నన్ను వెన్నాడే కథలు-9

నేషనలు బుక్ ట్రస్టు వారి కథాభారతి సిరీసులో ‘తమిళ కథానికలు’ (1971) పుస్తకం చేతుల్లోకి తీసుకోగానే అందులో చదువుకి సంబంధించిన ఒక కథ ఉండాలని గుర్తొచ్చింది. ఆ కథ ఏదై ఉండవచ్చు? పుస్తకంలో మొత్తం ఇరవై కథలు. ఆ కథ పేరు గుర్తు లేదు. రచయితల పేర్లు చూసాను: రాజాజి, పుదుమైపిత్తన్, జయకాంతన్, కల్కి, అఖిలన్- కాదు. ‘బురదలో వికసించిన కెందమ్మి’ అయి ఉండవచ్చునా? రెండు పేజీలు చదివాను. ఇది ఆ కథ కాదని తెలిసిపోయింది. మరే కథై ఉండవచ్చు?

మరోసారి నా జ్ఞాపకాల్ని తడుముకున్నాను. ఆ కథలో ఒక రైలు కూడా ఉంటుందని గుర్తొచ్చింది. మరోసారి విషయసూచిక చూసాను. ‘కుమారపురం స్టేషన్ ‘. ఈ కథ అయి ఉండవచ్చునా? దాదాపు పదహారు పేజీల కథ. సగం చదివేటప్పటికే తెలిసిపోయింది. అవును, ఈ కథే. ఇదే కథ. తాడికొండలో, నాగార్జున సాగరులో నా చదువు ముగించుకున్న రోజుల అనుభవాల గాలి ఇంకా వంటిని వీడకుండానే 80 ల మొదట్లో చదివాను కాబట్టే, ఈ కథ, రచయిత పేరు గుర్తులేకపోయినా, కథ పేరు గుర్తులేకపోయినా, ఒక పూర్వజన్మ జ్ఞాపకంలాగా నా అంతశ్చేతనలో భద్రంగా ఒదిగిపోయి ఉంది.

ఈ ‘కుమారపురం స్టేషన్’ (1952) నన్నెందుకు వెన్నాడుతూ ఉందో మీకు కథ చదవగానే అర్థమైపోతుంది. మీలో చాలామందికి నాకులాంటి అనుభవాలే ఉంటాయి కాబట్టి ఈ కథ మిమ్మల్ని కూడా వెన్నాడటం మొదలుపెడుతుంది. ఉన్నవూళ్ళో ప్రైమరీ స్కూలు దాటి లేకపోవడం వల్ల దూరంలో ఉన్న హైస్కూలుకో, లేదా కాలేజీకో వెళ్ళి చదవవలసి వచ్చిన అనుభవాలు ఉన్నవారందరికీ ఈ కథ ఒక నమూనా. ఎందుకంటే మనందరమూ ఈ విశాల భారతదేశంలో ఏదో ఒక ఇడై సేవల్ నుంచి వచ్చినవాళ్ళమే కాబట్టి. నా వరకూ ఆ రైల్వేస్టేషనూ, ఆ రైలు ప్రయాణమూ, కూడా వచ్చిన ఆ వృద్ధుడూ చాలా ముఖ్యం. నేను తాడికొండలో చదువుకున్న ఆరేళ్ళూ మా ఊరినుంచి స్కూలుకి వెళ్ళేటప్పుడూ, వచ్చేటప్పుడూ పయనించిన దారి ఇడై సేవల్ నుండి కోవెల్ పట్టి పోయే రైలు దారిలాంటిదే కాబట్టి. యాభై ఏళ్ళ కిందట మధ్యతరగతి విద్యార్థుల అనుభవాలు ఇవి. ఇప్పుడు దళితులు, గిరిజనులు, బాలికలూ, మైనారిటీ సమూహాలకు చెందిన పిల్లలూ ఈ దారమ్మటే నడుస్తున్నారు. కొద్దిగా అటూ ఇటూగా ప్రతి ఒక్కరి అనుభవమూ ఇలాంటిదే.

ఈసారి ఈ కథ చదివినప్పుడు పిల్లలు ప్రవేశ పరీక్షలో ‘అన్ని సబ్జెక్టులూ బాగానే రాసాము, ఒక్క లెక్కలు తప్ప’ అన్నప్పుడు నాక్కూడా అది నా అనుభవమే అని గుర్తొచ్చింది. 72 నాటి మాట. తాడికొండ స్కూలు ప్రవేశపరీక్ష రాయడానికి మా అన్నయ్య నన్ను రాజవొమ్మంగి తీసుకువెళ్ళాడు. ఆ ప్రాంతం మొత్తానికి నేనొక్కణ్ణే పరీక్షకు హాజరయ్యాను కాబట్టి స్కూళ్ళ ఇన్స్పెక్టరు గారి ఇంట్లోనే పరీక్షకు కూచోబెట్టారు (అప్పట్లో ఆయనకు ఇల్లూ, ఆఫీసూ అదేననుకుంటాను). మా అన్నయ్య ప్రశ్నపత్రం చూసాడు. లెక్కలకి సంబంధించిన ప్రశ్నలు కష్టంగా ఉన్నట్టున్నాయే అని అన్నాడు. అవునన్నాను. తీరా చేస్తే అది అయిదో క్లాసుకి ఎంట్రన్సు పేపరు! కొంతసేపటికి వాడు కూడా బయటకి వెళ్ళిపోయాడు. సరే, మొత్తానికి పేపరు రాసి ఆ ఆన్సరు షీటు ఇచ్చేసి బయటకి వచ్చేటప్పటికి మా అన్నయ్య పరుగు పరుగున లోపలకి వస్తున్నాడు. ‘అప్పుడే అయిపోయిందా! పేపరు ఇచ్చేసావా! ఎంతపనిచేసావు! నేను ఈ లెక్కలకి జవాబుల కోసం మా మౌలాలిగాడిదగ్గరికి వెళ్ళి వస్తున్నాను. అయ్యో! ఇప్పుడెలాగ?’ అన్నాడు. నాకు సీటు రాదనుకుని ఇంటిబాట పట్టాం. కాని ఆ పరీక్షలో నేను పాసయి తాడికొండలో చేరడం- అదో వింత నాకూ, మా అన్నయ్యకీ!

ఈ కథా రచయిత కు.అళగిరి స్వామి (1923-1970) కథారచయిత, పాత్రికేయుడు. మాక్సిం గోర్కీని విస్తృతంగా తమిళంలోకి అనువదించినవాడు. ఇంతకీ ఆయన స్వగ్రామం కూడా ఇడైసేవల్ నే!


కుమారపురం స్టేషన్

తమిళ మూలం: కు. అళగిరి స్వామి

తెలుగుసేత: చల్లా రాధాకృష్ణ శర్మ


కుమారపురం ఒక అడవి స్టేషను. దానికి అరమైలు పరిధిలో ఊరూ పల్లె ఏమీ లేదు. అయి నా స్టేషను కట్టిన తర్వాత, పేరు పెట్టకపోతే ఎలా? ఏదో ఒక పేరు పెట్టాలి గదా! ఆ దృష్టితో దానికి కుమారపురం అనే పేరు పెట్టారు; కాని స్టేషనుకి తూర్పుగా ఒక మైలు కవతల వున్న కుమార పురం అనే గ్రామం సుమారు డెబ్బయియైదేళ్లుగా స్టేషన్ని బహిష్కరిస్తూ వచ్చింది. ధాత కరువు ఏర్పడ్డప్పుడు, పనిపాటులు కల్పించే వుద్దేశంతో తిరుచ్చిరాపల్లినుంచి తిరునెల్వేలి దాకా రైలు మార్గం వేసినట్లు చెపుతారు. ఆ మార్గంలో కోవిల్ పట్టికి దక్షిణంగా ఏడవ మైలులో ఉంది ఈ స్టేషను. ఆ చుట్టుపక్కల వుండే గ్రామస్థులు తమ జీవితకాలంలో ఒకసారో రెండుసార్లో గుడికని తీర్థానికని యాత్ర చేస్తారు. పదిమైళ్ల దూరంలో ఒక మారియమ్మ గుడో, పన్నెండు మైళ్ల దూరంలోనో ఒక కాలియమ్మన్ గుడో వుంటుంది. అక్కడికి వెళ్లి పొంగళ్లు పెట్టడం వారి కలవాటు. ఈ యాత్రలకు రైళ్లూ అక్కరలేదు. ; బస్సులూ అక్కరలేదు. కొన్ని సందర్భాలలో వాళ్లు వెళ్లవలసిన గ్రామం స్టేషనుకంటే దగ్గరలోనే వుంటుంది. అటువంటప్పుడు నడిచి వెళ్లకుండా, స్టేషనుకి వచ్చి రైలెక్కుతారా యెవరైనా?

ఈ స్టేషను చరిత్రలో మొట్టమొదటి సారిగా ఇక్కడ దిగిన ప్రముఖుడు సుబ్బరామ అయ్యర్ అని చెప్పవలసి వుంటుంది. కోవిల్ పట్టినుంచి మూడు రోజులకు క్రితమే ఆయన అక్కడికి వచ్చాడు. కొత్తగా బదిలీ అయి వచ్చిన ఆ స్టేషను మాస్టరుకి ఆయన బాల్యమిత్రుడు. కొంత కాలం పాఠశాలలో సహాధ్యాయుడు కూడా. దూరపు బంధువనీ చెప్పవచ్చు. తన మిత్రుణ్ణి యీ స్టేషనుకి ఆహ్వానించే సదవకాశం స్టేషను మాస్టరుకి కలిగింది. ఆయన పిల్లవాడికి ఆరో యేడు నిండింది. దాన్ని పురస్కరించుకుని, మిత్రుణ్ణి ఆహ్వానించాడు. సుబ్బరామ అయ్యరు కూడా ప్రశాంత వాతావరణంలో మిత్రుడితో హాయిగా కాలక్షేపం చెయ్యవచ్చునని బయలుదేరి వచ్చాడు.

పుట్టిన రోజు పండుగకు వచ్చిన ఒకే ఒక అతిథి సుబ్బరామ అయ్యరే. బాల్య మిత్రులిద్దరూ తమ తమ జీవిత చరిత్రల్నీ ఒక వూరి నుంచి మరో వూరికి బదిలీ అయినప్పటి విషయాల్ని కుటుంబ వ్యవహారాలూ మొదలైన వాటిని గురించి సవిస్తరంగా మాట్లాడుకున్నారు ఆ రాత్రంతా. కోవిల్ పట్టిలో సౌకర్యాలు ఎలా వున్నాయని స్టేషన్ మాష్టరు అడిగాడు. కుమారపురం స్టేషన్లో జీవితం ఎలా గడపగలుగుతున్నావని సుబ్బరామ అయ్యరు అడిగాడు. ఇలా ఒక రోజు గడిచింది.

మరునాడు స్టేషన్ మాష్టరు మాటి మాటికి యింటికి వచ్చి తన విధ్యుక్తధర్మ నిర్వహణకు సెలవు తీసుకుని వెడుతూ వుండేవాడు. మధ్యాహ్నంవేళ, స్టేషన్ మాస్టరు లేని సమయంలో ఆయన పిల్లవాడితో తమాషాగా మాట్లాడుతూ కాలక్షేపం చేసేవాడు సుబ్బరామ అయ్యరు. పిల్లలతో ఆట లాడడమో, పిల్లల సమూహంలో సంతోషంగా వుండడమో ఆయనకి అలవాటు లేదు. బహుశః ఆయన వృత్తి అందుకు అడ్డు తగిలేదేమో! కాని ఆ పిల్లవాడు తప్ప మాట్లాడేందుకు అక్కడ మరెవ్వరూ లేరు. మధ్యాహ్నం ఎలాగో అతనితో కాలక్షేపం చేసేవాడు. భోజనానంతరం సుమారు రెండు గంటలు నిద్రపోయేవాడు. మూడూ మూడున్నరకల్లా లేచి, తన వెంట తెచ్చుకున్న పుస్తకం తీసుకుని స్టేషనుకి వెళ్లేవాడు.

ప్లాట్ఫారం మీద అయిదారు వేపచెట్లు ఉన్నాయి. అది వేసవి కావడం వల్ల, చెట్లు బాగా పూశాయి. వేప పూలు ఎన్నో నేలమీద పడివుండేవి. ఆ చెట్ల మీదుగా వీచే చల్లని గాలి సువాసనలు వెదజల్లుతూ స్టేషను వైపు వచ్చేది. అందువల్ల స్టేషన్ వరండాలో గాలి వీచే వైపున ఒక బెంచీ మీద కూర్చుని, పుస్తకం తెరిచి చదువుకోవడం మొదలుపెట్టాడు.

కొంచెం సేపయిన తర్వాత దక్షిణాది నుంచి వచ్చిన ఒక ఎక్సప్రెస్ బండి మామూలు ప్రకారం అగకుండా వెళ్ళిపోయింది. ఇక సాయంకాలం ఆరు దాటిన తర్వాతే, అక్కడికి రైళ్లు వస్తాయి. కనక స్టేషన్ మాస్టరు మిత్రుడి వద్దకు వచ్చి, ఆయన పక్కనే కూర్చున్నాడు. పుస్తకం మూసివేసి, కింద పెట్టి, సుబ్బరామ అయ్యరు “ఈ స్టేషనుకి ప్రయాణీకులు వస్తూ పోతూ వుంటారు గదా!” అని నవ్వుతూ అడిగాడు.

“రాకేఁ ! నిన్న కూడా ఒక ప్రయాణీకుడు యీ స్టేషన్లో దిగాడు గదా!” అన్నాడు స్టేషన్ మాస్టరు.

సుబ్బరామ అయ్యరు బిగ్గరగా నవ్వాడు. నిన్న దిగిన ప్రయాణీకుడు  ఆయనే.

“ఇలా కనక యింకా పది స్టేషన్లుంటే చాలు, రైల్వే బడ్జెట్టులో లోటు లేకుండా ఎలా వుంటుంది ?…” అంటూ అవహేళన పూర్వకంగా నవ్వడం, మాట్లాడడం  ఏకకాలంలో ఆపివేశాడు సుబ్బరామ అయ్యరు.

“అలా అనడానికి వీల్లేదు. రేపు సోమవారం. కోవిల్ పట్టిలో సంత జరుగుతుంది. పది టికెట్లకైనా మనుషులు వస్తారు.”

“అలా అయితే స్టేషనుకి రెండు రూపాయల రాబడి వస్తుందని చెప్పండి.”

ఇద్దరూ నవ్వారు. అప్పుడు పోర్టరు కరుప్పయ్య అక్కడికి వచ్చాడు. వాళ్ల మాటలు వింటూ అతను ఒక మూల నిలబడ్డాడు.

“ఎందుకని యీ స్టేషను కట్టారు? ఇది లేకపోతే, ఎవరు అఘోరించారని?”

“ఈ స్టేషను యీ చుట్టుపక్కల గ్రామస్థులకి మరోవిధంగా సహాయపడుతోంది. ఇలాగైనా యిందువల్ల లాభం వుందనే విషయం యిక్కడికిబదిలీ అయిన తర్వాతే తెలుసుకోగలిగాను.”

సుబ్బరామ అయ్యరు ఏమీ మాట్లాడకుండా, మిత్రుడు చెపుతున్న మాటలు వింటూ కూర్చున్నాడు. స్టేషన్ మాస్టరు చెప్పడం మొదలు పెట్టాడు.

“ఇది వేసవి కాలం కావడంవల్ల చుట్టుపక్కల వుండే గ్రామాలు మాగాణి భూములవడంచేత పచ్చపచ్చగా లేవు. కాని ఎప్పుడూ యిలా వుండవు. నవధాన్యాలు పండే సారవంక భూమి. పొలం పనులు చేసేవారు తాగే నీటి కోసం కుండలతో యిక్కడికి వస్తారు. ఇరవై కుండల నీళ్లయినా కావలసి వస్తుంది రోజూ. కనక యీ విధంగానైనా యీ స్టేషనువల్ల లాభం వుంది.”

“అలా అయితే చలివేండ్రం  కట్టవలసిన చోట స్టేషన్ కట్టారన్న మాట !”

స్టేషను మాస్టరు పరిహాస ధోరణిని కట్టిపెట్టి, మనఃపూర్వకంగామాట్లాడసాగాడు.

“ఇలాగే ఒకటి వుండవలసిన చోట మరొకటి కడతాడు మానవుడు. ఒక పనికని వుద్దేశించబడింది మరొకందుకు వుపయోగపడుతోంది. అప్పుడు సవ్యంగా జరిగిన ఖర్చు కూడా అనవసరమైన ఖర్చుగా మారిపోతుంది. ప్రపంచమే అలా వున్నప్పుడు ఈ కుమారపురం స్టేషన్ని విమర్శించడమెందుకు?”

హేళనగా నవ్వుతూ సుబ్బరామ అయ్యరు “ప్రపంచాన్నీ మీ స్టేషను కిటికీ గుండా చూస్తున్నట్టున్నారు? ఆరు నెలల్లో యీ రాతి కట్టడం మీద మీ కింత మమకారం ఎలా కలిగిందో నాకు ఆశ్చర్యంగా వుంది” అన్నాడు.

స్టేషన్ మాస్టరు కొంచెం ఉద్రేకం తెచ్చుకుని మాట్లాడసాగాడు.

“కోవిల్ పట్టిలో పాఠశాల కట్టారు? ఎందుకోసం కట్టారో చెప్పండి చూద్దాం.”

“ఎందుకు కడతారు బడి! వందమంది విద్యార్థులు చదువుకునేందుకే కడతారు బడి…”

“అలాగే అనుకుందాం. వందమంది విద్యార్థులూ ఎందుకోసం చదువుతారు?” అడిగాడు స్టేషన్ మాస్టరు.

“ఏవిఁటి! ఇలా అడుగుతున్నారు?”

“కారణం వుండబట్టే అడుగుతున్నాను. బదులు చెప్పండి.”

‘..’

“జ్ఞానం వృద్ధి చేసుకునేందుకు పిల్లలు చదువుతారనేగా మీరు చెప్పే సమాధానం!”

“మీరు మరో కారణమేదైనా చెపుతారా ?”

“పిచ్చివాడు కూడా కేవలం జ్ఞానం కోసమని పిల్లల్ని బడికి పంపడు. మీరూ  నేనూ జ్ఞానం కోసం బడికి వెళ్లామా? చదువుకోనివాడికి కూడా ఉద్యోగం యిస్తామని చెప్పండి. వానాకాలమని కూడా చూడకుండా ఎవరైనా బడికి వెడతారేమో చూద్దాం” అని సవాలు చేశాడు స్టేషన్ మాస్టరు.

సుబ్బరామ అయ్యరు నవ్వాడు. అప్పుడు పోర్టరు కూడా నవ్వాడు. పోర్టరు ఎదట యిలా మాట్లాడడం మర్యాద కాదనుకునో యేమో, అయ్యరు ఆ తర్వాత మరేమీ మాట్లాడకుండా పుస్తకం చేత పుచ్చుకున్నాడు.

“ఏవిఁటి! మౌనం వహించారు!” అని స్టేషన్ మాస్టరు ఆయన్ని ఎగదోశాడు.

“మీతో మాట్లాడి జయించడమే? సూర్యచంద్రులున్నంత దాకా కుమారపురం స్టేషను శాశ్వతంగా వుండనివ్వండి. ఇందువల్ల నాకేమీ నష్టం లేదు” అని అయ్యరు ఏదో ఒక పుట కోసం గాలిస్తున్నట్టుగా పుస్తకం తిర గేశాడు.

స్టేషన్ మాస్టరు పోర్టర్ని పిలిచి “ఇంటికి వెళ్లి కాఫీ చెయ్యమని చెప్పు”అని అతన్ని పంపించాడు.

“మనమూ వెడదాం” అన్నాడు అయ్యరు.

ఆ తర్వాత కొంచెంసేపటికి యిద్దరూ బయలుదేరారు, స్టేషన్ నుంచి ఇంటికి.

మూడో రోజు పొద్దున, ఎనిమిదింటికల్లా ఉత్త రాది వెళ్లే ప్యాసెంజరు ఒకటి రావాలి. ఆ రోజు సోమవారం. కోవిల్ పట్టి సంతకు వెళ్లే ప్రయాణీ కులు నలుగురైదుగురు ఏడింటికి ముందే గోనిసంచులతో సహా స్టేషనుకి వచ్చారు. తమల పాకులు వేసుకుంటూ వాళ్లు మాటల్లో మునిగిపోయారు. ఏడుంబావుకి సుబ్బరామ అయ్యరు ఫలహారం పూర్తి చేసుకుని, ప్లాట్ఫారం మీద వేపచెట్ల కింద వున్న ఒక బెంచీ మీద కూర్చుని, పుస్తకం చదవడం మొదలు పెట్టాడు, నిన్న ఆపిన చోటునుంచి. పల్లెటూరి వాళ్లు సాధారణంగా బిగ్గరగా మాట్లాడతారు. అందువల్ల, ఆయన దీక్షగా చదవలేక పోయాడు. కమ్మని వేపచెట్ల గాలి కూడా ఆయన్ని దీక్షగా చదవనివ్వడం లేదు.

ఈ యెడారిలో కూడా యిటువంటి కమ్మని వాసన, ఇటువంటి చక్కని గాలి. చూడడానికి ఇదంతా నల్లమట్టి. అయినా యిక్కడ చెట్లు ఏపుగా పెరిగి, కమ్మని వాసనతో చక్కని గాలి వీస్తోంది. ఈ సువాసన కూడా ఈ మట్టిలోనే పుట్టింది కాబోలు!

ఆయన చూపులు దూరాన వున్న గ్రామాల మీదికి వెళ్లాయి. “ఈ గ్రామాల్లో నివసించే నూర్లకొద్ది స్త్రీలూ పురుషులూ ఈ మట్టినే నమ్మి జీవిస్తున్నారు. ఈ నల్లమట్టిలోంచే యింత కమ్మని వాసనా వస్తోంది.. ప్రాణమూ లభిస్తోంది..” అనుకున్నాడు.

