ప్రేమగోష్ఠి-2

'ఒక సంపూర్ణమానవుడు తాకితేచాలు ఒక బోలుమనిషిలోకి వివేకం ప్రవేశించేమాట నిజంగా నిజమైతే ఎంతబాగుణ్ణు' అన్నాడు సోక్రటీస్, అగధాన్ కోరుకున్నట్టే అతడి పక్కన కూచుంటో. 'నిండుకలశంలోంచి ఖాళీపాత్రలోకి నీళ్ళు వడగట్టినట్టు, అలా వివేకం ప్రవహించే మాటనే నిజమైతే, నీ పక్కన కూచునే అదృష్టానికి నేనెంత సంతోషిస్తానని!'

ఇంతకీ విద్య మంచిదేనా?

మనిషి పుట్టుకతోటే విద్యావంతుడు. కాని ఆ విద్య అతడి మనసులో మరుగునపడిపోయి ఉంటుంది. గురువు చెయ్యవలసిన పని ఆ స్మృతిని మేల్కొల్పడం. గురువూ, శిష్యుడూ నిరంతరం వివేకరక్తులుగా సంభాషిస్తూ, సంభాషిస్తూ ఉండగా, ఒకనాటికి, ఒక హఠాత్ క్షణాన, ఆ స్మృతి నిప్పురవ్వలాగా విద్యార్థిలో మేల్కొంటుంది.

ఏది విద్య?

ప్రాచీన గ్రీకులకి ఈ సంగతి తెలుసు. వాళ్ళు చదువునీ, విద్యనీ రెండు అంతస్థుల్లో చూసారు. చదువు అంటే- పఠన, లేఖన, గణన సామర్థ్యాలు పాఠశాలలో అందుతాయనీ. కాని విలువలు, సంబంధాలు, నడవడిక నగరంలో నేర్చుకోవలసి ఉంటుందనీ.