ఆయన చిత్రాలు తెలుగువాళ్ళ సంపద

డా.కొండపల్లి శేషగిరిరావు గారి శతజయంతి సందర్భంగా ఈరోజునుంచి ఫిబ్రవరి 5 దాకా స్టేట్ గాలరీ ఆఫ్ ఆర్ట్ లో శేషగిరిరావుగారి చిత్రకళా ప్రదర్శన ఉంటుంది. ఆ సందర్భంగా శేషగిరిరావుగారికి నివాళిగా ఈ వ్యాసం.


ఒక గ్రామం మొత్తం పూనుకుంటేనే ఒక మనిషి విద్యావంతుడవుతాడని ఒక ఆఫ్రికన్‌ సామెత. ఒక నగరం మొత్తం పూనుకుంటేనే ఒక పౌరుడు విద్యావంతుడవుతాడని పూర్వకాలపు గ్రీకులు భావించేవారు. డా.కొండపల్లి శేషగిరిరావుగారి జీవితప్రయాణాన్ని దగ్గరగా చూసినవాళ్ళకి ఒక దేశం మొత్తం పూనుకుని ఆయన్ని చిత్రకారుడిగా రూపొందించిందని అర్థమవుతుంది.

ఎటువంటి జీవితం! ఎన్నో ఆశల్తో, కలల్తో బాల్యం గడిచి, యవ్వనంలోకి అడుగుపెట్టిన ఆ యువకుడికి ఎదురైన అనుభవాలు మరొకరికి తటస్తించి ఉంటే ఆ అనూహ్యపరిణామాల కింద అతడు అణగిపోయి ఉండేవాడు. ఎంతో సంకల్ప బలం, ఇచ్ఛా శక్తి ఉన్నప్పటికీ, ఆయనకి ఎదురయినట్లుగా అందరు పెద్దలు, మిత్రులు, దాతలు, స్ఫూర్తి ప్రదాతలు ఎంతమందికి జీవితంలో లభిస్తారు! స్వయంకృషికి, దైవానుగ్రహం పూర్తిగా తోడు నిలబడటం అందరికీ లభించగలిగే జీవితానుభవం కాదు. శేషగిరిరావు గారి జీవితప్రయాణం గురించి తెలుసుకుంటూ ఉంటే అన్నిటికన్నా ముందు కలిగేది పట్టలేని ఆశ్చర్యం. ఆ ఆశ్చర్యం నెమ్మదిగా ఆయనపట్ల అభిమానంగా మారి అక్కడితో ఆగకుండా ఆయన జీవించిన కాలం పట్ల, దేశం పట్ల ఆరాధనగా మారుతుందనడంలో ఆశ్చర్యంలేదు.

1935-48 మధ్యకాలంలో హైదరాబాదు చరిత్ర, తెలంగాణా చరిత్ర చదివేవాళ్ళకి ఆ కాలమంతా మతకల్లోలాలతోనూ, నిజాం మీద తిరుగుబాట్లతోనూ, రజాకారు -కమ్యూనిస్టు పోరాటాలతోనూ నడిచిన రక్తసిక్తచరిత్రగానే గుర్తుండిపోతుంది. కానీ అదేకాలంలో ఒక భూస్వామి బిడ్డని, ఒక దేశ్‌ముఖ్‌ కుమారుణ్ణి, ఒక అగ్రవర్ణానికి చెందిన వాణ్ణి, కులాలకీ, మతాలకీ, ప్రాంతాలకీ అతీతంగా మనుషులు ఎట్లా చేరదీసారో చదువుతుంటే, వళ్ళు గగుర్పొడవకుండా ఉండదు. మనకు తెలిసిన హైదరాబాదు రాజ్య చరిత్ర మొత్తం నాణేనికి ఒకవేపే అని అర్థమవుతుంది. ఒక్క శేషగిరిరావుగారి జీవితం తెలిస్తే చాలు, కల్లోలకాలపు నైజాం చరిత్రలో మరొక వైపు ఎలా ఉండేదో తెలుసుకోడానికి. ఇది మనుషుల చరిత్ర. మనస్వుల చరిత్ర. మనీషుల చరిత్ర.

ఊహించగలమా! ఒక బ్రాహ్మణ యువకుడికి చదువుకోడానికి ఒక మహ్మదీయ పాలనాధికారి తన ఇంట్లో చోటిచ్చాడని! ఊహించగలమా! తక్కిన తెలంగాణా అంతా కమ్యూనిస్టు పోరాటం వైపు అడుగులేస్తుంటే, తన భవిష్యత్తు ఎటు నడవనున్నదో తనకే స్పష్టంగా తెలియని ఒక పదిహేడేళ్ళ నవయువకుడు గాంధీని కలుసుకోడానికి ఉత్సాహపడుతున్నాడని! శేషగిరిరావుగారి జీవితంలో మొదటి పాతికేళ్ళు, అంటే ఆయన సెంట్రల్‌ స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ క్రాఫ్ట్‌లో ఉపాధ్యాయుడిగా చేరేదాకా, ఆ పావుశతాబ్దం జీవితం దానికదే ఒక ఉజ్జ్వల చరిత్ర అని చెప్పవచ్చు. ఆ తర్వాత జీవితంలో ఆయన ఒక చిత్రకారుడిగా, ఉపాధ్యాయుడిగా, మార్గదర్శకుడిగా, చిత్రకళాచరిత్రకారుడిగా, ఒక స్ఫూర్తిప్రదాతగా జీవించడానికి ఆ మొదటి పాతికేళ్ళ జీవితమే గొప్ప పునాది.

యూరపియన్‌ సాహిత్యంలో bildungsroman అనే సాహిత్య ప్రక్రియ ఉంది. ముఖ్యంగా ఎన్నో నవలలు ఆ ధోరణిలో వెలువడ్డాయి. ఒక మనిషి తొలినాటి జీవితంలో, అతడి కుటుంబ పరిస్థితులు, అతడు చేపట్టిన అధ్యయనం, అతడి చుట్టూ ఉన్న పరిస్థితులు, ఆ కాలంలో వీచిన గాలులు అతణ్ణెట్లా తీర్చిదిద్దాయో చిత్రించే రచన అన్న మాట. శేషగిరిరావుగారి పైన ఆనంద్‌ గడప, నిర్మల బిలుక అనే ఇద్దరు చిత్రకళావేత్తలు వెలువరించిన An Odyssey of Life and Art Dr.Kondapalli Seshagirirao (2024 అనే పుస్తకంలో శేషగిరిరావు గారి తొలిజీవితం గురించిన ఈ విశేషాలు చదువుతున్నంతసేపూ నాకు రోమాంచితమవుతూనే ఉన్నది. ఈ ఒక్కభాగమూ దానికదే ఒక నవలగా రావలసిన జీవితం కదా అనిపించింది.

ఆ జీవితమంతా మనకి కనిపించే ఎందరో మహనీయులు, శేషగిరిరావుగారి తండ్రిగారు గోపాలరావు దేశ్‌ ముఖ్‌ మొదలుకుని, గుండవరం హనుమంతరావు, పెండ్యాల రాఘవరావు, వట్టికోట ఆళ్వారుస్వామి, మాడపాటి హనుమంతరావు, మందుముల నరసింగ్‌ రావు, నవాబ్‌ మెహిదీ నవాజ్‌ జంగ్‌, సుకుమార్‌ దేస్కర్‌, మహ్మద్‌ జలాలుద్దీన్‌, ఖాన్‌ బహదూర్‌ సయ్యద్‌ అహ్మద్‌, గులాం యాజ్దానీలు హైదారాబాదు రాజ్యంలోనూ, ఇక నందలాల్‌ బోస్‌. మహేంద్రనాథ్‌ దత్తా, కుమారిల స్వామి వంటివారు శాంతినికేతన్‌ లోనూ , దేవీప్రసాద్‌ రాయ్‌ చౌధురీ వంటివాటి వాడు మద్రాసులోనూ ఆయనపైన నెరిపిన ప్రభావాలు సామాన్యమైనవి కావు. వానమామలై వరదాచార్యులు వంటి సాత్త్వికకవితో ఆయనకు లభించిన సాంగత్యమూ చిన్నది కాదు. మనం పురాణాల్లో చదువుతామే, శివుడు త్రిపురాసుర సంహారానికి పూనుకున్నప్పుడు ప్రతి ఒక్కదేవతా తన శక్తిని ఆయనలో నిక్షిప్తం చేసిందని. అలా వీరంతా తమ తమ ఉజ్జ్వల జీవితాంశలను, తమ ఆత్మలోని కించిత్‌ జ్యోతిర్మయ పార్శ్వాన్ని శేషగిరిరావుగారిలో నిక్షిప్తం చేసారా అనిపిస్తుంది.

అందుకనే, తన జీవితంలో చిత్రలేఖనంలో శేషగిరిరావుగారు సాధించిన పరిణతి, నిర్మించిన ఒక రసమయలోకం మనకి ఆశ్చర్యం కలిగించవు. ఒక పద్మం వికసించాలంటే ఒక పంకం తప్పనిసరి అన్నట్టే, అంత కల్లోలమయ, నిష్ఠుర, ఉద్విగ్నమయ జీవితంలోంచి నడిచి వచ్చాడు కాబట్టే, ఆయన చిత్రలేఖనాలు తామరపూల రేకల్లా, అంత సుకోమలంగా, లలితంగా, ప్రకాశభరితంగా, సాత్వికమయంగా మనకి చూపడుతున్నాయి.

ఒక మనిషి చిత్రకారుడిగాగాని లేదా కళాకారుడిగాగాని రూపొందే క్రమంలో అతడిమీద ఎన్నో ప్రభావాలు పడటం సజహం. చుట్టూ ఉన్న పరిస్థితులు, ఆశనిరాశలు అతణ్ణి ఎన్నో ఆటుపోట్లకు గురిచెయ్యడం సహజం. చాలాసార్లు ఆ పరిణామ క్రమంలో కళాకారుడు పూర్వసంప్రదాయం నుంచి విడివడి కొత్త కళారీతులకి అంకురార్పణ చెయ్యడం కూడా సహజం. కాని ఏ కళాకారుడైతే, కేవలం కళాకారుడిగా మాత్రమే కాక, మనిషిగా కూడా పరిణామం చెందుతూ వస్తాడో, అతడు తన పూర్వసంప్రదాయాన్ని పూర్తిగా తుంచెయ్యడు. అందుకు బదులుగా ఆ సంప్రదాయాన్ని ఒక నవ్యసంప్రదాయంగా పునర్నిర్మిస్తాడు. అలాగని అందరు neo-classical చిత్రకారులకీ ఇది వర్తిస్తుందని చెప్పలేం. శేషగిరిరావుగారు ఒక నవ్యసంప్రదాయవాది కూడా కాడు. ఆయన ఒక కొత్త సంప్రదాయాన్ని నిర్మించాడు. అది పూర్వసంప్రదాయాల్లో దేనికీ కొనసాగింపు కాదు. అజంతా చిత్రరీతులు, కలంకారీ, నఖాషీ, బెంగాల్‌ స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్‌, చీనా, జపాన్‌ చిత్రకళ- ఏ ఒక్కదానికీ అది నకలు కాదు, కొనసాగింపు కాదు. కాని ఆయన చిత్రలేఖనాల్ని చూడగానే మనకి మనం మన గతంతో తెగతెంపులు చేసుకుంటున్నామని అనిపించదు. అందుకు బదులుగా, మనమేదో ఒక మహత్తర కళాసంపదకి వారసులమని ఈ చిత్రకారుడు గుర్తుచేస్తున్నాడే అనిపిస్తుంది. మరొక చిత్రకారుడు, మామూలు చిత్రకారుడనే కాదు, ఏ పాటి సామర్థ్యమున్న చిత్రకారుడైనా కూడా శేషగిరిరావుగారికి సమకాలికుడిగా చిత్రకళా సాధన చేసి ఉంటే అటు యూరపియన్‌ ఇంప్రెషనిజానికో, మాడర్నిజానికో లేదా ఇటు బెంగాల్‌, బొంబాయి ప్రభావాలకో, అదీ కాదంటే, చీనాజపాన్‌ చిత్రకారులకో అనుకరణగా మారిపోకుండా ఉండేవాడు కాడని చెప్పగలం. కాని శేషగిరిరావుగారిని అలా కాకుండా కాపాడిరది ఏమిటి?

ఒకటి ఆయన మీద పడ్డ ప్రభావాల విస్తృతి. ఆయన తొలిరోజుల్లో ఆయనకి దారిచూపిన జలాలుద్దీన్‌, సయ్యద్‌ అహ్మద్‌ లు సాధారణ చిత్రకారులు కారు. వారు ఆ రోజుల్లోనే గులాం యాజ్దానీ ఆదేశాల మీద అజంతాకి పోయి అక్కడ కొన్నినెలలు నివాసముండి, ఆ భిత్తి చిత్రాలకి నమూనాలు రాసుకొచ్చినవాళ్ళు. అవి ఇప్పటికీ హైదరాబాదు స్టేట్‌ మూజియంలో భద్రంగా ఉన్నాయి. అజంతా చిత్రాలయినా కాలం తాకిడికి వన్నె తగ్గేయేమోగాని, ఈ నకళ్ళు మాత్రం ఇంకా వెలుగులీనుతూనే ఉన్నాయి. అటువంటి చిత్రకారుల నుంచి ఆయన శాంతినికేతన్‌ లో నందలాల్‌ బోస్‌ దాకా ప్రయాణించాడు. అంతేనా! అక్కడ చీనా చిత్రకారుల్ని కూడా కలుసుకున్నాడు. మతాలకీ, దేశాలకీ, జాతులకీ అతీతులైన చిత్రకళా తపస్వుల సాన్నిధ్యం దొరికింది ఆయనకి. వాళ్ళనుంచి లభించిన స్ఫూర్తిని ఆయన సంతులితం చేసుకోగలిగాడు. దా న్నే మనం మనస్తత్వశాస్త్రంలో integration of personality అంటాం. అంటే జీవితంలో తనకి ఎదురవుతున్న వివిధ పార్శ్వాలు తనలో రేకెత్తించే స్ఫూర్తినీ, స్ఫురణల్నీ సమంగా జీర్ణం చేసుకోగలిగినవాడే పరిపూర్ణవ్యక్తిత్వాన్ని సాధ్యం చేసుకోగలుగుతాడు. అతడే గనుక ఒక కళాకారుడైతే విభిన్న ధోరణుల్ని అందంగా కలిపే ఒక రసమయసేతువు కాగలుగుతాడు.

శేషగిరిరావుగారు చిత్రించిన చిత్రాల్లో ఎంత వైవిధ్యముందో తలుచుకుంటే ఆశ్చర్యమేస్తుంది. రామాయణ, మహాభారతాలు, శాకుంతలా లతో పాటు దేవీదేవతలు, గురువులు, చరిత్రనిర్మాతలతో పాటు శిలలు, శిల్పాలు, శిథిలాలు, తరువులు, పశుపక్ష్యాదులు- ప్రతి ఒక్కదానికీ ఆయన ప్రపంచంలో చోటు ఉంది. దివినీ, భువినీ రెండిరటినీ ఆయన తన కాన్వాసుమీద పొదువుకున్నాడు. ఆ చిత్రాల్లో హెచ్చుతగ్గుల్లేవు. నిలువెత్తు కాన్వాసుమీద చిత్రించిన ఒక కావ్యదృశ్యం ఆయన మనసుని ఎంతగా మనకి పట్టిస్తుందో, ఆయన 2012 లో చిట్టచివర గీసిన లేడిబొమ్మ కూడా అంతలానే మన ఎదను రాపాడుతుంది.

శేషగిరిరావుగారి చిత్రకళాసృష్టిలో నాక్కనిపించే విశేషమేమిటంటే, ఆయన్ను మనం ఫలానా లేబిల్‌కి పరిమితం చేయలేక పోవడం. నేను ముందే చెప్పినట్టుగా ఆయన నియో-క్లాసికల్‌ కాడు. ప్రాచీనుడూ కాడు. గ్రామీణకళాకారుడు కాడు, పట్టణజీవితాన్ని చిత్రించే రియలిస్టూ కాడు. కేవలం భిత్తి చిత్రకారుడు కాడు, కేవలం నీటిరంగుల చిత్రకారుడు కాడు. గొప్ప సాహిత్యవేత్త ప్రతి ఒక్క సాహిత్యప్రక్రియనూ చేపట్టినట్టే, చేపట్టిన ప్రతి ఒక్క ప్రక్రియలోనూ తన వైదగ్ధ్యాన్ని చూపించినట్టే, డా.శేషగిరిరావు కూడా చిత్రకళలో ప్రతి ఒక్క మాధ్యమంలోనూ తన కృషి చేపట్టారు. ప్రతి ఒక్క చిత్రలేఖనంలోనూ తన ఆత్మను కొంత వదిలిపెట్టారు.

నేనింతకుముందు ప్రస్తావించిన గ్రంథంలో ఆనంద్‌ గారూ, నిర్మల గారూ శేషగిరిరావు గారు గీసిన కొన్ని చిత్రలేఖనాల మీద తమ ప్రశంసను సవివరంగా మనతో పంచుకున్నారు. అవన్నీ ప్రతి ఒక్కరూ చదవవలసినవి. కాని వాటిలో ప్రతి ఒక్క ప్రశంసనూ చదివిన తరువాత కూడా, ఆ చిత్రలేఖనాల గురించి, మనం ముచ్చటించుకోవలసింది ఇంకా ఎంతో మిగిలిపోయి ఉందనే నాకనిపించింది. ఉదాహరణకి ‘గుహుడు’ అనే తైలవర్ణ చిత్రంపైన వారు రాసింది ఎంతో హృద్యంగా ఉంది. కానీ అన్నిటికన్నా ముందు ఆ చిత్రలేఖనంలో శేషగిరిరావు చూపించిన కాంపొజిషన్‌ నైపుణ్యాల గురించి మాట్లాడుకోవాలి మనం.

అందులో రెండు పాత్రల చేతుల్లో పడవ నడిపే తెడ్లు ఉన్నాయి, రామలక్ష్మణుల చేతుల్లో విల్లం బులున్నాయి. మొత్తం నదీ, పడవా, కొండలూ horizontal గా ఉన్న ఆ శయ్యలో, ఆ నాలుగు ఉపకరణాలూ, వాటితో పాటు పడవ తాలూకు రెండు కొనలూ, మధ్యలో పెట్టిన అమ్ములపొదీ, ఒక సరుకుల మూటా మాత్రమే vertical గా ఉన్నాయి. నిలువుగా ఉండే ఆ ఆరు ఆకృతులూ ఒక చక్కనిరాగంలో వాది, సంవాది స్వరాల్లాగా ఒక లయనీ, తూగునీ సమకూరుస్తున్నాయి. ముఖ్యంగా లక్ష్మణుడి చేతుల్లో ఉన్న విల్లు, గుహుడి చేతుల్లో ఉన్న తెడ్డుకి బదులు పలుకుతున్నట్టుగా ఉంది. పడవా, నదీ, కొండలూ ఏర్పరచిన సమాంతర సంగీతానికి ఈ నిలువుగీతలు తలలూపుతున్నట్టుగా ఉన్నాయి. ఇక మాస్టర్‌ స్ట్రోక్‌ ఏమిటంటే, పడవకు కుడివైపు కొనమీద వాలిన క్రౌంచపక్షి. అది వాలీవాలనట్టు ఉంది. దానికి కొద్దిగా దిగువలో ఒక పక్షి అప్పుడే పడవమీంచి గాల్లోకి తేలినట్టుగా ఉంది. కుడివైపు ఉన్న ఆ రెండు పక్షులకూ ప్రతివాదిస్వరంలాగా ఎడమవైపు అయిదు పక్షులు ఎగురుతూ ఉన్నాయి. మొత్తం ఏడు పక్షులు. సప్తస్వరాలు! అసలు ఏ చిత్రలేఖనంలోనైనా బేసి సంఖ్య సమకూర్చే సౌష్టవం సరిసంఖ్యకి ఎప్పటికీ సాధ్యం కాదు. పడవలో కూడా చూడండి. అయిదుగురు మనుషులు!ఈ ఒక్క చిత్రలేఖనం గురించే ఇలా ఎంతసేపేనా ముచ్చంటిచుకోవచ్చు. చూసే కొద్దీ, ఎన్నెన్నో అందాలు స్ఫురించే కావ్యకృతి ఇది.

నిజానికి శేషగిరిరావు గారు చిత్రించిన ఈ పౌరాణిక ఇతివృత్తాల్ని మనం రంగుల్లో రాసిన ఖండకావ్యాలు అనడమే సమంజసంగా ఉంటుందేమో! అలానే మేనక విశ్వామిత్రుల తైలవర్ణ చిత్రం మీద కూడా ఆ చిత్రవేత్తలు ఎంతో మధురంగా తమ ప్రశంసని మనతో పంచుకున్నారు. కానీ అన్నిటికన్నా ముందు, ఆ చిత్రలేఖనంలోని వర్ణసంయోజనం గురించి కదా మనం చెప్పుకోవాలి!

మామూలుగా నారింజా , నీలమూ పరస్పర పూరకవర్ణాలు. ఇక్కడ రెండు రకాల నారింజలూ, రెండు రకాల నీలాలూ ఉన్నాయి. ఎరుపు-నారింజకి, నీలాకుపచ్చ పూరకవర్ణం, పసుపు-నారింజకి కపిల-నీలం పూరక వర్ణం. విశ్వామిత్రుడు కట్టుకున్న వస్త్రం ఎరుపు-నారింజ. దానికి ఆయన కుడివైపునున్న చెట్టు, ఆయన వెనక ఉన్న శిలాతల్పం నీలాకుపచ్చరంగుల్లో ఉండటంతో ఆ రెండిరటి సంయోజనం గొప్ప శోభని సంతరించింది. విశ్వామిత్రుడి వస్త్రం తాలూకు ఎరుపు-నారింజకి, మేనక చీరలోని పసుపు-నారింజ సమీపసాదృశ్యవర్ణాలుకాగా, ఆ పసుపు-నారింజకు దూరంగా ఉన్న కొండల ముదురునీలం పూరకంగా ఉంది. ఈ నాలుగు వర్ణాలు కలిసి ఆ కాన్వాసుమీద ఒక సంగీతకృతిని ఆలపిస్తున్నట్టుంది. ఆ పరస్పరపూరక వర్ణాల వల్ల ఆ దృశ్యంలో ఒక నాటకీయత సిద్ధించింది. చుట్టూ ఉన్న నీలం ఒక చట్రంలాగా అమరగా, ఆ మధ్యలో ఆ ప్రేమికులిద్దరూ ఒక తేజోమయ మిథునంగా గోచరిస్తున్నారు. అరమోడ్పు కళ్ళతో చూడవలసిన అప్సర విస్ఫారిత నేత్రాల్తోనూ, కళ్ళుమూసుకుని ఉండవలసిన మునీశ్వరుడు అరమోడ్పు కళ్ళతోనూ కనిపిస్తుండటం వెనక ఆ ప్రేమకాంతి వాళ్ళమీద పన్నిన రంగుల వలనే కారణమని మనకి తెలుస్తూనే ఉంది!

ఇలా ఆయన గీసిన ప్రతి ఒక్క తైలవర్ణ చిత్రం గురించీ మాట్లాడుకోవచ్చు. ఇలా అనేక తలాల్లో మనతో మాట్లాడటానికి ఆకృతులు సరిపోవనుకుని, చాలామంది గొప్ప చిత్రకారులు, నైరూప్యచిత్రలేఖనాలు చిత్రిస్తుంటారు. కాని ఆకృతుల్ని కనుగొనగలిగితే, వాటిని చిత్రించవలసినట్టుగా చిత్రిస్తే, అవి మనకి వినిపించే సంగీతం ముందు నైరూప్య చిత్రలేఖనాలు కూడా వెలవెలబోతాయని మనకి, ఇదుగో, ఇటువంటి చిత్రలేఖనాలు చూసినప్పుడు అర్థమవుతుంది.

డా.కొండపల్లి శేషగిరిరావు పూర్తి తెలుగు చిత్రకారుడు. ఆయన చిత్రాలు కాళహస్తి కలంకారీలాగా, చేర్యాల పటచిత్రాల్లగా, అజంతా భిత్తిచిత్రాల్లాగా తెలుగువాళ్ళ సంపద. ఒక తరం ఆయన్ని సృష్టించింది. ఆయన మరికొన్ని తరాలకు స్ఫూర్తిప్రదాతగా నిలిచిపోతాడు.


Featured image and inside paintings by Dr.Kondapalli Seshagiri Rao

20-1-2025

9 Replies to “ఆయన చిత్రాలు తెలుగువాళ్ళ సంపద”

  1. rammohanthummuri – I am a writer, a poet, a head master, a fater, a husband, and a creative person. I primarily in telugu language.
    Thummuri says:

    చాలా ఏండ్ల ( నా ముప్పైల్లో)క్రింద ఆయన గీసిన పోతన బొమ్మ ఆంధ్రప్రభ వారపత్రిక ముఖ చిత్రంగా వచ్చింది. అప్పుడు మొదటిసారి వారి పేరు వినటం . అది కత్తిరించి నా తొలి కవితల డైరీ ‘మందాకిని’( నా తొలి కలం పేరు) మొదటి బ్రౌన్ అట్టపై అతికించుకున్నాను.అదిప్పటికీ నా దగ్గర భద్రంగా ఉంది. అలా వారి పేరు మాత్రమే తెలిసిన నాకు గత పదిహేను సంవత్సరాల కాలం వారి బంధువర్గంతో ఏర్పడిన సాహిత్యం నీహారిణి గారి పరిచయంతో వారి గురించి మరికొంచెం తెలిసినా ఇప్పుడు మీ పోస్టు చదివిన తరువాత ఏమీ తెలియలేదనే అనిపించింది. వరిష్ఠ అధ్యాపకులు
    రచయిత ఒద్దిరాజు మురళీధర్ రావుగారి సాంగత్యం వల్ల కొన్ని వారి జీవితానుభవాలను వినడం జరిగింది. మురళీధర్ రావు గారు శేషగిరిరావు గారిని బాల్యం నుండి ఎఱిగిన వ్యక్తి.
    వారు రాసిన వ్యాస ప్రతి నాకు పంపించినపుడు ఆశ్చర్యపోయాను. మీరు వాటిని చాలా స్పష్టంగా రాసారు. ఒక గొప్ప చిత్రకారుడు మన మధ్య 2012 వరకు ఉన్నా తెలుసుకోలేని , పట్టించుకోలేని , పట్టించుకునే విధంగా ప్రభుత్వము గానీ తత్సంబందిత సంస్థలుగానీ ప్రయత్నించ లేక పోవడం నాకు బాధకలిగించింది. పి.వి. వంటి ప్రముఖులతో తనకు పరిచయాలున్నా తన ప్రకాస్తి కోసం ప్రయత్నించని ఆ కళా తపస్వి నిబద్ధతకు అచ్చెరువు కలిగించింది. శంఖులో పోస్తే గానీ తీర్థం కాదన్నట్లు మీరు విడమరచి చెప్పితే కానీ ఆయన గొప్పతనం తెలియలేదు. మీకు శత సహస్ర నమోవాకములు.

    1. మీ సహృదయ స్పందనకు హృదయపూర్వక నమస్కారాలు.

  2. చిత్రకారులకే చిత్రం గురించి తెలుస్తుంది.
    విశ్వామిత్రుడి ‘ అరమోడ్పు కనులు’ దానికి ఉదాహరణ!
    ఈ వ్యాసం చదివి ఆ చిత్రాలను దగ్గరకు తీసుకుంటేనే ఆ విశేషాలు కనబడేది.లేదంటే పక్షులకు బదులు ‘ తెల్ల మచ్చలు’ కనబడేవి!

  3. కేవలం మీరు మాత్రమే రాయగలిగిన మోనోగ్రాఫ్.
    మేమెరుగని ఒక అద్భుతమైన కళారకారుడిని మీ ద్వారా తెలుసుకోగలిగినందుకు సంతోషంగా ఉంది.
    ధన్యవాదాలు.

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%