నా గురించి పాడుకున్న పాట-1

కొన్నేళ్ళ కిందట బెంగుళూరులో ఒక సాహిత్యసమావేశానికి వెళ్ళాను. ఆ రోజు అక్కడొక పుస్తక ప్రదర్శన కూడా ఉండింది. అందులో వాల్ట్ విట్మన్ Leaves of Grass కన్నడ అనువాదం చూసాను. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. తెలుగులో ఇప్పటిదాకా విట్మన్ ని ఎవరూ ఎందుకు అనువదించలేదో నాకు తెలియలేదు. ఎవరి సంగతో ఎందుకు, నేనే అనువదించి ఉండవచ్చుకదా, కాని ఇన్నేళ్ళయినా కూడా ఎందుకు పూనుకోలేకపోయానో నాకే తెలీకుండా ఉంది. ఆధునిక యుగంలో వచన కవితకి విట్మన్ నే ఆద్యుడు. స్వేచ్ఛాపిపాసి, ప్రజాస్వామిక వాది, ఆరోగ్యవంతమైన ఐహిక జీవితాన్ని కలగన్నాడు. ‘పాడిపంటలు పొంగి పొర్లే దారిలో’ నడిచినవాడు. ‘తిండి కలిగితె కండ కలదోయ్, కండకలవాడేను మనిషోయ్’ అని భావించినవాడు. నిజమైన దేశభక్తుడు. కానీ ఆ దేశం గురజాడ ‘దేశభక్తి’ లో ప్రస్తుతించిన దేశం. ఎల్లలోకం ఒకటి కాగలిగిన దేశం. అటువంటి కవి తెలుగులోకి వస్తే యువతరానికి గొప్ప గళం ఒకటి పరిచయమవుతుందనిపించింది. అందుకని అతడి సుప్రసిద్ధ గీతం Song of Myself (1855) ని తెలుగు చేయడానికి ఉపక్రమిస్తున్నాను. ఈ గీతంలో మొత్తం 52 భాగాలున్నాయి. మొదటగా మొదటి మూడు భాగాలూ ఈ రోజు మీకందిస్తున్నాను.


నన్ను నేను ఘనపరుచుకుంటున్నాను
నేనూ మీరూ సంభావిస్తున్నది ఒక్కటే
ఎందుకంటే నాలో అణువణువూ మీది కూడా.

నేనొకింత తీరిగ్గా నా ఆత్మని ఆవాహన చేస్తున్నాను
ఇక్కడ వసంతకాలపు గడ్డిపోచనొకదాన్ని…
సోమరిగా పరికిస్తున్నాను.

నా గళం, నా రక్తంలోని ప్రతి కణం ఈ మృత్తిక లోంచి ఈ గాల్లోంచి  రూపొందినవే,  ఇక్కడి తల్లిదండ్రులకు పుట్టినవే, వాళ్లు వాళ్ల తల్లిదండ్రులకు, ఆ తల్లిదండ్రులు తమ తల్లిదండ్రులకు.
ఇప్పుడు నేను నా ముప్ఫై ఏడో ఏట ఆరోగ్యవంతుడైన మానవుడిగా ముందడుగు వేస్తున్నాను,ఇక మరణం దాకా వెనుతిరిగేది లేదు .

ఆచారాల్ని, సంప్రదాయాల్ని
ఎలా ఉన్న వాటినట్లానే పక్కకు నెట్టి,
ప్రతి ఒక్క విపత్తుకూ ఎదురేగుతూ

విశృంఖల మౌలికశక్తితో
మంచికో చెడ్డకో ముందుకు నడుస్తున్నాను.

2

ఇళ్ళూ, గదులూ కూడా సుగంధతైలాలతో సురభిళిస్తున్నాయి. ..అలమారులన్నీ అత్తరుల్తో కిక్కిరిసిపోయాయి.
ఆ సుగంధాన్ని గుర్తుపడుతున్నాను, ఇష్టపడుతున్నాను, నాకై నేను ఆఘ్రాణిస్తున్నాను.
ఆ సుగంధం నన్ను మత్తెక్కించగలదు గాని ఆ మత్తులోకి జారిపోకుండా నన్ను నేను నిలవరించుకుంటున్నాను.

నా చుట్టూ ఉన్న వాతావరణం ఒక సుగంధ ద్రవ్యం కాదు. .. దానికి సుగంధాన్ని వడిగట్టిన రుచిలేదు… అది నిర్గంధం.
ఆ పరిమళం నాకోసమే. .. నేను దానితో ప్రేమలో పడ్డాను.
నేనిప్పుడు నదీతీరానికి పోతాను, అడవికి పోతాను
అక్కడ నా దుస్తులు విడిచిపెట్టి దిగంబరుణ్ణవుతాను,
ఆ పరిమళం నన్ను ముంచెత్తడంకోసం నేనున్మత్తుణ్ణై ఉన్నాను.
నా ఊపిరి పొగ, ప్రతిధ్వనులు, తరంగాలు, ఝుంకారాలు, నిట్టూర్పులు..రకరకాల తీగలు, లతలు, మూలికలు
నా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు.. నా గుండె చప్పుడు.. నా ఊపిరితిత్తుల్లో ప్రసరిస్తున్న రక్తం, ప్రాణవాయువు

సముద్రతీరానిదీ, ముదురురంగు సముద్రపు రాళ్ళదీ, మేటులో పండుతున్న ఎండుగడ్డిదీ, పచ్చివీ, ఎండినవీ ఆకుల్లోంచీ గుప్పున తాకే సువాసన,
నా గొంతులోంచి ఉప్పొంగే మాటల్లో తేన్చే సవ్వడి…గాల్లో సుళ్ళు తిరుగుతూ తేలిపోయే మాటలు,
కొన్ని మెత్తని ముద్దులు.. మరికొన్ని కావిలింతలు. .. హత్తుకోడానికి చాపిన బాహువులు,
ఒంటరిగా ఉండటంలోనో లేదా వీథుల్లో వడివడి పోవడంలోనో లేదా పొలాలమ్మటో, కొండదారులమ్మటో నడుచుకుంటూ పోవడంలోనో అనుభవానికొచ్చే సంతోషం,
ఒక స్వస్థతాపూర్వక భావన. .. ఒక పూర్ణదిన కలస్వనం.. పొద్దున్నే పక్కమీంచి లేచి సూర్యుడికి ఎదురేగడంలోని కవిత్వం.

నువ్వెప్పుడైనా ఒక వెయ్యి ఎకరాల మేరకు లెక్కపెట్టావా? కొలవగలిగినంతమేరకు భూమిని కొలిచిచూసావా?
చదవడానికి  సాధన చేసావా?
శ్లోకాలు నీ అంతట నువ్వే అర్థం చేసుకోగలుగుతున్నందుకు గర్వించేవా?

ఈరోజుకి, ఈ రాత్రికి నా దగ్గర ఉండిపో అప్పుడు కవిత్వమూలమేదో నువ్వు చేజిక్కించుకోగలుగుతావు
భూమికీ, సూర్యుడికీ చెందిన సమస్త శ్రేష్టత్వాన్నీ నువ్వు కైవసం చేసుకోగలుగుతావు… అయినా ఇంకా కోట్లాది సూర్యులు మిగిలిపోతారు.
ఎన్నో విషయాల్నీ, సంగతుల్నీ నువ్వింకెంతమాత్రం మరోమనిషి ద్వారానో మూడో మనిషి ద్వారానో తెలుసుకునే పని ఉండదు… లేదా మరణించినవాళ్ళ కళ్ళతో చూడవలసిన అగత్యం ఉండదు. .. లేదా పుస్తకాల భ్రాంతుల్లో తగులుకోవలసిన పని ఉండదు.
అలాగని నువ్వు నా కళ్ళతో కూడా చూడవు లేదా నా నుంచి ఏదీ సంగ్రహించవు,
నాలుగుదిక్కులనుండీ నీ అంతట నువ్వే వింటావు, విన్నదాన్ని నీకై నువ్వు కూడగట్టుకుంటావు.

3

మాట్లాడుతున్నవాళ్ళు ఏం మాట్లాడుతున్నారో విన్నాన్నేను..వాళ్ళు ఆదినుంచి అంతం దాకా మాట్లాడుతున్నారు.
కాని నేను ఆది గురించీ మాట్లాడను, అంతం గురించీ మాట్లాడను.

ఈ వర్తమానాన్ని మించిన ప్రారంభం మరెక్కడో లేదు
ఇప్పుడేది నడుస్తోందో దాని కన్నా మించిన యవ్వనం, యుగం మరొకటి లేదు
ఈ ప్రస్తుతక్షణం కన్నా పరిపూర్ణమైంది మరెప్పుడూ లేదు
ఈచోటుని దాటిన స్వర్గం మరొకటి లేదు, నరకం మరొకటి లేదు.

ఉద్వేగం, ఉద్వేగం, ఉద్వేగం
ప్రపంచోత్పాదకమైన ఉద్వేగమే సదా.

పరస్పర వైరుధ్యాల మసకలోంచి సమానశక్తులు పురోగమిస్తాయి.. సదా పదార్థమూ, సమృద్ధీ,
సదా ఒక సారూప్యజాలం.. సదా విభిన్నత.. సదా ఒక ప్రజననం

విస్తారంగా చెప్పి ప్రయోజనం లేదు. .. పండితులకీ, పామరులకీ కూడా అదేమిటో తెలుసు.

అది ఎంత నిశ్చయాత్మకమో అంత నిశ్చయం. ..స్థిరంగా నిలబెట్టిన స్తంభాలు, దృఢంగా జతపరిచిన దూలాలు
అశ్వంలాగా బలిష్టం, అనురాగపూరితం, దర్పితం, విద్యున్మయం
నేనూ నా రహస్యం ఇక్కడిలా కుదురుకున్నాం.

స్పష్టం, మధురం నా ఆత్మ… అలాగే నా ఆత్మలో భాగం కానిది  కూడా, సమస్తం, స్పష్టం, సుమధురమే.

ఒకటి లేదా మరొకటి లేదు… అదృశ్యానికి దృశ్యం నిరూపణ,
కడకు ఆ దృశ్యం కూడా అదృశ్యంగా మారి తనని మరొకటి నిరూపించేదాకా.
శ్రేష్టమైనదాన్ని చూపించి దాన్ని హీనమైనదాన్నుంచి వేరుచెయ్యడంలో యుగాలు యుగాల్ని చికాకుపరుస్తూనే ఉన్నాయి
పరిపూర్ణ యోగ్యతనీ, విషయాల సమభావాన్నీ తెలుసుకుని వాళ్ళు చర్చిస్తున్నంతసేపూ నేను మౌనంగానే ఉంటాను, ఇక అప్పుడు నన్ను నేను ఆరాధించుకుంటో నదిలో జలకాలాడటానికి బయల్దేరుతాను.

నా ప్రతి ఒక్క అంగాగానికీ, నా గుణగణాలకూ నా స్వాగతం, అలాగే హృదయం కలిగిన ప్రతి ఒక్క మనిషికీ, శుచిస్నాతుడైన ప్రతి ఒక్కడికీ కూడా.
నాలో ఒక్క అంగుళం కూడా, అంగుళంలోని ఒక్క అణువు కూడా దుర్మార్గమైంది లేదు. అలానే ఏ ఒక్కరూ కూడా తక్కినవారికన్నా అపరిచితులూ కారు.

నేనిప్పుడు సంతృప్తిగా ఉన్నాను.. నేను దర్శిస్తున్నాను, నృత్యం చేస్తున్నాను, పాడుకుంటున్నాను, పరవశిస్తున్నాను.
భగవంతుడు నాకు ఏకశయ్యాగతుడై రాత్రంతా నా పక్కనే నిదురించి
గంపలనిండా వదిలిపెట్టిన శ్వేతవస్త్రాలతో నా గృహాన్ని పుష్కలం చేసి
తెల్లవారుతూనే వెళ్ళిపోతున్నప్పుడు
నా నేత్రాలు వీథికొసదాకా చూసి వెనుదిరిగినప్పుడు
తాము చూసినదాన్ని నాకు వివరించబోయినప్పుడు
ఒకటో లేదా రెండో లేదా ముందేమున్నదో విశదీకరించడానికి పూనుకున్నప్పుడు
నేను నా సాక్షాత్కారాన్ని, అంగీకారాన్ని వాయిదా వెయ్యనా
లేక నా నేత్రాల్ని చూసి రోదించనా?

14-8-2024

14 Replies to “నా గురించి పాడుకున్న పాట-1”

  1. Song of myself నాకెంతో యిష్టం .మీ అనువాదం చాలా ఇష్టంగా చదివాను న్యూజర్సీకి వర్జీనియా కి మధ్య వాల్ట్ విట్మన్ పేర ఒక రహదారి వుంది . ఆదారున వెళ్ళినప్పుడల్లా ఈ కవిత్వమే వినపడుతుంది. ఈ కవిత్వాన్ని తెలుగులో వినిపించినందుకు మీకు కృతజ్ఞతలు.

    1. హృదయపూర్వక ధన్యవాదాలు మేడం!

    2. New Jersey and Pennsylvania రాష్ట్రాలను కలిపే వారధి పేరు వాల్ట్ విట్మాన్ బ్రిడ్జ్. It’s the first major bridge named after a poet. We drove on this bridge yesterday and today I started reading this series…

  2. విట్మన్ మహాకవి… తెలుగులో తన గొంతును నేరుగా వినిపించిన వైనం… ఎంతటి భావుకత!

  3. నేనిప్పుడు సంతృప్తిగా ఉన్నాను.. నేను దర్శిస్తున్నాను, నృత్యం చేస్తున్నాను, పాడుకుంటున్నాను, పరవశిస్తున్నాను.
    భగవంతుడు నాకు ఏకశయ్యాగతుడై రాత్రంతా నా పక్కనే నిదురించి
    గంపలనిండా వదిలిపెట్టిన శ్వేతవస్త్రాలతో నా గృహాన్ని పుష్కలం చేసి
    తెల్లవారుతూనే వెళ్ళిపోతున్నప్పుడు
    నా నేత్రాలు వీథికొసదాకా చూసి వెనుదిరిగినప్పుడు
    తాము చూసినదాన్ని నాకు వివరించబోయినప్పుడు
    ఒకటో లేదా రెండో లేదా ముందేమున్నదో విశదీకరించడానికి పూనుకున్నప్పుడు
    నేను నా సాక్షాత్కారాన్ని, అంగీకారాన్ని వాయిదా వెయ్యనా
    లేక నా నేత్రాల్ని చూసి రోదించనా?

    వహ్వా… నేత్రాలు వీధి కొస దాకా చూసి…వెనుతిరిగినప్పుడు. ..
    ఆహా…
    ఎంత మంచి కవిత్వం? అనువదించే తమకు నమోనమః

  4. rammohanthummuri – I am a writer, a poet, a head master, a fater, a husband, and a creative person. I primarily in telugu language.
    Thummuri says:

    ఎందరో మహాకవులు అందరికీ వందనాలు.
    మరో మహాకావ్యానువాద శుభారంభానికి
    స్వాగతం . అభినందనం . నిఖార్సైన దేశభక్తి
    కావ్యం స్వాతంత్ర్య దినోత్సవం నాడు ప్రారంభం కావడం సంతోషకరం .

  5. ఇంగ్లీష్ లో ఎలా ఉన్నాయో పదాలు తెలియదు .చదివి అర్థం చేసుకోవాలంటే ఇప్పుడు కుదరదు .సార్ మీరు అల్లిన తెలుగు పదాలు మాత్రం అద్భుతం .ప్రతి పదం మరొక పదానికి వెన్నుగా నిలిచింది .

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%