
ప్రియమైన శాఫో,
నిన్న కూడా నీకు ఉత్తరం రాయలేకపోయాను. ఎందుకంటే నిన్న సాయంకాలం సాక్షి పాత్రికేయ బృందం నన్ను ఆహ్వానించారు. వారీ మధ్య ప్రతి నెలా ఒక సాహిత్యవేత్తని ఆహ్వానిస్తూ వారినుంచి ఏదైనా నాలుగు మంచిమాటలు వినాలని కోరుకుంటూ ఉన్నారట. నిన్న నన్ను పిలిస్తే, ఏమి మాట్లాడాలా అని ఆలోచించాను. నిన్నంతా నీకు రాయాలనుకున్న ఉత్తరంలో నీ మొదటి కవిత, Ode to Aphrodite గురించే ఆలోచిస్తున్నాను కదా, ఒక కవి ఒక భాషలోకి ఊపిరులూదగల సంగీతం, ఆ మంత్రమయ శక్తి గురించే ఆలోచిస్తున్నానుకదా, అందుకని వారితో తెలుగు భాష గురించి మాట్లాడేను.
తెలుగు ఇప్పటిదాకా మూడు దశలు దాటిందనీ, మొదటిదశలో శాసనభాషగా, తర్వాతి కాలంలో సాహిత్యభాషగా, గత రెండు వందల ఏళ్ళుగా ఆధునిక భాషగా వికసించిందనీ, ఇప్పుడు ఒక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదనీ చెప్పాను. గతంతో పోలిస్తే, ఇప్పుడు తెలుగు మాట్లాడే వాళ్ళ సంఖ్య పెరిగిందిగానీ, ఈ భాష బోలుభాష, ద్వేషానికీ, దూషణకీ, హేళనకీ, వినోదానికీ మాత్రమే వాడుకుంటున్న భాషగా మారుతున్నదనీ, దీనికి మళ్ళా కొత్త జవసత్త్వాలు సమకూర్చవలసిన బాధ్యత మనందరి మీదా ఉందని చెప్పాను.
భాష అంటే ఏమిటి? అక్షరం. ఎన్నటికీ నశించినదనే కదా. కాలం తాకిడికి చెక్కుచెదరనిదనే కదా. నువ్వు ఆఫ్రొడైటుని ప్రార్థిస్తూ రాసిన ఈ గీతాన్ని ఇరవై ఆరుశతాబ్దాల పాటు చెక్కుచెదరకుండా కాపాడింది, అదే కదా, ‘మాటలనియెడు మంత్రశక్తి.’
ఇదుగో ఈ మధ్యాహ్నమిట్లా కూచుని ఈ గీతాన్ని తెలుగు చేసాను. మొదటిసారి నీ గీతం తెలుగుమాటల్లోకి ప్రవహిస్తుంటే దూరంగా కోకిల వంతపాడుతోంది.
సింహాసనేశ్వరీ! సమ్మోహశీలా, ఆఫ్రొడైట్!
సర్వేశ్వర పుత్రికా! దేవతా! వేడుకుంటున్నాను
ఓ అమరసౌందర్యవతీ, నా హృదయాన్నిట్లా
నిరాశలో, నిస్పృహలో వధించకు.
నా విలాపాలు నీ చెవిని సోకినంతనే
మునుపొక్కసారి దిగివచ్చావే, అలా తరలిరా
నాకోసం మరొకసారి, అలవైకుంఠపురంలోని
నీ స్వర్ణసౌధాన్నుంచి.
పావురాళ్ళు పూన్చిన నీ రథాన్నధిరోహించి,
చాచిన వాటి రెక్కలమీదుగా, అమరమందార
వనం నుంచి ఈ నల్లని పుడమిమీదకి
జ్యోతిర్మయరోదసిలోంచి-
తరలివచ్చావప్పుడు, ధన్యురాలా! మందహాస
తుందిల వదనంతో అడిగావు నిన్నెందుకు మళ్ళా
తలుచుకున్నానని, ఇప్పుడు మళ్లా ఏ కష్టం
వచ్చిందని, ఎందుకు విలపిస్తున్నానని,
నా హృదయమెవరికోసం ఉన్మత్తమయ్యిందని
ఇప్పుడు మళ్ళా నాకోసమెవరిని ప్రేమమార్గం
పట్టించాలని, ‘చెప్పు, శాఫో, నీ ఎదలో
ప్రేమదుఃఖానలం రగిలించిందెవర’ని.
‘ఇప్పుడెవరు దూరమవుతున్నారో వాళ్ళు తప్పక
మళ్ళా వెంటపడతారు, ఇప్పుడు కానుకలు పక్కన
పెడుతున్నవారు రేపు తమంతతామే కురిపిస్తారు
తమమనసు కాదంటున్నా ప్రేమిస్తారు.’
రా, ప్రేమదేవతా, నీ మాటల్తో నా పరితాపం
చల్లార్చు. నా ప్రేమపరియాచనని అనుగ్రహించు
నా ప్రేమపరివేదనలో పూర్వం నిలబడ్డట్టే
ఇప్పుడు కూడా నా పక్కన నిలబడు.
నీ మొత్తం కవిత్వంలో పూర్తిగా మిగిలిన కవిత ఇదొక్కటే. అది కూడా ఒకటో శతాబ్దపు గ్రీకు లాక్షణికుడు Dionysius of Halicarnassus, తన రసగంగాధరం, Critical Essays, Part II లో ఈ కవిత గురించి పరవశిస్తూ రాసుకున్నందువల్ల. ఆయన ఏమి రాసాడా అని ఆ గ్రంథంలో 23 వ అధ్యాయం మొత్తం చదివాను. ఆయన అన్నిటికన్నా ముందు నీ భాషకి, నీ కావ్యశిల్పానికి, నీ గీతశయ్యకి మైమరచి పోయాడని అర్థమైంది.
సరే, ఆ విషయాల గురించి ఎలానూ మాట్లాడుకోబోతున్నాం, కాని అన్నిటికన్నా ముందు, ఒక రసజ్ఞుడి వల్ల ఈ పూర్తి కవిత ఇలా భద్రంగా మాకు దక్కిందన్న సంతోషాన్ని పంచుకోకుండా ఉండలేకపోతున్నాను. మా మాష్టారు అనేవారు, సాహిత్యానికి సహృదయుడే పోషకుడని. రాజులూ, జమీందారులూ కాదని. ఆ డయోనిసియస్ ఎవ్వరో ఆయనకి, ఈ కవితలో నువ్వేం రాసావో, ఆఫ్రొడైట్ ని ఎందుకు ప్రార్థించావో, నీ ప్రేమ పరితాపమేమిటో, అదంతా ఏమీ పట్టలేదు. ఆయన్ని పారవశ్యానికి లోను చేసింది నీ ఈవొలిన్ గ్రీకు భాష, ఆ అచ్చులు, ఆ హల్లులు, వాటి అద్వితీయమైన కలయిక, ఆ సమాసగ్రథన చాతురి.
ఈ గీతంలో నువ్వొక సుసంస్కృత పదసంయోజనాన్ని (glaphura kai antheira synthesis) సాధించావని రాసాడు. నువ్వు గ్రీకు అక్షరాల్తో ఒక గుడి నిర్మించావు. ఆఫ్రొడైటుకి కాదు, సరస్వతికి నిర్మించావు అనుకున్నాడు ఆయన. రెండున్నర సహస్రాబ్దాల తర్వాత కూడా ఆ గుడి చెక్కుచెదరలేదంటే అందుకు కారణం ఆ సహృదయుడు. ఆయనే ఈ కవిత చదివి పరవశించకపోయి ఉంటే, ఇప్పుడు ఏ ఈజిప్టు ఎడారుల్లోనో, ఏ పగిలిపోయిన పానపాత్రల మీదనో, ఈ అమరగీతం శకలాలుగా మాత్రమే మాకు దక్కి ఉండేది.
ఆయన ఈ కవితలో నీ కావ్యశిల్పం గురించి రాసిందంతా శ్రద్ధగా చదివాను. నాకు గ్రీకు వచ్చి ఉంటే ఎంతబాగుండేది! ఆయన చెప్తున్న ఆ సమాసపరికల్పననీ, ఆ శయ్యనీ చక్కగా అర్థం చేసుకోగలిగేవాణ్ణి కదా! కానీ అదృష్టవశాత్తూ నేను పూర్వాంధ్రసంస్కృత మహాకవుల శుశ్రూష చేసినందువల్ల, డయోనిసియస్ ఏం మాట్లాడుతున్నాడో కొంత పోల్చుకోగలిగాను. ఆయన చెప్తున్నదాన్నే మా తెలుగు ఆదికవి నన్నయ ‘అక్షర రమ్యత’ అని అన్నాడు. వాల్మీకినుంచి, కాళిదాసునుంచి ఆయన కొల్లగొట్టుకున్న సంపద అది. నన్నయ రాసిన ఈ పద్యం, ఇప్పుడు, నా చెవుల్లో నినదిస్తోంది:
కమ్మనిలతాంతముల కుమ్మొనసి వచ్చు
మధుపమ్ముల సుగీత నిన్నదమ్ములెసగెం చూ
తమ్ముల లసత్కిసలయమ్ముల సుగంధి ముకు
ళమ్ములను నానుచు ముదమ్మొనర వాచా
లమ్ములగు కోకిక కులమ్ముల రవమ్ము మధు
రమ్మగుచు విన్చె ననిశమ్ము సుమనోభా
రమ్ముల నశోకనికరమ్ములును చంపక చయ
మూలును కింశుక వనమ్ములును నొప్పెన్
కానీ డయోనిసియస్ నీ గీతం గురించిన వివరణలో అక్షర రమ్యతనీ, సంగీతనాదాత్మకతనీ మించింది కూడా మరేదో ఉంది. అదేమై ఉంటుందా అని ఆలోచిస్తుంటే, జగన్నాథ పండితరాయలు తన కవిత్వం గురించి చెప్పుకున్న విశేషణం గుర్తొచ్చింది. తన ‘భామినీవిలాసం’ మొదలుపెడుతూనే, ఆయన తన కవిత్వం ‘మాధుర్య పరమసీమా’ అని చెప్పుకున్నాడు. అవును. నీ కవిత్వం మాధుర్యపరమసీమ.
పోతన పద్యాల్లో, అన్నమయ్య సంకీర్తనల్లో, క్షేత్రయ్య పదాల్లో కనిపించేది ఆ మాధుర్యపరమసీమనే. చూడు, మరీ ముఖ్యంగా ఈ పోతన పద్యం:
నల్లనివాఁడు పద్మనయనంబులవాఁడు కృపా రసంబు పైఁ
జల్లెడువాఁడు మౌళిపరిసర్పిత పింఛమువాఁడు నవ్వు రా
జిల్లెడుమోమువాఁడొకఁడు చెల్వల మానధనంబు దెచ్చెనో!
మల్లియలార! మీ పొదలమాటున లేఁడుగదమ్మ! చెప్పరే!
ఇందులో అక్షరమ్యతా, అనుతాపమూ ఒకదాన్నొకటి విడదీయలేనంతగా కలిసిపోయాయి. అందులోనూ ఆ ‘మల్లియలార’ అన్న సంబోధన ఉందే, అది హృదయాన్ని మెలిపెట్టివేసే గమకం. నీ కవితలో Who is it, Sappho, who flouts you? అని ఆఫ్రొడైటుతో పలికించావు చూడు, అచ్చం అది ఆ గోపికలు ‘మల్లియలార! మీ పొదలమాటున లేడుగదమ్మ చెప్పరే !’ అన్నట్లే ఉంది.
ఇది ద్రాక్షాపాకం కూడా కాదు, జగన్నాథపండితరాయలు మాటల్లోనే చెప్పాలంటే, ‘మృద్వీకామధ్య నిర్యన్మసృణరసఝరీ మాధురి’ అది. అంటే ద్రాక్షపండు మధ్యలో స్రవించే అతి సున్నితమైన రసధార.
ఈ పొద్దున్నే నీ ఈ కవిత, Ode to Aphrodite ని, ఒక్కసారి నువ్వు రాసినప్పటి గ్రీకులో వినగలనా అని చూసాను. ఇదుగో, యూట్యూబులో ఈ గానం వినిపించింది. నీ కాలం నాటి గ్రీకుధ్వనుల్ని పట్టుకుని, అచ్చం ఆ కాలంలో నువ్వు ఆలపించినట్టే, ఒక బృందం ఆలపించారు. వారి గానం వింటుంటే, నాకు రవీంద్రుడు స్వయంగా స్వరకల్పన చేసి శాంతినికేతనంలో ఒక వసంతదివసాన పాడించిన తన గీతం వింటున్నట్టుంది.
మరొక పఠనం కూడా విన్నాను. Stephen Daitz ప్రాచీన గ్రీకు ధ్వనుల్ని పునర్నించాడని పండితలోకం ఆయన్ని ప్రస్తుతిస్తున్నదని విన్నాను. అందుకని ఆయన ఈ గీతాన్ని ఎలా పఠించి ఉంటాడా అని ఇదుగో, ఈ ఆడియో కూడా విన్నాను.
ఈ కవిత్వపఠనం వింటున్నంతసేపూ పొద్దున్నే మా బాల్కనీలో నుంచుని పక్కన దేవకాంచనం చెట్టు మీద రెడ్ వెంటెడ్ బుల్బుళ్ళ కిలకిల వింటున్నట్టుంది.
ఈ రోజంతా ఈ కవితలోని భాష గురించి తలుచుకోడంలోనే గడిచిపోయింది. డయోనిసియస్ లానే నేను కూడా ఇందులో నువ్వేం రాసావో దాని గురించి ఆలోచించాలనుకోవడం లేదు. మరీ ముఖ్యంగా, ‘తమమనసు కాదంటున్నా ప్రేమిస్తారు’ అనే వాక్యం ఎందుకు రాసావా అనుకున్నానుగాని Anne Carson రాసిన The Justice of Aphrodite in Sappho I చదివితే ఆ సందేహం కూడా తీరిపోయింది.
Featured image: The Birth of Venus, Bottiselli, c.1480
22-4-2026


భద్రుడు గారు.. ఇది కదా జ్ఞాన సముపార్జన అంటే.. ధన్యవాదాలు.
హృదయపూర్వక ధన్యవాదాలు సార్!
ఇది కదా మాటలనియెడు మంత్రశక్తి…
మీ మాటలలో మాత్రముగ్ధుల్ని చేసే అపూర్వతాకిడి. ఆహా! ఈ అక్షరాలే కదా కనుపాపల్ని నాట్యమాడించే ఘన శక్తి.
ఇవే తమకు నా అంజలులు.
హృదయపూర్వక ధన్యవాదాలు మేడం!
పోతన పద్యం, నన్నయ, క్షేత్రయ్య ల గురించి చెప్పినదానికి ఎంతో సంతోషం కలిగింది.
హృదయపూర్వక ధన్యవాదాలు సార్!
విశ్వనాథ కావ్యానందం అని రాసిన పుస్తకం చూసాను గానీ చదువలేకపోయాను. మీ పోస్టులు చదువుతుంటే కావ్యానందం ఎలాంటిదో అనుభవంలోకి వస్తున్నది. అక్షరాక్షర సార్థకత తెలియ వస్తున్నది.
పెల్లుబికిన భావోద్వేగం
రెల్లుపూల పిల్లగాలిలా
తాకగానె తన్మయమంద్రం
ఉప్పొంగెను హృన్మయసంద్రం
నమస్సులు.
హృదయపూర్వక ధన్యవాదాలు సార్!
Thanks for including the links to the recitation and reading of the poem, Sir.
Beautiful sounds!!
Your clear translation helped understand what Sappho expressed in her poem Ode to Aphrodite.
You said at the end
‘తమమనసు కాదంటున్నా ప్రేమిస్తారు’ అనే వాక్యం ఎందుకు రాసావా అనుకున్నానుగాని Anne Carson రాసిన The Justice of Aphrodite in Sappho I చదివితే ఆ సందేహం కూడా తీరిపోయింది.
Hoping you will discuss this in your next letter.
ఓహో…., నమస్సులు మాష్టారూ 🙏