అవధూత గీత -16

అయిదవ అధ్యాయం

15

ఒక ఇల్లుగాని, కుటీరంగాని, కుటుంబంగానీ లేకుండా
సాంగత్యం, నిస్సాంగత్యం రెండూ కూడా లేకుండా
ఇక్కడ ఎరుక, ఎరుకలేకుండటం రెండూ లేకుండా
సర్వసముడివై కూడా మనసులో ఎందుకు శోకిస్తున్నావు?

16

అవికారమూ, వికారమూ రెండూ అసత్యాలని తెలిసి
అవిలక్షణమూ, లక్షణమూ రెండూ అసత్యాలని తెలిసి
కేవలం నీ ఆత్మ ఒక్కటే యథార్థ సత్యమని తెలిసి
సర్వసముడివై కూడా ఎందుకు రోదిస్తున్నావు?

17

ఇక్కడ జీవుడన్నింటిలోనూ సమానవర్తనుడని తెలిసి
ఇక్కడ జీవుడన్నింటిలోనూ నిరంతరవర్తనుడని తెలిసి
ఇక్కడ జీవుడన్నింటిలోనూ చెక్కుచెదరడని తెలిసి
సర్వసముడివై కూడా ఎందుకు రోదిస్తున్నావు?

18

అవివేకమూ, వివేకమూ రెండూ అజ్ఞానమేనని తెలిసి
అవికల్పమూ, వికల్పమూ రెండూ అజ్ఞానమేనని తెలిసి
ఉన్నదొక్కటే అన్న ఎరుక నిరంతరాయమని తెలిసి
సర్వసముడివై కూడా ఎందుకు రోదిస్తున్నావు?

19

కట్టిపడేసినతోవగాని, బయటపడేసేతోవగాని లేదని తెలిసి
పాపపూరితమైనదీ, పుణ్యప్రదమైనవీ తోవలు లేవని తెలిసి
సంపూర్ణమార్గమనిగానీ, శూన్యమార్గమనిగానీ లేవని తెలిసి
సర్వసముడివై ఉండి కూడా మనసులో ఎందుకు శోకిస్తున్నావు?

20

అది వర్ణవివర్ణాలు రెండింటిపట్లా సమానమేనని తెలిసి
అది కార్యకారణాలు లేకపోవడంపట్ల సమానమేనని తెలిసి
అది భేదాభేదాలు రెండింటిపట్లా సమానమేనని తెలిసి
సర్వసముడివై కూడా మనసులో ఎందుకు శోకిస్తున్నావు?

21

ఇక్కడ అన్నింటిలోనూ ఆ చైతన్యం నిరంతరమని తెలిసి
ఇక్కడ అన్నింటిలోనూ ఆ చైతన్యం నిశ్చలమని తెలిసి
దానికి ద్విపాత్తులూ, చతుష్పాత్తులనే తేడాలేదని తెలిసి
సర్వసముడివై కూడా మనసులో ఎందుకు శోకిస్తున్నావు?

22

అది అన్నింటినీ నిరంతరం దాటిపోయేదని తెలిసి
అది అన్నింటికన్నా నిర్మలం, నిశ్చలమని తెలిసి
అది రాత్రింబగళ్ళని దాటి వ్యాపించినదని తెలిసి
సర్వసముడివై కూడా ఎందుకు మనసులో శోకిస్తున్నావు?

23

బంధంలోకీ, ముక్తిలోకీ వచ్చిపడటంలేదు
యోగంలోకీ, వియోగంలోకీ వచ్చిపడటంలేదు
వాదాల్లోకీ, వివాదాల్లోకీ వచ్చిపడటంలేదు
సర్వసముడివైన నువ్వెందుకు శోకిస్తున్నావు?

24

ఇక్కడ కాలవికాలాల్ని నిరాకరిస్తుండగా
చిన్ని నిప్పురవ్వను కూడా నిరాకరిస్తుండగా
ఒక్క సత్యానికి మాత్రమే చోటిస్తుండగా
సర్వసముడివైన నువ్వెందుకు శోకిస్తున్నావు?

25

ఇక్కడ దేహవిదేహాలు లేవని తెలిసి
ఇక్కడ స్వప్నసుషుప్తులు లేవని తెలిసి
ఇక్కడ నామనిర్దేశాలు లేవని తెలిసి
సర్వసముడివి నువ్వెందుకు శోకిస్తున్నావు?

26

ఆకాశంలాగా విశాలంగా నిర్మలంగా ఉండగా
విభేదాల్నిదాటి అన్నిటిపట్లా ఒక్కలాగా ఉండగా
సారంపోకుండానో, నిస్సారం కాకుండానో ఉండగా
సర్వసముడివి, నువ్వెందుకు మనసా రోదిస్తున్నావు?

27

ఇక్కడ ధర్మాధర్మాలపట్ల తీవ్రవైరాగ్యం ఉండగా
వస్తువు, అవస్తువులపట్ల తీవ్రవైరాగ్యం ఉండగా
ఇక్కడ కామవికామాల పట్ల తీవ్రవైరాగ్యం ఉండగా
సర్వసముడివై కూడా నువ్వెందుకు రోదిస్తున్నావు?

28

సుఖదుఃఖాల్ని వదిలిపెట్టి సమానభావంతో ఉంటూ
శోకాశోకాల్ని వదిలిపెట్టి సర్వోన్నతసత్యంగా ఉంటూ
గురుశిష్యబంధాన్ని దాటిన పరమోన్నతతత్త్వంగా ఉంటూ
సర్వసముడివై ఉండి కూడా నువ్వెందుకని రోదిస్తున్నావు?

29

అంకురమనీ, సారమనీ, నిస్సారమనీ లేవని తెలిసి
చలం, అచలం, సామ్యం, విసామ్యమంటూ లేవని తెలిసి
ఆలోచించడం, అలోచించకపోవడం రెండూ లేవని తెలిసి
సర్వసముడివై ఉండి కూడా ఎందుకు మనసులో రోదిస్తున్నావు?

30

ఇదే సారం, సారాల్లోకెలా సారమని తెలిసీ
ఇది నిజతత్త్వంకన్నా భిన్నమని చెప్పాక కూడా
విషయాలకు ముక్తికలిగించే శక్తిలేదని తెలిసీ
సర్వసముడివై ఉండి కూడా ఎందుకు రోదిస్తున్నావు?

31

పాంచభౌతిక ప్రపంచం ఎండమావిలాంటిదని
వేదాలు అనేకవిధాల ఘోషిస్తూ ఉండగా
ఆ సత్యానికి అన్నీ సమానమేననీ తెలిసీ
సర్వసముడివై కూడా నువ్వెందుకు రోదిస్తున్నావు?

32

ఎక్కడైతే ఎవరూ తెలుసుకోలేరో, తెలుసుకోజాలరో
అక్కడ ఛందస్సు ఎక్కడ? అలంకారాలెక్కడ?
సమరసంలో మునిగి పునీతుడైన అవధూత
ఏది పలవరిస్తుంటే అదే పరమసత్యం.

ఆరవ అధ్యాయం

1

మనమూ, ప్రపంచమూ ఎండమావులమని
వేదాలు అనేకవిధాల ఘోషిస్తూ ఉండగా
ఆ సత్యం నిరంతరం, శివప్రదమై ఉండగా
దానికి దేంతో పోలిక తేవడం? పోల్చి చెప్పడం?

2

అది విభక్తం కాదు, అవిభక్తమూ కాదు
దానికి కార్యమూ, వికార్యమూ లేనే లేవు
ఆ సత్యం నిరంతరం, శివప్రదమై ఉండగా
దాన్ని పూజించడమెలాగు? సేవించడమెలాగు?


సంస్కృత మూలం

పంచమోధ్యాయః

15

అనికేత కుటీ పరివార సమం
ఇహ సంగవిసంగవిహీన పరం
ఇహబోధవిబోధవిహీన పరం
కిము రోదిషి మానసి సర్వసమమ్

16

అవికారవికారమసత్యమితి
అవిలక్షణలక్షణమసత్యమితి
యది కేవలమాత్మని సత్యమితి
కిము రోదిషి మానసి సర్వసమమ్

17

ఇహ సర్వసమం ఖలు జీవ ఇతి
ఇహసర్వనిరంతర జీవ ఇతి
ఇహ కేవలనిశ్చల జీవ ఇతి
కిము రోదిషి మానసి సర్వసమమ్

18

అవివేకవివేకమబోధ ఇతి
అవికల్పవికల్పమబోధ ఇతి
యది చైకనిరంతరబోధ ఇతి
కిము రోదిషి మానసి సర్వసమమ్

19

న హి మోక్షపదం న హి బంధపదం
న హి పుణ్యపదం న హి పాపపదం
న హి పూర్ణపదం న హి రిక్తపదం
కిము రోదిషి మానసి సర్వసమమ్

20

యది వర్ణవివర్ణవిహీన సమం
యది కారణకార్యవిహీన సమం
యది భేదవిభేదవిహీన సమం
కిము రోదిషి మానసి సర్వసమమ్

21

ఇహ సర్వనిరంతరసర్వచితే
ఇహ కేవల నిశ్చల సర్వచితే
ద్విపదాదివివర్జిత సర్వచితే
కిము రోదిషి మానసి సర్వసమమ్

22

అతిసర్వనిరంతర సర్వగతం
అతినిర్మల నిశ్చలసర్వగతం
దినరాత్రివివర్జిత సర్వగతం
కిము రోదిషి మానసి సర్వసమమ్.

23

న హి బంధవిబంధ సమాగమనం
న హి యోగవియోగ సమాగమనం
న హి తర్కవితర్క సమాగమనం
కిము రోదిషి మానసి సర్వసమమ్.

24

ఇహ కాలవికాల నిరాకరణం
అణుమాత్రకృశానునిరాకరణం
న హి కేవల సత్యనిరాకరణం
కిము రోదిషి మానసి సర్వసమమ్.

25

ఇహ దేహవిదేహవిహీన ఇతి
నను స్వప్నసుషుప్తివిహీన పరం
అభిధానవిధాన విహీన పరం
కిము రోదిషి మానసి సర్వసమమ్.

26

గగనోపమశుద్ధ విశాల సమం
అతిసర్వవివర్జిత సర్వసమం
గతసారవిసారవికారసమం
కిము రోదిషి మానసి సర్వసమమ్.

27

ఇహ ధర్మవిధర్మవిరాగతర-
మిహ వస్తువివస్తువిరాగతరం
ఇహ కామవికామవిరాగతరం
కిము రోదిషి మానసి సర్వసమమ్.

28

సుఖదుఃఖవివర్జితసర్వసమ-
మిహ శోకవిశోకవిహీన పరం
గురుశిష్యవివర్జిత తత్త్వపరం
కిమురోదిషు మానసి సర్వసమమ్.

29

న కిలాంకుర సారవిసార ఇతి
న చలాచలసామ్యవిసామ్య ఇతి
అవిచారవిచార విహీనమితి
కిము రోదిషి మానసి సర్వసమమ్.

30

ఇహ సారసముచ్చయసారమితి
కథితం నిజభావవిభేద ఇతి
విషయే కరణత్వమసత్యమితి
కిము రోదిషి మానసి సర్వసమమ్.

31

బహుధా శ్రుతయః ప్రవదంతి యతో
వియదాదిరిదం మృగతోయసమం
యది చైక నిరంతరసర్వసమం
కిము రోదిషి మానసి సర్వసమమ్.

32

విందతి విందతి న హి న హి యత్ర
ఛందోలక్షణం న న హి తత్ర
సమరసమగ్నో భావితపూతః
ప్రలపతి తత్త్వం పరమవధూతః

షష్ఠోధ్యాయః

1

బహుధా శ్రుతయః ప్రవదంతి వయం
వియదారిరిదం మృగతోయసమం
యది చైక నిరంతరసర్వశివ
ముపమేయమథోహ్యుపమా చ కథమ్.

2

అవిభక్తివిభక్తి విహీన పరం
నను కార్యవికార్యవిహీన పరం
యది చైక నిరంతర సర్వశివం
యజనం చ కథం తపనం చ కథమ్.


Featured image pc: Wikimedia Commons

7-11-2024

4 Replies to “అవధూత గీత -16”

  1. ఉహలు- ఊసులు - సంధ్య – ... జీవితం ఏమిటి అన్న ప్రశ్న కు.... సమాధానం వెతుకుతూ... సాగుతున్న జీవితం...
    Sandhya Yellapragada says:

    ఎంతటి అద్వైతం పంచుతున్నారు. వేల కృతజ్ఞతలు. ఈశ్వరకృప ఈ కార్తీకంలో ఇలా వర్షిస్తున్నది. నమోనమః

  2. రాగ ద్వేషాలు లేక శోకం లేనే లేదు.
    సత్యం శివం సుందరం.నమస్సులు ,🙏🙏🙏

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%