
ప్రియమైన శాఫో
ఏం చేస్తున్నా నీ గురించిన తలపులే నా మనసుని ఆక్రమించుకున్నాయి. నీకు రాయబోయే ఉత్తరంలో వాక్యాలే రోజంతా మనసులో కూర్చుకుంటూ ఉంటాను. ఒకప్పుడు ఉత్తరాలు రాయాలంటే ముందు గొప్ప భావోద్వేగం ఆవహించేది. ఇప్పుడు ఆ ఉద్రేకం లేదు. పైపైన వరదలు ప్రవహించిపోయాక ఉండే అచకిత మనఃస్థితి.
ఆశ్చర్యం. సరిగా ఇలాంటి వాక్యమే నీ కవిత్వంలోంచి ఒక శకలంగా మాకు దొరికింది. Framgent 120. ఒక్క వాక్యం. చిన్న వాక్యం.
నాకెవరినీ బాధ పెట్టాలని లేదు, నా మనస్సు ప్రశాంతంగా ఉంది.
పదో శతాబ్దానికి చెందిన ఒక విజ్ఞానసర్వస్వ రచయిత ఈ వాక్యాన్ని పట్టుకున్నాడు. Etymologicum Genuinum నిజానికి ఒక నిఘంటువు లాంటిది. అది కూర్చిన పండితుణ్ణి నీ కవిత్వంగాని, నీ వాక్కులోని మాధుర్యంగాని, నీ ప్రేమపరితాపం గానీ ఏవీ ఆకర్షించలేదు. అతడు ఇదుగో amayunon అనే పదం దగ్గర ఆగిపోయాడు. దాని అర్థం ప్రతీకారేచ్ఛ లేకపోవడమని అర్థమట. ‘నాకెవరినీ బాధ పెట్టాలని లేదు’ అనే వాక్యాన్ని, ‘నాకెవరిమీదా ప్రతీకారం తీర్చుకోవాలని లేదు’ అని కూడా అనువదించవచ్చు.
ఇదుగో, ఇలానే ఒక నిఘంటుకారుడో, ఒక వ్యాకరణపండితుడో, లేదా ఒక చరిత్రకారుడో ఏదో ఒక పదప్రయోగం, లేదా ఒక అలంకారం- నీ కవిత్వంలోంచి ఏదో ఒక శకలాన్ని ప్రస్తావిస్తారు. వారికి ఏది దొరికిందనేది వారి యిష్టాన్ని బట్టి, శ్రద్ధని బట్టి, జీవితంలో వారి వారి వృత్తులూ, ప్రవృత్తులూ వేటికి ప్రాధ్యాన్యాన్నిస్తున్నాయన్నదాన్ని బట్టి ఆధారపడుతుంది. కానీ ఈ పండితుడెవరో చాలా అదృష్టవంతుడు. అతడికి ఏకంగా నీ హృదయమే దొరికింది.
ఎవరో అన్నారు, కవిత్వం ఒక సీసాలో బిగించిపెట్టి సముద్రంలో వదిలిపెట్టిన సందేశం లాంటిదని. ఆ సీసా ఏ తీరానికి కొట్టుకువెళ్తుందో, ఎవరి చేతులకి చిక్కుతుందో ఎవరికెరుక? తీరా ఆ సందేశం వాళ్ళ చేతులకి చిక్కాక వారికి ఏమి తెలుస్తుంది? అదెవరు పంపారో, ఎక్కడివారో, ఎప్పటివారో ఎలా తెలుస్తుంది? ఈ మాటలు రాస్తోంటే నాకు ఎడ్గార్ అలన్ పో రాసిన Ms found in a Bottle (1833) కథ గుర్తొస్తోంది. ఆధునిక కథ ఆ కథనుంచే పుట్టిందంటారు. అందులో కథకుడు ఒక సముద్ర ప్రయాణంలో ప్రమాదవశాత్తూ తాను ప్రయాణిస్తున్న పడవలోంచి పెద్ద నౌకలోకి వెళ్ళిపడతాడు. ఇక అక్కణ్ణుంచి అతడు చెప్పేదంతా తర్కానికీ, కార్యకారణసంబంధానికీ అందని అనుభవం. తన అనుభవాన్ని అతడు వివరంగా రాసిపెట్టి ఒక సీసాలో బిగించి సముద్రంలోకి విసిరేస్తాడు. తానెలానూ మరణించబోతున్నాడు, కాని తన అనుభవం తనతో పాటే అంతరించిపోకూడదనుకుంటాడు. ఎవరికేనా ఎప్పుడేనా ఆ సీసా చేతికి చిక్కితే తన హృదయం అర్థమవుతుందని అతడి ఆశ.
