
మొన్న ఆదివారం సాయంకాలం కవిసంధ్య ఆధ్వర్యంలో రఘుశేషభట్టార్ కొత్త కవిత్వసంపుటి ‘అసంకల్పిత పద్యం’ ఆవిష్కరించే అవకాశం నాకు లభించింది. శిఖామణి అధ్యక్షత వహించిన ఆ సమావేశంలో మిత్రులు కొప్పర్తి, నాళేశ్వరం శంకరం, తూముచర్ల రాజారాం, శ్రీనివాస గౌడ్ కూడా ఆ పుస్తకం మీద మాట్లాడేరు. రఘు కవితానిర్మాణంలో శిల్పదృష్టి ప్రధానంగా ఉంటుందనే అందరూ భావించడంతో సభ మొత్తం కవిత్వ నిర్మాణం తీరుతెన్నలు మీద ప్రత్యేకమైన సదస్సులాగా నడిచింది.
ఇది రఘు తీసుకువచ్చిన తొమ్మిదవ సంపుటి అయినప్పటికీ నేను ఆయన కవిత్వం చదవడం ఇదే మొదటిసారి. కాబట్టి, ప్రధానంగా మూడు అంశాలమీద నా అభిప్రాయాల్ని క్లుప్తంగా చెప్పాను. మొదటిది, పుస్తకంలో ఆయన కవిత్వంతో పాటు కవి రాసుకున్న ముందుమాట, రెండు ఇంటర్వ్యూలు, రెండు సమీక్షలు కూడా ఉన్నాయి. ఒక ఇంటర్వ్యూలో మొదటి ప్రశ్న, దానికి ఆయనిచ్చిన జవాబు ఇలా ఉన్నాయి:
ప్రశ్న: కవిత్వంలో వస్తు శిల్పాలు సమతూకంలో ఉండాలా? వస్తువొక నెపం మాత్రమే అన్న మీ స్టేట్ మెంట్ ను ఎలా సమర్ధించుకుంటారు?
జవాబు: ఆ రెండూ సమతూకంలో ఉండకపోవటం వల్ల కవిత్వానికి వచ్చిన ఇబ్బందేమీ లేదు. కవి ప్రతిభ అతడి వస్తువులో కన్నా శిల్పంలోనే బయట పడుతుంది. వస్తువెంత పేలవంగా ఉన్నా శిల్పంలో దమ్ముంటే ఆ కవిత నిలబడుతుంది. బండ్లకొద్దీ కవిత్వం రాసినా diction అబ్బని వాళ్ళతో భాష బాగుపడదు కదా. మన ఉద్దేశ్యాలన్నీ భాషను ఉద్ధరించేందుకే ఉపయోగపడాలి. శిల్పం వల్లే మన రాతలు సజీవంగా ఉండగలుగుతాయి.
ఇటువంటి జవాబిచ్చిన కవిని శిల్పవాది అని అనకుండా ఎలా ఉంటారు? కాని లోపల కవిత్వం చదివితే, ఏ ఒక్క కవిత కూడా వస్తురహితంగాలేదు. అలాగని పాతవస్తువునే, గతానుగతిక భావాల్నే, చర్వితచర్వణమైన అనుభూతినే కవితగా మారించ ఉదాహరణ ఒక్కటి కూడా లేదు. చెప్పడంలోనే కాదు, చిత్రించే వస్తువులో కూడా కవి నవ్యతకోసం చూస్తూనే ఉన్నాడు. మరి ఇలాంటి జవాబు ఎందుకిచ్చాడు?
బహుశా అలాంటి ప్రశ్న అడిగారు కాబట్టి అలాంటి జవాబిచ్చి ఉంటాడు. మన తెలుగు కవిత్వప్రపంచంలో ఎవరేనా కవిత నిర్మించడం మీద కొద్దిపాటి శ్రద్ధ చూపించగానే అతణ్ణి రూపవాది అని అనడం ఒక అలవాటుగా మారింది. ఇది ప్రాచ్య, పాశ్చాత్య సాహిత్యశాస్త్రాల్ని అరకొరగా చదివినందువల్ల వచ్చిన అలవాటు. ఉదాహరణకి రూపవాదం అనే మాటని ఎవరో మొదటిసారి ఇంగ్లిషులోని formalism అనే పదానికి సమానార్థకంగా వాడేరు. అప్పణ్ణుంచీ శిల్పం మీద శ్రద్ధ పెట్టండి అని చెప్పిన ప్రతి ఒక్కర్నీ రూపవాది అనడం మనదగ్గర ఒక ధోరణిగా మారిపోయింది. (వాళ్ళల్లో ఎంతమంది రోమన్ జాకబ్ సన్ ని చదివి ఉంటారో తెలీదు.)
కాని మన దగ్గర మొదటినుంచీ ద్రష్ట, స్రష్ట అని రెండు పదాలున్నాయి. ద్రష్ట అంటే చూసేవాడు. చూసింది చూసినట్టుగా రాసేవాడు. యోగ్యతాపత్రంలో శ్రీశ్రీ కవిత్వం గురించి చలంగారు రాసిన ఈ వాక్యాలు సుప్రసిద్ధం:
హృదయం ఎల్లా కంపిస్తే ఆ కంపనకి మాటల రూపాన్ని ఇవ్వడం అతనికే తెలుసు, మాటల్ని కత్తులూ, యీటెలూ, మంటలుగా మార్చటం అతనికే చేతనవును. పద్యాలు చదువుతోంటే, ఇవి మాటలు కావు, అక్షరాలు కావు – ఉద్రేకాలు, బాధలు, యుద్ధాలు – అతని హృదయంలోంచి మన హృదయంలోకి దిరెచ్త్ గా పంపిన ఉత్సాహాలు, నెత్తురు కాలవలనిపిస్తుంది.
కాబట్టి మహాప్రస్థాన గీతాల్లో శ్రీశ్రీ ద్రష్ట. అదే కృష్ణపక్షం పద్యాల్లో కృష్ణశాస్త్రి స్రష్టగా కనిపిస్తాడు. అంటే తన అనుభూతిని ఒక స్వర్ణకారుడి నగని చెక్కినట్టుగా, ఒక హస్తకళాకారుడు ఫిలిగ్రీ అల్లినట్టుగా, నేర్పుగా ఒక పద్యంగా నిర్మించడం. నిజానికి మన భాషల్లోనే కాదు, కేవలం ఒక్క సాహిత్యంలోనే మాత్రమే కాదు, ప్రపంచమంతటా కూడా అధునిక యుగం తలెత్తేదాకా, ప్రతి ఒక్క కళలోనూ స్రష్టలకే ప్రాధాన్యత ఉండేది. అసలు poetry అనే మాట, poesis అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. దాని అర్థం రూపొందించడమనే. ఆ విధంగా చూస్తే poetry అనే మాటకి అసలైన అర్థం ‘శిల్పం’ అనే అనాలి.
కాని ఆధునిక యుగం మొదలయ్యాక ముందు చిత్రకళలో తిరుగుబాటు సంభవించింది. రొమాంటిక్, ఇంప్రెషనిస్టు, మాడర్న్ చిత్రకారులు పాండిత్యం మీద తిరుగుబాటు చేసి spontaneity వైపు మొగ్గు చూపారు. అంటే తక్షణ స్పందన, సద్యః స్పందన అన్న మాట . ఫ్రెంచి రొమాంటిక్ చిత్రకారుల స్ఫూర్తితోనూ, జర్మన్ రొమాంటిక్ కవుల ప్రభావంతోనూ కవిత్వం తీరుతెన్నుల్ని మారుస్తూ ఇంగ్లిషు రొమాంటిక్ కవులు కవిత్వాన్ని spontaneous overflow అని అనడంలో ఆశ్చర్యం లేదు.
కాని మళ్ళా ఏ ఒక్క అధునిక కవి ప్రస్థానాన్ని మనం పరిశీలించినా అతడు తోచింది తోచినట్టుగా రాయడంతో తృప్తి చెందలేదనే అనిపిస్తుంది. ఇది యేట్సులాంటి రొమాంటిక్ కవికీ, ఇలియట్ లాంటి మాడర్న్ కవికీ మాత్రమే కాదు, నెరుడా లాంటి సోషలిస్టు కవికి కూడా వర్తించే అంశమే. ప్రసిద్ధులైన ఆధునిక మహాకవులు తమ జీవితాల్లో కవిత్వ నిర్మాణమ్మీద అపారమైన దృష్టి కనపరిచారని వాళ్ళ కవిత్వాలూ, వ్యాసాలూ, వాళ్ళ ఉత్తరాలూ, ఇంటర్వ్యూలూ సాక్ష్యమిస్తున్నాయి. చివరికి రేనర్ మేరియా రిల్క లాంటి కవికి కవిత్వశిల్పమే ఒక మతంగా మారిపోయిందని కూడా విమర్శకులు రాస్తున్నారు.
ఆధునిక తెలుగు కవుల్లోనూ, సమకాలిక తెలుగు కవుల్లోనూ ఈ స్పృహ బలంగా ఉన్నవాళ్ళ కవిత్వాన్ని పాఠకులు మళ్ళీ మళ్ళీ చదవాలనుకోవడం యాదృచ్ఛికం కాదు. నిజానికి మహాప్రస్థాన గీతాల్లో ద్రష్టగా ఉన్న శ్రీశ్రీ మరోప్రస్థాన గీతాల్లో స్రష్టగా మారడం మనకి కనిపిస్తుంది. అయిదు నిమిషాల్లో మరోప్రపంచం గీతం రాసేయగలిగిన కవికి సదసత్సంశయం రాయడానికి ఇరవయ్యేళ్ళు పట్టిందని తానే చెప్పుకున్నాడు. అది కూడా కనీసం రెండు వెర్షన్లు కనిపిస్తాయి మనకి ఖడ్గసృష్టిలో.
కాబట్టి కవిత్వనిర్మాణం మీద శ్రద్ధ వహించాలని చెప్పేవాణ్ణి రూపవాది అని ఎవరేనా అంటున్నారంటే వాళ్ళకి కవిత్వం గురించి ఏమీ తెలియదనుకోవాలి. ‘ప్రాగ్విపశ్చిన్మతంబున రసము వేయి రెట్లు గొప్పది నవ కథాధృతిని మించి’ అని విశ్వనాథ అన్నాడని విమర్శించడం సులువు. కాని ‘అగ్గిపుల్లా, కుక్కపిల్లా, సబ్బుబిళ్ళా కాదేదీ కవితకనర్హం, ఔనౌను శిల్పమనర్ఘం’ అని శ్రీశ్రీ ఇంకా స్పష్టంగా చెప్పాడన్న విషయం మనం మర్చిపోతూ ఉంటాం.
అయితే ద్రష్ట స్రష్టగా మారే క్రమంలో ఛందస్సులమీదా, పద్యం తాలూకు బిగువు మీదా, అలంకారాలమీదా దృష్టి ఎక్కువయ్యే కొద్దీ అతడి కవిత్వం సాధారణపాఠకుడినుంచి దూరంగా జరిగిపొయ్యే ప్రమాదం ఉంటుంది. అంతిమంగా కవిత్వానికి అసలైన విలువ దాని accessibility లో ఉంటుంది. శిల్పరీత్యా శ్రీకృష్ణదేవరాయలు పెద్దనకన్నా గొప్ప కవి. కాని పాఠకుడు మనుచరిత్రను సమీపించినంత సులువుగా ఆముక్తమాల్యదలోకి ప్రవేశించలేడు. అందుకనే ఆంధ్రకవితాపితామహుడు పెద్దన కాగలిగాడు తప్ప కృష్ణదేవరాయలు కాలేదు.
కవిత్వాన్ని accessible కాకుండా అడ్డుపడేది, శిల్ప వ్యామోహం మాత్రమే కాదు, వస్తువ్యామోహం కూడా. పాండిత్యం మాత్రమే కాదు, సిద్ధాంతం కూడా. ఒక కవిత వినగానే పాఠకుడు తన మనసులో మాట చెప్పాడని ఏ కవితని స్వీకరిస్తాడో ఆ కవిత మాత్రమే నిలుస్తుంది. దానికి సహాయపడేది శిల్పమూ కాదు, వస్తువూ కాదు, కవి తాలూకు సత్యసంధత మాత్రమే. సరిగా ఈ కారణం వల్లనే అలిసెట్టి ప్రభాకర్ కవితలు ప్రజల హృదయాల్లో నిలబడిపోగలిగాయి.
