కవితలు రాసుకునే బల్ల

Reading Time: 3 minutes

32

మరొక సంపుటి యానిస్ రిట్సోస్ Late Into The Night (ఓబెర్లిన్ కాలేజి ప్రెస్, 1995). కవితల్ని అనువదించిన మార్టిన్ మెక్ కిన్సే చిన్నదే అయినా సమగ్రమైన ముందుమాట కూడా రాసాడు.

యానిస్ రిట్సోస్ (1909-1990) ఇరవయ్యవ శతాబ్ది గ్రీకు కవుల్లోనే కాదు, ఐరోపీయ కవుల్లో కూడా ఎంతో ప్రసిద్ధి పొందిన కవి. శక్తిమంతమైన కవిత్వం రాసిన కవులు రాశిలో ఎక్కువ రాయకపోవడం మనకు తెలిసిందే. కాని రిట్సోస్ ఇందుకు మినహాయింపు. అతడి జీవితకాలంలో 93 కవితసంపుటాలు, 3 నాటకాలు, 9 కథాసంపుటాలు, ఒక వ్యాస సంకలనం, 11 అనువాదాలు వెలువరించాడు. తొమ్మిది సార్లు నోబెల్ బహుమతికి ప్రతిపాదించబడ్డాడు, కాని సామ్యవాద కవులు అంతకన్నా ప్రతిష్టాత్మకంగా బావించే లెనిన్ బహుమతి అతణ్ణి వరించింది. అతడామాటే చెప్పాడు కూడా. కానీ, అన్నిట్నీ మించి లూయీ ఆరగాఁ లాంటివాడు ‘రిట్సోస్ మనకాలపు అత్యంత గొప్ప కవి’ అని అనడం అతడు మటుకే పొందిన అత్యంత విలువైన సత్కారం.

అతడంత విస్తారంగా రాయడం వెనక ఎంతో విషాదంతోనూ, అలుపెరగని పోరాటంతోనూ కూడుకున్న జీవితం ఉంది. పుట్టిన మూడు నెలలకే క్షయవ్యాధి తల్లిని కబళించింది. పన్నెండేళ్ళ వయసులో సోదరుణ్ణి కూడా ఆ వ్యాధి మింగేసింది. పదిహేడేళ్ళకి తనకి కూడా ఆ వ్యాధి సోకింది. ఆ యేడాదే తన తండ్రి మతిస్తిమితం తప్పి ఆసుపత్రి పాలయ్యాడు. మరొక పదేళ్ళకి సోదరి కూడా మానసిక సమస్యలతో చికిత్సాలయాన్ని చేరుకుంది.

1927 నుంచి 38 దాకా అతడు టిబి వార్డులమధ్యా, వివిధరకాల ఉద్యోగాల మధ్యా తిరుగుతూ కవిత్వ రచన సాగించాడు. రెండవ ప్రపంచ యుద్ధం మొదలవుతూనే గ్రీకు సోషలిస్టుల గెరిల్లా దళంలో చేరాడు. ’48 నుంచి ’53 మధ్యలో గ్రీసులో సంభవించిన అంతర్యుద్ధ కాలంలో కారాగారాల్లోనూ, కాన్ సెంట్రేషన్ కాంపుల్లోనూ గడిపాడు. ’53 నుంచి ’67 మధ్యకాలంలో కొంత స్వతంత్రం పొందాక, తన సాహిత్యంలో దాదాపు సగం భాగం వెలువరించాడు. తిరిగి మళ్ళా ’67 లో గ్రీసు సైనికపాలనలోకి పోగానే మళ్ళా అరెస్టయ్యాడు. నాలుగేళ్ళ పాటు మళ్ళా చెరసాల, ప్రవాసం, మిలిటరీ హాస్పటళ్ళు.

ఆ తర్వాత మూడేళ్ళు గృహనిర్బంధం. ’74 లో చివరిసారి విడుదలయ్యాక, 1990 లో ఈ లోకాన్ని వీడివెళ్ళేదాకా, కొన్నాళ్ళు ఏథెన్సులోనూ, కొన్నాళ్ళు సమోస్ లోని కార్లొవాసి దగ్గరున్న ఇంట్లోనూ ఉంటూ కవిత్వం రాసాడు. ఈ పుస్తకంలో కవితలు తన చివరి రోజుల్లో కార్లొవాసిలో ఉండగా రాసినవి.

అతడు విస్తారంగా రాయడానికి మరొకకారణం రోజూ పొద్దున్నే లేవగానే తొలివేకువగంట ఏదో ఒకటి రాస్తుండేవాడట, లేదా అందుబాటులో ఏదుంటే దానిమీద బొమ్మలు గీస్తుండేవాడట. అజ్ఞాతవాసంలో, ప్రవాసంలో, ఆసుపత్రుల్లో, కారాగారాల్లో తనని తాను కాపాడుకోడానికి, మతిభ్రమించకుండా మనిషిగా మనడానికి చేసిన ప్రయత్నమది.

1

అపరాహ్ణవేళ తోటల్లో పండగకళ.
చిమ్మెటల కూనిరాగం మధ్య
సముద్రపొడ్డున పూచిన పొదల మీద
పరిచిన రంగురంగు తువ్వాళ్ళ వెనక
నగ్న యువదేహాల సూచన, సూర్యకాంతి
మెరుగుపెట్టిన ఆ కాంస్యవర్ణదేహాలమీద
తళుకులీనే ఉప్పుతునకలు. కాని ఎందుకో
ఆ ఉత్సవంలో నీకు పిలుపు లేదని గ్రహిస్తావు.
ఒక్కడివే కూచుంటావు,
కాంతిసంవత్సరాలదూరం నుంచి
ఏ రహస్య సంకేతాలతోనో
నీ ఏకాంత క్రతువుల్ని వెలిగిస్తూ
నక్షత్రాలు తిరిగి వచ్చే
రాత్రికోసం ఎదురు చూస్తూ.

2

ఇంతదాకానే, ఇంకముందుకి లేదు, ఇంక ముందంటూ లేదు.
ఈ ఊరొచ్చే బస్సు విదేశీ యాత్రీకుల్ని దింపేస్తున్నది
విదేశీ సామగ్రి, విదేశీపరుపుచుట్టలు.
ఒకప్పుడు నీ సామాను కూడా మోసిన
సూట్ కేసు,నువ్విప్పుడు గుర్తుపట్టలేకున్నావు
నీకిష్టమైన నీలంచొక్కా, నువ్వు మొదటిసారి
ప్రేమలోపడ్డప్పటి ఫొటో. అలమారులో పుస్తకాలు
అటు ముఖం తిప్పేసుకున్నాయి. బల్లమీద
తాళ్మ చెవులగుత్తి. అవి ఏ తాళాలు
తెరుస్తాయో నీకక్కర్లేదు..
మాటవరసకి, ఈ చిన్ని వెండితాళం చెవి చూడు
ఆ, అవును, అది ఆ రత్నాలభరిణది
అందులో వజ్రాలు, మరకతాలు, పుష్యరాగాలు,
ఎప్పుడో చాలాకాలం కిందట బావిలో పడిపోయిన
మూడుకెంపుల బంగారు శిలువబొమ్మ,
ఆ బావినంతా వెదికారు, ఊడ్చేసారు,
రాళ్ళుతప్ప మరేమీ దొరకలేదు,
మిగిలిందంతా యవ్వనదేవత పాతాళానికిపట్టుకుపోయిందనుకున్నారు.

3

పాతభయాలతో పోరాడటానికి వారు చెయ్యగలిగిందంతా చేసారు, తలవంచకుండా.
కారాగారం, చిత్రహింసలు, ప్రవాసం.
ఉరితీసేముందు రాత్రి యివోర్గోస్ వాళ్ళమ్మకి రాసాడు
‘అమ్మా ఏడవ్వద్దు, నేను నిర్భయంగా మరణిస్తాను
నా తరఫున కొండల్ని, చెట్లని, పక్షుల్ని పలకరించడం మానకు ‘
అలెక్సీస్ అయితే జైలుగది గోడమీద ఏకంగా
సుత్తీకొడవలి బొమ్మచెక్కేసాడు, కింద సంతకం కూడా.
తక్కినవాళ్ళు ఎక్కుపెట్టిన తుపాకుల ఎదట
పాటలు పాడేరు, నాట్యం చేసేరు. చాలా గొప్పగా.
కాని ఈ భయం-నిశ్శబ్దం, ఊపిరాడనివ్వదు, అదృశ్య శత్రువు.
ఇది నిన్ను శపించదు, తలపడదు, తుపాకి గురిపెట్టదు.
కనిపించకుండా కాచుకుంటుంది. నువ్వు చెయ్యగలిగిందల్లా ప్రశాంతంగా,
కించిత్ గంభీరంగా, నీ చివరిదినం కోసం దుస్తులు సిద్ధం చేసుకోవడం
నల్ల బూట్లు, నల్లటి మేజోళ్ళు, నల్ల దుస్తులు.
కాని కోటుగుండీలో ఎర్ర గులాబి కూడా,
ఆ రోజులు జ్ఞాపకంగా, భయాల్ని జయించిన వాళ్ళ జ్ఞాపకంగా.

4

నువ్వు రోజూ కవితలు రాసుకునే బల్ల
చెదలు తినేసిందితినెయ్యగా మిగిలింది తుపాకితూటాలకు గళ్ళుపడింది.
రాత్రిపూట దాన్లోంచి గాలి పిల్లంగోవి ఊదుతుంది.
ఒక్కొక్కప్పుడు తెలివేకువవేళ
స్వర్గసంగీతదేవత అక్కడికొచ్చి
తన తెల్లచేతిసంచీ బల్లమీద ఉంచుతుంది,
చేతితొడుగులు, గాజులూ కూడా.
అప్పుడు నీ పక్కన మేనువాలుస్తుంది.
నువ్వప్పుడు నిద్రనటిస్తుంటావు,
ఎవరికి తెలుసు, బహుశా నువ్వు నిజంగానే నిద్రపోతుండొచ్చు.

5

ఇళ్ళు నెమ్మదిగా ఖాళీ అవుతున్నాయి, మాటలు కూడా
ఆ బుట్టలో నిన్నటిదాకా కూడా ఆపిల్ పళ్ళుండేవి.
కింద వీథిలో చాకులు సానబెట్టేవాడొచ్చి
పాతచాకులు సానబెడుతుండేవాడు.
ఇప్పుడు
నువ్వు కిటికీలోంచి నీ చెయ్యి బయటికి చాపుతావు,
ఏ మేఘాన్నో నావనో ముందుకుతొయ్యాలని కాదు,
ఊరికే, బయట ఎట్లా ఉందో చూద్దామని అంతే.
మళ్ళీ నీ చెయ్యి వెనక్కి లాక్కున్నప్పుడు
బయటిశూన్యానికి అది కొంకర్లుపోయిఉంటుంది.

6

వెళ్ళిపోయినవాళ్ళు మన కుటుంబంలాంటివాళ్ళు,
వాళ్ళు లేరని మనకి తెలుస్తూంటుంది.
తిరిగివచ్చినవాళ్ళు పూర్తిగా అపరిచితులు,
ఒకప్పుడు వాళ్ళకి కళ్ళద్దాలు లేవు, ఇప్పుడున్నాయి.
వాటివెనక కళ్ళున్నాయని మనకెట్లా నిశ్చయం?
బహుశా వాళ్ళు నిద్రపోతున్నప్పుడు తేల్చుకోవాలి.
బయట హాల్లో తెరిచి ఉన్న వాళ్ళ పెట్టెల్లొంచి
కొత్త  లోదుస్తుల విచిత్రమైన వాసన,
బయట వీథిలో మూసిన దుకాణాలతలుపుసందుల్ని
వెలిగిస్తూ వరదలాగా వాహనాలకాంతి.
ఇంక నీకు అమ్మకాలకీ,కొనుగోళ్ళకీఏదీ మిగలని వేళ
నీముందు దుర్భేద్యంగా పరుచుకున్న అబద్ధాలు.

7

ఇంకా పక్షులున్నాయి, అవి పాడుతున్నాయి కూడా,
చెట్లున్నాయి, అమాయిక సముద్రం కూడా.
ద్రాక్షతీగలు మళ్ళా చిగురించాయి, ఆలివ్ చెట్లు
కొమ్మల్తో విప్పారేయి. గాలంతా,
దుక్కిదున్నినేల చిక్కటిసువాసన. కొండలే రంగు
తిరిగాయో చూస్తావు-దాదాపు నీలం.
పక్షులకి జవాబివ్వాలనుకుంటావు, కాని నోరుపెగలదు.నీ చూపులు
మళ్ళా మళ్ళేది ఆ నేలవైపే, అక్కడది ఎదురుచూస్తున్నది,
కొత్త మొలకలకోసం, గులాబిపొదలకోసం, మృతులకోసం.

8

వెనక్కి పోగలిగితే,
బహుశా కనబడవచ్చు.
పాతతోటలో,
పాటపాడుతూ పిచుక.

9

రంగురంగుల సాయంకాలాలకు సెలవు.. సామాన్లు
సర్దుకోవలసిన వేళ, మూడుపెట్టెల పుస్తకాలు, కాగితాలు, చొక్కాలు..
వేసుకున్నప్పుడల్లా చాలా బాగా కనిపిస్తావు, ఆగులాబిరంగు
చొక్కా మర్చిపోకు, ఈ శీతాకాలం నువ్వు వేసుకోకపోయినా.
ఈ లోగా ఆషాఢశ్రావణాల్లో రాసిన ఆ కవిత్వాన్ని
మరోసారి సరిచూసుకుంటాను, కొత్తగా చేర్చడానికేమీ
ఉండకపోవచ్చు, నిజానికి తొలగించేదే ఎక్కువ ఉండవచ్చు.
ఆ పదసందోహం మధ్య మిలమిలమెరిసే ఒకింత అనుమానం,
ఈ వేసవి, ఈ చిమ్మెటలు, చెట్లు, సముద్రం, సంధ్యవేళ
కూతపెట్టుకుంటూపోయే పడవలు, మేడమీద వెన్నెలనీడలో
కువకువలాడే చిలుకలు, కరుణార్ద్రభరితమైన ఈ వేసవి,
బహుశా ఈ జీవితానికిదే చివరి వేసవని ఒకింత అనుమానం.

9-1-2016

Leave a Reply

%d bloggers like this: