అవధూత గీత-15

నాలుగవ అధ్యాయం

19

నా చిత్తం మొత్తం ఏకాగ్రంగా ఉందని తెలుసుకో
లక్ష్యమూ, విలక్ష్యమూ అనేవి లేనివాణ్ణని తెలుసుకో
కాబట్టి యోగవియోగాల గురించి నేనేమి చెప్పేది?
నిర్వాణ స్వరూపుణ్ణి, వికారాలు అణగినవాణ్ణి.

20

నేను మూర్ఖుణ్ణికాను, పండితుణ్ణీ కాను
మౌనమూ, మౌనం లేకపోవడమూ లేవెన్నటికీ
కాబట్టి తర్క వితర్కాల గురించి నేనేమి చెప్పేది?
నిర్వాణ స్వరూపుణ్ణి, వికారాలు అణగినవాణ్ణి.

21

తల్లిదండ్రుల్లేరు, కులం లేదు, జాతి లేదు
పుట్టడం, మరణించడం నాకెన్నటికీ లేవు
స్నేహవ్యామోహాల గురించి నేనేమి చెప్పేది?
నిర్వాణ స్వరూపుణ్ణి, వికారాలు అణగినవాణ్ణి.

22

అస్తమించినవాణ్ణికాను, ఉదయిస్తున్నవాణ్ణీ కాను
తేజస్సూ, తేజస్సు లేకపోవడమూ నాకెన్నటికీ లేవు
కాబట్టి సంధ్యాదిక కర్మల గురించి నేనేమి చెప్పేది?
నిర్వాణ స్వరూపుణ్ణి, వికారాలు అణగినవాణ్ణి.

23

నన్ను సందేహించకు, వ్యాకుల రహితుణ్ణి
సందేహించకు నన్ను, నాది ఎడతెగని ఉనికి
నన్ను సందేహించకు, మరకలేవీ అంటనివాణ్ణి
నిర్వాణ స్వరూపుణ్ణి, వికారాలు అణగినవాణ్ణి.

24

వాళ్ళు అన్నిరకాల ధ్యానాలూ వదిలిపెట్టేస్తారు
శుభకర్మలూ, అశుభకర్మలూ కూడా వదిలిపెట్టేస్తారు
నాన్నా! ధీరులైనవాళ్ళు సేవించేది త్యాగామృతాన్నే
కాబట్టి నిర్వాణ స్వరూపుణ్ణి, వికారాలు అణగినవాణ్ణి.

25

ఎక్కడ తెలుసుకునేదంటూ లేదో
అక్కడ ఛందస్సులేదు, అలంకారాల్లేవు
సమరసమగ్నుడై పరమావధూత
పునీతసత్యాన్నే పలవరిస్తుంటాడు.

అయిదవ అధ్యాయం

1

ఓంకారమనే ఈ అక్షరం ఆకాశంలాంటిది
దానికి పరాపరాల సారవిచారంతో పనిలేదు
అవిలాసాన్నీ, విలాసాన్నీ కూడా నిరాకరించేదాన్ని
బిందువుతో కలిపి పలికే అక్షరమని ఎలా అనగలం?

2

అది నువ్వే అని వేదాలు చెప్పే వాక్యాలు
నువ్వే ఆ పరమసత్యమని ప్రతిపాదిస్తున్నవి
ఉపాధుల్ని విడిచిపెట్టిన సర్వసముడివి.
సర్వసముడివై కూడా ఎందుకు శోకిస్తున్నావు?

3

నీకు కిందు, మీదు లేవు, అన్నిటిపట్లా సమానుడివి
లోపలా బయటా లేవు, అన్నిటిపట్లా సమానుడివి
చివరికి ఒకటి అనేభావన కూడా వదిలిపెట్టినవాడివి
సర్వసముడివై కూడా ఎందుకు మనసులో రోదిస్తున్నావు?

4

నీకు కల్పించుకున్న కల్పనల్లేవు, ఆలోచనల్లేవు
కారణాల్లేవు, వాటివల్ల పుట్టే కార్యాలూ లేవు
పదజాలాన్నీ, పదసంధినీ కూడా వదిలిపెట్టినవాడివి
సర్వసముడివై కూడా ఎందుకు మనసులో రోదిస్తున్నావు?

5

అజ్ఞానమూ, ఎరుకా, ఎరుకలోనే ఉండిపోవడమూ లేవు
విదేశమూ, దేశమూ, వాటిలోనే ఉండిపోవడమూ లేవు
కాలమూ, కాలంకానిదీ, అక్కడే ఉండిపోవడమూ లేవు
సర్వసముడివై కూడా ఎందుకు మనసులో రోదిస్తున్నావు?

6

ఘటాకాశమూ, ఘటమూ అనేవి లేవు
జీవమున్న దేహము, జీవమూ అనేవి లేవు
కారణాలూ, కార్యాలనే విభాగమూ లేదు
సర్వసముడివై కూడా ఎందుకు శోకిస్తున్నావు?

7

నిరంతరాయమైన విముక్తిపదం ఇక్కడే ఉంది
అది లఘువా, దీర్ఘమా అన్న ఆలోచనతో పనిలేదు
అది కోణాకారమూ, వృత్తాకారమనే విభజనలేనిది
సర్వసముడివై కూడా ఎందుకు మనసులో రోదిస్తున్నావు?

8

ఇక్కడ శూన్యవిశూన్యాలు లేవని తెలిసి
ఇక్కడ శుద్ధవిశుద్ధాలు లేవని తెలిసి
ఇక్కడ సర్వవిసర్వాలు లేవని తెలిసి
సర్వసముడివై కూడా ఎందుకు శోకిస్తున్నావు?

9

భిన్నవిభిన్నాలనే ఆలోచనలేదని తెలిసి
లోపలా, బయటా, మధ్యా అంటూ లేవని తెలిసి
శత్రుమిత్రుల్ని వదిలిపెట్టిన సర్వసముడివి,
సర్వసముడివై కూడా ఎందుకు మనసులో రోదిస్తున్నావు?

10

శిష్యుడూ, శిష్యుడుకాడనేవాడూ లేడని తెలిసి
కదిలేవీ, కదలనివనే విచారణ లేదని తెలిసి
ఇక్కడే నిరంతరాయంగా ముక్తిపదముందని తెలిసి
సర్వసముడివై కూడా ఎందుకు మనసులో రోదిస్తున్నావు?

11

అయ్యా! రూపవిరూపాలంటూ లేవని తెలిసి
అయ్యా! భిన్నవిభిన్నాలంటూ లేవని తెలిసి
అయ్యా! సృష్టీ, లయమూ కూడా లేవని తెలిసి
సర్వసముడివై కూడా ఎందుకు మనసులో రోదిస్తున్నావు?

12

గుణాలూ, అవగుణాలూ, బంధాలూ లేవని తెలిసి
మృతుడిగా ఉండీ జీవనకర్మ చెయ్యడమెలాగు?
శుద్ధుడివీ, ఏ మరకలూ అంటనివాడివనీ తెలిసి
సర్వసముడివై కూడా ఎందుకు మనసులో రోదిస్తున్నావు?

13

ఇక్కడ భావవిభావాలంటూ ఏవీ లేవని తెలిసి
ఇక్కడ కామవికామాలంటూ ఏవీ లేవని తెలిసి
ఇక్కడ ఎరుక కలగడమే విముక్తిపొందడమని తెలిసి
సర్వసముడివై కూడా ఎందుకు మనసులో రోదిస్తున్నావు?

14

ఇక్కడ తెలిసే సత్యం నిరంతరాయ సత్యమని తెలిసి
కలిసి ఉండేదీ, కలిసి ఉండనిదీ కూడా కాదని తెలిసి
నిజంగానే అన్నింటినీ వదిలి సర్వసమానంగా ఉండగా
సర్వసముడివై కూడా ఎందుకు మనసులో రోదిస్తున్నావు?


సంస్కృత మూలం

చతుర్థోధ్యాయః

19

సంవిద్ధి మాం సర్వ సమాధియుక్తం
సంవిద్ధి మాం లక్ష్య విలక్ష్య ముక్తం
యోగం వియోగం చ కథం వదామి
స్వరూపనిర్వాణమనామయోహమ్.

20

మూర్ఖోపి నాహం న చ పండితోహం
మౌనం విమౌనం న చ మే కదాచిత్
తర్కం వితర్కం చ కథం వదామి
స్వరూపనిర్వాణమనామయోహమ్.

21

పితా చ మాతా చ కులం న జాతిః
జన్మాది మృత్యుర్నచ మే కదాచిత్
స్నేహం విమోహం చ కథం వదామి
స్వరూపనిర్వాణమనామయోహమ్.

22

అస్తం గతో నైవ సదోదితోహం
తేజోవితేజో న చ మే కదాచిత్
సంధ్యాదికం కర్మ కథం వదామి
స్వరూపనిర్వాణమనామయోహమ్.

23

అసంశయం విద్ధి నిరాకులం మామ
సంశయం విద్ధి నిరంతరం మాం
అసంశయం విద్ధి నిరంజనం మాం
స్వరూపనిర్వాణమనామయోహమ్

24

ధ్యానాఇన్ సర్వాణి పరిత్యజంతి
శుభాశుభం కర్మ పరిత్యజంతి
త్యాగామృతం తాత పిబంతి ధీరాః
స్వరూపనిర్వాణమనామయోహమ్.

25

విందంతి విందంతి న హి న హి యత్ర
ఛందోలక్షణం న హి న హి తత్ర
సమరసమగ్నో భావితపూతః
ప్రలపతి తత్త్వం పరమవధూతః

పంచమోధ్యాయః

1

ఇతి గదితం గగనసమం తత్
న పరాపరసారవిచార ఇతి
అవిలాసవిలాసనిరాకరణం
కథమక్షరబిందుముచ్చరణమ్.

2

ఇతి తత్త్వమసి ప్రభృతిశ్రుతిభిః
ప్రతిపాదితమాత్మాని తత్త్వమసి
త్వముపాధివివర్జితసర్వసమం
కిము రోదిషి మానసి సర్వసమమ్.

3

అధ ఊర్ధ్వవివర్జిత సర్వసమం
బహిరంతరవర్జిత సర్వసమం
యది చైకవివర్జిత సర్వసమం
కిము రోదిషి మానసి సర్వసమమ్

4

న హి కల్పితకల్పవిచార ఇతి
న హి కారణకార్యవిచార ఇతి
పదసంధివివర్జిత సర్వసమం
కిము రోదిషి మానసి సర్వసమమ్.

5

నహి బోధవిబోధసమాధిరితి
న హి దేశవిదేశస్మాధిరితి
న హి కాలవికాలసమాధిరితి
కిము రోదిషి మానసి సర్వసమమ్.

6

న హి కుంభనభో న హి కుంభ ఇతి
న హి జీవవపుర్న హి జీవ ఇతి
న హి కారణకార్యవిభాగ ఇతి
కిము రోదిషి మానసి సర్వసమమ్.

7

ఇహ సర్వనిరంతరమోక్షపదం
లఘుదీర్ఘవిచార విహీన ఇతి
న హి వర్తుల కోణవిభాగ ఇతి
కిము రోదిషి మానసి సర్వసమమ్.

8

ఇహ శూన్యవిశూన్య విహీన ఇతి
ఇహ శుద్ధవిశుద్ధవిహీన ఇతి
ఇహ సర్వవిసర్వవిహీన ఇతి
కిము రోదిషి మానసి సర్వసమమ్.

9

న హి భిన్నవిభిన్న విచార ఇతి
బహిరంతరసంధి విచార ఇతి
అరిమిత్రవివర్జిత సర్వసమం
కిము రోదిషి మానసి సర్వసమమ్.

10

న హి శిష్యవిశిష్యస్వరూప ఇతి
న చరాచరభేదవిచార ఇతి
ఇహ సర్వనిరంతరమోక్షపదం
కిము రోదిషి మానసి సర్వసమమ్.

11

నను రూపవిరూప విహీన ఇతి
నను భిన్నవిభిన్న విహీన ఇతి
నను సమ్ర్గవిసర్గవిహీన ఇతి
కిము రోదిషి మానసి సర్వసమమ్.

12

న గుణాగుణపాశనిబంధ ఇతి
మృతజీవనకర్మ కరోమి కథం
ఇతి శుద్ధనిరంజన సర్వసమం
కిము రోదిషి మానసి సర్వసమమ్.

13

ఇహ భావవిభావ విహీన ఇతి
ఇహ కామవికామవిహీన ఇతి
ఇహ బోధతమం ఖలు మోక్షసమం
కిము రోదిషి మానసి సర్వసమమ్.

14

ఇహ తత్త్వనిరంతరతత్త్వమితి
న హి సంధివిసంధివిహీన ఇతి
యది సర్వవివర్జిత సర్వసమం
కిము రోదిషి మానసి సర్వసమమ్.


Featured image: PC: Wikimedia Commons

6-11-2024

10 Replies to “అవధూత గీత-15”

  1. ఈ పోస్ట్ లు చూస్తూ రోజూ ఒకటే మాట అనుకుంటున్నాను..You are very kind అని. ఇవి ఎవరు ఇట్లా పంచుతారు, ఎవరు ఇలా చదివించుతారు?
    నేను ఒకట్రెండు సందర్భాల్లో, జీవితంలో తరువాత అడుగు ఎటు వేయాలి తెలీక సందిగ్ధంలో ఉన్నప్పుడు అనిల్ నా చేతిలో గురు చరిత్ర పెట్టి, ఊరికే పారాయణం చేస్తూ ఉండమన్నాడు. అయ్యేసరికి నా చిక్కు ముడులు నా ప్రమేయం లేకుండానే విడివడి నాకు ముందుకు వెళ్ళే మార్గం దొరికింది. మీరు దీనిని పుస్తకంగా తెస్తే, అట్లా శ్రద్ధగా మననం చేసుకునే వీలుంటుంది. 🙏

    1. సాధారణంగా ఇటువంటి పోస్టులు పెట్టేటప్పుడు నా బ్లాగ్ చూసే వారి సంఖ్య రోజురోజుకీ తగ్గిపోతూ ఉంటుంది. కానీ ఇది ఒక బాధ్యత అనుకుని చేస్తాను. ఎవరు చదువుతారని? ఏమో? తెలియదు. రాసిన కొన్నాళ్ల తర్వాత నేను మళ్లా తిరిగి చదువుకుంటే నాకే చాలా బాగా అనిపిస్తాయి. నా జీవించిన జీవితం నిష్ఫలం కాలేదు అనిపిస్తుంది. ఒక రోజు నుంచి ఈ నాలుగు వాక్యాలు పిండివడగట్టుకోకపోతే ఇంకా రోజుకి మిగిలేదేముంది?

      నాది నాలుగు రాళ్లు వెనకేసుకున్న జీవితం కాదు. నాలుగు పూలు వెనకేసుకున్న జీవితం.

      1. ఈ పోస్ట్ లు మాటలను మించిన మౌనంలోకి నెడుతూ ఉంటాయి కావచ్చు, మీరు దీక్షగా చేస్తున్న పనికి మా మాటలు అడ్డమెందుకనీ ఆగిపోవచ్చు. చదువుతున్నారు కదా అని మిత్రులం మాట్లాడుకుంటూనే ఉన్నాం ఈ పోస్ట్ ల గురించి.

        మీరు నడిచిన మార్గమంతా పూలదారి భద్రుడు గారూ. మీరు రాళ్ళను పక్కను నెట్టి విత్తనాలు జల్లినందుకు. ఇట్లా లెక్కలేనన్ని పాదులు తవ్వినందుకు. ఏ లెక్కలూ చూసుకోకుండా మీ బలం, మీ తపః ఫలం కొంత ధారపోసినందుకు. వేయేల, ఋషిలా మీరు నడచి వచ్చినందుకు. ❤️

  2. నేను అష్టావక్ర గీత ప్రతి రోజూ చదువుతూ ఉంటాను. మీరు చెప్పే ప్రతి విషయం నాకెంతో సహజంగా అనిపిస్తుంది. నిజానికి మనసు ఇటువంటి సత్యాల్ని తప్పించుకుని తిరుగుతుంది. తమరు ఇటువంటి విషయాల్ని చెప్తూ ఉండడం వల్ల ఎంతో మంది చదువుతూ ఉన్నా ఎలా స్పందించాలో తెలియక మౌనం వహిస్తారని నాకు అనిపిస్తుంది. నమోనమః

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%