ప్రియమైన శాఫో-7

ప్రియమైన శాఫో

ఇప్పుడు నా ముందున్నవి నీ కవిత్వ శకలాలు. చిన్ని చిన్ని తునకలు. అయితేనేం, వాటితోనే నిన్ను నా మనసులో రూపుకట్టుకోవాలని ప్రయత్నిస్తున్నాను. వాటిలో ఏ ఒక్కదాన్ని తీసుకున్నా చుట్టూ అంతులేని ఖాళీ. ముందూ వెనకా పేజీలు చిరిగిపోయిన ఒక జీవితకథ. అయితేనేం, ఆ ఖాళీల్ని నా అనుభూతితో నింపుకుంటాను. నీ కవిత్వం పగిలిన అద్దమే. కానీ, మళ్ళా ఆ శకలాల్లో ఏ ఒక్కదాన్ని చేతుల్లోకి తీసుకున్నా నా పూర్తి ముఖచిత్రం కనిపిస్తుంది.

ఎక్కణ్ణుంచి మొదలుపెట్టను? ఇదుగో, నా ముందు Fragment 98 ఉంది. ఒకే పేపైరీలో పైనా కిందా దొరికిన కొన్ని వాక్యాలు. ఒకటే కవిత. కాని మధ్యలో కాలం కబళించిన కొన్ని పదాలు:

ఆ తర్వాత మరికొన్ని పంక్తులూ, మరెన్నో ఖాళీలు. కానీ, ఈ నాలుగు చరణాలు చాలు,  ఏకంగా ఒక ప్రపంచమంతా ఉంది. మూడు తరాలు, మీ తల్లి, నువ్వు, నీ కూతురు. మూడు ప్రపంచాలు. ఎంత అమాయిక, నిష్కల్మష ప్రపంచాలు. జడముడేసుకుని దానికొక ఊదారంగు రిబ్బను చుట్టుకుంటే అదే గొప్ప ఆభరణంగా మురిసిపోయే కాలం నుంచి, చివరికి, నీ బిడ్డదగ్గరకి వచ్చేటప్పటికి, ఆ చిన్నిపాటి అలంకారం కూడా దొరకని కాలం. 

ఇది నువ్వు ప్రవాసంలో ఉండగా రాసిన కవిత అని తెలుస్తూనే ఉంది. ఇందులో, మొదటి చరణంలో, కేశభూషణం గురించి నువ్వు వాడిన meg’ epainon (μέγ’ ἐπάινον) అనే పదానికి అర్థం ‘గొప్ప ప్రశంస ‘అనీ, అలంకరించుకునే ఆభరణం అనే వాచ్యార్థంలో వాడాలంటే kosmos అని అనుండాలి అనీ  రాసారు Anne Carson. ఆమె రాసిందాని ప్రకారం, గ్రీకులో, cosmos అంటే రెండు అర్థాలు, ‘అమరిక’, ‘అలంకారం’.  గ్రీకు దర్శనం ప్రకారం మొదట్లో ఉండేది అవ్యవస్థనే. దాన్ని chaos అన్నారు. ఆ chaos నుంచి ఒక వ్యవస్థ తలెత్తడమే cosmos. ఈ రెండు పదాల్నీ ఆమె స్త్రీవాద దృక్పథం నుంచి పరిశీలిస్తూ, ప్రాచీన గ్రీకు సమాజంలో, ఒక స్త్రీకి శిరోవేష్టనమే ఆమెకొక సామాజిక మర్యాదనీ, వ్యవస్థాగతమైన గుర్తింపునీ, ఒక అమరికనీ తెచ్చిపెట్టేదిగా ఉండేదని వివరించారు. ఆ నేపథ్యంలో, నీ బిడ్డకి నువ్వొక శిరోవేష్టనం కూడా సమకూర్చుకోలేకపోవడం నీలో ఎంత వేదన కలిగించగలదో ఊహించవచ్చు.

ఒక మనిషి తన జీవన విషాదాన్ని చెప్తున్నప్పుడు ఇదుగో, ఇటువంటి తునకలే, ఇటువంటి అత్యంత వైయక్తిక అనుభవాలే ఆ కవిత్వాన్ని నమ్మదగ్గవిగా చేస్తాయి. మనుషుల  సుఖదుఃఖాల గురించిన మెలకువ ఆ కవికి స్పష్టంగా ఉందని నన్ను ఒప్పిస్తాయి. అందుకని Anne Carson ఈ కవిత గురించి రాస్తూ cosmos ప్రస్తావన తేగానే, నా ఆలోచనలు epic, lyric ల వైపు మళ్ళాయి. 

మామూలుగా సాహిత్య ప్రపంచం ఏమనుకుంటుందంటే, మనిషిని నడిపించే మహాశక్తుల గురించీ, రాజకీయ- సామాజిక పార్శ్వాల్లో మనుషులు లోనయ్యే అనుభవాల గురించీ రాస్తే దాన్ని epic  అనీ, అలాకాక, వ్యక్తుల స్వీయ అనుభవాల గురించీ, వారి ఇల్లు, పిల్లలు, ప్రేమ, కలయిక, విడిపోడాల గురించి రాస్తే దాన్ని lyric అనీ.  

కాని ఇది చాలా స్థూల దృష్టి. కవిత్వాన్ని యాంత్రికంగా చదవడం.  ప్రపంచ కవిత్వంతో నా పరిచయం పెరుగుతున్నకొద్దీ, నాకు ఒక విషయం మరింత స్పష్టమవుతోంది. అదేమంటే, మానవ జీవితాన్ని శాసించే మహాశక్తుల గురించి మామూలు కవులు రాస్తే వార్తాపత్రిక చదివినట్టు ఉంటుంది. కాని అదే మహాకవులు రాస్తే అందులో ఇలా వస్త్వాశ్రయం, ఆత్మాశ్రయం అని రెండుగా విభజించడానికి ఉండదు. మహాకవులు రాసే epic లోనూ ఇటువంటి lyrical moments ఉంటాయి, వారు  lyric  రాస్తే అందులోనూ ఒక epic world  కనిపిస్తుంది.

గొప్ప కవిత్వం ఏకకాలంలో ఒక epic, ఒక లిరిక్  కూడా. ఏకకాలంలో వస్త్వాశ్రయం, ఆత్మాశ్రయం కూడా. చలంగారు చెప్పినట్టు ‘తనకీ లోకానికీ మధ్య సామరస్యం కుదిరే దాకా చేసే అంతర్ బహిర్ యుద్ధారావం.’

నాకు cosmos అనే మాట వినగానే అన్నిటికన్నా ముందు హోమర్ వర్ణించిన అకిలిస్ కవచం గుర్తొచ్చింది. ఇలియడులో పద్ధెనిమిదో సర్గలో, దేవలోకపు కమ్మరి హెఫస్టస్, అకిలిస్ కోసం ఒక కవచం తయారుచేస్తాడు. ఆ కవచం మీద అతడు ఏకంగా ఒక cosmos నే చిత్రిస్తాడు. దానిలో లేనిదేది? భూమి, ఆకాశం, సూర్యచంద్రులు, గ్రహతారకలు. వాటితో పాటు, రెండు నగరాలు, ఒకదానిలో సాధారణ పౌరజీవితం, పెళ్ళి, న్యాయవివాదం, రెండోది  ముట్టడిలో ఉన్న నగరం. దానికి ఇరువైపులా మోహరించిన రెండు సైన్యాలు. యుద్ధం, రక్తపాతం. వాటి పక్కనే మళ్ళీ మళ్ళీ పొలం దున్నుతున్న దృశ్యం, దానిపక్కనే పంటకోతలు, ద్రాక్షతోటలు, పండ్లుగంపలకెత్తేవాళ్ళు, పిల్లలు. మరొక పక్క ఆవులు, ఎడ్లు, సింహాలు, వేటకుక్కలు, పచ్చికబయళ్ళో మేతమేస్తున్న గొర్రెలు, ఆ దృశ్యం పక్కనే నాట్యం చేస్తున్న యువతీయువకులు, వాళ్ళ మధ్య వలపు సుగంధం. ఇక ఆ దృశ్యాలన్నిటికీ అంచుల్లో ఘూర్ణిల్లే మహాసముద్రం.

ఇది నిజంగా ఒక epic world. దానికదే ఒక విశ్వం. ఇన్ని యుగాలుగానూ, రసజ్ఞులు ఈ మహాదృశ్యాన్ని అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. కాని అందరూ చెప్పేది ఒకటే మాట, ఆ కవచం మీద తాను సృష్టించిన cosmos, తాను గానం చేస్తున్న ఇతిహాసం రెండూ ఒక్కలాంటివనే హోమర్ సూచిస్తున్నాడని.

(రామాయణంలో కూడా ఇటువంటి ఒక సూచన ఉందని మా మాష్టారు చెప్పారు. రావణుడి అంతఃపురంలో హనుమంతుడు ఒక రత్నాల తివాసీ చూస్తాడు. దానిమీద భూమి, మహీధరాలు, తరువులు, శాఖలు, పూలు, పుష్పదళాలు, కేసరాలు మొత్తం చిత్రించి ఉంటాయి. ఆ చిత్రమూ, తన కావ్యమూ ఒక్కలాంటివేనని వాల్మీకి సూచిస్తున్నాడని మా మాష్టారి పరిశీలన.)

నిజానికి ఇలియడ్ తక్కిన కావ్యంలో లేనిది కూడా ఆ కవచమ్మీద చిత్రించిన దృశ్యంలో ఉందని నాకు Mark W Edwards రాసిన Homer, Poet of the Iliad చదివాక గానీ తెలియలేదు. తక్కిన ఇలియడ్ అంతా యుద్ధం, ఒక స్త్రీ ప్రేమపర్యవసానం, ఒక వీరుడి కోపం తెచ్చిపెట్టిన వినష్టం, ఒకరినొకరు నరుక్కోడం, అదంతా ఒక దగ్ధ ప్రపంచం. కాని జీవితమంతా ఇంతే అని హోమర్ ఎలా నమ్మగలడు? మానవుడు మరణిస్తాడు, నిజమే, మర్త్యత్వం గీతాకారుడు చెప్పినట్టుగా, ఒక ధ్రువసత్యం. కానీ, మరణాన్ని అనుక్షణం ధిక్కరించే జీవితం కూడా ఉంది. అది అడుగడుగునా ఉంది. పొలాలు, పంటలు, పంటకోతలు, పానగోష్ఠి, ప్రేమపారవశ్యం, ఋతుపరిభ్రమణం- ఇవి కూడా సత్యమే. హెసియోద్ లాగా పొలం దున్నడం గురించీ, నాట్లు నాటడం గురించీ, ఏ కార్తెలో ఏ విత్తనాలు చల్లాలో ఆ కృషి విజ్ఞానమంతా రాయాలని హోమర్ కి కూడా ఉంటుంది కద!  కాని ఇలియడ్ కథాగమనంలో ఆ దృశ్యాల్ని ఎక్కడ చొప్పించగలడు? ఎక్కడ చిత్రించగలడు? అందుకని ఆయన ఆ కవచాన్ని తన canvas గా తీసుకున్నాడు. ఒక కవచం మీద ఆ జీవన దృశ్యాల్ని చిత్రించడంలో ఒక కావ్యవ్యంగ్యముంది. ఏమిటది? అది కవచం. నిజమే, సాక్షాత్తూ దేవలోకపు కమ్మరి స్వయంగా రూపొందించినప్పటికీ ఆ కవచం అకిలిస్ ని కాపాడలేదు. ఎందుకంటే మర్త్యత్వం ఒక నిష్ఠుర వాస్తవం. కానీ ఆ కవచం ఆ యుద్ధభూమిలో పదేపదే ఒక సత్యాన్ని ఎలుగెత్తి చాటుతూనే ఉంది. అదేమంటే, ఈ యుద్ధం మాత్రమే జీవితం కాదు. రక్తం చిందిస్తున్న ఈ నగరం పక్కనే ప్రశాంత పౌరజీవితం జీవించే మరొక నగరం కూడా ఉంటుంది. నెత్తురు ప్రవహిస్తున్న ఈ భూమిని ఆనుకునే నాట్లు వేస్తున్న పొలాలు, కోసి కుప్పనూరుస్తున్న పంటలు, విరగపండిన ద్రాక్షతోటలు కూడా ఉంటాయి. ఒకరినొకరు నరుక్కోవడమే సమస్యకి పరిష్కారంగా భావించే ఈ నగరం పక్కనే, తమ సమస్యని పెద్దమనుషుల ముందు నివేదించి, సామరస్యంగా సమస్యని పరిష్కరించుకునే జీవితం కూడా ఉంటుంది. కాబట్టి, మానవ జీవితం రెండునగరాల జీవితం అని ఆ కవచం చెప్తూ ఉండకపోతే, ఇలియడు మహాకావ్యం ఎంత అసంపూర్ణంగా ఉండి ఉండేది!

అందుకని మనం epic అని పిలుస్తున్నది కూడా తనలో ఒక lyrical world ని పొదువుకునే ఉంటుంది. నాకీ క్షణాన, రామాయణ మహాకావ్యంలో ఒక దృశ్యం గుర్తొస్తున్నది. ఎన్నిసార్లు తలుచుకున్నా నాకది కొత్తగానే ఉంటుంది. అది అయోధ్యాకాండలో, అడవికి వెళ్ళిపోయిన రాముణ్ణీ, సీతనీ, లక్ష్మణుణ్ణీ వెతుక్కుంటూ భరతుడు వెళ్ళినప్పటి సంఘటన. రాముణ్ణి కలుసుకోడానికి ముందురోజు భరతుడు గుహుణ్ణి అడుగుతాడు, ‘మా అన్నావదినలు ఇక్కడ ఎక్కడ విశ్రమించారు’ అని. గుహుడు చూపించిన చోట అతడికి ఒక ఇంగుదీ వృక్షం కనిపిస్తుంది. ఆ చెట్టు కొమ్మల్ని చిక్కుకుని ఒక చీరపోగు కనిపిస్తుంది. దాన్ని చూస్తూనే భరతుడిలా (అయోధ్యాకాండ, 88:15) అనుకుంటాడు:

(సీతమ్మ ఉత్తరీయం ఈ పొదకి తగులుకుని ఉంటుందని నిశ్చయంగా అనిపిస్తున్నది. అందుకనే ఈ పట్టుదారప్పోగులు ఇక్కడ చిక్కుకుని ఉన్నాయి.)

నిజానికి అది చెట్టు కూడా కాదు. గచ్చపొద. ఆ పొదనీడనే రాముడూ, సీతా శయనించి ఉంటారు. అందుకని ఆమె చీరపోగు ఒకటి ఆ ముళ్ళపొదలో చిక్కుకుపోయి ఇప్పుడు భరతుడికి కనిపించింది. ఆ అడవిలో ఎన్నో చెట్లు ఉండగా, ఇంగుదీ వృక్షాన్నే కవి ఎందుకు ప్రత్యేకంగా ప్రస్తావించాడు? ఆ అన్నదమ్ములూ, ఆ నారీమణీ ఆ గచ్చపొదనీడన శయనించి ఉంటారన్న ఊహలో ఉన్న వేదనని మాటల్లో చెప్పలేం. ఇక ఆ పొదలో చిక్కుకున్న ఆ పట్టుదారం, అది ఎంత సులలిత చిత్రం! ఈ శ్లోకం దానికదే ఒక lyrical world! ఈ పట్టుదారం గురించి రాయకపోయినా రామాయణ కథాగమనానికి అడ్డులేదు. ఆ ఒక్క దృశ్యాన్ని చూపించకపోయినా, అసలు భరతుడు తన అన్నని వెతుక్కుంటూ వెళ్ళడంలోని ఆ కరుణరసానుభూతి మనలో తలెత్తడానికి అడ్డు ఉండదు. కానీ, ఆ చిన్ని దారప్పోగుని ఎత్తి చూపడంతో,  వాల్మీకి నన్నెంత సమ్మోహితుణ్ణి చేస్తున్నాడు!

ఇప్పుడు నువ్వు ఒక రిబ్బను గురించి రాసింది చదువుతుంటే, నాకు రామాయణం గుర్తురావడంలో ఆశ్చర్యమేముంది? దీన్ని వట్టి lyrical fragment గా భావించి పక్కనపెట్టేయగలమా? సగం చెదిరిపోయి సగమే మిగిలిన ఈ కవితలో ఉన్నది వట్టి కేశాలంకారమేనా? మూడు తరాలున్నాయిందులో. మీ తల్లి జీవించిన కాలంలో మీ మైటిలెని నగరం, అకిలిస్ కవచం మీద వర్ణించిన ప్రశాంత నగరం. అప్పుడు ఒక స్త్రీకి తలదువ్వుకుని ఊదారంగు రిబ్బనుతో జడముడేసుకుంటే అదే గొప్ప అలంకారం. ఒకవేళ ఆ స్త్రీ కబరీభరం గోధుమరంగులో బంగారుకాంతులీనుతుంటే ఆ అలంకారంతో కూడా పనిలేదు. నాలుగు పూలు చాలు, వాటికవే గొప్ప అలంకారం. ఆ తర్వాత నువ్వు చూపిస్తున్న దృశ్యంలో నువ్వూ, నీ బిడ్డా ఉన్నారు. ఇది హోమర్ చిత్రించిన రెండో నగరం.

ముట్టడిలో ఉన్న నగరం. ఆ నగరాన్ని చుట్టుముట్టిన సైన్యాలు ఆ నగరసంపదని ఎలా పంచుకుందామని ఆలోచిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో చిక్కుకున్న ఆ నగరంలో స్త్రీలు, ఆ తల్లులూ, ఆ పిల్లలూ వాళ్ళ జీవితాలెలా ఉండి ఉంటాయి? ఇదుగో, ఇప్పుడు  టెహెరాన్ లో, టెల్ అవీవ్ లో, బీరుట్ లో నివసిస్తున్న తల్లులూ, పిల్లలూ ఎలాంటి జీవితం జీవిస్తూ ఉండి ఉంటారు? ఎంత  epic  రాస్తే మనం ఆ మానవదుఃఖాన్ని సంపూర్ణంగా చిత్రించగలుగుతాం? కాని, ఇదుగో, నువ్వు చెప్పావే, ఇప్పుడు నీ బిడ్డకి ఒక రిబ్బను కూడా లేదని. దాన్నిప్పుడు ఎక్కణ్ణుంచి తెచ్చేదని అడిగావే, ఆ ప్రశ్న, దానికదే ఒక epic. ఆ రోజుల్లో ఒక స్త్రీ జీవితాన్ని  chaos  కాకుండా cosmos గా మార్చగలిగేది ఆ ఒక్క శిరోవేష్టనమే అని తెలిసాక, నువ్వు అడుగుతున్న ప్రశ్న కేవలం ఒక అలంకారానికి సంబంధించింది మాత్రమే కాదనీ, మొత్తం మానమర్యాదలకు సంబంధించిందనీ స్ఫురించకుండా ఎలా ఉంటుంది?

అందుకని శాఫో, నా జీవితంలో నేను చదివిన గొప్ప కవితల్లో, హోమర్ అకిలిస్ వర్ణనతో సమానంగా నీ ఈ కవితని కూడా గుర్తుపెట్టుకుంటాను. ఆ రామాయణ శ్లోకంలాగా ఈ కవిత కూడా అత్యంత వ్యక్తిగత క్షణాల్లోనే అత్యంత రాజకీయ సంఘర్షణని కూడా చూపించగలదని తెలుసుకున్నాను. రామాయణంలోని ఆ శ్లోకంలో తెగిపోయిన ఒక పట్టుదారప్పోగు వెనక నిష్కారణంగా ఒక కుటుంబానికి విధించిన రాజ్యబహిష్కరణ కనిపిస్తున్నది. నువ్వు నీ బిడ్డకు తెచ్చి ఇవ్వలేకపోయిన ఒక రిబ్బనుముక్క వెనక మొత్తం లెస్బోస్ అనుభవించిన రాజకీయ అంతఃకలహం, నిష్కారణంగా మీ కుటుంబానికి తప్పని ప్రవాస దైన్యం కనిపిస్తున్నది.  The personal is political అంటే ఇదే కదా!


Featured image courtesy: http://www.craiyon.com

29-4-2026

6 Replies to “ప్రియమైన శాఫో-7”

  1. అత్యద్భుతం. ఎంత బాగా జీవించారు? ఆహా

  2. Wah sir… from just one small fragment, you showed a whole world !!
    While reading this post I literally felt like you just handed over your lens to help us see what you are seeing, the epic in the lyric and the lyric in the epic!!
    Very clearly and patiently, you explained what to see and what to experience!!
    🙏🏽

Leave a Reply

Discover more from నా కుటీరం

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading