
విషవృక్షం. బంకింబాబు నవల. నా చిన్నప్పుడు, అంటే మరీ చిన్నప్పుడు, పదేళ్ళ కన్నా చిన్నప్పుడు, నేను పదే పదే చదివిన పుస్తకాల్లో అది కూడా ఉంది. అప్పట్లో పంచాయితీ సమితి వారు కూడా గ్రంథాలయ పుస్తకాలు కొనుగోలు చేసేవారు. అలా కొని ఊళ్ళల్లో సర్కులేటు చేసిన పుస్తకాల్లో కొడవటిగంటి ‘పానకంలో పీచు’, ‘అహింసా ప్రయోగం’ కథల సంపుటాలతో పాటు ‘విషవృక్షం’ కూడా నా చేతుల్లో పడింది. ఆ పుస్తకం ఎన్ని సార్లు చదివానో చెప్పలేను. కాని గడిచిన యాభై ఏళ్ళల్లో మళ్ళా ఆ పుస్తకం నా కంట పడలేదు.
మొన్నామధ్య అనిల్ బత్తుల ఇన్స్టాలో తన దగ్గరున్న పుస్తకాల కవరు పేజీలు పెడుతున్నప్పుడు ఈ పుస్తకం కవరు పేజీ కూడా చూసాను. అది నా చిన్నప్పుడు చదివిన తెలుగు అనువాదంలానే అనిపించింది. ఆ పుస్తకం ఒక్కసారి ఇవ్వగలరా చదివి ఇచ్చేస్తానని అడిగాను.
విషవృక్షం చదవాలనుకుంటే ఎక్కడ దొరకదని? The Poison Tree ఇంగ్లిషు అనువాదం ఇంటర్నెట్టు ఆర్కైవులో ఉంటుందని తెలుసు. కానీ ఆ నా చిన్నప్పటి పుస్తకం చదవాలన్న కోరిక. అప్పట్లో అన్నిసార్లు చదివిన ఆ పుస్తకంలో నిజంగా నాకేమి గుర్తుందో చూసుకుందామని ఒక కుతూహలం.
అనిల్ చాలా ఉదారుడు. నేనడగ్గానే తనే ఆ పుస్తకం స్వయంగా మా ఇంటికి తీసుకొచ్చి మరీ అందచేసాడు. అవును. అదే పుస్తకం. అది దండమూడి మహీధర్ చేసిన అనువాదమని ఇప్పుడు తెలిసింది. ఆ మొదటిపేరా చదవగానే నా చిన్నప్పుడు చదివిన పుస్తకం అదేనని గుర్తుపట్టాను. ఆవురావురుమంటూ ఆ పుస్తకం వెంటనే చదివేసానుగాని, అందులో నాకు ఇప్పటికీ గుర్తున్నవి ‘కుంద’, ”హీర’ మాత్రమేనని అర్థమయింది. మరీ ముఖ్యంగా ఆ నవల చివర్లో హీరా దేవేంద్రబాబుని భయపెడుతూ ‘స్మరగరళ ఖండనం మమ శిరసి మండనం దేహి పదపల్లవముదారమ్’ అని పాడిన గీతగోవిందవాక్యాలు. నవల్లోని ఆ చివరిదృశ్యం ఏదో భయానక బీభత్స వాతావరణాన్ని గుర్తుచేస్తున్నదిగానే ఇన్నేళ్ళపాటూ కూడా నా జ్ఞాపకంలో మిగిలిపోయింది. ఆ దృశ్యంతో పాటు కుందనందినికి కలలో ఆమె తల్లి కనిపించి తనదగ్గరికి వచ్చెయ్యమని చెప్పిన దృశ్యాలు కూడా ఆ వివరాలతో గుర్తులేవుగాని, ఏదో మార్మిక, అలౌకిక విషయంగా గుర్తుండిపోయిందని గుర్తుపట్టాను. ఇవి తప్ప నవల్లో మరేవీ గుర్తులేవు. ఆ కథ అస్సలు గుర్తులేదు. అన్నిటికన్నా ఆశ్చర్యం, కథానాయకుడు నగేంద్రబాబుగాని, అతడి భార్య సూర్యముఖిగాని, వాళ్ళ ఇంట్లో పెరిగిన ఆ విషవృక్షంగాని నాకేమీ గుర్తులేవు. అంటే ఇన్నేళ్ళ తరువాత వెనక్కి తిరిగి చూసుకుంటే, ఆ నవల్లో ఒక అభాగినిగా కుంద ఒక్కతే నా హృదయాన్ని అంటిపెట్టుకుని ఉండిపోయిందంటే, ఆ నా పసిమనసుని సంతోషంకన్నా దుఃఖమే ఎక్కువ ఆకట్టుకున్నదని అర్థమయింది.
2
ఇప్పుడు ఇన్నేళ్ళ తరువాత మళ్ళీ చదివినప్పుడు ఈ నవలని ఇదే మొదటిసారి చదవడం అని చెప్పవచ్చు. ‘విషవృక్షం'(1872-73) బంకించంద్ర ఛటోపాధ్యాయ (1838-94) రాసిన మొదటి సాంఘిక నవలల్లో ఒకటి మాత్రమే కాదు, భారతీయ సాహిత్యంలోనే తొలి సాంఘిక నవల్లో ఒకటి కూడా. ఆ తర్వాత ఆరేళ్ళకుగానీ వీరేశలింగంగారి ‘రాజశేఖర చరిత్ర’ (1878) వెలువడలేదు. చందుమీనన్ మళయాళంలో రాసిన ‘ఇందులేఖ’ (1889) హరినారాయణ ఆప్టే మరాఠీ నవల ‘మథలీ స్థితి’ (1885) వంటివన్నీ ఆ తర్వాత వచ్చినవే. అలా చూసినప్పుడు ఒక సాంఘికనవలగా తన సమకాలిక బెంగాలీ జీవితాన్ని చిత్రించడంలో బంకిం పూర్తిగా సఫలుడు కావడమేకాకుండా, ఇన్నేళ్ళ తరువాత కూడా ఆ నవలని తన పాఠకుల్తో చదివిం చగలిగే శిల్పసౌష్టవాన్ని సాధించేడని కూడా చెప్పవచ్చు.
స్థూలంగా ఆ కథ ఇది: నగేంద్రబాబు గోవిందపూరు జమీందారు. చాలా ఉన్నత వ్యక్తిత్వం, సంస్కారం కలిగినవాడు. సూర్యముఖి అతడి భార్య. వారికి పిల్లల్లేరు. నగేంద్రుడి చెల్లెలు కమల, ఆమె భర్త శ్రీశబాబు కలకత్తాలో ఉంటారు. శ్రీశబాబు అక్కడ ఒక ఆఫీసులో గుమస్తాగా పనిచేస్తుంటాడు. దేవేంద్రబాబుది కూడా గోవిందపూరే. అతడు కూడా చదువుకున్నాడు. గాయకుడు. రసికుడు. కాని స్త్రీలోలుడు. మద్యపానలోలుడు. హీర నగేంద్రుడి ఇంట్లో పరిచారిక. ఆమె తనని మనస్ఫూర్తిగా ప్రేమించే మనిషి కోసం వెతుక్కుంటూ ఉంటుంది.
కథాప్రారంభంలో నగేంద్రుడు గోవిందపూరునుంచి తన జమీకి సంబంధించిన పనులు చూసుకోడానికి పడవమీద బయల్దేరతాడు. కాని ప్రయాణమధ్యంలో పెద్ద తుపాను కమ్ముకుంటుంది. అతడు తన పడవని ఏదో ఒక ఒడ్డుకి చేర్చి ఆ వానలో ఆ దగ్గరలో ఏదేనా గ్రామం ఉందేమోనని వెతుక్కుంటూ వెళ్తాడు. అలా అతడు వెళ్ళి అడుగుపెట్టిన మొదటి ఇంట్లోనే ఒక రోగిష్టి వృద్ధుడూ, నవయవ్వనవతి అయిన అతడి కూతురూ కనిపిస్తారు. నగేంద్రుడు ఆ ఇంటి గుమ్మం దగ్గరకు చేరుకున్నప్పుడే ఆ వృద్ధుడు కూడా కన్నుమూస్తాడు. ఆ పిల్ల వంటరిదైపోయిందని నగేంద్రుడికి అర్థమవుతుంది. ఆ మర్నాడు అతడు ఆ వృద్ధుడికి అంత్యక్రియలు చేయించి, ఆ పిల్ల భారం తనమీద వేసుకుని, ఆమెను కలకత్తా తీసుకువెళ్ళి తన చెల్లెలికి అప్పగిస్తాడు. ఆమె గురించి తన భార్యకి కూడా తెలియచేస్తాడు. అతడి భార్య సూర్యముఖి ఆమెని తమ ఇంటికి తీసుకువచ్చెయ్యమనీ, తమ దూరపుబంధువు తారాచరణ్ కిచ్చి పెళ్ళి చేయవచ్చనీ చెప్తుంది. నగేంద్రుడు కుందను గోవిందపూరు తీసుకొస్తాడు. ఆమెని తారాచరణ్ కి ఇచ్చి పెళ్ళి చేస్తారు. కాని రెండుమూడేళ్ళకే అతడు మలేరియాతో చనిపోతాడు. కుంద వితంతువవుతుంది.
వితంతువులకి పునర్వివాహం శాస్త్రసమ్మతమే అని ఆ బెంగాల్లో ఈశ్వరచంద్ర విద్యాసాగరుడు వాదిస్తూ ఉన్న రోజులు. కాబట్టి కుంద పునర్వివాహానికి అర్హురాలేనని గోవిదపూరు సమాజం కూడా నమ్మడం మొదలుపెట్టింది. ఆ నవయవ్వన వతి అయిన స్త్రీ నెమ్మదిగా నగేంద్రుడి మనసుని కలవరపరచడం అతడి భార్య సూర్యముఖి గుర్తుపట్టింది. కొన్నాళ్ళు సంక్షోభంలోనూ, పైకి చెప్పుకోలేని కలవరంలోనూ గడిపేక, చివరికి నగేంద్రుడు కుందని పెళ్ళి చేసుకుంటాడు. ఆ వెంటనే సూర్యముఖి ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. నగేంద్రుడు కూడా ఆమెని వెతుక్కుంటూ తను కూడా ఇల్లు విడిచిపెట్టేస్తాడు. ఈలోపు దేవేంద్రబాబు కుందమీద కన్నేస్తాడు. అందుకు సాయపడమని ఆ ఇంటిపరిచారిక హీరాని అడుగుతాడు. హీరాకి దేవేంద్రుడిమీద ఇష్టముందిగాని కుందమీద అతడి దృష్టి పడటం ఇష్టంలేదు. ఒకరోజు దేవేంద్రుడు ఆ ఇంటికొచ్చి కుందతో ఎలాగేనా మాట్లాడించే ఏర్పాటు చెయ్యమని అడిగితే, హీరా నలుగురినీ పిలిచి గొడవచేస్తుంది. అవమానంతో దేవేంద్రబాబు పారిపోతాడు. కాని అందుకు ఎలాగేనా హీరా మీద ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటాడు. చివరికి ఒకరోజు ఆమెకి మద్యమిచ్చి ఆ మత్తులో ఆమెని చెరుస్తాడు. ఆమె తెలివిలోకి వచ్చేటప్పటికి ఆమెని తన్ని తరిమేస్తాడు. హీర తాను మోసపోయాననీ చావు తప్ప మరో దారిలేదనీ అనుకుని విషం తెచ్చుకుంటుంది.
ఈలోపు ఎలాగో మొత్తానికి నగేంద్రుడు, సూర్యముఖీ ఇద్దరూ గోవిందపూరు చేరుకుంటారు. ఆ ఇంట్లోనూ, ఆ ఊళ్ళోనూ కూడా పండగ వాతావరణం నెలకొంటుంది. నగేంద్రుడు తనని వచ్చి పలకరిస్తాడని కుంద ఎదురుచూస్తూ ఉంటుంది. కానీ అతడు సూర్యముఖి బతికి తిరిగివచ్చిందన్న సంతోషంలో కుందని మర్చిపోతాడు. ఆ సమయంలో హీర కుందదగ్గరికొస్తుంది. తనతో పాటు విషం కూడా తెచ్చుకుంటుంది. ఆమెకి తెలియకుండా కుంద కొంత విషం సంగ్రహించి తాను ఆత్మహత్య చేసుకుంటుంది. హీర అక్కణ్ణుంచి పారిపోతుంది.
