाणवली हे मात ॥ध्रु.॥
तरी जाणे धणी । वदे सेवकाची वाणी ॥२॥
तुका म्हणे ठेवा । होतां सांभाळावें देवा ॥३॥ (2322)
65
ఇప్పుడు నీ నామం గానం చేస్తాను
నీ ప్రేమరక్తిమలో నాట్యమాడతాను.
నీ నామంలో నమ్మకం కుదురుకున్నాక
మళ్ళా మళ్ళా పుట్టే ప్రసక్తి ఎక్కడ?
నీ నామాన్ని విస్మరించానా
కోటిపాపాలు చుట్టుకుంటాయి.
ఎవరు పలికినా వట్టిపోని నామమని
ప్రేమపారవశ్యంతో చెప్తున్నాడు తుకా.
तुझें नाम गाऊं आतां । तुझ्या रंगीं नाचों था था॥१॥
तुझ्या नामाचा विश्वास । आम्हां कैंचा गर्भवास ॥ध्रु.॥
तुझे नामीं विसर पडे । तरी कोटी हत्या घडे ॥२॥
नाम घ्या रे कोणी फुका। भावें सांगतसे तुका ॥३॥ (2975)
Featured image: Photography by Cristina Tarantino via pexels.com
26-11-2025