
అప్పుడప్పుడూ అనుకుంటాను, అవును, సాహిత్యం కూడా వార్తనే కదా. వార్తల్ని మించిన వార్త. ఎజ్రా పౌండ్ నే కదా అన్నది literature is news that stays the news అని . కానీ ఒక సాహిత్యవేత్తకి ఏదైనా జాతీయ స్థాయి అవార్డు వస్తే తప్ప మన పత్రికలకి అతడి పేరు గుర్తు రాదు. అప్పుడు కూడా లోపల పేజీలలో ఎక్కడో నాలుగు వాక్యాలు రాస్తారు. కానీ ఒక కొత్త పుస్తకం వచ్చినప్పుడు, ఆ మాటకొస్తే ఒక కొత్త కవిత వచ్చినప్పుడు, అంతకన్నా మించిన పతాక శీర్షిక ఉంటుందా పత్రికలకి! 80 ల మొదట్లో అజంతా ‘కంప్యూటర్ చిత్రాలు’ కవిత రాసినప్పుడు చూసాను, పురాణం సుబ్రహ్మణ్య శర్మగారు ఆంధ్రజ్యోతి వారపత్రిక అట్టమీద అజంతా కొత్త కవిత అని ఒక పతాక వార్తలాగా వేసి మరీ లోపల ఆ కవిత అచ్చు వేసారు. మళ్ళా ఎప్పుడూ అటువంటి వార్త కనబడలేదు తెలుగు పత్రికల్లో. ఇన్నాళ్ళకు, ఇదుగో, ఒక రచయిత తన యాభయ్యవ పుస్తకం విడుదలచేస్తే ఒక సాహిత్య పత్రిక దాన్నొక వార్తగా భావించి ఆ రచయితని ఇంటర్వ్యూ చేసింది. నా దృష్టిలో ఒక పత్రిక ఇలా ఇంటర్వ్యూ చేయడమే ఒక పెద్ద వార్త! ఈ ఖ్యాతి అఫ్సర్ దే!
నిజానికి ఒక తెలుగు రచయిత యాభై పుస్తకాలు వెలువరించడం ఏమంత గొప్ప విషయం కాదు. నాకు తెలిసి విశ్వనాథ సత్యనారాయణ గారు రాసిన నవలలే దాదాపు యాభై ఉండి ఉండవచ్చు. కాబట్టి, రాసింది కాదు, ఇంకా రాయవలసింది చాలా ఉంది. Heard melodies are sweet, but those unheard are sweeter.
థాంక్యూ అఫ్సర్! సాధారణంగా సమవయస్కుల్లో ఒక sibling rivalry ఉంటుంది. కాని దాన్ని దాటి నీ సోదరుడి కృషిని సెలబ్రేట్ చేసుకున్నావు చూడు, అది నాకు చాలా నచ్చింది.
యిప్పటి పరిచయం కాదు, వాడ్రేవు చినవీరభద్రుడితో- చిన్ని అడుగులతో బెజవాడలో కలిసి నడిచిన కాలాలు. నిజానికి అంతకుముందే భద్రుడితో పరిచయం. బహుశా నేను ఖమ్మంలో డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే చదివానేమో! చదివిన వెంటనే యెప్పటికీ గుర్తుండిపోయే ఆత్మీయ వాక్య భావ సమ్మేళనం భద్రుడి వచనమైనా, కవిత్వమైనా. నిజానికి ఆ రెండీటీకి అంత తేడాలేదు. ఆ రెండూ సంగమించే స్థలకాలాల్లోనే భద్రుడు నాకు కనిపిస్తాడు. మొదట చదివిన రచనలకూ, ఇప్పుడు వివిధ రూపాల్లో కనిపిస్తున్న భద్రుడికీ పెద్ద దూరమేమీ లేదు. అప్పుడప్పుడూ అనిపిస్తుంది- మరీ అనువాదాల హోరులో కొట్టుకుపోతున్నాడా అని తప్ప! ఎందుకంటే, మా తరంలో అనితర సాధ్యమైన సృజన శక్తి తనలో వుంది. తనదే అయిన ఆలోచనా ధార వుంది. కుదురైన చైతన్య స్రవంతి వుంది. అన్నిటికీ మించి నన్ను అబ్బురపరిచే నిలకడ వుంది. అందుకే సన్నిహిత మిత్రుడిగా నాలోపల తన గురించి యేవో యెదురుచూపులున్నాయి. మరి వొక్క చేతి మీదుగా యాభై పుస్తకాలు రాసే శక్తి యెక్కడి నించి వచ్చి వుంటుంది మరి?! సాధన అనేది గొప్ప లక్ష్యం. నడుస్తూనే వుండడం అన్నది కూడా గొప్ప జీవన పరిష్కారమే. ఆగిపోతామన్న దిగులేదో లోపల రవంత సవ్వడి చేస్తున్నా, సాధనా, నడకా వాటిని అనుసరించే అక్షరాల పంట భద్రుడి చేలో ఋతువుకి విరామం లేదు. వొంటరిగా సేద్యం చేసినా సరే అతని పంట మన కళ్ళకి కన్నుల పంటే.
*
యాభై పుస్తకాల మైలురాయి చేరుకున్న సందర్భంగా సారంగ తరఫున శుభాకాంక్షలు. మీ తరంలో ఇన్ని రచనలు చేసిన అరుదైన వ్యక్తి మీరే అనుకుంటా. ఇది ఎలా సాధ్యపడింది? మీ దినచర్యలో రచన ఎంత భాగం తీసుకుంటుంది?
ముందుగా సారంగకి నా ధన్యవాదాలు. నా యాభయ్యవ పుస్తకంగా బసవన్న ‘మూడు వందల వచనాలు’ విడుదల చేయగానే ఇలా సారంగ నుంచి ఈ అభినందనలు రావడం నాకు కొంత ఆశ్చర్యంతో పాటు ఎంతో సంతోషాన్నిచ్చింది. ఒక రచయిత చేస్తున్న ప్రయాణాన్ని ఇలా ఒక సాహిత్యపత్రిక ఫాలో అవుతున్నదని తెలియడంలో ఒకింత థ్రిల్ కూడా ఉందనుకుంటాను.
నా మొదటి పుస్తకం 1986 లోనే వచ్చినప్పటికీ నేను మధ్యలో చాలాకాలం ఏమీ రాయకుండా గడిపిన కాలం కూడా చాలానే ఉంది. దానికి కారణం ఉద్యోగం అని అనవచ్చుగానీ, అంతకన్నా కూడా సమయనిర్వహణ ఎలా చేసుకోవాలో తెలియకపోవడమే ముఖ్యకారణం. 2000 లో హైదరాబాదు వచ్చినతర్వాత కూడా కొన్నాళ్ళు నాకిది ప్రశ్నగానే ఉండింది. కానీ ఒక మిత్రుడు దాశరథి రంగాచార్య గారి గురించి చెప్పాడు. ఆయన ప్రతి రోజూ మార్నింగ్ వాక్ కి వెళ్ళొచ్చి కనీసం నాలుగైదు పేజీలైనా రాయాలనే నియమం పెట్టుకుని మరీ రచనా వ్యాసంగం కొనసాగిస్తుంటారని. అటువంటి క్రమశిక్షణ వల్లనే ఆయన రిటైర్ అయ్యాక నాలుగు వేదాలూ, పది ఉపనిషత్తులూ అనువాదం చెయ్యగలిగారు. ఆ మాట విన్నతరువాత, నెమ్మదిగా అంటే, 2009-10 నాటికి, నా తెల్లవారు జాము వేళలు నావి అనీ, ఆ సమయం నా చేతుల్లోనే ఉందనీ గ్రహించాను. అప్పణ్ణుంచీ తెల్లవారు జామున రోజూ ఒక గంట సేపు రాయడం పనిగా పెట్టుకున్నాను. ఉద్యోగంలో ఉన్నన్నాళ్ళూ ఎంత పని ఒత్తిడి ఉన్నా, ఎన్ని చికాకులు ఉన్నా, చూడవలసిన ఉత్తరాలూ, ఫైళ్ళూ ఎన్ని ఉన్నా, రాయడం మానేవాణ్ణి కాను. ఇక ఉద్యోగం నుంచి రిటైర్ అయ్యాక ఒక ఏడాది పాటు ఒక వ్రతంలాగా నా బ్లాగులో రోజూ ఒక పోస్టు పెట్టాను.
ఇలా రోజూ ఏదో ఒకటి రాయడాన్ని కొందరు పాజిటివ్ గా చూడకపోవచ్చు. ఎంత రాసావన్నది ముఖ్యంకాదు, ఎంత గాఢంగా, లోతుగా రాసావన్నది ముఖ్యం అని అనవచ్చు. అటువంటి ఉదాహరణలు కూడా మనకి లేకపోలేదు. రోజూ రాయడానికి దాశరథి రంగాచార్య ఒక ఉదాహరణ అయితే, జీవితకాలం లో పట్టుమని పాతిక కవితలు కూడా రాయని అజంతా, పాతిక కథలు కూడా రాయని చాసో కూడా లేకపోలేదు.
కాని నేనేమనుకుంటానంటే రోజూ రాయడం ఒక creative gymnastics. గొప్ప సంగీతకారులు రోజూ తెల్లవారుజాముల్లో రియాజ్ చేస్తుంటారని మనకు తెలుసు. రోజూ రాయడం వల్ల నీ అంతరంగం మరింత సృజనశీలంగా మారుతుంది. రోజూ తెల్లవారగానే బావిలో నీళ్ళూరినట్టు, మొక్కకు పూలు పూసినట్టు, నీ తలపులు రచనలుగా మారతాయి. ‘ఇంధనం అగ్నిగా మారినట్టు నా రోజులు పద్యాలుగా మారాలని’ ఒక కవితలో రాసుకున్నాను కూడా.
ఇన్నేసి రచనలు చేసినప్పుడు మీకు బాగా ఇష్టమైన లేదా మీ మనసుకి బాగా దగ్గరగా వచ్చిన వొకే వొక్క రచన ఏది అంటే ఏం చెప్తారు?
ఈ ప్రశ్నకి జవాబు చెప్పడం కష్టమని మీకు తెలియంది కాదు. కాని నా మొదటి పుస్తకం ‘నిర్వికల్ప సంగీతం’ నాకు చాలా ప్రత్యేకం. నేను రాజమండ్రి వెళ్ళకపోయి ఉంటే, ఆ గోదావరీ, ఆ సాహిత్యసాంగత్యం లేకపోయి ఉంటే ఆ పుస్తకం వచ్చి ఉండేది కాదు. గాథాసప్త శతిలో ఒక కవితలో గోదావరి ఒడ్డు గురించి చెప్తూ ‘శీలోన్మూలాని కూలాని’ అంటాడు కవి. అంటే ఆ నది ఒడ్డున శీలం నిలబడదని. ఇక్కడ శీలం అనే మాటని అన్ని రకాల యాంబిషన్లనీ సూచించే synecdoche గా తీసుకుంటే ఆ నది ఒడ్డున నా యాంబిషన్లన్నీ కూలిపొయ్యి కవిత్వం పట్ల ప్రేమ ఒక్కటే నిలబడిన కాలం అది. ఆ పుస్తకం తేకముందు నాకు సివిల్ సర్వీసు పరీక్షలు రాసి ఐఏఎస్ అవ్వాలని కోరిక ఉండేది. కాని రాజమండ్రి నా అన్నిరకాల యాంబిషన్లనీ ధ్వంసం చేసేసింది. కవిత్వంతో తప్ప మరిదేనితోనూ ప్రేమలో పడలేనని అర్థమయింది నాకు. ఆ ఆరాటమంతా ఎలా ఉన్నది అలా నమోదు అయ్యింది కాబట్టి నిర్వికల్ప సంగీతం నాకు ప్రత్యేకం.
మీ సమకాలీనుల్లో ఇప్పటికీ మీకు మంచిమిత్రులున్నారు. వారి రచనల్లో మీరు ప్రత్యేకించి గమనించిన అంశాలు కొన్ని చెప్తారా?
ఇది చాలా పెద్ద ప్రశ్న. ఒక పుస్తకం రాయవలసినంత విషయం. చలంగారి సాహిత్యంలో ‘చలం మిత్రులు’ అని ఒక పుస్తకం ఉంది. అలాగ నా మిత్రులు అని నేను కూడా ఒక పుస్తకం రాయవలసిన విషయం ఇది. ఇన్నేళ్ళ జీవితంలో నేను గాఢంగా అభిమానించిన కవులూ, రచయితలూ కనీసం వందమందేనా ఉంటారు. వారిలో చాలామంది మీద నా అభిప్రాయాలు ఎప్పటికప్పుడు సమీక్షలుగానో, ముందుమాటలుగానో లేదా ఆ పుస్తకాల ఆవిష్కరణ సభల్లో ప్రసంగాలుగానో పంచుకుంటూనే ఉన్నాను.
కానీ మీరీ ప్రశ్న అడిగినప్పుడు నా సమకాలికులై ఉండి కూడా అకాలంగా ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన మిత్రులు గుర్తొస్తున్నారు. నా రాజమండ్రిమిత్రులు సమాచారం సుబ్రహ్మణ్యం, మహేశ్, సావిత్రిగారు గొప్ప భావుకులు, సున్నితమనస్కులు. వారు జీవించి ఉంటే ఈ లోకం మరింత తేటపడి ఉండేది వాళ్ళ రచనల వల్లా, మాటల వల్లా. ఎక్కడికి వెళ్లిపోయాడో ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయిన కవులూరి గోపీచంద్ కూడా గుర్తొస్తున్నాడు. కోనసీమకి చెందిన డా.సుబ్బరామన్ తాడికొండలో నాకు జూనియర్. అతడు తెలుగువాళ్ళ రింబో. కలుసుకున్నది ఒక్కసారే అయినా మధురాంతకం మహేంద్ర ఉండి ఉంటే ఒక ఆజానుబాహువైన రచయిత మన మధ్య నడుస్తుండేవాడు కదా అనిపిస్తుంది. ఇక ఎన్ని సార్లు కలుసుకున్నామో లెక్కపెట్టలేని కవితాప్రసాద్ గురించి ఏమని చెప్పను? ఈ నగరంలో అతడు గుర్తుకు రాని రోజు ఉండదు నాకు. మరీ చిన్నవయసులో నిష్క్రమించకపోయినా శివలెంక రాజేశ్వరి, డా.యు.ఏ.నరసింహమూర్తి లాంటి వాళ్ళు లేని ప్రపంచం కదా ఇది అనిపించినప్పుడు ఆ దిగుల్ని తట్టుకోవడం కష్టం.
మీరు రాయాలనుకుని రాయకుండా వుండిపోయిన ప్రక్రియ ఏమిటి? ఎప్పుడైనా అటువేపు దృష్టి పెట్టాలని అనుకుంటున్నారా?
నా సాహిత్యదిగంత రేఖలో నాటకం నిలబడి ఉంది. ‘నాటకాంతం హి సాహిత్యం’ అంటారు కదా. ఒకటి కాదు, చాలా నాటకాలు రాయాలనే ఉంటుంది. నేను రాజమండ్రిలో ఉన్నప్పుడు టి.జె. రామనాథం గారి కోసం ‘స్వాతంత్రోద్యమ శంఖారావం’ అని ఒక డాక్యుమెంటరీ నాటకం రాసాను. ఆ అనుభవం మీద ఆయన నన్ను ఒక సాంఘిక నాటకం రాసిమ్మని చాలా సార్లు అడిగాడు. కాని రాయలేకపోయాను. తెలుగులో కన్యాశుల్కం తరువాత నాటకం రాలేదని చెప్పే ఒక సంప్రదాయం ఉంది. నేను ఆ మాట చెప్పనుగానీ, ఎందుకనో, తెలుగు నాటకం పూర్తిగా వికసించవలసినట్టుగా వికసించలేదనే అనిపిస్తుంది నాకు. ఒక ‘మేక్బత్’ లాంటి నాటకం తెలుగులో ఇప్పటిదాకా ఎందుకు రాలేదు? చాలా సార్లు చెప్పినమాటనే మరోసారి చెప్తున్నాను. కొన్నేళ్ళ కిందట పోలీసు ఎన్ కొంటర్లలో మృతులైన వారి కళేబరాల్ని అప్పగించమని గద్దర్ లాంటి వాళ్ళు పోరాటాలు చేసేవారు. ఆ ఇతివృత్తం నేపథ్యంగా ఒక ‘యాంటిగని’ లాంటి నాటకం మనకి వచ్చి ఉండాలి కదా! ఒక ఇబ్సెన్, ఒక చెకోవ్, ఒక అయినెస్కో లాంటి పేర్లు మళ్ళా చెప్పడం నాకు ఇష్టం లేదు. కనీసం ఒక టామ్ స్టాపర్డ్ లాంటి నాటకరచయిత మనకి వచ్చి ఉండాలి కదా. కన్యాశుల్కానికి కొనసాగింపుగా Rosencrantz and Guildenstern Are Dead లాంటి ఒక నాటకం రాయొచ్చనే ఊహ మన నాటకకర్తలకి ఎందుకు కలగలేదు? పోనీ మన దేశాన్నే తీసుకున్నా మరాఠీ, కన్నడ నాటకరంగాలతో పోటీ పడగల నాటకాలు మనకి వచ్చి ఉండాలి కదా. లేదా ఒక టాగోర్ లాగా సంగీతరూపకాలు? ఈ లోటుని పూరించే దిశగా ఏదైనా చెయ్యాలని బలంగా అనిపిస్తూంటుంది.
ఇంటర్నెట్ వచ్చిన తరువాత తెలుగు సాహిత్యం స్థితీ గతీ మారిపోయాయని మీరు అనడం గుర్తు. ఆ మార్పు మంచికోసమేనా?!
నేను నా పునర్యానం కావ్యంలో చివరి కవితలో నన్ను ఇంతదాకా తీర్చిదిద్దినవారందరికీ కృతజ్ఞతలు చెప్తూ ఇంటర్నెట్ కి కూడా కృతజ్ఞతలు చెప్పుకున్నాను. నా అధ్యయనాన్నీ, నా సాహిత్య వ్యాసంగాన్నీ ఇంటర్నెట్ కి ముందు, ఇంటర్నెట్ తరువాత అని రెండుగా విభజించి చూసుకోగలను. అందులోనూ గడచిన పాతికేళ్ళల్లో 2010 దాకా ఒక దశ. ఆ తర్వాత వెబ్ 2.0 అందుబాటులోకి వచ్చి, ఇంటర్నెట్ ఒక ఇంటరాక్టివ్ మీడియా గా మారేక, ప్రపంచం చాలా చిన్నదైపోయింది. మనుషులు ఏదేనా తెలుసుకోడానికీ, నేర్చుకోడానికీ, ఒకరి భావాలు మరొకరితో పంచుకోడానికీ బహుశా ఇప్పుడు లభిస్తున్నన్ని అవకాశాలు మానవ చరిత్రలో ఇప్పటిదాకా లభించలేదని చెప్పవచ్చు. గుటెన్ బర్గ్ నుంచి జుకర్ బర్గ్ దాకా సాగిన ప్రయాణం మానవాళి మంచికేనని నిర్ద్వంద్వంగా చెప్పగలను. సరే, ఏ మాధ్యమం అయినా ఉపయోగించుకునేవాళ్ళని బట్టి ఉంటుంది. సినిమానే చూడండి. కొరియా, ఇరాన్ లాంటి దేశాలు ప్రపంచాన్ని నిశ్చేష్టుల్ని చెయ్యగల సినిమాలు తీస్తుంటాయి. ఆ మాధ్యమాన్ని తెలుగువాళ్ళు కాలక్షేపం కోసం వాడుకుంటారు.
ఇప్పుడు ఇంటర్నెట్ మూడో దశలో అడుగుపెట్టింది. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ దశ ఇది. ఏ.ఐ వల్ల రచయితలు కనుమరుగు కారుకదా మరింత బలపడతారు. ఉదాహరణకి మనమొక పీరియాడిక్ నవల రాద్దామనుకుంటే, అందుకు కావలసిన నిర్దిష్ట సమాచారాన్ని ఏ.ఐ ద్వారా రాబట్టుకోవచ్చు. అనువాదానికి ఏ.ఐ గొప్ప టూల్.
చివరగా మరోసారి మీకు నా ధన్యవాదాలు. ఈ తెల్లవారు జామున ఎందరో మిత్రుల్ని మరోసారి తలుచుకోడానికీ, చాలా అంశాల గురించి మరోసారి ఆలోచించుకోడానికీ అవకాశం కల్పించారు.
( సారంగ వెబ్ మాగ్ జైన్ సౌజన్యంతో)
17-12-2024
శుభోదయం, భద్రుడు గారు, ఎంత బాగా రాసారో, మీ మాటలు భూపాల రాగం ఆలపిస్తున్నాయి. మనసుకు హాయిగా ఉంది మన గోదారమ్మ అంత చల్లగా ఉన్నాయి.
ముఖ్యంగా ఇంటర్నెట్ గురించి మంచి మాటలు చెప్పారు.
ధన్య వాదాలు
మణి వడ్లమాని
ధన్యవాదాలు మేడం!
అయ్యా నమస్కారములు.శుభాకాంక్షలు.
నమస్కారాలు
అఫ్సర్ సార్ కి అభినందనలు ముందుగా!
అసూయదే పై చేయైన కాలంలో ఈపని చేసినందుకు!
ఆయనకే కాదు మాలో చాలమందికి కూడా అనిపిస్తుంది” అనువాదాల్లో కూరుకుపోతున్నారాని!”
ధన్యవాదాలు సార్! అయితే వాటిని అనువాదాలు అనుకోవద్దు. అధ్యయన ఫలాలుగా భావించవచ్చు కదా!
ప్రతిస్పందన మేఘమై వర్షించిన వైనం…
అభినందనలు సర్.
ధన్యవాదాలు రామ్ భాస్కర్!
🙏🌹
As Usual, Learnt New Things Through This Interview of Yours Thanks To Afsar & సారంగ.
ధన్యవాదాలు సార్!
కాని నేనేమనుకుంటానంటే రోజూ రాయడం ఒక creative gymnastics.నిజం సార్ . ఇది ఈ మధ్యకాలంలో అనభవైకవేద్యం. గత మూడేళ్ళుగా కవితనో,గేయమో , పద్యమో, వ్యాసమో రాయని రోజు లేదంటే అది మీ వంటి వారి ప్రేరణే అనుకుంటాను. మీ ఇంటర్వ్యూ మీ అప్డేషన్ ను తెలుపుతుంది. గైడింగ్ కా కూడా ఉంది. మీకు అభినందనలు. సారంగసారథులకు కృతజ్ఞతలు.
ధన్యవాదాలు సార్!
ఉదయం కూడా అందంగా ఉంది. అనుభూతి ని నెమరేసుకోవడం వల్ల, మాటల కరువు. చిత్రం బాగుంది 🙏🙏🙏
ధన్యవాదాలు సార్!