ఈ వాక్యం కూడా నాకలానే Ms found in a bottle లాగా అనిపించింది. కాలమహాసాగరంలో మునిగిపోకుండా మిగిలిన ఒక చిన్ని వాక్యం. నీ తక్కిన కవిత్వమేదీ మాకు దొరకకపోయి ఉంటే, నీ జీవితం గురించిన తక్కిన విశేషాలేవీ మాకు తెలియకపోయి ఉంటే, ఈ ఒక్క వాక్యమే దొరికి ఉంటే, ఆమె ఎవరు? ఎందుకామె మనసులో ప్రతీకారేచ్ఛ లేదు? ఎందుకామె ప్రశాంత చిత్తురాలిగా ఉంది? ఈ ప్రశ్నలు ప్రపంచాన్ని వేధిస్తూనే ఉండేవి.
కానీ, ఇప్పుడు నీ కవిత్వం మరికొంత దొరికినందువల్లా, నీ గురించిన సమాచారం ఎంతో కొంత మాకు తెలుస్తున్నందువల్లా, ఈ వాక్యం మరింత ఆసక్తికరంగా మారింది. ఎందుకని? ఎందుకని ఆమె ప్రతీకారమూ, ప్రశాంతమానసమూ అనే రెండు మాటలు వాడింది? నిజానికి ఇవి ఒక కవి రాసే మాటలు కావు కదా. ఒక ఋషి మాత్రమే రాసుకోవలసిన మాటలు కదా. ఋషి కాకపోతే కవి కాలేడని మా పూర్వీకులు నమ్మారు. కాని కవి కాలేనివాడు ఋషి కూడా కాలేడు. ఎందుకంటే, కవి మాత్రమే తన ఉద్వేగాల్ని పోల్చుకోగలడు. వాటిని మాటల్లో పెట్టగలడు. ప్రచండమైన ఆ తుపానులకి ఎదురీదగలడు. మహోపద్రవకారకాలైన ఆ ఆవేశాల్ని తట్టుకుని, ఆ తర్వాత కూడా అతడు జీవించగలిగితే, తప్పకుండా ఋషిగా మారతాడు.
నీ కవిత్వంలో మాకు దొరికినదాన్నిబట్టి, అన్నిటికన్నా ముందు, ప్రతి చిరుగాలికీ కంపించే అతి సున్నిత హృదయం నీదని బోధపడుతుంది. ‘నేను ఆకాశాన్ని తాకాలనుకోవడం లేదు’ అన్నావొక చోట. కాని ఆకాశపు హద్దుల్ని తాకే ఉత్సాహం నీది. అసలు అన్నిటికన్నా ముందు నీలో నన్ను ఆకట్టుకున్నదే అది. ఉప్పొంగే జీవశక్తి. పొంగిపొర్లే ప్రేమధార. నీలాంటి సున్నితహృదయులు తమకి తారసపడ్డ ప్రతి ఒక్క మనిషీ తనని ప్రేమించాలని కోరుకుంటారు. ప్రేమించడం కాదు, తమనే పట్టించుకోవాలనుకుంటారు. మొత్తం attention తమమీదే ఉండాలనుకుంటారు. అక్కణ్ణుంచి మొదలవుతుంది యుద్ధం. అక్కణ్ణుంచే అనురాగబంధాలు కావలసినవి అగ్నిగుండాలుగా మారడం మొదలవుతుంది. ఏ ప్రేమికుడి జీవితకథ చూసినా, ఏ ప్రేమికురాలి ప్రేమయాత్ర చూసినా తెలిసేది ఇదే, మూడు పువ్వులూ, ఆరు గాయాలూనూ!
నీ గురించి నేను చాలా విన్నాను. నీలాంటి నిరుపమాన సజీవవ్యక్తిత్వం గురించి వినేదంతా నిజమని అనుకోలేం. నీలాంటి వాళ్ళ గురించి మాట్లాడుకునేటప్పుడు మనుషులు చాలా సార్లు తమ మాటల్లో తమ ఊహల్నీ, స్వైరకల్పనల్నీ కూడా జోడించి చెప్తుంటారు. కాబట్టి అలా విన్నవాటిలో ఏది నిజమో, ఏది కాదో ఎంచడానికి బదులు, నువ్వు నీ చుట్టూ ఉన్న మనుషుల్లో అంత కుతూహలం రేకెత్తించావన్నదొక్కటే గుర్తుపెట్టుకుంటాను.
