చీనా చిత్రకళ

c4

చిత్రలేఖనంలో యూరోప్ రీతికి, ప్రాచ్య రీతులకీ, ముఖ్యంగా చీనాచిత్రలేఖనానికీ తేడా ఉందనేది అందరికీ తెలిసిన సంగతే. గత శతాబ్దం మధ్యదాకా కూడా యూరోప్ తన పెర్ స్పెక్టివ్ మాత్రమే సరైనదనీ, తక్కిన దృష్టిక్రమాలు అపసవ్యమనీ అనుకునేది. రినైజాన్సు చిత్రకారులు అలవాటు చేసిన linear Perspective ఒక్కటే సరైన పెర్ స్పెక్టివ్ అనుకునేది. కాని ఇంప్రెషనిస్టు చిత్రకారులనాటికే ఆ నమ్మకం బీటలు వారడం మొదలుపెట్టింది. జపాన్ ప్రింట్ల తరహాలో తాము కూడా కంటితో చూస్తున్నది కాకుండా మనసుతో చూస్తున్నది చిత్రించడం నేర్చుకోవాలని ఆధునిక పాశ్చాత్య చిత్రకారులు తహతహలాడటం మొదలుపెట్టారు.

ప్రపంచ చిత్రలేఖన గతిని మార్చారని చెప్పదగ్గ మహోన్నత ఐరోపీయ చిత్రలేఖకులు చీనా, పారశీక చిత్రకారులముందు వెలవెలబోకుండా ఉండలేరు. ఆఫ్రికన్ ఆదిమ దారుశిల్పాల్ని చూసి పికాసో క్యూబిజం ని మొదలుపెట్టినా ఆఫ్రికన్, ఓషియానిక్ ఆదిమ శిల్పాలు మనలో రేకెత్తించగల స్పందనలు ఆధునిక శిల్పులూ, చిత్రకారులూ ఇంకా సాధించవలసే ఉన్నది.

ఉదాహరణకు ఐరోపీయ చిత్రలేఖనాన్నీ, చీనా చిత్రలేఖనాన్నే తీసుకుందాం. ఐరోపీయ చిత్రకారుడు ఒక ప్రకృతి దృశ్యాన్ని చిత్రించాలనుకుంటే linear Perspective మీద ఆధారపడతాడు. అంటే కంటికి దగ్గరగా కనిపించే చెట్లు పెద్దవిగానూ, దూరంగా ఉండే కొండలు చిన్నవిగానూ చిత్రిస్తాడు. ఇది భ్రాంతి. నిజానికి చెట్లు కొండల కన్నా చిన్నవిగానే ఉంటాయి. కన్ను వాటిని చిన్నవిగా చూసినంతమాత్రాన మనం వాటిని కొండలకన్నా పెద్దవని అనుకోలేం. కాని ఈ భ్రాంతిమీద ఆధారపడితే తప్ప ఐరోపీయ చిత్రకారుడు మనని ఆ చిత్రం వాస్తవికంగా ఉన్నదని నమ్మించలేడు. అందుకని అతడేమంటాడంటే నువ్వెలా చూస్తున్నావో దాన్ని చిత్రించు, ఎలా ఉందనుకుంటావో దాన్ని కాదు అని.

కానీ కళ్ళు మనని భ్రమ పెడుతాయని చీనా చిత్రకారుడికి తెలుసు. అందుకని అతడు linear Perspective లో కాకుండా atmospheric perspective లో చిత్రిస్తాడు. అంటే, ఎదురుగా ఉన్న చెట్లని చిన్నవిగా చిత్రిస్తూ దూరంగా ఉన్న కొండల్ని ఎత్తుగా చిత్రిస్తాడు. అంతేకాదు, ఐరోపీయ చిత్రకారుడికి తాను చిత్రిస్తున్న చిత్రలేఖనంలో focal point ఒకటే ఉండాలి. చిత్రంలోని రంగులూ, రేఖలూ అన్నీ ఆ ఫోకల్ పాయింట్ వైపు దారితీసేవిగా ఉండాలి. చిత్రంలోని తక్కిన రంగులన్నిటికన్నా ఫోకల్ పాయింట్ దగ్గర రంగులు స్ఫుటంగానూ, అత్యంత నాటకీయంగానూ ఉండాలి. కాని చీనా చిత్రకారుడికి ఇటువంటి భ్రమల్లేవు. అతడి చిత్రంలో అసంఖ్యాకమైన ఫోకల్ పాయింట్లు ఉంటాయి. పూర్వకాలపు చీనా చిత్రలేఖనాల ink scrolls కొన్నిమీటర్ల పొడవుంటాయి. మన కాకిపడగలవాళ్ల రామాయణం బొమ్మల్లాగా ఆ చుట్ట విప్పుకుంటూ మనం ఆ బొమ్మని చూస్తూండే కొద్దీ ఆ బొమ్మతో పాటు ఒక ప్రయాణం చెయ్యడం మొదలుపెడతాం.

ఇక అన్నిటికన్నా ముఖ్యం, ఒకే దృశ్యాన్ని ఒక ఐరోపీయ చిత్రకారుడూ, చీనా చిత్రకారుడూ కూడా గీసారనుకోండి, ఆ దృశ్యం రెండు బొమ్మల్లోనూ ఒక్కలానే ఉండదు. ఇ.ఎచ్.గోంబ్రిచ్ తన సుప్రసిద్ధ రచన Art and Illusion లో ఈ విషయాన్నే ఎత్తి చూపి ప్రపంచాన్ని సంభ్రమానికి గురిచేసాడు. ఇంగ్లాండులో ఉన్న ‘డెర్వెంట్ వాటర్’ అనే స్థలాన్ని ఒక ఇంగ్లీషు చిత్రకారుడూ, ఒక చీనా చిత్రకారుడూ గీసిన బొమ్మలు అతడు పక్కపక్కనే పోల్చి చూపించాడు. ఆ బొమ్మలు ఇక్కడ చూడండి.

c2c3

గోంబ్రిచ్ చెప్పేదేమంటే ఇంగ్లీషు చిత్రకారుడి vocabulary వేరు, చీనా చిత్రకారుడిది వేరు అని. ఇద్దరు చిత్రకారులూ తాము చూస్తున్నదాన్ని చిత్రించడం కాకుండా తాము చిత్రిస్తున్నదాన్నే మనకు చూపిస్తున్నారంటాడు. దృశ్యమొకటే, దర్శనాలు వేరు. చీనా చిత్రకారుడు ‘డెర్వెంట్ వాటర్’ ని చీనా నేత్రాల్తో చూస్తున్నాడు.ఉదాహరణకి ఇంగ్లీషు చిత్రంలో చెట్లు పొడుగ్గానూ, కొండలు చిన్నవిగానూ కనిపిస్తే చీనా చిత్రంలో చెట్ల కన్నా కొండలు ఎత్తుగా ఉన్నాయి. ఇంగ్లీషు చిత్రంలో horizontal ఉన్న దృశ్యం చీనా చిత్రంలో diagonal గా మారింది. ఇక అన్నిటికన్నా ఆశ్చర్యపరిచే అంశం, ఇంగ్లీషు చిత్రంలో ఉన్న కొండల ప్రతిబింబాలు చీనా చిత్రలేఖనంలో పూర్తిగా అదృశ్యమైపోయాయి. ఎందుకని?

అందుకు జవాబు చీనా తత్త్వశాస్త్రంలో వెతకవలసి ఉంటుంది. సాంప్రదాయిక చీనా చిత్రకారులు ఒక చిత్రలేఖనంలో రంగులకీ, గీతలకీ ఎంత స్థానం ఇవ్వాలో అంతకన్నా ఎక్కువ స్థానం ఖాళీ స్థలానికి కూడా ఇస్తూ వచ్చారు. ఆ ఖాళీ స్థలం ఆంతరంగిక స్థలం. చిత్రాన్ని చూస్తున్నప్పుడు కన్ను ఆ రేఖలమీంచి తిరుగాడుతూ ఆ శూన్యస్థలంలో ఒకింత ధ్యానానికి లోనవుతుంది. ఆ శూన్య స్థలాన్ని ఇంగ్లీషు నేత్రాలు చూడలేవు. చీనా నేత్రాలు మాత్రమే చూడగలుగుతాయి. ఒక చిత్రలేఖనాన్ని పూర్తిగా రంగుల్తో, రేఖల్తో నింపడం సరైన పద్ధతి కాదని ఏళ్ళమీదట ఇంగ్లీషు చిత్రకారుడు తెలుసుకున్నాడు. కానీ ఆ మెలకువనుంచి అతడు single focal point కి మాత్రమే చేరుకోగలిగాడు. కానీ ఒక చీనాచిత్రకారుడు సుదీర్ఘ పర్వతశ్రేణి, అనంతజలరాశి, అడవులు, గ్రామాలు, నావలు, ఋతువుల్ని చిత్రిస్తూ కూడా అపారమైన శూన్యతని తన చిత్రంలో ఇమిడ్చిపెట్టగలుగుతున్నాడు. దృశ్యాన్ని దర్శనంగా మార్చే విద్య అది.

2-10-2014

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading