
రెండవ అధ్యాయం
5
సారాసారాల్ని దాటి ఉన్నదేదో, రాకపోకల్ని దాటినదేదో
ఆ నిర్వికల్ప, నిరాకుల, శివస్వరూపంగా ఉన్నది నేనే.
6
సర్వవిభాగాలనుంచీ విడివడ్డవాణ్ణి కాబట్టి
త్రిదశులైన దేవతలు సమర్చించేది నన్నే
సంపూర్ణత్వం పొందినవాణ్ణి కాబట్టే
త్రిదశతత్త్వ విభాగానికి అందనివాణ్ణి కూడా.
7
ప్రమాదం గురించి శంకలేదు, వృత్తిగురించి భయంలేదు
నీటిబుడగల్లాగా తలపైకెత్తుతాయి, ఇంతలోనే కరిగిపోతాయి.
8
మహత్తుతో కూడుకున్న పంచభూతాల్లోనూ
అది సదా నిండి ఉన్నదే. ఎలాగైతే
మెత్తనివీ, చురుకైనవీ, తీపైనవీ
చేదైనవీ, కటువైనవీ, చల్లనివీ కూడా-
9
నీళ్ళల్లోనే కలిసిపోగలవో ప్రకృతిపురుషులు కూడా
అలానే ఒకరికొకరు వేరుకారని నాకనిపిస్తున్నది.
10
దేన్ని మనం ఇదీ అని పేరుపెట్టి పిలవలేమో
ఏది సూక్ష్మంకన్నా మరింత సూక్ష్మతరమో
మనసునీ, ఇంద్రియాల్నీ, బుద్ధినీ కూడా దాటిన
అకలంకతత్త్వమేదో అదే ఈ జగత్తును పాలిస్తున్నది.
11
అటువంటిది సహజంగా ఉన్నచోట నేనెక్కడ?
నువ్వెక్కడ? ఈ చరాచరాలెక్కడ?
12
ఏది ఆకాశంలాంటిదని చెప్తున్నారో
దాన్ని పోల్చడానికి ఆకాశమే సరైనది.
చైతన్యవంతమది, దోషాల్లేనిది
సర్వజ్ఞమూ, సంపూర్ణమూనూ.
13
ఆయన నడవడానికి భూమి సరిపోదు
ఆయన్ని నడపడానికి గాలి సరిపోదు
ఆయన్ని తేల్చడానికి నీరు సరిపోదు
వెలుగుమధ్య నిలిచిన వెలుగు ఆయన.
14
ఆయన ఆకాశాన్ని పరిచిపెట్టినవాడు కాడు
మరి దేనివల్లా వ్యాపించినవాడూ కాడు
బయటా లోపలా తిష్టవేసుకు కూచున్నాడు
ఎడతెగనివాడు, ఎక్కడా ఆగిపోనివాడు.
15
అచ్చం యోగులు చెప్పినట్టే అది
సూక్ష్మం, అదృశ్యం, నిర్గుణం కాబట్టి-
సరిగ్గా ఆ వరసలోనే ఆ గుణాల్నిబట్టే
దాన్ని పట్టుకోవాలి, పదిలపర్చుకోవాలి.
16
సతతం అభ్యాసం వల్ల దాన్ని తప్ప
మరిదేన్నీ పట్టుకోవలసిన పని ఉండదు.
లోపలి దోషాలనుంచి నెమ్మదిగా బయటపడి
చివరికి దానిలోనే లీనమైపోతాడు.
17
ప్రపంచం గొప్ప విషం, కోపించి భయపెడుతుంది
అజ్ఞానమోహంపుట్టిస్తుంది, స్పృహతప్పిస్తుంది
దాన్నుంచి బయటపడే మార్గమంటావా! నువ్వు నీ
సహజ స్థితిలో ఉండటమే అమోఘమైన అమృతం.
18
భావనవల్ల చేరగలిగేచోటుకి ఆకారం లేదు
కళ్ళతో చూసేదెప్పుడూ సాకారమే.
భావాభావాల్ని దాటిన స్థితి ఏదుందో
అదొక శూన్యస్థితి. దాన్నే అంతరాళమంటారు.
19
బయటి చూపు ప్రపంచం, లోపలి చూపు ప్రకృతి,
అంతరంలో అంతరాంతరముందే అది నారికేళ జలం.
20
బయటికి చూసే చూపులో భ్రాంతి తప్పనిసరి
చక్కగా ఆలోచించేజ్ఞానం మధ్యేమార్గం.
ఆ మధ్యస్థంలో మధ్యస్థంగా ఉన్నదేదో
అదే నారికేళజలంలాగా తెలుసుకోదగ్గది.
21
పున్నమిచంద్రుడు నిండుగా ఒకే ఒక్కడు, నిర్మలుడు,
అక్కడ ఇద్దరున్నారనుకుంటే అది చూసే చూపులోపం.
22
దృష్టిలోపంలాంటిదే బుద్ధిలోపం కూడా, తేడాలు చూస్తుంది.
ధీరుడు మనతో పంచుకునేది కోటినామాలతో కీర్తించదగ్గది.
23
వాడు మూర్ఖుడుగానీ, పండితుడుగానీ
గురుప్రజ్ఞా ప్రసాదం ఎవరికి లభిస్తుందో
ఎవడు భవసాగరవిరక్తుడై సత్యాన్ని
తెలుసుకుంటాడో అతడే విద్వాంసుడు.
24
ఇష్టాయిష్టాల నుంచి బయటపడ్డవాడు, ప్రాణులన్నిటికీ
దేనివల్ల మంచిచేకూరుతుందో దాన్ని కోరుకునేవాడు,
ఏది తెలుసుకున్నాడో దాన్ని గట్టిగా పట్టుకున్నవాడు,
ఆ ధీరుడు తప్పక అత్యున్నత స్థితికి చేరుకుంటాడు.
సంస్కృత మూలం
5
అహమేవ పరం యస్మాత్సారాసార తరం శివం
గమాగమ వినిర్ముక్తం నిర్వికల్పం నిరాకులమ్.
6
సర్వావయవనిర్ముక్తం తదహం త్రిదశార్చితమ్
సంపూర్ణత్వాన్నగృహ్ణామి విభాగం త్రిదశాశికమ్.
7
ప్రమాదేన సందేహః కింకరిష్యామి వృత్తివాన్
ఉత్పద్యన్తే విలీయన్తే బుద్బుదాశ్చయథా జలే.
8
మహదాదీని భూతాని సమాప్యైవం సదైవ హి
మృదుద్రవ్యేషు తీక్ష్ణేషు గుడేషు కటుకేషు చ.
9
కటుత్వం చైవ శైతత్వం మృదుత్వం యధాజలే
ప్రకృతిః పురుషస్తద్వదభిన్నం ప్రతిభాతి మే.
10
సర్వాఖ్యారహితం యద్యత్సూక్ష్మాత్సూక్ష్మతరం పరం
మనో బుద్ధీంద్రియాతీత మకలంకం జగత్పతిమ్.
11
ఈదృశం సహజం యత్ర అహం తత్ర కధం భవే
త్వమేహ హి కధం తత్ర కధం తత్ర చరాచరమ్.
12
గగనోపమం తు యత్ప్రోక్తం తదేవ గగనోపమం
చైతన్యం దోషహీనం చ సర్వజ్ఞం పూర్ణమేవ చ.
13
పృథివ్యాం చరితం నైవ మారుతేన చ వాహితం
వారిణాపిహితం నైవ తేజోమధ్యే వ్యవస్థితమ్.
14
ఆకాశం తేన సంవ్యాప్తం న తద్వ్యాప్తం చ కేనచిత్
స బాహ్యాభ్యన్తరం తిష్టత్యవచ్ఛిన్నం నిరన్తరమ్.
15
సూక్ష్మత్వాత్తదదృశ్యత్వానిర్గుణత్వాచ్చ యోగిభిః
ఆలంబనాది యత్ప్రోక్తం క్రమాదాలంబనం భవేత్.
16
సతతాభ్యాస యుక్తస్తు నిరాలంబో యదాభవేత్
తల్లయాల్లీయతే నాంతర్గుణ దోష వివర్జితః
17
విష విశ్వస్య రౌద్రస్య మోహమూర్ఛా ప్రదస్యచ
ఏకమేవ వినాశాయహ్యమోఘం సహజామృతమ్.
18
భావగమ్యం నిరాకారం సాకారం దృష్టిగోచరమ్
భావాభావ వినిర్ముక్త మంతరాళం తదుచ్యతే.
19
బాహ్యభావం భవేద్విశ్వమంతః ప్రకృతిరుచ్యతే
అంతరాదంతరం జ్ఞేయం నారికేల ఫలాంబువత్.
20
భ్రాంతి జ్ఞానస్థితం బాహ్యే సమ్యగ్జ్ఞానం చ మధ్యగం
మధ్యాన్మధ్యతరం జ్ఞేయం నారికేల ఫలాంబువత్.
21
పౌర్ణమాస్యాం యధాచంద్ర ఏక ఏవాతి నిర్మలః
తేనతత్సదృశం పశ్చ్యేద్ద్విధా దృష్టిర్విపర్యయః
22
అనేనైవ ప్రకారేణ బుద్ధిభేదో న సర్వగః
దాతాచ ధీరతామేతి గీయతే నామకోటిభిః
23
గురుప్రజ్ఞా ప్రసాదేన మూర్ఖోవాయది పండితః
యస్తు సంబుధ్యతే తత్వం విరక్తో భవసాగరాత్.
24
రాగద్వేష వినిర్ముక్తస్సర్వభూత హితే రతః
దృఢబోధశ్చ ధీరశ్చ సగచ్ఛేత్ పరమంపదమ్.
1-11-2024
ఆయన నడవడానికి భూమి సరిపోదు
ఆయన్ని నడపడానికి గాలి సరిపోదు
ఆయన్ని తేల్చడానికి నీరు సరిపోదు
వెలుగుమధ్య నిలిచిన వెలుగు ఆయన
🙇🏻♂️💐
ధన్యవాదాలు