నానృషిః కురుతే చిత్రమ్

సుప్రసిద్ధ చిత్రకారులు బి.ఎ.రెడ్డిగారి చిత్రకళా ప్రదర్శన ఈ నెల ఏడో తేదీనుంచి నిన్నటిదాకా స్టేట్ గాలరీ ఆఫ్ ఫైను ఆర్టు, మాదాపూరులో జరిగింది. నిన్న ఆ ప్రదర్శన సమాపనోత్సవానికి నన్ను కూడా అతిథిగా ఆహ్వానిస్తే వెళ్ళాను. చిత్రకారులు, చిత్రకళాభిమానులు, బి.ఎ.రెడ్డిగారి కుటుంబసభ్యుల సమక్షంలో ఆ సమావేశం ఎంతో ఆత్మీయంగా జరిగింది. ప్రసిద్ధ చిత్రకళా విమర్శకులు రత్నారావు ముఖ్య అతిథిగా విచ్చేసారు. శ్రీమతి మడిపడగ అన్నపూర్ణ చిత్రకళా ప్రదర్శనకు క్యురేటరుగా వ్యవహరించారు. రెడ్డిగారి పెద్దమ్మాయి చిత్రలేఖకులు పద్మారెడ్డిగారు సభ నిర్వహించారు. ఆమె భర్త, సుప్రసిద్ధ చిత్రకారులు ఎ.రాజేశ్వరరావుగారు, రెడ్డిగారి చిన్నమ్మాయి సుధగారు, ఆమె భర్త తిమ్మారెడ్డిగారు కూడా సభలో ఉన్నారు. రెడ్డిగారు చిత్రించిన 152 చిత్రలేఖనాల సంపుటి ‘స్వధాత్రి’ పేరిట నిన్న విడుదల చేసారు. అది కాక, రెడ్డిగారి పెద్దమ్మాయి, వారి మనమడు వెలువరించిన మరొక జ్ఞాపిక సంచికను కూడా నిన్న విడుదలచేసారు. ఎల్లల్లేని కళారాధన, కల్మషమెరుగని కుటుంబం- నిన్న పొద్దున్న వారి మధ్య గడిపిన క్షణాలు నాకెంతో విలువైనవి.

నిన్న వెలువరించిన ‘స్వధాత్రి’ సంపుటికి నన్ను నాలుగు వాక్యాలు రాయమని రెడ్డిగారు నన్ను ఆదేశించడం నాకు దక్కిన అపురూపమైన గౌరవంగా భావిస్తున్నాను. ఆ ముందుమాట ఇక్కడ మీకోసం మళ్ళా పంచుకుంటున్నాను.


నానృషిః కురుతే చిత్రమ్

బి.ఎ.రెడ్డిగారు ఒక ఋషి. ఆయన ఒక చిత్రకారుడు, ఉపాధ్యాయుడు, పిల్లల ప్రేమికుడు, నిత్యచిత్రకళాసాధకుడు- వీటిలో ఏ ఒక్కటైనా ఆయన్ని తెలుగువాళ్ళు చూసి గర్వించేలా, ప్రేమించేలా చెయ్యగల అంశాలేగాని, ఈ పార్శ్వాలన్నీ కలిసి ఆయనలోని అత్యుత్తమ వ్యక్తిత్వసంస్కారంవల్ల మరింత శోభిస్తున్నాయి. ఒక మనిషి తన జీవితకాలంలో ఎటువంటి పరిణతి సాధించాలని మన పెద్దలు చెప్తూ వచ్చారో అటువంటి పరిపక్వత, సంపూర్ణఫలసిద్ధి రెడ్డిగారి జీవితంలో అనుక్షణం కనిపిస్తుంది.

ఆయన పరిచయమై పాతికేళ్ళు దాటింది. ఈ లోపు అత్తాపూరు, హైదరాబాదు, మన చుట్టూ ఉండే తెలుగు సమాజం, ప్రపంచం ప్రతి ఒక్కటీ గుర్తుపట్టలేనంతగా మారిపోయేయి. కాని రెడ్డిగారు మాత్రం నేను ఆయన్ని చూసిన మొదటిసారి, అత్తాపూరులో సంస్కృతి రూరల్‌ ఆర్టు స్కూల్లో పిల్లలతో కూచుని వాళ్ళకి బొమ్మలు వేయడం ఎలా నేర్పుతూ ఉన్నారో ఇప్పుడూ అలానే ఉన్నారు.

అయితే ప్రతి ఏడాదీ ఆ పిల్లలు మారుతున్నారు. వారిలో ఎంతో కొంతమంది తిరిగి చిత్రలేఖనం, ప్రింటుమేకింగు తమ వృత్తిగా, ప్రవృత్తిగా కొనసాగిస్తూ ఉన్నారు. వారికి బి.ఎ. రెడ్డిగారి జీవితం, ఆయన జీవిత కాలపు సాధన కొండగుర్తులుగా మారేయి. తాము కూడా పిల్లని చేరదీసి వాళ్ళతో రంగులూ, కుంచె పట్టిస్తూ ఉన్నారు.

ఇన్నేళ్ళ జీవితంలో నేనెందరో ఉపాధ్యాయుల్ని చూసాను. వారిలో చాలామంది తమకి అరవైఏళ్ళు దాటాక విశ్రాంతి జీవితం జీవించడాన్ని ఇష్టపడుతూ ఉంటారు. ఎందరో చిత్రకారుల్ని కూడా చూసాను. వారిలో చాలామంది తమ చిత్రకళ ద్వారా ఆర్జన మొదలుపెట్టి, మరింత ఆర్జించడమెట్లా అన్నదానిమీదనే దృష్టిపెడుతూ ఉంటారు. వారి చిత్రకళాసాధనని వారి అంతరంగంకాక కొనుగోలుదారుల అభిరుచి నిర్ణయిస్తూ ఉండటం కూడా చూస్తూ ఉన్నాను. అలాగే ఎందరో కళారాధకుల్ని చూసేను. వారు ఒకప్పుడు గొప్ప కృషి చేసి ఉంటారు. కాని అక్కడే ఆగిపోయి ఉంటారు. మారుతున్న కాలం వారిని నిరాశాపరులుగా మార్చేసింది. మారుతున్న అభిరుచులు వారికి అర్థం కావు. వారు తమ రంగుల్తో, కుంచెల్తో నిస్సహాయులుగా నిలబడి పోయి ఉంటారు. కాని రెడ్డిగారు వీరందరికన్నా ప్రత్యేకమైన వ్యక్తిగా, కళాకారుడిగా కొనసాగడానికి కారణమేమై ఉంటుందా అని ఆలోచిస్తుంటాను.

ఉదాహరణకి ఈ సంపుటంలో 2024 లో, 2025 లో చిత్రించిన చిత్రాలు కూడా ఉన్నాయి. అంటే ఆయన తన ఎనభై నాలుగవ ఏట, ఎనభై అయిదవ ఏట చిత్రించిన చిత్రాలవి! ఆ చిత్రాల్లో ఆ రేఖల్లోగాని, ఆ రంగుల్లోగాని, ఆ ఆకృతుల అమరికలో గాని ఎంత నిర్దుష్టంగా ఉన్నాయి! మామూలుగా చేతులూ, వేళ్ళూ వణికే ఆ వయసులో ఒక యువకుడికి మాత్రమే సాధ్యమయ్యే grip ఆ చిత్రాల్లో కనిపిస్తున్నదంటే అర్థమేమిటి? అది తన జీవితం పట్ల ఆయనకున్న గ్రిప్పు. ఆయన ఆరాధించిన కళామతల్లి ఆయనపైన వర్షించిన అనుగ్రహం. ఆయన చుట్టూ ఉండే చిన్నారుల నిర్మల మనస్సులు ఆయనకిచ్చిన ఆరోగ్యవరదానం.

తన జీవితకాలంపాటు రెడ్డిగారు చేస్తూ వచ్చిన సాధనకి నమూనాగా చెప్పదగ్గ 120 వర్ణచిత్రాలున్నాయిందులో. ఈ బొమ్మలన్నీ ఒక్కచోట చూసినప్పుడు చాలా భావాలు స్ఫురిస్తూ ఉన్నాయి. కాని మూడు అంశాల్ని మాత్రం ఇక్కడ మీతో పంచుకోవాలని ఉంది.

మొదటిది, ఈ చిత్రలేఖనాల్లో ఉట్టిపడే తెలుగు సంస్కృతి. తెలుగు వాళ్ళ జీవితాన్నీ, సంస్కృతినీ ప్రతిబింబించే గొప్ప కళారీతులు కూచిపూడి నాట్యం, కొండపల్లి, ఏటికొప్పాక, నిర్మల్‌ బొమ్మలు, బందరు, కాళహస్తీ కలంకారీ పనితనం, చేర్యాల నఖాషీ చిత్రలేఖనం, లేపాక్షి, రామప్పల శిల్పరామణీయకతలని పోలిన గుణమేదో ఈ బొమ్మల్లో మనకి కనిపిస్తున్నది. ఈ బొమ్మల్ని చూస్తూ ఉంటే సంక్రాంతిరోజుల్లో కృష్ణాగోదావరీ నదీతీర గ్రామాల్లో తిరుగుతున్నట్టుగా ఉంది. ఆ బొమ్మలు ఎంత తెలుగుతనాన్ని పుణికి పుచ్చుకున్నాయంటే చివరకి రామాయణపాత్రలు కూడా తెలుగువాళ్ళల్లానే కనిపిస్తున్నారు.

రెండోది, ఈ చిత్రలేఖనాల్లోని ఆకృతుల అమరిక. ‘గోవర్ధన గిరి’ (2008) ‘పూలకొరకు’ (2005) ‘గ్రామశోభ’ (2005), ‘పెళ్ళిపల్లకి’ (2025) లాంటి చిత్రాల్లో కాన్వాసు స్పేసుని ఆయన వినియోగించుకున్న తీరు మనకి అమరావతి, నాగార్జునకొండ బౌద్ధ శిల్పాల్ని గుర్తుకు తెస్తుంది. ఒకే కాన్వాసుమీద ఎన్నో ఆకృతుల్ని చిత్రించినప్పటికీ, ప్రతి ఆకృతికీ, ఆకృతికీ మధ్య అవిరళమైన స్పేసు ఉన్నట్టుగా కనిపింపచెయ్యడం మామూలు కౌశల్యం కాదు. ఇది తెలుగువాడికే చేతనైన ఒక చిత్రలేఖన నైపుణ్యం. అజంతా బొమ్మల నుంచి దామెర్ల రామారావుగారు పుణికిపుచ్చుకున్న కౌశల్యం ఇది. ఇది రెడ్డిగారి చేతుల్లో గొప్ప సొగసు సంతరించుకుంది.

మూడోది నన్ను ఆశ్చర్యపరిచింది, ఆయన కరోనా కాలాన్ని చిత్రించిన తీరు. ఒక మహమ్మారిని చిత్రించిన తీరుని బట్టే చెప్పవచ్చు, ఆయన ఎంత అప్ట్‌డేటెడుగా ఉన్నారో!

సంతోషమేమిటంటే తన స్ఫూర్తిని, తన దృష్టిని, తన కౌశల్యాన్ని ఆయన తన తదనంతర తరాలకు ధారాళంగా పంచిపెట్టారు, ఇంకా పంచిపెడుతూనే ఉన్నారు. ఏ కళాకారుడైనా కోరుకోవలసింది అటువంటి సాధనని, అటువంటి సాఫల్యాన్ని. ‘నా నృషిః కురుతే చిత్రమ్‌’ (ఋషికాని వాడు చిత్రలేఖకుడు కాలేడు) అనవచ్చు ఆయన్ని చూసి.

27-2-2025

6 Replies to “నానృషిః కురుతే చిత్రమ్”

  1. rammohanthummuri – I am a writer, a poet, a head master, a fater, a husband, and a creative person. I primarily in telugu language.
    Thummuri says:

    ఎందరో చిత్రలేఖనర్షులు .అందరికీ వందనాలు.మా చిన్నతనంలో ఆరవ తరగతిలోనో ఏడవ తరగతి లోనో లలితకళలు అని ఒక పాఠం చదివిన గుర్తు. అప్పుడు మాకు మా బాపే తెలుగు చెప్పేవారు. సంగీతం , సాహిత్యం,నృత్యం, చిత్రలే ఖనం ,శిల్పం ఐదు లలిత కళలు అని చదువుకున్నాము. ఇప్పుడు మీ వల్ల ఆ కళల పారమ్యం తెలుసుకోగలుగుతున్నాం.అసలు మన సంప్రదాయం ఈ ఐదింటిని జీవన విధానం లో అనేక విధాలుగా పొందుపరిచింది . ముగ్గులు , మంగళహారతులు, ఇంటి గోడలపై బొమ్మలు, వినాయకుని మట్టిబొమ్మలు , పండుగలప్పుడు ఆటపాటలు ఇవి అతి సామాన్యులు కూడా వాటిని ఆదరించే విధంగా ఐతే , దేవాలయాల్లో శిల్పాలు ,
    కీర్తనలు , నృత్యాలు, హరికథలు , పురాణ ప్రవచనాలు,కోలాటాలు , చెక్కభజనలు , బతుకమ్మ ఆటలు , అట్లతద్ది, గొబ్బెమ్మలు, పెండ్లి పాటలు, వీటికి తోడు వివాహాది కార్యక్రమాల్లో మేళతాళాలు. , పూలతో అలంకరణలు ఇలా లలితకళల వివిధ రూపాలను ఎంతో నైపుణ్యంతో జీవన శైలిలో ఇమిడ్చారు. మనసుకు ఉల్లాసం కలిగించే ఈ కళల
    ఆదరణ సన్నగిల్లి పోతున్న తరుణంలో మీ వంటి వారు వాటిని గుర్తింపజేయటం సంతోషకరం

  2. గతంలో ఒకసారి రెడ్డి గారి ని పరిచయం చేసారు.గుర్తుంది.ఇది రెడ్డి గారి విరాడ్రూప పరిచయం.
    వారి కి వారి కుటుంబానికి శుభాకాంక్షలు.ఒక ఋషి ని పరిచయం చేసిన మీకు ధన్యవాదాలు.

  3. మీ స్పందనకు నా కడుపు నిండింది.

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%