
నన్ను ప్రభావితం చేసిన పుస్తకాల గురించి రాసినప్పుడు, అందులో సురా అల్ ఫాతిహా గురించి కూడా ప్రస్తావిస్తూ, మౌలానా అబుల్ కలాం ఆజాద్ భాష్యం గురించి ప్రస్తావించినప్పుడు, ఒకరిద్దరు మిత్రులు ఆ పుస్తకం ఎక్కడ దొరుకుతుందని అడిగారు.
ఆ మొదటి సూక్తంలో, ‘అల్ రహమాన్ అల్ రహీమ్’ అనే విశేషణాల్ని వివరిస్తూ ఆయన రాసిన ‘రహమత్’ అనే అధ్యాయం నుండి రెండు పుటలు (పే.47-49) తెలుగు చేసి మీకందిస్తున్నాను.
అల్ రహ్మాన్, అల్ రహీమ్ : సుమనస్వీ, దయాళువూ
అల్ రహ్మాన్, అల్ రహీమ్ అనే పదాలు ‘రహమత్’ అనే పదం నుంచి పుట్టాయి. మనుషులు ఇతరులపట్ల దయచూపడానికి ఉత్సాహపడతారే, ఆ మనోసౌకుమార్యాన్ని సూచించడానికి వాడే ఆరబిక్ పదం రహమత్. ఆ పదం కలిగించగల స్ఫురణ చాలా విస్తృతమైంది. అందులో ప్రేమ, సహానుభూతీ, సౌమనస్యమూ, ఔదార్యమూ ప్రతి ఒక్కటీ ఇమిడిపోతాయి.
అల్ రహమాన్, అల్ రహీమ్ అనే రెండు పదాలూ కూడా రహమత్ అనే ధాతువునుంచే ఉత్పన్నమైనప్పటికీ, అవి రెండూ రెండు విభిన్న పార్శ్వాల్ని సూచిస్తాయి. అల్ రహమాన్ అంటే రహమత్ ఉన్నవాడని అర్థం. అల్ రహీమ్ అంటే కేవలం రహమత్ కలిగి ఉన్నవాడనే కాకుండా, ఆ రహమత్ ని సదా ప్రకటిస్తూ ఉండేవాడనీ, అతణ్ణుంచే ఈ సృష్టిలోని ప్రతి ఒక్కటీ ప్రతి క్షణమూ భద్రతని పొందుతూ ఉంటున్నదనీ అర్థం.
ఈ రెండు పార్శ్వాల్నీ కలుపుకుని సర్వేశ్వరుడి రహమత్ లోని సమగ్రతను మనకు ఎరుకపరచడమే ఖురాన్ ఉద్దేశ్యం.
‘నా రహమత్ ఈ ప్రపంచంలోని ప్రతి ఒక్కదాన్నీ తనలో పొదువుకునే ఉంది’ (ఖు.7:156)
ఇంతకీ సర్వేశ్వరుడి ఈ రహమత్ అంటే ఏమిటి? ఖురాన్ చెప్పేదేమంటే, జీవితంలో ఎక్కడెక్కడ సౌందర్యం, పరిపూర్ణత కనిపిస్తున్నాయో అదంతా సర్వేశ్వరుడి దయాపరత్వమనే.
ఈ విశ్వంలో వర్ధిల్లుతున్న జీవితాన్ని మనమొకసారి పర్యావలోకించి చూస్తే, మనకి కొట్టొచ్చినట్టు కనబడే విశేషమేమిటంటే, ఈ విశ్వాన్ని ఒక గతి, ఒక వ్యవస్థ నిలబెడుతున్నాయని. ‘నిజామీ రుబూబియత్’. ఈ ఋతం ద్వారానే మనం ప్రకృతికి పరిచయమవుతున్నాం. ఈ గతికి మనం ఏ మాత్రం పరిశీలించి చూసినా కూడా ఈ వ్యవస్థని మించిన మహాసత్యమొకటి సర్వత్రా వ్యాపించి ఉన్నదనీ, పనిచేస్తున్నదనీ, దానిమీదనే ఈ వ్యవస్థ మొత్తం ఆధారపడి ఉన్నదనీ తెలుస్తుంది.
మరి ఈ వ్యవస్థ, ఈ ‘రుబూబియత్’ ప్రయోజనమేమిటి?ఈ విశ్వంలో జీవులకి పోషకంగా ఉండటం. కాని కేవలం ఆ పోషకత్వమే పరమప్రయోజనమని చెప్పడానికి లేదు. అంతకన్నా మించింది మరొకటి ఉంది. ప్రతి ఒక్క అస్తిత్వంలోనూ సౌందర్యోన్మీలనం చెయ్యడమే ఆ పోషకత్వ పరమప్రయోజనం. అట్లా చూసినట్టయితే, ఈ విశ్వసంచాలనం వెనక ఒక మహావ్యూహముందని అర్థమవుతుంది. ఆ వ్యూహంలో, ఆ ప్రణాళికలో ఒక సౌందర్యముంది. దాని నడకలో ఒక సమతూకం ఉంది. దాని చర్యలకి కొన్ని ప్రత్యేక ధర్మాలున్నాయి. దాని దృక్కుల్లో సౌందర్యముంది. దాని స్వరంలో సంగీతముంది. దాని శ్వాసలో సుగంధముంది. తనపై నిర్మించబడ్డ దివ్యభవనం నాలుగుకాలాలపాటు నిలబడటానికి అది చేయనిదంటూ ఏమీ లేదు. జీవితగమనంలో మనకు కనిపించే ‘రుబూబియత్’ కన్నా ఈ ధర్మం గొప్పది. ఈ అంశాన్నే ఖురాన్ ‘రహమత్’ అనే పదం ద్వారా సూచిస్తున్నది. ఇందులో సర్వేశ్వరుడి సౌమనస్యం, దయాపరత్వం రెండూ కలిసే ఉన్నాయి.
విశ్వసంచాలనాన్ని నడిపిస్తున్న వ్యూహం దివ్య సౌమనస్యం తాలూకు ఫలితం: తనేది చేసినా స్థిరంగానూ, నెమ్మదిగానూ ఒక పరిపూర్ణత్వాన్ని సాధించుకునే ప్రజ్ఞనే లేకపోయుంటే ఈ విశ్వయంత్రాగానికి అస్తిత్వమే ఉండేది కాదు. అయితే, ఈ ప్రజ్ఞ ఏమిటి? దీని ప్రయోజనమేమిటి? దీని లక్ష్యం సృష్టించడం, విధ్వంసం కాదు. సమన్వయం, అవ్యవస్థ కాదు. ఎందుకని? తన తెలివితేటలన్నీ ఉపయోగించి మరీ మనిషి ఈ ప్రశ్నకు సమాధానం వెతకడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు, కానీ ప్రయోజనం లేకపోయింది. కాని ఖురాన్ చెప్పే సమాధానమేమిటంటే, ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్న రహమత్ వల్లనే , స్వభావరీత్యా రహమత్ సమన్వయకారకం కావడం వల్లనే ఈ విశ్వాన్నీ, విశ్వంలో వ్యాపించి ఉన్న ప్రతి ఒక్కదాన్నీ నడిపించే వ్యూహమంటూ ఒకటి ఉన్నది. అది నిలబెట్టేదిగా ఉంటున్నది. ఒక నిష్పత్తిలో జీవితమూలద్రవ్యాల్ని సమకూర్చిపెట్టడం లోనే ఆ సంతులనం కనిపిస్తున్నది. ప్రతి అస్తిత్వంలోనూ ఆ సమతూకమే మనకు గోచరిస్తున్నది. ప్రతి ఒక్క వికాసంలోనూ, పరిపూర్ణత దిశగా అది సాధించే ప్రతి ప్రయాణం లోనూ ఆ సమతౌల్యమే కనిపిస్తున్నది. ఈ సంతులనధర్మాన్ని బట్టే ప్రతి ఒక్క సృజనాత్మక కార్యకలాపాన్నీ మనం గుర్తుపట్టగలుగుతున్నాం.
ఈ విశ్వవ్యాపారంలో ఈ సమతౌల్యమూ, సమన్వయమూ ఎందుకుండాలి? పంచభూతాలూ కలిసి ప్రపంచంగా ఏర్పడుతున్నప్పుడు అవి నిర్దిష్ట అనుపాతంలోనే ఎందుకు సమ్మిళితం కావాలి? పదార్థం తనలోని మూలధాతువుల నిష్పత్తిని ఉల్లంఘించకుండా ఎందుకు గౌరవించాలి? ఈ ప్రశ్నముందు మానవపరిజ్ఞానం నోరువెళ్ళబెడుతుంది. కాని ఖురాన్ చెప్పేదేమంటే, ఈ విశ్వ సృష్టికర్త స్వయంగా దయామయుడు కాబట్టి, రహమత్ కలిగినవాడు మాత్రమే కాక, ఆ దయాపరత్వాన్ని ప్రకటిస్తూనే ఉంటాడు కాబట్టి, అటువంటి అభివ్యక్తి తప్పనిసరిగా సుందరంగానూ, అనుగ్రహపూరితంగానూ, సమన్వయసుశోభితంగానూ ఉండకతప్పదు కాబట్టి అని.
ఒక నిర్ధిష్ట ఆకృతినీ, సౌందర్యాన్నీ సంతరించుకోడానికే ప్రకృతి సదా పరితపిస్తూంటూందని తత్త్వశాస్త్రం చెప్తుంది. ఆకృతికి అనుపాతం కావాలి, సౌందర్యానికి సమతౌల్యం కావాలి.ఈ రెండూ కలిసి జీవితాన్ని నియమబద్ధంగా కొనసాగించే సూత్రాన్ని పేనుతుంటాయి. అలా అనుకుంటే, మళ్ళా ఒక ప్రశ్న తలెత్తుతుంది. ఇట్లా నియమబద్ధంగానే ఎందుకుండాలి అని. ఋతమే ఎందుకుండాలి? అనృతం మటుకు ఎందుకుండకూడదు? ఈ ప్రశ్నలకి తత్త్వశాస్త్రం దగ్గర సమాధానాలు లేవు. ఒక ప్రసిద్ధ తత్త్వవేత్త మాటల్లో చెప్పాలంటే ‘ఎందుకు, ఎక్కడ అన్న ప్రశ్నలు తలెత్తగానే తత్త్వశాస్త్రం మూగబోతుంది’. కాని ఖురాన్ దగ్గర ఇందుకు సమాధానముంది. ఈ నియమనిర్బంధం దివ్యానుగ్రహంవల్లనే అని అంటుంది ఖురాన్. తన సృష్టిలో అస్తిత్వాన్ని సంతరించుకునే ప్రతి ఒక్కటీ శివమయంగానూ, సౌందర్యోపేతంగానూ ఉండితీరాలని సర్వేశ్వరుడి నిర్హేతుక కృపావిలాసం భావిస్తూ ఉన్నది కాబట్టి అని.
ఖురాన్ ఇట్లా ప్రశ్నిస్తున్నది:
‘చెప్పు, ఈ భూదిగంతాల్లో ఉన్నదంతా ఏమిటి?
చెప్పు, ఇదంతా సర్వేశ్వరుడిదేననీ. ఆయన తనకి తనే ఒక దయాశాసనం విధించుకున్నాడనిన్నీ.’ (ఖు.6:12)
‘నా దయనే అన్నిట్నీ తనలో పొదువుకుని ఉంది.’ (ఖు.7:156)
29-7-2017
