వసంతమేఘగర్జన

చూస్తూ ఉండగానే ఆకాశమంతా మబ్బులు
చిక్కబడటం మొదలుపెడతాయి, ఇంటికి
అతిథులు రాబోతున్నారనగానే కుర్చీలు సర్దే
చప్పుళ్లతో పాటు బార్లా తెరిచిన తలుపులు.

అంతదాకా మామూలుగా ఉన్న వాతావరణంలో
ఇంకా ఎవరూ రాకుండానే ఎంతోమంది వచ్చినట్టు
ఒకటే హడావుడి. మరి కాసేపట్లో తెరతీస్తారనగా
నాటకం నడవకుండానే రసధార మొదలవుతుంది.

గార్డు ఊళ వేసిన తర్వాత కూడా ప్లాట్ఫారం మీద
ప్రయాణీకులు రైలెక్కడానికింకా జాగుచేసినట్టు
వీథుల్లో పిల్లలు క్రికెట్టు ఆడుతూనే ఉంటారు
ఇంతలో ఇంజను మోతపెట్టినట్టు కోకిల కూత.

అంతదాకా దిక్కుల్ని కలవరపెట్టిన అలజడి
చల్లబడుతుంది. ఆకాశం గుండె తెరిచిమరీ
స్వాగతం పలికినట్టు వసంతమేఘగర్జన
నినదిస్తుంది. వీథంతా పుష్పవర్షం కురుస్తుంది.

11-4-2025

6 Replies to “వసంతమేఘగర్జన”

  1. వసంతమేఘగర్జన అందరి మనసుకు నచ్చేలా రాయడం మీకే సాధ్యం

  2. శుభోదయం సర్!!కవిత ఆద్యంతమూ చా..లా హృద్యంగా ఉంది!ఉపమానాలు చా..లా సహజంగా ఉన్నాయి!”ఇంజను మోత పెట్టినట్టు కోకిల కూత,ఆకాశం గుండె తెరిచి మరీ స్వాగతం పలికినట్టు వసంత మేఘ గర్జన నినదిస్తుంది!వీధంతా పుష్పవర్షం కురుస్తుంది!అద్భుతం సర్! నిన్న మా ఊళ్ళో కురిసిన వర్షం ఈ రోజు మీ కవితలో ప్రత్యక్ష మైంది!🙏🙏🙏

  3. పొద్దున్నే రాసిన నా కామెంట్ 😢 పబ్లిష్ కాలేదు, not sure if it was not submitted…

    నిన్న ఇక్కడ కూడా వాన పడిందని, వసంత మేఘ గర్జన విన్నాను కానీ, అక్షరాల్లో చూడగలను అనుకోలేదని రాశాను.

    భద్రుడు గారూ, పూల వాన కూడా…ఇప్పుడు కూడా. ❤️

    1. నిన్న వాన కురిస్తే పరిమళం ఇవాళ తాకింది.

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%