పోయిన ప్రాణం లేచొచ్చినప్పుడు

ఈ కొత్త సంవత్సరం వచ్చిన ముందు రోజు రాత్రి అంటే డిసెంబరు 31 న నేను చాలా చీకటిలో చిక్కుకుపోయి ఉన్నాను. ఇంటిముందు బాల్కనీలో వెలిగించిన క్రిస్మస్ తార, విద్యుద్దీపాల మాల మెరుస్తూనే ఉన్నాయి, కాని హృదయంలో చిగురించవలసిన కాంతిరేఖ ఇంకా పొడచూపడం లేదు. అట్లాంటి వేళ రామకృష్ణారావు గారినుంచి నూతనసంవత్సర శుభాకాంక్షలతో ఒక కవిత వాట్సాప్ లో వచ్చింది. కె. రామకృష్ణారావు తెలంగాణ ప్రభుత్వంలో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఆయన చదివే పుస్తకాల్నీ రచయితల్నీ చూస్తే నాకన్నా ఎప్పుడూ యోజనం ముందుంటారనిపిస్తుంది. ఆయన పంపిన కవిత For Calling the Spirit Back from Wandering the Earth in Its Human Feet. ఆ కవిత రాసిన Joy Harzo అమెరికన్ కవయిత్రి. ఒక్లహోమా కు చెందిన హర్జో యు ఎస్ చరిత్రలో పొయెట్ లారేట్ కాగలిగిన మొదటి నేటివ్ అమెరికన్ కవయిత్రి. ఆమె కవితాసంపుటి Conflict Resolution for Holy Beings (2015) లోది ఈ కవిత. ఈ కవిత చదవగానే నాకు పోయిన ప్రాణం లేచొచ్చినట్టు అనిపించింది. అందుకని మీతో పంచుకోకుండా ఉండలేకపోతున్నాను.


పోయిన ప్రాణం లేచొచ్చినప్పుడు

ఆ పొటాటో చిప్స్ పాకెట్టూ, ఆ వైట్ బ్రెడ్డూ, ఆ కోక్ బాటిలూ పక్కన పెట్టెయ్యి.

ఆ సెల్ ఫోనూ, కంప్యూటరూ, రిమోట్ కంట్రోలూ ఆపెయ్యి.

తలుపు తెరు, ఆ మీదట దాన్ని నెమ్మదిగా మూసుకోనివ్వు.

ప్రేమగా పలకరించే గాలులు గుండెనిండా పీల్చుకో, అవి ఈ పుడమిమీద ఓషధుల సారాన్ని నింపుకుని మరీ ప్రసరిస్తాయి.

ఆ గాలుల్ని మళ్ళా ధన్యవాదాలతో పునఃప్రదానం చెయ్యి.

ఆ క్షణాన నువ్వు పాట పాడితే ఆ పాట నిన్ను తారాగగనానికి తీసుకుపోయి తిరిగి వెనక్కి తీసుకురాగలదు.

నీ తల్లిదండ్రుల కోరికలో నువ్వొక స్వప్నంగా ప్రాణంపోసుకున్నప్పణ్ణుంచి నిన్ను సంరక్షించుకుంటూ వస్తున్న భూమికి నువ్వు కృతజ్ఞతతో కైమోడ్చు.

నీ పాదరక్షలు నిన్ను నీ రక్షకదేవతలశిబిరానికి తీసుకుపోనివ్వు. ఆ దేవతలకి నువ్వు పుట్టకముందు నుంచీ తెలుసు, ఆ దేవతలు అక్కడ అనంతరకాలంలో కూడా నిలిచే ఉంటారు, వాళ్ళు వెలిగించుకున్న నెగడి కాలాతీతంగా మండుతూనేఉంటుంది.

నీ వలసలు ముగించేక నీలో తలెత్తే అభద్రతాసంకేతాల్ని పృథ్వి చక్కదిద్దనీ.

నీతో కలిసి నడిచే చిన్నచిన్నపిపీలికాలపట్ల, పక్షులపట్ల, జంతువుల పట్ల గౌరవం చూపించు.
వాటిపట్ల మనం మనుషులం చేస్తున్న హానికి మనఃపూర్వకంగా క్షమాభిక్ష యాచించు.

దిగులు పడకు.

ఉత్పాతాలు, సరిహద్దులు, తనిఖీలు, సైనికపటాలాలు, ఊచకోతలు,యుద్ధాలు-అన్నిటిమధ్యా, తమని తాము ద్వేషించుకుంటారుకాబట్టి నిన్ను కూడా ద్వేషించేవాళ్ళ మధ్య దారి చేసుకొంటో పోవడమెట్లానో నీ హృదయానికి తెలుసు.

నీ ప్రయాణం బహుశా కొన్నిగంటలపాటు, ఒకరోజు, ఒక ఏడాది, కొన్నేళ్ళు, ఒక శతాబ్దం, ఒక సహస్రాబ్దం లేదా ఇంకా చాలాకాలమే పట్టవచ్చు.

