
25
పగిలిన కుండలోపలి ఖాళీస్థలం ఆకాశంలో కలిసిపోయినట్టు
యోగి దేహం విడిచినప్పుడు పరమసత్యంలో కలిసిపోతాడు.
26
కర్మకలాపంలో కూరుకుపోయినవాళ్ళు అవసానదశలో
ఏది తలిస్తే వాళ్ళ తద్గతి అలానే ఉంటుందని చెప్తారు.
కాని యోగమార్గంలో నడుస్తున్నవాళ్ళు అవసానదశలో
ఏది తలిస్తే అదే గతిపొందుతారని మాత్రం చెప్పలేం.
27
కర్మకలాపంలో కూరుకుపోయిన మనిషి గురించి మాట్లాడవచ్చు
కాని యోగులు సాధించే స్థితి గురించి మాటల్లో చెప్పడం కష్టం.
28
ఈ విషయం తెలిసాక యోగుల దారి ఇదీ అని చెప్పలేం,
దారితప్పనివాళ్ళు కాబట్టి వాళ్ల దారి వాళ్లకే దొరుకుతుంది.
29
నది ఒడ్డునో, అంత్యజగృహంలోనో ఎక్కడ మరణించినా
యోగి మరొకసారి పుట్టడు. పరమసత్యంలో కలిసిపోతాడు.
30
తాను సహజుడనీ, పుట్టుకలేనివాడనీ, ఆలోచనకు అందనివాడనీ
తెలుసుకున్నవాడు ఎలా నడుచుకోనీ అతణ్ణి ఏ దోషాలూ అంటవు.
ఆ స్థితికి చేరుకున్నాక అతడికి చెయ్యవలసినపనులంటూ ఉండవు
అటువంటివాడు తపస్విగానీ, సంయమిగానీ, దేనికీ కట్టుబడి ఉండడు.
31
అతడు పొందేది నిర్మలం, నిష్ప్రతిమం, దానికొక ఆకారముండదు
దేహముండదు, ఆలంబనం ఉండదు, ఆకాంక్ష ఉండదు
రెండనేవి లేని చోటు, మోహంలేని స్థితి, ఆ శక్తికి తరుగులేదు
అటువంటి తనని తాను అతడు శాశ్వతంగా చేరుకుంటున్నాడు.
32
దాన్ని వేదాలు బోధించలేవు, దీక్షలు అందించలేవు
తలగొరిగించుకుంటేనో, గురుశిష్యులు కూడుకుంటేనో
దొరికేది కాదది. ముద్రాదికాలు ప్రకాశించని అటువంటి
తనని తాను అతడు శాశ్వతంగా చేరుకుంటున్నాడు.
33
అక్కడ శాంభవం లేదు, శాక్తికమానుషాలు కూడా లేవు
పిండం లేదు, రూపం లేదు, కరచరణాలు లేవు,
మొదలుపెట్టడం, తీర్చిదిద్దడం లేని ఘటంలాంటి
తనని తాను అతడు శాశ్వతంగా చేరుకుంటున్నాడు.
34
నీటినురుగులో పుట్టే బుడగలు నీటిలోనే కలిసినట్టుగా
ఎవని స్వరూపంవల్ల చరాచరాలతో కూడుకున్న జగత్తు
ప్రభవిస్తున్నదో, నిలుస్తున్నదో, లయిస్తున్నదో అటువంటి
తనని తాను అతడు శాశ్వతంగా చేరుకుంటున్నాడు.
35
అక్కడ ముక్కుమూసుకోవడం లేదు, దృష్టినిలపడమూ లేదు
అక్కడ ఎరుక ప్రకాశించదు, ఎరుకలేకపోవడమూ లేదు
నాడీ ప్రచారమూ, ప్రసారమూ కూడా లేని అటువంటి
తనని తాను అతడు శాశ్వతంగా చేరుకుంటున్నాడు.
36
అక్కడ నానాత్వం లేదు, ఏకత్వం లేదు, ఉభయత్వమూ లేదు
అన్యత్వం, అణుత్వం, దీర్ఘత్వం, మహత్వం, శూన్యత్వం లేవు
ప్రమాణత్వం, ప్రమేయత్వం, సమత్వాల్ని కూడా వదిలిపెట్టిన
తనని తాను అతడు శాశ్వతంగా చేరుకుంటున్నాడు.
37
నియమనిగ్రహం పాటించినా, పాటించకపోయినా
తపస్సు కూడగట్టుకున్నా, కూడగట్టుకోలేకపోయినా
నెత్తిన పనులు వేసుకున్నా, ఏ పనీ చేయకపోయినా
తనని తాను అతడు శాశ్వతంగా చేరుకుంటున్నాడు.
38
మనస్సుకాదు, బుద్ధి కాదు, శరీరం కాదు, ఇంద్రియాలు కావు
పంచతన్మాత్రలు కావు, పంచభూతాలతో కూడుకున్నదీ కాదు
అహంకృతికాదు, ఆకాశస్వరూపమూ కాదు, వీటన్నిటినీ దాటి
తనని తాను అతడు శాశ్వతంగా చేరుకుంటున్నాడు.
39
విధినిరోధాల మధ్యనే పరమాత్మ తత్త్వాన్ని చేరుకునేటప్పుడు
యోగి మనసు తేడాలు చూడటం మానేసిందా- ఇక అతడికి
శౌచం లేదు, అశౌచం లేదు, అక్కడ ఏ గుర్తులూ మిగలవు.
ఆ తావులో అతడికి నిషేధాలు కూడా విధ్యుక్తధర్మాలే.
40
మనసుకీ మాటలకీ కూడా ఎక్కడ శక్తిచాలదో
అక్కడ దేన్ని గురూపదేశమని చెప్పగలం?
ఈ సంగతి తెలిసి మాట్లాడే గురువూ, అతడు
చెప్పే మాటలూ రెండూ సమంగా ప్రకాశిస్తాయి.
మూడవ అధ్యాయం
1
గుణవిగుణ విభాగంలో ప్రవర్తించనది, రతివిరతి విభాగంలేనిది
నిర్మలం, నిష్ప్రపంచం, గుణాలూ విగుణాలూ కూడా లేనిది
ఎల్లెడలా వ్యాపించింది, విశ్వమంతా తానే అయి ఉన్నదీ
అయిన ఆ వ్యోమరూప శివస్వరూపానికి ఏమని నమస్కరించేది?
2
తెలుపో ఎరుపో నలుపో ఏ రంగులూ లేనిదీ
కార్యకారణాలు తనే అయినదీ, వికల్పాలు లేనిది
మాలిన్యాలు లేనిదీ, శుభప్రదమైనదీ అయిన
నా ఆత్మకు, మిత్రుడా! నేనెట్లా నమస్కరించేది?
3
మూలమున్నా లేకున్నా నేను సదా మొలకెత్తుతూనే ఉన్నాను,
పొగలుచిమ్మినా చిమ్మకున్నా నేను సదా రగులుతూనే ఉన్నాను,
దీపం వెలగనీ, వెలగకపోనీ నేను సదా ప్రకాశిస్తోనే ఉన్నాను,
జ్ఞానామృతాన్ని, సమరసస్వభావుణ్ణి, ఆకాశంతో పోల్చదగ్గవాణ్ణి.
4
ఆ సత్యానికి కోరిక ఉన్నదనిగాని లేదనిగాని ఎలా చెప్పగలను?
ఆ సత్యానికి సాంగత్యముందనిగాని లేదనిగాని ఎలా చెప్పగలను?
ఆ సత్యానికి సారముందనిగాని సారం లేదనిగాని ఎలా చెప్పగలను?
జ్ఞానామృతాన్ని, సమరసస్వభావుణ్ణి, ఆకాశంతో పోల్చదగ్గవాణ్ణి.
సంస్కృతమూలం
25
ఘటేభిన్నే ఘటాకాశ ఆకాశే లీయతే యథా
దేహాభావే తథా యోగీ స్వరూపే పరమాత్మని.
26
ఉక్తేయం కర్మయుక్తానాం మతిర్యాంతేపి సా గతిః
న చోక్తా యోగయుక్తానాం మతిర్యాంతేపి సా గతిః
27
యా గతిః కర్మయుక్తానాం సా చ వాగింద్రియాద్వదేత్
యోగినాం యా గతిః క్వాపి హ్యకథ్యా భవతోర్జితా.
28
ఏవం జ్ఞాత్వా త్వముం మార్గం యోగినాం నైవ కల్పితం
వికల్పవర్జనం తేషాం స్వయం సిద్ధిః ప్రవర్తతే.
29
తీర్థే వాంత్యజగేహే వా యత్ర కుత్ర మృతోపి వా
న యోగీ పశ్యతే గర్భం పరే బ్రహ్మణి లీయతే.
30
సహజమజమచింత్యం యస్తు పశ్యేత్స్వరూపం
ఘటతి యది యథేష్టం లిప్యతే నైవ దోషైః
సకృదపి తదభావాత్కర్మ కించిన్న కుర్యాత్
తదపి న చ విబద్ధః సంయమీ వా తపస్వీ
31
నిరామయం నిష్ప్రతిమం నిరాకృతిం
నిరాశ్రయం నిర్వపుషం నిరాశిషం
నిర్ద్వంద్వనిర్మోహమలుప్త శాక్తికం
తమీశమాత్మానముపైతి శాశ్వతం
32
వేదో న దీక్షా న చ ముండనక్రియా
గురుర్న శిష్యో న చ యత్రసంపదః
ముద్రాదికం చాపి న యత్ర భాసతే
తమీశమాత్మానముపైతి శాశ్వతం
33
న శాంభవం శాక్తిక మానవంనవా
పిండం చ రూపం చ పదాదికం న వా
ఆరంభ నిష్పత్తి ఘటాది కం చ నో
తమీశ మాత్మాన ముపైతి శాశ్వతమ్
34
యస్యస్వరూపాత్స చరాచరం
జగతుత్పద్యతే తిష్ఠతి లీయతేపివా
పయోవికారాదివ ఫేన బుద్బుదా
స్తమీశ మాత్మానముపైతి శాశ్వతమ్
35
నాసానిరోధో న చ దృష్టిరాసనం
బోధోప్యబోధోపి న యత్రభాసతే
నాడీప్రచారోపి న యత్రకించి
త్తమీశ మాత్మానముపైతి శాశ్వతమ్
36
నానాత్వమేకత్వముభత్వమన్యతా
అణుత్వదీర్ఘత్వ మహత్త్వశూన్యతా
మానత్వమేయత్వ సమత్వవర్జితం
తమీశమాత్మానముపైతి శాశ్వతమ్
37
సుసంయమీ వాయదివానసంయమీ
నుసంగ్రహీవాయది వానసంగ్రహీ
నిష్కర్మకోవా యది వాసకర్మక
స్తమీశ మాత్నాముపైతి శాశ్వతమ్
38
మనో న బుద్ధిర్నశరీర మింద్రియం
తన్మాత్రభూతానినభూత పంచకం
అహంకృతి శ్చాపివియత్స్వరూపకం
తమీశ మాత్మానముపైతి శాశ్వతమ్
39
విధౌనిరోధే పరమాత్మ తాంగతే
న యోగినశ్చేతసి భేదవర్జితే
శౌచం న వాశౌచమలింగ భావనా
సర్వం విధేయం యది వా నిషిధ్యతే.
40
మనోవచో యత్ర నశక్తమీరితుం
నూనం కధం తత్రగురూపదేశతా
ఇమాం కథా ముక్తవతో గురోస్త
ర్యుక్తస్య తత్వం హి సమం ప్రకాశతే.
మూడవ అధ్యాయం
1
గుణవిగుణ విభాగో వర్తతేనైవకించి
ద్రతి విరతి విహీనం నిర్మలం నిష్ప్రపంచం
గుణవిగుణవిహీనం వ్యాపకం విశ్వరూపం
కధమహమిహ వందే వ్యోమరూపం శివం వై.
2
శ్వేతాది వర్ణరహితో నియతం శివశ్చ
కార్యం హి కారణమిదం హి పరం శివశ్చ
ఏవం వికల్పరహితోహమలం శివశ్చ
స్వాత్మానమాత్మని సుమిత్రకధం నమామి.
3
నిర్మూల మూలరహితోహి సదోదితోహం
నిర్ధూమ ధూమరహితోహి సదోదితోహం
నిర్దీపదీపరహితోహి సదోదితోహం
జ్ఞానామృతం సమరసం గగనోపమోహమ్
4
నిష్కామ కామమిహ నామ కధం వదామి
నిస్సంగసంగమిహ నామ కధం వదామి
నిస్సారసారరహితం చ కధం వదామి
జ్ఞానామృతం సమరసం గగనోపమోహమ్
2-11-2024