ఆయన ఆలోచనలన్నీ చదువుకున్న పుస్తకంలోని సూక్తులవలె మధురంగా ఉన్నాయి. ఆయన మనస్సులో ఆలోచనలెన్నో మెదులుతున్నాయి. అప్పుడు పడమరగా సుమారు అరమైలు దూరాన నలుగురైదుగురు త్వరత్వరగా స్టేషను వైపుగా నడిచి రావడం చూశాడు.

“బండి కింకా టైముంది. ఇలా చెమటలు పట్టేలా ఎందుకు వస్తున్నారు వీళ్లు !” అని అయ్యరు అనుకున్నాడు. కొందరేమో ఒక గంట ముందుగానే స్టేషను చేరుకున్నారు. ఆయనకిది వెర్రితనమనిపించింది.

“కల్లాకపటం తెలియని మనుషులు” అనుకున్నాడు అయ్యరు తనలో తాను.

వేపచెట్ల గాలి ఎంతో హాయిగా వుంది. ఆ కమ్మని గాలి కోసమే వేసవి అంతా యిక్కడే గడపాలన్న వుద్దేశం కలిగింది అయ్యరుకి. అంతే. చుట్టూ వున్న మట్టి మీదా పచ్చిక మీదా పచ్చిక మధ్య వికసించిన అడవి పూల మీదా ఆయనకు అభిమానం పుట్టుకు వచ్చింది. ఇంకా కొద్ది సేపట్లో రైలెక్క బోతున్నందువల్ల ఆ అభిమానం మరింత బలపడింది. “ఏ ప్రాంతాలలో నివసించినా, మనుషులు మనుషులుగానే నివసిస్తున్నారు” అనుకున్నాడు.

ఇంతలో ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ప్లాట్ ఫారం మీదికి వచ్చి, రెక్కను ఒక్కసారి ఎగాదిగా చూసి అక్కడే నిలబడ్డారు. ఎప్పుడో ఒక ఆవుని కొన్న విషయాన్ని ఒక అసామి కథలా చెప్పుకుపోతుంటే మిగిలిన వాళ్లు ఊఁ కొడుతూ వింటున్నారు.

సుబ్బరామ అయ్యరు వాళ్ల మాటల్ని శ్రద్ధగా విన్నాడు. ఆ మాటల్లో నిజమే కాదు, అర్థమూ స్వారస్యమూ ఉన్నట్లు ఆయనకి తోచింది. వాళ్ల నడిగి, వాళ్ల జీవిత చరిత్రల్ని కూడా తెలుసుకోవాలనే ఆశ కూడా కలిగింది.

అరమైలు దూరాన తెల్లని గుడ్డ ముక్కలవలె కనిపించి, పరిగెత్తుకు వచ్చిన వాళ్లల్లో ఒకాయన వృద్ధుడూ, నలుగురు బాలురూను. ప్లాట్ఫారం చేరుకోగానే “టికెట్లు యిచ్చారా ?” అని అడిగాడు పరిగెత్తుకు వచ్చిన వృద్ధుడు.

మాట్లాడుతున్న వాళ్లల్లో ఒకతను “ఇవ్వలేదు” అని బదులు చెప్పాడు. అంతా అమ్మయ్యా అనుకున్నారు. ఆ నలుగురు పిల్లల చూపులూ ఒక్క సారిగా వేపచెట్ల నీడను బెంచి మీద కూర్చున్న సుబ్బరామ అయ్యరు మీద పడ్డాయి. చూచీ చూడడంతోనే వాళ్లకు ఆయన మీద ఆదర భావం కలిగింది. అటువంటి వ్యక్తిని వాళ్లు సంవత్సరానికొకసారయినా చూడడం అపూర్వమే. వాళ్ల బడికి ఎప్పుడైనా విజయం చేసే పెద్ద యిన స్పెక్టరులా కాళ్లకు  బూట్లు, క్లోను కోటు, జరీయంచు ఉత్తరీయం మొదలైన వాటిలో కనిపించాడు ఆయన. బట్టతల కూడా ఆయనమీది గౌరవాన్ని యినుమడింప జేసింది. తనవైపు కన్నార్పకుండా చూస్తున్న పిల్లల్ని గమనించాడు అయ్యరు. నలుగురు పిల్లలూ ఇంచు మించు సమ వయస్కులు. వన్నెండు నుంచీ పదిహేను దాకా వుండవచ్చు వాళ్ల వయస్సు. ఒక్కొక్కని చేతిలోనూ ఒకటి రెండు పుస్తకాలూ కొన్ని తెల్ల కాగితాలూ ఉన్నాయి. చొక్కా జేబుల్లో చెక్కి సిద్ధంగా వున్న పెన్సిళ్లు. వాళ్లను చూస్తే విద్యార్థులని స్పష్టమవుతుంది.

పిల్లలూ అయ్యరూ ఒకరి నొకరు చూసుకుంటూనే వున్నా, పలకరించేందుకు మాత్రం ఎవ్వరూ ప్రయత్నించలేదు. ఇంతలో రెక్క వంగింది. స్టేషను మాస్టరు టికెట్టుతో అయ్యరు వద్దకు వచ్చాడు.

“ఈ చోటు మీకు బాగా నచ్చినట్టుంది. ఇక్కడే కూర్చున్నారు.”

“మంచి గాలి” అన్నాడు అయ్యరు. టికెట్టు తీసుకున్నాడు.

“అలా అయితే యీసారి సెలవలికి యిక్కడికే రండి. ఇలా మూడు రోజుల్లోనే బయలుదేరి వెళ్ళిపోకుండా, ఒక్క పది రోజులైనా వుండేట్టు రండి…”

“అలాగే కానీండి… పది రోజులే గదా! రాముడు పధ్నాలుగు సంవత్స రాలు వనవాసం చేసినప్పుడు, మనం యిక్కడ ఒక్క పదిరోజుల పాటు వుండలేమా?”

“ఆ వనవాసకాలంలోనే రాముడు ఆత్మసఖుల్ని సంపాదించుకో గలిగాడు. రాముణ్ణి రాముడిగా చేసింది ఆ వనవాసమే గదా!” అన్నాడు స్టేషన్ మాస్టరు.

“బడి విడిచి పెట్టిన తర్వాత పురాణాలన్నిటినీ మీరు బాగా పరిశీలించి నట్టున్నారు” అని సుబ్బరామ అయ్యరు నవ్వుతూ అన్నాడు. అయినా మిత్రుని మాటలలో ఏదో ఒక హాయీ, సత్యమూ అంతర్లీనమై వున్నట్లు ఆయనకు స్ఫురించింది.

ఆ తర్వాత సావకాశంగా మాట్లాడే వీలు లేకపోయింది. బండి వచ్చే వేళయింది. అందువల్ల స్టేషనులోకి వెళ్ళిపోయాడు స్టేషను మాస్టరు. ఆ చిన్న పిల్లల్ని అక్కడే వుండమని చెప్పి, వృద్ధుడు వెళ్ళి టికెట్లు తెచ్చాడు. ప్రయాణీకులంతా ప్లాట్ ఫారం మీద సిద్ధంగా వున్నారు.

సకాలంలో బండి వచ్చింది. అయ్యరు ఎక్కిన పెట్టెలోనే ఆ వృద్ధుడూ పిల్లలూ ఒకరివెనక మరొకరు ఎక్కారు. పెట్టెలో చోటుంది. ఒక కిటికీ వద్ద కూర్చున్నాడు అయ్యరు. ఆయనకు ఎదురు వరుసలో చాలా చోటుండడం వల్ల, అక్కడ కూర్చున్నాడు పిల్లలు. వృద్ధుడు అయ్యరు కుడి చేతి వైపు పక్కగా కూర్చున్నాడు. వృద్ధుడికి కుడివైపు భూతం వంటి ఒక వ్యక్తి బోలెడు సామాన్లతో కూర్చున్నాడు. అతనికభిముఖంగా అతనిలో బోలెడు మూడువంతులైనా లావుగల ఒకామె కూర్చుంది. ఆమె పక్కన కూడా ఏమిటో వున్నాయి మూటాముడులూనూ , బిందెలూ…

కుమారపురం స్టేషన్ నుంచి రైలు కదిలింది.

పిల్లలు రెండు వైపులా కిటికీల గుండా చెట్టు చేమలు పరుగెత్తుకు పోవడం చూస్తూ మురిసిపోయారు. వాళ్ల ఆశ్చర్యాన్నీ అనందాన్నీ చూసిన సుబ్బరామ అయ్యరు వాళ్లు రైలు ప్రయాణం చేయడం యిదే మొదటిసారి కాబోలు అనుకున్నాడు. వాళ్లతో మాట్లాడాలని ఆశ, కాని అటువంటి వ్యక్తులు సులభంగా మాట్లాడతావా మరి!

ఆయన కది కొంచెం కష్టంగానే తోచింది.

కొన్ని నిమిషాలు గడిచాయి. పిల్లలతో మాట్లాడడం మొదలు పెట్టాడు, పడమటి వైపుగా కిటికీ పక్క కూర్చున్న భూతాకారం మనిషి. ఎత్తు గడలోనే ఎంతో మంచితనం ప్రదర్శించాడు ఆయన.

“ఎక్కడికిరా ప్రయాణం?” అని అడిగాడు. ఆయన గొంకు ఆయన కంటె బరువుగా వుంది. ఏం బదులు చెప్పాలో పిల్లలకి తెలియలేదు. వాళ్ల తరఫున వృద్ధుడు సమాధానం చెప్పాడు.

“కోవిల్ పట్టికి వెడుతున్నారు. పెద్ద బడిలో చేరాలి”. పిల్లలు భూతాకార వ్యక్తిని ఎగాదిగా చుశారు. ఆయన వజ్రాల దుద్దులు, వజ్రపుటుంగరం, బంగారు గుండీలు, వెడల్పయిన చేతి గడియారం – వీటిని చూడసాగారు మాటిమాటికి.

“ఏ క్లాసులో చేరతారు?”

“మా వూళ్ళో ఆరోక్లాసు ప్యాసయ్యారు. అక్కడ ఏడో క్లాసులో చేరాలి.”

“ఏ వూరు పిల్లలు?”

“ఇడై సేవల్ …”

“ఇడై సేవలా! అక్కడ ఏడో క్లాసు లేదూ ?”

“లేదు, సర్కారువారి శాంక్షనుకి దరఖాస్తు పెట్టారు.”

“ప్యాసయినట్టు సర్టిఫికెట్టు వుందా?”

“ఉంది.”

“ఉన్నా సరే, పరీక్ష పెట్టే చేర్చుకుంటారు.”

“అందుకనే ఒక పంతులుగారిచేత యింట్లో ఒక నెల రోజులు ట్యూషన్ చెప్పించాడు” అన్నాడు వృద్ధుడు.

భూతాకారం మనిషి ఒక పిల్లవాణ్ణి చూచి “ఒరేయ్! నేను మూడు ప్రశ్నలు వేస్తాను. నువ్వు వాటికి బదులు చెప్పాలి. నిన్ను ఏడో క్లాసులో చేర్చుకుంటారు” అన్నాడు. వెంటనే “వాటిజ్ యువర్ నేమ్?” అని అడిగాడు.

“మై నేమీజ్ శ్రీనివాసన్” అన్నాడు ఒక పిల్లవాడు.

“వాటీజ్ యువర్ ఫాదర్స్ నేమ్?” ఇది ఆయన అడిగిన రెండో ప్రశ్న.

“మై ఫాదర్స్ నేమీజ్ రామస్వామి నాయుడు.”

“వాట్ క్లాస్ యు పాస్?” ఇది మూడవ ప్రశ్న.

ఆయన వచ్చీ రాని ఇంగ్లీషుని చూసి సుబ్బరామ అయ్యరు లోలోపల నవ్వుకున్నాడు.

“సిక్స్త్ క్లాస్” అని వినయంగా సమాధానం చెప్పాడు శ్రీనివాసన్.

“ఇంక చాలా, అబ్బాయ్! చూస్తే తెలివిగలవాడివిలా వున్నావ్.. ఇలా చకచకా బదులు చెప్పాలి. నువ్వు తప్పకుండా ఏడో తరగతే..”

కుర్రవాడికి అంతులేని సంతోషం.

వృద్ధుడు ఆయన్ని చూసి “మిగిలిన కుర్రాళ్లను కూడా అడగండి ఏవన్నా” అన్నాడు.

“మన ఇంగ్లీషు యింతవరకే. ఇంతకు మించి మా మేష్టారు చెప్పలేదు.” అని బొజ్జ కదిలేటట్లు నవ్వాడు.

ఆయన కెదురుగా కూర్చున్న ఆయన భార్యా సుబ్బరామ అయ్యరూ మందహాసం చేశారు.

“మందేవూరు?” ఆయన్ని అడిగాడు వృద్ధుడు.

“తిరునెల్వేలి జంక్షన్ లో పంకజవిలాస్ కాఫీ క్లబ్బు వుంది చూశారూ అదే మన దుకాణం. చూసేవుంటారు.”

“తిరునెల్వేలికి చిన్నప్పుడు ఎప్పుడో వెళ్లాను.”

“ఆ క్లబ్బు మందే. ఇటువంటి కుర్రాళ్లు వెయ్యి మంది మన హోటల్లో తింటూ చదువుకుంటున్నారు. జంక్షన్లో మన హోటలు విడిచి పెట్టి కాలేజీ కుర్రాళ్లు మరెక్కడికి వెళ్లరు. ఇరవైయైదేళ్లుగా నడుపుతున్నాను హోటలు.”

“ఎవరైనా మంచి హోటల్ని విడిచి పెడతారా?”

ఆయన కుర్రవాళ్ళ వైపు తిరిగి “ఒరేయ్ మీరూ కాలేజీకి వచ్చారంటే, భోజనానికి మన హోటలుకే వస్తారు…” అన్నాడు.

కుర్రవాళ్ళ సంతోషానికి మేరలేదు. పట్టణం ఆసామి ఇంత ఆదరంగా మాట్లాడడం, వాళ్ళకెంతో సంతోషం కలిగించింది.

“ఎంతమంది పిల్లలు మీకు?” అని వృద్ధుడు అడిగాడు.

“మన హోటల్లో భోజనం చేసేవాళ్ళూ, చెయ్యబొయ్యేవాళ్లూ అంతా  మన పిల్లలే!” అన్నాడు.

వృద్ధుడికా సమాధానం సరిగా భోధపడలేదు. అది గ్రహించాడు ఆ హోటలు యజమాని. అయినా ఆ విషయాన్ని వివరించేందుకు ప్రయత్నించకుండా “డబ్బు తీసుకుని సొంత పిల్లలకి భోజనం పెడుతున్నాడా ? అని మీరనుకోవచ్చు. కాని ఏం చేయడం ? హోటలు యజమాని ధర్మం యిది. అయినా నాకు వీలయినంతవరకు ధర్మకార్యాలు చేస్తూనే వున్నాను., చాలామందికి స్కూలు జీతం కట్టడానికి డబ్బు సహాయం చేశాను. వాళ్ళ వద్దనుంచి మళ్ళీ తీసుకోవడమూ వుంది,  తీసుకోక పోవడమూ జరుగుతుంది” అన్నాడు తృప్తిగా. మరుక్షణం భార్యను చూసి ఫలహారాలు సిద్ధం చేయమన్నాడు – ఆయన కోసమే.

“చాలా దూరమా ప్రయాణం?” వృద్ధుడు అడిగాడు.

“మధుర దాకా వెడుతున్నాం. అక్కడొక పెళ్లి.”

మళ్లీ వృద్ధుడు “ఎంత మంది పిల్లలు మీకు?” అని అదే ప్రశ్న వేశాడు.

“చెప్పాను గదా! అందరు పిల్లలూ నా పిల్లలే అని. కంటేనే పిల్లలవుతారా? ఈ నలుగురూ నా పిల్లలే. ఏమంటారు?”

అప్పుడు వృద్ధుడికి అర్థమయింది. ఆ విషయాన్నే మళ్లీ ప్రస్తావిస్తూ “పిల్లలు లేరు కాబోలు. దానికేం లెండి. మీరన్నట్టు లోకంలో వున్న పిల్లలంతా మన పిల్లలే. ఇప్పుడు చూడండి. వీళ్లలో ఒక్కడే నా మనమడు. మిగిలిన ముగ్గురూ వాడితోపాటు చదువుకునే వాళ్లు. వీళ్లందర్ని సొంత పిల్లల మాదిరి కోవిల్ పట్టికి తీసుకు వెడుతున్నాను. చివర కూర్చున్నాడే, ఆ అబ్బాయి వాళ్లు కొంచెం పేదవాళ్లు. వాణ్ణి ఎలా చదివించడమా అని వాళ్ల నాన్న నన్ను సలహా అడిగాడు. పిల్లలతో పాటు మీ వాడూ చదువు కుంటాడు; యిప్పుడు వాడికయ్యే ఖర్చు నేను భరిస్తానని ధైర్యం చెప్పాను. తరువాతి విషయం తరవాత చూసుకోవచ్చునన్నాను. వాడికా చదువుకోవాలని ఎంతో ఆశ. తనను చదివించమని వాడు మూడు రోజులు తిండీతిప్పలూ లేకుండా యేడుస్తూ కూర్చున్నాడు..” అని చెప్పుకు పోతున్నాడు.

హోటలు యజమాని భార్య ఫలహారాల పాత్ర తెరిచింది. అందులోవున్న పిండివంటలు ఒక పెళ్లికి సరిపోయేవన్ని వున్నాయి. ఆయన చెప్ప కుండానే ఒక పెద్ద ఆకుని అయిదారు ముక్కలు చేసి, వాటినిండా రకరకాల పిండి వంటలు వుంచి, ఆ పిల్లలకూ వృద్ధుడికి ఆమె యివ్వబోయింది. పిల్లలు వాటిని తీసుకోడానికి కొంచెం వెనకా ముందూ చూశారు.

“ఒరేయ్ పిల్లలూ! తిండి విషయంలో మొహమాటం చూడకూడదు.. తినండి” అన్నాడు హోటలు యజమాని.

“తీసుకోండి” అన్నాడు వృద్ధుడు కూడా.

అప్పుడు తీసుకున్నారు పిల్లలు.

హోటలు యజమాని ఒక ఆకుని సుబ్బరామ అయ్యరు ముందుంచాడు. ఆయన నాజూకుగా “యిప్పుడే కాఫీ తాగాను. వద్దులెండి. మీరు పుచ్చుకోండి” అన్నాడు. కోటు జేబులోంచి పుస్తకం బయటికి తీశాడు.

అయినా హోటలు యజమాని విడిచి పెట్టలేదు. బలవంతం చేసి, ఆయన చేత ఒక గ్లాసు కాఫీ తాగేటట్లు చేశాడు.

వాళ్లంతా ఫలహారం చేసేటప్పుడు రైలు నాలాక్టిన్ పుత్తూర్ అనే స్టేషన్లో ఆగి, మళ్లీ బయలుదేరింది.

సుబ్బరామ అయ్యరు పుస్తకం తెరిచి చదవడం మొదలు పెట్టాడు. పిల్లలేమో చేతులు కడుక్కుని కూర్చున్నారు. అయ్యరు చేతిలో వున్న పుస్తకం పేరులోని అక్షరాలు కూడ బలుక్కుని ‘అనాకెరీనా, లియో టోల్ స్టోయ్’ అని మెల్లగా చదివాడు ఒక కుర్రవాడు. అది అయ్యరు  చెవిలో పడింది.

“టోల్ స్టోయ్! ఇదీ సరిగ్గానే వుంది. చెప్పనంత వరకూ టోల్ స్టోయ్ అనేగాని టాల్స్టాయ్ అని ఎలా తెలుస్తుంది” అని అనుకున్నాడు.

కొంచెం సేపయిన తర్వాత, ఆ పిల్లలు తమ చేతుల్లోవున్న కాగితాలు విప్పి చదవసాగారు.

“ఏవిఁట్రా అవి!” అడిగాడు హోటల్ యజమాని.

“మా హెడ్ మాస్టరుగారు రాసిచ్చినవి.”

“ఏం రాసిచ్చారేవిఁటి?”

ఒక కుర్రవాడు బదులు చెప్పాడు. “అవుని గురించి ఇంగ్లీషులో ఒక వ్యాసం. నక్క-ద్రాక్షపళ్ల కథ,  తోడేలూ మేకపిల్ల కథ, స్నేహితునికి ఒక ఉత్తరం….”

“అన్నీ ఇంగ్లీషులోనే – హెడ్మాస్టరుగారు బాగా చదువుకున్నవాడు. బంగారంలాంటి వాడు. కన్నతండ్రిలా పిల్లలకి పాఠాలు చెప్పి, యివన్నీ రాసిచ్చారు” అన్నాడు వృద్ధుడు.

“బాగా చదవండర్రా… వీటిలోంచి ఏదో ఒకటి పరీక్షలో యిస్తారు రాయమని,” అన్నాడు హోటలు యజమాని.

పుస్తకం చదువుతున్నట్టు పైకి నటిస్తూ, వాళ్ల సంభాషణనంతా వింటున్నాడు సుబ్బరామ అయ్యరు.

కాఫీ సేవించిన తర్వాత హోటలు యజమాని “పిల్లలు బాగా చదివే వారిలా కనిపిస్తున్నారు” అన్నాడు వృద్ధుడితో.

“పల్లెటూరి పిల్లలైనా, చదువు మాత్రం గట్టిదే. ఇంతకూ వంతులుగారలాంటి వారు. ఆయనలా కన్నతండ్రి కూడా పిల్లల పట్ల అంత ప్రేమగా వుండడని నా అభిప్రాయం” అన్నాడు వృద్ధుడు.

“అది సరేగానీండి – పంతులుగారు కూడా తండ్రే గదా!” అన్నాడు హోటలు యజమాని.

అది వినేసరికి సుబ్బరామ అయ్యరు ఒళ్ళు గగుర్పొడిచింది.

“అందులో సందేహమేముందండి? ఈ కుర్రాళ్ళు చదువులోనే కాదు, పనిపాటుల్లోనూ సిసింద్రీలే” అన్నాడు వృద్ధుడు.

“పనిపాటులా?”

“అవును. పని చెయ్యకపోతే ఎలా? బడికి వెళ్ళేముందు ఆవుల్ని మేపుతారు. పత్తిగింజలు రుబ్బుతారు. ఇలా ఇంటి పనులు చేసిన తర్వాతే బడికి వెళతారు…”

“భేష్! అలా వుండాలి. బతక నేర్చిన వాడి లక్షణం అది. పనిపాటులు తెలీని చదువు చదువవుతుందా అసలు? పైగా అటువంటి వాడివల్ల ఊరి కేవఁన్నా లాభం వుందా ? పోనీ వాడికి మాత్రం లాభం వుందా?… నా విషయం తీసుకోండి.. నేను రెండో క్లాసు దాటలేదు. బి. యే., యం. యేలు చదివుంటే ఉద్యోగం చేసేవాణ్ణి. అలా వుద్యోగం చేస్తే, యిన్నేళ్లుగా నా వల్ల విద్యార్థులకు వుపకారం జరిగి వుండేదా? నలుగురికి సహాయ పడడమే చదువవుతుంది. అంతే కాని వూరివాళ్లని బెదరగొట్టే చదువు మాత్రం వద్దనే వద్దు … మీ రేమంటారు? “ఇందులో సందేహమేముం దండి” అన్నాడు వృద్ధుడు. వాళ్లిలా మాట్లాడుకుంటూనే వున్నారు. కోవిల్పట్టి స్టేషను వచ్చింది. చదువుతున్నట్టుగా నటిస్తున్న సుబ్బరామ అయ్యరు పుస్తకం మూసివేసి, కోటు జేబులో వుంచాడు. అందరూ దిగే సన్నాహంలో ఉన్నారు.

“ధైర్యంగా పరీక్ష రాయండర్రా. నేను పెద్దవాణ్ణి. మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. మీరంతా ప్యాస్… వెళ్లిరండి. చదువుకోసం తిరునెల్వేలి వస్తే, పంకజ విలాన్ మర్చిపోకండి! గుర్తుంటుంది గదా!” అన్నాడు హోటలు యజమాని.

సుబ్బరామ అయ్యరూ, ఆ కుర్రవాళ్లూ వృద్ధుడూ అంతా బండి దిగారు. వెళ్లేటప్పుడు హోటలు యజమాని వైపు తిరిగి మందహాసం చేస్తూ నమస్క రించి సెలవు తీసుకున్నాడు సుబ్బరామ అయ్యరు. ఆయన వెనకాలే నడిచారు కుర్రవాళ్లు. ఆయనకు ముందు నడవడానికి సందేహించారు. ఆయనంటే పిల్లలకి అంత గౌరవం కలిగింది.

స్టేషను నుంచి బయటికి రాగానే, గుర్రపుబండి కోసం ఎదురుచూస్తూ నుంచున్నాడు అయ్యరు. కోవిల్పట్టి స్టేషన్లో పోర్టరుగా పనిచేస్తున్న ఒకతను ఆ దగ్గర్లో ఒక మూల నుంచున్నాడు. ఆ రోజు అతనికి రాత్రి డ్యూటీ. పిల్లల్నీ వృద్ధుణ్ణీ  చూసి “రండి, రండి” అంటూ అతను వాళ్ల వద్దకు వచ్చాడు. వాళ్లెందుకు వచ్చారో తెలుసుకున్నాడు. అతనూ ఇడై సేవల్ గ్రామస్థుడని వాళ్ల మాటలను బట్టి అయ్యరు గ్రహించాడు.

వాళ్లను తన యింటికి ఆహ్వానించాడు పోర్టరు. టిఫిన్ వగైరాలు అక్కడే. ఆ రాత్రి అక్కడే వుండి, మరునాడు గ్రామానికి వెళ్లవచ్చునని అతనన్నాడు.

శుబ్బరామ అయ్యరుకి గుర్రపుబండి దొరికింది. అది ఎక్కాడు. బండి మలుపు తిరిగేంతవరకూ ఆయన దృష్టి ఆ పిల్లలమీదే వుంది. కుమారపురం స్టేషనూ, స్టేషను మాస్టరుతో జరిగిన సంభాషణా, వేపచెట్ల కమ్మని గాలీ, నల్ల మట్టిలోంచి వచ్చిన సువాసనా, హోటలు యజమాని సౌజన్యం, చదువంటే యేమిటో ఆయనా, స్టేషన్ మాస్టరూ చేసిన నిర్వచనాలూ, పల్లెటూరి ప్రధానోపాధ్యాయుడు పిల్లల్ని తండ్రిలా చూసిన తీరూ, టాల్ స్టాయిని టోల్ స్టోయ్ చదివిన పిల్లల అక్షర జ్ఞానం, పేద పోర్టరు విందు పిలుపూ – ఇవన్నీ ఆయన స్ఫురణకు వచ్చాయి. ఇరవై నిమిషాల రైలు ప్రయాణంలో ఇరవై సంవత్సరాలు చదివినా తెలుసుకోలేని విషయాలు తెలిసిన ఒక సంతోషం.. పల్లెటూరి ప్రధానోపాధ్యాయుడు, హోటలు యజమాని, పోర్టరు – వీళ్లకంటే మంచి ఉపాధ్యాయులు ఈ లోకంలో మరెవరైనా వుంటారా? అని కూడా అనుకున్నాడు. వాళ్ల వద్ద చదవని చదువును ఈ కుర్రవాళ్లు యిక్కడ చదువుతారు! అని తనలో తాననుకున్నాడు. కుమారపురం స్టేషనుకి ప్రయాణీకులు రాకపోవడం కంటే, పై చదువుకని వాళ్లు యిక్కడి బడికి రావడమే హాస్యాస్పదం.. ఆ స్టేషనుకి చలివేంద్రం అనే పేరన్నా ఉంది.. కాని..

సుబ్బరామ అయ్యరు ఇల్లు చేరుకున్నాడు.

వృద్ధుణ్ణి పిల్లల్ని పోర్టరు తన యింటికి తీసుకు వెళ్ళాడు. గ్రామంలో భోజనం చేసి రావడంవల్ల, వాళ్లేమీ తినలేదు. కాని పోర్టరు చేసిన బల వంతం వల్ల కాఫీ మాత్రం తాగారు. మధ్యాహ్నం భోజనం చేస్తామన్నారు. అ తర్వాత అంతా – పోర్టరు కూడా బడికి వెళ్ళారు. బడి వరండాలో వాళ్ళను వుండమని చెప్పి, పోర్టరు ప్రధానోపాధ్యాయుని గది ఎక్కడుందో తెలుసుకుని అక్కడికి వెళ్ళాడు. ఇడైసేవల్ గ్రామంనుంచి ఆరో క్లాసు ప్యాసయి ఏడో తరగతిలో చేరాలని నలుగురు పిల్లలు వచ్చినట్లు ప్రధానో పాధ్యాయుడికి తెలియజేశాడు. ఆయన వెంటనే ఒక ఉపాధ్యాయుణ్ణి పిలిచి రెండు మూడు ప్రశ్న పత్రాలు ఆయనకు యిచ్చి, ఆ విద్యార్థుల్ని పరీక్షించవలసిందిగా చెప్పాడు.