చివరికి హీర పిచ్చిదవుతుంది. ఒకరోజు ఆమె దేవేంద్రబాబు ఇంటికొచ్చి అతణ్ణి భయపెడుతుంది. గతంలో అతడు తన మీద మోజుపడి తనని ఆకట్టుకోడానికి పాడిన అష్టపదినే వికటాట్టహాసంతో పాడుతుంది. దేవేంద్రుడికి భయంతో గుండె ఆగిపోతుంది. ఆ తర్వాత కూడా చాలాకాలం పాటు అక్కడ ‘స్మరగరళ ఖండనం మమ శిరసి మండనం, దేహి పదపల్లవముదారం’ (మన్మథుడనే విషానికి విరుగుడులాగా ఉన్న మొగ్గల్లాంటి నీ పాదాలతో నా శిరసుని అలంకరించు) అనే గీతం వినిపిస్తూ ఉండేదని రచయిత నవల ముగిస్తాడు.
నవల మొదట్లోనే తన తండ్రి మరణించినప్పుడు కుంద నిద్రలో ఉంటుంది. అప్పుడు ఆమెకి కలలో ఆమె తల్లి కనిపిస్తుంది. ఆమెని కూడా తనతో వచ్చెయ్యమంటుంది. కుంద అందుకు మానసికంగా సిద్ధం కాదు. అప్పుడామె తల్లి ఇద్దరు వ్యక్తుల్ని చూపిస్తుంది. వీళ్ళిద్దరూ నీ బరువు బాధ్యతలు తీసుకుంటారుగాని వీళ్ళకు దూరంగా ఉండు అని చెప్తుంది. ఆ తర్వాత జరిగిన సంఘటనల్లో ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు నగేంద్రుడూ, మరొకరు హీర అని కుంద పోల్చుకుంటుంది. జరగబోయే కథని ఇలా సూచించిచెప్పినప్పటికీ, రచయిత తన నవల్లోని ఉత్కంఠ ఏ మాత్రం చెదరకుండా మనల్ని తన వెంటబెట్టుకుపోగలగడం చాలా ఆశ్చర్యమనిపిస్తుంది.
ఈ మాట శిల్పం గురించి చెప్తున్నాను. ఇక నవల చెప్తున్న సందేశమేమిటి? 29 వ అధ్యాయం ఇలా మొదలుపెడుతున్నాడు:
నేను విషవృక్షం గురించి వివరంగా చెప్పడానికి ఉద్యమించాను. ఒకరకంగా చెప్పాలంటే ప్రతి గృహంలోనూ ఈ విషవృక్షానికి చెందిన సూక్ష్మ బీజాలు వుంటూనే వుంటాయి. కామ, క్రోధ, మద, మాత్సర్యాలు లేని మనిషి అంటూ వుంటాడని నేననుకోను. మహమహా జ్ఞాన సంపన్నులే వీటికి దాసులైపోవడం కద్దు. మనస్సు చలిస్తుంది. జ్ఞానులకు, అజ్ఞానులకు మధ్య భేదమేటంటే- జ్ఞానులు తమ చిత్తవృత్తులను అదుపులో వుంచుకోగలుగుతారు. సాధారణ మానవులు వాటిని అదుపులో వుంచుకోలేరు.అటువంటి వ్యక్తులకు యీ విషవృక్షం అంకురించి, పెరిగి, పెద్దదై, పుష్పించి, ఫలితాలను అందిస్తుంది. మనస్సును జయించలేని స్థితిలో ఈ వృక్షం మరింత అభివృద్ది చెందుతుంది. యిది అంత తొందరగా చనిపోయే వృక్షం కాదు. చూడడానికి యిది చాలా అందంగా వుంటుంది. కాని దీని ఫలాలు విషంతో నిండి వుంటాయి. వీటిని రుచి చూస్తే ఆ విషయం బోధపడుతుంది. (పే.131-132)
ఈ మాటల్ని బట్టి చూస్తే నగేంద్రుడి మనసులో కుంద పట్ల కలిగిన సంచలనాన్నే రచయిత విషవృక్షానికి బీజంగా చెప్తున్నాడని అనిపిస్తుంది. కాని అదే సమయంలో దేవేంద్రబాబు, హీరలాంటి వాళ్ళ మనసుల్లో కూడా విషవృక్షం పెరిగి పెద్దదవుతుండటం నవల్లో కనిపిస్తుంది. నిజానికి ఈ నవల్లో రచయిత ఏ ఒక్కరి పట్లా మొగ్గు చూపలేదు. ఎవరినీ ఉత్తములుగానో లేదా అధములుగానో చిత్రించలేదు. కాని, ఈ నవలకి 1884 లో వెలువడ్డ ఇంగ్లిషు అనువాదానికి ముందుమాట రాస్తూ సర్ ఎడ్విన్ ఆర్నాల్డు, that which appears to me most striking and valuable in the book is the faithful view it gives of the gentleness and devotion of the average Hindu wife అని రాసాడు. అలాగని సూర్యముఖి ద్వారా ఒక హిందూసతి సౌశీల్యాన్ని ఉగ్గడించడమే రచయిత ఉద్దేశ్యమై ఉంటే, అతడు దీనికి ‘కల్పవృక్షం’ అని పేరుపెట్టి ఉండేవాడు. అంత సౌశీల్యవతి అయిన భార్య, ఆమె మాట జవదాటని భర్త ఉన్న గృహంలో కూడా విషవృక్షం చిగురించడానికి కారణం కుందవంటి స్త్రీకి ఆశ్రయమివ్వడమని రచయిత అంటున్నాడా? లేక వితంతువులకి వివాహం శాస్త్రసమ్మతమేనని ఈశ్వరచంద్రుడు వాదిస్తూ ఉండటం ఇటువంటి దుష్ఫలితాలకు దారి తీస్తుందని చెప్తున్నాడా? ఆర్నాల్డు ఈ మాట కూడా రాసాడు: In Debendra the Babu paints successfully the ‘young Bengalee’ of the present day, corrupted rather than elevated by his educational enlightenment. ఒక వితంతువు ఎదట ఒక విద్యావంతుడైన బెంగాలీ యువకుడి ఈ ప్రవర్తన చూడగానే మనకు గిరీశం గుర్తురాకుండా ఉండడు. కాని చివరికి దేవేంద్రబాబు పట్ల కూడా రచయిత మనలో ద్వేషాన్నీ, అసహ్యాన్నీ రేకెత్తించడు. మరి ఈ కథద్వారా రచయిత అంతిమంగా చెప్పదలచుకున్నదేమిటి?
1690 లో కలకత్తాతో పాటు మరొక మూడు గ్రామాల్ని కొనుక్కుని ఈస్టిండియా కంపెనీ వ్యాపారకార్యకలాపం మొదలుపెట్టాక, నెమ్మదిగా, స్థానిక రాజకీయాల్లో జోక్యం చేసుకుని, 1757 నాటికి బెంగాలుమీద రాజకీయ అధికారాన్ని సుస్థిరం చేసుకుంది. 1858 నాటికి బెంగాలుతో సహా కంపెనీ పాలనలోని భారతభూభాగం బ్రిటిషు పాలనలోకి వచ్చేటప్పటికి, బెంగాల్లో ఒక నవ్యసమాజం పూర్తిగా బలపడింది. ఈస్టిండియా కంపెనీ వల్ల తలెత్తిన జమీందారుల నవ్యఫ్యూడలిజంతో పాటు, కంపెనీ ఏజెంట్లూ, ఉద్యోగులూ, టోకు, చిల్లర వ్యాపారులూ, సివిల్ సర్వీసు అధికారుల్తో కూడిన ఒక సరికొత్త బెంగాలు రూపొందడమేకాక కొత్తగా లభించిన సంపదను రెండుచేతులా అనుభవిస్తూ ఉంది. దాన్నే ‘భద్రలోక్’ అని పిలిచేవారు. వారు కాక తక్కిన బెంగాలంతా ‘ఛోటాలోక్’. ఈ కొత్త భద్రలోకంలో ఆధునిక విద్య, సామాజిక సంస్కరణలూ, మత సంస్కరణల్తో పాటు ఒక సాంస్కృతిక పునరుజ్జీవనం కూడా సంభవిస్తూ ఉంది. కాని నూట యాభై ఏళ్ళకు పైగా (1690-1858) నడిచిన ఈ పరిణామంలో స్త్రీలకి తగిన స్థానం దక్కనేలేదు. పందొమ్మిదో శతాబ్దం మొదలైనప్పణ్ణుంచీ ఈ ప్రశ్న బెంగాలీ విద్యావంతుల్ని కలవరపరుస్తూనే ఉంది. స్త్రీలు ‘అంతఃపురాల్ని’ దాటి బయటి సామాజిక జీవితంలోకి రావాలనీ, చురుకైన పాత్ర పోషించాలనీ విద్యావంతులు వాదిస్తూ ఉన్నారు. కాని వారిలో అందరు విద్యావంతులూ ఒక్కలానే లేరనీ, కొందరి మాటలకీ, చేతలకీ మధ్య పొంతన లేదనీ బంకింబాబు భావిస్తూ ఉండవచ్చును. అటువంటివారికి ప్రతినిధిగా ఈ నవల్లో దేవేంద్రబాబు కనిపిస్తాడు. అతడు కూడా జమీందారుల కుటుంబానికి చెందినవాడే. కాని, ఎప్పుడో, నగేంద్రబాబు పూర్వీకుడి చేతిలో దేవేంద్రబాబు పూర్వీకుడు కోర్టుకేసుల్లో తన ఆస్తి మొత్తం పోగొట్టుకున్నాడు. పోయిన సంపద మరో రూపంలో రాబట్టుకోడానికి దేవేంద్రబాబు తండ్రి హరిపురం జమీందారు ఏకైక కుమార్తె తో దేవేంద్రుడికి పెళ్ళి చేసాడు. కాని ఆ వివాహంవల్ల దేవేంద్రుడికి సంతోషం లేకుండా పోయింది. అతడి గురించి రచయిత ఇలా రాస్తున్నాడు:
దేవేంద్రుడు కలకత్తాలో కులాసాలు, విలాసాలు అలవాటు చేసుకుని వాటిలోనే నిమగ్నమైపోయాడు. పాపం చేస్తున్నాననే భావాన్ని దూరం చేసుకుని మద్యాన్ని సేవించడం అలవాటు చేసుకున్నాడు. మానసిక బాధల్ని మర్చిపోవడానికి అదొక మంచి సాధమనిపించింది. ఆ అభ్యాసం పెరిగింది. అనుతాప భావన అతనిలో అంతరించింది. కలకత్తానుంచి తిరిగి వచ్చి తోటలో ప్రత్యేకంగా నిర్మించుకున్న భవనంలో ఒంటరిగా వుంటూ తన కోర్కెల్ను తీర్చుకుంటూ కాలక్షేపం చేస్తున్నాడు. బ్రహ్మసమాజాన్ని స్థాపించాడు. వితంతువివాహం, స్త్రీ స్వాతంత్ర్యం మొదలైన విషయాల్లో మాత్రం తారాచరణ్, దేవేంద్రబాబు అభిప్రాయాలు ఒకటిగానే వుండేవి. దేవేంద్రబాబు స్త్రీ స్వాతంత్ర్యం కావాలని అంటున్నాడంటే- ఇందులో అతనికి స్వార్థం లేకపోలేదు. (పే.45)
తన కాలంలో సంఘసంస్కరణ గురించి మాట్లాడే వాళ్ళ పట్ల బంకింబాబుకి ఉన్న సందేహాల్ని ఈ పాత్ర ద్వారా చాలా స్పష్టంగా ప్రకటించాడని చెప్పవచ్చు. తర్వాత రోజుల్లో తన ‘ఘరే-బైరే’ (1916) లో సందీప్ పాత్ర ద్వారా జాతీయోద్యమ ఆదర్శాలు మాట్లాడే వాళ్ల పట్ల టాగోరు ఇటువంటి సందేహాన్నే చూపించాడని అనుకోవచ్చు. కన్యాశుల్కం (1892-1906) లో గిరీశం పాత్ర ద్వారా గురజాడా, సుశీల (1922) కథలో సులేమాన్ పాత్ర ద్వారా చలంగారూ కూడా తమ సమకాలిక సంస్కరణల గురించి మాట్లాడే వాళ్ళపట్లా, జాతీయోద్యమ ఆదర్శాలు మాట్లాడే వాళ్ళ పట్లా ఇటువంటి సందేహాన్నే వ్యక్తపరచడం కూడా మనం గమనించవచ్చు.
దేవేంద్రబాబుకి భార్య అనుకూలవతి కాకపోవడం వల్ల అతడు మద్యపానం ద్వారా చెడ్డదారి తొక్కాడు. మరి అత్యంత అనుకూలవతి అయిన భార్య ఉన్నప్పటికీ నగేంద్రబాబు ఎందుకని రెండో పెళ్ళికి సిద్ధపడ్డాడు? వితంతువులకి మళ్ళీ పెళ్ళికి హక్కు ఉందని ఈశ్వరచంద్రుడు చేస్తున్న పోరాటాన్ని తనకి అనుకూలంగా ఎందుకు మలుచుకున్నాడు? మొదట్లో చేసినట్టుగానే కుందకి మళ్ళా మరొక వరుణ్ణి చూసి వివాహం చేసి ఉండవచ్చునే! తన కుటుంబాన్ని, తన జమీందారీనీ కూడా సంక్షోభంలోకి నెట్టిన ఈ నిర్ణయానికి నగేంద్రుడు ఎవరిని బాధ్యుల్ని చేయగలడు?
నాకనిపిస్తుంది, నగేంద్రుడు కూడా దేవేంద్రబాబులాగా, ఆస్తిపోగొట్టుకుని ఉండిఉంటే కుందని పెళ్ళి చేసుకోడానికి సాహసించి ఉండేవాడుకాడని. బహుశా ఏ మద్యపానానికో బానిసై ఉండేవాడు. మానసికంగా పతితుడై, తన చెడు తలపులు తీర్చుకోడానికి రహస్యంగా ఏవో పాట్లు పడుతుండేవాడు. కాని నగేంద్రుడి సంపద అతడికి తన ప్రలోభాన్ని బాహాటంగా ప్రకటించుకునే అవకాశాన్నిచ్చింది. సంఘసంస్కరణోద్యమం దానికి మతపరంగా ఎదురుకాగల చిక్కుల్ని పక్కకు నెట్టింది. తన భార్య సౌశీల్యం తనకి అడ్డుపడకపోగా, తన దారిని మరింత సుగమం చేసింది.
కాబట్టి రచయిత స్పష్టంగా చెప్పకపోయినా, ఆయన మనసులో సంభవిస్తున్న కలవరమేమిటో నేను అర్థం చేసుకోగలిగాను. అతడేమంటున్నాడంటే, విషవృక్షానికి బీజాలు ప్రతి ఇంట్లోనూ ఉన్నాయి. కోరికల్ని అదుపు చేసుకోడం సాధారణమానవులకి సాధ్యం కాదు. అయినా ఏదోలాగా తమని తాము సంభాళించుకుంటూ జీవితాన్ని నెట్టుకొస్తూ ఉంటారు. కాని సంపద ఉందే, అది, ఆ విషవృక్షానికి నీరుపోసి పెంచిపెద్దచేస్తుంది. సంపద నీడలో మనిషి తానే ఒక విషవృక్షంగా మారిపోగలడు. దాదాపు నూట యాభై ఏళ్ళ పాటు ఈస్టిండియా కంపెనీ ద్వారా బెంగాలుకు ఒనగూడతున్న నడమంత్రపు సిరి బెంగాలు సామాజిక జీవితాన్నీ, గృహస్థ జీవితాన్నీ కూడా అతలాకుతలం చేస్తున్నదని బంకింబాబు గుర్తుపట్టాడు. అందుకు అతడు ఏ ఒక్కరినీ, విడివిడిగా తప్పుపట్టలేడు, కానీ అంతిమంగా సంభవించవలసిన తుపాను సంభవించడం కళ్ళారా చూసాడు.
3
సిద్ధహస్తుడైన రచయిత తన రచన ప్రారంభంలోనే తన రచనాసందేశాన్ని ఇమిడ్చిపెడతాడు. విషవృక్షం నవల్లోని మొదటి పేరా చూడండి:
నగేంద్రుడు పడవమీద వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు. జ్యేష్టమాసపు రోజులవి! ఏ నిమిషంలోనైనా మేఘాలు ఆవరించి వర్షం కురవడానికి, తుఫాను చెలరేగడానికి అవకాశాలు లేకపోలేదు. అందుకే అతని భార్య సూర్యముఖి, బయలుదేరడానికి ముందు తన మీద ఒట్టు వేయించుకుని-పడవను జాగ్రత్తగా తీసుకువెళ్ళవలసిందని, తుఫాను- వర్షం వచ్చే సూచనలు కనిపించడంతోనే పడవను ఒడ్డుకు మళ్ళించుకుపోవలసినదని, ఏ పరిస్థితిలోనూ పడవలో వుండవద్దని-ప్రాధేయపడింది. నగేంద్రుడు సూర్యముఖి చెప్పిన విధంగానే ఆచరించుకుంటానని మాటిచ్చి పడవలోకి ఎక్కాడు..'(పే .5)
అన్నట్టే తుపాను వచ్చింది. తన భార్య సలహా ప్రకారం అతడు పడవలో ఉండకుండా ఊళ్ళోకి అడుగుపెట్టాడు, అక్కడే కుందని చూసాడు. దాంతో అతడి జీవితంలోకి తుపాను ప్రవేశించింది. ఇది కథపరంగా. కాని కావ్యధ్వని ఇందుకు భిన్నంగా ఉంది. అతడి సంసారమనే పడవ తుపానులో చిక్కుకున్నప్పుడు అతడు ఆ పడవలో ఉండకుండా, ఆ పడవను ఒడ్డుకు చేర్చి ఉంటే, ఆ తుపానునుంచి బయటపడి ఉండేవాడు. కానీ అతడలా చేయలేకపోయాడు. దాంతో ఆ తుపాను అతడి సంసారాన్ని అల్లకల్లోలం చేసేసింది.
నిజంగానే విషవృక్షం ఎన్నదగ్గ నవల. మరొక రచయిత ఎవరేనా అయి ఉంటే, తాను రాస్తున్న సాంఘిక నవలని నీతికథగా మార్చేసి ఉండేవాడు. కాని పైకి నీతికథలాగా కనిపిస్తున్న ఈ నవల నిజానికి సాంఘిక నవల కాదు, ఆర్థిక నవల. సమాజంలో సంపద పోగుపడే ప్రతి యుగమూ ఒక తుఫానులాంటిదే అనుకుంటే, నేటి కాలానికి ఈ నవల్లో కనిపిస్తున్న ప్రాసంగికత సామాన్యమైనది కాదు.
Featured image: Fort William of the Kingdom of Bengal of EIC Col. – Engraving by Jan Van Ryne. 1754. Courtesy: British Library
17-6-2025
“సమాజంలో సంపద పోగుబడే ప్రతి యుగమూ ఒక తుఫాను లాంటిదే!”
ధన్యవాదాలు
💐🙇🏻♂️
ఈ పుస్తక పరిచయం చాలా బాగుంది, sir!!
Thanks for discussing the style and the message. Very interestingly you call it “ఆర్థిక నవల”. But it makes sense that money shapes and influences people in many ways.
ధన్యవాదాలు మాధవీ!
చెయ్యి తిరిగిన విశ్లేషకులు మీరు. నవల చదవాలన్న కుతూహలం కలిగించారు. వందనాలు.
హృదయపూర్వక ధన్యవాదాలు మేడం!