నాకూ అర్థమయినంతవరకూ నీ జీవితకథ సంగ్రహంగా ఇది: నువ్వు క్రీస్తుపూర్వం 630 ప్రాంతాల్లో లెస్బోస్ ద్వీపంలో పుట్టావు. అది ఎంత గ్రీకు ద్వీపమో, అంత ప్రాచ్యద్వీపం కూడా. తూర్పు వైపు చూసే పడమటిప్రపంచం అది. అందుకనే నీ కవిత్వంలో తూర్పు దేశాల సుగంధం అంత సురభిళిస్తూ ఉంటుంది. నీ తల్లిదండ్రుల్తో పాటు నీ ముగ్గురు సోదరుల గురించి కూడా మాకు కొంత సమాచారం తెలుసు. అందులో ఒక సోదరుడి గురించి నువ్వే ఒక కవితలో రాసావు. నీకో బిడ్డ ఉందని కూడా నీ కవితలు చదివితే తెలుస్తుంది. నువ్వు పుట్టిపెరిగిన కాలం ప్రాచీన గ్రీకు చరిత్రలో నగరరాజ్యాలు ప్రభవిస్తున్న కాలం. అప్పుడు నియంతలు కూడా పుట్టుకొచ్చారు. అలాగని వాళ్ళు వంశపారంపర్యంగా పాలనాధికారం లభించే రాజులు కారు. కేవలం బలంతో అధికారాన్ని చేజిక్కించుకునే వ్యక్తులు. వాళ్ళకీ, మరోవైపు సాంస్కృతికంగా ఉన్నత స్థితికి చెందిన కులీన కుటుంబాలకీ మధ్య నిరంతరం సంఘర్షణ నడిచేది. ఆ కులీన కుటుంబాల పాలన, దాన్ని oligarchy అందాం, దాన్నుంచి, వ్యక్తిపాలకులు రాజ్యాధికారాన్ని హస్తగతం చేసుకోవాలని చూసేవారు. నువ్వూ, నీ సమకాలికుడైన మరొక కవి ఆల్కేయసూ అటువంటి కులీన పాలకవర్గాలకు చెందినవాళ్ళు.
నువ్వు పుట్టేటప్పటికే నీ మైటిలినె నగరాన్ని పెంథిలిడ్లు అనే కుటుంబాలవాళ్ళు పరిపాలించేవారు. చరిత్ర వాళ్ళని చాలా క్రూరులుగా గుర్తుపెట్టుకుంది. ఎందుకంటే ఆ రోజుల్లో గ్రీసునుంచి పెద్ద ఎత్తున లెస్బోస్ కి పెద్ద ఎత్తున వలసలు నడిచేవి. ఆ వలసలవల్ల పెంపొందిన వ్యవసాయం, వాణిజ్యం లెస్బోస్ లో కొత్త సంపద సృష్టించాయి. ఆ సంపదమీద ఆధిపత్యం కోసం పెంథిలిడ్లకీ, సంపన్న కుటుంబాలకీ మధ్య సంఘర్షణ నడుస్తుండేది. నువ్వు పుట్టే వేళకి, అటువంటి సంపన్న కుటుంబాలకి చెందిన పిట్టకోస్ అనేవాడు పెంథిలిడ్ల పాలనకి ముగింపు పలికి తాను మరొక నియంత-పాలకుడిగా మారాడు. కానీ అదే సమయంలో ఎథీనియన్లు మైటిలినె మీద దండెత్తడంతో వాళ్ళకీ, లెస్బియన్లకీ మధ్య పోరుమొదలయ్యింది. ఆ యుద్ధంలో పిట్టకోస్ గెలిచాడుగానీ లెస్బోస్ వైపు పోరాడిన మిర్సిలాస్ అనేవాడు ప్రత్యర్థిగా ఎదిగాడు. అతడిపైన సంపన్న కుటుంబాలు తిరగబడ్డాయిగానీ, వాళ్ళ వైపు నిలబడతానని చెప్పిన పిట్టకోస్ చివరినిమిషంలో వాళ్ళని మోసపుచ్చాడు. దాంతో వాళ్ళు ఒడిపోయారు. కాని ఇప్పుడు పిట్టకోస్ మిర్సిలాస్ తర్వాత రెండవ బలమైన పాలకుడిగా అధికారాన్ని దక్కించుకున్నాడు.
అలా ఎవరైతే మిర్సిలాస్ మీద తిరగబడ్డారో ఆ సంపన్నులు చాలామంది లెస్బోస్ వదిలి ప్రవాసులుగా వెళ్ళిపోవలసి వచ్చింది. అల్కేయస్ కూడా అలా ప్రవాసిగా వెళ్ళిపోయినవాడే. ఆ రాజకీయ చదరంగం నీడ నీ మీద కూడా పడిందనీ, మిర్సిలాస్ మీద తిరగబడ్డ సంపన్న కుటుంబాల్లో మీది కూడా ఒకటనీ, కాబట్టి నువ్వు కూడా సిసిలీకి ప్రవాసం వెళ్ళిపోవలసి వచ్చిందనీ విన్నాను. కొందరు నువ్వు ప్రవాసానికి వెళ్ళలేదని వాదిస్తారుగానీ, నీ కవిత్వంలో వినిపించే విషాదపూర్వకమైన జీర నీ ప్రవాసానికి అంతర్గత సాక్ష్యంగా నిలబడుతుంది.
నువ్వు బహుశా క్రీ.పూ. 604 ప్రాంతంలో ప్రవాసానికి వెళ్ళావు. అంటే అప్పుడు నీకు ఇరవై ఆరేళ్ళ వయసు ఉండివుండవచ్చు. 597 ప్రాంతంలో మిర్సిలాస్ మరణించాడు. దాంతో చాలామంది ప్రవాసితులు తిరిగి లెస్బోస్ లో అడుగుపెట్టారు. నువ్వు కూడా 597 ప్రాంతంలో లెస్బోస్ కి వచ్చి ఉంటావు. అప్పటికి నీకు బహుశా ముప్ఫై ఏళ్ళ ప్రాయం. ఆ తర్వాత నువ్వు బహుశా 570 ప్రాంతంలో ఈ లోకం నుంచి సెలవు తీసుకునేదాకా, మరొక పాతికేళ్ళకు పైగా మైటిలెనిలో జీవించావు. అంటే నీ ప్రవాస జీవితం నీ మొత్తం జీవితయాత్ర కి సరిగ్గా మధ్యలో సంభవించింది. అంతకు ముందు లెస్బోస్ లో నడిచిన జీవితం పూర్వార్థం. సిసిలీనుంచి తిరిగి వచ్చిన తరువాత లెస్బోస్ లో జీవించింది ఉత్తరార్థం.
అలా చూసినప్పుడు ఈ వాక్యం but I am not someone who likes to wound rather I have a quiet mind అనేది నువ్వు ప్రవాసం నుంచి తిరిగి వచ్చాక చెప్పిన మాటలాగా తోస్తుంది. ప్రవాసానికి పోకముందటి నీ జీవితానికీ, తిరిగి వచ్చాక జీవితానికీ మధ్య ఎన్నోరకాలుగా తేడా ఉంటుందని ఊహించగలం. నువ్వు దేశం వదిలిపెట్టి వెళ్ళిపోయాక పాలకులు నీ ఆస్తులు స్వాధీనం చేసేసుకుని ఉండి ఉంటారు. నీ దాసదాసీ జనం చెల్లాచెదురైపోయుంటారు. నువ్వు కటిక దారిద్ర్యాన్ని చవి చూసి ఉంటావు. సిసిలీలో ప్రవాసిగా జీవిస్తున్నప్పుడు నీ బిడ్డకి ఒక రిబ్బను కూడా కొనుక్కోలేకపోయావని నువ్వు రాసుకున్నది మేము మర్చిపోలేం. నువ్వు తిరిగొచ్చాక ఆ పూర్వపు వైభవం, ఆ సంపద, ఆ పలుకుబడి, ఆ సాహచర్యాలు, ఆ సాంగత్యాలూ అలానే ఉండిఉంటాయనుకోలేం. నువ్వు కవివి, రాజ్యాధికారం కోరుకున్నదానివి కాదు. కాని చరిత్రగతిలో నువ్వు కూడా ఆటుపోట్లకి లోను కాకతప్పలేదు. కాబట్టి మరొకరెవరేనా నీ పరిస్థితిలో ఉండి ఉంటే, దేశాన్నో, దైవాన్నో నిందించకుండా ఉండరు. కానీ, ఇదేమిటి, ‘నాకెవరినీ బాధ పెట్టాలని లేదు, నా మనసు ప్రశాంతంగా ఉంది ‘ అంటున్నావు!
ఈ చరిత్ర అంతా తెలిసాక, ఈ వాక్యం చదివితే, నాకు భగవద్గీతలో ఈ శ్లోకం (17:15) గుర్తు రావడంలో ఆశ్చర్యమేముంది? గీతాకారుడిలా చెప్తున్నాడు:
అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్
స్వాధ్యాయాభ్యసనం చైవ వాజ్ఞ్మయం తప ఉచ్యతే
అంటే మనిషి మాట్లాడే మాటలకి నాలుగు ధర్మాలు ఉండాలని చెప్తున్నాడు. ఒకటి అది సత్యంగా ఉండటం, రెండోది అది ప్రీతికరంగా ఉండటం, మూడోది మనుషుల మంచి కోరేది కావడం, ఇక మొదటిదీ అన్నిటికన్నా ముఖ్యమైందీ అది అనుద్వేగకరంగా ఉండటం, అంటే ఇతరులని రెచ్చగొట్టనిదిగా ఉండడమన్నమాట. అటువంటి వాక్యాల్ని అన్వేషిస్తూ చేసే అధ్యయనం, అలా జీవించడానికి ప్రయత్నించడం వాటినే వాక్కుతో చేసే తపస్సు అంటారు అని స్వయంగా భగవానుడు చెప్తున్నాడు.
నువ్వు వాడిన గ్రీకుపదం, ఏ పదాన్ని తాను నిఘంటువుకి ఎక్కిస్తున్నప్పుడు, ఆ పండితుడికి, ఆ పదానికి అత్యుత్తమ ఉదాహరణగా నీ పదప్రయోగం కనిపించిందో, ఆ పదం ἄμυνον (amyunon) అనేదానికి అనుద్వేగకరం అనేదానికన్నా సరైన సమానార్థకం మరేదీ కనిపించడం లేదు నాకు.
నిజనైకి గీతాకారుడు నాలుగు పదాలు వాడినప్పటికీ, ఆయన వాడిన మొదటిపదమే తక్కిన మూడింటికీ పునాది. నీ మనసు అనుద్వేగకరమైతే, అప్పుడు నువ్వు మాట్లాడే మాటలు సత్యంగా, ప్రియంగా, హితంగా ఉండితీరతాయి. కొన్ని సార్లు నీ వాక్చాతుర్యం వల్ల నువ్వు మాట్లాడే మాటలు సత్యంగా, హితంగా, ప్రియంగా కనిపించేట్టు చెయ్యవచ్చుగానీ, నీ మనసు ఉద్వేగపూరితంగా ఉంటే, ఆ మాటలు వినేవాళ్ళకి, అవి అసత్యంగా, అప్రియంగా వినబడుతుంటాయి. అవి వాళ్ళ హితాన్ని కోరడం లేదని ఆ శ్రోతలకి తెలిసిపోతూనే ఉంటుంది.
అందుకని మనసుని అనుద్వేగకరంగా ఉంచుకోవడమే నిజమైన స్వాధ్యాయం, నిజమైన సాధన. అటువంటి study, అటువంటి practice మాత్రమే వాజ్ఞ్మయ తపస్సు కాగలుగుతాయి. కాబట్టే ఋషి కాలేనివాడు కవి కాలేడన్నారు మా పూర్వులు . ఈ ఒక్క పదాన్నీ ఆ నిఘంటుకారుడు ఎత్తిచూపకపోతే నువ్వు ఋషిత్వాన్ని అందుకున్నావని మాకు తెలిసి ఉండేది కాదు. నిన్ను ఎంతసేపూ passionate womanగా, వ్యామోహపీడితురాలిగా, స్త్రీదేహాల కోసం అల్లాడినదానిగా చిత్రించినవాళ్ళు ఈ పదాన్ని చూడలేకపోయారనాలి.
కవిత్వానికి శత్రువులెవరంటే, surface readers. వాళ్ళు కవిత్వం చదవకపోయినా పర్వాలేదుగానీ పైపైన చదువుకుంటూ పొయ్యేవాళ్ళు ఆ కవికి చేసే అపకారం అంతా ఇంతా కాదు. నీ గురించి తెలుస్తున్నవి కొద్దిపాటి చారిత్రిక సంఘటనలే కావచ్చు, కానీ వాటినే లోతుగా చదివితే నువ్వు నీ ఆత్మలో సాధించిన ఔన్నత్యం ఏమిటో మాకు తెలుస్తుంది. నువ్వు ప్రవాసం నుంచి తిరిగి వచ్చాక కూడా, మిర్సిలాస్ అయితే లేడుగాని, పిట్టకోస్ మరొక పదిపన్నెండేళ్ళ పాటు జీంచే ఉన్నాడు. రకరకాల రాజకీయాలు చేస్తూనే ఉన్నాడు. సంపన్నకుటుంబీకులకి తాను శత్రువుని కానని చెప్పడానికి ఆ కుటుంబాలకి చెందిన అమ్మాయిని పెళ్ళి కూడా చేసుకున్నాడు. అయినా కూడా అటువంటి చాతుర్యాన్నీ, ఆత్మవంచననీ చూస్తూ కూడా ‘నాకెవరి మీదా కోపం లేదు, నా మనస్సు ప్రశాంతంగా ఉంది’ అని అనడం సామాన్యమైన విషయం కాదు.
కాబట్టి సోక్రటీసు నిన్ను అందమైన శాఫో అని అన్నాడంటే ఆశ్చర్యం లేదు. ఆయనలాంటి అనుద్వేగకరమనస్కుడు మాత్రమే గుర్తుపట్టగలడు నీ అందం నీ అనుద్వేగానిదని.
Featured image: Shipwreck, 1845, Knud Andreassen Baade Norwegian, (1808–1879)
27-4-2026


అనుద్వేగం – ఒక్క పదం తో శాఫో రూపాన్నే మార్చివేయడం మీరు మాత్రమే చేయగలరు. అనేక విషయాలను తెలుపుతూ , పరిస్థితులను వివరిస్తూ , వైయక్తిక అనుభూతి పరంపరలను విశ్లేషిస్తూ రాయడం మీకు మాత్రమే సాధ్యం. శాఫో వాక్యాన్ని గీతా శ్లోకానికి అనుసంధానించడం ఎంత అధ్యయన ధారణ కలిగి ఉంటే సాధ్యమౌతుంది.
ఇప్పుడు అనుద్వేగం అనే పదం చదివిన పాఠకులను వెంటాడుతూ ఉండే పదం .
హృదయపూర్వక ధన్యవాదాలు సార్!
అద్భుతః.
శాఫో జీవనరేఖలను బాగా విపులీకరించారు. అలాగే .భగవద్గీత లో చాలా గొప్ప శ్లోకాన్ని శాఫో వాక్యానికి అన్వయించిన విధానం చాలా బాగుంది.
ఇంక ఈ మీ వాక్యమైతే “కవిత్వానికి శత్రువులెవరంటే, surface readers. వాళ్ళు కవిత్వం చదవకపోయినా పర్వాలేదు గానీ పైపైన చదువుకుంటూ పొయ్యేవాళ్ళు ఆ కవికి చేసే అపకారం అంతా ఇంతా కాదు.”
— కఠోర సత్యం…
ధన్యవాదాలు భద్రుడు గారు..
మీరు చదివేక ఆ పోస్టు సంపూర్ణమవుతుంది.
ఇద్దరు గొప్ప చదువరులు పైన చెప్పిన మాటల కన్నా మించి నేనేమీ చెప్పలేను and I completely agree with what they said.🙏🏽
మీరు Sappho’s fragment 120 ని ఆమె biography ని తెలుపుతూ, మీ readers ని surface reading ని దాటించి, ఆమె జీవిత ప్రయాణంలో ఆమె మనఃస్థితి పొందిన transformation ని గీతా శ్లోకంతో ఆ ఋషులు సాధించిన అనుద్వేగకరమయిన మనఃస్థితితో పోల్చి శాఫో సాధించిన ఔన్నత్యాన్ని తెలియజెప్పి you elevated my understanding and appreciation for Sappho and her poetry, Sir. 🙏🏽
హృదయపూర్వక ధన్యవాదాలు మాధవీ!