
రెండేళ్ళ కిందట బైబిల్లో పాతనిబంధనలోని కొన్ని కీర్తనల్నీ, పరమోన్నతగీతాన్నీ తెలుగు చేసాను. 150 కీర్తనల్లో 60 కీర్తనలు ‘ఈశ్వర స్తుతిగీతాలు’ పేరిట డిజిటలు పుస్తకంగా విడుదల చేసాను. ఆ గీతాల్ని నా చిన్నప్పటి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయిని వజ్రమ్మ పంతులమ్మగారికి అంకింతం చేసాను. ఆమెకి నా జీవితంలో నేను ఏమీ చేయలేకపోయాను కాని ఈ కీర్తనల్ని ఆమెకు అంకితమివ్వడం భగవంతుడి అనుగ్రహంగా భావించాను.
పరమోన్నతగీతం అనువాదమైతే చేసానుగాని, కొన్ని వివరణలు, విపులంగా ఒక ముందుమాట రాయాలని అనుకుని రెండేళ్ళుగా ఆ అనువాదాన్ని అలానే వదిలిపెట్టేసాను. ఆ గీతం గురించి చదివే కొద్దీ, రబ్బి అకీవాతో పాటు మహనీయ క్రైస్తవ సాధువులు, అగస్టయిను, సెయింటు జాను ఆఫ్ క్రాసు, థామసు ఆక్వినాసు, సెయింటు థెరేసా ఆఫ్ అవిలా వంటివారే ఆ గీతాన్ని వ్యాఖ్యానించడానికి తాము సరిపోమని భావించినప్పుడు నాలాంటి అల్పజ్ఞుడు ఆ గీతాన్ని ముట్టుకోవడమే ఒక సాహసమనిపించి, ప్రతి సారీ నా వేళ్ళు వొణికేవి.
కానీ ఆ గీతాన్ని అలా వదిలిపెట్టేయడం కూడా నాకు ఇష్టం లేకపోయింది. కాబట్టి సాహసించి, ముందుమాటా, సర్గలవారీగా ఎనిమిది సర్గలకీ వివరణలూ రాసి వారం రోజుల కిందట ‘దివ్యప్రేమ గీతం’ గా వెలువరించాను.
ఈ గీతాన్ని ఆత్మీయురాలు నిర్మలకి కానుక చెయ్యడం కూడా భగవత్సంకల్పంగానే భావిస్తున్నాను. రెండువేల అయిదు వందల ఏళ్ళ యూదీయ, క్రైస్తవ, భగవద్విశ్వాసుల ఆశీస్సులు ఆమెకు ఈ రూపంలో అందుతున్నాయని నమ్ముతున్నాను. ఈ పుస్తకానికి ఆమెనే మొదటి పాఠకురాలు కూడా. ఆమె తన స్పందనను ఈ రోజు ఇలా పంచుకున్నారు. ఆమె ఈ కానుక స్వీకరించడం నా భాగ్యంగా భావిస్తున్నాను.
ప్రియమైన చినవీరభద్రుడు గారికి,
మీ ‘దివ్య ప్రేమ గీతం’ నాకు పుస్తకంగా కాకుండా నా ఆత్మను తాకిన అనుభూతిగా చేరింది, మీ ప్రేమకు, దయకు కృతజ్ఞతలు చెప్పడానికి నా దగ్గర మాటలు లేవు. మీ స్నేహం నా జీవితానికి దివ్య గీతం లాంటిది.
126 పేజీల పుస్తకం చదవటానికి దాదాపు వారం రోజులు పట్టింది. నాలుగు పేజీలు చదవటం మళ్లీ వెనక్కి వెళ్ళటం.
ప్రతి పేజీ ప్రేమను, సౌందర్యాన్ని, సత్యాన్ని కొత్త రూపంలో చూపింది. పాటలో పదాల వెనుక ఉన్న అనురాగాన్ని, పదాల మధ్య ప్రేమని అద్భుతంగా వివరించారు. మీది భావానికి ఆత్మనిచ్చిన వివరణ.
‘ప్రేమ గీతం పాడే మనసు సత్యాన్ని అనుభవించే ఆత్మగా మారుతుంది’ అన్న వ్యాఖ్యానం చదివినప్పుడు ఈ పుస్తకం కేవలం ‘Song of Songs’ కాదు, హృదయగీతమని అనిపించింది.
మీ స్నేహం కూడా ఈ గీతంలానే మృదువుగా, లోతుగా, సహానుభూతితో నిండినది. మీ సున్నిత స్వభావం, మీ ఆలోచనల ప్రకాశం ఈ పుస్తకం పేజీల మధ్య వెలుగులు విరజిమ్ముతున్నాయి.
హృదయపూర్వక కృతజ్ఞతలతో,
మీ స్నేహితురాలు,
నిర్మల
29-9-2025
నిర్మల గారు అదృష్టవంతులు. ఒక దివ్యప్రేమ గీతం అర్హపాత్రులకి చేరటం ఆనందదాయకం . ఇరువురికీ మనఃపూర్వక అభినందనలు.
హృదయపూర్వక నమస్కారాలు సార్!
‘దివ్యప్రేమ గీతం’ పుస్తకాన్ని నిర్మలకి మొదటి పాఠకురాలిగా కానుకగా అందించడం నిజంగా ఒక అనుబంధపు గుర్తు.
ఈ కానుక వెనకున్న భావానికి చినవీరభద్రుడు గారికి స్నేహాభివందనం.
హృదయపూర్వక ధన్యవాదాలు సార్!
గౌరవనీయులు చిన వీరభద్రుడు గారికి నమస్కారాములతో.
ఈ మధ్య కాలంలో “నా కుటీరం” క్రమం తప్పకుండా చదువుతున్నాను. దివ్య ప్రేమగీతం మీ చిన్ననాటి ఉపాద్యాయరాలు గారికి అంకిత మివ్వడం నన్ను ఎంతో కదిలించింది. మీరు సాహిత్యానికి మతము, ప్రాంతము ఎల్లలు ఉండవని నిరూపించారు. ప్రేమ ,కరుణ,మానవీయతలు భాషకు గొప్ప సౌందర్యాన్ని ఇస్తాయి.
మీ రచనను అంకితం పొందిన వజ్రమ్మ గారు ధన్యులు.
S.M.బాషా ,అనంతపురం.
హృదయపూర్వక ధన్యవాదాలు. వజ్రమ్మ పంతులమ్మ గారికి అంకితం ఇచ్చింది ‘ఈశ్వర స్తుతి గీతాలు’. ‘దివ్య ప్రేమ గీతం’ నిర్మల గారి అంకితం ఇచ్చాను.
ఊరికే వ్రాయడం కాదు ఆ అనుభూతి మూలాలకు చేర్చి పాఠకుల హృదయం దానిని స్పృశించి,అందులోనే మునిగిపోవడం మీరు అక్షరాలతో చేసే విద్య.ఇది ఆత్మ తో చేసే వారే చెయ్యగలరు
హృదయపూర్వక ధన్యవాదాలు!
“ప్రేమ గీతం పాడే మనసు సత్యాన్ని అనుభవించే ఆత్మగా మారుతుంది”
ఓహ్… What a flagship expression!
హృదయపూర్వక ధన్యవాదాలు