మెడిటేషన్స్-2

మెడిటేషన్స్  నేటికాలపు వ్యక్తిత్వ వికాసవాదులకి ఒక సెల్ఫ్ హెల్ప్ పుస్తకంగా కనిపించడంలో ఆశ్చర్యం లేదు. మార్కస్ అరీలియస్ ప్రధానంగా స్టోయిక్కు. ఆయన కాలంలో రోమ్ లో ప్రధానంగా నాలుగు రకాల దర్శనాలు ఉండేవి. వారిలో మొదటివారు Academicians. అంటే వారు ప్లేటో స్థాపించిన అకాడెమీ ప్రతిపాదించిన దర్శనానికి అనుగుణంగా ప్రపంచాన్ని వివరించడానికి ప్రయత్నించేవాళ్ళు. మరొకరు Peripatetics. వారు అరిస్టాటిల్ దర్శనానికి అనుయాయులు. మూడవ తరహా Epicureans. క్రీ.పూ. నాల్గవ శతాబ్దంలో ఎపిక్యూరస్ ప్రతిపాదించిన దర్శనం అధారంగా తత్త్వ విచారణ చేసేవాళ్ళన్నమాట. నాలుగవ దర్శనం Stoics.

స్టోయిసిజం

ఏథెన్స్ లో నలుగురూ కూడుకునే సమావేశ స్థలాన్ని అగోరా అనేవారు. అటువంటి అగోరాని ఆనుకుని ఉన్న ఒక భవనం వసారాలో క్రీ.పూ. మూడవ శతాబ్దంలో జీనో అనేవాడు తన శిష్యుల్తో సంభాషిస్తూ ఉండేవాడు. ఆ వసారాని గ్రీకు భాషలో స్టోవా అంటారు. ఆ స్టోవాలో మాట్లాడుకున్న ఆ గురుశిష్యుల్ని స్టోయిక్కులు అని వ్యవహరించేవారు. కాబట్టి జీనో ప్రతిపాదించిన దర్శనానికి స్టోయిసిజం అనే పేరు వచ్చింది. తర్వాత రోజుల్లో Stoic అనే నామవాచకంతో పాటు, stoic అనే విశేషణం కూడా ఇంగ్లిషు నిఘంటువుల్లో చేరింది. స్టోయిక్కులు ప్రతిపాదించిన దర్శనాన్ని అనుసరించేవాడు Stoic. అయితే, మనిషి తన జీవితం పట్ల తాను పూర్తి అదుపు కలిగి ఉండాలనీ, ఎటువంటి ప్రతికూలపరిస్థితుల్లోనైనా ప్రలోభాలకు లొంగని ధీరత్వాన్ని కలిగి ఉండాలని నమ్మే ప్రతి ఒక్కరినీ కూడా మనం stoic గా గుర్తుపడుతున్నాం.

స్టోయిక్కుల దర్శనం జీనో తో మొదలై క్రైసిప్పస్ అనేవాడితో స్థిరరూపం పొంది రోమన్ సామ్రాజ్యకాలం నాటికి పూర్తి స్థాయి ప్రజాదరణ పొందగలిగింది. అంటే అది గ్రీసులో మొదలై రోమ్ కు చేరుకుంది. ఆనాటి రోమన్ సామాజిక పరిస్థితుల వల్ల ఆ  దర్శనం రోమన్ జీవితానికి ఒక చారిత్రిక అవసరమయ్యింది. అందుకనే ఎడిత్ హామిల్టన్ స్టోయిసిజం గ్రీకులో రెండవస్థాయి దర్శనంగానీ రోమ్ కి వచ్చేటప్పటికి ప్రధానస్రవంతి తత్త్వశాస్త్రంగా మారిపోయింది అని రాసింది.

మార్కస్ అరీలియస్ కాలం నాటికి స్టోయిక్కుల్లో ఎపిక్టెటస్ ప్రధానస్థానంలో ఉన్నాడు. ఎపిక్టెటస్ ఒక బానిసగా దీర్ఘకాలం జీవించి, స్వేచ్ఛ పొందిన తరువాత తన జీవితానుభవాలు ఆధారంగా బోధించడం మొదలుపెట్టాడు. అతడి బోధలు కిట్టని రోమన్ చక్రవర్తి దొమితియన్ అతణ్ణి రాజ్యం నుంచి బహిష్కరించాడు. కాని అతడి బోధలు అప్పటికే రోమన్ ప్రజానీకం మీద ప్రభావం చూపించడం మొదలుపెట్టాయి. మార్కస్ అరీలియస్ ఒక విద్యార్థిగా ఎపిక్టెటస్ ను అధ్యయనం చేసాడు. అతడి భావాల వల్ల గాఢంగా ప్రభావితుడయ్యాడు. ఇలా ఒక బానిస ఒక చక్రవర్తిని తీర్చిదిద్దిన ఉదాహరణ ప్రపంచచరిత్రలో మరొకటి లేదు.

స్టోయిక్కులు తత్త్వశాస్త్రాన్ని ప్రధానంగా మూడు విభాగాలుగా చూసారు. అవి logic, physics and ethics. ఇందులో కూడా ఒక క్రమం ఉంది. ముందు logic, చివరిది epic. మనిషి పశుస్థాయినుండి అత్యున్నత నైతికమానవుడిగా వికసించవలసి ఉంటుంది. ఆ అత్యున్నత స్థితిని వారు కొన్నిసార్లు divine అని కూడా అన్నారు. కాని స్టోయిక్కుల దృష్టిలో నైతికతను మించిన పరమార్థం లేదు. మనిషి బయటి ప్రపంచం గురించి తనకు కలుగుతున్న సంవేదనల్ని బట్టే జ్ఞానాన్ని ఏర్పరచుకుంటాడు. కాని బయటి ప్రపంచం మనలో కలిగించే స్పందనలు, సంవేదనలు చాలా సార్లు కలుషితంగానూ, మనల్ని తక్షణమే ఉద్రేకించేవిగానూ, కోరికలు పుట్టించేవిగానూ ఉంటాయి. వాటిని మనిషి తన తార్కికతతో, తన హేతువివేచనతో సరిదిద్దుకుని తన గురించీ, ప్రపంచం గురించీ కూడా సవ్యమైన నిర్ణయాలు తీసుకునే స్థాయికి చేరవలసి ఉంటుంది. అది కేవలం చర్చలవల్ల, వివేచన వల్ల మాత్రమే కాదు, ఆచరణ వల్ల మాత్రమే సాధ్యపడుతుంది. స్టోయిసిజం ప్రధానంగా అనుష్టాన వేదాంతం.

యూరపియన్ తత్త్వశాస్త్రం మీదా తొలి క్రైస్తవం మీదా స్టోయిక్కులు చూపించిన ప్రభావం చాపకింద నీరులాంటిది. తాము వారికి ఋణపడ్డామని ఎవరూ బాహాటంగా చెప్పుకోరుగాని, మనం ఆ ప్రభావాన్ని గుర్తుపట్టగలం. ఉదాహరణకి, ఇమ్మాన్యువల్ కాంట్. ఆయన రాసిన Critique of Pure Reason (1781, 1787), Critique of Practical Reason (1788), Critique of the Power of Judgment (1790) అనే మూడు విభాగాల వివేచన వెనక స్టోయిక్కుల మూడు విభాగాలూ ఉన్నాయని మనం అనుకోవచ్చు.

సోక్రటీస్ ఆదర్శం

స్టోయిక్కులు ప్లేటో అనుయాయుల్తోనూ, తర్వాత రోజుల్లో ఎపిక్యూరియన్లతోనూ విభేదిస్తూ వచ్చారు. ప్రపంచం గురించి ఎప్పుడూ చర్చల్లో మునిగితేలే ప్లేటో అనుయాయిల్ని వారు  తక్కువగా  చూసేవారు. కాని ఒక మనిషి ఎలా జీవించాలో ఒక ఉదాహరణ చెప్పమంటే మాత్రం వారు సోక్రటీస్ వైపే చూసేవారు.  వారి అసలైన ఆదర్శం సోక్రటీస్ అనడంలో సందేహం లేదు. ఒక మనిషి పూర్తి జ్ఞానిగా, ఋషి (గ్రీకులో sophos, లాటిన్ లో sapien)గా జీవించినదానికి సోక్రటీస్ అత్యున్నత ఉదాహరణ అని వారు భావించారు.

మార్కస్ అరీలియస్ కి కూడా ఆ విధంగా సోక్రటీస్ నే ఒక రోల్ మోడల్ అనడంలో సందేహం లేదు. కాని ఆ సోక్రటీస్ ఎపిక్టెటస్ వివరించిన, ఆరాధించిన సోక్రటీస్. మరొకవైపు హెరాక్లిటస్ పట్ల కూడా మార్కస్ కు ఆరాధన ఉంది. స్టోయిక్కులు విభేదించినప్పటికీ ఎపిక్యూరస్ పట్ల కూడా అతడికి గౌరవం ఉంది. కాబట్టి సోక్రటీస్, ఎపిక్టెటస్, హెరాక్లిటస్, ఎపిక్యూరస్ ల ఆలోచనలు మార్కస్ అరీలియస్ ను ప్రభావితం చేసాయని మనం అనుకోవచ్చు. తాను స్టోయిక్కు శిక్షణ పొందినప్పటికీ, భావాల్లో స్టోయిక్కు అయినప్పటికీ, అరీలియస్ తనని తాను స్టోయిక్కు అని ఎక్కడా చెప్పుకోలేదు. అన్ని దర్శనాల్నీ సమానంగానే ఆదరించాడు. చివరి రోజుల్లో ఎల్యూసెనియన్ దీక్షలు కూడా స్వీకరించాడు.

మనిషి జీవితాన్నీ, సమాజాన్నీ నాలుగు విలువలు నిలబెడతాయని ప్లేటో అనుయాయులు భావించారు. అవి ఆత్మనిగ్రహం, ఆచరణ, ధైర్యం, న్యాయం. మార్కస్ అరీలియస్ వీటితో పాటు మరికొన్ని విలువలకోసం కూడా తపించాడు. అవి మంచితనం, నిరాడంబరత, ప్రేమ, అభిమానం, కోరికలనుంచి విముక్తి, ఏదీ ఆశించకపోవడం, దేన్నో పోగొట్టుకున్నామని భావించకపోవడం లాంటివి. అన్నిటికన్నా ముఖ్యమైన విలువగా అతడు నిజాయితీని భావించాడు. ఇటువంటి విలువలకోసం జీవించాలని తనకు తాను ప్రతిరోజూ చెప్పుకోడం కోసం ఆయన మెడిటేషన్స్ రాసుకున్నాడు. కాబట్టి ఆ గ్రంథం ఒక చికిత్సా విధానం అని కూడా అనుకోవచ్చు. అతడే ఒకచోట రాసుకున్నట్టుగా కళ్ళకి దివ్యాంజనం పూసుకున్నట్టు తన మాటలు తనకి స్వస్థత చేకూరుస్తాయని నమ్మాడు.

ఆశ్చర్యంగా ఉంటుంది. ఒక చక్రవర్తి తన రాజ్యాన్ని రక్షించడం కోసం యుద్ధాలు చేస్తూ, ఆ యుద్ధభూమిలో ఎత్తైన కొండమీద దుర్గాన్ని నిర్మించుకున్నట్టుగా, తన అంతరంగ యుద్ధంలో తనని తాను కాపాడుకోడానికి మరొక దుర్గాన్ని నిర్మించుకున్నాడని తెలిస్తే చాలా ఆశ్చర్యమనిపిస్తుంది. అందుకనే పియెర్రి హేడట్ అనే ఒక వ్యాఖ్యాత మెడిటేషన్స్ గ్రంథాన్ని Inner Citadel అంటే అంతరంగ దుర్గం అని అభివర్ణించాడు.

యూఫ్రటీస్ నదీ తీరం నుంచి అట్లాంటిక్ దాకా, స్కాట్లాండు నుంచి ఆఫ్రికా దాకా విస్తరించిన ఒక మహాసామ్రాజ్యాన్ని పరిపాలించిన చక్రవర్తి ఈ మానవజీవితం, యశోవైభవాలూ అశాశ్వతం అని పదే పదే తనకు చెప్పుకుంటూ, అంతిమంగా, జీవించినన్నాళ్ళూ నీతిపరుడైన మనిషిగా జీవించడమొక్కటే నిజమైన జీవితాదర్శం అని నలుగురికీ చెప్పడమే కాదు, ఎవరూ వినకుండా, పదే పదే తనకు తాను చెప్పుకుంటూ ఉన్నాడని తెలుసుకోవడంలోనే మనకొక జీవితాదర్శం స్ఫురిస్తూ ఉన్నది.

అందుకనే ఏడవ శతాబ్దంలో మెడిటేషన్స్ చదివిన ఒక గ్రీకు పాఠకుడు ఇలా రాసుకున్నాడట:

నువ్వు బాధనుంచి బయటపడాలంటే

ఈ పుస్తకం పేజీలు తెరిచిచూడు,

ఈ ధన్యగ్రంథం లోతుల్లో అడుగుపెట్టు.

చదవడం మొదలుపెడితే

ఇంతదాకా గడిచిన నీ జీవితం

ఇప్పుడు గడుస్తున్నది, రేపు రాబోతున్నది

అన్నీ సరళంగా కనిపిస్తాయి.

సుఖదుఃఖాలు అనుకుంటున్నవి రెండూ కూడా

వట్టి పొగ తప్ప మరేమీ కాదని తెలుసుకుంటావు.

29-10-2022

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%