నీ మనసుని కనిపెట్టుకో. సరైన శిక్షణలేకపోతే అది అటూ ఇటూ పారిపోవచ్చు, అది నీ హృదయాన్ని కాలాన్ని దొంగిలించేవాళ్ళ కి విందుగా ఎరగా వేసి తప్పించుకుపోవచ్చు.

ఊరికినే పశ్చాత్తాపపడకు.

నువ్వు నడిమధ్యానికి దారి వెతుక్కోగలిగినప్పుడు, నీ ఆత్మ కాపలాదారులు వెలిగించిన అగ్ని చెంతకు చేరుకోగలిగనప్పుడు నీకు తప్పకుండా స్వాగతం లభిస్తుంది.

నిన్ను నువ్వు దేవదారు, నీలాంబరం, సంజీవిని మూలికల్తో పరిశుద్ధపరుచుకో.

అపజయాలతో, అవమానాలతో నీకు మిగిలివున్న లంకెల్ని తుంచెయ్యి.

నీ మనసులో, నీ భుజాలమీద, నీ హృదయంలో, నీ పాదాలదాకా పరుచుకుని ఉన్న బాధ తొలగిపోనివ్వు. నీ పూర్వీకుల వేదనతొలగిపోయి నీ ముందు రానున్న ఆగామితరాలకు దారిచెయ్యి.

క్షమాభిక్ష యాచించు.

నిన్ను ప్రేమించే వాళ్ళ చేయూతకోసం ఎలుగెత్తి ఆహ్వానించు. నీకు సహాయపడటానికి సిద్ధంగా ఉన్నవాళ్ళకి ఎన్నోరూపాలు: వాళ్ళు జంతువులు కావచ్చు, పంచభూతాలు, పక్షులు, దేవదూతలు, సాధువులు, శిలలు , నీ పితృదేవతలు కావచ్చు.

నీ ఆత్మని వెనక్కి పిలు. నీ ప్రాణం ఎక్కడో అవమానాల, మూలల్లోనో, ముడతల్లోనో, నీమీద తీర్చిన తీర్పుల్లోనో, నీమీద పడ్డ నిందల్లోనో ఇరుక్కుపోయి ఉండవచ్చు.

నువ్వు నీ ప్రాణాన్ని, నీ జీవాన్ని, నీ ఆత్మని ఎలా పిలవాలంటే, అది వెంటనే వెనక్కి ఎగిరొచ్చేయాలి.

ఎంతో ఇష్టంగా, పసిపాపతో మాట్లాడినట్టుగా నువ్వు దాన్ని పలకరించాలి.

దారితప్పి సంచరిస్తున్న నీ ఆత్మని మళ్ళా చేరపిలుచుకో. బహుశా అది పీలికలు పీలికలుగా, ముక్కలుచెక్కలై వెనక్కి రావచ్చు. ఆ శకలాల్ని పోగుచేసుకో. ఎంతో కాలం తర్వాత తిరిగి నువ్వు వాటిని చేరదీసుకున్నందుకు అవి మహదానందానికి లోనవుతూ ఉండవచ్చు.

నీ ప్రాణాన్ని, నీ ఆత్మని నువ్వు చేరబిలుచుకుని దానికి స్నానం చేయించి, శుభ్రవస్త్రాలిచ్చిన తరువాత దానికొకింత విశ్రాంతి కావాలి.

అప్పుడు నీకొక విందుగోష్టి అవసరమవుతుంది. నువ్వు ఎవరెవరిని ప్రేమిస్తున్నావో, ఎవరెవరు నీకు బాసటగా నిలబడుతున్నారో వారందరినీ ఆ విందుకి ఆహ్వానించు. వెళ్ళడానికి మరొక చోటంటూ లేనివారికి ఒకింత చోటు చూపించు.

అప్పుడు ధన్యవాదసమర్పణ మొదలు పెట్టు. కాని గుర్తుపెట్టుకో, ప్రసంగాలు మరీ సుదీర్ఘం కాకుండా చూసుకో.

అప్పుడు, నువ్వు తప్పకుండా చెయ్యవలసిన పని ఒకటుంది. అదేమింటంటే, నీ తర్వాత వస్తున్న మనిషి కూడా చీకట్లో దారి తప్పకుండా దారి చూపించు.

2-1-2024

10 Replies to “పోయిన ప్రాణం లేచొచ్చినప్పుడు”

  1. ఇది చదువుతున్నంత సేపు గంగావతరణం కళ్లముందు కదలాడుతుంది గురువుగారు..
    గంగ భగీరధుడుని అనుసరించి పాతాళ లోకము (అమెరికా) చేరి సగరులకు(జీవకోటికి) ఉత్తమగతులు ప్రసాదించినట్టు వుంది .. 🙏

  2. తల మీద పెట్టుకున్న భారమంతా పూచికపుల్లతో తొలగించి వేసుకున్నాం👌💐🙏🏿🙏🏿.

  3. అద్భుతమైన కవిత. అంతకన్నా అద్భుతమైన అనువాదం 🙏

  4. తన్మయత్వానికి లోనుచేసింది
    కృతజ్ఞతలు

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading