ప్రపంచ కవి

హరీన్ చటో, గిరాం మూర్తీ ఇటీవలి మా ఇన్ స్పిరేషన్ అని రాశాడు శ్రీ శ్రీ ఒకసారి. గద్దర్, చెరబండరాజు మా ఇన్స్పిరేషన్ గా ఉన్న కాలం కూడా నాకు ఒకటి ఉండేది. 1980- 1985 మధ్యకాలంలో గద్దర్ నా దృష్టిలో ఒక హీరో. 1981 లో నేను బిఎ సెకండ్ ఇయర్ లో ఉన్నాను. అప్పుడు సూర్య కళామందిరంలో ఒక సాయంకాలం గద్దర్ బృందం పాడిన పాటలు విన్నాను. కొన్నాళ్లపాటు ఆ పాటలు గుర్తొస్తే చాలు ఒక విద్యుద్వలయం కళ్ళ ముందు కదులుతూ ఉండేది.

నేను రాజమండ్రిలో ఉన్న రోజుల్లో ఆయన పాటలు పాడుకోవడం మమ్మల్ని మేము ఛార్జ్ చేసుకుంటూ ఉండే ప్రక్రియలో భాగంగా ఉండేది. మహేష్, సుబ్బూ, వసీరా, గోపీచంద్, ఎర్రా ప్రగడ- మేమంతా కలిసి కూర్చున్నప్పుడు ఎవరో ఒకరు గద్దర్ పాట గుర్తు చేశేవారు. అంతే, ఆ వాతావరణం మొత్తం మారిపోయేది. గద్దర్ పాటలు అనే చిన్న పుస్తకం క్రౌన్ సైజుది ఉండేది. అది మా అందరి మధ్యా సర్కులేట్ అవుతుండేది. ఆయన తొలినాటి పాటలు- ‘ఈ ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా’, ‘గాంగోళ్ళమండి మేం బాబు, గరీబోళ్ళమండి మేం బాబు’, ‘నాసాకింద మీసా కింద నిన్ను జైల్ల బెట్టినారు’, ‘సిరిమల్లె చెట్టుకింద లచ్చుమమ్మో’ వంటివి మా నాలుకలమీద నానుతుండేవి. అప్పట్లోనే ‘రంగుల కల’ సినిమా కూడా వచ్చింది. అందులోని ‘మదన సుందరి’ పాట వసీరా పాడుతున్నప్పుడల్లా మహేష్ చెప్పలేనంత భావోద్వేగానికి లోనవుతూ ఉండేవాడు. అది దాదాపుగా ఆరాధన స్థాయికి చేరుకునేది. ఎంత ఆరాధన లేకపోతే, తాను ‘నన్నయ భారత రచన డాక్యుమెంటరీ డ్రామా’ (1983) రాసినప్పుడు, చెరబండరాజు, గద్దర్ గీతాల్తో ఆ నాటకాన్ని ముగిస్తాడు!

ఆ కాలంలో మా పల్లెల్లో రాడికల్స్ ప్రవేశించారు. పీపుల్స్ వార్ ప్రభంజనాలు మా అడవుల్ని అతలాకుతలం చేస్తూ ఉండేవి. ఒక గిరిజన గ్రామానికి గ్రామ కరణంగా మా నాన్నగారు ఆ ఆటుపోట్లలో విపరీతంగా నలిగిపోతూ ఉండేవారు. మరొకవైపు నేను రాజమండ్రిలో మిత్రులతో కలిసి గద్దర్ పాటలు పాడుకుంటూ ఉండేవాడిని. ఇంత విరోధాభాసతో కూడుకున్న కాలం నా జీవితంలో మరొకటి లేదు.

ఆ రోజుల్లో కాకినాడలో ఒక ప్రభుత్వ అధికారి దగ్గర గద్దర్ పాటల క్యాసెట్ ఒకటి నాకు కనబడింది. ఒక్కసారి విని ఇస్తామంటే ఆయన అనేక షరతులు పెట్టి దాన్ని నాకు ఇచ్చాడు. ఒక పెన్నిధి దొరికినట్టుగా నేను దాన్ని రాజమండ్రి తీసుకువెళ్తే మాలో ఎవరో నాకు తెలియకుండా ఆ కాసెట్ కాపీ చేసుకున్నారు. అలా కాపీ చేసిన క్యాసెట్ విన్న మరొకరు ఎవరో ఆ ప్రభుత్వాధికారితో ‘ఈ మధ్య గద్దర్ పాటలు విన్నాను’ అని చెప్తే ఆ అధికారి అది తాను నాకు ఇచ్చిన కాసెట్టే అని గుర్తుపట్టాడు. నామీద అగ్రహోదగ్రుడైపోయాడు. ‘అత్యంత రహస్యంగా దొరికిన ఆ పాటల్ని నువ్విలా పబ్లిక్ చేస్తావనుకోలేదు’ అన్నాడు ఆయన. ఇంతకీ ఆ కేసెట్టు ఆయనకి ఒక పోలీస్ అధికారి నుంచి దొరికిందట. ఆ పోలీస్ అధికారి కూడా ఎన్నో షరతులు పెట్టి ఆయనక కేసెట్ ఇచ్చి ఉంటాడు. ఆ రహస్యం ఎక్కడ బయటపడుతుందో దానివల్ల తమ ఉద్యోగాలు ఎక్కడ ఊడిపోతాయో అన్న భయమే ఆ అధికారి ఆగ్రహానికి కారణం. ఇదంతా ఇప్పుడు ఎందుకు రాస్తున్నాను అంటే గద్దర్ పాటలు చాప కింద నీరు లాగా సమాజంలో ప్రవహించిన కాలం ఒకటి ఉండేదనీ, ఆ కాలాన్ని నేను కళ్ళతో చూశాను అనీ చెప్పటానికి.

1997 లో గద్దర్ పైన హత్యా ప్రయత్నం జరిగినప్పుడు హైదరాబాదులో కవులు, రచయితలు పెద్ద ఊరేగింపు తీశారు. ఆ ఊరేగింపులో కలిసి రావలసిందిగా నామాడి శ్రీధర్, వొమ్మి రమేష్ బాబు పిలిస్తే నేను కూడా ఆ ఊరేగింపులో కలిసి నడిచాను. ఆ సాయంకాలం జరిగిన బహిరంగ సభలోదూరంగా ఉండి నేను వక్తల ప్రసంగాలు వింటూ ఉన్నాను. ఈ లోపు అదిలాబాద్ జిల్లాకు చెందిన కొందరు గిరిజన యువకులు నన్ను గుర్తుపట్టి పలకరించి ‘అక్కడ చూడండి ఎవరున్నారో’ అని ఒకవైపు చూపించారు. అక్కడ పార్కు చేసి ఉన్న కార్ల పక్కన క్రీనీడలో ఎస్.ఆర్. శంకరన్ గారు! గద్దర్తో కలిసి నడిచి, ఆడి, పాడి ప్రభుత్వాన్ని, రాజ్యాన్ని ధిక్కరించిన అసంఖ్యాక ప్రజలతో పాటు ఆ కవి గీతాల్ని కొద్ది ఎడంగా, కానీ ఎంతో నిశితంగా, గొప్ప గౌరవంతో పరిశీలిస్తూ వచ్చిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారనీ, వాళ్లలో నేను కూడా ఉన్నాను అని చెప్పడానికి ఈ విషయం ప్రస్తావించాను.

గద్దర్ పాటల సమగ్ర సంపుటమేదీ వచ్చినట్టు నేను చూడలేదు. కాని ఆయన తొలిపాటలు, ఆ తర్వాత రోజుల్లో ప్రసిద్ధి చెందిన ‘నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా’, ‘అమ్మా తెలంగాణమా, ఆకలి కేకల గానమా’, ‘పొడుస్తున్న పొద్దుమీద నడుస్తున్న కాలమా’ లాంటి గీతాలతో పాటు, ‘శాంతి చర్చలకు రమ్మని పిలిచి హోం మంత్రిగారూ’ లాంటి పూర్తి రాజకీయగీతాలతోపాటు, ఇటీవలి పాటల దాకా కూడా ఆ కవి గీతరచనలో నిత్యప్రయోగశీలిగా ఉన్నాడని మనకు అర్థమవుతూనే ఉంటుంది. పాటల పల్లవుల్లోనూ, బాణీల్లోనూ, మాండలికాన్ని పూర్తిగా కొల్లగొట్టుకోవడంలోనూ వంగపండులో ఉన్న వైవిధ్యం గద్దర్ లో కనిపించదు. కాని మహాకవులు శిల్ప సంక్లిష్టత, నవ్యత, ప్రయోగాలమీదకన్నా, వీలైనంత సరళంగా, సూటిగా శ్రోతల హృదయాల్ని కైవసం చేసుకోవడం మీదనే దృష్టిపెడతారు. కృష్ణదేవరాయలకి, పెద్దనకి మధ్య ఉన్న తేడా ఇదే. గద్దర్ ఇంటలెక్చువల్ పాఠకుల మీద కన్నా రసహృదయుల్తో కనెక్ట్ కావడం మీదనే ఎక్కువ దృష్టి పెడతాడు. భక్తి కవులది కూడా ఇదే పద్ధతి అనీ, తాను మనసు తో కనెక్ట్ కాగానే పాట అప్రయత్నంగా పుడుతుందని, ఆయన ఒక ఇంటర్వ్యూలో చెప్పగా విన్నాను.

కవిగా మాత్రమే కాదు, గాయకుడిగా కూడా గద్దర్ ది అద్వితీయమైన గళం. గానం. ఆ గొంతులోని జీర, ఆ అరుపులు, ఆ విరుపులు, మధ్యలో ఆ ఉరుములు, ఆ నొక్కులు- అవి అతడి పాటకు అద్దే ప్రత్యేకత మరొకరి గొంతులో మనం వినగలిగేది కాదు. అందుకనే ఆయన రాసినపాటలు విమలక్క, వందేమాతరం శ్రీనివాస్, ఇతర గాయకులు పాడితే మనలో కలగని ఉత్తేజమేదో ఆయన పాడినప్పుడే మనలో మేల్కోడం దాదాపుగా ప్రతి ఒక్కరికీ అనుభవంలోకి వచ్చిన విషయమే.

ఆఫ్రికాలోనో, మధ్య, దక్షిణ అమెరికా దేశాల్లోనో, కార్పొరేటీకరణకు, కార్పొరేట్లకు వత్తాసుగా నిలబడుతున్న నియంతృత్వాలకు వ్యతిరేకంగా గళం ఎత్తిన కవులు ప్రపంచమంతా ప్రఖ్యాతులయ్యారు. మన కళ్ళ ఎదురుగా, మన మధ్య, మన కాలంలో సంచరించాడు కాబట్టి గద్దర్ విశిష్టతని మనం గుర్తించవలసినంతగా గుర్తించలేదుగానీ, ఆయన కూడా తక్కిన ప్రపంచ కవులకు ఏ మాత్రం తీసిపోడు.

ఒక సాహిత్యకారుడిగా గద్దర్ పాట గురించి నేను సాధికారికంగా చెప్పగలమాట ఒకటే. తెలుగులో నోబెల్ పురస్కారం పొందడానికి పూర్తి అర్హత ఉన్న కవిత్వం అంటూ మన సమకాలంలో ఎవరిదైనా ఉంటే అది గద్దర్ పాట మాత్రమే. అలాగని నోబెల్ పురస్కారమే ఒక కవికి సర్వోన్నతమైన గుర్తింపు అని కాదు. ఒక కవికి నోబెల్ ప్రైజు వస్తే తక్కిన ప్రపంచమంతా ఆ కవి గురించి తెలుసుకుంటుంది, అతడి సాహిత్యం విస్తారంగా అనువాదమవుతుంది. అతడు ఏ విలువలకోసం నిలబడ్డాడో ఆ విలువలపట్ల జాగృతి కలుగుతుంది. అయితే నోబెల్ ప్రైజు రాకపోయినా కూడా గద్దర్ ప్రపంచ కవి అనడానికి నాకేమీ సంకోచం లేదు.

ఇన్నేళ్లుగా హైదరాబాదులో ఉంటూ కూడా ఆయన్ని ఒక్కసారి కూడా కలుసుకోలేకపోయాను. ఇక ఆ లోటు ఎప్పటికీ పూడదు.

11-8-2023

8 Replies to “ప్రపంచ కవి”

  1. మధురం. గద్దర్ పై చాలా సమగ్రమైన రూపాన్ని ఇచ్చారు. ఆయన విరుపులు, కేకలు, నొక్కులు, నిట్టూర్పులు, పాట మధ్య మధ్య మాటలు.. నాకైతే అత్యద్భుతం.. మొత్తంగా పూనకం పట్టినట్లు ఊగిపోతాను ఇప్పటికీ. 1981-82 లో నేను ఆంధ్ర యూనివర్సిటీ ఎకనామిక్స్ & theater Student నీ. అత్తిలి కృష్ణారావు గారి సంస్థ నాట్యభారతి ‘ నటుడ్ని. తద్వారా రావిశాస్త్రి గారికి అత్యంత దగ్గరవాడిని. అప్పట్లో తరచుగా గద్దర్ వచ్చేవాడు. విద్యార్థులను అంతలా ఊగించి శాసించిన మరో ప్రయోక్త ఎవ్వరూ లేరు. మీరు చెప్పిన విరుపులు, ఉపులూ, కేకలు, నొక్కులు.. రాత్రి బృంద సమావేశాలలో శాస్త్రిగారు చెప్పి చెప్పుకుని పాడుకుని మైమరచి పోవడం నాకు ఎన్నో సార్లు అనుభవం. నాకు గద్దర్ తో చాలా అనుభవాలు ఉన్నాయి. ఆయన ప్రత్యేక ముద్రలను ఇటీవల గుర్తు చేసింది మీరే. నిస్సందేహంగా ఆయన అన్నమయ్య తర్వాత అంతటి వాగ్గేయకారుడు. నోబుల్ బహుమతి స్థాయి ఉన్న మన మట్టి మనిషి.. మహామనీషి. మీకు వినమ్ర నమస్కారం.

  2. Velmajala Narsimha – Velmajala Narsimha appears to be a Telugu writer, poet, and storyteller, known for contributions to Telugu literature, with profiles on LinkedIn as a writer and on Sanchika.com featuring his work, particularly under the title "Idi Naa Kalam" (This is my pen). While LinkedIn shows potential professional roles like an accountant in Mumbai, his literary presence is strong, indicating a background in creative writing and storytelling in the Telugu language. Key Aspects: Literary Focus: He writes poems and stories in Telugu. Platform: Featured on literary sites like Sanchika.com in series like "Idi Naa Kalam". Professional Profile: May also work in accounting or IT, as suggested by some LinkedIn profiles. Location: Associated with Yadadri Bhuvanagiri (Telangana) as a writer, and Mumbai professionally. In essence, Velmajala Narsimha is a Telugu literary figure active in both creative writing and potentially professional fields, with a notable presence in online Telugu literary communities.
    Narsimha Velumajala says:

    బతికున్నప్పుడు బాగున్నావా అని అడగం కానీ
    చనిపోయినంక మహానుభావుడు అంటాం
    అది మన పాలకుల దౌర్భాగ్యం

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%