రఘు కవిత్వంలో పద్యనిర్మాణం పట్ల స్పృహ చాలా ఉంది కాబట్టే, ఈ సంపుటిలోని 56 కవితల్లో, ‘రాయని వేళ్ళు’, ‘తెలిసింది’, ‘మాయ’, ‘ఒక పరిపూర్ణ పద్యం’, ‘మిష’, ‘అంకురం’, ‘గుబులు’, ‘ఇంకా దూరం’, ‘మోజు’, ‘కోనేరు’ లాంటి కవితలు కవిత్వం గురించి రాసినవే. వీటిని meta-poetry అనవచ్చు. ప్రతి ఒక్క కవీ తాను ఎంచుకున్న వస్తువునో, ఇతివృత్తాన్నో కవిత్వంగా మారుస్తున్నప్పుడు, తన కావ్యకళ గురించి చెప్పుకోవడం కూడా అనూచానంగా వస్తూ ఉన్నదే. ‘పూతమెరుంగులున్ పసిడిపూప బెడంగులు ..’ అని అల్లసాని పెద్దన చెప్పిన ఉత్పలమాలిక ఆయన Ars Poetica నే. కాని అదే పని శ్రీశ్రీ కూడా చేసాడని మనం మర్చిపోకూడదు. మహాప్రస్థానంలో కనీసం మూడు కవితలు ‘నవకవిత’, ‘ఋక్కులు’, ‘కవితా ఓ కవితా’ కవి తాలూకు Ars Poetica నే. అదే పని రఘు కూడా చేస్తున్నాడు. అయితే సాధారణంగా కవులు ఒకటి రెండు పద్యాల్లో తమ కవిత్వ కళ గురించి చెప్పి ఊరుకుంటారు, కాని జీవితకాలం పాటు అదే విషయం మీద పద్యాలు రాస్తూ ఉండరు కదా అనవచ్చు. కానీ ఇప్పటికాలంలో ఒక కవికి ఎప్పటికప్పుడు కవిత్వమంటే ఏమిటి అనే ప్రశ్న పడే పడే ఉదయించకుండా ఉండదు. ఎవరేనా తాను రాస్తున్నదే కవిత అనీ, కవిత్వానికి తనదే చివరి నిర్వచనమనీ అనుకుంటే, అంతకన్నా విషాదం మరొకటి ఉండదు. అందుకనే
ఎవడైనా కవిత ఇతమిత్థమని అంటే
గోష్పదమంత నీటిలో మునిగి చావమనవలదా
అనాడు బైరాగి.
రఘు కవిత్వంలో ప్రధామైన వస్తువేమిటి? నా ప్రసంగంలో మూడో అంశం ఇదే. రఘు కవిత్వంలో ప్రధానంగా కనిపించేవి, మన జీవితాల్లోంచి, మన చుట్టూ ఉన్న జీవితాల్లోంచి త్వరితంగా అంతరించిపోతున్న విలువలూ, సంస్కారమూను. ముఖ్యంగా ‘కూటమి’, ‘సిద్ధి’ అనే కవితలు కవి హృదయాన్ని బాగా పట్టిస్తున్నవి.
రఘు కవిత్వంలో వస్తువుమీద కన్నా శిల్పం మీద ఎక్కువ మొగ్గు ఉంటుందనే విమర్శని పరాస్తం చేసే కవిత ‘వనదేవత’. మామిడిచెట్టు మీద రాసిన ఈ కవితలో ఆద్యంతం వస్తువు మీద ఫోకస్ చెక్కుచెదరకుండా, కవి అభివ్యక్తి దాన్ని మరింత ప్రకాశవంతం చేసేదిగానే ఉండటం దీనికి కారణమనుకుంటాను. రాబోయే రోజుల్లో రఘు ఇలాంటి కవితల్ని నిర్మిచగలిగితే, అతడి కవితలు, అతడి విమర్శకులకు కూడా accessible కాగలుగుతాయి.
9-4-2025
మంచి గమనింపు సార్
ధన్యవాదాలు గోపాల్!
సాహిత్యానికి సంబంధించిన గొప్ప సత్యాల్ని రఘు గారి కవిత్వాన్ని చూపిస్తూ చెప్పారు. ధన్యవాదాలు సర్
ధన్యవాదాలు సార్
మీ ప్రసంగం విని కొన్ని నా సందేహాలు తీరాయి. వస్తు శిల్పాల మీద చర్చ జరిగింది. ఇంకా జరగాల్సి వుంది. రఘు కవిత్వంలో వస్తు శిల్పాల సమన్వయం గొప్పగా వుంది.
ధన్యవాదాలు సార్!