పద్యవిద్య

316

అక్టోబర్ 6 వ తేదీ రవీంద్రభారతిలో కవిత్వశాలవారు నిర్వహించే పొయెట్రీ వర్క్ షాప్ మీద పెట్టిన పోస్ట్ మీద వర్ణలేఖగారూ, పారుపల్లి శ్రీధర్ గారూ తమ అభిప్రాయాలు నిస్సంకోచంగా వ్యక్తం చేయడం నాకు సంతోషాన్నిచ్చింది. అయితే వారికి ఈ విషయం మీద కొంత వివరంగా చెప్పాలని ఈ నాలుగు మాటలూ రాస్తున్నాను.

కవిత్వశాల తరఫున యువకవులకోసం ఏదైనా కార్యక్రమం చెయ్యలన్నది మెర్సీగారి ఆలోచన. ఆమెకి కవిత్వం పట్ల ఉన్న దాహం చూస్తుంటే నాకు ముఫ్ఫైయ్యేళ్ళు వెనక్కిపోయినట్టుంటుంది. ఆ రోజుల్లో నాకు శరభయ్యగారూ, సుదర్శనంగారూ, మా సాహితీవేదిక మిత్రులూ తోడుగా ఉన్నారు. ఇప్పటి యువకవులకు కూడా వారి వారి జీవితాల్లో అటువంటి మహనీయమిత్రులూ, గురువులూ ఉండవచ్చు. కాని ఆ రోజుల్లో నేను నా గురువులనుంచీ, మిత్రులనుంచీ పొందిన స్ఫూర్తిని ఇప్పటి యువకవులకు కూడా పంచాలన్న ప్రలోభంతోనే కవిత్వశాలకోసం పనిచేయడానికి సిద్ధపడ్డాను.

ఆ రోజు మేం చెయ్యాలనుకుంటున్నది కవిత్వం ఎలా రాయాలో నేర్పడం కాదు. కవిత్వం ఒకరు నేర్పితే వచ్చేది కాదు. కాని ఒక కవి తనలో పలుకుతున్న కవిత్వానికి అక్షరరూపం ఇవ్వడానికి కొన్ని support systems ఉంటాయి. వాటిని మనం కవులకి అందించవచ్చు. దాన్నే నన్నయ ‘పద్యవిద్య’ అన్నాడు. పద్యవిద్య అంటే మనలో సుళ్ళు తిరిగే కవిత్వోద్రేకానికి ఒక ఆకృతి సంతరించడమెలానో తెలుసుకోవడం. కవిత్వం చెప్పడంలో అంతా హృదయం పాత్రనే కాదు, కొంత బుద్ధి పాత్ర కూడా ఉంది. అందుకనే తొమాసా సెవా అనే జెసూట్ కవి కవిత్వాన్ని a dream dreamed in the presence of reason అన్నాడు.

కబట్టి ఆ రోజు మేం ముందు ఒక కవితనెలా చదవాలో అర్థం చేసుకోవాలో చర్చిద్దామనుకుంటున్నాం. ఆ వర్క్ షాప్ లో ముందు మేమొక ప్రసిద్ధ తెలుగు కవి కవిత తీసుకుని దాన్నెలా సమీపించాలో, చదవాలో, అర్థం చేసుకోవాలో వివరించాలనుకుంటున్నాం. ఆ తరువాత అక్కడ హాజరైన సాహిత్యవిద్యార్థులంతా బృందాలుగా ఏర్పడతారు. సుమారు 10-15 బృందాలు. ఒక్కో బృందానికీ ఒక్కొక్క తెలుగు కవిత ఇస్తారు. ఆ బృందం ఆ కవితను చదివి, చర్చించి, అర్థం చేసుకుంటారు. ఆ తరువాత ఒక గంటపాటు ఆ బృందాలు తాము తమకిచ్చిన కవితల్ని ఎలా అర్థం చేసుకున్నారో తక్కినవారందరికీ వివరిస్తారు. మొత్తం సభ ఆ వివరణ మీద ప్రతిస్పందిస్తారు.

ఈ విధంగా చెయ్యడం వల్ల కవిత్వనిర్మాణానికి సంబంధించిన కొన్ని మెలకువలు బోధపడతాయనీ, తద్వారా కవులు తమ కవిత్వకళని మరింత మెరుగుపర్చుకోగలుగుతారనీ మా ఉద్దేశ్యం.

ఈ ప్రణాళికను మరింత బాగా అమలు చెయ్యడానికి మీరేమైనా చెప్పాలనుకుంటే చెప్పండి.

27-9-2013

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading