నిజ‘జ్యోతి’ర్దర్శనం

ఏ ఉపేక్ష చేతనో తెలియదు కానీ
ఈ రాత్రిలోకి నడిచి రావడానికి
నాకు అనుమతి లభించింది.

ఉషాజ్యోతి బంధం కవిత్వ సంపుటి ‘ఉన్మత్త’ (2022) తెరుస్తూనే ఈ మొదటి వాక్యం నన్ను నిలబెట్టేసింది. సాధారణంగా ఆసక్తి వల్ల మనకి అనుమతులు దొరుకుతాయి. కాని ఇక్కడ ఉపేక్ష వల్ల అనుమతి లభించిందట. ఈ కవితకి పెట్టిన పేరు ‘మాయ.’

ఇక ఆ పుస్తకమంతా ఎక్కడా, విరామ చిహ్నాల దగ్గర కూడా ఆగకుండా, చదువుకుంటూ పోయాను. చదువుతుంటేనే ఒక ప్రత్యేక లోకంలో, ప్రత్యేకమైన ఋతువులో సంచరిస్తున్నానని అర్థమయింది.

పుస్తకమంతా చదివాక, కాశీభట్ల వేణుగోపాల్ ఏమంటున్నాడా అని చూసాను. ‘ప్రత్యూషా తనే, ప్రదోషమూ ఆమే..’అని ఆయన ఈ కవిత్వానికొక ముందుమాట రాసాడు. ‘కవిత్వంలోంచీ కవి ప్రథమ మానవతత్త్వం లీలామాత్రంగా గోచరమవుతుంటుంది’ అని మొదలుపెట్టి ‘నిజ’జ్యోతి’ర్దర్శనం మనకీ కవిత్వంలో, లీలా మాత్రంగా..కనీ కనిపించక జరుగుతుంది’ అని రాసాడాయన. ఇంకా ఇలా అంటున్నాడు:

‘మనమంతా జ్ఞాపకాల శకలాలం.. ఆ శకలాలు ఏ chronology పాటించక ముందుది వెనకా, వెనకది ముందూ మసకబారిన అక్షరాలతో కలిపికుట్టేసిన అసంపూర్ణ పుస్తకాలం..
మనం కవితా పుస్తకాలం
ఇది ‘ఉషా పుస్తకం’

ఈ కవిత్వ సంపుటాన్ని ఆయన కొలాజ్ అని కూడా అన్నాడు.

ఆ మాటకొస్తే, గొప్ప కావ్యాలన్నీ దాదాపుగా collage లే. ఇలియట్ The Waste Land ని మనం ఆధునిక కావ్యంగా చెప్పుకుంటున్నాం. కాని పోస్ట్ మాడర్న్ చింతన ప్రపంచాన్ని ఆవహించిన తొలిరోజుల్లో ఒక విమర్శకుడు వేస్ట్ లాండ్ ని మించిన పోస్ట్ మాడర్న్ కావ్యం మరేముంటుంది అనడిగాడు.

నేనకుంటాను- కవిత్వం రెండు సందర్భాల్లో గొప్ప ఆకర్షణీయంగా ఉంటుంది. ఒకటి, భాష పూర్తిగా వికసించినప్పుడు, ఒక యుగానికి తాను దేనికోసం తపిస్తున్నదో పూర్తిగా అర్థమయినప్పుడు, ఒక జాతి ఆరాటానికి స్పష్టంగా ఒక గొంతు దొరికినప్పుడు- ఈ సందర్భం మనందరికీ తెలుసు. అటువంటి కవిత్వం రాసినవాళ్ళనే మనం మహాకవులంటాం.

కాని రెండో సందర్భం, అందరికీ ఎక్కువగా తెలిసింది కాదు. అది యుగం మారినప్పుడు లేదా జీవన గమనం మారినప్పుడు, కొత్త భాష, కొత్త ఆరాటాలు, కొత్త గమ్యాలు సుదూరంలో కనిపిస్తున్నప్పుడు, మనిషి తనలో సుళ్లు తిరిగే అనుభూతికి అభివ్యక్తికోసం గొంతు పెగుల్చుకోడానికి ప్రయత్నిస్తాడే, ఆ తొలివేళల్లో పుట్టే కవిత్వం. అది గుండె ఇంకా పూర్తిగా గొంతుగా మారని సమయం. మనకు తెలిసిన భాష మన రోజువారీ అవసరాలకు మాత్రమే సరిపోయేవేళ, మనల్ని లోపల నిలనివ్వకుండా గుంజేస్తున్న భావాల్ని పైకి చెప్పుకోడానికి, మన చేతుల్లో ఉన్న భాష మనకి ఎంత మాత్రం సరిపోని వేళ, అట్లాంటి వేళల్లో పుట్టే కవిత్వముంటుందే, దానిలోని ఆకర్షణ అంతా ఇంతా కాదు.

ఒక భాష బాగా వికసించాక అందులో కనిపించే సౌందర్యం మధ్యాహ్నమార్తాండశోభ. కాని కవులు కొత్త భాషకోసం గొంతుపెగుల్చుకున్నప్పుడు అవతరించే ఆ ప్రథమవాగ్విభూతి ఉషాసౌందర్యం లాంటింది.

ఈ ‘ఉన్మత్త’ కవిత్వంలో నాకు చాలా ఆశ్చర్యం కలిగించిదేమంటే, ఇందులో చాలా పదాలు, పదబంధాలు, అనుభూతి ప్రకటనలు మనకి చాలా కాలంగా తెలిసినవే. కాని ఈ కవిత్వంలో చదువుతున్నప్పుడు అవి మనకి కొత్తగా, మనం ఇంతదాకా చూడని తావుల్లాగా, తెరవని కిటికీల్లాగా కనిపిస్తున్నాయి. మామూలు మాటలే, కాని కవయిత్రి, తాను వాటిని కొత్తగా మాటలు నేర్చుకుంటున్నదానిలా మాట్లాడుతుండటంతో, అవి మనలో రేకెత్తించే స్పందనలు మాత్రం అద్వితీయంగా ఉన్నాయి. ఈ వాక్యాలు చూడండి:

అనంత నీలిమాకాశపు
బందీలు
ఏ అడవినేల చివరో
నివసించడం మొదలుపెట్టారు.

అకురాలు కాలాన
విధివంచితులంతా
అక్కడ కలుసుకున్నారు..

భూమిమీద ప్రశంసించతగ్గన్నటి గురించి
నేను చెప్పిన మాటలు నిజమేనని తెలుసుకో..

ఒక చిన్ని తారకకి
నిన్ను నువ్వు ఇచ్చుకోలేని
అశక్తతే
ఈ అస్తిత్వ వేదన..

ఇలా ఈ పుస్తకమంతా మనకు తెలిసిన పదాలే, మామూలుగా ఏమంత బరువులేని పదాలే, కాని, ఈ కవయిత్రి పేర్చిన అమరికలో చూసినప్పుడు, రాలినపువ్వులు తిరిగి కొమ్మలకి అతుక్కున్న చెట్లని చూసినట్టు అనిపిస్తుంది. కవిత్వమంటే భాష కాదనీ, ఆ భాషచుట్టూ అల్లుకునే ఒక సూక్ష్మలోకమనీ మనకి అర్థమవుతుంది.

కొత్త మాటల్ని, కొత్త భావాల్నీ పరిచయం చేసే కవులది ఒక దారి. కాని మనకు తెలిసిన మాటల్నే, మనకు తెలిసిన అనుభవాల్నే తన చేతుల్లోకి తీసుకుని వాటి మీద పడ్డ దుమ్ము తుడిచి, పూలగుత్తిలాగా వాటిని అమర్చి మనముందుంచే ఇటువంటి కవులు చాలా అరుదుగా ఎదురవుతారు. అదాటుగా పోతుంటే మనం వీళ్లని గుర్తుపట్టకుండానే ముందుకు నడిచిపోతామేమో కూడా.

ఎన్నేళ్ళుగానో విన్న కవిత్వాలు, మనకి బాగా పరిచయమైన కథానాయికలు, నాయకులు, చిరపరిచితాలైన లాండ్ స్కేప్ -కాని ఉషాజ్యోతి బంధం కవిత్వంలో మనకి కనిపించినప్పుడు, మనం ఆ లోకాన్ని విస్మరించితిరుగుతున్నామనీ, ఒక క్షణం అన్నీ పక్కనపెట్టి, ఆ చెట్టుకింద, ఆ ఋతువులో, ఆ పాట వినడంద్వారా మనం మనకి మరింత చేరువకాగలమనీ అనిపిస్తుంది.

బహుశా ఇది మన శైశవ దినముల నిర్మలత్వాన్నీ, తొలియవ్వనపు ఉధృతినీ, మలి యవ్వనపు అసంతృప్తినీ ఒక్కచోటే గుదిగుచ్చిన పూలదండ కావచ్చు. ఇందులో కొన్ని సుగంధాలు సున్నితం, కొన్ని ఘాటైనవి, కొన్ని వాసనలేని పూలు. కాని ఈ పూలమాల చేతుల్లోకి తీసుకోగానే ‘పసుపుపచ్చని వెలుగుపరుచుకున్న ఒంటరి మందిరం’, ‘పగడపు ఎలుగుల భ్రమలే లేని శాంతిమందిరాలూ’, ‘చీకటి దిగంతాల కింద కొన్ని చుక్కలూ ఓ నెలవంకా’ గుర్తు రాకుండా ఉండవు. ఈమె కూడా మనం నివసిస్తున్న నగరంలోనే నివసిస్తున్నదని అనిపించదు. ఎక్కడో ఏ ఎడారిలోనో మరీ పసిప్రాయంలోనే తన బిడారు తప్పిపోయిన పిల్లలాగా కనిపిస్తుంది. తనవాళ్ళని వెతుక్కుంటూ, కనిపించిన ప్రతి ఒక్కరూ తనవారే అనుకుంటూ, కానీ కాదని చెప్పుకుంటూ, అవునేమోనని తడబడుతూ- దివారాత్రాల మధ్య, దిగంతాల దిక్కుగా ఆమె చేసే ప్రయాణంలో, ఇసుకలోకి బరువుగా పడిలేచే అడుగుల్లాగా ఆమె పలికే మాటలు ఈ కవితలు. కొన్నిసార్లు ఆమె వెతుక్కుంటున్నది దేవుణ్ణేమో అని కూడా అనుమానం కలుగుతుంది.

ఈ కవిత చూడండి.

గండశిల

మాటకారి మనిషి వెళ్ళిపోయాక
అంతా పోయి వాకిట్లో కూచున్నాము
చుట్టూ అంతా నిశ్శబ్దం
ధాన్యపు కొట్టం మీంచి
చంద్రవంక పైకి లేచింది.
తడితడి గాలి గట్టిగా వీచి
ఒంటికి కొట్టుకుంది
చుక్కమల్లె చెట్టు దయ్యంలా ఊగుతుంది
కథలన్నీ చెప్పుకోడం పూర్తయ్యాక
ఒక్కొక్కరుగా వెళ్ళిపోయారు
నవ్వులనీ ఖాళీ అయ్యి
ఆ చోటు బోసినోరయ్యింది.
నిదురరెప్పలతోనే
పనులు మొదలుపెట్టాము.

ఈ కవిత నాకు గొప్ప ఆశ్చర్యాన్నీ, అనిర్వచనీయమైన ఆహ్లాదాన్నీ కలిగించింది. మనకు అలవాటయిపోయిన భావాల బరువుని మన నెత్తిమీంచి సునాయాసంగా తీసిపక్కన పెట్టి, మనకి ఒకింత సేదతీర్చినట్టుండే ఈ కవిత తెలుగులో వచ్చిందంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది.

ఈ సంపుటిలోని చివరి కవిత ‘సమాంతరం’ దీర్ఘ కవిత. ఆ కవితను ఇద్దరు ముగ్గురు కవిత్వప్రేమికులు కలిసి చదువుకుంటో, ఒక్కొక్క వాక్యానికీ వ్యాఖ్యానం చెప్పుకుంటో, ఆ అర్థాల్నీ, అంతరార్థాల్నీ అనుభవిస్తో, పలవరిస్తో పంచుకోవలసిన కవిత. అది ప్రేమికురాళ్ళ అనాది ఆత్మకథ. మంత్రనగరి సరిహద్దులు ముట్టాలని తహతహలాడే ప్రతి ఒక్క జానపద వీరుడి ప్రేమకథ. ఆ కవితలో ఒకచోట

అయినా నువ్వొచ్చే దారి
ఖాళీగానే వుంది
అన్నవీ విన్నవీ కలుపుకొని
కూడుకుని చూసినా
లెక్క దాటిపోయింది
నేనే దారి తప్పానో
యాదవులందో క్షత్రియుల్లోనో
వాళ్లలోనే వుంటావని
అందరూ చెప్పుకుంటే విన్నాను
కట్టుతప్పావేమో కనిపించలేదు
వేలు ఇటుగా చూపిస్తున్నారు
ఎవరో
ఈ దిక్కా
అక్కడినుంచే వచ్చాను
చప్పుడు లేదు
వెనక్కి తిరిగి చూడాలంటే భయం
వున్నచోటు తప్ప
లోకమంతా వెతికాను
పిచ్చిదాన్నన్నారు
గీత దాటే వీలు లేదు
మాటతోనే హద్దు చూపిచ్చావు
వీరఘట్టం చేరాను.

అని అంటున్నప్పుడు, ఆ ‘వీరఘట్టం’ అనే మాట ఆ కవయిత్రికి ఎలా స్ఫురించిందో కదా అనుకున్నాను. తనలోకి తాను నిర్భీతిగా ప్రయాణానికి పూనుకున్నవాళ్ళకి మాత్రమే ఒకసారి కాకపోతే మరొకసారైనా ఇటువంటి వాగ్దర్శనం సాధ్యపడుతుంది.

తెలిసిన మాటలే, కాని ఆ మాటల్ని కొత్తగా నేర్చుకుంటున్నట్టుగా ప్రయోగించే కవయిత్రి చేతుల్లో అవి కావ్యవాక్కుగా మారడం నిజంగా మానసోల్లాసం. ఈ కవిత చూడండి:

చిత్తరువు

ప్రేమికులు దాచిపెట్టుకున్న చిత్రాల్లోకి తర్జుమా అవుతారు
దాచుకున్న చిత్రాలు అనుస్మరణలోకి చేరిపోతాయి
అనుస్మరణ మౌనంలోకి నిష్క్రమిస్తుంది
నిష్క్రమించిన మౌనం తర్వాత ఇక మిగిలేదేవిటి
బహుశా చాలా పాతదే మళ్ళా మళ్ళా జరిగేదే
కథలేకండా ఉత్త ప్రేమ మిగిలిపోతుంది.

Featured image: A watercolor painting by Moshe Dayan.

17-2-2023

10 Replies to “నిజ‘జ్యోతి’ర్దర్శనం”

  1. Rupa rukmini . K – ✍️అక్షరం ఓ ఆయుధమైతే... పుస్తకం ఓ విజ్ఞాన వేదిక✍️ ❤అలల అంచున నడకకు పాద ముద్రలుండవు❤️ poetry📖అనీడ
    Rupa rukmini K says:

    ఉష కవిత్వ పద విన్యాసం…. భావ వ్యక్తికరణ గురించి బాగా చెప్పారు సర్

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%