యుగయుగాల చీనా కవిత-18

ఆరు రాజవంశాల కాలానికి చెందిన కవుల్లో తావో యువాన్ మింగ్ సుప్రసిద్ధుడు. ప్రపంచ వ్యాప్తంగా ఆయన పేరు తెలుసు. అలాగే చీనా కవిత్వంలోకి ప్రకృతి ప్రేమని ప్రవేశపెట్టిన కవిగా కూడా ఆయన ప్రసిద్ధి చెందాడు. కాని, ఆయన సమకాలికుడు, మరొక అత్యంత ప్రతిభావంతుడైన కవి గురించి బయటి ప్రపంచానికి ఈ మధ్య మాత్రమే తెలుస్తున్నది. ఆయన పేరు హ్షీ లింగ్-యూన్. చీనా కవిత్వంలో నిజమైన ప్రకృతి ఆరాధకుడు. తావో యువాన్ వర్ణించిన పచ్చదనం పొలాలదీ, తోటలదీ (తీయెన్-యువాన్) కాగా, హ్షీ లింగ్-యూన్ వర్ణించిన సౌందర్యం కొండలదీ, నదులదీనూ (షాన్-షుయి). తన కవిత్వంతో హ్షీ లింగ్-యూన్ చీనా సౌందర్యారాధన మీద ఎంత బలమైన ముద్రవేసాడంటే ఆ తర్వాతి రోజుల్లో చీనాలో వికసించిన లాండ్ స్కేప్ చిత్రకళ షాన్-షుయి చిత్రకళగానే ప్రసిద్ధి చెందింది.
 
భాషా పరిమితుల్ని దాటి తావో యువాన్ మింగ్ బయటి ప్రపంచానికి తెలియడం కారణం ఆయన కవిత్వంలోని సారళ్యం, సౌలభ్యం. సరిగ్గా భాషాపరమైన పరిమితులవల్లనే హ్షీ లింగ్-యూన్ ఇప్పటికీ చీనా రసజ్ఞుల హృదయాల్ని దాటి బయటపడలేకున్నాడు. ఆయన కవిత్వ వైశిష్ట్యాన్ని అనువాదాల్లో గుర్తుపట్టడం కష్టం. ఇంగ్లిషులో చదివినప్పుడు అవి పేలవంగానూ, బోలుగానూ కనిపిస్తాయని ఆ కవిత్వాన్ని అనువదించిన ప్రతి అనువాదకుడూ చెప్తూనే ఉన్నాడు. ముఖ్యంగా, డేవిడ్ హింటన్ చేసిన సుప్రసిద్ధ అనువాదం The Mountain Poems of Hsieh Ling-yun (2001) ని పదే పదే పఠిస్తూ ఉంటేగాని, ఆ కవిత్వంలోకి ఒకపట్టాన ప్రవేశించలేం. నిజానికి హింటన్ అనువాదాల కన్నా, జె.డి.ఫ్రాడ్ షామ్ అనువాదాలు నాకు ఎక్కువ సుబోధకంగా అనిపించాయి.
 
హ్షీ లింగ్-యూన్ (385-433) రాజకుటుంబాలకు చెందిన వాడు. జిన్ రాజ్యం మీద ఉత్తరాది తెగలు దండెత్తినప్పుడు జిన్ రాజవంశం దక్షిణాదికి పారిపోయి అక్కడ నాన్ జింగ్ రాజధానిగా తూర్పు జిన్ రాజ్యాన్ని నెలకొల్పుకున్నారని గతంలో చెప్పుకున్నాం. తిరిగి ఆ రాజ్యం మీద తిరుగుబాటు తలెత్తినప్పుడు వివిధ రాజవంశాలు అధికారం కోసం ఒకరితో ఒకరు పోరాడుకున్నారు. వారిలో లి-యు కుటుంబానికి వ్యతిరేకంగా హ్షీ లింగ్ యూన్ పోరాడేడు కాని, చివరికి లియు కుటుంబం లియు-సోంగ్ రాజ్యాన్ని స్థాపించింది. దాంతో హ్షీ కొన్నాళ్ళు లి-యు వంశాన్ని సేవించకతప్పలేదు. కాని అనతికాలంలోనే లి-యు మరణించినప్పుడు అతడి వారసత్వం కోసం పోరాడిన రెండు వర్గాల్లో హ్షీ మళ్ళా ఓడిపోయే పక్షం వైపే నిలబడ్డాడు. దాంతో తన ముప్పై ఏడవ ఏట అతడు ఆగ్నేయ చీనాలో యూంగ్-చియా అనే తీరప్రాంతానికి ప్రవాసానికి పోక తప్పలేదు.
 
ఆ ప్రవాస కాలంలో అతడొకసారి తన స్వగ్రామం సీన్-నింగ్ లో కొన్నాళ్ళు గడిపాడు. ఆ ప్రాంతమంతా అడవులతో, కొండలతో, సరస్సులతో, జలపాతాలతో నిండిన ప్రదేశం. ఆ ప్రకృతి సౌందర్యం అతడిలో ఒక అపూర్వమైన జాగృతిని కలగచేసింది. అంతదాకా పుస్తకాలద్వారా మాత్రమే పరిచయమైన డావో అతడికి తొలిసారిగా ఒక సాక్షాత్కారంగా అనుభవానికొచ్చింది. దాంతో అనారోగ్యం కారణం చెప్పి తన ప్రభుత్వోద్యోగానికి రాజీనామా ఇచ్చేసి ఆ కొండల్లో గడపడం మొదలుపెట్టాడు. తన సుక్షేత్రంలో పరివారంతో, పుస్తకాలతో, చిత్రలేఖనం, సంగీతం, విందు నాట్యాలతో ఒక సౌందర్యోన్మత్తతలో గడిపడం మొదలుపెట్టాడు.
 
కాని అక్కడ అతడు మళ్ళా రాజకీయాలు చేస్తున్నాడనే కారణం మీద అతణ్ణి మళ్ళా మరొక సుదూర ప్రాంతానికి ప్రవాసానికి పంపేసారు. అతడక్కడికి పోవడానికి నిరాకరించాడు. మామూలుగా అయితే ఆ అవిధేయతకి మరణ దండన తప్పదు. కాని అతడు రాజకుటుంబీకుడు కావడం వల్లా, అప్పటికే కవిగా ఎంతో ప్రసిద్ధి చెంది ఉన్నందువల్లా, రాజు అతణ్ణి ఏమీ చెయ్యలేదు. షీ-నింగ్ కన్నా మరింత సుదూర ప్రాంతమైన నాన్-హై కి ప్రవాసానికి పంపించాడు. చీనా నాగరికత కి సుదూరమైన సరిహద్దుల్లో, సముద్ర తీరప్రాంతంలోని ఆ చిన్న పట్టణం లో అతడి సౌందర్య పిపాస మరింత ప్రజ్వరిల్లుతూ ఉండగానే, మళ్ళా రాజకీయ కారణాల వల్ల చివరికి 433 లో అతడు ఉరికంబం ఎక్కక తప్పలేదు. తనని ఉరితీసే రోజు అతడు రాసుకున్న కవితలో తాను ఎంతో ప్రేమించిన షీ-నింగ్ క్షేత్రంలో మరణించలేకపోవడమొక్కటే తనని బాధిస్తున్నదని వాపోయాడు.
 
రాజకీయాలు, తిరుగుబాటు, ప్రవాసం ఒకవైపు, అడవులు, కొండలు, నదులు, సముద్రతీరాలు మరొకవైపు అతణ్ణి నిలవనివ్వలేదు. కన్ ఫ్యూసియస్ ఒక మాట చెప్పాడు: నువ్వు ప్రభువుని సేవించగలిగే విధేయతతో సేవించు, లేదా రాజ్యం వదిలిపెట్టి వెళ్ళిపో అని. ప్రాచీనా చీనాలో ఒక పౌరుడు నిజమైన కన్ ఫ్యూసియన్ గా జీవించాలంటే అతడికి ఉన్న రెండు మార్గాలివే. అయితే, ఒక కత్తి చేతపట్టుకుని ప్రభువు కోసం పోరాడటం, లేదా ఆ రాజ్యం వదిలి మరో ప్రభువునో లేదా ఏ అడవినో వెతుక్కుంటో పోవడం. తావో చియాన్ చేసిందదే. ఆయన ఎంచుకున్న దారి పట్ల ఆయనకీ స్పష్టత ఉంది, మనకీ అది స్పష్టంగా అర్థమవుతుంది. కానీ హ్షీ లింగ్-యూన్ జీవితంలో అతడు ఎంచుకున్న ఎంపికలో ఆ స్పష్టత అతడికీ గోచరించలేదు, మనకీ గోచరించదు. ఎందుకంటే అతడు ఒక వైపు రాజకీయంగా తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూనే ఉన్నాడు. మరొకవైపు తన సమకాలిక రాజకీయాలనుంచి దూరంగా ప్రకృతి ఒడిలో తలదాచుకోవాలని కూడా తపిస్తూనే ఉన్నాడు. ఆ రెంటిమధ్యా నలుగులాటలో అతడు అనుభవించిన సంఘర్షణ అతడి కవిత్వాన్ని మరింత జటిలం చేసేసింది. ఒకవైపు తన సమకాలిక రాజకీయ ప్రస్తావనలతో పాటు, ‘చూ శబ్దావళి ‘, గీత సముచ్చయం, జువాంగ్-జి, ధ్యాన బౌద్ధం వంటి గ్రంథాలనుంచి అతడు చేసే ఉల్లేఖనలు, ఆ పూర్వవాక్యాల్ని అతడు తన రాజకీయానుభవాలతో కలిపి మననం చేసే తీరు వల్ల అతడి కవిత్వం మరింత సాంద్రమైపోయింది.
 
ఒకరకంగా హ్షీ లింగ్-యూన్ భర్తృ హరి లాంటి వాడు. భర్తృ హరి ఏడు సార్లు సన్యాసాశ్రమంలో ప్రవేశించి ఏడు సార్లూ తిరిగి మళ్ళా గృహస్థాశ్రమంలోకి వచ్చేసిన కథ మనకి తెలుసు. మనుషుల పట్ల ప్రేమ, ముఖ్యంగా స్త్రీల పట్ల పిపాస భర్తృ హరిని సన్న్యాసాశ్రమంలో నిలవనివ్వలేదు. అందుకనే ఆయన కవిత్వంలో శృంగారమూ, వైరాగ్యమూ సమపాళ్ళల్లో ఉంటాయి. హ్షీ-లింగ్ యూన్ కూడా తన కాలం నాటి సామాజిక-రాజకీయ యుగధర్మాన్ని దాటిన మహాసౌందర్యాన్నేదో అడవుల్లో, కొండల్లో, పరుగులెత్తే నదీజలాల్లో, సముద్రతీరాల్లో చూసాడు. దానికి వివశుడైపోయాడు. అలాగని అక్కడే ఉండిపోలేకపోయాడు కూడా. అతడికి తన పరివారం కావాలి, సుక్షేత్రం కావాలి, స్నేహితులు కావాలి, గానం, నాట్యం, పుస్తకాలు కావాలి. అది వైరాగ్యమా? కాదని చెప్పవచ్చు. అలాగని దాన్ని ప్రపంచంలో కూరుకుపోవడం అని కూడా అనలేం. నిజానికి అతడు చూసిన సౌందర్యం ఈ ప్రాపంచిక జీవితాన్ని మరింత ప్రేమించదగ్గదిగా గోచరింపచేసే సౌందర్యమే. ఈ ప్రపంచం లేకపోతే ఆ సౌందర్యానికి అర్థం లేదు. ఆ సౌందర్యం లేకపోతే ఈ ప్రపంచానికి కూడా పూర్ణత్వం లేదు.
అనుదవాదకుడికి పరీక్ష పెట్టే హ్షీ లింగ్-యూన్ నుంచి మూడు కవితలు మీ కోసం తెలుగులో:
 
1
 

శిలాద్వారం దగ్గర కట్టుకున్న కొత్త ఇంటిచుట్టూ ఎత్తైన కొండలు, పరుగులెత్తే ప్రవాహాలు, జలపాతాలు, దట్టమైన అడవులు, పొడుగాటి వెదుళ్ళు

 
ఏకాంత కుటీరం కట్టుకోడం కోసం నేనీ కొండలెక్కాను
మేఘాల్ని పక్కకు జరిపి శిలాద్వారం దగ్గర విశ్రమించాను.
 
పాకుడు పట్టిన ఈ నాచుమీద నడవగలిగేదెవ్వరు?
కొమ్మలు కిందకు వాలిపోకుండా కాపుకాచేదెవ్వరు?
 
శీతాకాలదినాల్లో గాలి మరింత వేగంగా ఊళపెడుతుంది
కాని వసంతాగమనవేళ ఇక్కడ పూలతో నిండిపోతుంది.
 
వెళ్ళినవాడు నా స్నేహితుడింకా తిరిగి రాలేదు
అతణ్ణి మళ్ళా చూస్తానన్న చిన్న ఆశ నన్నింకా వీడలేదు.
 
మా తివాసీల మీద పోగుపడ్డ పరిమళపు దుమ్ము
బంగారు పానపాత్రల్లో స్ఫటికంలాగా మధువు.
 
ఇప్పుడు మానససరోవర తరంగాలు ఏ పాటి విలువ చేస్తాయి
చెట్లకొమ్మల మీంచి కొండపైకెక్కాలని ప్రయత్నిస్తాను.
 
ఎక్కడో పాలపుంతలో ఉన్నవారికోసం బెంగపెట్టుకుంటాను
నా ఒంటరినీడని అల్లుకుని మిగిలినవి జ్ఞాపకాలు మటుకే.
 
కిందన కొండవార సరసులో తనివితీరా ఈతకొడతాను.
పైకి చూస్తానా, కొమ్మల్లో కేరింతలు కొడుతూ కోతులు.
 
ప్రత్యూషవేళ, సాయంకాల పవనాలకోసం ఎదురుచూస్తాను.
సాయంకాలాలు, సూర్యోదయక్షణాల కోసం ప్రతీక్షిస్తాను.
 
ఈ గంభీర శిఖరాల నీడన వెలుగు ఎక్కువసేపు నిలబడలేదు.
నట్టడవిలో చిన్నపాటి శబ్దాలు కూడా సుదూరం వినిపిస్తాయి.
 
విషాదం సెలవుతీసుకోవాలేగాని భావన రెక్కవిప్పగలదు.
వివేకం ఉదయించాక వేదన క్షణకాలం కూడా నిలవదు.
 
నేనే సూర్యరథ సారధినై ఉంటేనా!
ఇట్లాంటి ఊహలే ఆత్మకింత ఉపశమనం కలిగించేది.
 
అలాగని పామరజనంకోసం కాదు నేనీ మాటలు చెప్తున్నది
ఇటువంటి మాటలు సహృదయులు వింటే బాగుణ్ణనిపిస్తుంది.
 
2
 

షీ నింగ్ క్షేత్రం నుంచి సెలవు తీసుకుంటున్నప్పుడు

 
నా చిన్నప్పుడు నాకంటూ కొన్ని వ్రతాలు పెట్టుకున్నాను
కాని ప్రపంచం నన్ను వాటినుంచి పక్కకు తప్పించింది.
 
చూడబోతే ఇదంతా ఏదో నిన్ననే జరిగినట్టుంది, కాని
ఇప్పటికే రెండు పుష్కరాల కాలం గడిచిపోయింది.
 
అలిసి,ఓడిపోయి ఇప్పుడు మహారణ్యాల బాట పట్టాను.
నీతిమంతుల ముందు ఇప్పుడు నేను సిగ్గుపడుతున్నాను.
 
అయినా ఒక మాట , నా అనారోగ్యం నాకు మేలే చేసింది
ఒక ఉద్యోగం దొరికింది, అందులో నేనేమీ చెయ్యక్కరలేదు.
 
రాజముద్రిక చేతుల్లో పట్టుకుని కడలి చుట్టూ తిరగడమే పని
అలవాటైన కొండదారులనుండి పడవ పక్కకు తిప్పుతాను.
 
కొండలెక్కీ, దిగీ, పర్వతమార్గాల్లో పయనించి అలసిపోయాను.
నదీ మార్గాలమ్మట పడవప్రయాణాల్లో విసుగెత్తిపోయాను.
 
ఇప్పుడు నా వెనగ్గా గిరిశిఖరాలు ఒకదానిమీదొకటి
చుట్టూ పోగుపడ్డ ఇసుక దిబ్బలు, ఎటుచూడు లంకలు.
 
గండశిలల నీడలచుట్టూ అల్లుకుంటున్న శ్వేతమేఘమాలికలు.
పారదర్శక జలాల మీద పరుచుకున్న ఆకుపచ్చని వెదుళ్ళు.
 
కొండచుట్టూ నది మలుపు తిరిగినచోట ఇల్లు కట్టుకున్నాను
కొండకొమ్ముమీద ఒక సుందర హర్మ్యం నిర్మించుకున్నాను.
 
ఇప్పుడు ఇరుగుపొరుగునుంచి సెలవు తీసుకుంటూ వాళ్ళకి
చెప్తాను: ‘మూడేళ్ళు, ఓపిక పట్టండి, మళ్ళా వచ్చేస్తాను.
 
దేవదారు వృక్షాలు నాటండి, విస్తారంగా, నా కోసం
దయచేసి నా ఈ ఒక్క కోరికనీ పెడచెవిని పెట్టకండి.’
 
3
 

నదీ ప్రవాహాన్ని చూడటానికి వెళ్ళినప్పుడు

 
ప్రయాణానికి ముందు పొద్దుపోయేదాకా వేచి ఉన్నాను
పడవ తాళ్ళు విప్పి పూర్ణచంద్రుడికోసం ఎదురుచూసాను.
 
గాలినీ, కెరటాల్నీ తప్పించుకుంటూ నదిమీద సాగాను
స్ఫటికసదృశాలు, నిర్మలజలాల్ని కెరలించుకున్నాను.
 
జంటనదులమధ్యనుంచి గండశిలలు బయటపడ్డాయి,
మూడు కొండలమీంచి జలపాతాలు ఉరకలెత్తుతున్నాయి.
 
ఇన్నాళ్ళూ నేను తిరుగాడిన దేశం వెనక్కి తప్పుకుంది
చిక్కటినీడల గోడలు కళ్ళముందు కదలాడుతున్నాయి.
 
కొండల్ని తేరిపారచూసానుగాని దృశ్యం సాక్షాత్కరించదు
అడవిలో కన్ను పొడుచుకు చూసినా నీలాకాశం కనరాదు.
 
దట్టమైన వెదుళ్ళ మధ్య దారివెతుక్కుంటూ ఉండగా
సూర్యుడిలో నీడ సూర్యుడితోపాటే పయనిస్తున్నది.
 
ప్రశాంత జీవితంకోసం ప్రపంచాన్ని వదిలిపెట్టినప్పుడు
ఈ కందమూలాల, ఋష్యాశ్రమాల కష్టాలు నాకేమి తెలుసని?
 
ఈ గాలులూ, గాలివానలూ నాకు కష్టం కలిగించడం లేదు
బరువు దించుకోడానికి స్నేహితుడొకడైనా లేడన్నదే నా బాధ.
 
ఈ చెట్టునీడన కలిసి కూచోడానికి స్నేహితుడొకరుంటే
ఇట్లాంటి ఒక్కరోజు కూడా వేల ఏళ్ళకు సమానమంటాను.
 
5-4-2022

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading