MUSIC WITHOUT SHADOWS

ముప్పై ఏళ్ళ కిందటి మాట. అప్పట్లో తెలుగు యూనివెర్సిటీలో పి ఎచ్ డి సీట్లు ఉన్నాయంటే అప్లై చేసాను. ఇంటర్వ్యూకి పిలిచారు. డా.నారాయణరెడ్డి వైస్ ఛాన్సలర్. ఆయనతో పాటు మరొక ఇద్దరు ముగ్గురు కూడా ఉన్నారు ఆ బోర్డులో. ఆ ఇంటర్వ్యూకి నాతో పాటు అద్దేపల్లి రామమోహన రావుగారు కూడా హాజరయ్యారు. ఆయన కాలేజిలో నాకు మాష్టారు. ఇంటర్వ్యూలకి ముందు ఆయన నారాయణరెడ్డిని కలిస్తే. ‘మీరూ, వీరభద్రుడు లాంటివారు ఈ ఇంటర్వ్యూలకి రావడం మా యూనివెర్సిటీ ఘనతని పెంచింది’ అన్నారట.
 
ఇంటర్వ్యూలో తక్కినవి ఏమడిగారో గుర్తులేదుగాని, ఒక్క ప్రశ్న మాత్రం గుర్తుండిపోయింది.
‘నిర్వికల్ప సంగీతంలోని తాత్వికత గురించి కొద్దిగా వివరిస్తారా?’ అనడిగారు, జి.వి.సుబ్రహ్మణ్యం గారు. నేను అప్పటిదాకా ఆయన్ని ఫొటోల్లో చూడటమేగాని ప్రత్యక్షంగా చూసిందిలేదు. నేను హాజరైన ఇంటర్వ్యూలో నా పుస్తకం మీదనే నన్ను ప్రశ్నలడగడం గమ్మత్తుగా, గిలిగింతగా తోచింది.
నేను చిరునవ్వు నవ్వి ఊరుకున్నాను.
 
‘చెప్పండి. ఆ కవిత్వం వెనక కవి హృదయం ఎటువంటిదని మీరు అనుకుంటున్నారు? ‘ అన్నారు ఆయన మరోసారి.
 
అప్పుడు కొంత వివరంగానే చెప్పాను. ‘నేను ఆ కవితలు రాసినప్పుడు నాకు ప్రతి ఒక్క కవితా ఎంతో కొత్తగానూ, ఆశ్చర్యకరంగానూ ఉండేవి. ఎందుకంటే, నేను రాయాలనుకున్న కవితలు కాక, నాకు తెలీకుండానే, నాతో నిమిత్తం లేకుండానే బయటికి వచ్చిన కవితలు అవి. నా బుద్ధి చెప్పిన మాట నా హృదయం వినడం లేదని నాకు అర్థమయింది. ఆ పుస్తకం వెలువడ్డాక, దాశరథి దాన్ని సమీక్షిస్తూ, ఆ కవిత్వంలో ఎంతో పవిత్రత ఉంది అంటే నేను ఆశ్చర్యపోయాను. ఎందుకంటే, ఎంతో గ్లానిలోనూ, వేదనలోనూ, అపరాధభావనమధ్యా రాసిన కవిత్వం అది. దానిలో ఆయనకు పవిత్రత ఎలా గోచరించిందీ అని. శేషేంద్ర కూడా అటువంటి మాటలే నాకో ఉత్తరం రాసారు. ‘కొమ్మల్లో, ఉషఃకాల జలాల్లో తిరిగే గాలిలాంటిది మీ జన్మ, మీ వాక్ స్పర్శ ఈ సత్యాన్నే తెలుపుతోంది ‘ అని. కాబట్టి, ఆ కవి హృదయం నాకు తెలిసిన మనిషిది కాదు. ఆ కవిత్వం కన్నా అదనంగా ఆ కవి గురించి నేనేమీ చెప్పలేను ‘ అని చెప్పాను.
 
బహుశా, ఈ మాటలు, నిర్వికల్ప సంగీతంలోని తక్కిన అన్ని కవితలకన్నా, ‘నిర్వికల్ప సంగీతం’ అన్న కవితకే ఎక్కువ వర్తిస్తాయి. నిజంగా నాతో నిమిత్తం లేకుండా, నేను రాయాలనుకోకుండా, రాసిన కవిత ఇది.
 
( ఆ ఇంటర్వ్యూ ఏమైందని అడక్కండి. నాకు తెలుగులో ఎమ్మే లేదని యూనివెర్సిటీ నాకు పి ఎచ్ డి లో సీటు ఇవ్వలేదు.)
 
~
 

నిర్వికల్ప సంగీతం

 
ఈ లేతవీణమీద ఎప్పుడు ఏ రాగాన్ని శృతి చెయ్యాలో నీకు తెలుసు. నీ అగాధమైన అంతరంగంలోని ఏ సంకల్పమో గొప్ప గీతంగా యీ లోకమంతటా మోగుతుంది. తన తీక్ష్ణమైన సునిశితత్వానికి తానే కదిలి ఒణికిపోయి నీ సంగీతం బేలగా నిన్ను చూస్తుంది. అప్రత్యాశితంగా దయ ఒలికే నీ కళ్ళు ఎటో చూస్తుంటాయి. నీ సంగీత జీవనార్తి నీ నిశ్శబ్దాన్ని తాకి నీ చుట్టూ విఫలంగా పర్చుకొంటుంది.
 
ఒళ్ళెరగని ఆవేశం నుంచి హఠాత్తుగా ఉలికిపడినప్పుడు కన్నీటిజాలు తప్ప మరేమీ మిగలదు. ఏ దూర మలయాదేశాల రబ్బరు కాండాలో పాలు ఒలికిస్తాయి. వెనకా ముందూ తెలియని కారణాల నిష్ప్రయోజనం మధ్య కన్నీరు నీ నైవేద్యంగా పేరుకుంటుంది.
 
నేను హఠాత్తుగా నీ నుంచి వేరయి నిన్ను ప్రశ్నిస్తాను. అర్థరాత్రి వాన తుంపరలో నదీతీరాన జీవితపు నిరర్థకత్వం బోధపడినప్పుడు నా కన్నీటి సంపద విలువ నన్ను ధైర్యంగా నిలుపుతుంది. ఒక్కణ్ణీ నా గది తలుపులు తెర్చుకున్నప్పుడు నిశ్చలచిత్రంలాంటి ఆ గది మానససరోవరంలా చేరదీస్తుంది. హాయైన హిమాలయ పవనంలా నా పైన నేనే ఆనందంగా సుగంధం వర్షించుకుంటాను.
 
నీ దివ్యహస్తాల్లో యీ లేతవీణ వొద్దిగ్గా అలానే. శబ్దం నిశ్శబ్దమై, నీ సంగీతం నీలోకే ప్రవహిస్తుంది. అలసిన నా కన్రెప్పలపైన ఒక సుకుమార వేదనానుభూతి నందివర్ధనం పువ్వులా నిలుస్తుంది.
 
19-7-1983
 

MUSIC WITHOUT SHADOWS

 
On this delicate veena, you know how to play. From the depths of your soul, you would tune your song. Your music is moved by its own sharpness and looks at you fervently. You gaze in the distance with unasked kindness. In your silence, the angst of your music splashes around you.
 
Nothing remains but tears when I awaken from an emotional trance. On distant islands, rubber trees yield milk. In the hollowness of ill-founded causes, tears become an offering.
 
Suddenly, I separate from you and question you. At midnight along the banks of the river, I realize how empty my life has become. Only my tears remain by my side. As I enter my room, it greets me like a still-life painting of a mythical lake. Like a gentle Himalayan breeze, I spray myself with a perfume of joy.
 
The veena lies tenderly in your divine arms. As the music flows back into you, the sound turns into silence. Unheard melodies wash over my tired eyelids like temple flowers drenched in dew.

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading