సుకవి

పద్మభూషణ్‌, కళాప్రపూర్ణ, నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా (1895-1971) ఇరవయ్యవ శతాబ్ది తెలుగు కవుల్లోనే కాక, వెయ్యేళ్ళకు పైబడ్డ తెలుగు కవిత్వ చరిత్రలో విశిష్టస్థానం సముపార్జించుకున్న కవి. తన భావనాబలంలోనూ, కవిత్వ ధారలోనూ, సంస్కారయుతమైన పదప్రయోగంలోనూ, సౌష్టవపద్యశిల్పంలోనూ మహాకవుల సరసన నిలబడగలిగినవాడు. ముఖ్యంగా సామాజిక అన్యాయాన్ని, కులమతాల అడ్డుగోడలు వేళ్ళూనుకున్న అవ్యవస్థనీ ప్రశ్నించడంలోనూ, తెలుగు కవిత్వంలో అంతదాకా చోటు దొరకని దళిత జీవనాన్ని కావ్యవస్తువుగా స్వీకరించి, అభాగ్య సోదరుడి పక్షాన నిలబడడంలోనూ ఆయనే మొదటివాడు. శాంతి, అహింసలు ఒకపక్కనా, ప్రపంచాన్ని మార్చాలంటే సాయుధ సంఘర్షణ తప్పదని మరొక పక్కనా దేశంలోనూ ప్రపంచంలోనూ సంభవిస్తున్న పరిణామాల్ని ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తూ, ఆ రెండు దారుల్లోనూ దేన్ని ఎంచుకోవాలని సంఘర్షణపడి చివరికి శాంతి, ప్రేమ, కరుణ, అహింసల మార్గాన్నే ఎంచుకున్నవాడు. ఇంత అవ్యవస్థతో కూడిన ఈ ప్రపంచానికొక సృష్టి కర్త వుంటాడా ఉంటే అతడి ఉద్దేశ్యమేమై ఉంటుందని ఎన్నో సార్లు ఈశ్వరుణ్ణి నిలదీసినవాడు. పాతనిబంధనలో యోబులాగా పరమేశ్వరుణ్ణి ప్రశ్నించకుండా ఉండలేకపోయినవాడు. కాని తనకీ, మనిషికీ మధ్య పూజారులూ, పురోహితులూ, మధ్యవర్తులుగా చేరినందువల్ల మాత్రమే దూరం ఏర్పడుతున్నదని గ్రహించి ఈశ్వరుడు నేరుగా తన కుమారుణ్ణే మనుషులమధ్యకు పంపించాడని నమ్మి క్రీస్తు చరిత్రని అజరామర కావ్యంగా సృజించినవాడు.

2

జాషువా అన్నిటికన్నా ముందు కవి. సున్నిత హృదయుడు. చిరుగాలికి కూడా కంపించగలిగే లలితమనస్కుడు. ‘తేలిక గడ్డిపోచలు తెచ్చి’ వాటిని ‘జిలుగుంబంగరు రంగులుం కులుకు మేల్చిన్న్నారి పూగుత్తి సొమ్ములు కీలింంచిన’ పద్యశాఖలకు తగిలించి, ఆ మాటలతో ఒక కావ్యసౌధాన్ని నిర్మించి అందులో ఒక ‘అలఘు సుఖాన్ని’ పొందడం కోసమే ఆయన పద్యాలు చెప్పడం మొదలుపెట్టాడు. మొదట్లో ఆయన దృష్టి అంతా ఆ సౌందర్యం మీదనే. కాని ఆ కృషిలో తాను అల్లుతున్న నిరుపమానమైన పద్య సౌందర్యాన్ని చూడటానికి బదులు తాను పుట్టిన కులాన్ని మాత్రమే చూస్తున్న సమాజం ఆయన్ను వికలమనస్కుణ్ణి చేసింది. ఆ వివక్ష ఆయన్ని తీవ్రంగా గాయపరిచింది. అప్పుడు ఆయన ఆ సమాజ అవ్యవస్థ వైపు, ఆ సామాజిక క్రౌర్యం వైపూ దృష్టి సారించాడు. సామాజిక నిమ్నోన్నతాల్నీ, అల్పత్వాల్నీ, ఆత్మవంచననీ ప్రశ్నించాడు. తీవ్రంగా విరుచుకుపడ్డాడు. తనలాగే లక్షలాదిమంది ‘నాలుగు పడగల హైందవ నాగరాజు’ కాటుకు గురవుతున్నారని చూసి వారి పక్షాన నిలబడ్డాడు. తన అక్కున చేర్చుకున్నాడు. తనకీ, వారికీ కూడా ఒక కొత్తలోకం కోసం భగవంతుడికి గబ్బిలంతో సందేశం పంపించాడు. కాని సామాజిక వివక్ష తనను ఎంత గాయపరిచినా ఆయన తన మానసిక స్థైర్యాన్ని కోల్పోలేదు. తనని గాయపరుస్తున్న మనిషిని తిరిగి గాయపరచాలని అనుకోలేదు. తనని, తనవాళ్ళనీ అవమానిస్తూ, నిరాదరిస్తూ, తమ శ్రమని దోచుకుంటున్నవాళ్ళ మనసుల్లో మార్పు రావాలనే ఆశించాడు. రాగలదని నమ్మాడు. బుద్ధుడూ, యేసూ, గాంధీ ఏ విధంగా ఈ సమాజానికి విముక్తిమార్గం చూపించారో తాను కూడా ఆ దారినే నడవాలని తపించాడు. చివరిదాకా తన జీవితంలోనూ, కవిత్వంలోనూ కూడా ఆ దారినే నడిచాడు.

ఈ ప్రయాణం జాషువా గారి కావ్యాల్లోనూ, ఖండకావ్యాల్లోనూ కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ‘పిరదౌసి’ (1932) నుండి ‘క్రీస్తు చరిత్ర’ (1963) దాకా దాదాపు మూడు దశాబ్దాల పాటు ఆయన సృష్టించిన కావ్యలోకంలో మనం ప్రయాణించినప్పుడు ఆ హృదయస్పందనాన్ని మనం చాలా దగ్గరగా వినగలుగుతాం. కొన్నిసార్లు ఆవేదనతో, కొన్ని సార్లు ఆగ్రహంతో, కొన్ని సార్లు అలజడితో, కాని ఎప్పుడైనా కూడా మనల్ని అబ్బురపరిచే పద్యవిన్యాసంతో ఆయన కనబడతాడు. ఆ కావ్యాల్ని వరసగా చదువుకుంటూ వెళ్తున్నప్పుడు మనమొక మహామానవుడి సన్నిధిలో ఉన్నామన్న స్ఫురణ కలుగుతూ ఉంటుంది. తన ప్రతి ఒక్క జీవితానుభవాన్నీ ఎంతో విలువైందిగా భావిస్తూ ఆ గాఢతని ఎంతో నిజాయితీతో మనతో పంచుకున్న మహాకవిని వింటున్నామన్న గౌరవం కలుగుతుంది.

3

కవిగా జాషువా గుర్తింపు, ప్రశస్తి ప్రధానంగా ఖండకావ్యాల మీద ఆధారపడిరది. 1937 నుండి 1965 దాకా ఆయన వెలువరించిన ఏడు సంపుటాల్లోనూ దాదాపు రెండువందల దాకా ఖండకావ్యాలున్నాయి. సంపుటాల్లోకి ఎక్కనివి మరొక నలభై దాకా ఉన్నాయి. ప్రకృతి సౌందర్యం, తెలుగు వీరులు, జాతీయోద్యమ యోధులు, సమకాలిక సంఘటనలు, చిన్న చిన్న సంతోషాలు, బాధలు, తనని కుంగదీసే వ్యథలు- ఎప్పటికప్పుడు వాటన్నిటినీ ఆయన పద్యాలుగా మలిచి తన శ్రోతలతో, పాఠకులతో పంచుకుంటూనే ఉన్నాడు. మొదటి సంపుటంలోని మొదటి పద్యాల్లో కనవచ్చే సులలిత మనస్కుడూ, లేత హృదయుడూ రాను రాను సామాజిక వాస్తవాల్మి, నిష్టురాల్నీ కూడా స్పష్టంగా పసిగట్టడం మనకి ఆ పద్యాల్లో కనిపిస్తుంది. ముఖ్యంగా అతడు పూర్వకవుల్ని, తెలుగు కవిత్వాన్ని అపారంగా ప్రేమించాడనీ, తన పద్యాన్ని కూడా వారి కోవలో సృజించాలని సాధన చేసాడనీ మనం గ్రహిస్తాం.

ఈ పద్యం చూడండి:

గీర్వాణ కవులు ద్రొక్కిన కావ్యపథముల నొడలు చెమ్మటలూర నడువవలయు
మన కవిత్రయము పెట్టిన కావ్య భిక్షకు పలుమారు దోయిలింపగవలయు
అన్యదేశీయ కావ్యాంబుధుల్‌ మథియించి గుణరత్నముల నేరికొనగవలయు
నధునాతన కవీంద్రు లల్లు కబ్బముల తాలింపు సొంపుల నాకళింపవలయు

తెలుగు సాహిత్యసుందరీ దేహవల్లి
కెరవు సొమ్ముల సొగసు రానీక హృదయ
మెరిగి మధురంపు నడకలు కరపవలయు
అది కవిత్వంబు అతడు శారదకు గురుడు.

పూర్వాంధ్ర సంస్కృత కవులు, పాశ్చాత్య కవులు, ఆధునిక కవులు ఏ శైలితో, ఏ ప్రతిభతో కవిత్వం పలుకుతున్నారో గమనిస్తూ ఆ దారిలో తాను కూడా తెలుగు పద్యాన్ని ‘హృదయమెరిగి మధురపు నడక’ లో నడిపించడం ఒక్కటే కాదు ఆయన కవిత్వానికి శోభనిచ్చింది, ఆ కావ్యకౌశల్యం కన్నా ముందు ఆ హృదయ నైర్మల్యం మరింత గొప్పది. సహజంగానే బీదవాడిపట్ల, బలహీనుడి పట్ల, మూగజీవులపట్ల ఆయన గుండె కరిగిపోతూ ఉండటం అందరికన్నా ముందు ఆయనే గుర్తుపట్టాడు. తన తొలిరోజులనాటి కావ్యం ‘స్వప్న కథ’ లో ఇలా అంటున్నాడు:

చిన్నప్పటినుండియు నా
కన్ను పరుల కష్టములను కని యోరువలే
దన్నా! బడాయిగాదీ
వెన్నెల నా కనులనుద్భవించునుండున్‌

ఇతరుల కష్టాల్ని చూసి ఓర్చుకోలేని ఆ చూపునుంచే వెన్నెల ప్రసరిస్తూ ఉందని చెప్పుకోవడంలో నిజంగా బడాయి లేదు. నిజానికి ఇతరుల కష్టాల్ని చూసినప్పుడు తొణికే కన్నీటిచుక్కలోనే భగవంతుడున్నాడని ఆయనకు తెలుసు. ఆ కావ్యంలోనే మరొక చోట ఇలా అంటున్నాడు:

పరుల దుర్గతి గని గుండె కరగి వగచు
సదయ హృదయుల వీక్షణాంచలమునందు
పుట్టుచుండును కన్నీటిబొట్టువోలె!
ఏడి భగవంతుడని సంశయింతువేల?

అటువంటి హృదయం కనుకనే ఆయన సాలీడు గురించి రాసినా, గిజిగాడు గురించి రాసినా, తుమ్మెద గురించి రాసినా, నెమిలి నెలత గురించి రాసినా వెన్నెల కురిసినట్టే ఉంటుంది. అపురూపమైన ఆ పద్యసోయగాన్ని తలుచుకోడానికి మళ్లీ అన్ని పద్యాలూ ఎత్తి వినిపించాలి. కాని మచ్చుకి ఒక పద్యం:

కులుకు పసిండి నిగ్గుల దుకూలములన్‌ ధరియించి ముద్దు బి
డ్డలును, పడంతి, నీ పొదిగిటన్నిదురింపగ, కన్నెగాడ్పు లూ
యెల సదనంబు నూచ భయమింత యెరుంగక కన్నుమూయు నీ
అలఘుసుఖంబు మాకు కలదా? గిజిగా, ఒక రేనికున్నదా?

అంత అపురూమైన తేనెసోనలు కవిత్వంలో చిందిస్తున్నప్పటికీ, సమాజం తన కావ్యసౌందర్యాన్ని ప్రశంసించకుండా తన కులం అడ్డు రావడం ఆయన్ని బాధిస్తూనే వున్నదని  అనడానికి తొలిరోజుల పద్యాల్లోనే సాక్ష్యమున్నది. ఈ పద్యం చూడండి:

చక్కని కవితకు, కులమే
యెక్కువ తక్కువలు నిర్ణయించినచో, నిం
కెక్కడి ధర్మము తల్లీ?
దిక్కుంజర వేదికా ప్రతిష్టిత గాత్రీ!

ఈ వేదన తర్వాతి రోజుల్లో గబ్బిలం కావ్యానికి దారితీసినప్పటికీ, ఆ బాధ చివరిదాకా ఆయన్ని వేధిస్తూనే ఉన్నదని మనకి తర్వాతి కావ్యాల్లో కూడా కనిపిస్తున్నది. ‘క్రీస్తు చరిత్ర’ లో ఒక సమరయ స్త్రీని యేసు తనకి దాహం తీర్చుకోడానికి నీళ్ళిమ్మని అడిగే ఘట్టంలో ఆయనిలా అంటున్నాడు:

జలముల్‌, వాయువు, అగ్నియున్‌, పరమ రాజన్యుండు, భూలోక వా
సులకుంబంచి యొసంగిపోయినన్‌ స్థిరాస్తుల్‌, స్పృశ్యతాస్పృశ్యతల్‌
కులగోత్రాలు ప్రపంచసభ్యతకు సిగ్గుంజేటు జుమ్మిమ్మహా
కలుషంబెల్ల మహా పదార్థములకున్‌ కల్పింతు రల్పాశయుల్‌.

ఆ మహాపదార్థాల్లో కవిత్వం కూడా ఒకటి. అల్పబుద్ధి కలిగిన వాళ్ళు తమ మహా కాలుష్యాన్ని ఆ కవిత్వానికి కూడా అంటించడం ఆయన్ని కలవరపరుస్తూనే ఉంది. తన చిట్టచివరి కావ్యమైన ‘ముసాఫరులు’ లో కూడా ఆయన ఈ మాటలే చెప్తున్నాడు:

మనవాడా కాదాయను
యనుమానము దీరకున్న అబ్జభవుని య
బ్బను గూడ లక్ష్యపెట్టని
అనాది పండితులు కొందరగుపింత్రు ధరన్‌.

గొప్ప కవిత్వం వల్లనో, నైతిక విప్లవం వల్లనో, సంఘసంస్కారం వల్లనో వాళ్ళు మారతారనుకోవడం భ్రమ. ఆ కావ్యంలోనే ఈ మాట కూడా చెప్తున్నాడు:

పెరిగినది వాజ్ఞ్మయంబం
బరమంటం పెద్ద గ్రంథభాండాగారంబుల్‌
పెరిగినవి, మానవత్వము
పెరగదు కారణము తమ్మిబిడ్డడెరుంగున్‌

తాను పుట్టి పెరిగిన సమాజంలోని కులరక్కసి వల్ల ఆయన హృదయాన్ని జీవితకాలం ఒక దుఃఖపు జీర పెనవైచుకునే ఉంది. అపురూపమైన మాధుర్యంతో పొంగిపొర్లే ఆ ఖండకావ్యాల్లో మనం ఒక చేదునీ, ఆ పరిమళంలో ఒక గాటుని కూడా ఆస్వాదించవలసి ఉంటుంది, ఇందుకనే.

4

ఖండకావ్యాలతో పాటు జాషువా సృజించిన కావ్యాలు కూడా వస్తువులోనూ, శిల్పంలోనూ, రసస్ఫూర్తిలోనూ ఎంతో విశిష్టమైనవి. వాటిలో కొన్ని కావ్యాల గురించి స్థూలంగా తలుచుకుందాం.

‘పిరదౌసి’ (1932) ఆయన తొలికావ్యాల్లో ఒకటైనప్పటికీ ఆయన తదనంతర సాహిత్యదర్శనానికి అదొక నమూనాగా నిలబడగల కావ్యం. అపురూపమైన పద్యాలు, కొత్త కల్పన, జీవిత వైరుధ్యాల్ని కనుగొని, వాటిని తనకై తాను సమన్వయించుకోగల పరిణతి ఆ కావ్యంలో మనకి కనిపిస్తాయి.

ఆ కావ్యంలో రెండు ఇతివృత్తాలు కనిపిస్తాయి. గజనీ మహమ్మదు తన మీద ఒక మహాకావ్యం రాసి ఇమ్మనడం, పిరదౌసి రాయడం మొదలైన చారిత్రిక అంశాలతో కూడిన కథ మొదటి ఇతివృత్తం, స్థూల ఇతివృత్తం.

కావ్యంలో మొదటి, నాలుగవ ఆశ్వాసాలు చరిత్ర, రెండవ మూడవ ఆశ్వాసాలు కవి కల్పన. పిరదౌసి జీవితంలో ఏమి జరిగిందో చరిత్ర మనకి చెప్తున్నది. ఆ విషయాన్ని ఎంత బాగా వర్ణించినా అందులో కవి ప్రతిభ ఏమీ లేదు. కాని పిరదౌసి గురించి మనకు తెలిసినదాన్ని బట్టి అతడి జీవితంలో ఏమి జరిగిఉండవచ్చునో ఊహించడంలో కవి ప్రతిభ ఉంది.

కాని దానికన్నా సూక్ష్మంగా మరొక ఇతివృత్తం కనిపిస్తుంది. భగవత్సృష్టిలో మహాసౌందర్యం ఎంతో సహజంగా ప్రకాశితమవుతూ ఉండగా కవి మళ్ళా కావ్యసౌందర్యాన్ని సృష్టించవలసిన అవసరమేముంది? అలా సృష్టించినా అది భగవత్సృష్టి ముందు నిలబడగలుగుతుందా? అంటే, కవి కావ్యరచనకు పూనుకోక తప్పదనే సమాధానం. ఎందుకంటే కవి ఒక్కడే ఈ ప్రపంచంలోని కృతఘ్నతనీ, కృతజ్ఞతనీ కూడా చిత్రించగలిగినవాడు. కవి కావ్యంలో మనకి కనిపించే సౌందర్యం కృతజ్ఞతా సౌందర్యం. ఆ కృతజ్ఞత దేవుడిపట్లా, దేవుడు సృష్టించిన సజ్జనుల పట్లా కూడా. ఎందుకంటే తాను చూసిన కృతఘ్నత తనకి జీవితేచ్ఛ లేకుండా చేసినప్పుడు, ప్రతిఫలాపేక్షలేని ఒక మానవుణ్ణి చూడకుండా పిరదౌసి ఈ లోకాన్ని వదిలివెళ్ళాడని నమ్మలేకపోయాడు జాషువా గారు. ఇందులో చెప్పకుండా చెప్పిన మరొక విశేషం కూడా ఉంది. పిరదౌసి కావ్యం రాయడానికి పూనుకున్నప్పుడు ప్రతిఫలాపేక్ష ఉంది. ఆ ప్రతిఫలం తాను ఆశించినట్టుగా లేదని తెలిసినప్పుడు అతడికి జీవితం పట్ల ఆసక్తిపోయింది. కాని ప్రతిఫలాపేక్షతో రాసేది కావ్యమెట్లా అవుతుంది? అడవిలో దారితప్పినప్పుడు తనకి దారి చూపిన చెంచుని కలిసినప్పుడు పిరదౌసికి ప్రతిఫలాపేక్షలేని వాక్కు సాక్షాత్కరించింది.

వాని మృదూక్తి నైపుణియు, వాని వినమ్ర విధేయభావమున్‌
వాని పరోపకార నిరవద్య గుణప్రతిభావిశేషమున్‌
వాని శరీర సౌష్టవం, వాని భుజార్గళ మాంసలత్వమిం
పైన కృతజ్ఞతార్థకృతులై వెడలెన్‌ పిరదౌసి వాక్కునన్‌

ఆ విధంగా చూసినట్లయితే, పిరదౌసి కావ్యంలోని మొదటి, నాలుగవ ఆశ్వాసాలు చరిత్ర మనకు చెప్తున్న కృతఘ్నతా చిత్రణ. రెండు, మూడు ఆశ్వాసాలు కవి సంభావించిన కృతజ్ఞతా వర్ణన. రెండవ ఆశ్వాసం దేవుడి పట్ల కృతజ్ఞతా ప్రకటన కాగా మూడవ ఆశ్వాసం దేవుడు సృష్టించిన సజ్జనుల పట్ల కృతజ్ఞతా సమర్పణ అని చెప్పవలసి ఉంటుంది.

తర్వాతి రోజుల్లో జాషువా కనపరిచిన పద్యవిన్యాసం మహిమ పిరదౌసిలో మనకి నిండుగా గోచరిస్తుంది. మొదటి కావ్యంలోనే అంత కౌశల్యం చూపించగల కవులు చాలా అరుదుగా ఉంటారు. ఈ పద్యాలు చూడండి:

ఈ తొలికోడి కంఠముననే యినబింబము నిద్రవోయెనో
రాతిరి, తూర్పుగొండలభిరామములైనవి దీని వక్రపుం
గూతల మర్మమేమి కనుగొమ్మని యల్లన హెచ్చరించి ప్రా
భాతసమీర పోతములు పైకొనియెం తొలిసంజ కానుపుల్‌
పిట్టల బీచుబీచుమనిపించు వేగుపడంతి దోసిటన్‌
బట్టె గులాబిగుత్తుల నభంబున పుప్పొడి దుమ్ము రేగ నీ
విట్టి నిసర్గపూజలకు తృప్తి వహింతువొ? నా స్తవంబులో
బట్టము కట్టుకొందువొ? కృపానిధి, గుండెలు గుమ్మరించెదన్‌.

కాబట్టి అపురూపమైన ఈ చిన్ని కావ్యం కలకాలం నిలిచి ఉంటుందని చెప్పనక్కర్లేదనుకుంటాను.

5

‘స్వప్న కథ’,  ‘అనాథ’  రెండూ 1934 లో రాసిన కావ్యాలు. ఇందులో స్వప్నకథ ఒక మనోజ్ఞమైన కల్పన. చందమామలో రాట్నం వడుకుతున్న ఒక ముసలవ్వను కవి చూసి ఆమె అక్కడికి ఎలా చేరినదని అడిగినప్పుడు ఆమె తన కథ చెప్తుంది. నిస్వార్థంతో ఆమె జీవించిన జీవితమే ఆమెని చంద్రలోకానికి తీసుకువచ్చిందనే ఆ కథలో చల్లదనం ఉన్నప్పటికీ, సామాజిక వాస్తవం పట్ల కవి ఎంత జాగృతుడిగా ఉన్నాడో ఈ పద్యం సాక్ష్యమిస్తుంది:

పేదరికము పెద్ద వింత చదువుల బడి
దానిలోన లజ్జ గానబడదు
ఉదరమొజ్జ యగుచు నోరంత ప్రొద్దులు
నోర్మి విద్దె నేర్పుచుండునచట.

అనాథ కావ్యంలో మొదటిసారి ఒక ‘అస్పృశ్య’బాలిక కనిపిస్తుంది. కాని అస్పృశ్యతాసమస్యను మరింత లోతుగా పరిశీలించడానికి ఆయన గబ్బిలం దాకా ఆగవలసి వచ్చింది. ‘అనాథ’ కావ్యంనాటికి ఇంకా ఆ తొలినాళ్ళ సౌందర్యోపాసకుడే బలంగా ఉన్నాడు. ఈ పద్యం చూడండి:

ఆకటం దూలు సస్యశ్యామల క్షేత్రకన్య కడుపు చల్లగా భుజించె
బక్కచిక్కిన కొండవాగుందటాకంబు చిటుకలో నుప్పోంగి చియ్యబట్టె
ముమ్మాయి ముత్యంబు వోలితామరమీద వర్షబిందువు తాండవంబు సేసె
నడయాడు రతనంబు వడువున నాడాడ ఆరుద్రపురువు ప్రత్యక్షమయ్యె

చెలగి చేయార దానంబు జేసి చేసి
కొరతవడియున్న వాని కాపురము వోలి
ఉబ్బు సెడి తూలె నొక చిన్ని మబ్బుతునక
ఉత్తరంబుగ దిక్కుల కొత్తిగిల్లి.

6

గబ్బిలం (1941-43) జాషువా రచనల్లో అత్యంత ప్రజాదరణ పొందిన కావ్యం. వస్తువులోనూ, భావప్రకటనలోనూ, కవి హృదయ నివేదనలోనూ తెలుగు పద్య కవిత్వంలో ఇంత విప్లవాత్మక ప్రయోగం మరొకటి లేదు.

జాషువా కవిత్వసాధన మొదలుపెట్టిన తొలి ఇరవయ్యేళ్ళుగా ఎంతో అద్భుతమైన పద్యశిల్పంతో కూడిన కవిత్వం రాసినప్పటికీ, సమాజం ఆ కావ్యసౌందర్యాన్ని మనసారా ప్రశంసించలేకపోయింది. ప్రతిసారీ ఆ పద్యసౌందర్యాన్ని పక్కన పెట్టి ఆయన పుట్టిన కులం గురించి మాట్లాడుతూ ఉంది. ఈ సామాజిక క్రౌర్యాన్ని తాను మొదట్లో తట్టుకోగలనుకున్నాడుగానీ, రానురాను అది తాను ఊహించినదానికన్నా బలంగా వేళ్ళూడదన్నుకున్నదని గ్రహించాడు.

ఆ క్రౌర్యాన్ని ఎండగట్టడంలో,  ఎద్దేవా చెయ్యడంలో గబ్బిలం కావ్యంలోఆయన చాలా  పదునైన భాష వాడాడు. అంతదాకా సుమపేశలంగా మెత్తగా, తాకితే కందిపోతుందేమోననిపించేటంతగా ఖండకావ్యాల్లో కనిపించిన లలిత సరళ తెలుగు భాష కాదిది. ఇప్పుడు కత్తివాదరలాంటి వాక్యప్రయోగాలకు పూనుకున్నాడు:

పామునకు పాలు చీమకు పంచదార
మేపుకొనుచున్న కర్మభూమిం జనించు
ప్రాక్తనంబైన ధర్మదేవతకు కూడ
ఉలికిపడు జబ్బు గలదు వీడున్న చోట
ప్రతిమల పెండ్లి సేయుటకు వందలు వేలు వ్యయించుగాని దుః
ఖితమతులైన పేదల ఫకీరుల శూన్యములైన పాత్రలన్‌
మెతుకు విదల్పదీభరతమేదిని ముప్పదిమూడు కోట్క దే
వతలెగవడ్డ దేశమున భాగ్యవిహీనుల క్షుత్తులారునే?

కాని మనం గమనించవలసింది, గబ్బిలం మొదటిభాగంలో అస్పృశ్యతా సమస్య ప్రధాన ఇతివృత్తం కాదు. అక్కడ కవి దృష్టి తన పూర్వకవులమీదనే ఉంది. ఆయన గబ్బిలానికి చూపించిన తోవ తన పూర్వాంధ్రకవులు నడిచిన దారి. ఆ రోజులనాటికింకా జాషువా ప్రధానంగా కవి, కవిగానే జీవించాలని కలలుగన్నాడు, ఆ కలనే గబ్బిలం ద్వారా పరమేశ్వరుడికి మొరపెట్టుకున్నాడు.

కాని ఆ తర్వాత ఏమి జరిగిందో కవి ఇలా రాస్తున్నాడు: ‘ గబ్బిలము కైలాసమునకు సందేశము తీసుకొనిపోయి చిరకాలమైనది. వాని సందేశ ఫలితంగా నాల్గుమూలలనుండి ప్రసన్న వాయువులు వీయసాగినవి. దేవాలయ ప్రవేశం, హరిజనోద్ధరణమని గాంధీదేవుని చరకారaూంకరణము శ్రవణసుభగంగా గానము చేసినది. సర్వసమత్వమను మంత్ర రాజాన్ని భరతదేశం వల్లె వేయసాగింది. అరుంధతీసుతుని నిరాశాకాశంలో ఆశాతటిల్లతలు మోసులెత్తినయి. తన చిరకాల దాస్యక్లేశాన్ని విస్మరించినాడు. గబ్బిలం తిరిగి దర్శనమిచ్చింది. ప్రఫుల్లవదనుడై తీయనిస్వాగత మిచ్చినాడు. పండా కాయా అని ప్రశ్నించినాడు. పండైనదని ప్రకృతి ప్రత్యుత్తరమిచ్చింది.’

ఆ ప్రత్యుత్తరం రెండవ గబ్బిలం కావ్యంగా రూపుదిద్దుకుంది. దళితసమస్య పట్ల, అస్పృశ్యతా నివారణ పట్ల గాంధీ చూపిన మార్గంతో జాషువా సంతృప్తి చెందాడని మనకి స్పష్టంగా తెలుస్తున్నది. అలాగని ఆయనకు అప్పటికి అంబేద్కరు గురించి తెలియకపోలేదు. ‘కలడంబేద్కరు నా సహోదరుడు మాకై అష్టకష్టాలకుంబలియై సీమకు వోయి క్రమ్మరిన విద్వాంసుడు..’ అని ఒక పద్యం రాసాడు కూడా. కాని  గాంధి, అంబేద్కరుల మధ్య విభేదం కన్నా, వారి ఆశయాల్లోని ఏకీభావమే ఆయనకు ముఖ్యంగా తోచింది. తర్వాత ఎప్పుడో రాసిన ‘శ్రద్ధాంజలి’ అనే మరొక ఖండకావ్యంలో అంబేద్కరుని ఉద్దేశించి ఇలా అంటున్నాడు:

చటులాస్పృశ్యత కుగ్రరాక్షసికి దంష్ట్రల్‌ రాలి యొక్కింత చెం
గటికేతెంచెడి, నీ అఖండ కృషియున్‌ గాంధీ దయాదృష్టి యొ
క్కట చేకూరుట చేత, లోక హిత దీక్షా దక్ష, నీవిప్పుడె
చ్చటనున్నావు పరిగ్రహింపుము నమస్కారాంజలీ గుచ్ఛముల్‌

అలాగని గబ్బిలం రెండ భాగంలో కవి తాను ఊరటపడి మనల్ని ఊరడిస్తున్నాడని అనుకోకూడదు.  అరుంధతీ సుతుడి భవితవ్యం పట్ల అనుమానాన్ని గబ్బిలం రెండవభాగంలో వ్యక్తపరినంతగా జాషువా మరెక్కడా వ్యక్తం చేయలేదు. అందుకు కారణం, దళితుడి పేదరికం, సామాజిక క్రౌర్యం, అస్పృశ్యతాసమస్యలు మాత్రమే కాదు, ‘ఆత్మభారతాంధ్ర జాతిలోగల అనైకమత్యం, స్వార్థలుబ్ధత, బహుకులమతావేశ వ్యాధిపీడ, కాబట్టనితనం, అవని లోని తీరని వేదనలు’ కూడా ఇప్పుడు కవిని బాధించడం మొదలుపెట్టాయి. గబ్బిలం మొదటి భాగంలో కవిత్వం పట్ల, కవుల పట్ల ఉన్న ప్రేమ స్థానంలో, గబ్బిలం రెండవభాగంలో తీవ్ర చింతాకులత, వేదన వచ్చిచేరాయి. కావ్యానికి రాసుకున్న ముందుమాటలో కొంత ఆశని ప్రకటించాడుగాని, కావ్యంలో ఆ చిన్నపాటి ఆశ కూడా కనిపించదు. కావ్యమంతా, పద్యం వెనక పద్యం ఆయన ఆగ్రహంతో, ఆవేదనతో రగిలిపోతూనే ఉన్నాడు. ఈ పద్యాలు చూడండి:

ఎంత కోయిలపాట వ్యథయయ్యెనో కథా! చిక్కుచీకటి వనసీమలందు
ఎన్ని వెన్నెలవాగులింకిపోయెనో కదా! కటికి కొండలమీద మిటకరించి
ఎన్ని కస్తురిజింకలీడేరెనో కదా! మురికితిన్నెల మీద పరిమళించి
ఎన్ని ముత్తెపురాలు భిన్నమయ్యెనొ కదా! పండిన వెదురు జొంపములలోన

ఎంద గంధవహనమెంత మెంత తంగెటి జున్ను
యెంత రత్నకాంతి యెంత శాంతి
ప్రకృతి గర్భమందు! భగనమైపోయెనో
పుట్టరాని చోట బుట్టుకతన.
కనుపడలేదు దైవతము గాని పదార్థము భారతంబునన్‌
గనుపడలేదు సత్కులము కన్న మహాకళ భారతంబునన్‌
కనుపడలేదు వర్ణమున కన్న పిశాచము భారతంబునన్‌
గనుపడలేదు పంచమునికన్న నీచపు జంతువేదియున్‌

ఈ పరిస్థితిని చక్కదిద్దగలదని భావించిన విద్య కూడా ఈ దారుణవాస్తవం ముందు నిలవలేకపోవడం ఆయన్ని మరింత బాధించింది.

జనులం బీలిచి పిప్పిచేసేడి దురాచారంబులన్‌ గాలమ
ట్టని విద్యాబలమేల? విద్యయన మౌఢ్య వ్యాఘ్రికింపైన భో
జనమా? మోసపు వ్రాతకోతలకు రక్షాబంధమా? యెందుకీ
మనుజత్వంబు నొసంగలేని చదువుల్‌ మైరేయపుం మైకముల్‌

7

ముంటాజమహలు (1943) ప్రధానంగా వర్ణనాత్మక కావ్యం. అందులో కూడా కవి కొత్త కల్పనలు కొన్ని చేయకపోలేదు. కాని ప్రధానంగా ఆ నిర్మాణంలో ‘ఒక పవిత్ర ప్రణయసందేశము, ఒక కళాపోషణదీక్ష, ఒక ఆవేశము, ఒక ఇరుకు. ఒక మూగ సారస్వతము’ ఉన్నట్టుగా కవి భావించి ఆ ‘తేజఃపుంజా’న్ని ఏదో ఒక మేరకు తన పద్యాల్లో పట్టుకోడానికి ప్రయత్నించాడు. ఈ పద్యం చూడండి:

ఏ వన్నెగల తీవెకే పచ్చ సవరింప చెలువారునో దాని చికిలి చేసి
ఏ పుష్పదళమున కే పుష్యరాగంబు సరిపోవునో దాని సంఘటించి
ఏ కిసాలంబున కే కెంపు జోడిరప కొమరారునో దాని కూర్పు చేసి
ఏ గులాబి మొగ్గ కే రవ్వ బొదిగింప నందగించునొ దాని నతుకు బెట్టి

ప్రకృతి సిద్ధమైన వన్నెతో వన్నెకు
చెలిమిగలిపి భావముల నిమిడ్చి
చలువరాతి ఫలకముల దీర్పసాగిరి
చిత్ర చిత్ర గతుల శిల్పివరులు.

‘కాందిశీకుడు’ (1945) పూర్తి కల్పనా కథ. ఒక కాందిశీకుడికీ, ఒక బౌద్ధ భిక్షుని కపాలానికీ మధ్య జరిగిన సంభాషణ కావ్యవస్తువు. ‘నిరపరాధులగు మానవులను నిష్కారణముగా ఆహుతి గొనుచున్న నేటి ప్రపంచ యుద్ధ భీషణ కాలమున శాంత్యహింసల ఔత్కృష్ట్యములను స్థిరీకరించుటయే’ ఆ కావ్యం రచించడంలో తన ఆశయంగా కవి చెప్పుకున్నాడు. కవి తన అంతరంగంలో  ఉప్పొంగుతున్న ఆశనిరాశలన్నింటినీ పద్యాల్లోకి వడగట్టడానికి ప్రయత్నించాడు. తాను జీవిస్తున్న ప్రపంచం, సమాజం ఎలా   ఉండాలని కవి కోరుకుంటున్నాడో కొన్ని పద్యాల్లో గొప్ప నిర్మలత్వంతో ప్రకటించాడు. ఉదాహరణకి ఈ పద్యం చూడండి:

ఎనలేని దుఃఖవహ్నికి ఛాయjైు నట్టి తృష్ణ నెల్లరును హరించుచోటు
నిరపయాకరములై తిరుగు ప్రాణుల మేనుకత్తుల కగ్గము కాని చోటు
ఎల్లజాతులవార లేకోదరులయట్టు ముద్దుముద్దుగ పొంది పొసగు చోటు
వెలితిచే శుష్కించు పేదసాదల డొక్క ముప్పూట లనువుగా పూడు చోటు

ఇంద్రియవిజేతలైన మునీంద్ర కోటి
మానసముబోలి కలతలు లేని చోటు
ప్రేమరసవాహినులు వెల్లి విరియుచోటు
పరమగును, దానికొక స్థలాంతరము లేదు.

నిర్మలమైన ఈ కలనే మరింత విస్తరించి ‘కొత్తలోకం’ (1957) కావ్యంగా రాసాడు. అప్పటికి ఆయనకి  అరవయ్యేళ్ళ వయసుదాటింది. తాను తన జీవితనాటకాన్ని అప్పటికే అరవయ్యేళ్ళుగా చూస్తూ ఉన్నాననీ, అంక పరిమితిలేక యుగయుగాలుగా సాగుతున్న ఆ నాటకంలో ప్రత్యక్షరం, ప్రతి పదం రసభరితమనీ, భావస్ఫోరకమనీ, అన్ని ఘట్టాల్లోనూ హృదయద్రావకాలైన దృశ్యాలున్నాయనీ చెప్తాడు. ఈ కావ్యంలో కూడా నాయకుడు పంచజనుడే. ఇది ప్రధానంగా ఈశ్వరుడికీ, కవికీ మధ్య జరిగిన సంవాదం. ఇక్బాల్‌ మహాకవి రాసిన ‘షిక్వా’, ‘జవాబ్‌ ఇ షిక్వా’ లాంటి కావ్యం ఇది.

ఈ కావ్యాన్ని ఆయన పరలోకగతురాలైన తన అర్థాంగికి అంకితమిచ్చాడు. ఖండకావ్యాల మూడవసంపుటంలో పద్యాలు తన తల్లిని కోల్పోయిన దుఃఖంలోంచి ప్రభవించినవి కాగా, కొత్తలోకంలోని ‘మలికోర్కె’ తన ‘ఆత్మజాయా వియోగం’ నుంచి అంకురించిన పద్యమాలిక. అపారమైన ఈ సంసారదుఃఖానికి కవిత్వం విరుగుడు కాగలదనే ఒక నమ్మకం, అంతలోనే ఒక సంశయం ఈ కావ్యంలో అడుగడుగునా కనిపిస్తుంది.

గానము శిల్పమున్‌, కవిత కష్టములందెగటార్చు సాధనా
లైన దినాలకోసము సహస్ర యుగంబుల నుండి విశ్వమా
శా నయనంబులన్‌ దశదిశల్‌ పరికించుచునున్న దీ జగ
ద్గ్లాని అడంగునా తపితగర్భములందమృతంబు సోకునా

మూడు భాగాలుగా వెలువరించిన ‘నా కథ’ (1962) ప్రధానంగా ఆత్మకథ లాంటిది. కాని అందులో ఎక్కువగా జీవితవివరాలు, సంఘటనలే కనిపిస్తాయి. తక్కినకావ్యాల్లోని దర్శనం, లోతులు ఈ పద్యాల్లో కనిపించవు. మొత్తం మీద కనిపించేది ప్రధానంగా అసంతృప్తి.

ఈదితి వాజ్ఞ్మయాంబుధి నేబదియేడులు సర్వపండితా
మోదముగా రచించితివి ముప్పది కావ్యములిట్టినీవు ని
ర్వేదము కల్గు, ధిఃకృతి లభించెడు దేశములోన నీకు మా
కేది శరణ్యమంచు తలయెత్తక చింతిలె కావ్యకామినుల్‌

8

కాని ఈ నిర్వేదం నుంచి కవి తొందరగానే బయటపడ్డాడు. తన జీవితకాలతపస్సుకి లభించిన వరమా అన్నట్లుగా ఒక మహాకావ్య రచన చేయగలిగాడు. ‘క్రీస్తు చరిత్ర’ (1963) జాషువా గారి కావ్యాలన్నిటిలోనూ తలమానికమైనది. ఆ కావ్యానికి సాహిత్య అకాదెమీ పురస్కారం లభించడంలో ఆశ్చర్యం లేదు.

క్రీస్తు చరిత్రలో ప్రధానంగా మూడు అంశాలున్నాయి. మొదటిది, ఆయన సువార్తల ఆధారంగా క్రీస్తు చరిత్రని ఎంతో శ్రద్ధతో, భక్తితో, వినయంతో తిరిగిచెప్పారు. సువార్తల ఆధారంగా క్రీస్తు జీవితంలోని ఘట్టాలను మాత్రమే కాకుండా క్రీస్తు చెప్పిన కథల్ని కూడా ఆయన ఎంతో కొత్తగానూ, ఎంతో సరళంగానూ చెప్పుకొచ్చారు. తెలుగు బైబిలు భాషపట్ల కొంతమంది వ్యక్తంచేసే  అభ్యంతరాలకు జవాబు చెప్పగల రీతిలో ఆయనొక భాషని ఈ కావ్యంలో తీసుకురాగలిగారు. ‘కళాభిరుచిగల ఆధునిక యువక్రైస్తవ లోకానికి రుచించగల’ కొత్త శైలినీ, కొత్త సౌకుమార్యాన్నీ ఆయన ఈ కావ్యంద్వారా అందించడానికి ప్రయత్నించారు.

రెండవది, ఈ కావ్యంలోని పద్యనిర్మాణంలో ఆయన ఎన్నోచోట్ల కవిత్రయాన్ని తలపించే ఎత్తులకు చేరుకోగలిగారు. కొండమీది ప్రసంగాన్ని ఒక తిక్కన తెలుగు చేస్తే ఎలా ఉంటుందో, ఇందులో జాషువా తెలుగు సేత అలా ఉంటుందని చెప్పడం అతిశయోక్తి కాదు. ఈ పద్యాలు చూడండి:

విమలాత్మార్థము దీన
త్వము దాల్చిన వారిదగును పరలోకము దుః
ఖమునందు వారు ధన్యో
త్తములయి యోదార్పబడుట తథ్యము జుండీ.
ప్రేమించు వారి మరలం
ప్రేమించిన ఫలములేదు, ద్వేషించు నరున్‌
బ్రేమింపుడపుడు మోక్ష
స్వాని సమక్షమున గొప్ప ఫలము లభించున్‌
ఇప్పతిత భూతలికి మీ
రుప్పైయున్నారు సారముండక యుప్పే
చప్పనయియున్న, సారం
బెప్పగిదిం గల్గు దానికీ లోకమునన్‌

మూడవది, చాలా ముఖ్యమైనది. అదేమంటే, తొలినుంచీ జాషువాలో ఈ లోకం పట్ల గొప్ప ఆనందం, ఈ సమాజం పట్ల తీవ్రమైన అసంతృప్తి ఒకదానితో ఒకటి పెనవేసుకునే వున్నాయి. ఎల్లల్లేని సౌందర్యారాధనా, కరడుగట్టిన సామాజిక సంకుచితత్వం పట్ల  దాచుకోలేని నిరసనా ఆయన కవిత్వంలో వర్షిస్తూనే ఉన్నాయి. తనలోని ఈ పరస్పరవిరుద్ధ భావాల్ని ఆయన కొన్ని సార్లు సంవాదరూప కావ్యాలుగా కూడా రచించకపోలేదు. కాని  దయామయుడూ, పతితపావనుడూ అయిన యేసు కథ చెప్తున్నప్పుడు అంతదాకా తన అంతరంగంలో సంఘర్షిస్తూ వస్తున్న ఆ పరస్పరవిరుద్ధ భావాల్ని ఆయన సమన్వయించుకోగలిగాడనీ, తనకై తాను ఒక సమాధానం పొందగలిగాడనీ అనిపిస్తుంది.

సువార్తల్లోని సత్యాన్ని తాను జీవితానుభవంగా మార్చుకోవాలనుకుంటే ముందు తన హృదయం అందుకు తగ్గట్టుగా మారవలసి ఉంటుంది. సహజంగానే ప్రేమమయం, కరుణాపూరితం, ఇతరుల కష్టాన్ని చూసి ఓర్చుకోలేక కన్నీళ్ళు పెట్టే తన హృదయంలో ఎటువంటి విద్వేషానికీ, చివరికి నిరసనకి కూడా తావునివ్వకూడదని కవి భావిస్తున్నాడా అనడానికి నిదర్శనంగా కావ్యం మొత్తం కనిపిస్తుంది. ఈ పద్యం చూడండి:

ఒకచోట మొలకలెత్తెడి
నొకచో నొక్కింత పెరిగియున్నశియించున్‌
ఒకచో పండి ఫలించున్‌
సకల మనుష్యాంతరముల సత్యసువార్తల్‌

సుంకరులకీ, వేశ్యలకీ సాధ్యం కాగల దైవరాజ్యం పరిసయ్యులకీ, సద్దుకయ్యలకీ సాధ్యం కాకపోడానికి కారణం వాళ్ళకి నమ్మకం లేకపోవడమే. ఈ పద్యం చూడండి. దీని మూలభావం సువార్తలోదే అయినప్పటికీ, జాషువా తన నమ్మకంతో దానికి మరింత పదును పెట్టాడనిపిస్తుంది:

సేవాధర్మమె యుత్తమోత్తమమగున్‌, సేవ్యంబు హీనంబగున్‌
దైవాభీష్టమునిద్దియే, యెదిరి పాదంబంటి యెవ్వాడు ప్రే
మావిర్భూత మనస్కుడై, కడిగి ఆత్మానందమున్‌ చెందు నా
సేవా తత్పరుడప్పరాత్పరుని దృష్టిన్‌ దొడ్డవాడయ్యెడిన్‌

తక్కిన కావ్యాల్లో అయితే జాషువా సౌందర్యోపాసకుడు లేదా సామాజిక అసమ్మతికారుడు. కాని క్రీస్తు చరిత్రలో పరిపూర్ణ సత్యకాముడు, శాంతికాముడు.

9

జాషువా వృద్ధుడైపోయాడు, ఆయన కలం కూడా వృద్ధమయింది ఇంక కొత్త కవిత్వం ఏమి రాయగలుగుతాడనే ప్రశ్నకు సమాధానంగా రాసిన కావ్యం ‘ముసాఫరులు’(1963). భారతదేశం మీద చీనా దండయాత్ర నేపథ్యంగా రాసిన ఈ కావ్యంలో కూడా గొప్ప కల్పన ఉంది. పరలోకం నుంచి ఇహలోకానికి పుట్టుకకోసం ప్రయాణమైన ఒక జీవికీ, యుద్ధంలో తన ప్రాణాన్ని త్యాగం చేసి స్వర్గానికి పయనమైన ఒక యోధుడికీ మధ్య జరిగిన సంభాషణ ఈ కావ్యం. జాషువాని మొదటినుంచీ కలతపరుస్తున్న వైరుధ్యాలు  ఈ కావ్యంలో మళ్ళా కనిపిస్తాయి. ఎంతో సుందరమైన లోకం ఒకవైపు:

ఇక్కడి యిండ్లు, వాకిళులు నిక్కడి వాంశిక మోహజాలముల్‌
ఇక్కడికొండలున్నదులు నిక్కడి పున్నమినాటి వెన్నెలల్‌
ఇక్కడి మందవాయువులు నిక్కడి పుష్పవన ప్రదేశముల్‌
మక్కువ పుట్టనీయవనుమానపు స్వార్గిక జీవితంబుపై.

కాని, మరోవైపు, వివక్షతో కునారిల్లుతున్న జగతి:

విశ్వమానవ గోత్రేయ వీరులైన
కవులకున్‌ కర్మబంధంబు కట్టబెట్టి
పులుముచుందురు తలమీద కులము రంగు
తొలగిపోవదు లక్షసబ్బులకు కూడ.

కాని అప్పటికే కవి క్రీస్తు చరిత్రను గానం చేసి ఉన్నాడు కాబట్టి, ఈ కావ్యానికి పతాకవాక్యంగా చెప్పదగ్గ పద్యమొకటి చెప్పాడు:

కోటానుకోట్లు నరులొక
మేటి జగన్మాతృ సుతులు మిత్రులని మందిం
బాటింపు మీ సువార్తన్‌
జాటింపుము జీవితంబు సార్థక్యమగున్‌

ఈ సువార్త జాషువా సువార్త.

10

జాషువా తెలుగు పద్యానికొక కొత్త వన్నెని తీసుకొచ్చాడు. వెన్నలాగే సాగే ఒక లాలిత్యం, ఒక నైగనిగ్యం, గంగా ప్రవాహంలాంటి నిర్మల ధార జాషువా పద్యం సాధించుకుంది. అవే ఆయన్ను తెలుగు ప్రజలకు ప్రీతిపాత్రుణ్ణి చేసాయి. బహుశా బమ్మెరపోతన తర్వాత, తిరుపతి వెంకట కవుల తర్వాత తెలుగు ప్రజల నాలుకల మీద నానగలిగే లక్షణాన్ని జాషువా పద్యమే చూపించగలిగిందని చెప్పవచ్చు.

తన సమకాలిక కవులు పద్యాన్ని వదిలి పెట్టి గేయాన్నీ, వచన కవితనీ స్వీకరించి కవిత్వం చెప్పడం ఆయన వినకపోలేదు. అధునాతన ధోరణులతో తెలుగు కవులు చేస్తున్న ప్రయోగాలు ఆయనకు తెలియకపోలేదు. కాని అటువంటి ప్రయోగపరత్వంలోని అతివాదం ఆయనకు మింగుడుపడలేదు. నిజానికి తెలుగు పద్యం రాయడమేమంత సులువైన విషయం కాదు. ఆయనే ఒక పద్యంలో ఇలా అన్నాడు:

తెలుగు కవిత్వమన్న నొక తెన్నున బోయెడు పద్దు కాదు, ప్రా
సలు గణముల్‌ యతుల్‌ పదము సాగగనీయవు కట్టుబాట్లు సం
కెలలు విదల్చి భావమతికించుట దుర్ఘటమక్కటక్కటా
వలదు విరోధికిన్‌ తెలుగు వాక్కవితల్‌ కడు వేదనా నిధుల్‌

సామాజిక జీవితంలో ఎన్ని కట్టుబాట్లున్నాయో పద్యనిర్మాణంలో కూడా అన్ని ఉన్నాయి. అందులో కొన్ని మంచివి, కొన్ని చెడ్డవి. అయినా ఆయన పద్య వ్యవస్థని తిరస్కరించలేదు. పద్యాన్ని నిర్మించడంలోని కట్టుబాట్లను కొద్దిగా సడలించడం తనకి సమ్మతమేగాని, అంతకు మించి తోకపీకుడు చెయ్యడం తనకి ఇష్టం కాదని ఖండితంగా చెప్పాడొకచోట.

మొత్తము మీద ఆంధ్ర కవిముఖ్యులు పెట్టిన కట్టుబాట్లలో 
నుత్తమ మధ్యమాధమములున్నవి, వానిని కొద్దిగా మరా
మత్తొనరింపనౌననెడు మాటకు నేను సమ్మతింతు, నీ 
బిత్తల తోకపీకుడు కవిత్వపు ఫక్కిననాదరించెదన్‌

జాషువా ఖండకావ్యాల్నీ, కావ్యాల్నీ చదవడంలో గొప్ప సాహిత్యానుభవం ఉంది. ఆ పద్యాలు పైకి చదువుకుంటూ ఉంటే శ్రవణసుభగంగా ఉండే పద్యధార ఒకవైపు, వెన్నలాగా మెత్తగా జారిపోయే తెలుగు పదజాలం మరొకవైపు మనల్ని గొప్పగా అలరిస్తాయి. కాని వాటిని మించి, తన ప్రతి సంతోషాన్నీ, ప్రతి చికాకునీ, ప్రతి కలనీ, ప్రతి కల్పననీ మనతో పంచుకోడానికి ఉవ్విళ్ళూరే ఆ మానవుడు, రక్తమాసాంస్థిగత దేహుడిగా, ప్రేమైక హృదయుడిగా మన పక్కనే నిలబడి మనతో మాట్లాడుతున్నట్టుగా ఉండే, ఆ అనుభవముందే, అది చాలా కొద్దిమంది కవుల దగ్గర మాత్రమే మనకి దొరుకుతుంది.

10-12-2021

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading