ప్రియమైన శాఫో-11

ప్రియమైన శాఫో

చూస్తూండగానే వైశాఖంలో కృష్ణపక్షం ప్రవేశించింది. వసంతం వచ్చినంతసేపు పట్టలేదు, అప్పుడే వెళ్ళిపోడానికి సిద్ధమవుతున్నది. లోకమంతా అగ్నిగుండంలాగా మారిన రోజుల్లో ఇంకా వసంతం గురించి తలుచుకునేవాణ్ణి వెర్రివాణ్ణి చూసినట్టు చూస్తారు. చెట్లు చిగురించడం, కోకిల పాడటం, పూలల్లో తేనెలూరడం లాంటివాటి గురించే మాట్లాడుతుండే  నాలాంటి వాణ్ణి లోకం పట్టనివాడిగా ముద్రవెయ్యడం సులభం.

ఏం చెయ్యను! నాకిక్కడ ఈ మహానగరంలో రోజూ కోకిల పాట ఒక్కటే వినబడుతుంది. ఇదుగో, ఇప్పుడు, ఇంత ఎండవేళ కూడా, ఎక్కణ్ణుంచో కోకిల ఆకాశం తలుపులు తెరిచి మూస్తూనే ఉంటుంది. ఇరవయ్యేళ్ళ కింద, పదేళ్ళ కింద, అంతదాకా ఎందుకు, ఏడాది కిందట నా జీవితంలో నాకు దగ్గరగా వచ్చినవాళ్ళెవరూ ఇప్పుడు నాకు దగ్గరగా లేరు. కాని ఇన్నేళ్ళుగానూ, ఈ ఋతువు రాగానే, ఎక్కణ్ణుంచి వస్తుందో, క్రమం తప్పకుండా వచ్చి నన్ను పలకరించి వెళ్తున్నది కోకిల ఒక్కతే. అందుకనే వసంతమంటే నాకిష్టం. చిన్నప్పుడు వేసవి సెలవులనగానే ఇంటికి చుట్టాలొచ్చేవారు. ఒక్క మా ఇంటికే కాదు, మా ఇరుగింటికీ, పొరుగింటికీ కూడా. కానీ ఇప్పుడు నా ఇంటికొచ్చే చుట్టాలెవరూ లేరు. ఎవరో ఒకరు రావాలన్న ఎదురుచూపూ లేదు. కాని ఒక్క కోకిల రావడంతో నా ఇంటివాకిలిని  విశ్వపు చివరి అంచుదాకా సాగదీసినట్టనిపిస్తుంది.

ఇదొక చిత్రమైన అవస్థ. నువ్వు నానాటికీ మరింత ఒంటరిగా మిగిలిపోతుంటావు. కానీ, ఆకాశమూ, తారకలూ, కోకిలా, ఎప్పటివో జ్ఞపకాలూ, ఎవరో ఎప్పుడో పాడిన పాట, రాసిన కవిత, తలుచుకున్న మాటలు- మన ఒంటరితనాన్ని బద్దలుకొడుతుంటాయి. నువ్వు ఒంటరివి కావు, మేమంతా ఉన్నామని చెప్తుంటాయి. అంటే ఒక తలంలో, ఒక ప్రపంచంలో మనం ఒంటరి. అదే సమయంలో, మరో తలంలో, మరొక మనోజ్ఞలోకంలో మనమొక రసబృందం.

అందుకని ఇదుగో, నీ కవిత్వంలో ఈ నాలుగు పంక్తులూ, నేను మొదటిసారి చదివినప్పుడే, నాకెంతో సన్నిహితంగా అనిపించాయి. Framgment 168 B గా గుర్తుపెట్టుకున్న శకలం:

కొందరిది నీ కవిత కాదంటారు. అలాగని ఎవరూ దీన్ని తలచుకోకుండా ఉండలేరు. ఈ కవిత నీదికాంటూనే, తమ సంకలనాల్లో ఈ నాలుగు వాక్యాలూ చేర్చకుండా ఉండలేరు. కాని నాకైతే, ఈ నాలుగు పంక్తుల్లోనూ, ప్రతి ఒక్క పదచిత్రంపైనా నీ ముద్ర అచ్చొత్తి మరీ కనిపిస్తోంది. ఈ ఒక్క చరణం, ఆద్యంతాలు తెలియని, ఈ చిన్ని శకలంలో- నువ్వున్నావు, భూమి ఉంది, ఆకాశం ఉంది, అస్తమిస్తున్నా, చంద్రతారకలూ అక్కడే ఉన్నాయి, తరలిపోతున్నా కాలం కూడా అక్కడే తాత్సారం చేస్తూ నిలబడి ఉంది.

ఎంత చిత్రమైన వాక్యశకలమిది! ‘నేనొక్కతనే’ అని అంటూనే నువ్వెంతమందిని ఈ వాక్యం దగ్గరికి రప్పించుకున్నావో కదా. ఎన్ని యుగాలు గడిచిపోయాయి, కాని నువ్వట్లానే ఉన్నావు, ఒక గ్రీకు పానపాత్రమీద చిత్రించిన యువతిలాగా, యాపిల్ కొమ్మన పండిన పండులాగా, నిత్యయవ్వనిగా, జరామరణాలకు అతీతంగా, కాలాన్ని దాటి నువ్వక్కడే ఉన్నావు. ఈ వాక్యం చదువుకుని నిన్ను తలుచుకున్నవాళ్ళు గతించిపోతూండవచ్చు. కాని నువ్వక్కడే ఉన్నావు, ఘనీభవించిన పరిమళంలాగా, ఎన్నటికీ కొడిగట్టని దీపకళికలాగా, ఎప్పటికీ చెరిగిపోని సంతకంలాగా.

నిజమే ఇందులో ఒంటరితనముంది. చిక్కనైన ఒంటరితనం. శుక్ల పక్షపు రాత్రి అయి ఉంటుంది. నడిరాత్రికే చంద్రుడు అస్తమించాడంటే సప్తమినుంచి దశమి మధ్యలో ఎప్పుడో ఒక రోజై ఉంటుంది. అది వేసవి అనుకుందామా అంటే ఈ కవితలో కనిపిస్తున్న కృత్తికల్నిబట్టి, నీ కాలంలో, అది శరద్రాత్రి కావొచ్చేమో అనిపిస్తోంది. కాబట్టి శరత్కాలపు ఒక వెన్నెల రాత్రి, నీ వంటి భావుకురాలు, విదుషి, వైణికురాలు ఒంటరిగా ఉండవలసి వచ్చిందంటే, అందులో ఎంత వేదన ఉందో ఊహించగలుగుతున్నాను. అది మైటిలెని అయి ఉండే, నీ శిష్యులో, స్నేహితులో ఎవరో ఒకరు నీ పక్కన ఉండి ఉండేవారు. లేదా నువ్వే ఎవరో ఒక సఖిని పిలిచి, ఆ తంత్రీవాద్యం అందుకో, ఈ మధురగీతాన్ని ఆలపించు అని ఉండేదానివి. కాని అది నువ్వు ప్రవాసంలో ఉన్నప్పటి శారదరాత్రి అయి ఉంటుంది కాబట్టే చంద్రుడూ, కృత్తికలూ, కాలమూ కూడా తరలిపోతున్నా, నువ్వొక్కతవే నీ ఒంటరితనంలో మునిగిపోయి ఉన్నావు.

అది ఒక స్త్రీ ఒంటరితనం అనుకోవడం కన్నా, ఒక కవి ఒంటరితనం అనుకోవడం నాకెందుకనో మధురంగా తోస్తున్నది. ఇదుగో, నా ముందు లీ చింగ్ ఝావో (1084-1155) కవిత్వం ఉంది. ఆమె కూడా నీకులానే కవి, భావుకురాలు. నీ కవిత్వం లానే ఆమె కవిత్వం కూడా, కఠినమైన కాలం పిడికిలి నుంచి బయటపడ్డది, చాలా స్వల్పం. కొన్ని పూర్తి కవితలూ, గీతాలూ లేకపోలేదు. కానీ, నీకులానే, ఆమె కవిత్వంలో కూడా శకలాలుగా మిగిలిపోయినవీ  తక్కువేమీ కాదు.

ఇప్పుడిప్పుడే ఆమెని ప్రాచీన చీనా కవిత్వంలో సర్వోత్తమ కవయిత్రిగా గుర్తుపడుతున్నారు. ఆమె కవిత్వానికి కొత్త కొత్త అనువాదాలు వెలువడుతున్నాయి. అటువంటివాటిల్లో ఇప్పుడే కొత్తగా వెలువడ్డ పుస్తకం The Magpie oat Night (2025) నా చేతుల్లోకి వచ్చింది. ఆశ్చర్యం కదూ. ఈ వసంతం నేను ఒంటరిగా ఉన్నాననుకుంటూ ఉంటే ముందు కోకిల వచ్చింది. తర్వాత నువ్వు నా తలపుల్లో ప్రవేశించావు. ఇప్పుడు లీ చింగ్ ఝావో మన మధ్య అడుగుపెట్టింది.

పదేళ్ళ కిందట మొదటిసారి ఆమె కవిత్వం చదివినప్పుడు, నాకు ప్రాచీన చీనాభాషలో, కృష్ణశాస్త్రిని చదివినట్టనిపించింది. ‘తీయతేనియ బరువు మోయలేదీ బతుకు ‘అంటూ ‘తొగయు నా యెదకేల తగని సౌఖ్యజ్వాల’ అన్నట్టుగా ఆమె పాడుతున్నదనిపించింది. చివరికి ఎంకిలాగా ‘ఒక్కతెను, నాకేల ఓపజాలని సుకము’ అని జాలిగా, గోముగా, మూగగా ‘ ఈ రేయి నన్నొల్ల నేరవా రాజా’ అని లోగుంతుతో పాడుకుంటున్నట్టనిపించింది. ఇప్పుడు మళ్ళా ఈ పుస్తకమంతా అదే మధుర విషాదవేదన.

 లీ జింగ్ ఝావో ఉత్తర చీనాలో ఒక కులీన విద్వత్కుటుంబంలో పుట్టింది. చిన్న్నప్పణ్ణుంచీ కవిత్వం, సంగీతం ఆహారంగా పెరిగింది. ఆమెకి లభించిన భర్తకూడా ఆమెలానే భావుకుడు, రసజ్ఞుడు, కళాప్రేమికుడు, కవి. వాళ్ళు రాత్రంతా కవిత్వం చెప్పుకుంటూ గడిపేవారు. ఒకరొక కవిత చెప్పి అది ఏ పూర్వకవిదో చెప్పమని రెండోవారికి పరీక్ష పెట్టేవారు. ఆ పరీక్షలో నెగ్గకపోతే, అతడో, ఆమెనో స్వయంగా తేనీరు కలిపి ఇవ్వాలి. కాని ఆ తేనీటిపాత్ర అలా చేతుల్లో ఉండగానే, ఆ కవిత్వకేళి కలిగించిన ఉల్లాసానికి వాళ్ళకి తెరలుతెరలుగా నవ్వొచ్చేసేది. ఆ తేనీరట్లానే దుస్తులనిండా చిందిపడేది అని రాసుకుందామే తన జ్ఞాపకాల్లో. కానీ జీవితమంతా ఇలానే గడిస్తే ఇంక కథ ఎక్కడ? కవిత్వమెక్కడ?

వాళ్ళ రాజ్యం మీద ఉత్తరాది దండయాత్రలు మొదలయ్యాయి. తమ మీద వచ్చిపడుతున్న మూకలతో పోరాడే బదులు దక్షిణచైనాకి తరలిపోదామన్నాడు వాళ్ళ చక్రవర్తి. దాంతో లీ చింగ్ ఝావో కుటుంబం కూడా దక్షిణ చైనాకి పారిపోవలసి వచ్చింది. తమ ఇల్లు, తోటలు, సేకరించిన కళాఖండాలు, వాటన్నిటితో పాటు, ఆనందకరమైన ఆ రోజుల్ని కూడా అక్కడే వదిలిపెట్టి దక్షిణ సోంగ్ రాజ్యానికి తరలివచ్చారు. అక్కడేనా సంతోషంగా గడిపేరా అనుకుంటే, ఇంతలోనే ఆమె భర్త రాజాజ్ఞ మీద మళ్ళా దూరప్రయాణానికి బయలుదేరాడు. అలా పయనమైనవాడు తిరిగి రాలేదు. మార్గమధ్యంలోనే అస్వస్థుడై తనువు చాలించాడు. లీ చింగ్ ఝావో ఒంటరిదైపోయింది.

ఒంటరితనమంటే అది. నీ ప్రమేయం లేకుండానే రాజకీయ శక్తులు నిన్నెట్లా మైటైలెని నుంచి సిరాక్యూజ్ కు తరిమేదాకా విశ్రమించలేదో ఆమెని అట్లానే ఉత్తరచైనానుంచి దక్షిణ చైనాకు తరిమేడాకా, పొదరిల్లు లాంటి ఆ కవిత్వ కులాయాన్ని కూలచేస్తే తప్ప కాలం శమించలేదు.  అప్పటికే అదొక దుఃఖం, ప్రవాసం. ఇప్పుడు దానికి తోడు తన సహచరుడి నిష్క్రమణ. అటువంటి దుఃఖాగ్ని తనని దహిస్తూ ఉండగా ఆమె పాటలు కట్టింది, పద్యాలు రాసింది. అంతే కాదు.  ఆనాటి చీనాలో ఊహించలేని విషయం, ఆమె రాజు నిర్ణయాల్ని తప్పుపడుతూ వ్యాసాలు కూడా రాసింది.

ఇప్పుడు ఈ కొత్త పుస్తకం ద్వారా ఆమె కవిత్వాన్ని మాకు అందిస్తున్న Wendy Chen లీ చింగ్ ఝావో జీవిత విశేషాల్తో చక్కని ముందుమాట రాసారు. ఆ కవితల్ని వీలైనంత హృద్యంగా, అపూర్వంగా ఇంగ్లిషులోకి తీసుకురాడానికి ప్రయత్నించారు. ఆ కవితలన్నీ ఒకసారి చదివేసాను. ఇప్పుడు మళ్ళా నెమ్మదిగా ఒక్కొక్క వాక్యాన్నే పట్టుకుని ఆ ప్రాచీన భగ్నప్రణయసీమలో నెమ్మదిగా సంచరించడం మొదలుపెడతాను. కానీ, ఇప్పటికైతే, నీతో పంచుకోడానికి ఈ కవితనెంచాను:

ఈ కవిత చదివితే నీకేమనిపిస్తోంది? అదే చంద్రుడు, అదే రాత్రి, కానీ ఇంకెంతమాత్రం ఆ పూర్వపు శాఫోవి కావనే కదా. నాకూ అదే అనిపిస్తోంది, అదే వేసవి, అదే కోకిల, కాని ఇప్పటి నేనుకీ,  అప్పటి నేనుకీ మధ్య యోజనాల దూరముంది.


Featured image photography courtesy: Reynaldo #brigworkz Brigantty via pexels.com

4-5-2026

4 Replies to “ప్రియమైన శాఫో-11”

  1. లీ చింగ్ ఝావో కవిత్వమూ,
    శాఫో కవితా శకలమూ!
    మీ వసంత కోకిల!!
    Beautiful post, sir! 🙏🏽

    “ నాకిక్కడ ఈ మహానగరంలో రోజూ కోకిల పాట ఒక్కటే వినబడుతుంది” 🙏🏽

  2. అస్తమిస్తున్న చంద్రుడు
    కృత్తికలు కూడా, నడి
    రాత్రి, తరలిపోతున్న కాలం
    ఇక్కడ శయనిస్తూ నేనొక్కతనే.

    “ఈ నాలుగు పంక్తుల్లోనూ, ప్రతి ఒక్క పదచిత్రంపైనా నీ ముద్ర అచ్చొత్తి మరీ కనిపిస్తోంది. ఈ ఒక్క చరణం, ఆద్యంతాలు తెలియని, ఈ చిన్ని శకలంలో- నువ్వున్నావు, భూమి ఉంది, ఆకాశం ఉంది, అస్తమిస్తున్నా, చంద్రతారకలూ అక్కడే ఉన్నాయి, తరలిపోతున్నా కాలం కూడా అక్కడే తాత్సారం చేస్తూ నిలబడి ఉంది”

    మీరు చెప్పినట్టు.. ఈ Framgment 168 B నిజంగా భావకవులు కవితలల్లడానికి భలే సరంజామా. మీరు కృష్ణశాస్త్రి, నండూరి లను మాత్రమే తలుచుకున్నారు. నాకు మీరు కోకిల పాట గురించి రాసిన ఉపోద్ఘాతం, ముగింపు వాక్యాలు చదువుతుంటే బసవరాజు అప్పారావు గారి ఈ కోకిల గీతమే పదే పదే గుర్తొచ్చింది. కృష్ణశాస్త్రి గారు కూడా తన అప్పుడు పుట్టి ఉంటే వ్యాస సంకలనంలో బసవరాజు గురించి రాస్తూ
    “సుబ్బారావు పాట నిభృత సుందరం.. అప్పారావు పాట నిసర్గ మనోహరం” అన్నారు. ఈ శాఫో శకలం బట్టి ఆ మొత్తం కవిత లభించవుంటే , దానిని కృష్ణశాస్త్రి గారు చదివి ఉంటే ఏమనే వారో మీలాంటి వాళ్ళే ఊహించి చెప్పాలి.

    ఈ పోస్టు ద్వారా చింగ్ ఝావో గురించి , ఆమె కొత్త అనువాదం The Magpie oat Night (2025) పుస్తకం గురించి మాకు తెలిపినందుకు ధన్యవాదాలు భద్రుడు గారు.

    1. నిజమే. బసవరాజు అప్పారావు గారు కూడా గుర్తు రావాలి. అందుకే అనిపిస్తూ ఉంటుంది మీ అనుభూతి ప్రపంచం ఎంతో విశాలమని.

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading