వికసిత వ్యక్తిత్వం

పట్టాభిరామ్ గారితో నాది పాతికేళ్ళకి పైబడ్డ పరిచయం, స్నేహం కూడా. హిప్నొటిస్టుగా మొదలైన ఆయన ప్రయాణంలో ఒక వ్యక్తిత్వవికాసవాదిగా, వ్యక్తిత్వ వికాస రచయితగా ఎదగడం, తెలుగు రాష్ట్రాల్లో ఒక ప్రభావశీల శక్తిగా మారడం నా కళ్ళారా చూసాను. ఆయనతో కలిసి చాలా సమావేశాల్లో పాల్గొన్నాను. కలిసి కొన్ని ప్రయాణాలు కూడా చేసేను. ఆ సందర్భంగా ఆయన్ని దగ్గరగా కూడ చూసాను. బయటి ప్రపంచానికి ఆయన ఏ విలువల గురించి చెప్తూ వచ్చేడో, వాటిని తన వ్యక్తిగత జీవితంలో కూడా పాటిస్తుండటం గమనించాను. అందువల్ల ఆయన పట్ల నాకు గౌరవం కలుగుతూ వచ్చింది.

మనిషిగా ఆయన చాలా సరళస్వభావి. అపారమైన వినయం ఆయన సొత్తు. ఆ వినయంతోటే ఆయన ఎందరికో ఆప్తుడు కాగలిగాడు. ఆత్మీయుడిగా మారగలిగేడు. తెలుగు రాష్ట్రాల్లో చాలామంది తమకోసం, తమ కుటుంబసభ్యుల కోసం ఆయన దగ్గరకి కౌన్సిలింగుకి వెళ్తుండటం నాకు తెలుసు. ఆ కౌన్సిలింగులో ఆయన ఏ శాస్త్రీయ సూత్రాల్ని ఉపయోగిస్తూ వచ్చేరో నాకు తెలియదుగానీ, సౌమ్యమైన వదనం, కల్మషంలేని పలకరింపు, తనదగ్గరికి వచ్చిన మనిషి హృదయంలోకి చొరబడగల ఆత్మీయతల వల్ల ఆయన చెప్పే సలహాలు మనుషులు తమ సమస్యల్ని అధిగమించడానికి సాయపడేవి.

ఆయనతో కలిసి మాట్లాడిన సభలూ, చేసిన ప్రయాణాలూ, కలుసుకున్న వ్యక్తులూ, నవ్వుకుంటూనో, గాఢమైన ఆలోచనకు పూనుకుంటూనో మేము గడిపిన క్షణాలు చాలానే ఉన్నా, ఈ క్షణాన, రెండు మూడు అనుభవాలు మీతో పంచుకోదగ్గవిగా గుర్తొస్తున్నాయి.

మొదటిది, మేము 2002 లో అప్పటి భారత రాష్ట్రపతి డా.ఎ.పి.జె.అబ్దుల్ కలాం ను కలుసుకున్న సందర్భం. అప్పటికి ఎమెస్కో సంస్థ కోసం నేను డా. కలాం ‘వింగ్స్ ఆఫ్ ఫైర్’ ను ‘ఒక విజేత ఆత్మకథ’ గా , ‘ఇగ్నైటెడ్ మైండ్స్’ ను’ ‘నా దేశయువజనులారా’ గా అనువదించి ఉన్నాను. ఎమెస్కో అధినేత విజయకుమార్ కి ఆ అనువాదాలు స్వయంగా కలాం కి అందిం చాలనే కోరిక కలిగింది. కానీ భారత రాష్ట్రపతి అపాయింట్ మెంటు దొరకడం సాధ్యమా? ఆయనకు మాకు టైమిస్తాడా లాంటి అనుమానాలు మాకున్నాయి. కాని  భారతదేశపు పూర్వప్రధాని పి.వి.నరసింహారావుగారు మాకు ఆ సమావేశాన్ని సుగమం చేసారు. మేము కలాం ని కలవడానికి వెళ్ళడం నిశ్చయం కాగానే విజయకుమార్ డా. పట్టాభిరాం కూడా మా బృందంలో ఉండాలని అనుకున్నాడు. మేము డా.కలాం ని కలవడం, ఆయన మాతో తన డ్రాయింగురూములో దాదాపు గంటసేపు మాట్లాడటం-ఈ విశేషాలు నేను గతంలో పంచుకున్నాను. అయితే ఆ సందర్భంగా పట్టాభిరాం డా.కలాం మనసునెలా చూరగొన్నాడో ఆ చిన్న విశేషం మాత్రం ఇప్పుడు చెప్పి తీరాలి. మా సమావేశం దాదాపుగా అయిపోవస్తున్నదనగా, పట్టాభిరాం తన కోటులోంచి ఒక హాండ్ కర్ఛీఫ్ లాంటి పొడవైన తెల్లని క్లాతు బయటికి తీసాడు. ‘ఇది చూడండి సార్’ అన్నాడు కలాం తో. డా.కలాం కీ, మాకూ కూడా ఆయన అంత ఆ గుడ్డ ఎందుకు చూపిస్తున్నాడో అర్థం కాలేదు. అప్పుడు పట్టాభిరాం కలాం తో ‘సార్, నేను మీ రచనలు చదవకముందు, నా మనసుకూడా ఇలా మామూలుగా ఉండేది, కానీ మీ పుస్తకాలు, ముఖ్యంగా మీ ఆత్మకథ చదివాక, చూడండి, ఇలా అయిపోయింది’ అంటూ ఆ గుడ్డను రెండుసార్లు గాల్లోకి ఎత్తి ఊపాడు. మా కళ్ళముందే తెల్లటి ఆ గుడ్డ కాస్తా రంగురంగుల పతాకగా మారిపోయింది. ఆ ఇంద్రజాలం చూస్తూనే డా.కలాం తాను భారతరాష్ట్రపతినన్న విషయం మర్చిపోయి చిన్నపిల్లవాడిలా చప్పట్లు కొట్టాడు.

ఆ తరువాత మేము తిరిగి హైదరాబాదు వస్తూండగానూ, వచ్చేక కూడా చాలసార్లు ఆ సంఘటనని పదేపదే తలుచుకోలేకుండా ఉండలేకపోయాను. దాదాపు ఒక నిమిషం వ్యవధిలో ఆ రోజు డా.పట్టభిరాం చేసి చూపించింది వట్టి ఇంద్రజాలమేనా? కాదు. అందులో వ్యక్తిత్వవికాసం రహస్యం ఉంది. చూడండి. ఆ రోజు డా.కలాం ని కలిసినవాళ్ళల్లో విజయకుమార్ పబ్లిషరు. ఆయన చేసిన కృషి తెలుస్తూనే ఉంది. నేను అనువాదకుణ్ణి. నా కృషి కూడా కనిపిస్తూనే ఉంది. కాని పట్టాభిరాం ఎవరు? కేవలం మా మిత్రుడు మాత్రమేనా? డా.కలాం ముందు తన గురించిన విపుల పరిచయం చెప్పుకోడానికి పట్టాభిరాం కి సమయమూ లేదు, అది సందర్భమూ కాదు. కాని తన గురించి డా.కలాం కి ఎంతో కొంత తెలియాలి. ఎలా తెలియాలంటే, తన పేరు ఎప్పుడు వినిపించినా, కలాం కి తాను వెంటనే స్పష్టంగా కళ్ళముందు కనిపించాలి. అంటే ఏమిటి? నువ్వొక ఇంటర్వ్యూకి వెళ్ళావనుకో, నీకు ఒక్క నిమిషం మాత్రమే టైము దొరికిందనుకో, కాని ఆ బోర్డుని నువ్వు నూటికి నూరు శాతం ముగ్ధుల్ని చెయ్యాలని అనుకున్నావనుకో. అదెలా సాధ్యమవుతుందో పట్టాభిరాం ఆ రోజు మాకొక ఉదాహరణ చూపించాడు.

2001 లో అనుకుంటాను, మేము డా.విద్యాసాగర్ రాసిన ‘మనిషొకడే విడిగా మనలేడు’ పుస్తక ఆవిష్కరణకి విశాఖపట్టణం వెళ్ళాం. అప్పట్లో డా.విద్యాసాగర్ గిరిజన కార్పొరేషన్ మేనేజింగు డైరక్టరుగా పనిచేస్తున్నారు. ఆ రోజు ఆయన పుస్తకం సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆవిష్కరించేడు. సమావేశం అయినతరువాత మేమంతా గెస్ట్ హవుజులో డిన్నరు చేస్తూ ఉన్నాం. చాల ఉల్లాసకరమైన సమయం. డా.పట్టాభిరాం కి సీతారామశాస్త్రితో ఆ రోజే పరిచయం. సీతారామశాస్త్రి తాను చిన్నప్పణ్ణుంచీ వింటున్న పట్టాభిరాం ని అవాళ కలుసుకున్న సంతోషంలో ఉన్నాడు. సాధారణంగా అటువంటి తొలిసమావేశాల్లో ఒకరిపట్ల ఒకరు ఆరాధనని మాత్రమే ప్రకటించుకోడానికి ఉత్సాహపడే వేళలవి. కాని మాటల మధ్యలో పట్టాభిరాం సీతారామశాస్త్రితో ‘గురువుగారూ, మీ పాటల్లో ఒక పాట పట్ల మాత్రం నాకు కంప్లైంటు ఉంది’ అని అన్నాడు. అందరూ గతుక్కుమన్నారు. కాని ఆసక్తిగా కూడా చూసారు. సీతారామశాస్త్రికూడా తింటున్నవాడు ఒకక్షణం ఆగి ఆయన ఏం చెప్పబోతాడా అన్నట్టు చూస్తున్నాడు. కాని పట్టాభిరాం ఇవేవీ పట్టించుకోలేదు. ఆయన తన మాటలు కొనసాగిస్తూ ‘మీరు బోటనీ క్లాసు ఉంది, మేటనీ ఆట ఉంది, దేనికో ఓటు వెయ్యరా, హిస్టరీ లెక్చరుంది, మిస్టరీ పిక్చరుంది’ అంటూ ఒక పాట రాసారు కదా. ఆ పాట యువతమీద దుష్ప్రభావం చూపించదా? మీలాంటి సజ్జనుడు రాయవలసిన పాట కాదు కదా అది’ అని అన్నాడు. అంతా నిశ్శబ్దమైపోయారు. ఎవరూ ఏమీ మాట్లాడలేదు. అప్పుడెవరో ప్రయత్నపూర్వకంగా ఆ వాతావరణాన్ని తేలికపర్చడానికి సంభాషణ మరోవేపు మళ్ళించారు. కొంతసేపటికి అంతా ఆ సంభాషణ మర్చిపోయేరు.

కాని నేను మర్చిపోలేదు. ఆ సంఘటనలో పట్టాభిరాం లో రెండు గుణాలు నన్ను ఆకర్షించాయి. మొదటిది, అతనికి యువతరం మీద రచయితలు చూపించగల ప్రభావం మీద అంత నమ్మకం ఉండటం. రెండోది, వినడానికి చాలా అమాయికంగా కనిపించే ఆ నమ్మకంతో, ఆయన ఎటువంటి భేషజం లేకుండా, తమ తొలిసమావేశంలోనే ఆ కవిని నేరుగా అడగ్గలగడం. నిజానికి సీతారామశాస్త్రి కూడా అటువంటి మనిషే. వాళ్ళు రాసిన కవిత్వం తనకి అర్థంకాలేదనిపించినప్పుడు  సుప్రసిద్ధ కవుల్ని కూడా ఆయన నిలదీసి అడగడం నాకు తెలుసు.

రఘుకుమార్ అనే ఆయన ఒంగోలులో సర్వశిక్షా అభియాన్ జిల్లా అధికారిగా పనిచేస్తున్నప్పుడు గిజుభాయి పుట్టినరోజు వేడుక నిర్వహిస్తూ డా.పట్టాభిరాం నీ, నన్నూ కూడా ఆహ్వానించేడు. మేము కలిసి రైల్లో ప్రయాణించేం. ఆ రోజు ఆ మీటింగు ఏదో పెద్ద ఆడిటోరియంలో పెట్టారు. ఆ మొత్తం హాలంతా యువతీయువకులతో కిక్కిరిసిపోయింది. ఉపాధాయులు కాకుండా అంతమందికి గిజుభాయి గురించి ఎలా తెలుసునా అని అనుకున్నాను. కాని పట్టాభిరాం ప్రసంగం మొదలయ్యాక అర్థమయింది, ఆ వచ్చినవాళ్ళంతా పట్టాభిరాం ని వినడానికి వచ్చినవాళ్ళని!

నేను గిరిజన సంక్షేమ శాఖ హెడ్డాఫీసులో పనిచేస్తున్న రోజుల్లో మా ఆఫీసు వాళ్ళకి పట్టాభిరాం నా మిత్రుడని తెలిసింది. ఆయన్ని పిలిచి ఒక మోటివేషను సెషను ఏర్పాటు చెయ్యమని అడిగారు. కాని పారితోషికం మాత్రం ఆయనకు తగ్గట్టుగా ఇచ్చుకోలేమని కూడా చెప్పారు. నేను అదే మాట ఆయన్ని అడిగితే సంతోషంగా వచ్చి సెషను జయప్రదంగా నిర్వహించడమే కాక ఒక్క రూపాయి కూడా పారితోషికం తీసుకోలేదు!

హిప్నొటిస్టుగా ఆయన చేసిన సాధన వల్ల ఆ కంఠస్వరానికి ఒక సమ్మోహనశీలత్వం సిద్ధించిందేమో అని అనుకున్నాను మొదట్లో. కాని ఆయన్ని దగ్గరనుంచి చూసిన తరువాత, తాను ఏ విలువల గురించి మాట్లాడుతున్నాడో ఆ విలువల్ని నమ్ముతున్నందువల్ల, ఆ మాటలకి ఆ ప్రభావశీలత సిద్ధించిందని గ్రహించాను. దీపం వెలుగుతున్నప్పుడే మరొక దీపాన్ని వెలిగించగలుగుతుంది. తనది వికసిత వ్యక్తిత్వం కాబట్టే ఆయన వ్యక్తిత్వ వికాసం గురించి మాట్లాడేడని గ్రహించాను.

పట్టాభిరాం రాసిన పుస్తకాల ఆవిష్కరణ సభల్లో ఒకటి రెండు మీటింగుల్లో నేను పాల్గొన్నాను. మాట్లాడినట్టు కూడా గుర్తు. రెండేళ్ళ కిందట ఎమెస్కో ప్రచురించిన నా కథల సంపుటి ఆవిష్కరణ సమావేశానికి ఆయన కూడా వచ్చాడు. అదే ఆయన్ని చివరి సారి చూడటం అని ఇప్పుడు తెలిసింది.

వేన్.డబ్ల్యు.డయ్యర్ సమకాలిక ప్రపంచంలో వ్యక్తిత్వ వికాసవాదుల్లో అగ్రగణ్యుడు. ఆయన ఒకచోట ఇలా రాసుకున్నాడు. Change the way you look at things, and the things you look at change. తన జీవితకాలం పాటు బి.వి.పట్టాభిరాం ఈ సూత్రానికి ఉదాహరణగా జీవించాడని చెప్పవచ్చు.

2-7-2025

11 Replies to “వికసిత వ్యక్తిత్వం”

  1. Excellent portrayal of a non controversial icons of my youth by you sir. I am now a better fan of Pattabhiram garu and we’ll am a follower of all that you write. What you write moulds my life every day, each day…Regards Sir.

    1. హృదయపూర్వక నమస్కారములు

  2. నిజంగా పట్టాభి రామ్ గారిది వికసిత వ్యక్తిత్వమే సర్. ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల కోసం ఎమ్మెస్కో విజయకుమార్ గారి ఆధ్వర్యంలో ఆయన చేసిన మట్టిలో మాణిక్యాలు కార్యక్రమం ఎందర్నో ప్రభావితం చేసింది. ఆయన మరణం తీరని లోటు.

    1. అవును సార్! మీ స్పందనకు ధన్యవాదాలు.

  3. Lovely memories. ❤️
    మీరు ఆ ఫోటోలో భలే ఉన్నారు సర్…😊😊..డౌన్లోడ్ చేసుకోవడానికి రావట్లేదు..😢

  4. సిరివెన్నెల గారిని ఇంకో సందర్భంలో కూడా ఎవరో..” బోడి చదువులు వేస్టూ..మీ బుర్రంతా భోంచేస్తూ..
    ఆడి చూడు క్రికెట్టు..టెండూల్కర్ అయ్యేటట్టు.. అని రాసినందుకు , అట్లా రాయవచ్చా, పిల్లలు చదువులు మానేయరా అని అడిగారు. ఆయన తన సిగ్నేచర్ స్మైల్ తో …”మామూలు చదువు వేస్ట్ అనీ అనలేదు, ఊరికే ఆడమనీ అనలేదు – టెండూల్కర్ అయ్యేలా ఆడమంటే, ఇక అందులో తప్పేముంది.”.అన్నారు..am a huge fan of Sachin. ఆ ఆన్సర్ భలే ఇష్టం..మీరు శివ పాట గురించి రాస్తే గుర్తొచ్చింది…😊

  5. rammohanthummuri – I am a writer, a poet, a head master, a fater, a husband, and a creative person. I primarily in telugu language.
    Thummuri says:

    చాలా ఏండ్లనుండి వారి గురించి వింటేనే ఉన్నాను. ఎందుకో వారిని చూసేయోగం కలుగ లేదు. వారి విశిష్ట వ్యక్తిత్వాన్ని తెలియజెప్పడం గొప్ప నివాళి. ఆయనకు నా నివాళి.

  6. అద్భుతమైన నివాళి చాలా గొప్పగా రాశారు
    Sir,2022? సంవత్సరం తప్పు పడినట్లు ఉన్నది.

    1. ధన్యవాదాలు సార్! ఆ పొరపాటు సరిదిద్దాను.

  7. ఎంత గొప్ప ఘన నివాళి.. ఎలా ఉండాలో .. ఎలా ఉంటే మాటకు విలువ.. ఎలా బ్రతికితే బ్రతుకు కు సార్థకత లభిస్తాయి సోదాహరణంగా మీ అక్షరాల్లో వారి జీవితం లో తెలుస్తోంది.. గురూజీ 🙏🇮🇳

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%