
ఈ రోజులెప్పటికీ ముగిసిపోవన్నంత సంతోషంతో
ఎవరి చేతులు పట్టుకు
కరచాలనాలు చేసానో
ఒప్పులకుప్పలాడానో
ఈ రోజులెప్పటికీ ముగిసిపోకూడదనుకుంటూ
ఎవరి చేతులు పట్టుకు నడిచానో
నా సమస్త భద్రత పక్కనపెట్టి
ఎవరికి బాసటగా నిలబడ్డానో
ఎవరి చేతులకు నా చేతులడ్డుపెట్టి
కాపు కాచానో
ఆ చేతులు కనబడవు.
అగాధంలోకి జారిపోతున్నప్పుడు
కొనప్రాణం అరచేతుల్లోకి తెచ్చుకుని
అంచులు పట్టుకు వేళ్ళాడుతూ
ఆక్రోశిస్తుంటే
అదేమిటో ఆ చేతులు కనబడవు.
కాని సరిగ్గా అప్పుడే
ఈ చేతులు చూసాను.
కంచెమీద పాకుతున్న
లేత నులితీగల చిటికెనవేళ్ళు పట్టుకుని
ఓపిగ్గా ఒద్దిగ్గా
కంచెమీదకెక్కించే చేతులు
కూలిపోతున్నానని కుమిలిపోయే క్షణాల్లో
కరుణించే చేతులు.
అవి నాకింతదాకా తెలిసినవారి చేతులు కావు
స్నేహితుల చేతులు కావు
బంధువుల చేతులు కావు
నా వల్ల ఉపకారం పొందిన చేతులు కావు
నాతో చెట్టపట్టాలు పట్టుకు నడిచినవి కావు
కాని ఈ చేతులు నాకు తెలుసని
ఇప్పుడు తెలుస్తోంది
అమ్మ కడుపులో ఉన్నప్పణ్ణుంచీ
చుట్టూ పెట్టనికోటలాగా
కాచి కనిపెట్టుకున్న చేతులు.
భగవంతుడి చేతులు.
27-9-2025
❤️❤️ ఆ చేతుల కింద నా శిరసు వంచి… 🙏
Divine.. thank you sir.
ధన్యవాదాలు మానసా!
నైస్
ధన్యవాదాలు
ఆహా!! ఈ కవిత చదువుతున్నపుడు
ఉత్తర గర్భమున తనను కాపాడిన భగవంతుణ్ణి తలచుకున్న పరీక్షన్మహారాజు గుర్తుకొచ్చారు.
అద్భుతం సార్ 🙏🙏❤️🌹
హృదయపూర్వక ధన్యవాదాలు సార్!