ఒక విపత్తు, కుటుంబాలకు గానీ, సమాజాలకు గానీ, సంభవించాక, అది నేర్పే పాఠాలు మన జాతిస్మృతిలో, సమాజస్మృతిలో భాగం కావాలి. అంటే విపత్తు విద్యగా మారాలి. ఆ పాఠాలు ఎంత క్రూరంగానైనా ఉండనివ్వు. కాని ఆ అనుభవాలు పాఠాలుగా మారకపోతే, మళ్ళా అలాంటి పరిస్థితులే సంభవించినప్పుడు, మనుషులు మళ్ళా అంతే క్రూరంగా ప్రవర్తిస్తారు.
గురువు ఒక థెరపిస్టు
ఆన్ లైన్లూ, డిజిటల్ పరికరాలూ, పుస్తకాలూ, వర్కు బుక్కులూ ఒక ఉపాధ్యాయుడికి ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాలేవని కరోనా మనకి పూర్తిగా రుజువు చేసింది. నువ్వేమీ చెయ్యకపోయినా పర్వాలేదు. పిల్లవాడూ, నువ్వూ తరగతిగదిలో ఒకరినొకరు చూసుకుంటూ ఉన్నా కూడా అదే గొప్ప అభ్యసన కార్యక్రమం.