
మొన్న తిరుపతినుంచి డా.ఆకెళ్ళ విభీషణ శర్మగారు ఫోన్ చేసి అన్నమయ్య కీర్తనల్ని వ్యాఖ్యాన సహితంగా వెలువరిస్తున్నామని చెప్తూ, రెండు సంపుటాలు పంపించారు.
ఆరువందల ఏళ్ళ కిందట తాళ్ళపాక కవులు సృష్టించి రాగిరేకులమీద చెక్కించి భద్రపరిచి వెళ్ళిన భాండాగారం గురించి లోకానికి తెలిసిన తరువాత, 1922 మొదలుగా ఇప్పటిదాకా అన్నమయ్య కవిత్వవిశ్వరూపం నానాటికీ మరింతగా విస్తరిస్తూనే ఉంది. సాధు సుబ్రహ్మణ్య శాస్త్రి, వేటూరి ప్రభాకర శాస్త్రి, రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ మొదలైన పరిశోధకుల పరిష్కారంతో తాళ్ళపాక కవుల సంకీర్తనా సాహిత్యాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వారు 1980 లో మొదటిసారిగా 29 సంపుటాలుగా వెలువరించారు.
ఆ సంపుటాలు చేతికందడమే మహాభాగ్యం అనుకునే అభిమానులకి అందులో ఎన్నో పదప్రయోగాలు, పలుకుబళ్ళు కొత్తగా తోచడంతో వాటికి మళ్ళా పదకోశాలు నిర్మించే పరిశోధకులు కూడా ముందుకొస్తూనే ఉన్నారు. కానీ కీర్తనలు ఒకచోటా, పదకోశాలు మరొకచోటా, పలుకుబడి మెలకువలు విప్పిచెప్పే వ్యాఖ్యాతలూ మరొకచోటా ఉండటంతో తాళ్ళపాక కవుల కీర్తనసాహిత్యంలోకి ప్రవేశించడం దుష్కరంగానే ఉంటూ వచ్చింది.
ఇటువంటి పరిస్థితుల్లో తిరుమల తిరుపతి దేవస్థానం వారు అన్నమాచార్య ప్రాజెక్టు ద్వారా తాళ్ళ పాక పద సాహిత్యంలో తాము ముందు వెలువరించిన సంపుటాలకు ఒక్కొక్కదానికీ మళ్ళా సవివరంగా అర్థ తాత్పర్యాలతో వ్యాఖ్యానం వెలువరించడం అమృతాన్ని నేరుగా తెలుగు సాహిత్య ప్రేమికుల ఇంటికి పంపించడమే అని చెప్పొచ్చు.
విభీషణ శర్మగారు ఇప్పుడు అన్నమయ్య ప్రాజెక్టు సంచాలకులుగా ఉన్నారు. ఆయన తమ ప్రాజెక్టు వెలువరించిన మొదటి రెండు సంపుటాల్నీ నాకు అయాచితంగా పంపించడం స్వామిప్రసాదమే అనిపించింది.
పుస్తకాలు రావడమేమిటి, వెంటనే, మొదటి సంపుటం మొత్తం చదివేసాను. మొత్తం అన్నమయ్యవి 506 ఆధ్యాత్మ కీర్తనలు. వాటితో పాటు తాళ్ళపాక పెదతిరుమలాచార్యుడివి నాలుగు ఆధ్యాత్మకీర్తనలు కూడా అనుబంధంగా ఇచ్చారు.
ఈ కీర్తనలన్నిటికీ ఆచార్య కోలవెన్ను మలయవాసినిగారు వ్యాఖ్యానం రాసారు. మనకాలంలో అన్నమయ్య పండితులుగా చెప్పదగ్గవారు పరిష్కర్తలుగా ఉన్నారు.
ఈ కీర్తనలు చదువుతుంటే నాకు అన్నిటికన్నా మొట్టమొదటగా అనిపించిన అనుభూతి ఒకటే: అదేమంటే తిరుపతిలో అందమైన కొండలున్నాయి, అడవులున్నాయి, జలపాతాలున్నాయి, కొలనులున్నాయి, తలపైకెత్తి చూస్తే నీలగగనముంది. లేనివి రెండే, నదీ, సముద్రమూను. ఆ లోటు పూడ్చడానికా అన్నట్టు అన్నమయ్యా, ఆయన కుటుంబీకులూ తమ కీర్తనలనే నదుల్తో ఒక మహాసముద్రాన్ని సృష్టించారు. కాబట్టే ఈ కీర్తన సంపుటాలకి ‘అన్నమయ్య సంకీర్తన లహరి’ అని పేరుపెట్టడం ఎంతో సముచితంగా ఉంది.
ఈ కీర్తనలన్నీ ఆధ్యాత్మకీర్తనలేగాని, ఇందులో కవిగా అన్నమయ్య గీతవైభవం ఎన్నో పార్శ్వాలతో శోభిస్తూ ఉంది. అన్నిటికన్నా ముందు చెప్పవలసింది, ఒక కీర్తనకీ, మరొక కీర్తనకీ మధ్య పునరుక్తి లేకపోవడం. ఒక మనిషి తన జీవితకాలంలో అన్ని వేల కీర్తనలు రాసి ఉండటం ఒక ఆశ్చర్యమైతే, ఏ కీర్తన పాడినా అది తన మరొక కీర్తనకి ప్రతిధ్వని కాకుండా పాడటం మరింత ఆశ్చర్యం.
ఇందులో తెలుగు, సంస్కృతం రెండు భాషల్లోనూ కీర్తనలున్నా, ఆ తెలుగునీ, ఆ సంస్కృతాన్నీ ఒక శైలికీ, ఒక రంగుకీ, ఒక రసానికీ మాత్రమే పరిమితం చెయ్యలేం. కొన్నిచోట్ల అది ఎంతో లలితం. మరికొన్ని చోట్ల మహోద్దండం.
ఎమ్మెస్ సుబ్బులక్ష్మి, శోభారాజు, బాలకృష్ణప్రసాద్ మొదలుగా తెలుగు గాయకులూ, సినిమా గాయకులూ కూడా జనబాహుళ్యానికి చేరవేసిన సుప్రసిద్ధమైన కీర్తనలెన్నో ఈ మొదటిసంపుటంలో ఉన్నాయి. ‘అదివో అల్లవిదో హరివాసము’, ‘అలర చంచలమైన ఆత్మలందుండ నీ యలవాటు సేసె నీ వుయ్యాల’, ‘కొండలలో నెలకొన్న కోనేటిరాయడు వాడు’,’ఆకటివేళల అలపైన వేళలను’, ‘బ్రహ్మ కడిగిన పాదము’, ‘మనుజుడై పుట్టి మనుజుని సేవించి’, ‘ఎండగాని నీడగాని ఏమైన గాని’, ‘వాడల వాడల వెంట వాడివో’, ‘ఏ కులజుడేమి యెవ్వడైన నేమి’, ‘అంతర్యామీ అలసితి సొలసితి’, ‘అంతయు నీవే హరిపుండరీకాక్ష’, ‘ నిగమ నిగమాంత వర్ణిత మనోహర రూప’, ‘ఓహో డేం డేం వొగి బ్రహ్మమిదియని’, ‘ఇందరికి అభయంబు లిచ్చు చేయి’ వంటి తెలుగు కీర్తనలు, ‘భావయామి గోపాల బాలం’, ‘దేవదేవం భజే దివ్యప్రభావం’ వంటి సంస్కృత సంకీర్తనలూ ఈ సంపుటంలో ఉన్నాయి.
కాని ఎందుకనో స్వరకర్తలూ, గాయకులూ పట్టించుకోని అద్భుతమైన కీర్తనలు కూడా ఈ సంపుటంలో దాదాపుగా ప్రతి ఒక్క పుటలోనూ కనిపిస్తున్నాయి. ఆ కీర్తనల్లో అన్నమయ్య ‘భావగోచరమైన పరిణతి’ ఎంత కనిపిస్తున్నదో, జీవితకాలం పాటు కైంకర్యం చేసి సంపాదించుకున్న ‘ఘనమనోరాజ్య సంగతి’ ఎంత విస్పష్టంగా వినిపిస్తున్నదో, అంతే మిరుమిట్లు గొల్పుతూ ఆ భాషా వైభవం కూడా మనల్ని నివ్వెరపరుస్తూ ఉన్నది. కొన్ని చోట్ల ఆ తెలుగు గంభీరమైన సంస్కృతసమానంగా ఆ తేజస్సుతో, ఆ ఓజస్సుతో, ఆ కీర్తనల్ని స్తోత్రాలుగా మార్చేసింది, ఇదుగో, సుప్రసిద్ధమైన ఈ కీర్తనలో లాగా:
భాలనేత్రానల ప్రబల విద్యుల్లతా
కేలీవిహార! లక్ష్మీ నారసింహా!
ప్రళయమారుతఘోర భస్త్రికాపూత్కార
లలితనిశ్వాసడోలా రచనయా
కుల శైలకుంభినీ కుముదహితరవి గగన
చలన విధినిపుణ! నిశ్చల నారసింహా!
వివరఘనవదన దుర్విధ హసన నిష్ఠ్యూత
లవదివ్యవరుషలాలాఘటనయా
వివిధ జంతువ్రాత భువనమగ్నీకరణ
నవనవప్రియ! గుణార్ణవ నారసింహా!
దారుణోజ్జ్వల ధగద్ధగితదంష్ట్రానలవి
కార స్ఫులింగ సంగక్రీడయా
వైరిదానవ ఘోరవంశ భస్మీకరణ
కారణ! ప్రకటవేంకట నారసింహా!
అదే నరసింహుణ్ణి అచ్చ తెలుగులో ఎలా కీర్తిస్తున్నాడో చూడండి:
ఇలయును నభమును నేకరూపమై
జలజల గోళ్ళు జళిపించితివి
ఎడసిన నలముక హిరణ్యకశిపుని
దొడికిపట్టి చేతుల బిగిసి
కేదపి తొడలపై గిరిగొన నదుముక
కడుపు చించి కహకహ నవ్వితివి.
రొప్పుల నూర్పుల రొచ్చుల కసరులు
గుప్పుచు లాలలు కురియుచును
కప్పిన బెబ్బులి కసరు హుంకృతుల
దెప్పర పసురుల ధృతి యణచితివి.
పెళపెళ నార్చుచు బెడబొబ్బలిడుచు
థళథళ మెరువగ దంతములు
ఫళఫళ వీరవిభవరసరుధిరము
గుళగుళ దిక్కుల గురియించితివి.
చాతిన ప్రేవుల జన్నిదములతో
వాతెర సింహపు వదనముతో
చేతులు వేయిట చెలగి దితిసుతుని
పోతరమణపుచు భువి మెరసితివి
అహోబలమున అతి రౌద్రముతో
మహామహిమల మలయుచును
తహతహ మెదుపుచు తగు వేంకటపతి
యిహము పరము మా కిపుడొసగితివి.
తెలుగు అంటే ఇది. సంస్కృతాన్ని కూడా నలిగిమింగెయ్యగల తెలుగు. ఆ ‘వీరవిభవరసరుధిరము’ అనే మాట కూడా ఎలా తెలుగుమాటగా మారిపోయిందో చూడండి.
తెలుగు ఎంత నాదాత్మకమో, అంత లయాత్మకం కూడా. లయకోసం తెలుగు పాటలో ఇంగ్లిషు పదాల్ని చొప్పించేవాళ్ళు అన్నిటికన్నా ముందు అన్నమయ్యని చదివితే, తెలుగు భాష మహత్తు ఏమిటో తెలుసుకోగలుగుతారు. ఈ కీర్తన చూడండి.
బాపు దైవమా మా పాలి భవమా
తీపు రాకాసినెత్తురు దీం దోందోం దోందోం దోందోం.
కాలనేమి పునుకిది కంచువలె లెస్స వాగీ
తాళమొత్తరే తత్త తత తత్తత్త
కాలమెల్ల మాభూతగణమెల్ల వీడె కాచె
నేలబడి నేడును ధీం ధీం ధీం ధీం ధీం ధీం ధీం.
పగగొని మానక పచ్చినెత్తురెప్పుడును
తెగి కొనుదానె తిత్తి తితి తిత్తితి
తగుమహోదురు వీపు ధణధణమని వాగీ
బిగియించరే తోలు బింభిం, బింభిం, బింభింభిం.
మురదనుజుని పెద్ద మొదలి యెముక తీసి
తురులూదరే తుత్తు తుత్తు తుత్తుత్తు
తిరువేంకట గిరిదేవుడు గెలిసిన స
మరమునను మమ్మ మమ్మ మమ్మ మమ్మమ.
ఇక్కడ భాష మొత్తం ఒక వాద్యసందోహంగా పెళపెళ్ళాడుతూ మనమీద విరుచుకుపడుతున్నట్టుంది కదూ!
తమిళ ఆళ్వారుల్లానే అన్నమయ్య కూడా దైవాన్ని స్థానికం చేసేసాడు. హరిదాసులుండాలేగాని, ప్రతి ఊరూ ఒక దివ్యదేశంగానే కనిపించింది ఆయనకి. అందుకని అన్నమయ్యది ‘విస్తృత వైష్ణవం’ అని విభీషణ శర్మగారు రాసిన మాటలో ఎంత ఔచిత్యముంది. తన దర్శనం విస్తృతం కావడంలో అతడు అన్నమయ్య శ్రీవేంకటేశ్వరుణ్ణి ప్రతి ఊరిలోనూ మాత్రమే కాదు, ప్రతి ఒక్క పలుకుబడిలోనూ మాత్రమే కాదు, ప్రతి గ్రామంలోనూ కనవచ్చే ప్రతి ఒక్క జీవితవిశేషంలోనూ చూడగలిగాడు. కాబట్టే వెంకటేశ్వరుడు ఆయనకొక బోయనాయకుడిగా కూడా కనబడ్డాడు:
పొడవిన శేషగిరి బోయనాయకుడు
విడువకిమరి గాచు వెడబోయనాయడు
పొలసి మీసాల పెద్దబోయనాయడు
మలిగి వీపున గట్టే మంకుబోయనాయడు
పొలమురాజై తిరిగే బోయనాయడు
వెలయ మోటుననుండే వేటబోయనాయడు
పొట్టిపొట్టి అడుగుల బోయనాయడు ఎందు
పుట్టుపగ సాధించే బోయనాయడు
బొట్టుల మొకమునేసే బోయనాయడు
పట్టపు నెమలిచుంగుబలు బోయనాయడు
పొంచి శిగ్గెగరగని బోయనాయడు
మించి రాలమీద దాటే మెండుబోయనాయడు
అంచెల శ్రీవేంకటేశుడనే బోయనాయడు
పంచ కాలవేలముల పలుబోయనాయడు.
ఈ కీర్తనలో దశావతార సమన్వయం ఉందని తొలిపరిష్కర్తలు సూచనగా చెప్పినదాన్ని మలయవాసిని గారు ఎంతో ప్రతిభతో ఈ కీర్తనలోని సొబగుని విప్పి వివరించారు. ‘పొలము రాజు’ అంటే వరాహం అనీ, ‘చుంగు’ అంటే చెంగు అనీ ఆమె చెప్పకపోతే ఊహించడం కష్టం. ఇంక ‘బొట్టుల మెకం’ అంటే మాయలేడి అని ఆమె చెప్పేక, నిజమే కదా, మనకెందుకు తట్టలేదు అని అనిపించడం కూడా సహజమే.
చాలా రాయాలి. ఈ సంపుటంలోని ఎన్నో కీర్తనల్లో కనిపిస్తున్న భాషా వైభవంతో పాటు భావవైభవం గురించి కూడా రాసుకోవాలి. ‘అతిశయుండను వేంకటాద్రీశుడను మహాహితుణ్ణి’ తన చిత్తమంతా నింపుకుని అన్నమయ్య మాలికలుగా గుచ్చిన ప్రతి ఒక్క పాట గురించీ మాట్లాడుకోవాలి. ‘తిరువేంకట గిరిపతి యగు దేవశిఖామణి పాదము శరణని బ్రదుకుటతప్ప’ మరొక ‘సన్మార్గం’ లేదని పరిపూర్ణంగా నమ్మి పాటలతో పూజించిన పాటకారుడి గురించి బహుశా ఒక జీవితకాలం పాటు మాట్లాడుకుంటూనే ఉండాలి.
26-5-2024
అమోఘమైన పదసంపద మీ కుటీరం దగ్గర స్పష్టమైంది మాష్టారు…
ధన్యవాదాలు మేడం!
ఈ ఉదయం ఫలవంతం అయ్యింది.
ధన్యవాదాలు సార్
ధన్యవాదాలు గోపాల్!
“తిరుమల లో పొంగి పొర్లే సముద్రం” అద్భుతమైన వ్యాఖ్య. అన్నమయ్య పద సాహితీ సముద్రం గురించి మీద్వారా ఇలా వినడం… బాగుందండీ!
అన్నమయ్య పద భాండాగారం- వివరించి వినిపించే చాలామంది వ్యాఖ్యాతలు ఉన్నారు అనుకోండి. అందులో ఒకరు-
మా బాంక్ లో నే ప్రస్తుత GM శ్రీ గరికపాటి వెంకట్ గారు రోజూ మాకు వాట్సాప్ ద్వారా వినిపించడమే కాదు చాలా పుస్తకాలు తన వ్యాఖ్యానం తో వెలువరించారు.
ఇది గాక, బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ గారి ప్రవచనాలలో కూడా ఏదో ఒక సందర్భంలో అయినా అన్నమయ్య సాహిత్య ప్రస్తావన ఉంటుంది. అలా వాగ్గేయకారుడు అయిన అన్నమయ్య ప్రస్తావన మీ బ్లాగు లో రావడం
చాలా సంతోషంగా వుంది. ధన్యవాదాలు🙏
మీ సహృదయ స్పందనకు ధన్యవాదాలు మేడం!
అన్నమయ్య సాహిత్యం అపారసముద్ర మని చెప్పడం బాగుంది. ఆయన సాహిత్యం తెలుగు భాషకు గొప్పవరప్రసాదం.
ధన్యవాదాలు సార్!
మంచి వ్యాసం అందించారు. Thank you . Ee సంపుటాలు వెంటనే కొనుక్కుంటాను .
ధన్యవాదాలు
అన్నమయ్య గురించి మీరు రాసిన మాటలు ఒక్కసారి చదివేస్తే సరిపోదు.కాస్త ఓపికగా, మరికాస్త శ్రద్ధతో చదవాలి. అచ్చతెలుగు తెలుసుకోవాలన్నా, ఆ పదాల అర్గం భోదపడాలన్నా ఇంకొక్కసారి, మరొక్కసారి చదవాలి. చదివితే సరిపోతుందా? అంటే సరిపోదు. జాగ్రత్తగా ఆకళింపు చేసుకుని గుర్తు కూడా పెట్టుకోవాలి. చాలా ఆతృతగా గబ గబా చదివాక నాకు తెలిసిందిది. మీకు నమస్సులు
ధన్యవాదాలు మేడం
హరిదాసులుండాలేగాని, ప్రతి ఊరూ ఒక దివ్యదేశంగానే కనిపిస్తుంది
ధన్యవాదాలు సర్
ధన్యవాదాలు