ఒక గదిలో ఆ నలుగురు పిల్లల్నీ విడివిడిగా కూర్చో పెట్టారు. ప్రశ్న పత్రంలోని ప్రశ్నల్ని వ్రాసుకోండని, ఆ ఉపాధ్యాయుడు ప్రశ్నలు చదివాడు. అన్నీ ఇంగ్లీషులోనే ఉన్నాయి. పిల్లలు వాటిని వ్రాసుకున్నారు. ఒక్క గంటలో జవాబులు వ్రాయాలని ఉపాధ్యాయుడు చెప్పాడు. పిల్లలు వ్రాయడం మొదలు పెట్టారు.

పోర్టరూ వృద్ధుడూ బయటికి వచ్చి, ఒక చింతచెట్టు కింద కూర్చుని, ఊరి విషయాలు ముచ్చటించుకో సాగారు.

వదిన్నరకల్లా ఇంగ్లీషు పరీక్ష అయిపోయింది. తర్వాత లెక్కలు, తమిళం, సామాన్య విజ్ఞానశాస్త్రం మొదలైనవాటిలో జరిగాయి పరీక్షలు. అన్నీ పన్నెండుకల్లా అయిపోయినాయి. విద్యార్థులంతా మధ్యాహ్నం భోజనానికి యిళ్ళకు వెళ్ళారు. వాళ్ళను ఆ నలుగురు పిల్లలూ ఎగాదిగా చూస్తూ నిలబడ్డారు. పరీక్షలు పెట్టిన ఉపాధ్యాయుడు వాళ్ళను గదిలోనే కూర్చోబెట్టి, సమాధాన పత్రాలు త్వరత్వరగా దిద్ది, మార్కులు వేశాడు. త ర్వాత ప్రధానోపాధ్యాయుని గదికి వెళ్ళాడు. అప్పుడు పోర్టరూ వృద్ధుడూ అక్కడికి వచ్చారు.

“పరీక్షలు బాగా రాశారా?” అడిగాడు పోర్టరు.

“లెక్కలే కష్టంగా వున్నాయి.”

“?”

“చాలా తేలిక.”

“హెడ్ మాస్టరుగారు చెప్పిన ప్రశ్నలే వచ్చాయి. ఒక్క క్షణంలో రాశాను.” అన్నాడు ఒకడు. మిగిలినవాళ్ళూ అలాగే అన్నారు.

“ఇంగ్లీషు కనక బాగా రాస్తే, ప్యాసయినట్టే” అని పోర్టరు చెపుతూ వుండగా వృద్ధుడు “మా ఊరి పంతులుగారు -ఎలాంటివాడని! ఇక్కడేం అడుగుతారో తెలుసుకుని, అక్కడే అన్నీ చెప్పేశాడు. అదీ తెలివంటే తెలివి” అని ఇడై సేవల్ ప్రధానోపాధ్యాయుణ్ణి నోరార ప్రశంసించాడు.

“అయితే ఆయన ఘటికుడన్నమాట!”

“మరేమనుకున్నావ్! అందుకు తగ్గట్టుగా ఆయన గుణం కూడా బంగారం. ఇలాంటి పంతులుగారు మన వూరికి ఇంతవరకూ రాలేదనుకో. పిల్లలంటే ఆయనకి మహా ప్రేమ! ఆ తర్వాత నువ్వే ఆలోచించుకో” అన్నాడు వృద్ధుడు సగర్వంగా.

అంతా ఫలితం కోసం ఎదురుచూస్తూ మాటల్లో మునిగిపోయారు.

కొంచెం సేపయింది. పరీక్ష పెట్టిన ఉపాధ్యాయుడు అక్కడికి వచ్చి, వృద్ధుణ్ణి పోర్టర్నీ ఆ నలుగురు పిల్లల్నీ ప్రధానోపాధ్యాయుని గదికి తీసుకు వెళ్ళాడు. అప్పుడు వాళ్ళ సంతోషం మాయమయింది. భయం అవరించింది వాళ్లని.

“ఇలా రండి” అంటూ ఒక గదిలోకి తీసుకువెళ్ళాడు. అంతా లోపలికి వెళ్ళారు. ప్రధానోపాధ్యాయుణ్ణి చూడగానే పోర్టరు నమస్కరించాడు. వృద్ధుడు చేతులు జోడించాడు; కాని చేతులు వణికాయి. పిల్లలు అలాగే నిలబడిపోయారు. ఆశ్చర్యంలో మునిగిపోయిన వాళ్ల కళ్లు పెద్దవైనాయి. తమంతట తామే తెరుచుకున్నాయి నోళ్లు.

కుమారపురం స్టేషన్ నుంచి టాల్‌స్టాయ్ పుస్తకం చేత పుచ్చుకుని తమతోపాటు ప్రయాణం చేసిన ఆయనే యిక్కడ ప్రధానోపాధ్యాయుడుగా అసీనుడై వున్నాడు. ఇలా జరుగుతుందని పిల్లలు ఎలా అనుకోగలరు ? “రండి” అని నవ్వుతూ ఆయన వాళ్లని ఆహ్వానించాడు. “పెద్ద పంతులు గారికి దణ్ణం పెట్టండి” అని పోర్టరు చెప్చిన త ర్వాత, వాళ్లు నమస్కరించారు.

“ప్రశ్నలన్నీ కష్టంగా వున్నాయా?” అని అడిగి, నవ్వాడు సుబ్బరామ అయ్యరు. ఆ నవ్వులోని అందమూ ఆకర్షణా ప్రేమా చూసి ఒక కుర్ర వాడి కళ్లు చెమ్మగిల్లాయి.

ఆయన అడిగిన ప్రశ్నకు బదులు చెప్పకుండా అలాగే నిలబడిపోయారు.

తర్వాత “మీ పేర్లు చెప్పండి?” అడిగాడు.

“నారాయణస్వామి, శ్రీనివాసన్, సుబ్బయ్య, తిరుపతి.”

“అంతా ప్యాస్.” అన్నాడు సుబ్బరామ అయ్యరు. ఆ నలుగురు పిల్లల కళ్లనుంచి ఆనందాశ్రువులు రాలాయి.

“అంతా ఏడోక్లాసులో చేరండి. బాగా చదువుకోండి. ప్రతి పరీక్షలోనూ మంచి మార్కులు తెచ్చుకోవాలి.” అని, వృద్ధుణ్ణి వుద్దేశించి “మీ వూరి పంతులుగారే కాదండి, యీ వూరి ఉపాధ్యాయులు కూడా తండ్రి వంటి వాళ్లే. అంతేనా!” అని నవ్వుతూ అయ్యరు అడిగాడు.

“అందులో సందేహం ఏముందండీ!” అన్నాడు వృద్ధుడు తన సహజ ధోరణిలో. మళ్లీ నమస్కరించాడు.

సుబ్బరామ అయ్యరు మందహాసం చేశాడు.

“వెళ్లిరండి” అని వాళ్లను పంపించిన తర్వాత కూడా, ఆయన మనస్సులో కుమారపురం స్టేషను మెదలసాగింది.

తనలో తాను ‘అది పెద్ద బడి’ అనుకున్నాడు సుబ్బరామ అయ్యరు.

30-9-2025

2 Replies to “నన్ను వెన్నాడే కథలు-9”

  1. చాలా బావుంది కథ. చిన్ననాటి చదువుకున్న రోజుల్ని గుర్తు చేసింది. రైల్లో సంభాషణలు ఓ చక్కని అనుభూతినిచ్చాయి. థాంక్యూ సర్ 💐

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%