పునర్యానం-15

కవిత్వంలో రెండు రకాల వైఖరులు ఉన్నాయి. ఒకటి క్లాసిసిస్ట్ వైఖరి, రెండవది రొమాంటిసిస్ట్ వైఖరి. రొమాంటిసిస్ట్ దృష్టిలో తన జీవితానందం మొత్తం ఏదో ఒక్క అంశంలోనో లేదా ఆ అంశం చుట్టూతానో మాత్రమే ఉంటుంది. అది తన ఊళ్లోనో, లేదా తాను నమ్మిన విలువల్లోనో, లేదా తాను ప్రేమించిన స్త్రీలోనో, ఏదో ఒక స్థితిని ఆలంబనం చేసుకుని ఉంటుంది. అతడు తాను కోరుకునేది లభిస్తేనే తన జీవితానికి సాఫల్యత చేకూరినట్టనీ, అది లభించకపోతే తన జీవితానికి అర్థం లేదని భావిస్తాడు. కానీ తాను ఇష్టపడుతున్న మనిషి నుంచో, స్థలం నుంచో వియోగం సంభవించగానే అతడి జీవితంలో అంతులేని దుఃఖం మొదలవుతుంది. భావకవుల్లో కనిపించే అపారమైన దుఃఖమంతా ఆ రొమాంటిక్ మనః ప్రవృత్తి నుంచి పుట్టిందే.

కానీ క్లాసిసిస్ట్ అలా భావించడు. అతని దృష్టిలో జీవితానందం ఏదో ఒక్క అంశం లోనో లేదా ఒక్క అంశం చుట్టూతానో ఉండేది కాదు. అది మన జీవితమంతా కూడా పరుచుకుని ఉండేదిగాను, మనం జీవిస్తున్న ప్రతి నిమిషంలోనూ దాన్ని అనుభవంలోకి తెచ్చుకోగలదిగానూ అతను భావిస్తాడు. ఇందులో సాంప్రదాయక క్లాసిసిస్టులు వ్యక్తికి ప్రత్యేకమైన జీవితానందం గాని లేదా వ్యక్తి ప్రత్యేకంగా తనకై తాను వెతుక్కునే అర్థం కాని ఉండదనీ, మొత్తం వ్యవస్థకు అంతటికీ సంబంధించిన శ్రేయస్సులోనే వ్యక్తి శ్రేయస్సు కూడా ఉందనీ భావిస్తారు.

రొమాంటిసిస్టులు తర్వాత రోజుల్లో మాడర్నిస్టులుగాను, క్లాసిసిస్టులు సోషలిస్టులుగాను పరివర్తన చెందారు. మాడర్నిస్టు దృష్టిలో జీవితానికి అర్థం కల్పించడానికి చేసే ప్రతి ఒక్క ప్రయత్నం కూడా అంతిమంగా మనిషిని అణచి ఉంచేదే. కాగా సోషలిస్టు దృష్టిలో సమాజ శ్రేయస్సులోనే వ్యక్తి శ్రేయస్సు ఇమిడి ఉంది. అవసరమైతే సమాజ శ్రేయస్సు కోసం వ్యక్తి తన సంతోషాన్ని బలి ఇవ్వక తప్పదని కూడా అతడు వాదిస్తాడు.

నేను రాజమండ్రిలో ఉన్న రోజుల్లో ఈ రెండు ధోరణుల మధ్య ఊగిసలాడుతూ ఉండేవాణ్ణి. ఇటువంటి రెండు ధోరణులు ఉన్నాయనీ, అవి నన్ను రెండు వైపులా లాగుతున్నాయనీ అప్పట్లో నాకు ఇంత విస్పష్టంగా తెలిసే అవకాశం లేదు. అస్పష్టమైన ఆ ద్వైదీభావంలో నేను పెనగులాడుతున్నప్పుడు ఒకరోజు ఆర్. ఎస్. సుదర్శనం గారిని ఒక ప్రశ్న అడిగాను. ఆయన తనకి జీవితంలో ఏ ప్రశ్నలూ లేవనీ, సంతోషం మాత్రమే ఉందనీ చెబుతున్నప్పుడు నేను ఆయన్ని ఆ ప్రశ్న అడిగాను. అలా ప్రశ్నలు లేని మనఃస్థితికి చేరుకున్నాక కూడా మీకు రాయాలని ఎందుకు అనిపిస్తోంది అని అడిగాను.

ఎందుకంటే, అప్పటికి నాకు తెలిసిన రొమాంటిసిస్ట్ వైఖరి ప్రకారం జీవితంలో ఏదో ఒకటి కోల్పోతేనే రాయాలని కోరిక బలంగా ఉంటుందని నా నమ్మకం. ఎటువంటి వియోగం గానీ, కోల్పోడం గానీ లేనివారికి ఏదో ఒకటి రాయాలన్న కోరిక ఉండదని బలంగా నమ్మేవాడిని. నేను ఆ ప్రశ్న అడిగినప్పుడు ఆయన చాలా నిర్వికారంగా ‘అవును. సరిగ్గా అందువల్లనే నాకు రాయాలనిపిస్తుంది. నాకు అనుభవంలోకి వస్తున్న joy వల్ల రాయాలని కోరిక కలుగుతుంది. ఉపనిషత్తులు చెప్పింది కూడా అదే కదా’ అని అన్నారు.

నాకు ఆ మాటలు అర్థమయ్యేయి కానీ, అటువంటి ఒక మనఃస్థితి ఉండగలదని మాత్రం నేను నమ్మలేకపోయాను. ఆయన పట్ల గౌరవం ఉంది కాబట్టి ఆయన అసత్యం చెప్తున్నాడని అనుకోలేకపోయాను గాని, ఆయన చెప్తున్నది సత్యం అని కూడా అనుకోలేక పోయాను.

సరిగ్గా ఆ రోజులనాటి అటువంటి మనఃస్థితిని చిత్రించే కవిత ఇది. పునర్యానం కావ్యంలో చివరి అధ్యాయాల్లోని epiphanies కి నేను చేరుకోవడం వెనక ఇటువంటి ఒక దుర్భరమైన స్థితిని దాటి వచ్చానని చెప్పడం కూడా అవసరం అనిపించి, ఈ కవితల్ని పంచుకుంటున్నాను.


బడిలో గడిపినప్పుడు కిటికీ పక్క పసుపుపూల పొదలు పిలిచి రమ్మన్నాయి
ఊరించాయి­ రెక్కలమీద కాంతి సంగీతాలతో తుమ్మెదలు
జీవితం బడిలో లేదని మళ్లా వెతుక్కున్నానా అమ్మ వడి కోసం
నలుగురు కూచొని నవ్వే చోటుకోసం
ఆ పంటల కోతల కోసం, ఆ దేవుడి పందిళ్ల కోసం.

ఇప్పుడెక్కడున్నాయవి? దూరంగా జరిగిపోయింది అడవి ఊరినించి
చిక్కి సన్నమైన సెలయేరు, ఎండిన ఆ కొండజలధారలు
పూయదింక లొద్దులో ఆ సంపెంగ
మళ్లీ మళ్లీ వస్తాయా మాఘ ఫాల్గుణాలు
వాటి వెనక గాలుల్లో వినిపించీ వినిపించకుండా పాడేనేవో విషాదకంఠాలు

ఎండినతోటల్లోంచి, పాడుపడ్డ చెరువుల్లోంచి వినవచ్చేదొక కలవరం,
నేనొక బడిని పోగొట్టుకున్నాను, ఒక ఒడిని పోగొట్టుకున్నాను,
ఒక కలని పోగొట్టుకున్నాను, కోకిలని పోగొట్టుకున్నాను.

(పునర్యానం, 2.1.19)


Back then, yellow flowers wafted through the school windows
With their shining wings, bees enticed me.
As soon as I realized there was no life in school
I sought it again at temple festivals and harvest times.

Where were they?
Forest has moved away.
The flowers faded.
Streams thinned.
Spring returned, but the songs did not, and
Pain deepened.

Withering gardens and empty ponds wailed
My dreams, my play, everything fell apart.

14-8-2023

8 Replies to “పునర్యానం-15”

  1. “నేనొక బడిని పోగొట్టుకున్నాను, ఒక ఒడిని పోగొట్టుకున్నాను,
    ఒక కలని పోగొట్టుకున్నాను, కోకిలని పోగొట్టుకున్నాను.”
    Life is a tale….Full of sound and fury
    Signifying nothing.

  2. కవితకు ముందు రాసిన మాటలు ఒక కొత్త పాఠం. కవిత్వానికి ఇంత ఇంపైన వింగడింపు ఉంటుందని తెలియని నాబోంట్లకు దారిదీపాలు మీ వాక్యాలు. కవితలో కోల్పోయిన బాల్య స్మృతి మనసుకు తాకేట్లుగా ఉంది. ప్రతి అనువాదం ఒక
    కవిత్వానువాద ప్రాక్టికల్ . 🙏

  3. “జీవితం బడిలో లేదని”.. ఈ పేరా చదువుతుంటే, UK లో లేక్ డిస్ట్రిక్ట్ అని వర్డ్స్ వర్త్ పుట్టిన ప్రాంతాన్ని చూసాను. గ్రామీణ వాతావరణం లాటి ఆ పచ్చని దారులు ,సన్నని బాటలు..కొండలు, సన్నని జలపాతాలు, విశాలమైన చెరువు; అప్పుడు గుర్తుకు వచ్చిన పోయెమ్- up up my friend and quit your books; స్కూల్ రోజుల పోయెమ్.
    ఇక్కడ పెరిగాడు కాబట్టి అలా రాయగలిగాడు అతను అని. రొమాంటిక్ కవుల వల్ల కలిగే మేలు జీవితాంతం వుంటుంది.

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading