SANDHYA VANDANAM

నా పందొమ్మిదేళ్ళ వయసులో రాజమండ్రిలో టెలిపోన్స్ డిపార్ట్ మెంటులో ఉద్యోగంలో చేరాను. టెలికాం డివిజనల్ ఇంజనీరు ఆఫీసులో ఆఫీసు అసిస్టెంటుగా. నన్ను టెలిఫోన్ రెవెన్యూ అకౌంట్స్ ఆఫీసుకు అలాట్ చేసారు. ఆ ఆఫీసు చాలా రోజులపాటు గాంధీపురంలో ఉండేది. తర్వాత రోజుల్లో కోటగుమ్మం దగ్గర కొత్త ఆఫీసు కట్టాక, అన్ని ఆఫీసులూ ఒక్కచోటే పనిచేసేవి.

ఆ ఆఫీసులో నా ఉద్యోగం టెలిఫోన్ సబ్ స్క్రైబర్ల రికార్డు మెయింటెయిన్ చెయ్యడం. ఆ రోజుల్లో టెలిఫోన్లు చాలా కొద్దిమందికి మాత్రమే ఉండేవి. వాళ్ళ నెలవారీ బిల్లులు, చెల్లింపు వివరాలు మొదలయినవన్నీ ఒక లెడ్జర్లో రాసిపెడుతూ ఉండాలి. వాళ్ళేవైనా ఫిర్యాదులు చేస్తే వాటిని పరిశీలించి జవాబులిస్తూ ఉండాలి. తరచూ బిల్లులు ఎక్కువగా వస్తున్నాయనే ఫిర్యాదులు ఉండేవి. అప్పుడు వాళ్ళ టెలిఫోన్ కాల్స్ తాలూకు టిక్కెట్లన్నీ చూసి జవాబిచ్చేవాళ్ళం. ఆ తర్వాత కొన్నాళ్ళ పాటు టెలిఫొను బిల్లులు రోజుకు రెండు మూడు వేలు ఫిజికల్ గా లెక్కపెట్టి పంచే పని ఉండేది. ఇది కాక, టెలిఫోన్ సబ్స్క్రైబర్లకు బిల్లులు పంపడానికి వాళ్ళ అడ్రెసులు ఒక బ్రాడ్మా మిషను మీద తయారు చేసే పని కూడా ఉండేది.

అట్లాంటి ఉద్యోగం అయిదేళ్ళు చేసాను. ఒకవైపు నన్ను మా ఊరు బలంగా లాగుతూ ఉండేది. అక్కడి కొండలూ, అడవులూ, సూర్యోదయాలూ, అస్తమయాలూ, వెన్నెలరాత్రులూ, ఆ ఏరూ, ఆ గంగాలమ్మ పండగా గుర్తొచ్చినప్పుడల్లా ఎంతతో బెంగగా ఉండేది. మరొకవైపు రాజమండ్రి సాహిత్యవాతావరణం, సాహిత్య మిత్రబృందం, గోదావరి, గౌతమీ గ్రంథాలయం నాకు గొప్ప తోడుగా ఉండేవారు. ఎప్పుడెప్పుడు పని పూర్తవుతుందా, ఎప్పుడు గోదావరి ఒడ్డుకి వెళ్ళిపోదామా అని ఆతృతగా ఎదురుచూసేవాణ్ణి.

టెలిఫొన్స్ ఉద్యోగంలో గొప్ప సౌకర్యం ఒకటుండేది. అది ఔట్ టర్న్ మీద ఆధారపడ్డ పని. నువ్వు రోజుకి ఇంత పనిచెయ్యాలని లెక్క ఉండేది. ఆ పని ఎప్పుడు పూర్తయితే అప్పుడు నువ్వు బయటికి వెళ్ళిపోవచ్చు. లేదా రెండు రోజుల పని ఒక్కరోజే చేసేస్తే మర్నాడు ఆఫీసుకి రానక్కరలేదు. సిరివెన్నెల సీతారామశాస్త్రి కూడా టెలిఫోన్ రెవెన్యూ అకౌంట్స్ ఆఫీసులో పనిచేసినవాడే. ఆయన కాకినాడలో పనిచేసేవాడు. టైపిస్టు. వారం రోజుల పని ఒక్కరోజులో పగలూ రాత్రీ చేసేసి తక్కిన వారం రోజులూ పాటలు పాడుకుంటో గడిపేవాడు. ఆయన ఒక ఆదివారం షర్టు విప్పేసి, ఒట్టి బనీను మీద చెమటలు కక్కుతో టెలిఫోన్ బిల్లుల అకౌంట్లు టైపు చేస్తూండటం చూసానొకసారి.

టెలిఫోన్ రెవెన్యూ ఆఫీసులో నేను పనిచేసిన రోజుల గురించి రాయాలంటే గోర్కీ My apprenticeship రాసినట్టుగా, డాస్టవొస్కీ ‘పేదజనం’, ‘శ్వేత రాత్రులు’ రాసినట్టుగా, గొగోల్ ‘ఓవర్ కోటు’గా రాసినట్టుగా రాయాలి. కాఫ్కా కూడా ఒక ఇన్సూరెన్సు ఆఫీసులో క్లర్కుగానే పనిచేసేవాడని నాకు నేను చెప్పుకునేవాణ్ణి. కాని నిజానికి ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే, ఆ టెలిఫోన్స్ రెవెన్యూ అకౌంట్స్ ఆఫీసుకి చేతులెత్తి నమస్కరించాలనిపిస్తున్నది. ఎందుకంటే, నేను రాజమండ్రి అనే యూనివెర్సిటీలో సాహిత్యాధ్యయనం చేసుకోడానికి ఆ కార్యాలయం నాకు ఎప్పుడూ అడ్డురాలేదు సరికదా, నాకు ప్రతి నెలా స్టైఫండు ఇచ్చినట్టుగా నెలజీతం సమకూర్చింది. అక్కడ పనిచేస్తూనే నేను గ్రాడ్యుయేషన్ పూర్తి చేసాను. తత్త్వశాస్త్రంలో ఎమ్మే చేసాను. గ్రూప్ 1 పరీక్షలు రాసాను. అన్నిటికన్నా ముఖ్యం రోజుల తరబడి గౌతమీ గ్రంథాలయంలో గడపగలిగాను.

అయినా కూడా ఒక నవయువకుడు, మనసులో రంగులూ, కడుపులో రాగాలూ నింపుకున్నవాడు, ఒక ఆఫీసులో బిల్లులు రాసుకుంటూ గడపడంలో, ఎంతచెప్పినా, తీర్చలేని విషాదం ఒకటి ఉండనే ఉంది. అటువంటి ఒక సాయంకాలం నాటి అనుభవం ఈ కవిత.

~

సంధ్యావందనం

సిందూరవర్ణ పక్షాల్తో సంజపిట్ట నిశ్శబ్దంగా నా బల్లమీద వాల్తుంది. గాజు బరువులోంచి రంగురంగుల గీతాలు వలయాలై నా కాగితాలపై ప్రజ్వరిల్లుతూ ఉంటాయి. కాగితాల కట్టలు కుడి ఎడమ స్థానాల్లో చిన్ని చిన్ని జెండాలు తగిలించుకుని నన్ను బలమైన స్తంభానికి కట్టి పడేసిన మోకు చుట్టూ యీగల్లా ముసురుతుంటాయి. నెమరుమేస్తూ, అందమైన తోకతో యీగల్ని తోలుతూ, దివ్యత్వాన్ని అందుకోవాలని పరితపిస్తాను.

ఇలాంటి వేళల్లో ఒక శాలువా అయి ఆ కాంతి నా చుట్టూ తనని తాను కప్పుకొంటుంది. నేను శాలువా వూలు పరీక్ష చేస్తూ కాశ్మీర్ లోయల్లో దేవదారు వృక్షాల వెన్నెల నీడల్ని గీస్తూ వుంటాను. నా బంధాలు అపుడపుడు బిగుస్తూ నన్ను నీడల్లోకి లాగుతుంటాయి. లోయల్లోకి జారుతూ అంచులమీది కాంతిరేఖల్ని ఒదల్లేక దుఃఖిస్తుంటాను.

గాజు అద్దాల పగుళ్ళవెనగ్గా ఆకుపచ్చని కదలికలు రెపరెపలాడుతుంటాయి. సంధ్యావిహంగపు రాలిన రెక్కలు తళతళలాడుతుంటాయి. నా పై వాడికేక నా ముఖాన్ని యీవలివైపుకు తిప్పుతుంది. మౌనంగా వాడి అధికార స్వరానికి తలొంచుతాను. ఇక అప్పుడు నా శరీరం పైన రాగిరంగు కాంతి ముద్దలుగా జారడం కనిపిస్తుంది.

నన్ను బరువైన తరంగాల్తో పీడించే సంధ్యకి మౌనంగా వందనమిస్తాను. ఏమిటా పరధ్యానమని వాడు నన్ను కసురుకుంటాడు.

28-12-1983

SANDHYA VANDANAM

An orange-feathered bird of twilight lands on my table. Colourful circles crisscrossed through the paperweight shining on the paper. Office files with bookmarks swarm around me like flies around the cattle. All through, I ruminate, drive the flies away, and long for that elusive divinity.

At times like this, the light wraps me like a shawl. I stroke the wool of my shawl and draw up the moonlit shadows of the deodar trees in a Himalayan valley. As time passes, my attachments tighten and pull me into those shadows. As I slide down the slopes, I weep for my inability to hold onto the rays of sunlight that hang on the slopes.

Behind the glass doors, green movements flutter. The evening bird sheds glistening feathers. As my boss shouts, I turn around. Silently, I bow to his authority. You then see a coppery light descend over me.

As I sing my hymn to the twilight that pulls my heart, he accuses me of being absent-minded at work.

Leave a Reply

%d bloggers like this: