సంతోషలవలేశం

రెండురోజుల కిందట ఒక సెకండ్ హాండ్ బుక్ స్టాల్లో Art and Nature: An Illustrated Anthology of Nature Poetry పుస్తకం దొరికింది. న్యూ యార్క్ మెట్రొపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ కోసం కేట్ ఫారెల్ అనే కవయిత్రి చేసిన సంకలనం. రెండు రోజులుగా ఆ కవిత్వంలోనే మునిగితేలుతున్నాను. వసంతకాలపు పూలతావిలాగా, శీతాకాలపు ఎండకాంతిలాగా చల్లగా, వెచ్చగా, నునువెచ్చగా నన్ను సేదతీరుస్తున్న కవిత్వం. అందులోంచి రెండు మూడు కవితలు మీకోసం.

వసంతంలో పూచిన పదివేల పుష్పాలు

వసంతంలో పూచిన పదివేల పుష్పాలు, శారదకౌముది
వేసవిసాయంకాలాల గాలి, మాఘమాసపుమంచు.
వ్యర్థాలోచనల్తో నీ మనసుమీద ఎప్పుడు మబ్బుపట్టదో
అదే నీ జీవితంలోకెల్లా అన్నిటికన్నా గొప్ప ఋతువు.

-వూ మెన్, చీనా కవి (1183-1260)

గొల్లభామా, చిమ్మెటా

పుడమి పాడే పాటకి ఎప్పటికీ మృతి లేదు
వేసవి సూర్యతాపానికి పక్షులన్నీ చల్లని చెట్లలో కునుకుతీసేవేళ
కోతకోసిన కొత్తధాన్యసుగంధం గురించి

ఈ మూలనుంచి ఆ మూలకో పిలుపు పోతుంది
అది గొల్లభామది- వేసవిసంతోషంలో ఆమెదే ముందడుగు
ఆమె ఆహ్లాదకోశానికి తరుగులేదు
ఆడిపాడి అలిసిపోయినప్పుడు
ఏ గడ్డిదుబ్బులోనో ఒద్దిగ్గా ముడుచుకుంటుంది.

పుడమి పాడే పాటకి అంతం లేదు
శీతాకాలపు ఒక ఒంటరి సాయంకాలం
మంచు పరిచిన నిశ్శబ్దం నడుమ
నెగడి పక్కనుంచి వినవస్తుంది
చిమ్మెట కూజితం, క్షణక్షణానికీ మరింత వెచ్చనవుతూ.
మత్తెక్కి కనులరమోడ్చినవేళ
అదెక్కడో గడ్డికొండల్లోంచి గొల్లభామ పాటలాగా వినవస్తుంది.

-జాన్ కీట్స్ (1795-1821)

కొత్తసంవత్సర వేళ , 1981

నా దగ్గరొక సంతోషలవలేశం
పారదర్శకపు రంగులీనే
చిన్ని స్ఫటికం.

అంతకన్నా మరేమీకోరను.

దాన్నింత తుంపి
నీకు పంపిస్తాను.

ఆ ఆశాలవలేశాన్నందుకో
అప్పుడు నా సంతోషలవలేశం కుంచించుకుపోదు.

నీ చిన్ని ఆశని నాతో పంచుకో
అది మరింత పెద్దదవుతుంది.

చూడు, పంచుకుంటేనే
ఆశ రెట్టింపవుతుంది.

నీలిగడ్డిపూలమొక్కలాగా
పంచుకోకపోతే పుయ్యడం మానేస్తుంది
అల్లిబిల్లిగా అల్లుకుపోయిన వేళ్ళు
మట్టిచుట్టిన గడ్డిదుబ్బు
ఊహించలేనంత అనుగ్రహం.

-డెనిస్ లెవర్టవ్ ( జ.1923)

గొప్ప పనులు జరిగేది

గొప్ప పనులు జరిగేది మనుషులూ, కొండలూ కలిసినప్పుడు.
అది వీథుల్లోపడి ఒకరినొకరు తోసుకుంటే కాదు.

-విలియం బ్లేక్ (1757-1827)

15-4-2015

Leave a ReplyCancel reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Exit mobile version
%%footer%%