రెండు సమీక్షలు

ఎ. రవీంద్రబాబు సీనియర్ పాత్రికేయులు, కథకులు, సాహిత్యవేత్త. ఆయన నా పుస్తకాలు అయిదింటిపైన చేసిన సమీక్షల్ని ఇక్కడ మీతో పంచుకుంటున్నాను.


ప్రపంచ మానవ జీవన చిత్రణ

ప్రపంచ కథా సాహిత్యంలో తనను ప్రభావితం చేసిన ఇరవై కథలను ‘నన్ను వెన్నాడే కథలు’గా మన ముందుకు తెచ్చారు చిన వీరభద్రుడు. ఇందులో ప్రతీ కథా వస్తు, శిల్పాలపరంగా వైవిధ్యంతో అక్కడి సమాజాన్ని, సంస్కృతిని, మూలాల్ని, వాతావరణాన్ని పరిచయం చేస్తుంది. మనిషి స్వభావాన్ని మంచు బిందువులా తాకి చూపిస్తుంది. కమలేశ్వర్ ‘వేసవికాలం’ స్వాతంత్య్రానంతర స్థితికి అద్దం పడుతూ, ఔషధాలయంలో అవసరాల కోసం మాట్లాడే మనుషుల లోగుట్టును తెలియజేస్తుంది. చెహోవ్ ‘కుక్కను వెంటబెట్టుకున్న మహిళ’ నిజమైన ప్రేమకు వయస్సు, పరిస్థితులు, కుటుంబం అడ్డుకాదని చెప్తూ, ఆది అంతం లేని కథనంతో నడుస్తుంది. టాల్‌స్టాయ్ ‘కోడిగుడ్డంత గోధుమగింజ’ చిన్నపిల్లల కథలా అనిపించినా, చారిత్రక భౌతికవాద దృష్టితో శ్రమైక జీవన గొప్పదనాన్ని చెప్తుంది. కాఫ్కా ‘తీర్పు’ తండ్రీ కొడుకుల సంఘర్షణల్లోంచి కొడుకు మనసులోతుల్ని తవ్వి తీస్తుంది. మేరీ లూయీ కాష్నిట్జ్ ‘దుక్కపిల్ల’ శారీరక ఆకృతిపై పెద్దలు చూపే వివక్షను ఎండగడుతుంది. ఇంకా మాక్సిం గోర్కీ ‘మానవుని జననం’, మపాసా ‘బెడ్ నెంబరు 29’, ఓ హెన్రీ ‘పూర్తికాని కథ’, ప్రేమ్‌చంద్ ‘సాల్టు యినస్పెక్టరు’ వంటివి మనసును మెలిపెట్టి చదివిస్తాయి. కొత్త, పాతతరం రచయితలతోపాటు విమర్శకులూ తప్పక చదవాల్సిన కథలివి.


సారస్వత తాత్త్వికాంశాల సమాహారం

వాడ్రేవు చినవీరభద్రుడు కవి, విమర్శకుడు, అనువాదకుడు… సమాజాన్ని, చరిత్రని తనదైన భావనాత్మక ధోరణిలో అన్వేషిస్తున్న తాత్వికుడు. వీరు ఇటీవల వెలువరించిన అరుదైన పుస్తకాలివి. కథ ఎలా పుట్టింది? ఎక్కడ పుట్టింది? సమాజ పరిణామంలో కథా రూపాల ప్రాతినిధ్యం ఎలా సాగింది? కథాశిల్పం ప్రాధాన్యత ఎంతవరకు? అనే ప్రశ్నలకు సమాధానాలను సంక్షిప్తంగా, సూటిగా వివరిస్తుంది ‘కథలు ఎలా పుట్టాయి’. చీకటి ప్రపంచాన్ని మేల్కొలిపిన వాళ్లు కొందరు. జాతి విముక్తికై పోరాడిన వాళ్లు ఇంకొందరు. సాహిత్యాన్నే అస్త్రంగా పోరు సల్పిన వాళ్లు మరికొందరు. గూగి వా థియోంగో, అబ్దుల్ కలాం, బాబా ఆమ్టే, నేతాజీ, మహా శ్వేతాదేవి, యు.వి. స్వామినాథ అయ్యరు, నెక్కంటి సుబ్బారావు వంటి ఎందరో ఆదర్శమూర్తుల గురించి లోతైన, స్ఫూర్తిదాయకమైన వ్యాసాల సమాహారం ‘ఉదారచరితులు’. ప్లేటో ‘సింపోజియం’కు అనువాదం ‘ప్రేమగోష్ఠి’. ఏథెన్స్‌లో సత్యాన్వేషకుల మధ్య ప్రేమ గురించి జరిగిన తాత్విక సంభాషణల చర్చ ఇది. జీవిత పరమార్థానికి సూక్ష్మ వ్యాఖ్యానం లాంటిది. ఇక ‘ఆ బంభరనాదం’ భద్రుడు చదివిన పుస్తకాలు, కలిసిన వ్యక్తులు, చేసిన ప్రయాణాలు, సాహిత్యం, సాహిత్యకారులపై వారి అభిప్రాయాలను వెల్లడించే వ్యాస సంపుటి. ఎన్నో అంశాలను, ఎందరో వ్యక్తుల గురించి తెలియజేస్తుంది. తప్పక చదవాల్సిన పుస్తకాలివి.

8-9-2026

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading